ప్రభాస్‌ అందరికీ డార్లింగ్‌ ఎలా అయ్యాడో తెలుసా?

(అక్టోబర్‌ 23 రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా..) రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నట వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. స్టార్‌గా తను ఎంత ఎత్తుకు ఎదిగినా డౌన్‌ టు ఎర్త్‌ అనే పద్ధతిలోనే ఆయన లైఫ్‌ స్టైల్‌ ఉంటుంది. టాలీవుడ్‌లో గొప్ప స్నేహశీలిగా పేరు తెచ్చుకొని అందరికీ డార్లింగ్‌గా మారిన ప్రభాస్‌.. ప్రతి ఒక్కరినీ డార్లింగ్‌ అంటూ ప్రేమగా పలకరిస్తాడు. సాధారణంగా సెలబ్రిటీస్‌లో ఉండే హిపోక్రసీ ప్రభాస్‌లో కనిపించదు. స్వచ్ఛమైన మనసు, అందర్నీ ఆదరించే సుగుణం అతని సొంతం. అందుకే అందరికీ అతను డార్లింగ్‌ అయ్యాడు. అందరికీ ఎంతో ఇష్టమైన ప్రభాస్‌ అభిరుచులు ఏమిటి? ఆయన ఎవరిని ఇష్టపడతారు? ఎలాంటి  జీవితాన్ని ఆయన కోరుకుంటారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రభాస్‌ ప్రకృతి ప్రేమికుడు. ముఖ్యంగా అడవులు, జంతువులు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే హైదరాబాద్‌ దుండిగల్‌ సమీపంలోని 1650 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఖాజీపల్లి అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ను దత్తత తీసుకున్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. దాని కోసం 2 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. తన తండ్రి యు.వి.సూర్యనారాయణరాజు జ్ఞాపకార్థం ఈ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ఒక అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు, ఎకో టూరిజం కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఇందులో జంతువుల్ని కూడా ప్రవేశపెట్టి వాటిని సంరక్షించాలన్నది ప్రభాస్‌ ఆలోచన.  నటుడు అవ్వాలన్న ఆలోచన ప్రభాస్‌కి మొదట్లో ఉండేది కాదు. బాగా చదువుకొని మంచి బిజినెస్‌మేన్‌గా పేరు తెచ్చుకోవాలనేది ఆయన గోల్‌. అయితే పెదనాన్న కృష్ణంరాజు, స్నేహితుల ప్రోత్సాహంతో నటనవైపు అడుగులు వేశారు. సినిమాల్లోకి రావాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత నటనలో శిక్షణ పొందారు.  ప్రభాస్‌కి ఇష్టమైన డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీ. ఆయన దర్శకత్వంలో వచ్చిన మున్నాభాయ్‌ ఎంబిబిఎస్‌, త్రీ ఇడియట్స్‌ చిత్రాలను 20 సార్లకు పైగా చూశారు. హాలీవుడ్‌కి చెందిన రాబర్ట్‌ డీనీరో ప్రభాస్‌కి ఇష్టమైన నటుడు. ఆయన నటన అంటే ప్రభాస్‌కి ఎంతో ఇష్టం. ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేయడానికి ప్రభాస్‌ ఇష్టపడేవారు కాదు. తను చేసే ఒక సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టేవారు. అలా బాహుబలి సిరీస్‌ కోసం నాలుగు సంవత్సరాలు కేటాయించారు. ఈ సినిమా తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకొని ఒకేసారి పలు సినిమాల్లో నటిస్తూ తన సినిమాల స్పీడును పెంచారు.  బాహుబలి సినిమాలో చేసిన శివుడు, అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్స్‌ కోసం 30 కేజీల బరువు పెరిగారు ప్రభాస్‌. దాన్ని నాలుగు సంవత్సరాలపాటు కొనసాగించడం కోసం ఎంతో శ్రమించారు. 2010లో మిస్టర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న లక్ష్మణ్‌రెడ్డి... బాహుబలి సినిమా కోసం ప్రభాస్‌ని ట్రైన్‌ చేశారు. కోటిన్నర విలువైన జిమ్‌ ఎక్విప్‌మెంట్స్‌ ప్రభాస్‌ కోసం తెప్పించారు మేకర్స్‌.  రాజమౌళి మాటల్లో చెప్పాలంటే.. ప్రభాస్‌ చాలా బద్ధకస్తుడు. ఏ పని చెయ్యడానికైనా బద్దకిస్తాడు. అయితే సెట్స్‌కి వచ్చిన తర్వాత ఒక్కసారి కెమెరా ముందు నిలబడితే తన నటవిశ్వరూపంతో విజృంభిస్తాడు. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా విషయాల్లో బద్ధకంగా వ్యవహరిస్తాడు.  బాహుబలి సినిమాకి సంబంధించి ఇచ్చిన ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌లో భాగంగా ప్రభాస్‌తో వాలీబాల్‌ కూడా ఆడించేవారు. అప్పటి నుంచి వాలీబాల్‌ ప్రభాస్‌కి ఇష్టమైన గేమ్‌గా మారిపోయింది. దాని కోసం తన ఇంటి ఆవరణలోనే వాలీబాల్‌ కోర్ట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే బాస్కెట్‌ బాల్‌ అంటే కూడా ప్రభాస్‌కి చాలా ఇష్టం.  ప్రభాస్‌కి ఇష్టమైన ఫుడ్‌ చికెన్‌ బిర్యానీ. అతిథులకు మర్యాదలు చేయడంలో ప్రభాస్‌ తర్వాతే ఎవరైనా అంటారు అతని ఆతిథ్యం తీసుకున్నవారు. మలయాళ స్టార్‌ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ మాటల్లో చెప్పాలంటే.. ‘ప్రభాస్‌ ఫుడ్‌ పెట్టి చంపేస్తాడు’. ‘సలార్‌’ చేస్తున్న సమయంలో తను ఉంటున్న రూమ్‌కి లెక్కకు మించిన డిషెస్‌ పంపించాడని, అలాగే తన కుటుంబ సభ్యులకు కూడా పంపాడని పృథ్విరాజ్‌ చెప్పారు.  సేవా కార్యక్రమాల్లో ప్రభాస్‌ ఎప్పుడూ ముందుంటారు. ప్రకృతి విపత్తు సంభవించినపుడు ఏ టాలీవుడ్‌ ఇవ్వనంత పెద్ద మొత్తం విరాళంగా ప్రకటిస్తుంటారు. ఆపదలో ఉన్న ఎంతో మందికి ఆర్థిక సాయం చేయడం ద్వారా వారిని ఆదుకున్నారు. అయితే చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని చెబుతారు ప్రభాస్‌.

నవ్వుల రారాజు రాజబాబు జీవితం విషాదాంతం అనే మాటల్లో నిజమెంత?

(అక్టోబర్‌ 20 హాస్య నటుడు రాజబాబు జయంతి సందర్భంగా..) సినిమా రంగంలో పేరు, డబ్బు సంపాదించిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు.  హీరో, హీరోయిన్‌, క్యారెక్టర్‌ అర్టిస్ట్‌, కమెడియన్‌... ఎవరైనా సినిమాల ద్వారా తాము ఇంత సంపాదించాం అని ధైర్యంగా చెప్పగలరా? కానీ, నవ్వుల రారాజు రాజబాబు చెప్పారు. తాను సినిమాల్లో నటించడం ద్వారా కోట్లు సంపాదించానని బహిరంగంగా ప్రకటించారు. రాజబాబు ఆ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తడానికి, నటుడిగా తెరపై కనిపించడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అయితే కమెడియన్‌గా రాజబాబుకి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన డైలాగులు చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై కనిపిస్తే చాలు థియేటర్లు నవ్వుల్తో నిండిపోయేవి. పాతతరం హాస్యనటులు రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు రాజబాబు. తను సినీరంగానికి రావాలి, నటుడుగా మంచి పేరు తెచ్చుకోవాలి అనే కోరిక కలగడానికి ముఖ్య కారణం హాస్యనటుడు బాలకృష్ణ. పాతాళభైరవి చిత్రంలో ఆయన పోషించిన అంజిగాడు పాత్ర రాజబాబుని అంతగా ప్రభావితం చేసింది. ఆ సినిమాను రాజబాబు 90 సార్లు చూశారంటే ఆశ్చర్యం కలగక మానదు. రెండు దశాబ్దాలపాటు విరామం లేకుండా ప్రేక్షకుల్ని నవ్విస్తూ 514 సినిమాల్లో నటించారు రాజబాబు. శతాబ్దపు హాస్యనటుడు అవార్డు పొందిన రాజబాబు.. సినీ రంగంలోకి ఎలా వచ్చారు, ఆయన జీవిత విశేషాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.  రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1935 అక్టోబర్‌ 20న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, రమణమ్మ దంపతులకు జన్మించారు. నిడదవోలులో చదువుకునే రోజుల్లోనే బుర్రకథ నేర్చుకున్నారు రాజబాబు. ఎన్నో నాటక సమాజాల్లో నాటకాలు వేశారు. అది ఆయన తండ్రికి నచ్చేది కాదు. అయినా తండ్రికి తెలియకుండా నాటకాలు వేయడం, బుర్రకథ నేర్చుకోవడం చేసేవారు. ఇంటర్మీడియట్‌ పూర్తయిన తర్వాత టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు పూర్తి చేసి కొద్దికాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. నాటకరంగంలో పితామహుడిగా పేరు తెచ్చుకున్న గరికపాటి రాజారావు, స్నేహితులు.. రాజబాబును సినిమాల్లో వెళ్ళాల్సిందిగా ప్రోత్సహించారు. తనకి కూడా సినిమాల్లో నటించాలనే కోరిక ఉండడంతో మద్రాస్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఇంట్లో వారితో చెబితే ఒప్పుకోరని ఎవరికీ చెప్పకుండా 1960 ఫిబ్రవరి 7న మద్రాస్‌ రైలెక్కేశారు రాజబాబు.  అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. చివరికి పూట గడవడం కష్టంగా ఉన్న సమయంలో నటుడు, దర్శకుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ట్యూషన్‌ చెప్పారు. ఆ సమయంలో పిల్లల్ని, ఆ కుటుంబ సభ్యుల్ని తన మాటలతో బాగా నవ్వించేవారు. అది చూసిన నారాయణరావు తన దర్శకత్వంలో రూపొందిన సమాజం చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కులగోత్రాలు, స్వర్ణగౌరి, మంచి మనిషి చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల్లో నటించినందుకు రూ.350 పారితోషికం అందుకున్నారు. 1965లో వి.బి.రాజేంద్రప్రసాద్‌ నిర్మించిన అంతస్తులు చిత్రంలో మంచి క్యారెక్టర్‌ చేశారు. పారితోషికం ఎంత కావాలి అని రాజేంద్రప్రసాద్‌ అడిగితే.. మీకు తెలుసు కదా.. ఇవ్వండి అన్నారు రాజబాబు. అయితే అతని పారితోషికాన్ని ఒక్కసారిగా రూ.1300కి పెంచారు నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌. అంతస్తులు చిత్రంతో రాజబాబు కెరీర్‌ ఒక్కసారిగా టర్న్‌ అయింది. అవకాశాలు అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాజబాబుకి రాలేదు. 1960లో మొదలైన ఆయన సినీ ప్రస్థానం 1979 వరకు ఉజ్వలంగా సాగింది. ముఖ్యంగా 1960, 1970 మధ్యలో రాజబాబు లేని సినిమా దాదాపు లేదంటే అతిశయోక్తి కాదు.  రాజబాబు సరసన ఎక్కువ సినిమాలు చేసిన నటి రమాప్రభ. వీరిద్దరూ కలిసి 16 సంవత్సరాలపాటు 100 సినిమాలు చేశారు. హీరో ఎవరైనా రాజబాబు, రమాప్రభ సినిమాలో ఉండాల్సిందే. హీరో డేట్స్‌ తీసుకున్న వెంటనే వీరిద్దరి డేట్స్‌ కన్‌ఫర్మ్‌ చేసుకునేవారు నిర్మాతలు. పోస్టర్‌ మీద వీరిద్దరి ఫోటోలు ఉన్నాయంటే సినిమా సూపర్‌హిట్‌ అనే సెంటిమెంట్‌ హీరోలకూ వచ్చేసింది. ఆ తర్వాత మీనాకుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి వంటి నటీమణులు కూడా రాజబాబుతో ఎక్కువ సినిమాలు చేశారు. అప్పటికే రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం వంటి హాస్యనటులు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎవరినీ అనుకరించకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని హాస్యాన్ని పండించేవారు రాజబాబు. ఉత్తమనటుడిగా వరసగా 7 సార్లు ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్న తొలి హాస్యనటుడు రాజబాబు. మొత్తం 9 ఫిలింఫేర్‌ అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. అలాగే మూడు నంది అవార్డులు కూడా ఆయన్ని వరించాయి. అంతస్తులు చిత్రంతో బ్రేక్‌ వచ్చిన తర్వాత 1965 డిసెంబర్‌ 5న మహాకవి శ్రీశ్రీ మరదలు లక్ష్మీఅమ్ములుని వివాహం చేసుకున్నారు రాజబాబు. వీరికి నాగేంద్రబాబు, మహేష్‌బాబు సంతానం. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. రాజబాబు సోదరులు చిట్టిబాబు, అనంత్‌ కూడా హాస్యనటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు.  రాజబాబు వ్యక్తిగత జీవితం ఎంతో విభిన్నమైనది. ఆయనలో తాత్విక లక్షణాలు ఎక్కువ. జీవితం యొక్క పరమార్థం ఏమిటి అనే ఆలోచనలు ఎక్కువ చేసేవారు. తను జీవితంలో సంపాదించిన దానిలో ఎక్కువ శాతం దాన ధర్మాలకే వినియోగించారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున సీనియర్‌ నటీనటుల్ని ఘనంగా సన్మానించేవారు. వారిలో మొదటగా తనకు స్ఫూర్తిగా నిలిచిన బాలకృష్ణను సన్మానించారు. అలా సన్మానం అందుకున్నవారిలో రేలంగి, సూర్యకాంతం, సావిత్రి, డా.శివరామకృష్ణయ్య ఉన్నారు. అంతస్తులు చిత్రానికి ముందు ఒక సినిమా షూటింగ్‌ షాట్‌ పూర్తి చేసి బయటికి వచ్చినపుడు ఒక లైట్‌బోయ్‌ రాజబాబు నటనను ప్రశంసిస్తూ మీరు తప్పకుండా పెద్ద స్థాయికి వెళతారు. అప్పుడు నాకు బట్టలు పెట్టాలి అని అడిగాడు.  నటుడుగా ఎంతో బిజీ అయిపోయిన తర్వాత ఆ లైట్‌బోయ్‌ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అయితే అతను ఎలా ఉంటాడో గుర్తులేదు. అందుకే తన ప్రతి పుట్టినరోజున మద్రాస్‌లోని అన్ని స్టూడియోల్లో పనిచేసే లైట్‌బోయ్స్‌కి బట్టలు పెట్టి, బిర్యానీ ప్యాకెట్‌ ఇచ్చేవారు. పబ్లిక్‌ ట్రస్ట్‌ పేరుతో ఓ సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కోరుకొండలో జూనియర్‌ కళాశాలను కట్టించారు. రాజబాబు పేరుతోనే ఆ కాలేజీ ఉంది. రాజమండ్రిలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం అదే ఊరిలో బంగీ కాలనీ కట్టించారు. తన భార్య పేరు మీద రాజమండ్రిలో ఒక ఆడిటోరియం నిర్మించారు. రాజబాబు సేవా నిరతికి ఉదాహరణగా ఒక సంఘటన గురించి చెప్పాలి. ‘రాణి ఔర్‌ లాల్‌పరి’ అనే హిందీ సినిమా కోసం ఒక పాటలో నటించారు. రెమ్యునరేషన్‌ ఎంత ఇవ్వమంటారు అని నిర్మాత అడిగారు. చేసింది ఒక పాటే కాబట్టి ఐదు వేలు ఇస్తే చాలు అనుకున్నారు రాజబాబు. కానీ, ఆ నిర్మాత 40వేలు ఇచ్చారు. అయితే తను మాత్రం ఐదువేలే తీసుకొని మిగిలిన డబ్బును ఆ సినిమా షూటింగ్‌లో ఉన్న టెక్నీషియన్స్‌ అందరికీ పంచి పెట్టేశారు. పాత తరం నుంచి ఇప్పటివరకు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన హాస్యనటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.  సినిమాల ద్వారా కొన్ని కోట్లు గడిరచానని రాజబాబు చెప్పుకునేవారు. అయితే సినిమాలు నిర్మించడం వల్ల, దానధర్మాలు చెయ్యడం వల్ల ఆస్తంతా కరిగిపోయిందని, చివరి రోజులు ఎంతో దీనావస్థలో గడిపారని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాదని ఆయన సోదరుడు చిట్టిబాబు చెబుతున్నారు. 1983లో రాజబాబు చనిపోయే నాటికి హైదరాబాద్‌లో, మద్రాస్‌లో ఎన్నో ఆస్తులు ఉన్నాయని, ఆరోజుల్లో వాటి విలువ రూ.25 కోట్లని ఆయన తెలియజేస్తున్నారు. అలాగే మద్యానికి బానిసయ్యారని, వైవాహిక జీవితం సంతృప్తికరంగా లేదని, రాజబాబుని భార్య వదిలేసి వెళ్లిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. మద్యానికి బానిసైన మాట వాస్తవమే కానీ, దాని వల్ల ఆస్తులు కరిగిపోలేదని చిట్టిబాబు వివరించారు. రాజబాబుకి ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు, మహేష్‌బాబు. వీరిద్దరూ అమెరికాలో సొంతంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ రన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వీరు వందల కోట్లకు అధిపతులు. అంతేకాదు, ప్రస్తుతం మనం కారులో వినియోగిస్తున్న జిపిఎస్‌ వ్యవస్థను కనిపెట్టింది వారి సంస్థే. 1980 వచ్చేసరికి రాజబాబుకి అవకాశాలు కూడా తగ్గాయి. ఆ సమయంలోనే ఆయనకి గొంతు క్యాన్సర్‌ వ్యాధి సోకింది. ఒకసారి ఆపరేషన్‌ కూడా జరిగింది. రాజబాబుకి ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. ఆయన వర్థంతి అయిన ఫిబ్రవరి 11న రోజంతా ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు. అదేరోజు మరోసారి రాజబాబు గొంతుకి ఆపరేషన్‌ జరిగింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో 1983 ఫిబ్రవరి 14న రాజబాబు తుదిశ్వాస విడిచారు. తన హాస్యంతో రెండు దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన రాజబాబు భౌతికంగా మనమధ్య లేకపోయినా తను పోషించిన పాత్రల ద్వారా జీవించే ఉంటారు.

డైరెక్టర్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ.. అసలేం జరిగింది?

1990వ దశకంలో ఎక్కువ శాతం యాక్షన్‌ సినిమాలు రిలీజ్‌ అయ్యేవి. మధ్య మధ్య కొన్ని ప్రేమకథా చిత్రాలు, కామెడీ సినిమాలు కూడా వచ్చేవి. ఆరోజుల్లో హీరోయిన్లను ఎంతో గ్లామరస్‌గా చూపించేందుకు డైరెక్టర్లు తాపత్రయపడేవారు. హీరో చేసే యాక్షన్‌ సీన్స్‌కి ఎంత ఇంపార్టెన్స్‌ ఇచ్చేవారో, హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌కి కూడా అంతే ప్రిఫరెన్స్‌ ఇచ్చేవారు. కానీ, ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉండేవారు. 1991లో విడుదలైన కొబ్బరిబొండాం చిత్రం ద్వారా రచయితగా, సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు ఎస్‌.వి.కృష్ణారెడ్డి. ఆ తర్వాత రెండేళ్ళకు రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంతో దర్శకుడిగా మారారు. అప్పటి నుంచి 2023లో వచ్చిన ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు చిత్రం వరకు దాదాపు 40 సినిమాలకు దర్శకత్వం వహించారు.  కృష్ణారెడ్డి ఇండస్ట్రీకి వచ్చే నాటికి యాక్షన్‌ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. ఆ సినిమాల మధ్య ఫ్యామిలీ, సెంటిమెంట్‌, హాస్యాన్ని మిక్స్‌ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకున్నారు. తన ప్రతి సినిమాలోనూ ఇవన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. అప్పుడు లైమ్‌లైట్‌లో ఉన్న దర్శకుల మాదిరిగా కాకుండా హీరోయిన్లను ఎంతో గౌరవప్రదంగా చూపించేవారు. తన సినిమాల్లో డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, అశ్లీలతకు తావిచ్చేవారు కాదు. అంతేకాదు, తన సినిమాల్లోని హీరోయిన్ల పాత్రలకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు. దాదాపు ప్రతి సినిమాలోనూ కథ వారి చుట్టూనే తిరుగుతుంది. దాంతో కృష్ణారెడ్డి సినిమాలకు మహిళా ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా ఉండేది. ఆయన డైరెక్ట్‌ చేసిన సినిమా రిలీజ్‌ అవుతోందంటే కుటుంబ సమేతంగా థియేటర్లకు తరలి వెళ్లేవారు. ఆ క్రమంలోనే 1997లో శ్రీకాంత్‌, రమ్యకృష్ణ జంటగా రూపొందించిన ‘ఆహ్వానం’ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సంఘటనను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు కృష్ణారెడ్డి.  వివాహానికే కాదు, విడాకులకు కూడా ఆహ్వాన పత్రిక ఉండాలంటూ రూపొందించిన సినిమా ‘ఆహ్వానం’. కొత్త కాన్సెప్ట్‌తో కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ పూర్తయిన తర్వాత యూనిట్‌ నుంచి సెలవు తీసుకొని వెళ్లిపోవడానికి సిద్ధమైన రమ్యకృష్ణను ఆపి పట్టు బట్టలు, 10వేల రూపాయలు ఉన్న వెండి పళ్లాన్ని అందించి బొట్టు పెట్టి సంప్రదాయ పద్ధతిలో ఆమెను సాగనంపారు కృష్ణారెడ్డి. దాంతో ఒక్కసారిగా రమ్యకృష్ణ ఎమోషనల్‌ అయిపోయి కన్నీటి పర్యంతమైంది. యూనిట్‌లోని మిగతా సభ్యులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబ సభ్యురాలికి తను ఇచ్చిన గౌరవంగా భావించానని, అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనగా కృష్ణారెడ్డి చెబుతారు. హీరోయిన్లంటే కేవలం గ్లామర్‌కి, పాటలకు మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ, వారికి ఎంతో ప్రాధాన్యమిచ్చి గౌరవించడం అనేది ఎస్‌.వి.కృష్ణారెడ్డికి మాత్రమే సాధ్యమైంది. 

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి గురించి ఎవరికీ తెలియని కొన్ని విశేషాలు!

(అక్టోబర్‌ 10 ఎస్‌.ఎస్‌.రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా..) ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌నే ప్రామాణికంగా తీసుకునేవారు. కొన్ని కొత్త తరహా కథల కోసం సౌత్‌ ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్‌నే ఆశ్రయించేది. అలా ఎన్నో హిందీ సినిమాలు తెలుగులో రీమేక్‌ అయ్యాయి. అప్పుడప్పుడు సౌత్‌ సినిమాలు కూడా హిందీలో రీమేక్‌ అయినా వాటి సంఖ్య తక్కువనే చెప్పాలి. ఎప్పుడైతే టాలీవుడ్‌ నుంచి ఎస్‌.ఎస్‌.రాజమౌళి అనే డైరెక్టర్‌ ఉద్భవించాడో అప్పటి నుంచి తెలుగు సినిమా తీరు తెన్నులు మారుతూ వచ్చాయి. కొత్త తరహా సినిమాలు, టెక్నికల్‌గా మంచి స్టాండర్డ్స్‌ ఉన్న సినిమాలు రావడం మొదలైంది. ఈగ, బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సినిమాలతో తెలుగు సినిమా బాలీవుడ్‌ని దాటి హాలీవుడ్‌ వరకు వెళ్లింది. తెలుగు సినిమా పాటకి తొలి ఆస్కార్‌ సాధించి పెట్టిన ఘనత రాజమౌళికి దక్కింది. బాలీవుడ్‌ దర్శకనిర్మాతలే కాదు, హాలీవుడ్‌ ఇండస్ట్రీ కూడా తనవైపు దృష్టి సారించేలా రాజమౌళి తను చేసే సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్‌ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమా హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా ఉండబోతోందని అర్థమవుతోంది. హాలీవుడ్‌లో నిర్మాణం జరుపుకున్న ఇండియానా జోన్స్‌ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీ సాధించిందో అందరికీ తెలిసిందే. మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇండియానా జోన్స్‌ తరహాలోనే ఉండబోతోంది. ఒక హాలీవుడ్‌ స్థాయి సినిమా టాలీవుడ్‌ నుంచి రాబోతోందంటే అది తెలుగు వారు ఎంతో గర్వించాల్సిన విషయం. తన సినిమాలతో ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న రాజమౌళి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు చెందిన తెలుగు ఫ్యామిలీ.. కర్ణాటకలోని రాయచూరుకి వలస వెళ్లింది. అక్కడ జన్మించారు రాజమౌళి. తెలుగుతోపాటు కన్నడ కూడా అనర్గళంగా మాట్లాడగలరు రాజమౌళి. వ్యవహారిక కన్నడ భాష మాట్లాడడంలో ఆయన ఎక్స్‌పర్ట్‌. రాజమౌళికి ఇష్టమైన డైరెక్టర్‌ కె.రాఘవేంద్రరావు. ఆయన తన సినిమాల్లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని ఎంత పర్‌ఫెక్ట్‌ ఎలివేట్‌ చేస్తారనే విషయాన్ని అనేక ఇంటర్వ్యూల్లో రాజమౌళి వివరించారు. అదే తనకు ఇన్‌స్పిరేషన్‌ అని చెబుతారు.  రాజమౌళికి అత్యంత సన్నిహితుడు, ప్రాణ మిత్రుడు ఎన్టీఆర్‌. తన మొదటి సినిమా ఎన్టీఆర్‌తో చేసేందుకు అయిష్టంగానే ఒప్పుకున్న రాజమౌళి.. ఆ తర్వాత నటన పట్ల అతనికి ఉన్న డెడికేషన్‌, తను కోరుకున్న ఎఫెక్ట్‌ని స్క్రీప్‌పై ప్రజెంట్‌ చేసే విధానం రాజమౌళిని కట్టి పడేసింది. ఆ క్షణం నుంచి ఎన్టీఆర్‌తో ప్రేమలో పడిపోయాడు రాజమౌళి. ఆ కారణంగా ఎన్టీఆర్‌తో స్టూడెంట్‌ నెం.1, సింహాద్రి, యమదొంగ, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సినిమాలు చేశారు. రాజమౌళి, ఎన్టీఆర్‌ కుటుంబాల మధ్య బాండింగ్‌ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది.  ఎన్టీఆర్‌ తర్వాత రాజమౌళి ఎంతో ఇష్టపడే హీరో ప్రభాస్‌. ఒకరకంగా ప్రభాస్‌కి రాజమౌళి వ్యక్తిగత సలహాదారుడు. అతని కెరీర్‌ని అబ్జర్వ్‌ చేస్తూ ఇవ్వాల్సిన సలహాలిస్తూ ఉంటారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్‌ పేరు తెచ్చుకోవడం వెనుక రాజమౌళి హస్తం కూడా ఉంది.  స్టూడెంట్‌ నెం.1తో మొదలైన రాజమౌళి సినీ ప్రయాణం మర్యాద రామన్న వరకు దిగ్విజయంగా కొనసాగింది. అయితే అప్పటివరకు చేసిన 8 సినిమాలు తెలుగుకి మాత్రమే పరిమితమయ్యాయి. 2012లో చేసిన ఈగ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత చేసిన బాహుబలి1తో అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని 2019 అక్టోబర్‌ 19న లండన్‌లోని రాయల్‌ అల్బర్ట్‌ హాల్‌లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ఎం.ఎం.కీరవాణి లైవ్‌ ఆర్కెస్ట్రాతో ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేయడం విశేషం.  బాహుబలి మొదటి పార్ట్‌ రిలీజ్‌ అయిన సంవత్సరానికి రాజమౌళికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తెలుగులోనే సినిమాలు చేస్తున్న రాజమౌళికి కర్ణాటక ప్రభుత్వం రికమెండేషన్‌ వల్ల పద్మశ్రీ పురస్కారం లభించడం విశేషం. రాజమౌళి తనను తాను దర్శకుడిగా కంటే స్టోరీ టెల్లర్‌గానే ఇష్టపడతాడు. కానీ, ప్రేక్షకులు మాత్రం అతన్ని గొప్ప దర్శకుడిగానే చూస్తారు. తను సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ఎంతో స్ఫూర్తినిచ్చినవారు ఎం.ఎం.కీరవాణి అని చెబుతారు రాజమౌళి.  బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహర్‌ తన ఆటోబయోగ్రఫీలో రాజమౌళికి ప్రత్యేక స్థానం ఇచ్చారు. ‘గ్రేటెస్ట్‌ షోమ్యాన్‌ ఆఫ్‌ ది 21st సెంచరీ’గా రాజమౌళిని అభివర్ణించారు. సినిమాయే ఊపిరిగా జీవించే రాజమౌళికి దక్కిన గొప్ప గౌరవం ఇది.  రాజమౌళి నిరంతర విద్యార్థి. హాలీవుడ్‌ ట్రెండ్‌ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తన సినిమాల్లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతుంటారు. ఆ అబ్జర్వేషనే రాజమౌళిని అపజయం లేని దర్శకుడిగా నిలబెట్టిందని చెప్పడంలో సందేహం లేదు. రాజమౌళికి భారతీయ ఇతిహాసాలంటే వల్లమాలిన ఇష్టం. వాటిలో మహాభారతం అంటే మరింత ఇష్టం. ఇప్పటివరకు మహాభారతాన్ని ఎంతో మంది దర్శకులు ఎన్నో విధాలుగా చూపించారు. అయితే తన వెర్షన్‌లో మహాభారత గాథను తెరపై చూపించాలన్నది రాజమౌళి కల. ఇక తను సినిమాలు చేయడం మానేస్తాను అనుకున్న తరుణంలో చివరి ప్రాజెక్ట్‌గా మహాభారతాన్ని తెరకెక్కించాలన్నది ఆయన కోరిక.

44 ఏళ్ల క్రితం కలెక్షన్‌ పరంగా కొత్త రికార్డులు సృష్టించిన నటరత్న ఎన్టీఆర్‌ ‘కొండవీటి సింహం’!

(అక్టోబర్‌ 7తో 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా..) జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలతో నటుడిగా లెక్కకు మించిన సినిమాలు చేసి పురాణ పురుషుడిగా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నటరత్న ఎన్‌.టి.రామారావు. 1970వ దశకం వచ్చేసరికి సాంఘిక చిత్రాల్లో తన వైభవాన్ని కొనసాగించారు. 1977 సంవత్సరం ఎన్టీఆర్‌ కెరీర్‌లో అతి కీలకమైన సంవత్సరంగా చెప్పాలి. ఆ ఏడాది దానవీరశూర కర్ణ, అడవిరాముడు, యమగోల వంటి సిల్వర్‌ జూబ్లీ సినిమాలతో ఆయన కెరీర్‌ పీక్స్‌కి వెళ్లిపోయింది. ఆ క్రమంలోనే 1979లో వచ్చిన డ్రైవర్‌ రాముడు, వేటగాడు చిత్రాలు ఎన్టీఆర్‌ను తిరుగులేని హీరోగా నిలబెట్టాయి. ఆ సమయంలో ఎన్టీఆర్‌ దరిదాపుల్లో మరో హీరో లేరంటే అతిశయోక్తి కాదు. ఆ వరసలోనే వచ్చిన మరో సిల్వర్‌ జూబ్లీ సినిమా ‘కొండవీటి సింహం’. తమిళ్‌లో శివాజీ గణేశన్‌ హీరోగా రూపొందిన ‘తంగ పతకం’ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. 1981 అక్టోబర్‌ 7న విడుదలైన ‘కొండవీటి సింహం’ సంచలన విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. రోజా మూవీస్‌ పతాకంపై ఎం.అర్జునరాజు, కె.శివరామరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఎస్‌.పి. రంజిత్‌కుమార్‌ పాత్రలో తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించారు. రాము పాత్రలో శ్రీదేవితో కలిసి ఆయన వేసిన స్టెప్స్‌ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ‘ఈ మధుమాసంలో.. ఈ దరహాసంలో’, ‘మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే..’ పాటలు ప్రేక్షకుల మనసుల్ని సెంటిమెంట్‌తో తట్టి లేపగా, ‘అత్తమడుగు వాగులోన అత్త కొడకో..’, ‘పిల్ల వుంది..పిల్ల మీద కోరికుంది.. ’, ‘బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది..’, ‘వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే..’ వంటి పాటలు ప్రేక్షకుల చేత చిందులు వేయించాయి.  పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా, ఆయనకు అన్ని సందర్భాల్లోనూ సపోర్ట్‌గా నిలిచే యంగ్‌ క్యారెక్టర్‌లోనూ ఎన్టీఆర్‌ నటన అద్భుతం అని చెప్పాలి. సెంటిమెంట్‌, యాక్షన్‌, గ్లామర్‌, కామెడీ.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాకి బాగా కుదిరాయి. దాంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. విడుదలైన అన్ని సెంటర్స్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిసింది.  1980 దశకం ప్రారంభంలో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించిన చిత్రంగా ‘కొండవీటి సింహం’ నిలిచింది. కలెక్షన్స్‌ పరంగా, రన్‌ పరంగా అప్పటివరకు ఉన్న రికార్డులను ఈ చిత్రం అధిగమించింది. ఈ చిత్రాన్ని దిగ్విజయంగా 300 రోజులకు పైగా ప్రదర్శించారు. విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు, లేట్‌ రన్‌తో కలిపి మొత్తం 52 కేంద్రాలలో (37+15) - 100 రోజులు, 16 కేంద్రాల్లో (15+1) - 175 రోజులు (సిల్వర్‌ జుబ్లీ), 5 కేంద్రాలలో - 200 రోజులు, ఒక కేంద్రం(విశాఖపట్నం)లో 300 రోజులకు పైగా ఆడింది. మొదటి వారం రూ.34,35,908 వసూలు చేసి అల్‌ టైం రికార్డు సృష్టించింది. విడుదలైన 43 కేంద్రాలలో 50 రోజులకు(ఒక కోటి ఇరవై ఒక్క లక్షలు)1,21,47,837 రూపాయలు వసూలు చేసి చలనచిత్ర చరిత్రను తిరగరాసింది. మొత్తం 5 కేంద్రాలలో 200 రోజులు ఆడింది. 1) గుంటూరు.. కృష్ణా పిక్చర్‌ ప్యాలెస్‌ (200 రోజులు)డైరెక్ట్‌ 2) విశాఖపట్టణం.. శరత్‌ (205 రోజులు) డైరెక్ట్‌ 3) శ్రీకాకుళం.. సూర్య మహల్‌ (221 రోజులు) డైరెక్ట్‌ 4) హైదరాబాద్‌.. సెలెక్ట్‌ - షిఫ్టు మీద (262 రోజులు) 5) విజయవాడలో షిఫ్ట్‌ మీద 200 రోజులు ఆడింది. గుంటూరు, విశాఖపట్టణం, శ్రీకాకుళం కేంద్రాలలో డైరెక్ట్‌గా 200 రోజులు ఈ చిత్రం ప్రదర్శింపబడింది. ఒక కేంద్రంలో 300 రోజులు ఆడింది. విశాఖపట్నం.. శరత్‌ (205 రోజులు) + షిఫ్ట్‌తో మొత్తం 315 రోజులు ప్రదర్శింపబడింది.

‘బద్రి’ క్లైమాక్స్‌ విషయంలో పవన్‌ మాట వినని పూరి.. అప్పుడు ఏం జరిగింది?

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోగా పరిచయమైన పవన్‌కళ్యాణ్‌.. ఆ తర్వాత ఎలాంటి సెన్సేషనల్‌ హిట్స్‌తో స్టార్‌ హీరో అయ్యారో అందరికీ తెలిసిందే. అయితే ఎన్ని హిట్స్‌ వచ్చినా అతని కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో బద్రి ఒకటి. ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసి యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని డైలాగులు ఆరోజుల్లో జనం వాడుకలోకి వచ్చేశాయి. అలాంటి డిఫరెంట్‌ డైలాగులు రాయగల ఒకే ఒక్క డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. పవన్‌కళ్యాణ్‌కి కొత్త ఇమేజ్‌ని, గ్లామర్‌ని తీసుకొచ్చిన ఘనత పూరికి దక్కుతుంది. ‘బద్రి’ పూరి జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేసిన తొలి సినిమా. డైరెక్టర్‌గా ఫస్ట్‌ ఛాన్స్‌ దక్కించుకునేందుకు పవన్‌కళ్యాణ్‌ వంటి హీరోకి కథ చెప్పి ఎలా మెప్పించారు? దాని వెనుక కథ ఏమిటి అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.  రామ్‌గోపాల్‌వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి డైరెక్టర్‌గా ఛాన్స్‌ కోసం తిరుగుతున్న రోజులవి. అంతకుముందు దూరదర్శన్‌లో కొన్ని ప్రోగ్రామ్స్‌ చేశారు పూరి. ఆ సమయంలో సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె.నాయుడుతో మంచి స్నేహం ఉండేది. దాంతో తను పవన్‌కళ్యాణ్‌కి స్టోరీ చెప్పేందుకు ఏర్పాటు చేయమని అడిగాడు పూరి. శ్యామ్‌ కె.నాయుడు సోదరుడు ఛోటా కె.నాయుడు.. పవన్‌కళ్యాణ్‌కి మంచి స్నేహితుడు. పూరిని అతని దగ్గరకు తీసుకెళ్లాడు శ్యామ్‌. పవన్‌కళ్యాణ్‌కి స్టోరీ చెప్పాలంటే.. ముందు తనకు చెప్పాలని, కథ బాగోకపోతే తనకు చెడ్డపేరు వస్తుందని అన్నాడు ఛోటా. అప్పుడు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథ చెప్పారు పూరి. ఛోటాకి ఆ కథ బాగా నచ్చింది. ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌కి మూడు ముక్కల్లో ఆ కథ చెప్పాడు ఛోటా.  పవన్‌కి కూడా స్టోరీ నచ్చడంతో తెల్లవారు జామున 4 గంటలకు పూరి జగన్నాథ్‌కి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. అంతేకాదు, అరగంట మాత్రమే టైమ్‌ ఇస్తానని, ఆలోగా తనకు కథ చెప్పాలని కండిషన్‌ పెట్టారు పవన్‌. దానికి ఒప్పుకున్నారు పూరి. ఆరోజుల్లో పూరి కృష్ణానగర్‌లో ఉండేవారు. ఉదయం 4 గంటలకు అక్కడి నుంచి పవన్‌ ఇంటికి నడుచుకుంటూ వెళ్లారు. కథ చెప్పడం మొదలు పెట్టారు. అరగంట దాటిపోయింది. అలా నాలుగు గంటల పాటు కథ చెప్పారు పూరి. పవన్‌కి ఆ కథ బాగా నచ్చింది. అయితే క్లైమాక్స్‌ మార్చి మళ్ళీ కథ చెప్పమన్నారు. వారం రోజులపాటు దానిమీద కూర్చున్నారు పూరి. కానీ, తను రాసిన క్లైమాక్స్‌ని మించిన క్లైమాక్స్‌ అతనికి రావడం లేదు. మళ్ళీ పవన్‌ చెప్పిన టైమ్‌కి ఇంటికి వెళ్ళారు. మళ్ళీ కథ చెప్పారు. ‘ఇంతకుముందు చెప్పిన క్లైమాక్సే  కదా ఇది’ అన్నారు పవన్‌. తను రాసిన క్లైమాక్స్‌ని మించింది రావడం లేదని చెప్పారు. తను మార్చమని చెప్పాడు కాబట్టి క్లైమాక్స్‌ మార్చుకొని వస్తాడని ఊహించారు పవన్‌. కానీ, పూరి తను అనుకున్న దానికే ఫిక్స్‌ అయ్యాడు. పవన్‌కి అది బాగా నచ్చింది.  అందుకే పూరి జగన్నాథ్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. అయితే చివరలో ఆయనకు ఒక డౌట్‌ వచ్చింది. ‘ఛోటా నాతో చెప్పిన కథ ఇది కాదు కదా.. సూసైడ్స్‌కి సంబంధించిన కథ చెప్పాడు’ అన్నారు. ‘ఈ కథ చెబితే ఛోటాగారికి నచ్చేది కాదు. అందుకే వేరే కథ చెప్పి మీ అపాయింట్‌మెంట్‌ సంపాదించాను’ అన్నారు. ఆ విషయంలో పూరి యాటిట్యూడ్‌ ఇంకా బాగా నచ్చింది పవన్‌కి. అలా శ్యామ్‌ కె.నాయుడు ద్వారా డైరెక్టర్‌గా తొలి అవకాశాన్ని దక్కించుకున్నారు పూరి. ఐదు సినిమాలు డైరెక్ట్‌ చేసిన తర్వాత ఇడియట్‌ నుంచి డబుల్‌ ఇస్మార్ట్‌ వరకు పూరి జగన్నాథ్‌ చేసిన సినిమాల్లో 80 శాతం సినిమాలకు తనకు డైరెక్టర్‌గా తొలి అవకాశం ఇప్పించిన శ్యామ్‌ కె.నాయుడుతోనే పనిచేశారు పవన్‌కళ్యాణ్‌. 

68 ఏళ్ళ నాటి అక్కినేని నాగేశ్వరరావు వజ్రోత్సవంలో ఏం జరిగిందో తెలుసా?

(సెప్టెంబర్‌ 20 అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా..) 1941లో వచ్చిన ‘ధర్మపత్ని’ చిత్రంలోని ఒక పాటలో పది మంది పిల్లల్లో ఒకరిగా తొలిసారి వెండితెరపై కనిపించారు అక్కినేని నాగేశ్వరరావు. ఆ తర్వాత 1944లో ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామ జననం’ చిత్రంలో శ్రీరాముడిగా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా అక్కినేనికి నటుడిగా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ వెంటనే ‘మాయలోకం’, ‘ముగ్గురు మరాఠీలు’, ‘పల్నాటి యుద్ధం’, ‘రత్నమాల’ చిత్రాలు అక్కినేనిని మంచి నటుడిగా తీర్చిదిద్దాయి. ఆ తర్వాత వచ్చిన జానపద చిత్రాలు ‘బాలరాజు’, ‘కీలుగుర్రం’ వంటి సినిమాలు ఎఎన్నార్‌ను స్టార్‌ హీరోని చేశాయి. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో మైలురాయి సినిమాగా చెప్పుకునే ‘దేవదాసు’ చిత్రం 1953లో విడుదలైంది.  దేవదాసు పాత్రకు ఎఎన్నార్‌ న్యాయం చెయ్యలేడని అందరూ భావించారు. ఆ చిత్ర నిర్మాణం మానుకోమని నిర్మాత డి.ఎల్‌.నారాయణకు ఇండస్ట్రీలోని చాలా మంది చెప్పారు. డి.ఎల్‌. మాత్రం పట్టు విడవకుండా ఆ సినిమాను నిర్మించేందుకు సిద్ధపడ్డారు. ఎంతో కృషి చేసి దేవదాసు పాత్రను అత్యద్భుతంగా పోషించి.. తనను విమర్శించిన వారికి సమాధానం చెప్పారు అక్కినేని. తెలుగు సినిమా చరిత్రలో టాప్‌ టెన్‌ సినిమాల్లో నిలిచే సినిమాగా ‘దేవదాసు’ను చెప్పుకుంటున్నామంటే ఆ సినిమాను అక్కినేని ఎంత ప్రాణం పెట్టి చేశారో అర్థం చేసుకోవచ్చు.  ఆ సినిమా తర్వాత ‘కన్యాశుల్కం’, ‘చిరంజీవులు’ చిత్రాల్లో నటించాల్సిందిగా ఎఎన్నార్‌ను కోరారు డి.ఎల్‌.నారాయణ. అవి తను చేయదగ్గ పాత్రలు కావని అక్కినేని తిరస్కరించారు. ఆ రెండు సినిమాల్లో ఎన్‌.టి.రామారావు నటించారు.  1957లో మరో దృశ్యకావ్యం ‘మాయాబజార్‌’ విడుదలైంది. ఇది అక్కినేని నటించిన 56వ సినిమా. అదే సమయంలో మరో కథతో అక్కినేని దగ్గరకు వెళ్లారు డి.ఎల్‌. ఆ సినిమా పేరు ‘దొంగల్లో దొర’. అది మాస్‌ సినిమా కావడం, తన 60 సినిమా కావడంతో చేసేందుకు ఒప్పుకున్నారు అక్కినేని. 1957లోనే ఈ సినిమా కూడా విడుదలైంది. 60 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు వజ్రోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో తనను ప్రోత్సహించిన నిర్మాతలను సత్కరించాలని భావించారు అక్కినేని. చిత్ర పరిశ్రమ మొత్తం తరలి వచ్చే ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలి అనేది ఆయనకు అర్థం కాలేదు. ఆ సమయంలో విజయ సంస్థ అధినేత నాగిరెడ్డి.. దానికి కావాల్సిన స్థలం తను ఏర్పాటు చేస్తానని చెప్పారు.  వాహిని స్టూడియో ఎదురుగా నాగిరెడ్డికి చెందిన 24 ఎకరాల అడవిలాంటి ప్రదేశం ఉండేది. అక్కడి చెట్లన్నీ కొట్టించి చక్కని గార్డెన్‌లా తీర్చిదిద్దారు. రోడ్లు వేయించి, సభ నిర్వహించేందుకు వేదిక, కార్యక్రమానికి వచ్చిన అతిథులు భోజనం చేసేందుకు ఒక పెద్ద హాలు ఏర్పాటు చేశారు. అక్కినేని నటించిన 60 సినిమాల్లోని మంచి సన్నివేశాలను తీసుకొని ఒక చిత్రమాలగా తయారు చేశారు ఆదుర్తి సుబ్బారావు. వాటిని ప్రదర్శించేందుకు ఒక పెద్ద తెర, ప్రొజెక్టర్‌ కూడా తెప్పించారు. అక్కినేనిని ప్రోత్సహించిన నిర్మాతలకు అందించేందుకు జ్ఞాపికలు తయారు చేయించారు. వాటిని కళా దర్శకుడు ఎస్‌.కృష్ణారావు రూపొందించారు. 68 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఫంక్షన్‌కు 30 వేల రూపాయలు ఖర్చయింది.  ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అధ్యక్షత వహించారు. నటుడు చిత్తూరు నాగయ్య అందరికీ స్వాగతం పలికారు. అక్కినేని నాగేశ్వరరావును ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ ప్రముఖులు పంపిన సందేశాలను ఎన్‌.టి.రామారావు చదివి వినిపించారు. అక్కినేనితో సినిమాలు నిర్మించిన నిర్మాతల పేర్లను జెమినీ గణేశన్‌ చదువుతుండగా ఒక్కొక్కరు వచ్చిన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్‌ చేతుల మీదుగా జ్ఞాపికలు అందుకున్నారు. ఈ వేడుకలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 25,000 రూపాయలు విరాళం అందించారు అక్కినేని నాగేశ్వరరావు. ఫంక్షన్‌ దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు శివాజీ గణేశన్‌. ఇలా అక్కినేని నాగేశ్వరరావు వజ్రోత్సవంలో ఆనాటి ప్రముఖులంతా పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం ఫంక్షన్‌కి వచ్చిన 4 వేల మందికి చక్కని విందు ఏర్పాటు చేశారు. విందు తర్వాత అక్కినేని చిత్రమాలను ప్రదర్శించారు.  అక్కినేని వజ్రోత్సవం జరిగిన ప్రదేశాన్ని షూటింగులకు అనువుగా మరింత అభివృద్ధి చేశారు విజయ అధినేతలు. అలా విజయా గార్డెన్స్‌లో ఆ తర్వాత ఎన్నో సినిమాల షూటింగ్స్‌ జరిగాయి. వజ్రోత్సవం నిర్వహణకు అయిన ఖర్చు 30 వేల రూపాయలను నాగిరెడ్డికి ఇచ్చేందుకు ప్రయత్నించారు అక్కినేని. కానీ, ఆయన తీసుకోలేదు. అలా రుణం ఉంచుకోకూడదన్న ఉద్దేశంతో ఆ తర్వాత విజయ సంస్థ నిర్మించిన ‘గుండమ్మ కథ’ చిత్రంలో పారితోషికం తీసుకోకుండా నటించారు అక్కినేని. సినిమా చాలా పెద్ద హిట్‌ అయి కనక వర్షం కురిసింది. ఆ సమయంలో నాగిరెడ్డి పారితోషికం ఇవ్వాలని చూశారు. కానీ, అక్కినేని మాత్రం పారితోషికం వద్దన్నారు. 

అర్థరాత్రి అడవిలో నక్కల బారిన పడిన అల్లు రామలింగయ్య.. అప్పుడేమైంది?

పాతరోజుల్లో సినిమాల షూటింగులన్నీ దాదాపుగా స్టూడియోల్లోనే జరిగేవి. కొన్ని సన్నివేశాలు మాత్రమే తప్పనిసరి అయితే ఔట్‌డోర్‌లో తీసేవారు. చాలా సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో ఔట్‌డోర్‌ షూటింగ్స్‌ మొదలుపెట్టారు. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కొన్ని ఔట్‌డోర్స్‌లో వింత అనుభవాలు ఎదురవుతూ ఉండేవి. సందర్భం వచ్చినపుడు వాటి గురించి చెబుతూ ఆ సమయంలో వారు ఎలా ఫీల్‌ అయ్యేవారో వివరిస్తుంటారు. అలాంటి ఓ వింత అనుభవం అల్లు రామలింగయ్యకు జరిగింది. 1960వ దశకంలో ఆయన చేసిన ఓ సినిమా షూటింగ్‌ కోసం ఔట్‌డోర్‌కి వెళ్లాల్సి వచ్చింది. కాల్వ గట్ల మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు యూనిట్‌ అంతా అక్కడికి వెళ్లింది. ఆరోజు ఉదయం షూటింగ్‌ మొదలైంది. అల్లు రామలింగయ్య పాల్గొన్న కొన్ని సీన్స్‌ చిత్రీకరించారు దర్శకుడు. మధ్యాహ్నం అయిన తర్వాత షూటింగ్‌కి కొంత గ్యాప్‌ ఇచ్చారు. మిట్ట మధ్యాహ్నం ఎండ పైనుంచి పడుతుంది. ఆ సమయంలో కొందరు డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లు షూటింగ్‌ చెయ్యరు. ఆ విషయం అల్లుకి అప్పుడే తెలిసిందట.  అది లంచ్‌ టైమ్‌ కావడంతో అందరితో కలిసి భోజనం చేశారు అల్లు రామలింగయ్య. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు కునుకు తీయడం ఆయనకు అలవాటు. ఎక్కడ ఉన్నా సరే అరగంటైనా నిద్ర పోవాల్సిందే. అలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయనకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. భోజనం తర్వాత ఒక చుట్ట కాల్చుకొని నిద్రలోకి జారుకోవడానికి రెడీ అయ్యారు అల్లు. ఆ సమయంలోనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వచ్చి ‘మీరు చెయ్యాల్సిన సీన్‌ రావడానికి చాలా సమయం పడుతుంది. ఓ గంటసేపు హాయిగా నిద్రపోండి’ అని చెప్పాడు. అది విన్న అల్లుకి ఆనందం కలిగింది. చుట్ట కాల్చడం పూర్తయిన తర్వాత వెంటనే నిద్రలోకి జారుకున్నారు. అలా చాలా సేపు నిద్రలోనే ఉండిపోయారు. ఆయనకు సడన్‌గా మెలకువ వచ్చింది. అడవిలాంటి ప్రాంతం కావడంతో ఒక్క లైట్‌ కూడా లేదు. అంతా చిమ్మ చీకటి. తోటి నటీనటులుగానీ, యూనిట్‌ సభ్యులుగానీ ఎవరూ లేరు.  తను చెయ్యాల్సిన సీన్లు ఉన్నాయి. అయినా తనను నిద్ర లేపకుండా అందరూ ఎలా వెళ్లిపోయారు అనేది అల్లుకి అర్థం కాలేదు. తను చీకటిలో ఒంటరిగా ఉన్నానన్న విషయం గుర్తొచ్చి ఆయనకు ఒక్కసారిగా భయం వేసింది. అది కాలవ గట్టు కావడంతో కప్పలు, కీచురాళ్ళ శబ్ధం తప్ప ఏమీ వినిపించడం లేదు. దూరంగా ఎక్కడో నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. ఆయనకు భయం మరింత పెరిగింది. కాసేపటికి చీకటి అలవాటై లీలగా కాలువ, చెట్లు కనిపిస్తున్నాయి. ఏం చెయ్యాలో తోచక.. దిక్కులు చూస్తున్న ఆయనకు ఒక నక్కల గుంపు కనిపించింది. నక్కలు తనవైపే తీక్షణంగా చూస్తున్నట్టు అనిపించింది. మెల్లగా తనవైపు రావడం మొదలుపెట్టాయి. ఇక భయం తట్టుకోలేక గట్టిగా కేక పెట్టారు అల్లు. ఆ వెంటనే ‘సైలెన్స్‌’ అనే మాట వినిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచారు. అప్పుడుగానీ ఆయనకు అర్థం కాలేదు అది కల అని.  ఒక్కసారి లేచి చుట్టూ చూశారు అల్లు. యధావిధిగా షూటింగ్‌ జరుగుతోంది. ఆయన వేసిన కేకకు దగ్గరికి వచ్చిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ‘ఏంటి సార్‌.. మీ సీన్స్‌ రావడానికి టైమ్‌ పడుతుంది, గంట సేపు హాయిగా పడుకోమని చెప్పానుగా. అంతలోనే లేచిపోయారేంటి? పైగా కేకలు కూడా పెడుతున్నారు’ అన్నాడు. కాసేపటికి తేరుకున్న అల్లుకి మనసు కుదుటపడిరది. అదంతా కల అని నమ్మకలేకపోయారు. మళ్లీ నిద్రలోకి వెళ్లేందుకు రెడీ అయి కళ్లు మూసుకున్నారు. అంతలోనే తనకు వచ్చిన కల గుర్తొచ్చి చటుక్కున లేచి కూర్చున్నారు. ‘నాకు నిద్రా వద్దు, రెస్టూ వద్దు.. మీరు ఎప్పుడు నా సీన్‌ తీస్తే అప్పటివరకు వెయిట్‌ చేస్తాను’ అని ఆ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కి చెప్పి పంపించారు. అలా తనకు ఔట్‌డోర్‌లో ఎదురైన వింత అనుభవం గురించి వివరించారు అల్లు రామలింగయ్య.

50 వసంతాల ‘లక్ష్మణరేఖ’. సహజనటి జయసుధను వెలుగులోకి తెచ్చిన సినిమా ఇదే!

‘పండంటి కాపురం’ చిత్రంతో నటిగా పరిచయమైన జయసుధ.. ఆ తర్వాత నోము, సోగ్గాడు వంటి సినిమాల్లో నటించిన తర్వాత ఎన్‌.గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లక్ష్మణరేఖ’ చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్ర పోషించారు.  12 సెప్టెంబర్‌, 1975లో విడుదలైన ఈ సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నటిగా జయసుధకు మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. తనలోని నటిని వెలికి తీసి ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఈ సినిమా ఎంతో వైవిధ్యంతో కూడిన కథతో రూపొందింది. స్త్రీకి స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి, అది శృతి మించితే ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుంది అనే కథాంశంతో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమైన ఎన్‌.గోపాలకృష్ణ.. ‘లక్ష్మణరేఖ’ను ఆయన ఇంటిపేరుగా మార్చుకున్నారు.  ఈ సినిమా కథ విషయానికి వస్తే.. స్వతంత్ర భావాలు కలిగిన కవితగా జయసుధ నటించారు. తండ్రి(గుమ్మడి) తెచ్చిన సంబంధం కాదని, తను ప్రేమించిన రమేష్‌(చంద్రమోహన్‌)ను పెళ్ళి చేసుకుంటానని పట్టుపడుతుంది కవిత. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చిన సంబంధాన్ని ఒప్పుకొని మోహన్‌(మురళీమోహన్‌)తో పెళ్లికి సిద్ధపడుతుంది. పెళ్లి జరుగుతున్న సమయంలో తను ప్రేమించిన రమేష్‌ వచ్చి ఆమెను తీసుకెళ్లిపోతాడు. పెళ్లి పీటల మీద నుండి కూతురు వెళ్లిపోవడంతో తండ్రి అనారోగ్యానికి గురవుతాడు. అయితే అదే ముహూర్తానికి మోహన్‌కు కవిత చెల్లెలు ఊర్మిళను ఇచ్చి పెళ్లి చేస్తారు. కవితను తీసుకెళ్లిన రమేష్‌.. ఆమెను ఓ వేశ్యాగృహానికి అమ్మేస్తాడు. కవిత అక్కడే జీవితం సాగిస్తుంటుంది. ఆ తర్వాత రమేష్‌ వల్లే మోహన్‌, ఊర్మిళ దంపతుల మధ్య కలతలు వస్తాయి. వారిని కలిపేందుకు కవిత ప్రయత్నిస్తుంది. ఆ సందర్భంలోనే మోహన్‌, ఊర్మిళ ఆ ఇంటికి వస్తారు. అదే టైమ్‌కి రమేష్‌కి కూడా అక్కడికి వస్తాడు. రమేష్‌, కవిత మధ్య ఘర్షణ జరుగుతుంది. అనుకోకుండా కవిత చేతిలో ప్రాణాలు కోల్పోతాడు రమేష్‌. కవితను పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ఆమెకు 7 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తారు. దాంతో సినిమా ముగుస్తుంది.  50 సంవత్సరాల క్రితమే ఈ తరహా కథతో సినిమా రూపొందడం, దాన్ని ప్రేక్షకులు కూడా ఆదరించి విజయం చేకూర్చడం విశేషంగానే చెప్పుకోవాలి. కవితగా జయసుధ నటన అందర్నీ ఆకట్టుకుంది. ఇక నెగెటివ్‌ క్యారెక్టర్‌లో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు చంద్రమోహన్‌. కూతుళ్ల జీవితాలు ఏమైపోతాయోనని ఆందోళన పడే తండ్రిగా గుమ్మడి నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. వైవిధ్యమైన సినిమాలను చూడాలనుకునే ప్రేక్షకులకు ‘లక్ష్మణరేఖ’ తప్పకుండా నచ్చుతుంది. 

విజయశాంతితో సినిమా చెయ్యనని చెప్పిన శోభన్‌బాబు.. ఎందుకో తెలుసా?

అందాల నటుడు శోభన్‌బాబు నటించిన సినిమాలకు మహిళా ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా ఉండేది. దానికి తగ్గట్టుగానే ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కూడిన కథలే ఆయన దగ్గరకు వచ్చేవి. ఒక దశలో శోభన్‌బాబు ఇద్దరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశారు. అలా చేసిన ఓ విభిన్నమైన సినిమా ‘బావా మరదళ్లు’. ఈ సినిమాలో శోభన్‌బాబు సరసన రాధిక, సుహాసిని నటించారు. మొదట సుహాసిని స్థానంలో విజయశాంతిని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, ఆమెతో నటించనని శోభన్‌బాబు చెప్పారు. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించిన రాశి మూవీస్‌ నరసింహారావుతో  కూడా సినిమా చెయ్యడానికి ఆయన ఇష్టపడలేదు. విజయశాంతితో కలిసి నటించడానికి, నరసింహారావుతో సినిమా చెయ్యడానికి శోభన్‌బాబు ఎందుకు ఒప్పుకోలేదు? దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. 1982లో విడుదలైన తమిళ సినిమా ‘ఎంకయో కెట్ట కురల్‌’ ఘనవిజయం సాధించింది.  రజినీకాంత్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఎస్‌.పి.ముత్తురామన్‌ దర్శకత్వం వహించారు. రాధ, అంబిక హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని చూసిన రాశి మూవీస్‌ నరసింహారావు దాన్ని తెలుగులో రీమేక్‌ చెయ్యాలనుకున్నారు. ఈ సినిమా గురించి రచయిత సత్యమూర్తికి, డైరెక్టర్‌ ఎ.కోదండరామిరెడ్డికి చెప్పారు. వాళ్ళు కూడా సినిమా చూశారు. సత్యమూర్తికి నచ్చింది. కానీ, కోదండరామిరెడ్డికి నచ్చలేదు. అందులో చాలా మార్పులు చెయ్యాలన్నారు. ఈ సినిమాను శోభన్‌బాబుతో చెయ్యాలన్నది నరసింహారావు ఆలోచన. కథ ప్రకారం శోభన్‌బాబు భార్య లేచిపోతుంది. అందగాడైన శోభన్‌బాబు భార్య లేచిపోయింది అని చూపిస్తే ఆడియన్స్‌ కన్విన్స్‌ అవ్వరు అని కోదండరామిరెడ్డి వాదించారు. అంతకుముందు వచ్చిన ఇల్లాలు కూడా ఇలాంటి సబ్జెక్ట్‌తోనే చేశారు. మళ్ళీ ఈ సినిమా ఎందుకు అని అడిగారు. కానీ, నరసింహారావు మాత్రం సినిమా చెయ్యాలని ఫిక్స్‌ అయ్యారు.  తమ సినిమాలో నటించాల్సిందిగా శోభన్‌బాబుని అడిగారు నరసింహారావు. తను సినిమా చెయ్యడానికి చాలా టైమ్‌ పడుతుందని, రెండు సంవత్సరాలు పట్టినా పట్టొచ్చని చెప్పారు శోభన్‌బాబు. వాస్తవానికి నరసింహారావు సినిమా చెయ్యడానికి ఇష్టం లేకనే ఆయన అలా చెప్పారు. అంతేకాదు, తన రెమ్యునరేషన్‌ని అప్పుడు తను తీసుకుంటున్న దానికి నాలుగైదు లక్షలు పెంచి చెప్పారు. అలా అయితేనే చేస్తానన్నారు. నరసింహారావు దానికి కూడా ఒప్పుకున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు శోభన్‌బాబు. ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్‌గా మొదట జయసుధను అనుకున్నారు. అయితే తనకు ఉన్న కమిట్‌మెంట్స్‌ వల్ల ఆమె చేయలేనని చెప్పారు. అప్పుడు రాధికను ఓకే చేసుకున్నారు. మరో హీరోయిన్‌గా విజయశాంతిని ఫిక్స్‌ చేశారు. శోభన్‌బాబు పక్కన హీరోయిన్‌ అనగానే ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు.  శోభన్‌బాబు అడిగినంత రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు సిద్ధపడిన నరసింహారావు అడ్వాన్స్‌ ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అడ్వాన్స్‌ కూడా ఎక్కువే ఇచ్చారు. ఆ సమయంలో హీరోయిన్ల ఎవరని అడిగారు శోభన్‌బాబు. రాధిక, విజయశాంతి పేర్లు చెప్పారు. అయితే విజయశాంతితో చెయ్యనని అన్నారు. కారణం ఏమిటని నరసింహారావు అడిగారు. ‘కొత్తగా ఇండస్ట్రీకి వచ్చింది. చిన్నపిల్ల. నా కూతురిగా, చెల్లెలుగా చేసింది. నా పక్కన ఆమె హీరోయిన్‌గా సెట్‌ అవ్వదు’ అన్నారు శోభన్‌బాబు. ఆ కారణంగా విజయశాంతిని తప్పించి సుహాసినిని తీసుకున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేసి సినిమాను ప్రారంభించారు. 1984లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. చాలా సెంటర్స్‌లో శతదినోత్సవం జరుపుకుంది. సినిమా రిలీజ్‌కి ముందే శోభన్‌బాబుకి ఇవ్వాల్సిన బ్యాలెన్స్‌ రెమ్యునరేషన్‌ తీసుకొని ఆయన ఇంటికి వెళ్లారు నరసింహారావు. కానీ, పెంచి చెప్పిన అమౌంట్‌ తీసుకునేందుకు శోభన్‌బాబు ఒప్పుకోలేదు. సినిమా చెయ్యకుండా తప్పించుకోవడానికే అలా రెమ్యునరేషన్‌ పెంచి చెప్పానని, కాబట్టి తను ఎంత తీసుకుంటున్నానో అంతే ఇవ్వమని అన్నారు శోభన్‌బాబు. ఆ తర్వాత బావామరదళ్లు హండ్రెడ్‌ డేస్‌ ఫంక్షన్‌లో సినిమా ప్రారంభానికి ముందు జరిగిన ఈ విషయాలన్నీ ప్రస్తావించారు శోభన్‌బాబు. 

ఆ సినిమాలో నేను అడిగింది ఒక క్యారెక్టర్.. వాళ్లు ఇచ్చింది మరొకటి

నాని, కలర్స్ స్వాతి నటించిన అష్టాచెమ్మా మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందులో స్వాతి పిన్నిగా ఝాన్సీ నటించిన మందిర దేవి పాత్ర అంటే వ్వాహ్ అనకుండా ఉండరు. ఇక ఆ మూవీ గురించి ఝాన్సీ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలతో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. "అష్టాచెమ్మ మూవీ రిలీజయ్యి 17 సంవత్సరాలు అయ్యిందట. నిన్న గాక మొన్న ఆ క్యారెక్టర్ ఆఫర్ వచ్చినట్టు అనిపిస్తాయి ఉంటుంది ఫ్రెష్ గాను. ఆ మూవీ ఎప్పుడూ ఎంత ఫ్రెష్ గా ఉంటుందో చెప్పలేను. నాని, నేను, స్వాతి, భార్గవి అందరి క్యారెక్టర్స్ ఎంత ఇష్టమో చెప్పలేను. నా రోల్ ఇంకా ఇష్టం. మీకో పెద్ద కామెడీ చెప్తా చూడండి. ఆ మూవీలో నాకు క్యారెక్టర్ ఆఫర్ చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ మొత్తం చదివాక నాకు పిన్ని క్యారెక్టర్ వద్దు అప్పుడే నేను పిన్ని క్యారెక్టర్ చేయడమేంటి నాకు అమ్మాజీ క్యారెక్టర్ కావాలి అని అడిగాను. కానీ డైరెక్టర్ గారు పట్టు బట్టి లేదు లేదు నీ క్యారక్టర్ కూడా దుమ్ము లేపుద్ది అని చెప్పారు. నిజంగా చాలా క్యూట్ గా ఉంటుంది ఆ రోల్. నన్ను నమ్మి ఆ రోల్ ఇచ్చినందుకు చాల థ్యాంక్స్. అది గనక నేను చేయకపోయి ఉంటె నా..అన్ని క్యారెక్టర్స్ లో లో అదొక బెస్ట్ క్యారెక్టర్ అండి బాబు అది. నా కెరీర్ లో ఎప్పటికీ అద్భుతంగా మిగిలిపోయే ఒక గొప్ప క్యారెక్టర్ అది." అంటూ చెప్పింది ఝాన్సీ.

స్టార్ హీరోని ప్రేమించి మోసపోయిన హీరోయిన్.. కోట్ల ఆస్థి విద్యార్థులకి దానం

హీరోని హీరోయిన్ ప్రేమిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ వివాహ బంధం సాఫీగా సాగకపోవడంతో ,విడాకులు తీసుకొని ఒంటరి తనాన్ని భరిస్తుంది. చివరకి అనారోగ్యానికి గురై, చనిపోయే ముందు తన ఆస్థి మొత్తాన్ని దానం చేస్తుంది. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అదే కాన్సెప్ట్  ఒక టాప్ హీరోయిన్ నిజజీవితంలో  జరిగింది. తమిళ, తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలైన నటి శ్రీ విద్య(Sri Vidhya). బాలనటిగా 'తిరువారుచెల్వన్’తో  సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఈ చిత్రంలో శివాజీ గణేశన్ హీరో. ఆ తర్వాత దర్శక దిగ్గజం 'బాలచందర్'(k. Balachander)తో పాటు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో పలు రకాల పాత్రలు పోషించింది. అందం, అందుకు తగ్గ అభినయంతో ప్రేక్షకులని కట్టిపడెయ్యడంతో, సోలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. రజనీకాంత్(Rajinikanth), కమల్ హాసన్(Kamal Haasan),బాలచందర్ ల గ్రేటెస్ట్ మూవీ 'అపూర్వ రాగంగళ్’ లో రజనీ కాంత్ సరసన చేసి, రజనీ ఫస్ట్ హీరోయిన్ అనే టాగ్ లైన్ ని పొందింది. ఆ తర్వాతి  కాలంలో దళపతిలో రజనీ కి తల్లిగా కూడా చేసి రికార్డు సృష్టించింది. తన కెరీర్ లో కమల్ హాసన్ తో ఎక్కువ చిత్రాల్లో జత కట్టింది. ఆ సమయంలో వాళ్లిద్దరు ప్రేమలో పడ్డారని, కానీ పెళ్లికి శ్రీవిద్య తల్లి అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. దాంతో 1978లో మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌ ని శ్రీవిద్య  వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కొన్నాళ్ల పాటు ఎలాంటి చిత్రాలు చెయ్యలేదు. కానీ వివాహ బంధంలో శ్రీవిద్య ఫెయిల్ అయ్యింది. జార్జ్ తన ఆస్తిని లాక్కోవడంతో పాటు,తీవ్రంగా వేధించేవాడు. దీంతో 1980లో ఆ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీవిద్య తన కెరీర్ లో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కలుపుకొని సుమారు ఎనిమిది వందల చిత్రాల వరకు చేసింది. ఏ క్యారక్టర్ చేసినా ఆ క్యారక్టర్ లోకి పరకాయప్రవేశం చేసి తన నటనతో మెస్మరైజ్ చెయ్యడం శ్రీవిద్య స్టైల్ .చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ చిత్రాల్లో  తల్లితో పాటు వివిధ పాత్రలు పోషించి తెలుగు వారికి కూడా దగ్గరయ్యింది. 2003 లో  క్యాన్సర్ బారిన పడటంతో, తన కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకొని,ప్రముఖ నటుడు, 'ఏంఎల్ ఏ'  గణేష్ కుమార్ సహాయంతో, ఒక ఫౌండేషన్‌ని స్థాపించింది. ఆ తర్వాత  పేద విద్యార్థులకి కోట్ల రూపాయిల తన ఆస్తిని రాసిచ్చింది ,చివరకి మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్‌తో పోరాడి  2006లో చనిపోగా, అప్పటికి ఆమె వయసు  53 సంవత్సరాలు. శ్రీ విద్య  తండ్రి పేరు కృష్ణమూర్తి. హాస్యనటుడుగా పలు చిత్రాలు చేసాడు. తల్లి కర్ణాటక గాయని ఎం.ఎల్. వసంత కుమారి. శ్రీవిద్య ఏడాది వయసున్నప్పుడే  కృష్ణమూర్తి ఒక ప్రమాదంలో చనిపోయాడు.     

సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనకు తిరుగులేదని ప్రూవ్‌ చేసుకుంటున్న పవర్‌స్టార్‌!

(సెప్టెంబర్‌ 2 పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా..) పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌.. ఈ పేరు వింటేనే యూత్‌లో ఓ విచిత్రమైన వైబ్రేషన్‌. కేవలం సినిమాలతోనే కాదు, సమాజం పట్ల ఉన్న బాధ్యత, ఎవరికి అన్యాయం జరిగినా చలించిపోయే తత్వం ఆయన్ని ప్రజలకు బాగా దగ్గర చేసింది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్య పరిచే సాధనం అని భావించే పవన్‌కళ్యాణ్‌.. తన ప్రతి సినిమాలోనూ యూత్‌ని ఇన్‌స్పైర్‌ చేసే ఏదో ఒక పాట ఉండేలా చూసుకునేవారు. ఒక యంగ్‌ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో మెట్టూ ఎక్కుతూ పవర్‌స్టార్‌గా తనకంటూ ఓ బ్రాండ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు పవన్‌కళ్యాణ్‌. ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపనతో రాజకీయాల్లోకి ప్రవేశించి అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్‌.. రాష్ట్ర ప్రజలకు తన విలువైన సేవలు అందిస్తున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తన పవర్‌ ఏమిటో చూపించిన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్‌ 2. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి, సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.   ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు మహామహులు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న రోజుల్లో ఓ సాధారణ నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్‌ చిరంజీవి. తన డాన్సులతో, ఫైట్స్‌తో, డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం తన స్వయంకృషితోనే ఒక్కో మెట్టూ ఎదుగుతూ మెగాస్టార్‌ స్థాయికి చేరుకున్నారు.  చిరంజీవితోపాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలు వారి ఇమేజ్‌కి తగ్గట్టు సినిమాలు చేస్తూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని ఏర్పరుచుకున్నారు. ఆ సమయంలోనే మెరికలాంటి కుర్రాడు టాలీవుడ్‌లో మెరిశాడు. మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనే పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.  అప్పటికే ఎంతో మంది యువ హీరోలు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని సినిమా రంగంలో ప్రవేశించారు. నటనలోనూ, డాన్సుల్లోనూ చిరంజీవిని అనుకరిస్తూ వచ్చారు. అయితే పవన్‌కళ్యాణ్‌ మాత్రం చిరంజీవి ప్రభావం తనపై ఒక్క శాతం కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. 1996లో మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో తనలోని టాలెంట్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. తను క్రియేట్‌ చేసుకున్న ప్రత్యేకమైన స్టైల్‌, డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో యూత్‌ని విపరీతంగా ఆకర్షించారు. ఆ తర్వాత 2000 సంవత్సరం వరకు గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఐదు వరస సూపర్‌హిట్స్‌తో స్టార్‌ హీరో ఇమేజ్‌ని సంపాదించుకున్నారు.  2001 పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌కి ఎంతో కీలకమైన సంవత్సరంగా మారింది. తమిళ్‌లో విజయ్‌ హీరోగా ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మించిన ఖుషి ఘన విజయం సాధించింది. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చెయ్యాలంటే ఎ.ఎం.రత్నంకి కనిపించిన ఏకైక ఆప్షన్‌ పవన్‌కళ్యాణ్‌. ఆ సినిమా పవన్‌కి కూడా విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పారు. తమిళ్‌ హీరో విజయ్‌ పోకడలు తెలుగు వెర్షన్‌లో ఎక్కడా కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు పవన్‌. 2001 ఏప్రిల్‌ 27న విడుదలైన ఖుషి.. తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. అప్పటివరకు చేసిన సూపర్‌హిట్‌ సినిమాలు ఒక ఎత్తయితే.. ఖుషి చిత్రం పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌కి ఓ మైల్‌స్టోన్‌లా నిలిచింది.  ‘ఖుషి’ చిత్రం విడుదలైన రెండు సంవత్సరాల వరకు పవన్‌ మరో సినిమా చెయ్యలేదు. తన దర్శకత్వంలోనే రూపొందించిన జాని చిత్రం కోసం చాలా గ్యాప్‌ తీసుకున్నారు పవన్‌. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రిలీజ్‌ అయిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ సినిమా ప్రభావం.. పవన్‌ చేసిన తర్వాతి సినిమాలపై పడిరది. కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవ్వగా, మరికొన్ని ఏవరేజ్‌గా నిలిచాయి. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వచ్చిన జల్సా చిత్రంతో తన పూర్వవైభవాన్ని సాధించారు పవన్‌. ఈ సినిమా తర్వాత కూడా మరికొన్ని ఫ్లాప్‌లు అతన్ని వెంటాడాయి. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో చేసిన గబ్బర్‌సింగ్‌ ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసి, పవన్‌లోని కొత్తకోణాన్ని పరిచయం చేసింది. ఆ తర్వాతి సంవత్సరం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసిన అత్తారింటికి దారేది పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.  ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయానికి హరిహరవీరమల్లు, ఓజి, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాలు కమిట్‌ అయి ఉన్నారు. ఇటీవల హరిహర వీరమల్లు చిత్రం విడుదలై ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించింది. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ఓజీ సెప్టెంబర్‌ 25న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్‌ సెప్టెంబర్‌ 6 నుంచి జరగనుంది. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు అనే విషయంలో ఇప్పటివరకు మేకర్స్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. డిప్యూటీ సీఎం పదవీ బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించేందుకు కొత్త తరహా సినిమాలు చేస్తున్నారు పవన్‌కళ్యాణ్‌. 

నటుడిగా గర్జించి.. ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నందమూరి హరికృష్ణ!

(సెప్టెంబర్ 2 నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా..) నందమూరి వంశంలో నటరత్న ఎన్‌.టి.రామారావు తర్వాత అంతటి పవర్‌ఫుల్‌ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు నందమూరి హరికృష్ణ. నటుడిగా ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా అందరికీ గుర్తుండిపోయే వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి నట వారసుడుగా పేరు తెచ్చుకున్నారు హరికృష్ణ. 1956 సెప్టెంబర్‌ 2న నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు మూడో సంతానంగా జన్మించారు నందమూరి హరికృష్ణ. 1967లో విడుదలైన ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంలో బాలకృష్ణుడుగా నటించడం ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తల్లా పెళ్లామా, తాతమ్మ కల, రామ్‌రహీమ్‌ చిత్రాల్లో నటించారు. ఎన్‌.టి.రామారావు స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దానవీరశూర కర్ణ చిత్రంలో అర్జునుడుగా నటించారు హరికృష్ణ. ఆ తర్వాత చిత్ర నిర్మాణం వైపు దృష్టి సారించారు. నిర్మాతగా హరికృష్ణ తొలి సినిమా ‘డ్రైవర్‌ రాముడు’. తమ్ముడు బాలకృష్ణ హీరో అయిన తర్వాత పట్టాభిషేకం, అనసూయమ్మగారి అల్లుడు, తిరగబడ్డ తెలుగుబిడ్డ, పెద్దన్నయ్య వంటి చిత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 21 సంవత్సరాల తర్వాత శ్రీరాములయ్య చిత్రంలో సత్యం అనే వైవిధ్యమైన పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దర్శకుడు వై.వి.ఎస్‌.చౌదరి దర్శకత్వంలో రూపొందిన ‘సీతారామరాజు’ చిత్రంలో ఓ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేశారు హరికృష్ణ. నందమూరి నట వారసుడు హరికృష్ణ, అక్కినేని నటవారసుడు నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా సాధించిన విజయంతో వై.వి.యస్‌.చౌదరి తన సొంత బేనర్‌లో నిర్మించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంలో మరో పవర్‌ఫుల్‌ పాత్రతో హరికృష్ణ ఇమేజ్‌ని ఒక్కసారిగా పెంచేశారు. ఆ తర్వాత చేసిన శివరామరాజు, సీతయ్య, టైగర్‌ హరిశ్చంద్రప్రసాద్‌, స్వామి వంటి సినిమాలు హరికృష్ణకు నటుడిగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒక స్టార్‌ హీరో ఇమేజ్‌ ఈ సినిమాలతో లభించింది. హరికృష్ణ నటించిన చివరి సినిమా కృష్ణతో కలిసి చేసిన శ్రావణమాసం.  ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు దేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించారు. దాని కోసం వినియోగించిన చైతన్య రథం వాహనానికి సారధిగా వ్యహరించారు హరికృష్ణ. 75,000 కిలోమీటర్లు ఆ వాహనాన్ని నడిపి రికార్డు సృష్టించారు. 1995లో అధికార మార్పిడి జరిగినపుడు తండ్రి ఎన్‌.టి.రామారావును వ్యతిరేకిస్తూ చంద్రబాబునాయుడిని సమర్థించారు హరికృష్ణ. ఆయన ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో తండ్రి మరణించడంతో హిందూపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2013లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  నందమూరి హరికృష్ణ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయనకు ముగ్గురు కుమారులు జానకిరామ్‌, కళ్యాణ్‌రామ్‌, తారక్‌రామ్‌. వీరిలో కళ్యాణ్‌రామ్‌, తారక్‌ ఇద్దరూ హీరోలుగా తమ టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకున్నారు. తండ్రి సూచన మేరకు చిన్నతనంలోనే తారక్‌ పేరును నందమూరి తారక రామారావుగా మార్చారు హరికృష్ణ. కళ్యాణ్‌రామ్‌, హరికృష్ణ, ఎన్టీఆర్‌ కలిసి ఓ సినిమా చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. 2014లో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్‌ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇది జరిగిన నాలుగు సంవత్సరాలకే హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించడం విచారకరం.

అపర సత్యభామగా పేరు తెచ్చుకున్న అసమాన నటి జమున!

(ఆగస్ట్ 30 నటి జమున జయంతి సందర్భంగా..) 1950 నుంచి 1970 వరకు కొనసాగిన పాతతరంలో ఎంతో మంది హీరోయిన్లు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. ఆ రెండు దశాబ్దాల్లో తెరపై కనిపించిన హీరోయిన్లలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి జమున. అందం, అభినయం కలగలిసిన జమునకు ఎంతో పేరు తెచ్చిన పాత్ర సత్యభామ. తెలుగు చిత్ర సీమలో సత్యభామ అంటే గుర్తొచ్చే పేరు జమున. ఆ పాత్రలో అంతగా లీనమై నటించారామె. ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, జగ్గయ్య, హరనాథ్‌ వంటి అగ్రతారలతో కలిసి ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు జమున. దక్షిణాది సినిమాలతోపాటు హిందీ సినిమాల్లో కూడా నటించారు. 36 సంవత్సరాల సినీ కెరీర్‌లో 198 సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. నటిగా, రాజకీయ నాయకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న జమున సినీ, రాజకీయ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. 1936 ఆగస్ట్‌ 30న కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో నిప్పణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జన్మించారు జమున. ఆమె కంటే ముందు ఒక బాబు పుట్టి చనిపోవడంతో పండరీపురం వెళ్లి అక్కడి అమ్మవారిని దర్శించుకోవడంతో జమున జన్మించారు. అందుకే ఆమెకు మొదట జనాబాయి అని పేరు పెట్టారు. నక్షత్రం ప్రకారం ఏదైనా నది పేరు కలిసేలా పేరు పెట్టాలని పండితులు సూచించడంతో యమునలోని ము అక్షరాన్ని ఆమె పేరులో జతచేసి జమున అని నామకరణం చేశారు. జమునకు నాలుగేళ్ళ వయసులో వ్యాపార నిమిత్తం తెనాలి దగ్గరలోని దుగ్గిరాల  వచ్చింది వారి కుటుంబం. పుట్టి పెరిగింది హంపిలో కావడంతో జమునకు తెలుగు వచ్చేది కాదు. ఐదో ఏట స్కూల్‌లో చేరిన తర్వాతే తెలుగు నేర్చుకున్నారు. జమున తల్లి కౌసల్యాదేవి ఊరూరూ తిరిగి హరికథలు చెప్పేవారు. కొన్ని హరికథలకు జమునను కూడా తీసుకెళ్ళేవారు. అప్పుడు ఆమె స్టేజ్‌పై పాటలు పాడేవారు. పాటలు బాగా పాడుతుండడంతో ఆమెకు హార్మోనియం నేర్పించారు కౌసల్యాదేవి. జమున గురించి తెలుసుకున్న కొన్ని నాటక సమాజాల వారు ఆమెకు నాటకాల్లో నటించే అవకాశం ఇచ్చారు. అదే సమయంలో దుగ్గిరాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న కొంగర జగ్గయ్య కూడా నాటకాలు వేసేవారు. పొరుగూరులో ఖిల్జీ పతనం అనే నాటకం వేస్తున్నారని, జమునను పంపించాల్సింది ఆమె తల్లిదండ్రులను కోరారు జగ్గయ్య. వారి అనుమతితో ఆ నాటకంలో ఒక పాటకు జమునతో డాన్స్‌ చేయించారు. అప్పటికి జమున వయసు పదేళ్ళు. అలా పలు నాటకాల్లో నటించడం వల్ల నటిగా ఆమెకు మంచి పేరు వచ్చింది.  జమున ప్రతిభ గురించి తెలుసుకున్న ప్రముఖ దర్శకనిర్మాత బి.వి.రామానందం దుగ్గిరాల వచ్చి ఆమె తల్లిదండ్రులను కలిసి తను జైవీరభేతాళ అనే సినిమా తీస్తున్నానని, అందులో నటించేందుకు జమునను పంపించాల్సిందిగా కోరి అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. ఆ తర్వాత జమునను తీసుకొని మద్రాస్‌ వెళ్ళారు తల్లిదండ్రులు. అక్కడ కొన్ని రోజులు రిహార్సల్స్‌ చేసిన తర్వాత షూటింగ్‌ ప్రారంభించారు. ఒక షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత రెండో షెడ్యూల్‌కి ఇంకా టైమ్‌ వుందనీ, షూటింగ్‌ మొదలయ్యే ముందు కబురు పంపిస్తామని నటీనటుల్ని పంపించేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి కబురు రాలేదు. ఈలోగా రంగస్థలంపై విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు ఉన్న గరికపాటి రాజారావు ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారు. జమున గురించి ఆయనకు అంతకుముందే తెలిసి ఉండడంతో తమ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సిందిగా కోరారు. ఆ తర్వాత నెలరోజుల్లో షూటింగ్‌ మొదలుపెట్టారు. ఆ సినిమా పేరు పుట్టిల్లు. ఈ సినిమా ద్వారానే అల్లు రామలింగయ్య, సంగీత దర్శకుడు టి.చలపతిరావు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. పుట్టిల్లు చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించి నిర్మించారు రాజారావు. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే బి.వి.రామానందం చనిపోయారనే వార్త తెలిసి జమున తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. 1953లో పుట్టిల్లు చిత్రం విడుదలై పరాజయాన్ని చవిచూసింది.  ఆ తర్వాత ప్రముఖ దర్శకనిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి రూపొందిస్తున్న వద్దంటే డబ్బు చిత్రంలో జమునకు ఓ పాత్ర ఇచ్చారు. ఈ సినిమా కూడా విజయవంతం కాలేదు. ఆ తర్వాత నిరుపేదలు చిత్రంలో ఎఎన్నార్‌ సరసన హీరోయిన్‌గా నటించినా బంగారుపాప, వదినగారి గాజులు, దొంగరాముడు వంటి చిత్రాల్లో సెకండ్‌ హీరోయిన్‌గా చేశారు. 1956లో వచ్చిన చిరంజీవులు సినిమాలో మళ్లీ హీరోయిన్‌గా నటించారు జమున. ఈ సినిమా తర్వాత తెనాలి రామకృష్ణ, భాగ్యరేఖ, దొంగల్లో దొర, ఇల్లరికం, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణమాయ, గుండమ్మకథ, సిపాయి కూతురు, గులేబకావళి కథ, బొబ్బిలియుద్ధం వంటి సినిమాలతో టాప్‌ హీరోయిన్‌ అనిపించుకున్నారు. సత్యభామ పాత్ర పోషణలో జమున విశేషమైన ప్రతిభ కనబరిచేవారు. ఇప్పటివరకు ఆ పాత్రలో జమునను తప్ప మరొకరిని ఎవరూ ఊహించుకోలేరు. తెలుగులోనే కాకుండా తమిళ్‌లో 27, కన్నడలో 8, హిందీలో 8 చిత్రాల్లో నటించారు. మూగమనసులు చిత్రంలోని గౌరి పాత్రలో అత్యద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు జమున. ఇదే సినిమాను హిందీలో మిలన్‌ పేరుతో రీమేక్‌ చేశారు. అందులోనూ గౌరి పాత్రను జమునే చేసి మెప్పించారు. ఈ రెండు సినిమాల్లోని నటనకుగాను ఫిలింఫేర్‌ అవార్డును అందుకున్నారు. జమున నటించిన చివరి సినిమా 1989లో వచ్చిన రాజకీయ చదరంగం. ఇక అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే 2021లో అంటే 32 సంవత్సరాల తర్వాత అన్నపూర్ణమ్మగారి మనవడు చిత్రంలో ఓ పాత్రలో కనిపించారు.  జమునకు మూగ జీవాలంటే ప్రాణం. తనకి చిన్నతనం నుంచీ కుక్కలను పెంచడం అలవాటు. 1967లో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ అయిన జూలూరి రమణారావును వివాహం చేసుకున్నారు. పెళ్ళయిన తర్వాత కూడా కుక్కలను పెంచడం కొనసాగించారు. ఒకదశలో వారి ఇంట్లో 25 కుక్కలు ఉండేవి. వాటికి అన్ని వసతులు కల్పించడంతోపాటు డెలివరీలు కూడా చేసేవారు. వాటికి అనారోగ్యం కలిగితే తనే చికిత్స చేసేవారు. అంతేకాదు, ఆమె దగ్గర రెండు గుర్రాలు కూడా ఉండేవి. తన పెళ్లి నిశ్చయమైన తర్వాత ఈ విషయంలో ఎంతో ఆందోళన చెందారు జమున. పెళ్లి తర్వాత కుక్కలను పెంచుకోవడానికి తన భర్త ఒప్పుకుంటాడా లేదా అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పేవారు. జమున, రమణారావు దంపతులకు వంశీ, స్రవంతి సంతానం. ప్రముఖ రచయిత వేటూరి సుందరామ్మూర్తి సోదరుడి కుమార్తెను కోడలుగా చేసుకున్నారు జమున. ఆమె భర్త రమణారావు 2014లో 86 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు.  జమునకు ఇందిరాగాంధీ అంటే ఎంతో అభిమానం. దాంతో 1980లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోని విభేదాల వల్ల భారతీయ జనతాపార్టీలో చేరి ప్రచారం చేశారు. జమునకు దానగుణం ఎక్కువ. తన జీవిత కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తెలుగు ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అనే సంస్థ నెలకొల్పి పెన్షన్లు అందించారు. 1980లో టి.అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి సహకారంతో కాకినాడ సమీపంలో 150 మందికి నివాసాలు నిర్మించారు. అందుకే ఆ కాలనీకి జమున నగర్‌ అని పేరు పెట్టారు. ఇక జమున అందుకున్న పురస్కారాల గురించి చెప్పాలంటే.. మూగమనసులు(1964), మిలన్‌(1967) చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు. అలాగే 2008లో ఎన్‌.టి.ఆర్‌. జాతీయ పురస్కారం లభించింది. చలన చిత్రసీమలో నటిగా తనదంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసిన జమున వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ 2023 జనవరి 27న 87 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. 

ఎన్టీఆర్‌ ఆడవేషం వేసారంటే.. ఆ సినిమా సూపర్‌హిట్టే!

నవరసాలను అద్భుతంగా పోషించగలిగిన వారే మహానటులు అనిపించుకుంటారు. అవికాక స్త్రీ పాత్రలోనూ మెప్పించగలగడం అనేది అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు నాటక రంగంలో స్త్రీ పాత్రలు చేసేవారు అరుదుగా దొరికేవారు. అలాంటి సమయంలో మగవారే స్త్రీ పాత్రలు పోషించి వాటికి వన్నె తెచ్చారు. స్త్రీ వేషం వెయ్యాల్సిన పరిస్థితి ప్రతి నటుడికీ ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ కూడా లేడీ గెటప్స్‌ వేశారు. వీరిద్దరూ తమ కెరీర్‌ను స్త్రీ పాత్రలతోనే మొదలుపెట్టడం విశేషం. ఎన్టీఆర్‌ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక నాటకం వెయ్యాల్సి వచ్చింది. అందులో నాయకురాలు నాగమ్మ పాత్రను మీసాలతోనే నటించి మీసాల నాగమ్మగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఎఎన్నార్‌ కూడా నాటక రంగం నుంచి వచ్చినవారే. రంగస్థలంపై ఆయన చేసిన మొదటి పాత్ర స్త్రీ పాత్ర కావడం విశేషం. అక్కినేనితో పోలిస్తే ఎన్టీఆర్‌ ఎక్కువ సార్లు స్త్రీ పాత్ర ధరించారు.  సినిమా రంగానికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ తొలిసారి ‘అన్న తమ్ముడు’ చిత్రంలో స్త్రీ వేషంలో కనిపించారు. 1958లో వచ్చిన ఈ సినిమాలో అన్నగా ఎన్టీఆర్‌, తమ్ముడిగా జగ్గయ్య నటించారు. ఈ చిత్రానికి సి.ఎస్‌.రావు దర్శకత్వం వహించారు. ఒక సందర్భంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎన్టీఆర్‌ ఆడవేషం వేసుకుంటారు. పోలీసుగా ఉన్న రేలంగి.. ఆడవేషంలో ఉన్న ఎన్టీఆర్‌ను చూసి మనసు పడతాడు. ‘వయసు మళ్లిన వన్నెలాడి..’ అంటూ పాట కూడా పాడతాడు. అదే సంవత్సరం టి.ఆర్‌.రామన్న దర్శకత్వంలో వచ్చిన ‘కార్తవరాయని కథ’ చిత్రంలో కూడా ఒక సన్నివేశంలో ఎన్టీఆర్‌, రమణారెడ్డి ఆడ వేషాల్లో కనిపిస్తారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ కన్నడలోనూ, రమణారెడ్డి తమిళ్‌లోనూ మాట్లాడం ద్వారా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు.  తెలుగులో తొలి సోషియో ఫాంటసీ చిత్రం ‘దేవాంతకుడు’. ఈ చిత్రం చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. 1960లో సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రేమించిన అమ్మాయిని కలుసుకునేందుకు ఆడవేషంలో వస్తారు ఎన్టీఆర్‌. అలా సి.పుల్లయ్య, సి.ఎస్‌.రావు... ఎన్టీఆర్‌ను స్త్రీ పాత్రలో చూపించిన తండ్రీకొడుకులుగా ఘనత వహించారు. 1966లో బి.విఠలాచార్య దర్శకత్వంలో డి.వి.ఎస్‌.రాజు నిర్మించిన ‘పిడుగురాముడు’ చిత్రంలోనూ మరోసారి ఎన్టీఆర్‌ స్త్రీ పాత్రలో కనిపించి మెప్పించారు. విలన్‌ రాజనాల బారి నుండి తప్పించుకునేందుకు ఎన్టీఆర్‌, పద్మనాభం ఆడవేషాలు వేస్తారు. ఆ సందర్భంలో ‘రంగులు రంగులు...’ అంటూ సాగే పాట ప్రేక్షకుల్ని బాగా అలరించింది. ‘అన్న తమ్ముడు’లో ఎన్టీఆర్‌ ఆడవేషం వేసినప్పటికీ ఆ సందర్భంలో వచ్చే పాటలో ఘంటసాల గాత్రం వినిపిస్తుంది. ‘పిడుగు రాముడు’ చిత్రంలో మాత్రం ఎన్టీఆర్‌కు ఎల్‌.ఆర్‌.ఈశ్వరి వాయిస్‌ను ఉపయోగించడం విశేషం.  ఆ తర్వాత బి.ఎ.సుబ్బారావు రూపొందించిన ‘రైతుబిడ్డ’ చిత్రంలోని ఒక సన్నివేశంలో అర్థనారీశ్వర వేషంలో అలరించారు ఎన్టీఆర్‌. 1979లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘డ్రైవర్‌ రాముడు’ చిత్రంలో సత్యనారాయణతోపాటు ఎన్టీఆర్‌ కూడా ఆడవేషం వేసుకొని ఓ హోటల్‌లో పిండిరుబ్బుతూ చక్కని వినోదాన్ని పంచారు. ‘అన్నతమ్ముడు’ నుంచి ‘డ్రైవర్‌ రాముడు’ వరకు ఎన్టీఆర్‌ స్త్రీ పాత్రలో నటించిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించడం విశేషం. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక పాత్రల్లోనే కాదు, స్త్రీ వేషంలోనూ ప్రేక్షకుల్ని మెప్పించిన ఘనత నటరత్న ఎన్‌.టి.రామారావుకు దక్కుతుంది. 

నటుడిగా స్థిరపడిన కాశీవిశ్వనాథ్‌ డైరెక్ట్‌ చేసిన బ్లాక్‌బస్టర్‌ గురించి మీకు తెలుసా?

సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఎంతోమంది వివిధ శాఖల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చినవారు దర్శకులు అయినవారు, హీరో కావాలని వచ్చి సంగీత దర్శకుడిగా మారినవారు ఉన్నారు. టాలీవుడ్‌ విషయానికి వస్తే కొందరు నటులుగా మారిన తర్వాత రచనను పక్కన పెట్టిన రచయితలు ఉన్నారు. ఇక దర్శకుల విషయానికి వస్తే.. ఎన్నో కళాఖండాలు సృష్టించిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌.. ఒక దశలో తనలోని దర్శకుడ్ని పక్కన పెట్టి నటుడుగా కొనసాగారు. అలాంటి కోవలోకి వస్తారు దర్శకుడు వై.కాశీవిశ్వనాథ్‌. దర్శకుడుగా చేసిన సినిమాలు రెండే అయినా.. దర్శకత్వ శాఖలో అపారమైన అనుభవాన్ని సంపాదించారు. ఇప్పుడు పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపిస్తున్న కాశీ విశ్వనాథ్‌ గురించి, ఆయన చేసిన సినిమాల గురించి చాలా మందికి తెలియదు.  రాజమండ్రి దగ్గరలోని పురుషోత్తపట్నంలో జన్మించారు వై.కాశీవిశ్వనాథ్‌. తన బంధువుకి ఒక సినిమా థియేటర్‌ ఉండేది. అందులో ప్రతి రోజూ సినిమాలు చూడడం ద్వారా సినిమాలంటే ఆసక్తి పెరిగింది. కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘తొలికోడి కూసింది’ సినిమా ఆయన్ని డైరెక్షన్‌ వైపు టర్న్‌ చేసింది. తెలిసినవారి ద్వారా నిర్మాత కానూరి రంజిత్‌కుమార్‌ను కలిశారు కాశీవిశ్వనాథ్‌. ఆ సమయంలో విజయనిర్మల దర్శకత్వంలో ‘లంకెబిందెలు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారాయన. ఆ సినిమాకి అసిస్టెంట్‌గా చేరారు విశ్వనాథ్‌. అతన్ని ఇన్‌స్పైర్‌ చేసిన ‘తొలికోడి కూసింది’ నిర్మాత కూడా రంజిత్‌కుమారే.  అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అసోసియేట్‌గా, కోడైరెక్టర్‌గా 25 సినిమాలకు పనిచేసిన తర్వాత విశ్వనాథ్‌కి డైరెక్షన్‌ చేసే అవకాశం వచ్చింది. ప్రేమించుకుందాం రా, గణేశ్‌, కలిసుందాం రా.. సినిమాలకు అసోసియేట్‌గా చేస్తున్న సమయంలో ఆయనలోని టాలెంట్‌ని గుర్తించిన నిర్మాత సురేష్‌బాబు.. ‘నువ్వులేక నేనులేను’ ద్వారా విశ్వనాథ్‌కు దర్శకుడుగా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకి కథ కూడా తనే రాసుకున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో ఒక పాట కూడా రాశారు. తరుణ్‌, ఆర్తీ అగర్వాల్‌ జంటగా నటించిన ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడమే కాకుండా, మ్యూజికల్‌గా కూడా పెద్ద విజయం సాధించింది.  ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా వున్న నందమూరి కళ్యాణ్‌రామ్‌ తొలి సినిమా ‘తొలిచూపులోనే’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఘనత కూడా కాశీవిశ్వనాథ్‌కి దక్కుతుంది. ఉషాకిరణ్‌ మూవీస్‌ బేనర్‌పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోయినా దర్శకుడిగా కాశీవిశ్వనాథ్‌కి మంచి పేరు వచ్చింది. 2003లో ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత మరో 5 సంవత్సరాలపాటు ఆయనకు డైరెక్షన్‌ చేసే అవకాశం రాలేదు. ఆ సమయంలోనే ‘నచ్చావులే’ చిత్రంతో కాశీవిశ్వనాథ్‌ను క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పరిచయం చేశారు డైరెక్టర్‌ రవిబాబు. ఈ సినిమా నటుడిగా విశ్వనాథ్‌కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత రైడ్‌, డార్లింగ్‌, నమో వెంకటేశ, కళవర్‌కింగ్‌.. ఇలా వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. తండ్రి, బాబాయ్‌, మావయ్య వంటి క్యారెక్టర్స్‌ ఆయన్ని వరించాయి. దాంతో పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడిపోయారు కాశీవిశ్వనాథ్‌. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోలందరి సినిమాల్లోనూ సహాయ పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు కాశీవిశ్వనాథ్‌. 

అంజలీదేవి అంటే సీతమ్మ.. తమ మనసుల్లో ఆమెకు గుడి కట్టిన ప్రేక్షకులు!

(ఆగస్ట్‌ 24 నటి అంజలీదేవి జయంతి సందర్భంగా..) సాత్విక పాత్రలకు, కరుణ రసాన్ని పలికించే పాత్రలకు, పురాణ ఇతిహాసాల్లోని పతివ్రతల పాత్రలకు పెట్టింది పేరు అంజలీదేవి. పౌరాణిక చిత్రాల్లోని పాత్రలకు తన అద్వితీయమైన నటన ద్వారా జీవం పోశారు. లవకుశలో పోషించిన సీతమ్మతల్లి పాత్ర అంజలి జీవితాన్నే కాదు, ఎంతో మంది జీవితాలను కూడా ప్రభావితం చేసింది. ఒక దశలో సీత అంటే అంజలీదేవే అని ప్రజలు భావించేవారు. ఆమె బయట కనిపిస్తే కాళ్ళకు నమస్కరించేవారు. ఈ తరహా పాత్రల్లో అంజలికి వచ్చినంత పేరు మరే నటికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా బిజీ హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. అలా చేసుకుంటే అవకాశాలు తగ్గిపోతాయన్నది వారి బాధ. అంజలి మాత్రం ఇద్దరు ప్లిలలు పుట్టిన తర్వాత సినిమా రంగానికి వచ్చారంటే ఆశ్చర్యం కలగక మానదు. చిన్నతనం నుంచి నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ వచ్చిన అంజలికి సినిమాల్లోకి వెళ్లాలన్న కోరిక ఉండేది కాదు. అలాంటి అంజలీదేవి సినిమాల్లోకి ఎలా ప్రవేశించారు, ఆమె కెరీర్‌ ఎన్ని మలుపులు తిరిగింది, సినిమాల్లో ఆమె సాధించిన విజయాలేమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.  1927 ఆగస్ట్‌ 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు అంజలీదేవి. ఆమె అసలు పేరు అంజనీకుమారి. ఈమె తండ్రి నూకయ్య రంగస్థల కళాకారుడు. నాటకాలు వేయడం, నాటకాలకు సంగీతం సమకూర్చడం వంటివి చేసేవారు. 9 ఏళ్ళ వయసులో మొట్టమొదటిసారి రంగస్థలంపై అడుగు మోపారు అంజలి. ఆ తర్వాత స్కూల్‌ మాన్పించి ఆమెకు సంవత్సరంపాటు సంగీతం, నృత్యం నేర్పించారు. అయితే వాటికంటే చదువుకోవడానికే ఆమె ఎక్కువ ఇష్టపడేవారు. అయినా కాకినాడలోని యంగ్‌ మెన్స్‌ హ్యాపీ క్లబ్‌లో వుండే ఆదినారాయణరావు దగ్గర నటనలో శిక్షణ ఇప్పించేందుకు చేర్పించారు నూకయ్య. అక్కడ నటన నేర్చుకుంటూనే చదువుకునేవారు. ఆదినారాయణరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు అంజలి. ఆ క్రమంలోనే ఆయనంటే ఆమెకు ఆరాధనా భావం కలిగింది. యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌ వేసే నాటకాల్లో, ఇతర నాటక పరిషత్‌లు వేసే నాటకాలతో బిజీ అయిపోయారు అంజలి.  అప్పుడు అంజలికి పెళ్లి చేయాలని తండ్రి నూకయ్య సంబంధాలు చూశారు. అయితే తను పెళ్ళంటూ చేసుకుంటే ఆదినారాయణరావునే చేసుకుంటాను అని పట్టుపట్టారు అంజలి. అప్పటికే పెళ్ళయి పిల్లలు కూడా ఉన్న ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి నూకయ్య ఒప్పుకోలేదు. చివరికి తండ్రిని ఒప్పించి, ఆదినారాయణరావు కుటుంబ సభ్యుల్ని కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ సమయంలో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న గొల్లభామ చిత్రంలో నటించమని అంజలిని అడిగారు. సినిమాల్లో నటించడం అంజలికి, ఆదినారాయణరావుకు ఇష్టం లేకపోయినా పెద్దాయన అడిగారని ఒప్పుకున్నారు. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే అంజనీకుమారిగా ఉన్న ఆమె పేరును అంజలీదేవిగా మార్చారు సి.పుల్లయ్య. ఆ సినిమాలో ఆమెకు వ్యాంప్‌ క్యారెక్టర్‌ ఇచ్చారు. అది అంజలికి మంచిపేరు తెచ్చింది. దాంతో ఆ తర్వాత అన్నీ వ్యాంప్‌ క్యారెక్టర్సే వచ్చాయి. అలా మూడు సంవత్సరాలపాటు వ్యాంప్‌ క్యారెక్టర్స్‌ చేశారు. ఈ విషయంలో అంజలీదేవి ఎంతో బాధపడ్డారు. మంచి క్యారెక్టర్స్‌ చేసే అవకాశం వస్తే బాగుండేది అనుకున్నారు.  ఆ సమయంలోనే ఘంటసాల బలరామయ్య... శ్రీలక్ష్మమ్మ కథ పేరుతో రూపొందిస్తున్న సినిమాలో అంజలికి ప్రధాన పాత్ర ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించకపోయినా అంజలికి నటిగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా పల్లెటూరి పిల్ల చిత్రంలో అంజలికి హీరోయిన్‌ అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ కలిసి నటించిన తొలి సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత అంజలీదేవి 15 సంవత్సరాలపాటు హీరోయిన్‌గా కొనసాగారు. అనార్కలి, సువర్ణసుందరి, జయభేరి, భీష్మ, చెంచులక్ష్మీ వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. 1958లో సి.పుల్లయ్య దర్శకత్వంలో లవకుశ చిత్రంలో సీతగా నటించారు అంజలీదేవి. ఈ సినిమా ఆమె సినీ జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమా చిత్రీకరణ ఐదేళ్ళపాటు జరిగింది. 1963లో విడుదలైన లవకుశ అఖండ విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి సీత అంటే అంజలీదేవేనని అందరూ ఫిక్స్‌ అయిపోయారు. మరో పక్క ఆదినారాయణరావు సంగీత దర్శకుడిగా చాలా బిజీ అయిపోయారు.  ఆ తర్వాత భక్త ప్రహ్లాద, బడిపంతులు, తాత మనవడు వంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు అంజలి. నటిగానే కాదు, నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు నిర్మించారు. 1953లో అంజలి పిక్చర్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పరదేశి అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో మొత్తం 28 సినిమాలు నిర్మించారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాలన్నింటికీ ఆదినారాయణరావే సంగీత దర్శకుడు. 70, 80 దశకాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా అందరికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించారు అంజలీదేవి. 1992లో వచ్చిన బృందావనం ఆమె నటించిన చివరి సినిమా. ఇక అవార్డుల గురించి చెప్పాలంటే.. ఉత్తమ నటిగా అనార్కలి, సువర్ణ సుందరి, చెంచులక్ష్మీ, జయభేరి చిత్రాలకు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు. అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌, రఘుపతి వెంకయ్య పురస్కారం, రామినేని పురస్కారం, ఎన్‌.టి.ఆర్‌. జాతీయ పురస్కారం అంజలీదేవిని వరించాయి. 40 సంవత్సరాలకు పైగా నాటక రంగానికి, సినిమా రంగానికి విశేష సేవలు అందించిన అంజలీదేవి 2014 జనవరి 13న 86 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు. ఆమె తన అవయవాలను రామచంద్ర మెడికల్‌ కాలేజీకి దానమిచ్చారు. 

రజినీకాంత్‌ + కమల్‌హాసన్‌ = చిరంజీవి అని కన్‌ఫర్మ్‌ చేసిన టాప్‌ డైరెక్టర్‌!

(ఆగస్ట్‌ 22 మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా..) మెగాస్టార్‌ చిరంజీవి జీవితం గురించి, ఆయన సినిమాల్లో ఎదిగిన తీరు గురించి అందరికీ తెలుసు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం స్వయంకృషితో మెగాస్టార్‌ స్థాయికి చేరుకున్నారు. ఇక తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజిఆర్‌, శివాజీ గణేశన్‌ తర్వాత ఆ స్థానాలను భర్తీ చేసిన హీరోలు రజినీకాంత్‌, కమల్‌హాసన్‌. వీరిద్దరికీ గురువు ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌. హీరోలుగా వారి ఎదుగుదలలో బాలచందర్‌ పాత్ర ఎంతో ఉంది. ఒక దశలో తన శిష్యులను కూడా పక్కన పెట్టి రజినీకాంత్‌ + కమల్‌హాసన్‌ = చిరంజీవి అని ఒక వేదికపై ప్రకటించారు. తన సినిమాల ద్వారా హీరోలుగా ఎదిగి టాప్‌ పొజిషన్‌కి వచ్చిన తన శిష్యులను కాదని, చిరంజీవిని అంతగా మెచ్చుకోవడానికి రీజన్‌ ఏమిటి? అనే విషయం గురించి తెలుసుకుందాం. రజినీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి... ఈ ముగ్గురిలో కమల్‌హాసన్‌ నటుడిగా చాలా సీనియర్‌. 1960లో జెమినీ గణేశన్‌, సావిత్రి జంటగా నటించిన ‘కలతూర్‌ కన్నమ్మ’ అనే తమిళ సినిమాలో నాలుగేళ్ళ వయసులోనే నటుడిగా పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో బాలనటుడిగా చేసిన తర్వాత తంగప్ప వంటి డాన్స్‌మాస్టర్స్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. 1973లో కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అరంగేట్రం’ చిత్రంతో హీరోగా మారారు కమల్‌. ఆ తర్వాత హీరోగా అతను ఏ స్థాయికి వెళ్లారో అందరికీ తెలిసిందే. రజినీకాంత్‌లోని టాలెంట్‌ని గుర్తించిన స్నేహితులు ఆర్థిక సాయం చేయడం వల్ల మద్రాస్‌లోని ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు రజినీ. కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత తెలుగులో బాలచందర్‌ చేసిన ‘అంతులేని కథ’ చిత్రంలో హీరోయిన్‌కి అన్నయ్యగా ఒక విభిన్నమైన పాత్ర పోషించారు. ఈ సినిమా రజినీకి చాలా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో అతని స్టైల్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలా హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా వరసగా సినిమాలు చేస్తూ వస్తున్న రజినీ కెరీర్‌ బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘తప్పు తాళంగళ్‌’ చిత్రంతో టర్న్‌ తీసుకుంది. రజినీతో యాక్షన్‌ సినిమాలు చెయ్యొచ్చు అని డైరెక్టర్‌ ఎస్‌.పి.ముత్తురామన్‌ భావించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వరసగా యాక్షన్‌ సినిమాలు వచ్చాయి. తమిళ్‌తోపాటు తెలుగులోనూ రజినీకి అభిమానులు ఉన్నప్పటికీ ‘బాషా’ తర్వాత అభిమానగణం మరింత పెరిగింది.  ఇక చిరంజీవి కెరీర్‌ గురించి చెప్పాలంటే.. మొదట నటించిన సినిమా పునాదిరాళ్లు చిత్రం అయినప్పటికీ మొదట రిలీజ్‌ అయిన సినిమా ప్రాణం ఖరీదు. ఈ సినిమా తర్వాత రజినీ మాదిరిగానే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా.. చాలా సినిమాలు చేశారు. 1983లో వచ్చిన ‘ఖైదీ’ చిరంజీవి సినీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు తర్వాత తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి ఖైదీ సినిమా ఎంతో బాగా ఉపయోగపడింది. అయితే అంతకుముందు కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో చిరంజీవి శాడిస్ట్‌ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. ఈ సినిమా తమిళ్‌ వెర్షన్‌లో రజినీ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేశారు. అయితే దర్శకుడు కె.బాలచందర్‌కు చిరంజీవి పెర్‌ఫార్మెన్స్‌ బాగా నచ్చింది. అ తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘47 రోజులు’ సినిమాలోనూ అదే తరహా పాత్ర పోషించి బాలచందర్‌ ప్రశంసలు అందుకున్నారు చిరంజీవి.  బాలచందర్‌ కాంపౌండ్‌ నుంచి వచ్చిన రజినీకాంత్‌, కమల్‌హాసన్‌.. ఒకరు యాక్షన్‌ సినిమాల ద్వారా, మరొకరు వైవిధ్యమైన సినిమాలు, క్లాస్‌ మూవీస్‌ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ ఇద్దరిలో ఉన్న క్వాలిటీస్‌ అన్నీ చిరంజీవిలో ఉన్నాయని బాలచందర్‌ అభిప్రాయం. అందుకే రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ కలిస్తే చిరంజీవి అని ప్రకటించారు బాలచందర్‌.