సముద్రం దగ్గరకి వెళ్తే... ప్రశాంతత దొరికినట్లే!

  మనలో చాలామందికి సముద్రమంటే భలే ఇష్టం. కొంతమందిలో ఆ ఇష్టం ఏ స్థాయిలో ఉంటుందంటే, రిటైర్‌ అయ్యాక సముద్రపు ఒడ్డునే ఓ ఇల్లు కట్టుకోవాలని కలలు కంటూ ఉంటారు. మనిషి జీవితంలో సముద్రానికి ఉన్న ప్రాముఖ్యత తక్కువేమీ కాకపోవచ్చు. వ్యాపారం దగ్గర్నుంచీ, వర్షాల వరకూ సముద్రం లేనిదే బతుకు సాగదు. అంతవరకూ బాగానే ఉంది కానీ.... విశాలమైన సముద్రపు ఒడ్డున సమయాన్ని గడపాలని మనిషి ఎందుకంతగా తపించిపోతాడు? ప్రపంచంలో ఇన్ని సౌఖ్యాలు ఉన్నా మనిషి సమద్రపు ఒడ్డుకే ఎందుకు పరిగెడతాడు! సముద్ర తీరంలో ఉండే ప్రదేశాలు, అక్కడ ఉండే ఇళ్లకి ఎందుకంత గిరాకీ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. సముద్రం, మనిషికి ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతిని ఇస్తుందట. ఆ సముద్రపు నీలపు రంగు, అందులో నుంచి వచ్చే అలల శబ్దాలు, ఆ అలల మీదుగా తేలియాడుతూ వచ్చే సముద్రపు గాలి, ఆ గాలిలోని స్వచ్ఛమైన వాసన... అతని ఇంద్రియాలన్నింటికీ ఉత్తేజాన్ని కలిగిస్తాయట. ఇవన్నీ ఎవరా దారిన పోయే దానయ్య చెప్పిన విషయాలు కాదు. మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తేల్చిన అంశాలు. ఇందుకోసం వాళ్లు వెల్లింగ్‌టన్‌, హవాయ్‌ వంటి సముద్ర తీర ప్రాంతాలను గమనించారు. అక్కడి ప్రజలు మిగతా ప్రాంతాల ప్రజలతో పోలిస్తే చాలా సంతోషంగా ఉన్నట్లు గ్రహించారు. ఆదాయం, ఆస్తులు, వయసు.... వీటన్నింటికీ అతీతంగా అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు! అక్కడ ప్రజల్లో మానసికమైన సమస్యలు కూడా తక్కువగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేశాయి.   అదండీ విషయం! సిమెంటు కట్టడాలు ఎన్ని కనిపించినా, భౌతికమైన సుఖాలు ఎన్ని ఊరిస్తున్నామనిషి అంతరంగం ప్రకృతిలోనే సేదతీరుతుంది. భూమ్మీద మూడు వంతులుగా ఉన్న సముద్రం ఆ పకృతికి ఓ ప్రతిరూపంగా నిలుస్తుంది. అందుకే ఈసారి కాస్త సేదతీరాలనుకుంటే దగ్గరలో ఏదన్నా సముద్రపు ఒడ్డు ఉందేమో చూసుకోండి!

పోకెమాన్‌గోతో ఆరోగ్యం!

  కబాలి హడావుడి ముగిసింది. కానీ పోకేమాన్‌ మాత్రం దూసుకునిపోతున్నాడు. ప్రపంచానికంతా ఇప్పుడు పోకెమాన్‌ జాడ్యమే పట్టేసింది. ఇలాంటి ఆటలు ఆడుతూ, లేని జంతువులను ఊహించుకుంటూ రోడ్ల మీద తిరగడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయన్న వార్తలు పుంఖానుపుంఖాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్ని విమర్శల మధ్య కొన్ని సానుకూలమైన మాటలు కూడా వినిపిస్తున్నాయో. అవేంటంటే...   విటమిన్‌ డి లభ్యం- పొద్దస్తమానం, అయితే ఇంట్లోనూ లేకపోతే కారులోనూ గడిపేసే పాశ్చత్యులని ఆరుబయలకు తీసుకువచ్చిన ఘనత పోకెమాన్‌దే. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు! ఇలా రోజూ కాసేపు ఎండపట్టున తిరగడం వల్ల ఇంతవరకూ దూరంగా ఉన్న విటమిన్‌ డి ఇప్పుడు పుష్కలంగా లభిస్తోందంటున్నారు పోకెమాన్‌ ప్రియులు. కీళ్ల నొప్పుల నుంచి చర్మవ్యాధుల వరకూ విటమిన్‌ డి ఎంత అవసరమో చెప్పేదేముంది. జీవనశైలిలో మార్పు- ఆధునిక జీవనశైలి అంటే, నిరంతరం ఏదో ఒక చోట కూర్చుని ఉండటమే! దానికి తోడు ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్న వీడియో గేమ్స్ అన్నీ కూడా కూర్చుని అడేవే. పోకెమాన్‌తో ఇలాంటి పరిస్థితి నుంచి మార్పు వచ్చిందంటున్నారు. పోకెమాన్‌తో ఇంతవరకూ కుర్చీలోంచి కదలని వారంతా లేచి నాలుగు అడుగులు వేస్తున్నారట.     వేగం.. వేగం-  పోకెమాన్‌గోని పట్టుకోవాలంటే అలా ఓ నాలుగడుగులు వేస్తే సరిపోదు. కాస్త వేగంగా నడవాలి. కాస్త చురుగ్గా పోకెమాన్ల కోసం వెతకాలి. దీని వల్ల కావల్సినంత వ్యాయామం అవుతోందంటున్నారు కొందరు. ఈ ఆట ఆడుతున్న దగ్గర్నుంచీ రోజుకి కనీసం గంట తక్కువ కాకుండా నడుస్తున్నాం అనేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పని ఒత్తిడి నుంచి విశ్రాంతి- ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎంత ఒత్తిడితో కూడుకుని ఉంటాయో చెప్పేదేముంది! రోజుకి పది పన్నెండు గంటలు పనిచేసినా కూడా ఇంకా మెదడు మీద ఆ ఉద్యోగభారం ఉంటూనే ఉంటుంది. పోకెమాన్‌గోతో అలాంటి ఒత్తిడి నుంచి సులువుగా దూరం కావచ్చునంటున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు సిగిరెట్టు, మద్యపానాల జోలికి పోకుండా, పోకెమాన్‌తో ఆడుకోవడం మంచిదే కదా అని దబాయిస్తున్నారు.   డోపమైన్‌:  పోకెమాన్‌గో ఆడుతున్నప్పుడు శరీరంలో డోపమైన్‌ అనే రసాయనం విడుదల అవుతుందనీ, ఇది ఒకరకమైన సంతృప్తిని కలిగిస్తుందనీ చెబుతున్నారు. నిరంతరం ఈ సంతృప్తిని కోరుకోవడం కోసమే పోకెమాన్‌గో అంటే పడి చస్తున్నారు జనం.   సరే! పోకెమాన్‌గోతో ఇలాంటి ఉపయోగాలు కొన్ని ఉంటే ఉండవచ్చుగాక! కానీ ఎక్కడ నడుస్తున్నామో చూసుకోకుండా, ఏ హద్దులు దాటుతున్నామో గమనించుకోకుండా... గంటల తరబడి జీవితాలను వెచ్చించే ఈ పోకెమాన్‌గో ఏ వ్యసనానికీ తీసిపోదంటున్నారు పెద్దలు. ఇలా ఎవరి వాదనని వారు వినిపించేశారు. ఇక నిర్ణయించుకోవల్సింది మనమే!   - నిర్జర.

నైట్ షిఫ్ట్ వల్ల బ్రెస్ట్ కాన్సర్

  ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనే నానుడి ఉండేది.  కాలం మారింది ఆ నానుడి కూడా పాతబడిపోయింది. ఇప్పుడు అన్ని రంగాల్లో మగవారితో పాటు ఆడవాళ్ళు కూడా ఎందులోనూ మేము తక్కువ కాము అన్నట్టు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికన్ టైమింగ్స్ కి అనుగుణంగా రాత్రిళ్ళు కూడా పనిచెయ్యాల్సి వస్తే దానికి కూడా ఎక్కడా వెనకడుగు వెయ్యకుండా ముందుకు దూసుకేళ్తున్నారు. జీతాలు ఎక్కువ విశ్రాంతి తక్కువ అయిపోతోంది.   ఇలాంటి నైట్ షిఫ్ట్ లు అమ్మాయిల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అని అడిగితే చెడు ప్రభావమే అంటున్నారు పరిశోధకులు. రాత్రిళ్ళు డ్యూటి చేసే ఆడవారిలో బ్రెస్ట్ కాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందిట. శరీరంలో మెలటోనిన్‌, హార్మోన్లపై ప్రభావం చూపటం వల్లే రాత్రి డ్యూటీలు క్యాన్సర్‌కు కారణమవుతున్నట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మెలటోనిన్‌ రక్తంలో ఈస్ట్రోజన్‌ను తగ్గిస్తుంది, క్యాన్సర్‌ కణాల పెరుగదలనూ నిరోధిస్తుంది. మామూలుగా మన మెదడు మెలటోనిన్‌ను ఎక్కువగా మధ్యరాత్రి వేళల్లో వాతావరణం చీకటిగా ఉన్నప్పుడే ఉత్పత్తి చేస్తుంది. అలాంటి  సమయంలో నిద్రపోకుండా సహజ సిద్ధమైన వెలుతురులో కాకుండా కృత్రిమ వెలుతురు కింద, లైట్ల కాంతిలో పని చేసేటప్పుడు మెదడు మెలటోనిన్‌ విడుదలను ఆపేస్తుంది. దీనికారణంగా ఆరోగ్యం దెబ్బతిని రొమ్ము క్యాన్సర్‌ ఒక్కటే కాకుండా, పలురకాల అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంటుందన్నారు.     ఈ కారణంగానే పగటి వేళల్లో విధులు నిర్వర్తించే వారితో పోలిస్తే, రాత్రి డ్యూటీలు చేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు48 శాతం దాకా ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. ఈ సమస్యని నివారించుకోవాలంటే శరీరానికి  వ్యాయామం ఎంతైనా అవసరం. అలాగే నీళ్ళు ఎక్కువగా  తాగుతూ ఉండాలి. వెల్లుల్లి అన్ని వంటకాలలో తగిన విధంగా వాడాలి. దానిమ్మ పండుని ఎక్కువగా తినాలి. మాములు టీ బదులు గ్రీన్ టీ అలవాటుచేసుకోవటం మంచిది. రాత్రిపూట భోజనం బరువైనది కాకుండా చూసుకోవాలి. తేలికగా అరిగె పదార్థాలు తింటే సమస్య మన దగ్గరకి రాకుండా ఉంటుంది.         ...కళ్యాణి

కార్బైడ్‌ పండ్లు ప్రాణాంతకాలు!

  పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు! అందులోనూ మామిడి, అరటి, యాపిల్‌ అంటే నోరూరనివారు ఎవరుంటారు? కాని ఆ పండ్లని మగ్గపెట్టేందుకు వాడే విషపదార్థాల గురించి వింటుంటేనే భయం కలుగుతోంది. మరీ ముఖ్యంగా కార్బైడ్‌తో పండించిన పండ్లని ముట్టుకోవాలంటేనే దడ పుడుతోంది. మరి నిజంగానే కార్బైడ్‌ అంత ప్రమాదకరమైనదా? అయితే దాన్ని ఎందుకు వాడుతున్నారు? దాని బారిన పడకుండా ఉండటం ఎలా?... మీరే చూడండి!   ఇందుకు వాడతారు! మామిడి, అరటి వంటి పండ్లను చెట్టు మీద నుంచి కోసిన తరువాత కూడా మగ్గేందుకు కాస్త సమయం పడుతుంది. ఇది నిదానంగా జరిగే చర్య. పైగా వాటిని మగ్గపెట్టేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా కాస్త కేల్షియం కార్బైడ్‌ని కనుక వాటి మీద ప్రయోగిస్తే... అవి ఇట్టే పండిపోతాయి. లేదా కనీసం పండినట్లు కనిపిస్తాయి. ఇందులో మరో లాభం కూడా ఉంది! పచ్చిగా ఉండగానే కాయలని కోయడం, అవి గట్టిగా ఉన్నప్పుడే మార్కెట్‌కు తరలించడం వల్ల పండ్లు దెబ్బతినే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పైగా కార్బైడ్‌తో పండిన పండ్లు లోపల ఇంకా పచ్చిగానే ఉంటాయి కాబట్టి చాలా రోజులు నిలవ ఉంటాయి కూడా! ఇక మిలమిలా మెరిసిపోయే కార్బైడ్‌ పండ్లని చూసిన కొనుగోలుదారులకి, వాటిని రుచి చూడాలన్ని ఆశ ఎలాగూ కలుగుతుంది.   ఇదీ ప్రమాదం! కేల్షియం కార్బైడ్‌లో అర్సెనిక్‌, ఫాస్పరస్‌ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి అధిక మొతాదులో శరీరంలోకి చేరితే ఏర్పడే సమస్యలు అన్నీఇన్నీ కావు. తలనొప్పి, కళ్లు తిరగడం, నిద్రలేమి మొదలుకొని నరాలకు సంబంధించిన నానారకాల సమస్యలకూ ఇది దారితీయవచ్చు. చర్మం మీద కూడా కార్బైడ్‌ ప్రభావం అధికంగా ఉంటుంది. దద్దుర్లు నుంచి చర్మక్యాన్సర్‌ వరకూ కార్బైడ్‌ పండ్లని తినేవారిలే ఎలాంటి రోగమైనా తలెత్తవచ్చు. ఇక గుండె, మెదడు, కీళ్లు, జీర్ణాశయం వంటి శరీర భాగాల మీద ఈ కార్బైడ్‌ తీవ్ర ప్రభావం చూపుతుందనే వార్తలూ వినిపిస్తూ ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కనుక కార్బైడ్‌తో మగ్గపెట్టిన పండ్లని తింటే... అవి వారికీ, వారి కడుపులో ఉన్న బిడ్డకీ కూడా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.   మరేం చేయడం! కార్బైడ్‌ గురించి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా, రూపాయి కోసం వ్యాపారస్తులు పడే కక్కుర్తి ముందు ఉపయోగం లేకుండా పోతోంది. ఆరోగ్య శాఖ అధికారులు కూడా కార్బైడ్‌ వాడకాన్ని చూసీచూడనట్లు ఊరుకుంటారన్న ఆరోపణలూ ఉన్నాయి. కాబట్టి కార్బైడ్‌ పండ్ల నుంచి దూరంగా ఉండాల్సిన బాధ్యత వినియోగదారులదే. ఇప్పుడు కార్బైడ్‌తో పండించని పండ్లు అంటూ ప్రత్యేకంగా కొన్ని దుకాణాలు వెలుస్తున్నాయి. నమ్మకం ఉంటే వాటిలో పండ్లను తీసుకోవచ్చు. లేదా పండ్లని కొనుగోలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకున్నా సరిపోతుంది.   - కార్బైడ్‌తో పండించిన పండ్లు చూడ్డానికి మరీ పచ్చగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి.   - చాలా సందర్భాలలో పండ్లు ఒక చోట మగ్గి, మరో చోట పచ్చిగా ఉన్నట్లు రెండు రంగులలో ఉంటాయి.   - పైకి పండిపోయినట్లు ఉండి, లోపల పచ్చిగా ఉందంటే.... అది ఖచ్చితంగా కార్బైడ్‌ మహిమే!   - కార్బైడ్‌తో పండిన పండ్లు కృత్రిమంగా మగ్గి ఉంటాయి కాబట్టి, వాటిలోని తీపిశాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది.   - అన్నింటికీ మించి మామూలు పండ్లు మగ్గినప్పుడు వచ్చే ఆ సువాసన, కార్బైడ్ పండ్లలో కనిపించదు. అంటే రంగు, రుచి, వాసనల ద్వారా ఫలానా పండు కార్బైడ్‌తో మగ్గించారు అని తేలిపోతుందన్నమాట.   ఇదీ కార్బైడ్ పండ్ల కథ! ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒకోసారి మోసపోయే ప్రమాదం ఉంది కనుక, తినబోయే ముందర కాసేపు పండ్లను నీటి ధార కింద ఉంచితే, వాటిలోని విష రసాయనాలు చాలావరకూ కొట్టుకుపోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు నిపుణులు.   - నిర్జర.

ఉద్యోగమే కాదు.. ఆరోగ్యమూ ముఖ్యమే

    కాస్త ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి... అంటూ స్త్రీలకు ఓ హెచ్చరిక చేస్తున్నారు అధ్యయనకర్తలు. ‘‘అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్’’ ఓ అధ్యయనం నిర్వహించింది. సుమారు మూడువేల మంది మహిళలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో చాలా ఆసక్తికర అంశాలు తెలిశాయి. 1. ఉద్యోగం చేసే మహిళల్లో 70 శాతం మంది కన్నా ఎక్కువమంది అనారోగ్యం బారిన పడుతున్నారనీ, అదీ 32 సంవత్సరాల వయసు  నుంచేనని తెలిసింది. 2. ఊబకాయం, నడుం నొప్పి, మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నట్టు కూడా తెలిసింది. 3. ఇక దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారి సంఖ్య ఇంచుమించు 22 శాతంగా వుంటే, 14 శాతం మహిళలు తీవ్ర సమస్యలతో పోరాడుతున్నట్టు వెల్లడైంది. 4. ఇక శారీరక అనారోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యంపై కూడా మహిళలు తక్కువ శ్రద్ధ పెడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఒత్తిడి, ఒంటరితనం, ఆందోళన వంటివన్నీ మహిళలను తీవ్రస్థాయిలో ఇబ్బందిపెట్టే అంశాలని, వాటి నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలని చెబుతున్నారు నిపుణులు. ఈ అధ్యయనంలో తేలిన అంశాల ఆధారంగా మహిళలకి కొన్ని సూచనలు చెప్తున్నారు. అవి ఏంటంటే... 1. పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. 2. వ్యాయామం, ధ్యానం వంటివి జీవన శైలిలో భాగం కావాలి.   కుటుంబాన్ని, ఉద్యోగాన్ని రెండింటినీ సమర్థవంతంగా నిర్వహించాలంటే మహిళలు తప్పకుండా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిందే అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. మరి ఆలోచించండి. మహిళల ఆరోగ్యం ప్రమాదకర స్థాయిలో ఉందని అధ్యయనాలు చెబుతున్నప్పుడు ఆరోగ్యకర జీవనశైలిని ఆచరించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అలాగే... మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహిస్తూ, వారికి ఇంటి పనుల్లో సహాయపడితే ఇంటి ఇల్లాలు ఆరోగ్యం వుంటుంది. -రమ

చెవి నొప్పికి ఇంటి వైధ్యం

  మన పిల్లల్ని బాధించే వాటిలో చెవి నొప్పి ఒక పెద్ద సమస్య. పెద్దవాళ్ళకి చెవి పోటు వస్తే చక్కగా వాళ్ళకి తెలిసిపోతుంది.  అదే పిల్లల్లో వస్తే వాళ్లకి చెప్పటం రాకపోవటం వల్ల ఏదో ఒక రకమైన పేచీ పెట్టి ఏడుస్తూ కూర్చుంటారు. అస్తమాట్లు చెవిని నలుపుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి మనకి బాధ. డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్ళే లోపు కాస్త నొప్పి సర్దుకోవటానికి కొన్ని ఇంటి వైద్యాలు చేస్తే మంచి ఫలితం ఉండచ్చేమో.   సాదారణంగా పిల్లలు ఇయర్ బడ్స్ తో ఆడుకుంటూ చెవిలో పెట్టి తిప్పుకుంటూ ఉంటారు. పొరపాటున దానికి ఉన్న దూది చెవిలో ఉండిపోయినా పెద్దగా పట్టించుకోకుండా ఆడేసుకుంటారు. దాని ఫలితంగా కొన్నాళ్ళు పోయేసరికి చెవిపోటు రావటం, దాని వల్ల జ్వరం రావటం ఇలాంటివన్నీ మొదలవుతాయి. అందుకే వీలయినంత వరకు చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అసలు ఇయర్ బడ్స్ వారికి అందుబాటులో ఉంచకుండా జాగ్రత్త పడటం మంచిది. ఇక అనేక కారణాల వల్ల వచ్చే చెవిపోటు కోసం ఏం చెయ్యాలో చూద్దాం.     హైడ్రోజెన్ పెరోక్సైడ్ ఇలాంటి సమస్యలకి ఒక మంచి విరుగుడు. పిల్లల చెవిలో ఏదైనా చెత్త ఉండిపోయినా లేదా చీమలు, చిన్న పురుగులు లాంటివి ఉండిపోయినా పిలల్ని పడుకోబెట్టి చెవిలో ఐదు చుక్కల హైడ్రోజెన్ పెరోక్సైడ్ వేసి కాసేపు అలానే ఉంచాలి. దానితో చెవిలో ఏదైనా ఉంటే నురుగుతో పాటు బైటకి వచ్చేస్తుంది.   చెవిపోటు వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు గళ్ళ ఉప్పుని కాస్త కడాయిలో వేడి చేసి దానిని పల్చటి బట్టలో కట్టి ఓర్చుకునే వేడి ఉన్నప్పుడు చెవి చుట్టూ కాపడం పెడితే నొప్పి తగ్గి పిల్లలు హాయిగా నిద్ర పోతారు. వాళ్ళు నిద్రపోయేటప్పుడు తల కింద పిల్లో పెట్టకుండా పడుకోబెడితే మంచి ఫలితం కనిపిస్తుంది.   తులసి రసం కూడా చెవి నొప్పికి బాగా పనిచేస్తుంది. ఒక పది తులసి ఆకుల్ని చేతితో నలిపి రసం పిండి దానిని రెండు చుక్కల చొప్పున రోజులో కనీసం నాలుగు ఐదు సార్లు వేస్తూ ఉండాలి. దొరికితే నల్ల తులసి ఇంకా మంచిది. చెవి పోటుతో ఇబ్బంది పడే పిల్లల కోసం తీసుకోవల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనది వాళ్ళు స్నానం చేసేటప్పుడు నీరు లోపలకి వెళ్ళకుండా చూసుకోవటం. స్నానానికి ముందు వేసలైన్ పోసిన దూదిని చెవిలో పెట్టి స్నానం చేయిస్తే అది నీటిని లోపాలకి రానీయకుండా ఉంటుంది. చెవి లోపల ఉండే ఇన్ఫెక్షన్స్ పెరగకుండా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ కాస్త వేడి చేసి చెవిలో పోసి ఉంచడం వల్ల లోపల ఏదైనా గడ్డకట్టి ఉండిపోయినా కరిగిపోయి త్వరగా బయటకి వస్తాయి. అలాగే వేడి నీళ్ళు ఒక హాట్ బాగ్ లో పోసి దానిని చెవి చుట్టూ పెడుతూ ఉంటే నొప్పి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.   కొంతమంది పిల్లలు సెల్ ఫోన్ లో పాటలు పెద్ద సౌండ్ పెట్టుకుని చెవికి ఆనించుకుని వింటూ ఉంటారు. ఇలా చేస్తున్న వాళ్ళని కాస్త మెల్లిగా నచ్చచెప్పి అలా చేయకుండా చూసుకోవాలి. అలాగే పెన్సిళ్ళు, పెన్నులు చెవిలో పెట్టి తిప్పుకునే అలవాటుని కూడా తగ్గించాలి. మొత్తానికి చెవి నొప్పికి కారణాలు అనేకం ఉన్నా ఆ సమస్యని సరైన ఇయర్ స్పెషలిస్ట్ దగ్గరకి తీసుకువెళ్ళే లోపు పైన చెప్పినలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయటం మంచిదే కదా. ...కళ్యాణి

అతినిద్ర లోలుడు... మృత్యువుకి ఆప్తుడు...

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా... ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తై పోదువురా అని ఓ సినిమా కవి చెప్పిన మాట అక్షర సత్యం. నిద్ర మనకు విశ్రాంతిని ఇస్తుంది. అయితే అతి నిద్ర విశ్రాంతినిచ్చే సంగతి దేవుడెరుగు... అసలు ప్రాణాలే హరించే ప్రమాదం వుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అతనిద్రాలోలుడు.. తెలివిలేని మూర్ఖుడు అని అంటారు.. కానీ ఇప్పుడు అతినిద్రాలోలుడు మృత్యువుకి ఆప్తుడు అని నిస్సందేహంగా అనవచ్చు. ఎందుకంటే, ఈ విషయాన్ని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు బల్ల గుద్ది మరి చెబుతున్నారు. సదరు శాస్త్రవేత్తలు బల్ల గుద్దిన శబ్దం విని అయినా అతి నిద్ర లోలులకు మెలకువ వస్తుందో... రాదో! నిద్ర అనే అంశం మీద సిడ్నీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈమధ్య భారీ స్థాయిలో పరిశోధనలు చేశారు. వారి పరిశోధనలకు సంబంధించిన సారాంశాన్ని బయటి ప్రపంచానికి వెల్లడిస్తూ, ‘‘రోజుకు తొమ్మిది గంటలకు మించి నిద్ర పోయేవారు త్వరగా మృత్యువుకు చేరువవుతారు’’ అని తేల్చారు. దాదాపు రెండు లక్షల 30 వేల మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఈ శాస్త్రవేత్తలు ఈ నిద్రారణకు.. కాదు.. నిర్ధారణకు వచ్చారు. ఎక్కువగా నిద్రపోయేవారు మాత్రమే కాదు.. ఎక్కువగా కూర్చునే వుండేవారు కూడా త్వరగా బాల్చీ తన్నేసే ప్రమాదం వుందని వారు హెచ్చరిస్తున్నారు. ఎంత నిద్ర పోవాలో అంత నిద్రపోయేవారు, ఎంతసేపు కూర్చోవాలో అంతసేపే కూర్చుని శరీరాన్ని ఎక్కువగా అలసిపోయేలా చేసేవారికంటే ఎక్కువగా నిద్రపోయేవారు, ఎక్కువసేపు కూర్చునే వుండేవారు త్వరగా మృత్యువు ఒడిలోకి జారిపోతారని సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతిగా మద్యపానం చేసేవారు, అతిగా ధూమపానం చేసేవారికంటే అతిగా నిద్రపోయేవారికే మృత్యుగండం ఎక్కువగా వుంటుందని వారు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఆరు గంటలు మాత్రమే నిద్రపోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు. ఎంత తక్కువగా కూర్చుంటే అంత మంచిదని కూడా చెబుతున్నారు.  

ఆహారమే ఆరోగ్యాన్ని రక్షించే ఆయుధం

మంచి ఆరోగ్యానికి పౌష్ఠిక విలువలున్న ఆహారం ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. ఏమాత్రం ఒంట్లో కొంచెం నలతగా వున్నా సరైన ఆహారం తీసుకోండంటూ వైద్యులు హెచ్చరిస్తారు కూడా. ఆ అనారోగ్యాన్ని ఎదుర్కొనే ఆహార పదార్థాలని సూచిస్తారు కూడా. ఉదాహరణకి రక్తహీనతకి దానిమ్మ, ఆకుకూరలు అలాగే డయాబెటిక్‌కి మెంతులు ఇలా. సరే ఇవన్నీ మన శారీరక అనారోగ్యానికి వైద్యులు చేసే సూచనలు. కానీ, మన మానసిక ఆరోగ్యానికి, ఆహారానికి కూడా సంబంధం ఉందంటే నమ్మగలరా. ఒత్తిడిగా వున్నా,  చిరాకుగా, కోపంగా వున్నా, మూడ్ సరిగా లేకపోయినా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే అవన్నీ వాటంతట అవే సర్దుకుంటాయిట. మరి మూడ్ ఫుడ్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. ఎప్పుడైనా చాలా చిరాకుగా, లేదా చాలా టెన్షన్‌గా అనిపిస్తే ఒక్క అరటిపండు తినేయ్యండి వెంటనే. ఎందుకంటే, అరటిపళ్ళలో వుండే ట్రిప్టోఫాన్స్ మూడ్‌ను బాగుచేసే అతి మంచి అమినో యాసిడ్లుట. ఈ అరటిపండు తినగానే సెరోటానిక్ అనే పదార్థం విడుదలయ్యి, చికాకుని, టెన్షన్‌ని తగ్గిస్తుందిట. కాబట్టి చిరాకుగా వుంటే ఆ చిరాకుని బ్రేక్ చేసేందుకు అరటిపండుని తీసుకోవడమే తక్షణ కర్తవ్యం. ఇక ఏదైనా తీవ్ర ఆలోచనలో వుంటే, ఆ ఆలోచన క్రుంగదీస్తుంటే ఓట్స్‌ని తీసుకోవాలిట. ఈ ఓట్స్‌లో ఉండే ‘బి6’ విటమిన్ మనల్ని తిరిగి ఉత్సాహంగా ఉండేలా చేస్తుందిట.  ఇవేకాదు, ఒత్తిడిని దూరం చేసేందుకు, అలసటని, డిప్రెషన్‌ని ఎదుర్కొనేందుకు కూడా ఆహారమే ఆయుధం. ఒప్పుడైనా ఒత్తిడిగా ఉన్నట్టు అనిపిస్తే బంగాళాదుంపలు, చిలకడ దుంపల్ని ఆహారంలో చేర్చండి చాలు. నీర్సంగా వున్నప్పుడు వీటిని తీసుకున్నా వెంటనే శక్తి లభిస్తుంది. -రమ

పొగ తాగేవారికి శుభవార్త!

  పొగ త్రాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికి తెలిసిందే. తెలిసిన కూడా అందరూ పొగ త్రాగడం మానివేయడం లేదు. దీనివలన భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుందని మర్చిపోతున్నారు. కానీ క్యాన్సర్ ముప్పు నుండి తప్పించుకోవాలనుకుంటే పండ్లను తినడం మంచిది.  పొగ త్రాగేవాళ్ళు ప్రతిరోజూ పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదని, దీనివల్ల క్యాన్సర్ ముప్పు నుండి కొంతవరకైనా తప్పించుకోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.  కానీ పొగ త్రాగుతూ.. పండ్లను తింటే క్యాన్సర్ రాదనుకుంటే పొరపాటే. ఇది కేవలం కొంతకాలం వరకు మాత్రమే క్యాన్సర్ భారిన పడకుండా కాపాడుతుంది. అసలు క్యాన్సర్ రావొద్దని అనుకుంటే... పొగ త్రాగడం కొద్ది కొద్దిగా మానేయడం మంచిది.

ఆరోగ్యానికి ఆ నాలుగూ...

  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందులోనూ జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్ ఈ నాలుగూ అందరూ తప్పక తినితీరాలి అంటూ పోషకాహార నిపుణులు పదేపదే చెబుతున్నా మనం పెద్దగా పట్టించుకోం. వీలయినప్పుడు తింటాం. లేదంటే లేదు. అవునా! కానీ గుండె ఆరోగ్యంగా వుండాలంటే జీడిపప్పులు రోజూ ఓ నాలుగు అయినా తినాలిట. వీటిలో వుండే ఒలోయిక్ ఆమ్లం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు శరీరానికి అవసరమై. రాగి, మెగ్నీషియమ్, జింక్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఈ జీడిపప్పుల నుంచి లభిస్తాయిట. కాబట్టి ఏ పనిలో వున్నా ఓ నాలుగు జీడిపప్పులను టక్కున నోట్లో వేసుకోవడం మరచిపోవద్దు.   ఇక బాదం ఎందుకు తినాలో తెలుసా? శరీరంలోని హానికర కొవ్వు నిల్వలని తగ్గిస్తుంది కాబట్టి. వీటిలోని మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి లాంటి ఖనిజ లవణాలు, ఇ విటమిన్ గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయిట. గర్భవతులు రోజూ ఓ రెండు బాదం పప్పులు తింటే వీటిలోని ఫోలెట్, బి విటమిన్లు బొజ్జలోని పాపాయికి బర్త్ డిఫెక్ట్ లేకుండా చూసుకుంటాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు, మెనోపాజ్ దశలో వున్నవారు ఎండుద్రాక్షని రోజూ తప్పనిసరిగా తినాలిట. ఎందుకంటే, ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించే బోరెన్ అనే ఖనిజ లవణం ఎండుద్రాక్షలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే వీటిలో కూడా యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా వుంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక వాల్ నట్స్ తింటే రోగ నిరోధక శక్తి పెరగటమే కాదు. క్యాన్సర్ల వంటివీ దరిచేరవు. అలాగే ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. అధిక రక్తపోటు, హానికారక కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రణలో వుంటాయి. గుండె ఆరోగ్యంగా వుంటుంది. వీటన్నిటికీ కారణం వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్‌లు అధికంగా వుండటమే. -రమ  

స్టెప్పులేయడమే మంచి మందు..

  సంగీతమంటే ఇష్టం లేంది ఎవరికి..? మంచి పాటేదైనా అలా గాలివాటంగా వినిపిస్తుంటే.. చెవులు రిక్కించని వాళ్లు ఎవరైనా ఉంటారా.. ? మంచి రాగం చెవినపడితే వీలైతే కాళ్లూ చేతులూ లేకపోతే కనీసం వేళ్లైనా ఊపకుండా ఉండగలిగేవాళ్లు ఈ భూమ్మీద ఉన్నారంటారా.. ? లేరని గట్టిగా చెప్పొచ్చు. ముమ్మాటికీ ఆలాంటివాళ్లు ఈ పుడమిమీద దొరకరుగాక దొరకరని ఢంకా బజాయించి మరీ చెప్పొచ్చు.  ఆ అలవాటే ఇప్పుడు కొన్ని జబ్బులకు మందుగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పార్కిన్ సన్స్ డిసీజ్ కి నచ్చినపాటకి నచ్చినట్టుగా స్టెప్పులేస్తే చాలా ఉపశమనం కలుగుతుందని వైద్య శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజా పరిశోధనల్లో తెలిసిన ఈ విషయాన్ని వెంటనే అందరికీ చెప్పేయాలన్న ఉబలాటంతో శాస్త్రవేత్తలు టమకేసి మరీ చెబుతున్నారు.  అంతే కాదు.. ఇలా ఇష్టమైన పాటలకి స్టెప్పులేయడంవల్ల ఒక్క పార్కిన్ సన్స్ డిసీజ్ కి మాత్రమే కాదు, బీపీ, షుగర్ లాంటి మొండి జబ్బులకుకూడా చాలా ఉపశమనం కలుగుతుందంటున్నారు. సో.. మీ కిష్టమైన మంచి పాటకి స్టెప్పులేయడంవల్ల ఇన్ని మంచి లాభాలున్నాయని తెలిసినప్పుడు మరింకెందుకు ఆలస్యం.. లెట్స్ డూ ఇట్ ఫాస్ట్..

సూర్యుణ్ణి కౌగిలించుకోం‘డి’

  సూర్యకాంతిలో వుండే బి-బ్యాండ్ అతినీలలోహిత కిరణాలు మన ఆరోగ్యానికి అత్యంత కీలకమైనవి. ఆ కిరణాలే మన శరీరంలో ఎముకల పుష్టికి మూలమైన ‘విటమిన్-డి’ తయారీని ప్రేరేపిస్తాయట. ఆ కిరణాలు సూర్యకాంతి మన చర్మం మీద ఏటవాలుగా పడే ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎక్కువగా వుంటాయి. కాబట్టి వీటికోసం మనం ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ఆరుబయట గడపటం తప్పనిసరి. ఈ కిరణాలు మన చర్మం మీద పడుతూనే మన శరీరం ‘విటమిన్-డి ’ని తయారుచేసుకోవడం ప్రారంభిస్తుంది. మనం తిన్న ఆహారంలోని కాల్షియం ఎముకల్లో చేరడానికి డి విటమిన్ చాలా అవసరంట. ‘విటమిన్-డి ’ కోసం మందులు వాడచ్చు కదా అంటారు కొందరు. కానీ, మనం వాడే మందుల్లో ‘విటమిన్-డి ’ సుమారు 100 యూనిట్ల లోపే వుంటుంది. నిజానికి ఒక్కరోజుకి పిల్లలకి 200 యూనిట్లు, పెద్దలకు 400 యూనిట్ల ‘విటమిన్-డి ’ అవసరం. ఆ లెక్కన ఎన్ని మందులు వాడాలి చెప్పండి. చక్కగా ఉదయం, సాయంత్రం లేలేత కిరణాలు తాకేలా నిలుచుంటేచాలు.  రోజూ ఒంటికి సూర్యరశ్మి తగలని వారికి రొమ్ము, ప్రొస్టేట్, గర్భాశయం వంటి అవయవాలకు కేన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుందని పరిశోధకులు గుర్తించారు. పైగా ఈ మధ్యాకాలంలో చాలమందిలో ‘విటమిన్-డి ’ లోపం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు కూడా. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి ఈ ‘విటమిన్-డి ’ ఎంతో అవసరం. అయితే ఉదయం స్కూలుకి వెళ్ళే హడావిడి, సాయంత్రం ఎప్పుడో పొద్దుపోయాక ఇళ్ళకి చేరడం వల్ల తగినంత సూర్యరశ్మి పిల్లలకి చేరడం లేదని చెబుతున్నారు పరిశోధకులు. దీనివల్ల పిల్లలు భవిష్యత్తులో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా వుందట. సూర్యరశ్మి తగలగానే మన ఒంట్లో ‘మెలటోనిన్’ అనే హార్మోను తగ్గిపోతుందట. ఈ హార్మోన్ స్థాయి ఎక్కువగా వుంటే మనలో డిప్రెషన్ సమస్య ఎక్కువగా ఉంటుందిట. మానసికంగా నిస్తేజంగా ఉన్నా, డిప్రెషన్ చుట్టుముట్టినా లేలేత సూర్యకిరణాలలో సేదతీరడం మొదలుపెడితే చాలట. లేలేత సూర్యకిరణాలలో కొద్దిసేపు ఉంటే డిప్రెషన్‌కి కారణమైన ‘మెలటోనిన్’ హార్మోను స్థాయి తగ్గిపోతుంది. మానసికంగా ఉత్తేజం లభిస్తుంది.  అంతేకాదు.. రోజు క్రమం తప్పకుండా వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలని సూర్య కిరణాలు తాకేలా చేసేవారు ఒత్తిడి బారిన పడే అవకాశాలు చాలా తక్కువట. వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాల వల్ల మాత్రమే కాదు.. ఆ సూర్యరశ్మి తాలూకు ప్రభావం వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంతో ఉండచ్చని గట్టిగా చెబుతున్నారు. పసిపిల్లలు రాత్రంతా నిద్రపోకుండా అదేపనిగా ఏడుస్తుంటే రోజూ కొద్దిసేపు పగటి వెలుగులో ఉంచితే వారి నిద్ర అలవాట్లు తప్పకుండా మారతాయిట.  అంతేకాక వారు ఉత్తేజంగా కూడా ఉంటారని అధ్యయనాల్లో తేలింది. అటు ఆధునిక వైద్యులు, ఇటు సంప్రదాయ వైద్యులు ముక్తకంఠంతో చెబుతున్న మాట ఒక్కటే. మన మెదడుపై సూర్యరశ్మి అమోఘమైన ప్రభావాన్ని చూపిస్తుందిట. ఇది నిద్రతోపాటు రకరకాల హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుందిట. కాబట్టి మన శరీరంలోని అంతర్గత గడియారం సజావుగా నడుస్తూండాలంటే రోజూ కొంత సమయం సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం అవసరం.  సూర్యకిరణాలు సైతం మనల్ని తాకే అవకాశం లేని కాంక్రీట్ జంగిల్‌లో నివసిస్తున్నాం. ఆరుబయట ఉచితంగా, అనంతంగా దొరికే ఆరోగ్య ప్రదాయినిని నిర్లక్ష్యం చేస్తున్నాం. అనారోగ్యాన్ని కోరి తెచ్చుకుంటున్నాం అంటూ నిపుణులు చేస్తున్న హెచ్చరికలపై ఇకనైనా కాస్త శ్రద్ధ పెట్టాలి. సూర్యకిరణాల స్పర్శతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకునే విషయమై ఆలోచించాలి.                                                                          -రమ ఇరగవరపు

వెల్లులితో వైరస్ లకు చెక్

  ''ఆరోగ్యంగా వుండాలంటే రోజుకో పచ్చి వెల్లులిని తినండి'' అంటున్నారు నిపుణులు. వంటల్లో వెల్లులిని వాడినా వండినప్పుడు 'అల్లిసిన్' ఇతర శక్తివంతమైన కాంపౌండ్లుగా మారటం తగ్గిపోతుందట. కాబట్టి తాజా వెల్లులిని తినటం వల్ల మాత్రమే ఉపయోగం వుంటుందని అంటున్నారు నిపుణులు. అయితే కొన్ని రసాయనాలు వండినప్పుడు కూడా దెబ్బతినకుండా వుంటాయి. కాబట్టి వంటల్లో విరివిగా వెల్లులిని వాడచ్చు అని కూడా చెబుతున్నారు. పచ్చి వెల్లుల్లి రేకులని రోజుకు ఓ మూడు నోట్లో వేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ (LDL) ను 10 శాతం వరకు తగ్గించుకోవచ్చు. దాంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇక అధిక రక్తపోటుకి వెల్లుల్లి మంచి ఔషదం. ఇది మాత్రలతో సమాన ప్రభావం కలిగి వుండటం గుర్తించారు పరిశోధకులు. ఇక వైరస్ లకు వెల్లుల్లి చెక్ చెబుతుందనటంలో అనుమానమే లేదు. వెల్లుల్లి నమిలి తిన్నప్పుడు అందులోని 'అల్లిన్' అనే రసాయనం 'అల్లిసిన్' గా మారుతుంది. ఆ తర్వాత అది వెంటనే అజోన్ వంటి ఇతర రసాయన కాంపౌండ్ల రూపంలోకి మారుతుంది, వాటి వల్లే మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు దక్కుతాయి.                                                                                                                                 ---రమ

వడదెబ్బ తగిలిన వెంటనే...

గ్లోబల్ వార్మింగో మరొకటో.... కారణం ఏదైతేనేం! ఒకో ఏడాది గడిచేకొద్దీ ఎండల తీవ్రత పెరిగిపోతూనే వస్తోంది. ఆ ఎండల బారిన పడి వడదెబ్బతో విలవిల్లాడిపోయేవారి సంఖ్యా పెరిగిపోతోంది. కానీ కాస్తంత అవగాహన ఉంటే వడదెబ్బని తప్పించుకోవడం ఏమంత కష్టం కాదంటున్నారు.   వడదబ్బ కలిగే పరిస్థితిని Hyperthermia అంటారు. మన శరీరం నుంచి వెళ్లిపోయే వేడికన్నా, శరీరం లోపల ఉన్న వేడి ఎక్కువైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పుడుతుంది. దాంతో శరీరంలో వేడిని నియంత్రించే thermo regulation అనే వ్యవస్థ దెబ్బతినిపోయి వడదెబ్బకి దారితీస్తుంది. సాధారణంగా 40.6 డిగ్రీలని మించి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ వడదెబ్బ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.   విపరీతమైన ఉష్ణోగ్రతలకి తోడు మరికొన్ని పరిస్థితులు కూడా వడదెబ్బకి కారణం కావచ్చు. మందపాటి దుస్తులు వేసుకోవడం, ఎండలో విపరీతంగా శ్రమించడం, నేరుగా ఎండ తీక్షణత ఒంటికి తగిలేలా తిరగడం వంటి చర్యలతో ఏరికోరి వడదెబ్బని తెచ్చుకున్నట్లవుతుంది. ఇక మద్యపానం, కాఫీటీలు తాగడం వల్ల కూడా వాటిలోని రసాయనాలకి ఒంట్లో డీహైడ్రేషన్ ఏర్పడి వడదెబ్బకి దారితీయవచ్చు.   ముందు జాగ్రత్త   వడదెబ్బ వచ్చాక బాధపడేకంటే రాకుండా చూసుకోవడం తేలిక. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. - ఎండాకాలం వదులుగా, లేత రంగుల్లో ఉండే దుస్తులు వేసుకోవాలి. - బయటకి వెళ్లాల్సి వస్తే వెడల్పాటి అంచులు ఉన్న టోపీ పెట్టుకోవడం చాలా ఉపయోగం. - మూసి ఉన్న కారులో ఉష్ణోగ్రతలు చాలా త్వరగా పెరిగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని కారులో వదిలి వెళ్లకూడదు. ఎండలో ఉంచిన కారులో వేడి కాస్త తగ్గేదాకా తలుపులు తీసి ఉంచాలి. - పిల్లలు, వృద్ధులలో వేడిని నియంత్రించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. - కుక్కలు, పిల్లులకి చెమటే పట్టదు. ఇవి త్వరగా వడదెబ్బకి గురవుతాయి. కాబట్టి వీటిని వదలి బయటకు వెళ్లేటప్పుడు, వాటికి అందుబాటులో తగినంత మంచినీరు ఉందో లేదో గమనించుకోవాలి. - మంచినీళ్లు తాగుతూ ఉండాలి. మూత్రం పచ్చగా ఉంటే మనం తగినంత నీరు తాగడం లేదని గ్రహించాలి.   వడదెబ్బ తగిలితే! కళ్లు తిరగడం, అయోమయంగా ప్రవర్తించడం, నిస్సత్తువగా మారిపోవడం, తలనొప్పి, చెమట పట్టకపోవడం, వాంతులు, గుండెదడ... లాంటి లక్షణాలన్నీ వడదెబ్బ సమయంలో చూడవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఫిట్స్ రావడం, మూర్ఛపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి మరణానికే దారితీయవచ్చు. అందుకని వడదెబ్బ తగిలిందన్న అనుమానం రాగానే ఈ చర్యలు తీసుకుంటే రోగి కోలుకునే అవకాశం ఉంటుంది.   - రోగి ఒంటి మీద ఉన్న దుస్తులు వదులుచేసి బాగా గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి. - మెడ, గజ్జలు, తల దగ్గర నీటిలో తడిపిన గుడ్డలని ఉంచాలి. దాంతో ఉష్ణోగ్రతలు వెంటనే అదుపులోకి వస్తాయి. - చల్లటి నీరు నింపిన టబ్బులో రోగిని ముంచితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. - ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీటిని ఒక్కసారిగా కాకుండా నిదానంగా తాగించాలి.   ఒక పక్క ప్రాథమిక చికిత్స చేస్తూనే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించే ప్రయత్నం చేయాలి. అక్కడ అవసరాన్ని బట్టి రోగికి ఇంట్రావీనస్ ద్వారా శరీరంలో కోల్పోయిన లవణాలను వెంటనే అందించే ప్రయత్నం చేస్తారు. - నిర్జర.