తనని స్టార్‌ హీరో చేసిన డైరెక్టర్‌ని అవమానించిన చిరంజీవి!

సినిమా రంగంలో విజయాల శాతం తక్కువనేది అందరికీ తెలిసిన విషయమే. నూటికి నూరు శాతం విజయాలు సాధించిన దర్శకులు ఉండడం అరుదు. గతంలో డైరెక్టర్స్‌ లెక్కకు మించిన సినిమాలు తీసేవారు. వాటిలో సక్సెస్‌ పర్సంటేజ్‌ తక్కువగానే ఉండేది. కానీ, సక్సెస్‌ రేట్‌ ఎక్కువగా ఉన్న దర్శకులు కూడా ఉన్నారు. దానికి ప్రస్తుత జనరేషన్‌లో రాజమౌళినే ఉదాహరణగా తీసుకుంటారు. ఇప్పటివరకు అతను డైరెక్ట్‌ చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి. ఇంతకుముందు జనరేషన్‌ని పరిశీలిస్తే సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉన్న డైరెక్టర్‌ ఖచ్చితంగా ఎ.కోదండరామిరెడ్డి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన డైరెక్ట్‌ చేసిన 94 సినిమాల్లో దాదాపు 80 సినిమాలు సూపర్‌హిట్‌ అయినవే. ఈ ట్రాక్‌ రికార్డ్‌ ఆ తరం డైరెక్టర్స్‌లో ఎవరికీ లేదనే చెప్పాలి.  ఎ.కోదండరామిరెడ్డి విజయ పరంపర మెగాస్టార్‌ చిరంజీవితోనే స్టార్ట్‌ అయింది. ‘సంధ్య’ చిత్రంతో పరిచయమైన కోదండరామిరెడ్డి తన మొదటి సినిమాతోనే దర్శకుడుగా పాస్‌ అయిపోయారు. ఆ సినిమా చూసిన క్రాంతికుమార్‌ రెండో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పేరు ‘న్యాయం కావాలి’. చిరంజీవి కెరీర్‌లో ఓ గొప్ప సినిమాగా దీన్ని చెప్పొచ్చు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఈ క్యారెక్టర్‌ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత వెంటనే అదే కాంబినేషన్‌లో ‘కిరాయి రౌడీలు’ ప్రారంభించారు క్రాంతికుమార్‌. ఆ తర్వాత  కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో చేసిన ‘ఖైదీ’ చిత్రంతో చిరంజీవి స్టార్‌ హీరోగా ఎదిగారు. అలా వీరిద్దరిదీ హిట్‌ కాంబినేషన్‌ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఛాలెంజ్‌, అభిలాష, రాక్షసుడు, గూండా, దొంగ, విజేత, పసివాడి ప్రాణం, దొంగమొగుడు, కొండవీటి దొంగ, ముఠామేస్త్రి వంటి సినిమాలు ఘనవిజయం సాధించి చిరంజీవి రేంజ్‌ విపరీతంగా పెరిగిపోయింది. వీరిద్దరి కాంబినేషన్‌లో టోటల్‌గా 23 సినిమాలు వచ్చాయి. వాటిలో సూపర్‌హిట్‌ అయిన సినిమాలే ఎక్కువ. 1993లో వచ్చిన ముఠామేస్త్రి తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి సినిమా చెయ్యలేదు. అంటే ఈ 30 సంవత్సరాల్లో వీరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు.  ఇదిలా ఉంటే.. ఆమధ్య చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తన సక్సెస్‌ గురించి తెలియజేస్తూ తను ఈ స్థాయిలో ఉండడానికి, మెగాస్టార్‌గా ఎదగడానికి కారకులైన దర్శకుల గురించి తెలియజేశారు. కానీ, చిరు చెప్పిన డైరెక్టర్స్‌ లిస్ట్‌లో కోదండరామిరెడ్డి పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో మెగాభిమానులు సైతం షాక్‌ అయ్యారు. చిరంజీవికి స్టార్‌ స్టేటస్‌ రావడానికి ముఖ్య కారకులు కోదండరామిరెడ్డి అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఆ ఇంటర్వ్యూలో ఆయన గురించి చిరంజీవి ఒక్క చిన్న మాట కూడా మాట్లాడకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని అందరూ చర్చించుకున్నారు. ఆమధ్య కోదండరామిరెడ్డి ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మీకు, చిరంజీవికి మధ్య మనస్పర్థలు ఏమైనా ఉన్నాయా?’ అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘మా మధ్య అలాంటివి ఏమీ లేవు. ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటాం. బహుశా మేమిద్దరం కలిసి సినిమాలు చెయ్యకపోవడం వల్లే అందరూ అలా అనుకుంటున్నారేమో. నాకు తెలిసి మా మధ్య ఏమీ లేదు. ఆయన మనసులో ఏమైనా ఉందేమో నాకు తెలీదు’ అన్నారు.  అదే ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పిన డైరెక్టర్స్‌ లిస్ట్‌లో కోదండరామిరెడ్డి పేరును ప్రస్తావించలేదన్న విషయాన్ని గుర్తు చేసినపుడు మాత్రం ‘అవును. అది నిజమే. నేను కూడా దాన్ని గమనించాను. నా గురించి ఆయన ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించింది, బాధగా కూడా అనిపించింది. నేను ఈ మాట అన్నందుకు చిరంజీవి బాధపడినా ఫర్వాలేదు. నేను మాత్రం బాగా హర్ట్‌ అయ్యాను. మేమిద్దరం కలిసి 23 సినిమాలు చేశాం. అందులో సూపర్‌హిట్‌ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయినా నా పేరు చెప్పకపోవడం, మేం చేసిన సినిమాల గురించి కూడా మాట్లాడకపోవడం నాకు బాధ కలిగించింది’ అన్నారు.

సావిత్రిని రెండు నెలలు ఏడిపించిన జానకి.. అసలేం జరిగింది?

మహానటి సావిత్రి తొలి రోజుల్లో నటించిన అన్ని సినిమాల్లోనూ ఆమెకు పి.లీల ప్లేబ్యాక్‌ పాడేవారు. మాయాబజార్‌, పెళ్లి చేసిచూడు, మిస్సమ్మ వంటి సినిమాల్లో పి.లీల పాడిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అందుకే తను నటించిన ప్రతి సినిమాలోనూ ఆమే పాడాలని పట్టుపట్టేవారు సావిత్రి. ఆ తర్వాత ఆ అవకాశం పి.సుశీలకు వచ్చింది. లీల తర్వాత తనకు కరెక్ట్‌గా సూట్‌ అయ్యే గాత్రం సుశీలదేనని సావిత్రి నమ్మేవారు. ఎన్నో సినిమాల్లో సావిత్రికి సుశీల పాడిన పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఆమె తప్ప ఎవరు తనకు పాట పాడినా సావిత్రి ఒప్పుకునేవారు కాదు. ఇదిలా ఉంటే.. ఒక పాట విషయంలో సావిత్రి, ఎస్‌.జానకి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో సావిత్రికి పాట పాడనని తేల్చి చెప్పారు జానకి. వారిద్దరి మధ్య అసలేం జరిగింది. సావిత్రిని రెండు నెలల పాటు జానకి ఎందుకు ఏడిపించారు అనే విషయం తెలుసుకుందాం.  1957లో విడుదలైన ‘ఎం.ఎల్‌.ఎ.’ చిత్రం ద్వారా తెలుగులో నేపథ్య గాయనిగా పరిచయమయ్యారు ఎస్‌.జానకి. ‘నీ ఆశా అడియాస..’ అంటూ తొలిసారి ఘంటసాలతో కలిసి పాడిన పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో పాటలు పాడిన జానకితో ‘పడితాండ పత్తిని’ అనే తమిళ చిత్రంలో ఓ పాట పాడించారు. టి.ఆర్‌.పాప సంగీత దర్శకత్వంలో రూపొందిన మంచి మెలోడీ సాంగ్‌ అది. రికార్డింగ్‌ పూర్తయిపోయిన తర్వాత మహానటి సావిత్రి ఆ పాటపై అభ్యంతరం చెప్పారు. తనకు సుశీల పాడితేనే సినిమా చేస్తానని చెప్పడంతో జానకి పాటను తొలగించి మళ్ళీ సుశీలతో పాడించారు. ఇది తెలుసుకున్న జానకి ఎంతో బాధపడ్డారు. ఇకపై సావిత్రికి పాట పాడకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మరో మూడు సినిమాల్లో అవకాశం వచ్చినా పాడనని ఖచ్చితంగా చెప్పేశారు.  1962లో జెమిని గణేశన్‌, సావిత్రి ప్రధాన పాత్రల్లో ఎం.వి.రామన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొంజమన్‌ సలంగై’. ఇదే చిత్రాన్ని ‘మురిపించే మువ్వలు’ పేరుతో తెలుగులోకి డబ్‌ చేశారు. ఈ సినిమాలో సంగీత ప్రధానంగా సాగే ఓ పాట ఉంది. సావిత్రికి ఎప్పుడూ ప్లేబ్యాక్‌ పాడే లీల ఆ పాట పాడను అని చెప్పడంతో జానకి అయితే ఆ పాటకు న్యాయం చెయ్యగలదని భావించిన సంగీత దర్శకుడు ఎస్‌.ఎం.సుబ్బయ్యనాయుడు ఆమెను సంప్రదించారు. అప్పటికే సావిత్రికి పాడకూడదని నిర్ణయించుకున్న జానకి దాన్ని తిరస్కరించారు. ఎవరు చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరికి లతా మంగేష్కర్‌తో ఆ పాట పాడించాలనుకొని ఆ ట్రాక్‌ తీసుకొని బొంబాయి వెళ్ళారు దర్శకనిర్మాతలు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆమె ఆ పాట పాడలేనని చెప్పడంతో వారికి ఏం చెయ్యాలో తోచలేదు. అలా రెండు నెలలపాటు ఆ పాటను పెండింగ్‌లో పెట్టారు జానకి.  ‘ఆ పాటకు కమల లక్ష్మణ్‌తో డాన్స్‌ చేయిస్తాం. సావిత్రే చెయ్యాలా ఏంటి.. మీరు పాడండి’ అని దర్శకనిర్మాతలు రిక్వెస్ట్‌ చేయడంతో ఆ పాట పాడారు జానకి. అయితే ఆ పాటలో సావిత్రే నటించారు. అదే ‘నీ లీల పాడెద దేవా..’ అనే పాట. నాదస్వరంతో పోటీ పడుతూ జానకి పాడిన ఈ పాట అప్పట్లో పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాట ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఎస్‌.జానకి పాడిన పాటల్లో టాప్‌ టెన్‌లో ఈ పాట కూడా ఉంటుంది. ‘మురిపించే మువ్వలు’లోని ఈ పాటకు సంబంధించి జానకి మాత్రమే ఇప్పుడు మనమధ్య ఉన్నారు. ఆ సినిమా దర్శకనిర్మాతలు, సంగీత దర్శకులు, సావిత్రి, జెమినీగణేశన్‌ అందరూ కన్నుమూశారు.

తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన దర్శక దిగ్గజం కె.బాలచందర్‌!

జనజీవనంలో నుంచి తీసుకున్న కథావస్తువులే ఆయన సినిమాలు. తన సమకాలీనులైన దర్శకుల్ని సైతం ఆశ్చర్యపరిచేలా ఆయన సినిమాలు ఉండేవి. ఎంతో సహజమైన కథ, కథనాలతో ప్రేక్షకుల మనసుల్ని తాకే సినిమాలు చేయడం ఆయన ప్రత్యేకత. ఆయన ఎంపిక చేసుకునే కథలు చాలా విలక్షణంగా ఉండేవి. ఆ తరహా కథలు చేసేందుకు ఏ దర్శకుడూ ప్రయత్నించలేదు. ఆయన సినిమాల్లో మానసిక సంఘర్షణ ఉంటుంది, సామాజిక స్పృహ ఉంటుంది, మహిళల సాధికారతకు అద్దం పట్టేలా ఆయా పాత్రల చిత్రణ ఉంటుంది. ఆయన సినిమాలంటే ఇష్టపడనివారు ఉండరు. ఆ దర్శక మేధావే కె.బాలచందర్‌. తెలుగు, తమిళ భాషల్లో 100కు పైగా సినిమాలను ఆయన రూపొందించారు. ప్రస్తుతం బాలచందర్‌ మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సినిమాలతో మనల్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటారు. తమిళ దర్శకుల్లో తెలుగువారిని ఎక్కువ ప్రభావితం చేసారాయన. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన కె.బాలచందర్‌ జయంతి జూలై 9. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి, ఆయన చేసిన విభిన్నమైన ప్రయోగాల గురించి తెలుసుకుందాం.  కైలాసం బాలచందర్‌ 1930 జూలై 9న తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా మన్నిలంలో జన్మించారు. ఆయనకు ఎనిమిదేళ్ళ వయసులో సినిమాలు చూసే అవకాశం కలిగింది. అప్పటి తమిళ సూపర్‌స్టార్‌ ఎమ్‌.కె. త్యాగరాజ భాగవతార్‌ సినిమాలంటే బాలచందర్‌కు ఎంతో అభిమానం! చదువుకునే రోజుల్లోనే నాటకాలు రాసి, వాటికి దర్శకత్వం వహించేవారు. అయితే చదువును ఏ నాడూ అశ్రద్ధ చేయలేదు. బియస్సీ (జువాలజీ)లో డిగ్రీ పట్టా అందుకున్న తర్వాత  కొంతకాలం ముత్తుపేటలో టీచర్‌గా పనిచేశారు. తరువాత మద్రాసు మకాం మార్చారు. అక్కడ ఓ అకౌంటెంట్‌ జనరల్‌ వద్ద క్లర్క్‌గా పనిచేశారు. ఆ రోజుల్లోనే వర్ధమాన కళాకారుల సంఘంలో చేరారు. తరువాత సొంతంగా ఓ నాటకసంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఈయన నాటక సంఘంలోనే సౌందర్‌ రాజన్‌, షావుకారు జానకి, నగేశ్‌, వెన్నిరాడై శ్రీకాంత్‌ వంటి వారు నటించేవారు. ఆ తర్వాత వారంతా సినిమా రంగంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆరోజుల్లో బాలచందర్‌ రాసిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ నాటకం విశేషాదరణ చూరగొంది. ఈ నాటకాన్ని ఎన్నోసార్లు ప్రదర్శించారు. దాంతో బాలచందర్‌కు రచయితగా, దర్శకునిగా మంచిపేరు లభించింది. తద్వారా యమ్‌.జి.ఆర్‌. హీరోగా నటించిన ‘దైవతాయ్‌’ చిత్రానికి మాటలు రాసే అవకాశం లభించింది. ఆపై తన ‘సర్వర్‌ సుందరం’ నాటకాన్ని సినిమా తీయగా, దానికీ రచన చేశారు బాలచందర్‌. తాను రాసిన ‘నీర్‌ కుమిళి’ నాటకం ఆధారంగా అదే పేరుతో రూపొందిన చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. నాటకరంగంలో బాలచందర్‌కు ఎంతో పేరు సంపాదించి పెట్టిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ను తరువాత సినిమాగా ఆయనే తెరకెక్కించారు. ఆ సినిమా సైతం ఆకట్టుకుంది. ఆయన రూపొందించిన ‘భామా విజయం’ మంచి ఆదరణ పొందింది. అదే సినిమాను తెలుగులో ‘భలే కోడళ్లు’గా రూపొందిస్తూ తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు బాలచందర్‌. తెలుగునాట కూడా బాలచందర్‌కు మంచి పేరు లభించింది. చలం హీరోగా బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సత్తెకాలపు సత్తెయ్య’ చిత్రం మంచి విజయం సాధించింది. తరువాత వరుసగా చలంతో ‘బొమ్మా బొరుసా, జీవితరంగం’ వంటి చిత్రాలు రూపొందించారు. తమిళంలో తాను రూపొందించిన ‘అవల్‌ ఒరు తోడర్‌ కథై’ ఆధారంగా తెలుగులో ఆయన దర్శకత్వంలోనే రూపొందిన ‘అంతులేని కథ’ ఆరోజుల్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ చిత్రం ద్వారానే కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ తెలుగు తెరకు పరిచయం కాగా, ఇందులో నటించిన జయప్రదకు నటిగా మంచి పేరు లభించింది. తనను ఎంతగానో ఆదరించిన తెలుగు సినిమా రంగం అంటే బాలచందర్‌కు ఎంతో గౌరవం. ఆయనకు తెలుగు చదవడం రాకపోయినా, తెలుగు సాహిత్యం అంటే ఎంతో అభిమానం. అందువల్ల తెలుగులోనే ఓ స్ట్రెయిట్‌ మూవీ రూపొందించాలని ‘మరోచరిత్ర’ను తెరకెక్కించారు. ఈ సినిమా ఓ చరిత్ర సృష్టించింది. ప్రేమకథల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించిన బాలచందర్‌కి దర్శకుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టిందీ సినిమా. ఈ సినిమాలో కమల్‌హాసన్‌, సరితల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదే చిత్రాన్ని హిందీలో ‘ఏక్‌ దూజే కే లియే’ పేరుతో హీందీలో రూపొందించి అక్కడ కూడా ఘనవిజయం సాధించారు బాలచందర్‌. ఈ సినిమాలోని ‘తేరే మేరే బీచ్‌ మే..’ పాటకుగాను ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకునిగా రెండో నేషనల్‌ అవార్డు లభించింది. ఈ హిందీ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ నిర్మించడం విశేషం! కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన తెలుగు సినిమాల్లో అందమైన అనుభవం, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, తొలికోడి కూసింది, 47 రోజులు, కోకిలమ్మ, రుద్రవీణ వంటి సినిమాలు బాలచందర్‌ను అగద్రర్శకుడిగా నిలబెట్టాయి. ఇదికథకాదు, 47 రోజులు చిత్రాల్లో మెగాస్టార్‌ చిరంజీవిని నెగెటివ్‌ క్యారెక్టర్‌లో చూపించారు  బాలచందర్‌. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో చిరంజీవి సొంతంగా రుద్రవీణ చిత్రాన్ని నిర్మించారు. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో నటించడం ద్వారానే కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, చిరంజీవి, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటివారు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇలా సినిమా రంగంలో ఎంతో మందికి బ్రేక్‌ ఇచ్చిన బాలచందర్‌ కవితాలయా ప్రొడక్షన్స్‌ను స్థాపించింది తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో సినిమాలు  నిర్మించారు. చిత్రసీమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు బాలచందర్‌. సగటు మనిషి జీవితంలోని అనేక కోణాలను ఆవిష్కరిస్తూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు రూపొందించి దర్శకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కె.బాలచందర్‌ జయంతి జూలై 9. ఈ సందర్భంగా ఆ దర్శకదిగ్గజానికి నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.

ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించడం ముఖ్యమని చాటి చెప్పిన గుమ్మడి!

పాతతరం నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావుది ఓ విభిన్నమైన శైలి. ఆయన చేసిన పాత్రలను మరెవ్వరూ చేయలేరు అన్నంతగా ప్రేక్షకుల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. తన కెరీర్‌లో 500కి పైగా సినిమాల్లో నటించిన గుమ్మడి లభించిన ప్రతీపాత్రకూ న్యాయం చేసేవారు. ఎలాంటి పాత్రయినా అందులో ఆ పాత్రే కనిపించాలి తప్ప నటుడు కనిపించకూడదు అనే సిదాÊధంతాన్ని అక్షరాలా పాటించేవారు గుమ్మడి. ఆ స్థాయిలో నటనను ప్రదర్శించేందుకు, ప్రేక్షకుల మెప్పు పొందేందుకు శాయశక్తులా కృషి చేసేవారు. జూలై 9 సహజ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి. ఈ సంందర్భంగా ఆయన సినీ జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. మన దేశం గర్వించదగ్గ ‘మెథడ్‌ ఆర్టిస్ట్స్‌’లో గుమ్మడికి ప్రత్యేక స్థానం ఉంది. సాత్విక పాత్రలకు పెట్టింది పేరైన గుమ్మడి కొన్ని సినిమాల్లో విలన్‌గా కూడా నటించి మెప్పించారు. ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రంలో తిమ్మరుసు పాత్రను అద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకోవడమే కాదు,  రాష్ట్రపతి బహుమతి కూడా లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. రాష్ట్రప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తో గౌరవించింది. సాత్వికాభినయంలో తనకు తానే సాటి అనిపించుకున్న గుమ్మడి పేరు తలచుకోగానే ఆయన ధరించిన అనేక వైవిధ్యమైన పాత్రలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి.  గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గుమ్మడి వెంకటేశ్వరరావుకు బాల్యం నుంచీ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలనే తపన ఉండేది. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. దాకా చదువుకున్న గుమ్మడికి పుచ్చలపల్లి సుందరయ్య ఉపన్యాసాలు బాగా నచ్చేవి. దాంతో గుమ్మడి కూడా కమ్యూనిస్టు భావజాలాన్ని ఒంటపట్టించుకున్నారు. కాలేజీలో చేరితే చెడిపోతాడని భావించిన గుమ్మడి కన్నవారు ఆయనకు 17 ఏళ్ళ వయసులోనే పెళ్ళి చేశారు. చివరకు ఎలాగోలా హిందూ కళాశాలలో చేరి ఇంటర్‌ చదివారు. ఇంటర్‌ పాస్‌ కాకపోవడంతో వ్యవసాయంలో దింపారు పెద్దలు. వ్యవసాయం చేస్తూనే పుస్తకాలను విపరీతంగా చదివేవారు గుమ్మడి. ఆ సమయంలోనే ఆయన మనసు నటనవైపు మళ్ళింది. మెల్లగా నాటకాలు వేయసాగారు. తరువాత మిత్రుల ప్రోత్సాహంతో మదరాసు చేరి, సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘అదృష్టదీపుడు’ గుమ్మడి నటించిన తొలి సినిమా. ‘అదృష్ట దీపుడు’ తర్వాత గుమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. వచ్చిన సినిమాలు కూడా ఆయనకు నటుడుగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ పరిస్థితుల్లో తిరిగి ఇంటికి వెళ్లిపోదామని నిర్ణయించుకున్న గుమ్మడికి తమ సొంత సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు ఎన్టీఆర్‌. ఆయన బేనర్‌లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత గుమ్మడికి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘తోడుదొంగలు’ చిత్రంలో తన వయసుకు మించిన పాత్రను పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ సినిమా చూసిన దర్శకుడు పి.పుల్లయ్య తన ‘అర్ధాంగి’ చిత్రంలో ఏయన్నార్‌, జగ్గయ్యకు తండ్రిగా నటించే పాత్రను ఇచ్చారు. అప్పటి నుంచి గుమ్మడికి ఎక్కువగా వృద్ధ పాత్రలే లభించేవి. ఒకే తరహా పాత్రలు వచ్చినా వాటిని తనదైన శైలిలో పోషించి అందర్నీ మెప్పించేవారు. ప్రతినాయక పాత్రల్లోనూ తేనె పూసిన కత్తిలా నటించడంలో గుమ్మడి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏ తరహా పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేసేవారు గుమ్మడి. చివరి రోజుల్లో తన గాత్రానికి సమస్య రావడంతో ఇతర ఆర్టిస్టులతో డబ్బింగ్‌ చెప్పారు. అలా చేయడానికి ఇష్టపడని గుమ్మడి ఆ తర్వాత సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపలేదు. ఒక పాత్రను పోషించడం అంటే నటించడం కాదు, జీవించడం అని నమ్మే గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి జూలై 9. ఈ సందర్భంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తోంది తెలుగువన్‌.

వేణుమాధవ్‌ రాసిన సీన్స్‌తో హిట్ కొట్టిన రాజమౌళి!

ప్రతి సినిమాలో అన్నింటినీ కమాండ్‌ చేసే అంశం కథ. ఒక బలమైన కథ ఉంటేనే దాన్ని అందంగా మలిచే కథనం పుడుతుంది. ఒకప్పుడు బౌండ్‌ స్క్రిప్ట్‌తోనే సెట్స్‌కి వెళ్ళేవారు. షూటింగ్‌ మొదలు పెట్టిన తర్వాత ఎలాంటి మార్పులు చేసేవారు కాదు. కాలంతోపాటు ఈ పద్ధతులు కూడా మారాయి. సినిమాకి సంబంధించిన ఫుల్‌ స్క్రిప్ట్‌ ఉన్నప్పటికీ ఒక్కోసారి షాట్‌ తీసే ముందు స్క్రిప్ట్‌లో మార్పులు చేయడం, అనవసరం అనుకున్న షాట్‌ను తీసేయడం, అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతో ఒక కొత్త షాట్‌ని క్రియేట్‌ చేయడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇంతకుముందు సినిమాలో నటించే ఆర్టిస్టులకు ఎవరికి ఎన్ని సీన్లు ఉంటాయి అనేది ముందే నిర్ధారించేవారు. ఆ విషయంలో ఫుల్‌ క్లారిటీ ఉండేది. ఒక్కోసారి ఒక సీన్‌ బాగా వచ్చింది అని అందరూ ఫీల్‌ అయితే దానికి కొనసాగింపుగా కొన్ని సీన్స్‌ను పెంచేవారు. కమెడియన్‌ వేణుమాధవ్‌ తను నటించిన కొన్ని సినిమాల్లోని కామెడీ ట్రాక్స్‌ కూడా తానే రాసుకుంటారన్న విషయం తెలిసిందే. అలా రాజమౌళి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా నటించిన ‘సై’ చిత్రంలోని కామెడీ ట్రాక్‌కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆయన జీవించి ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.  ఈ సినిమా ప్రారంభంలో కాలేజ్‌ స్టూడెంట్స్‌, వేణుమాధవ్‌ మధ్య వచ్చే సీన్‌ను అతనే రాసుకున్నాడు. ఎన్నికల ప్రచారం కోసం గోడలపై అభ్యర్థుల పేర్లు రాయించే వ్యక్తిగా వేణు కనిపిస్తాడు. ఆ సీన్‌లో రాజమౌళి కూడా నటించాడు. రాజమౌళి వచ్చి ‘అన్నా గోడలమీద రాయనీకి పర్మిషన్‌ కావాల్నంటనే..’ అంటాడు. అప్పుడు ‘పర్మిషనేందిరో.. గోడల మీద కాదురా.. గుండెల్లో కునుకు తీస్తా.. మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్‌ బెల్‌ కొట్టాలి.. నల్లబాలు.. నల్లత్రాచు లెక్క.. నాకి చంపేస్తా’ అంటూ వేణుమాధవ్‌ చెప్పిన డైలాగ్‌కి రాజమౌళి కట్‌ చెప్పడం కూడా మర్చిపోయి నవ్వుతూనే ఉన్నాడట. ఆ సీన్‌ బాగా వచ్చిందని అందరూ హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. టోటల్‌గా సినిమా షూటింగ్‌ పూర్తయిపోయిన తర్వాత ఎడిటింగ్‌లో చూసుకున్నప్పుడు వేణుమాధవ్‌ సీన్‌ బాగా వచ్చిందని, అలాంటి సీన్స్‌ మరో రెండు ఉంటే బాగుంటుందని ఎవరో సలహా ఇచ్చారట.  రాజమౌళికి కూడా అది నిజమేననిపించి వేణుమాధవ్‌కి విషయం చెప్పారు. అప్పుడు వేణుమాధవ్‌ సినిమాలో వున్న మెయిన్‌ క్యారెక్టర్స్‌ ఏమిటి అని అడిగి తెలుసుకొని ఎసిపి, విలన్‌లతో ఆ సీన్‌ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పాడు. ఆ రెండు సీన్స్‌ని తనే రాసుకొని చేసి చూపించాడు. రాజమౌళి ఓకే అన్నాడు. అలా ఏసీపీ అరవింద్‌ (సమీర్‌), భిక్షుయాదవ్‌ (ప్రదీప్‌ రావత్‌)లను బెదిరించే సన్నివేశాలు రాసి... అందులో నటించారు వేణుమాధవ్‌. విలన్‌ను బెదిరించే సన్నివేశాలను తీయడానికి ప్రదీప్‌ రావత్‌ హైట్‌కు సరిపోయే విధంగా వేణుమాధవ్‌కు ఒక పీట వేశారట. తను తక్కువ హైట్‌లో ఉండి తల ఎత్తి విలన్‌కి వార్నింగ్‌ ఇస్తేనే బాగుంటుందని చెప్పాడు వేణు. దాన్ని ఒకసారి చేసి చూపించాడు. ఇదే బాగుంది అని అతను చెప్పినట్టుగానే తీశారు రాజమౌళి. అలా ఒక సీన్‌ కాస్తా మూడు సీన్లకు పెరిగింది. ఆ రెండు సీన్స్‌ని షూట్‌ చేసి సినిమాలో యాడ్‌ చేయడం వల్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ పాళ్ళు పెరిగింది. ఈ సినిమాలోని ఆ కామెడీ ట్రాక్‌ను ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తూనే ఉంటారు.

ప్రపంచంలో మరో కీరవాణి లేరు.. ఆ పేరు వెనుక అంత కథ ఉంది!

‘మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది..’అంటూ యువతలో స్ఫూర్తి నింపారు. ‘అంతా రామ మయం..’ అంటూ భక్తుల్ని పరవశింప జేశారు. ‘తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో..’ అంటూ ప్రేమికుల గుండెల్లో తీయని రాగాలు పలికించారు. ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా..’ అంటూ దేశభక్తిని ప్రభోదించారు. ‘రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే..’ అంటూ జీవిత సత్యాన్ని తెలిపారు. మూడు దశాబ్దాలుగా సంగీత ప్రియుల్ని సప్త స్వరాల్లో ఓలలాడిస్తున్న స్వరవాణి ఎం.ఎం.కీరవాణి పుట్టినరోజు జూలై 4. ఈ సందర్భంగా ఆయన సంగీత దర్శకుడిగా ఎదిగిన వైనం, అధిరోహించిన కీర్తి శిఖరాల గురించి తెలుసుకుందాం. కీరవాణి.. సంగీతంలో ఇది ఒక రాగం పేరు. ఈ పేరుతో ప్రపంచంలో మరెవ్వరూ లేరు అంటే ఆశ్చర్యం కలగక మానదు. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా ఆ పేరు పెట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దాదాపు 70 సంవత్సరాల క్రితం విడుదలైన ‘విప్రనారాయణ’ చిత్రాన్ని చూసిన శివశక్తి దత్తాకు అందులోని ఒక పాట బాగా నచ్చింది. ‘ఎందుకోయి తోటమాలి.. అంతులేని యాతనా.. ఇందుకేనా’ అంటూ సముద్రాల రాఘవాచార్య రాసిన ఈ పాటను ఎస్‌.రాజేశ్వరరావు కీరవాణి రాగంలో స్వరపరచగా, భానుమతి ఆలపించారు. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతిలపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ పాట శివశక్తి దత్తాను సంవత్సరాల తరబడి వెంబడిస్తూనే ఉంది. దాంతో కీరవాణి రాగంపైన మమకారం పెంచుకున్నారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే ‘విప్రనారాయణ’ విడుదలైన 7 సంవత్సరాల తర్వాత శివశక్తి దత్తా దంపతులకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు తనకెంతో ఇష్టమైన కీరవాణి అనే పేరు పెట్టేశారు. అలా ఇప్పటివరకు ఎవ్వరూ వినని పేరు పెట్టారు కీరవాణి తండ్రి.  1987 ప్రాంతంలో తెలుగు సంగీత దర్శకుడు చక్రవర్తి, మలయాళ సంగీత దర్శకుడు సి.రాజమణి దగ్గర సహాయకుడిగా చేరారు. చాలా సినిమాలకు పనిచేసిన తర్వాత 1990లో ‘కల్కి’ పేరుతో ప్రారంభమైన ఓ సినిమాకి సంగీత దర్శకత్వం వహించే ఛాన్స్‌ వచ్చింది. అయితే ఆ సినిమా షూటింగ్‌ జరగలేదు. ఆ సినిమా కోసం చేసిన పాటలు కూడా రిలీజ్‌ అవ్వలేదు. కీరవాణికి సంగీతంతోపాటు సాహిత్యం పట్ల కూడా మంచి ఆసక్తి ఉంది. అందుకే కొంతకాలం వేటూరి సుందరరామ్మూర్తి దగ్గర శిష్యరికం చేశారు.  సంగీత దర్శకుడిగా అవకాశం సంపాదించుకోవడం కోసం కొన్ని ట్యూన్స్‌ని రికార్డ్‌ చేసి 51 కాపీలను క్యాసెట్ల రూపంలో సిద్ధం చేశారు. వాటిని తన బంధువైన విజయేంద్రప్రసాద్‌తో కలిసి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల ఇళ్ళకు వెళ్ళి వారికి ఇచ్చారు. సంగీత దర్శకుడిగా అవకాశం ఇస్తే మంచి సంగీతం ఇవ్వగలను అని చెప్పారు. వేటూరి దగ్గర శిష్యరికం కారణంగా రామోజీరావు 1990లోనే నిర్మించిన ‘మనసు మమత’ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇప్పించారు. ఆ సినిమా పాటలు మంచి హిట్‌ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించిన తర్వాత వెంకటేశ్‌, శ్రీదేవి జంటగా రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన ‘క్షణక్షణం’ చిత్రానికి మ్యూజిక్‌ చేసే ఛాన్స్‌ వచ్చింది. సంగీత దర్శకుడిగా కీరవాణికి బ్రేక్‌ ఇచ్చిన సినిమా అదే.  ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులు చేసిన చాలా సినిమాలకు సూపర్‌హిట్‌ సాంగ్స్‌ని అందించారు. కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లోనే 23 సినిమాలు చేసారు. అవన్నీ మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి.  కీరవాణి కెరీర్‌లో మైలు రాళ్ళుగా చెప్పుకోదగిన సినిమాలు ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’. అలాగే ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు కీరవాణి సంగీత దర్శకుడు. ‘బాహుబలి’ సిరీస్‌ సంగీత దర్శకుడిగా ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఘరానా మొగుడు, అల్లరి మొగుడు, పెళ్లిసందడి వంటి ఎన్నో కమర్షియల్‌ సినిమాలకు సూపర్‌హిట్‌ సాంగ్స్‌ని అందించిన ఘనతను సాధించారు కీరవాణి. తన కెరీర్‌లో మొత్తం 200కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. వాటిలో ఎక్కువ శాతం మ్యూజికల్‌గా సూపర్‌హిట్‌ అయ్యాయి.  కీరవాణిలో సంగీత దర్శకుడే కాదు, చక్కని గాయకుడు, భావుకత కలిగిన రచయిత కూడా ఉన్నాడు. ‘మాతృదేవోభవ’ చిత్రంలోని ‘రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే..’ పాటతో తొలిసారి సింగర్‌గా మారారు. ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ని ఆయన ఆలపించారు. అలాగే తన కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో పాటలకు సాహిత్యాన్ని కూడా అందించారు కీరవాణి. ‘బాహుబలి2’లోని ‘దండాలయ్యా..’ సాంగ్‌కి ఉత్తమ గేయరచయితగా ఫిలింఫేర్‌ అవార్డును అందుకున్నారు.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. అలాగే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇవికాక ‘అన్నమయ్య’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక నంది అవార్డులు, తమిళనాడు స్టేట్‌ అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు కీరవాణి ఖాతాలో చాలానే ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ ట్రెండ్‌కి తగినట్టుగా తన బాణీలను మార్చుకుంటూ సంగీత దర్శకుడిగా ఇప్పటికీ టాప్‌ పొజిషన్‌లో ఉన్న యం.యం.కీరవాణి పుట్టినరోజు జూలై 4. ఈ సందర్భంగా ఆబాలగోపాలాన్నీ అలరిస్తున్న స్వరవాణి కీరవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.  

సావిత్రిని ‘బ్రహ్మ రాక్షసి’ అని తిట్టిన ఎస్‌.వి.రంగారావు.. దానికామె ఏం చేసిందో తెలుసా?

పాతతరం నటుల ప్రస్తావన వస్తే మొదట చెప్పుకునే ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ తర్వాత ఖచ్చితంగా వినిపించే పేరు ఎస్‌.వి.రంగారావు. పౌరాణికమైనా, సాంఘికమైనా.. అది ఎలాంటి క్యారెక్టర్‌ అయినా అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల్ని రంజింపజేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తన సహజ సిద్ధమైన నటనతో ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పోషించిన ఎస్వీఆర్‌ సినీ జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి, ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. కొందరు నటీనటులతో, దర్శకులతో విభేదించినా నటుడిగా ఆయనకు వున్న విలువ ఏమాత్రం తగ్గేది కాదు. కొన్ని పాత్రలు ఆయన కోసమే పుట్టాయా అనిపిస్తాయి. మరికొన్ని పాత్రలు ఎస్వీఆర్‌ తప్ప మరెవ్వరూ చెయ్యలేరు అనేంతగా అలరిస్తాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒక మహానటుడిగా తన ముద్ర వేసిన ఎస్‌.వి.రంగారావు జయంతి జూలై 3. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలు, వివాదాల గురించి తెలుసుకుందాం. మహానటి సావిత్రి సెట్‌లో ఉన్నారంటే.. ఆరోజు జరిగే సీన్‌లో నటించే మిగతా నటీనటులకు ఆందోళనగానే ఉండేది. ఎందుకంటే ఎదుట ఉన్నవారు నటనలో ఎంతటి దిగ్గజమైనా తన హావభావాలతో వారిని మట్టి కరిపిస్తుంది. అలాంటి పేరున్న సావిత్రి నటించిన ఓ తమిళ సినిమా షూటింగ్‌ సమయంలో ఒక తమాషా అయిన సంఘటన జరిగింది. ఆ సినిమాలో సావిత్రితోపాటు శివాజీ గణేశన్‌, ఎస్‌.వి.రంగారావు కూడా నటిస్తున్నారు. ఆరోజు ఓ సీన్‌ చిత్రీకరణ ముగ్గురితో జరగాల్సి ఉంది. శివాజీ గణేశన్‌ తన మేకప్‌ పూర్తి చేసుకొని సెట్‌కి వచ్చారు. అదే సమయంలో ఎస్వీఆర్‌ కూడా రావడంతో ఆయన పాదాలకు నమస్కరించి.. ‘ఈ ఒక్క సీన్‌ అయినా నాకు వదిలిపెట్టరా రాక్షసుడా..’ అన్నారట. దానికి ఎస్వీఆర్‌ పగలబడి నవ్వి ‘ఒక్కసారి వెనక్కి చూడరా.. అక్కడ బ్రహ్మరాక్షసి ఉంది. మనిద్దరినీ మింగేస్తుంది’ అని సావిత్రిని ఉద్దేశించి అన్నారట.  అది విన్న సావిత్రి రాక్షసిలా వికటాట్టహాసం చేసి అందర్నీ నవ్వించారు.  ఎస్వీఆర్‌ సెట్‌లో ఎంత సరదాగా ఉంటారో.. అంతే మొండితనం కూడా ప్రదర్శిస్తారు. ఒక్కోసారి దర్శకులతో కూడా గొడవకు దిగుతుంటారు. అలాంటి ఓ ఘటన దర్శకరత్న దాసరి నారాయణరావు, ఎస్వీఆర్‌ మధ్య జరిగింది. దాసరి తొలి చిత్రం ‘తాత మనవడు’ ఆరోజుల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఎస్వీఆర్‌ తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఆ సినిమాను నిర్మించిన కె.రాఘవ.. తదుపరి సినిమా కూడా దాసరి డైరెక్షన్‌లోనే చేశారు. ఆ సినిమా పేరు ‘సంసారం సాగరం’. ఈ సినిమా షూటింగ్‌లో దాసరి, ఎస్వీఆర్‌ మధ్య ఓ వివాదం జరిగింది.  జయంతితో కలిసి నటించే ఆ సీన్‌కి సంబంధంచిన డైలాగ్‌ పేపర్స్‌ చూస్తూ విసుక్కున్నారు ఎస్వీఆర్‌. ‘ఈ సీన్‌లో ఇంత లెంగ్తీగా ఉండే డైలాగ్స్‌ అవసరం లేదు’ అంటూ అందులోని కొన్ని డైలాగ్స్‌ తొలగించారు ఎస్వీఆర్‌. అది చూసిన దాసరి అవి తర్వాతి సీన్‌కి, క్లైమాక్స్‌కి లింక్‌ అయి ఉన్న డైలాగులని, తప్పనిసరిగా అవి ఉండాల్సిందేనని పట్టుపట్టారు. ఆ మాటకు కోపం తెచ్చుకున్న ఎస్వీఆర్‌ ‘నేను ఇంత సీనియర్‌ని నాకే ఎదురు చెప్తావా?’ అంటూ షూటింగ్‌ స్పాట్‌ నుంచి బయటికి వచ్చేసి కారులో వెళ్లిపోయారు. ఆ కారు వెనుక నిర్మాత రాఘవ మరో కారులో బయల్దేరారు. ఎస్వీఆర్‌ కారును రాఘవ ఛేజ్‌ చేయడం మొదలు పెట్టారు. మధ్యలోనే ఎస్వీఆర్‌ తన కారును ఆపి యూ టర్న్‌ తీసుకొని సరాసరి సెట్‌కి వచ్చేశారు. అది చూసి సెట్‌లోని వారు, ఆయన వెనకే వచ్చిన రాఘవ.. అందరూ ఆశ్చర్యపోయారు. ‘నువ్వు రాసిన డైలాగులే చెప్తానులే’ అంటూ ఆ సీన్‌ పూర్తి చేశారు ఎస్వీఆర్‌. షూటింగ్‌ పూర్తయిన తర్వాత ‘నేను చెప్పాను కదా అని నువ్వు డైలాగుల్ని తగ్గించుకోలేదు. డైరెక్టర్‌ అంటే నీలాగే ఉండాలి. తప్పకుండా నువ్వు పెద్ద డైరెక్టర్‌ అవుతావు’ అని దాసరిని మెచ్చుకుంటూ ఆశీర్వదించారు.  సినిమా రంగంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. కొన్ని విషయాల్లో దర్శకనిర్మాతలు, నటీనటులు పట్టుదలతో ఉంటారు. అయితే అది సినిమా ఔట్‌పుట్‌ బాగా రావడానికి వారు పడే తపనే తప్ప ఒకరిపై మరొకరికి ఎలాంటి పగలు, ద్వేషాలు ఉండవు. ఇలాంటి వివాదాలు ఎస్వీ రంగారావు సినీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా ఆయనలోని మహానటుడ్నే చూసేవారు దర్శకనిర్మాతలు. ఎస్వీఆర్‌ మనకు దూరమై 50 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ స్మరించుకుంటున్నామంటే.. అదే ఆయనలోని గొప్పతనం. జూలై 3 ఎస్వీఆర్‌ జయంతి సందర్భంగా ఆ మహానటుడికి ఘనంగా నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.

హత్య కేసులో సూపర్‌స్టార్‌ జైలు పాలు... 90 ఏళ్ళ క్రితం లక్ష రూపాయలు తీసుకున్నారు

సినిమా రంగంలోని ఎంతో మంది నటీనటులు వివిధ కారణాలతో, వివిధ నేరారోపణలతో జైలు జీవితాన్ని అనుభవించినవారు ఉన్నారు. తాజాగా కన్నడ హీరో దర్శన్‌ ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ తరహా ఘటనతోనే దాదాపు 90 ఏళ్ళ క్రితం మొట్ట మొదటి సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఎం.కె.టి. త్యాగరాజ భాగవతార్‌ ఓ హత్య కేసులో రెండున్నర సంవత్సరాలపాటు జైలు జీవితాన్ని అనుభవించారనే విషయం ఇప్పటి తరం వారికి తెలియదు.   ఎం.కె.టి. త్యాగరాజ భాగవతార్‌. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన భాగవతార్‌ తన 16వ ఏట నుంచే సంగీత కచ్చేరీలు చేయడం ప్రారంభించాడు. అతని సంగీతం వింటూ ప్రజలు మంత్రముగ్ధులయ్యేవారు. భారతదేశంలోనే కాదు, శ్రీలంక, నేపాల్‌, బర్మా వంటి దేశాల్లో కూడా ఆయనకు ప్రజాదరణ ఎక్కువగా ఉండేది. సంగీత కచ్చేరీలతోపాటు రంగస్థలం మీద నాటకాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు భాగవతార్‌.  1934లో సినీ రంగ ప్రవేశం చేసిన భాగవతార్‌ ‘పావలక్కోడి’ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాదు, ఇందులో భాగవతార్‌ పాడిన పాటలకు విపరీతమైన ఆదరణ లభించింది. ఈ సినిమాలో 50 పాటలు ఉండడం విశేషం. హీరోగా మొదటి సినిమాతోనే క్రేజ్‌ సంపాదించుకున్న ఆయన 1944 వరకు కేవలం 9 సినిమాల్లో మాత్రమే నటించారు. 100 సినిమాలు చేస్తేనే గానీ రాని ఖ్యాతి ఈ 9 సినిమాలతోనే లభించింది. సూపర్‌స్టార్‌ అనే పేరును సంపాదించి పెట్టింది. హీరోగానే కాదు ఒక దైవంగా ఆయన్ని ప్రేక్షకులు ఆరాధించేవారు. ఆయన నడిచి వెళ్లిన దారిలోని మట్టిని వెండి బరిణల్లో దాచుకునేవారట. ఆయన కారు నుంచి వచ్చిన ధూళిని విభూదిలా నుదుటన పెట్టుకునేవారట. ఆరోజుల్లో ఒక్క సినిమాకి భాగవతార్‌ లక్ష రూపాయల పారితోషికం తీసుకునేవారంటే ఆయనకు ఎంత పాపులారిటీ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో, దేవాలయాల్లో కచ్చేరీలు చేస్తే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకునేవారు కాదు. వ్యక్తిగతంగా అంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఎం.కె.టి. త్యాగరాజ భాగవతార్‌కి జైలుకి వెళ్ళాల్సిన దుస్థితి ఎందుకు పట్టింది? ఒక వ్యక్తిని హత్య చేయించాల్సిన అవసరం ఆయనకేమిటి? ఆ వివరాల్లోకి వెళితే.. అతని పేరు ఎన్‌.సి.లక్ష్మీకాంతన్‌.. నిరుపేద కుటుంబంలో పుట్టాడు. మోసాలు, ఫోర్జరీలు చేసేవాడు. ఆ క్రమంలోనే ఒక పత్రికను కొని దాన్ని ఎల్లో జర్నలిజానికి వాడుకునేవాడు. ప్రముఖులపై తప్పుడు కథనాలు రాస్తూ ఉండేవాడు. రాసే ముందు వారికి విషయం చెప్పి డబ్బు ఇమ్మని బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. కొందరు ఇచ్చేవారు, కొందరు ఇచ్చేవారు కాదు. అలా.. భాగవతార్‌ని, అతని సన్నిహితుడైన హాస్యనటుడు ఎన్‌.ఎస్‌.కృష్ణన్‌ని కూడా బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఈ విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాడు భాగవతార్‌. లక్ష్మీకాంతన్‌ని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఆ సమయంలోనే భాగవతార్‌ నటించిన ‘హరిదాసు’ చిత్రం 1944 దీపావళికి విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ ఒక్క సినిమా విజయంతోనే 12 సినిమాల్లో బుక్‌ అయ్యారు భాగవతార్‌. ‘హరిదాసు’ ఒకే థియేటర్‌లో 1946వ సంవత్సరం దీపావళి వరకు ప్రదర్శితమైంది. ఆ విజయాన్ని ఆనందించకుండానే భాగవతార్‌ జీవితంలోకి చీకటి ప్రవేశించింది.  జైలు నుంచి వచ్చిన లక్ష్మీకాంతన్‌ హిందు నేషన్‌ అనే మరో పత్రిక పెట్టాడు. యధావిధిగా ప్రముఖుల్ని టార్గెట్‌ చేస్తూ అవాకులు, చవాకులు రాసేవాడు. అలా పత్రిక మీద చాలా సంపాదించాడు. సొంతంగా ప్రెస్‌ పెట్టాడు. ఒక ఇల్లు కూడా కొన్నాడు. అయితే ఆ ఇంట్లో ది హిందులో పనిచేసే వడివేలు అనే వ్యక్తి ఉండేవాడు. అతన్ని ఖాళీ చెయ్యమంటే.. నేను చెయ్యను అన్నాడు. వడివేలు అతని మరదలితో కలిసి ఉండేవాడు. అతను ఖాళీ చెయ్యను అన్నాడన్న కోపంతో అతని గురించి, అతని మరదలి గురించి పత్రికలో అసభ్యంగా రాశాడు. అలా రాసినందుకు మరింత రగిలిపోయిన వడివేలు ఇల్లు ఖాళీ చెయ్యను. ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. అతన్ని ఖాళీ చేయించేందుకు కోర్టులో పిటిషన్‌ వేశాడు లక్ష్మీకాంతన్‌. ఆ కేసు నవంబర్‌ 10న విచారణకు రావాల్సి ఉంది. నవంబర్‌ 8న తన లాయర్‌ని కలిసేందుకు రిక్షాలో వెళుత్ను లక్ష్మీకాంతన్‌పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడిచేసి గాయపరిచారు. అతను చికిత్స పొందుతూ నవంబర్‌ 9న చనిపోయాడు. ఇక ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. లక్ష్మీకాంతన్‌ అంతకుముందు ఎవరి గురించి చెడుగా రాసాడో వాళ్ళందరూ కక్ష పెంచుకొని ఉంటారన్న ఉద్దేశంతో వారిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆ క్రమంలోనే సినిమాల్లో స్టంట్‌ మాస్టర్‌గా పనిచేసే ఆర్య వీరసేనన్‌ను, ఒక కానిస్టేబుల్‌ని కూడా అరెస్ట్‌ చేశారు. చివరగా భాగవతార్‌ని, ఎన్‌.ఎస్‌.కృష్ణన్‌ని అరెస్ట్‌ చేశారు. అప్పుడు జైలుకు వెళ్లిన భాగవతార్‌ 30 నెలల వరకు బయటికి రాలేకపోయారు.  ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. తనతోపాటు వడివేలును కూడా లక్ష్మీకాంతన్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న భాగవతార్‌.. వడివేలుతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడని ఆరోపించింది. దానికి మిత్రులు, ఒక కానిస్టేబుల్‌ సహకారం కూడా ఉందని తేల్చింది. దీంతో ప్రధాన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కేసును లండన్‌ తరలించేందుకు అనుమతి కోరారు భాగవతార్‌. ఎందుకంటే అప్పటికి ఇండియాలో సుప్రీమ్‌ కోర్టు లేదు. లండన్‌ కోర్టు.. మద్రాస్‌ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. వారే హత్య చేయించారని ఎక్కడా నిరూపణ కాలేదని చెబుతూ భాగవతార్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.  జైలు నుంచి వచ్చిన తర్వాత భాగవతార్‌లో చాలా తేడా వచ్చింది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అతని జీవితంలో ఒక నిర్లిప్తత అనేది వచ్చింది. జైలు నుంచి వచ్చినప్పటికీ అతనికి జనంలో అదే పాపులారిటీ ఉంది. అంతకుముందు 12 సినిమాలకు తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేశారు. మళ్ళీ ఏ నిర్మాత దగ్గరా అడ్వాన్స్‌ తీసుకోలేదు. తనే సొంతంగా 1959 వరకు సినిమాలు నిర్మించారు. కానీ, ఒక్క సినిమా కూడా హిట్‌ అవ్వలేదు. ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఎందుకంటే అతను జైలు నుంచి వచ్చే సమయానికి సినిమాల తీరు తెన్నులు మారిపోయాయి. కొత్త నటీనటులు వచ్చేశారు. భాగవతార్‌ చేసే సినిమాలకు ఆదరణ కరవైంది. మానసికంగా కుంగిపోయిన భాగవతార్‌ అనారోగ్య కారణాల వల్ల తన 49వ ఏటనే తుదిశ్వాస విడిచారు.

గిన్నిస్‌బుక్‌ రికార్డ్స్‌లో లతా మంగేష్కర్‌.. వివాదం తేలకుండానే కన్నుమూసారు!

మహ్మద్‌ రఫీ, లతా మంగేష్కర్‌ బాలీవుడ్‌లో లెజెండరీ సింగర్స్‌గా పేరు సంపాదించుకున్నారు. హిందీలోనే కాదు పలు భాషల్లో తమ గాన మాధుర్యంతో శ్రోతలను అలరించారు. సమకాలీనులు కావడంతో ఇద్దరూ కలిసి కొన్ని వందల పాటలు పాడారు. మహ్మద్‌ రఫీ ఇండస్ట్రీకి లత కంటే మూడు సంవత్సరాలు ముందే వచ్చారు. ఆయన పాడిన తొలిపాట 1944లో రికార్డ్‌ అయింది. లతా మంగేష్కర్‌ పాడిన తొలిపాటను 1947లో రికార్డ్‌ చేశారు. అయితే రఫీ కంటే వేగంగా లత పాడిన పాటల సంఖ్య పెరిగింది.  1977 నాటికి లత 25,000 పాటలను పూర్తి చేశారు. దాంతో అత్యధిక పాటలు పాడిన గాయనిగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఆమె ఈ ఘనత సాధించడం మహ్మద్‌ రఫీకి బాధ కలిగించింది. నిజానికి వారిద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఒకరి మీద ఒకరికి అపారమైన గౌరవం ఉంది. రఫీ ఈ విషయం గురించి బాధ పడడానికి కారణం.. రికార్డు స్థాయిలో పాటలు పాడిన ఘనత తనకే దక్కాలని మొదటి నుంచి భావించేవారు. లత ఆ ఘనత సాధించినప్పటికీ దాన్ని ఆయన ఒప్పుకునేవారు కాదు. లత కంటే తనకే ఆ బుక్‌లో స్థానం సంపాదించే అర్హత ఉందని వాదించేవారు.  గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 1977 ఎడిషన్‌లో లతా మంగేష్కర్‌ సాధించిన ఘనత గురించి పేర్కొన్న వివరాలు.. గ్రామ్‌ఫోన్‌ సినిమా అనే కేటగిరిలో లతా మంగేష్కర్‌ అత్యధిక పాటలు పాడారు. 1948-74 మధ్యకాలంలో ఆమె 25 వేలకు తక్కువ కాకుండా పాటలు పాడారు. సోలో, డ్యూయెట్‌, కోరస్‌, గ్రూప్‌ సాంగ్స్‌ను 20 భారతీయ భాషల్లో ఆమె ఆలపించారు. రోజుకి ఆమె ఐదు షిఫ్టుల చొప్పున పనిచేశారు. 1974లోనే దాదాపు 1800 పాటలు పాడారు అంటూ ఆ బుక్‌లో ప్రచురించారు.  లతా మంగేష్కర్‌ సాధించిన ఈ రికార్డ్‌ను సవాల్‌ చేస్తూ మహ్మద్‌ రఫీ గిన్నిస్‌ బుక్‌ ప్రచురణ కర్తలకు 1977, జూన్‌ 11న ఓ లేఖ రాశారు. ‘1944 నుంచి నేను సినిమా రంగంలో ఉన్నాను. సినీరంగానికి, సినీ సంగీతానికి నేను చేసిన సేవలకు తగిన గుర్తింపు రావాలని కోరుకోవడం అత్యాశ కాదని నా అభిప్రాయం. 1944లో సింగర్‌గా నా కెరీర్‌ను ప్రారంభించాను. నేను పాడిన 23,000 పాటలు రికార్డ్‌ అయ్యాయి. దానికి సంబంధించిన ఆధారాలను కూడా జత చేస్తున్నాను. లతా మంగేష్కర్‌ 1947లో తన కెరీర్‌ను స్టార్ట్‌ చేసింది. నా కంటే జూనియర్‌ అయిన లత నా కంటే ఎక్కువ పాటలు ఎలా పాడగలదు? మీరు ఈ సంవత్సరం ఎడిషన్‌లో పేర్కొన్నట్టుగా లత ఐదు షిఫ్టుల్లో ఎప్పుడూ పాటలు పాడలేదు. అది వాస్తవం కాదు. రోజుకి ఒక పాట కంటే ఎక్కువ రికార్డ్‌ అయిన సందర్భాలు కూడా చాలా తక్కువ. 30 ఏళ్ళ కెరీర్‌లో 25,000 పాటలు పాడినట్టు చెప్పడం కూడా కరెక్ట్‌ కాదు. రోజుకి ఒక పాట చొప్పున లెక్క వేస్తే 9,300 పాటలు మాత్రమే అవుతాయి. నేను రోజుకి రెండు పాటలు పాడాను. కొన్నిసార్లు రోజుకి 5 పాటలు కూడా పాడానని ప్రూవ్‌ చేయగలను. అందువల్ల  నిజాయితీ కలిగి వున్న ఏదైనా భారతీయ ఏజెన్సీ ద్వారా నిజానిజాలు తేల్చాలి. అది తేలేవరకూ ఈ రికార్డ్‌కు సంబంధించిన పేజీని ఖాళీగా ఉంచాలని కోరుతున్నాను’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.  లేఖను అందుకున్న గిన్నిస్‌ బుక్‌ పబ్లిషర్స్‌ ‘మీరు ప్రస్తావించిన విషయాల గురించి పరిశీలిస్తాం’ అని హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాతి రెండు సంవత్సరాలు ప్రచురించిన గిన్నిస్‌ బుక్‌లో లతా మంగేష్కర్‌ పేరే ఉంది. దీంతో రఫీ ఇరిటేట్‌ అయిపోయేవారు. తను పాడిన పాటల వివరాలను మూడుసార్లు గిన్నిస్‌ బుక్‌ సంస్థకు పంపారు. వాటితోపాటు లేఖలు కూడా రాశారు. కానీ, ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ వివాదం తేలకుండానే 1980 జూలై 31న మహ్మద్‌ రఫీ కన్నుమూసారు. 1984లో విడుదలైన గిన్నిస్‌ బుక్‌ ఎడిషన్‌లో అత్యధిక పాటలు పాడిన గాయనిగా లత పేరును ఉంచుతూనే 1944 నుంచి 1980 వరకు 11 భాషల్లో 28,000 పాటలు పాడానని మహ్మద్‌ రఫీ స్వయంగా పేర్కొన్నారని గిన్నిస్‌బుక్‌లో ప్రచురించారు. ఆ తర్వాత 1991లో విడుదలైన గిన్నిస్‌బుక్‌ ఎడిషన్‌లో లతా మంగేష్కర్‌, మహ్మద్‌ రఫీ పేర్లను తొలగించారు.

ఎన్నికల్లో ప్రభంజనం.. ఈ సినిమాతోనే ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు!

నటరత్న ఎన్‌.టి.రామారావు తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన సినిమా ‘మనదేశం’. ఈ సినిమా 1949లో విడుదలైంది. అలాగే ఆయన చివరగా నటించే సినిమా అంటూ ప్రచారం పొందిన సినిమా ‘నా దేశం’. ఈ సినిమా 1982లో విడుదలైంది. ఎన్టీఆర్‌ జీవితంలో 1982 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే జస్టిస్‌ చౌదరి, బొబ్బిలిపులి, నాదేశం.. ఈ మూడు సినిమాలు రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించాయి. ఎన్టీఆర్‌ రాజకీయంగా విజయపథంలో పయనించేందుకు, ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ సినిమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాగే ఎన్టీఆర్‌ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించారు. అప్పటికే ఎన్టీఆర్‌ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయనతో సినిమాలు చెయ్యాలని ఎంతో మంది నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇక ఎన్టీఆర్‌ సినిమాలు చెయ్యరు అని  ప్రచారం మొదలైపోయింది.  అప్పుడు నిర్మాత దేవీవరప్రసాద్‌ని పిలిపించారు ఎన్టీఆర్‌. ఆయన వచ్చేసరికి అక్కడ ఎస్‌.వెంకటరత్నం, కృష్ణంరాజు అనే నిర్మాతలు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడివిడిగా మీకు సినిమాలు చెయ్యలేనని, ముగ్గురూ కలిసి ఒక సినిమా చేసుకోమని చెప్పారు ఎన్టీఆర్‌. అలా ఆయన నటించే చివరి సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే సినిమా ప్రారంభం కాకముందే కొన్ని భేదాభిప్రాయాల వల్ల నిర్మాత కృష్ణంరాజు తప్పుకున్నారు. కాల్షీట్స్‌ ఇచ్చే ముందు ‘పదిరోజుల్లో స్క్రిప్ట్‌ రెడీ అయిపోవాలి.. మరో 18 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేయాలి’ అని కండిషన్‌ పెట్టారు ఎన్టీఆర్‌. కొత్త కథ రెడీ చెయ్యాలంటే సమయం పడుతుంది కాబట్టి హిందీ సినిమా ‘లావారిస్‌’ని రీమేక్‌ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది నిర్మాతలకు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కి చెప్పారు. ఆ సినిమా చూసేంత తీరిక తనకు లేదని, పరుచూరి బ్రదర్స్‌ని చూసి స్క్రిప్ట్‌ రెడీ చేయమని చెప్పండి అన్నారు ఎన్టీఆర్‌. అప్పటికే ఎంతో బిజీ రైటర్స్‌ అయిన పరుచూరి బ్రదర్స్‌ని ఎలాగోలా ఒప్పించి స్క్రిప్ట్‌ రెడీ చేయించారు నిర్మాతలు.  1982 జూలై 22న ‘నా దేశం’ చిత్రాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముహూర్తపు షాట్‌ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అప్పుడు మేకప్‌ రూమ్‌లోకి వెళ్ళిన ఎన్టీఆర్‌ను ఆయన కుమారుడు జయకృష్ణ కలిసి హిందీలో లావారిస్‌ ఫ్లాప్‌ సినిమా అనీ, దాన్ని రీమేక్‌ చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని చెప్పాడు. దీంతో ఆలోచనలో పడ్డారు ఎన్టీఆర్‌. ఇది తెలుసుకున్న నిర్మాతలు టెన్షన్‌తో వణికిపోయారు. ఎంతో ఆలోచించిన తర్వాత ఎన్టీఆర్‌ సినిమా చేయడానికే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ముహూర్తపు షాట్‌ వరకు వచ్చిన సినిమాను ఆపెయ్యమని చెప్పడం తనకు శ్రేయస్కరం కాదని భావించిన ఎన్టీఆర్‌ ఎలా జరిగేది అలా జరుగుతుంది అంటూ ప్రొసీడ్‌ అయ్యారు. అలా ప్రారంభమైన ‘నా దేశం’ చిత్రాన్ని షూటింగ్‌, డబ్బింగ్‌ కలిపి 25 రోజుల్లో పూర్తి చేశారు ఎన్టీఆర్‌. రోజుకి లక్ష రూపాయల చొప్పున 25 రోజులకు ఎన్‌.టి.ఆర్‌కు 25 లక్షల రూపాయలు పారితోషికంగా నిర్మాతలు చెల్లించారు.  1982లో విడుదలైన జస్టిస్‌ చౌదరి, బొబ్బిలిపులి, నా దేశం చిత్రాలు ఎన్టీఆర్‌ రాజకీయ ప్రభంజనానికి ఎంతగానో దోహదపడ్డాయి. ‘నా దేశం’ చిత్రంలో పరుచూరి బ్రదర్స్‌ ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ రాశారు. ‘మీరు రాజకీయం నేర్చుకోవడానికి 35 ఏళ్ళు పట్టింది. నేను దాన్ని మూడు నెలల్లోనే అవపోసన పట్టాను’ అని ఎన్టీఆర్‌ చెప్పిన ఈ డైలాగ్‌ జనంలోకి బాగా దూసుకెళ్ళింది. ‘ఈ ఒక్క డైలాగ్‌ ద్వారా కోట్లాది మంది ప్రజలకు మా సందేశం వెళ్ళిపోతుంది బ్రదర్‌’ అని ఎన్టీఆర్‌ అన్నారు. 1982 అక్టోబర్‌ 27న ‘నా దేశం’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. రూ.45 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా కోటి రూపాయలు వసూలు చేసింది. కోటి రూపాయలు అంతకు మించి కలెక్షన్‌ సాధించిన ఎన్టీఆర్‌ సినిమాల్లో ‘నా దేశం’ 12వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైన 70 రోజులకు ఎన్‌.టి.రామారావు ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ‘నా దేశం’ తర్వాత ఎన్టీఆర్‌ మళ్ళీ సినిమాల్లో నటించరు అనే ప్రచారం బాగానే జరిగినప్పటికీ ఓ కళాకారుడిగా సినిమాలను విస్మరించలేదు. తన వీలును బట్టి కొన్ని సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్‌ నటించిన చివరి చిత్రం బాపు దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’.

మనీషా కోయిరాలా మృతి.. పేపర్‌లో ప్రకటన ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగింది?

ఒక మంచి సినిమా తియ్యాలంటే యూనిట్‌లోని అందరి సహకారం దర్శకుడికి ఉండాలి. ఆ సినిమాని జనరంజకంగా తీర్చి దిద్దే బాధ్యత దర్శకుడిదే అవుతుంది. ఆర్టిస్టుల నుంచి మంచి నటన రాబట్టుకోవడం, సాంకేతిక నిపుణుల నుంచి మంచి ఔట్‌పుట్‌ తీసుకోవడం అతని పని. ఇవన్నీ సక్రమంగా జరిగినపుడే ఒక మంచి సినిమా తయారవుతుంది. సినిమా పూర్తయిన తర్వాత దాన్ని రిలీజ్‌ చేయడం, జనంలోకి ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్ళడం నిర్మాత పని. అంటే పబ్లిసిటీ అనే ప్రక్రియను సక్రమంగా వినియోగించుకున్నప్పుడే వారు చేసిన సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరుగుతాయి.  ఈ విషయంలో కొందరు వక్రమార్గాన్ని కూడా ఎన్నుకుంటారు. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ‘క్రిమినల్‌’ విషయంలో ఇదే జరిగింది. సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో నిర్మాత ముఖేష్‌ భట్‌ చేసిన ఒక క్రిమినల్‌ పనికి అందరూ షాక్‌ అయ్యారు. సినిమాని ప్రమోట్‌ చేసుకునే పద్ధతి ఇది కాదు అనీ, సినిమా కోసం ఇంతగా దిగజారిపోతారా అనీ, ప్రపంచంలోనే అతి పెద్ద వరస్ట్‌ పబ్లిసిటీ ఇదేననీ.. ఇలా నిర్మాత ముఖేష్‌ భట్‌ని చాలా దారుణంగా అందరూ విమర్శించారు. ఇంతకీ జరిగిందేమిటంటే.. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రల్లో మహేష్‌భట్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘క్రిమినల్‌’. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించారు. హరిసన్‌ ఫోర్డ్‌ హీరోగా నటించిన అమెరికన్‌ మూవీ ‘ది ఫగిటివ్‌’కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. తెలుగు 1994 అక్టోబర్‌ 14న తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ అవ్వగా, తొమ్మిది నెలల తర్వాత హిందీ వెర్షన్‌ 1995 జూలై 21న విడుదలైంది. తెలుగులో బిలో ఏవరేజ్‌ సినిమాగా నిలిచింది ‘క్రిమినల్‌’. అయితే మ్యూజికల్‌గా ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. ఈ సినిమాలోని ‘తెలుసా.. మనసా..’ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. హిందీలో కూడా ఈ పాట సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమాపై నాగార్జున చాలా హోప్స్‌ పెట్టుకున్నాడు. కానీ, అతన్ని నిరాశ పరచింది.  తెలుగు వెర్షన్‌కి కె.ఎస్‌.రామారావు నిర్మాత కాగా, హిందీ వెర్షన్‌కి మహేష్‌భట్‌ సోదరుడు ముఖేష్‌భట్‌ నిర్మాత. తెలుగులో రిలీజ్‌ అయిన 9 నెలల తర్వాత హిందీలో ఈ సినిమా రిలీజ్‌ అవడం, తెలుగులో సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో హిందీ వెర్షన్‌కి డిఫరెంట్‌గా పబ్లిసిటీ చెయ్యాలని అనుకున్నాడు ముఖేష్‌ భట్‌. అందులో భాగంగా పేపర్‌లో ఒక యాడ్‌ ఇచ్చాడు. ‘మనీషా కోయిరాలా మృతి’ అనే టైటిల్‌తో ఆ యాడ్‌ వచ్చింది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇండస్ట్రీలో ఆందోళన మొదలైంది.  మనీషా కోయిరాలాకు లెక్కకు మించిన కాల్స్‌ వచ్చాయి. విషయం తెలుసుకున్న మనీషా కూడా షాక్‌ అయింది. అలాంటి ఫాల్స్‌ పబ్లిసిటీ చేసిన నిర్మాత ముఖేష్‌ భట్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. అంతేకాదు, మీడియా నుంచి ఇండస్ట్రీ నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.  అలాంటి పబ్లిసిటీతో రిలీజ్‌ అయిన ‘క్రిమినల్‌’ హిందీ వెర్షన్‌ లాభాలను ఆర్జించింది. రెండు కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా నాలుగు కోట్ల బిజినెస్‌ చేసింది. ఈ సినిమా రిలీజ్‌ అయిన సమయంలోనే అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా నటించిన ‘హల్‌చల్‌’, ఆమిర్‌ఖాన్‌, రజినీకాంత్‌ కలిసి నటించిన ‘ఆతంక్‌ హి ఆతంక్‌’ సినిమాలు విడుదలయ్యాయి. కానీ, ఈ రెండు సినిమాల కంటే ‘క్రిమినల్‌’కే ఎక్కువ కలెక్షన్స్‌ రావడం విశేషం.

పవన్‌ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేసేందుకు చిరంజీవి ఏం చేశారో తెలుసా!

మెగాస్టార్‌ చిరంజీవి.. ఈ పేరు ఎందరికో స్ఫూర్తి. ఈయన సినిమా ప్రయాణం ఎంతో మంది కొత్త హీరోలకు ఆదర్శం. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం స్వయంకృషితోనే అంచెలంచెలుగా ఎదిగి అభిమానుల చేత మెగాస్టార్‌ అనిపించుకున్న చిరంజీవి తమ్ముడు ఇప్పుడు పవర్‌స్టార్‌గా అభిమాన గణాన్ని గణనీయంగా పెంచుకోవడానికి ముఖ్య కారణం మెగాస్టార్‌ వేసిన గట్టి పునాది. తన సోదరుడ్ని హీరోగా పరిచయం చెయ్యాలన్న ఆలోచన వచ్చిన తర్వాత ఒక పర్‌ఫెక్ట్‌ లాంచ్‌ కోసం మెగాస్టార్‌ ఎన్నో ప్రయత్నాలు చేశారు. పవన్‌కళ్యాణ్‌ చేసే మొదటి సినిమా మామూలుగా ఉండకూడదు అనుకున్నారు. అందుకే ఎంతో మంది డైరెక్టర్లను పరిశీలించిన తర్వాత ఆ బాధ్యతను ఇ.వి.వి.సత్యనారాయణకు అప్పగించారు.  బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌, జుహీచావ్లా జంటగా రూపొందిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ చిత్రాన్ని తెలుగులో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ పేరుతో రీమేక్‌ చెయ్యడం ద్వారా పవన్‌ను హీరోగా లాంచ్‌ చేసేందుకు నిర్ణయించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించారు. పవన్‌ ఎంట్రీ మామూలుగా ఉండకూడదనుకున్న చిరంజీవి ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీని కూడా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశారు. ముందుగా పవన్‌ కళ్యాణ్‌ ఫోటోతో ఒక పోస్టర్‌ను రిలీజ్‌ చేసి ‘ఈ అబ్బాయి ఎవరు?’ అంటూ అందరిలోనూ క్యూరియాసిటీ క్రియేట్‌ చేశారు. మరికొన్ని రోజులకు ‘ఎస్‌..ఈ అబ్బాయే కళ్యాణ్‌’ అంటూ రివీల్‌ చేశారు. అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియను ఎంపిక చేశారు. ఇద్దరు ప్రముఖ హీరోల వారసులు ఈ సినిమా ద్వారా పరిచయం కావడం అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైన తర్వాత జరిగిన ఒక భారీ ఈవెంట్‌లో ‘ఇతను నా తమ్ముడు పవన్‌కళ్యాణ్‌’ అంటూ వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు పరిచయం చేశారు చిరంజీవి. తొలి సినిమాతోనే తనేమిటో ప్రూవ్‌ చేసుకున్నారు పవన్‌. ఈ సినిమాలో అతను చేసిన సాహసాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. పవన్‌ చేతుల మీద నుంచి కార్లు వెళ్ళడం, అతని ఛాతిపై బండరాళ్ళు ఉంచి వాటిని సుత్తితో పగలగొట్టడం వంటి విన్యాసాల గురించి అప్పట్లో విపరీతంగా చర్చించుకున్నారు. పవన్‌ చేసిన ఈ ఎడ్వంచర్స్‌ చూసి ప్రేక్షకులు షాక్‌ అయ్యారు. ఈ సన్నివేశాలు చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న హీరోయిన్‌ సుప్రియ అది చూసి కన్నీళ్ళు పెట్టుకుందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఈ సినిమా ద్వారా పరిచయమైన సుప్రియకు హీరోయిన్‌గా ఇదే మొదటి సినిమా, చివరి సినిమా కూడా ఇదే. చాలా సంవత్సరాల తర్వాత ఆమధ్య వచ్చిన ‘గూఢచారి’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు సుప్రియ.  1996 అక్టోబర్‌ 11న విడుదలైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’  మంచి విజయాన్ని అందుకుంది. 32 కేంద్రాల్లో 50 రోజులు, 2 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై హీరోగా పవన్‌కి పర్‌ఫెక్ట్‌ లాంచ్‌ అయింది. అయితే ఈ సినిమాకి పవన్‌కళ్యాణ్‌ అందుకున్న పారితోషికం మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. షూటింగ్‌ జరిగినన్ని రోజులు పవన్‌కు నెలకి రూ.5 వేలు చొప్పున ఇచ్చారు నిర్మాత అల్లు అరవింద్‌. ఈ సినిమా విడుదలై దాదాపు 30 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పుడు పవర్‌స్టార్‌గా పవన్‌కళ్యాణ్‌ రేంజ్‌ ఏమిటో అందరికీ తెలిసిందే. పవన్‌తో సినిమా చెయ్యాలంటే నిర్మాత అతనికి ఎంత ముట్టజెప్పాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతో సక్సెస్‌ఫుల్‌ హీరో అనిపించుకున్న పవన్‌ ఆ తర్వాత తను చేసే సినిమాల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత కొన్ని బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌తో పవర్‌స్టార్‌గా ఎదిగారు.

డైరెక్టర్‌గా తొలి సినిమా.. సావిత్రి పతనానికి అదే కారణమైందా?

మహానటి సావిత్రి గురించి, ఆమె నటించిన సినిమాల గురించి, ఆమె జీవితంలోని వెలుగు నీడల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగానే కాకుండా దర్శకురాలిగా మారి కొన్ని సినిమాలను రూపొందించారు. అయితే సావిత్రి దర్శకురాలిగా మారడానికి కారణాలు ఏమిటి? ఆమెకు దర్శకురాలిగా అవకాశం ఇచ్చింది ఎవరు? ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలను 55 సంవత్సరాల క్రితం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు మహానటి సావిత్రి.  ‘అన్నపూర్ణ పిక్చర్స్‌ బేనర్‌లో దుక్కిపాటి మధుసూదనరావుగారు నిర్మించే సినిమాలకు ఎక్కువ శాతం ఆదుర్తి సుబ్బారావుగారు దర్శకత్వం వహించేవారు. ఒకరోజు మధుసూదనరావుగారు నా దగ్గరకు వచ్చి ‘మన డైరెక్టర్‌ సుబ్బారావు బిజీగా ఉన్నాడు. మన నెక్స్‌ట్‌ పిక్చర్‌ను నువ్వు డైరెక్ట్‌ చేస్తావా’ అని అడిగారు. నాకు వెంటనే నవ్వు వచ్చేసింది. అలా నవ్వుతూనే ఉన్నాను. దానికి నిర్మాతగారు ‘హాస్యానికి ఆ మాట అనడం లేదు. నిజంగా నువ్వు డైరెక్ట్‌ చెయ్యాలి’ అన్నారు. అయినా నేను ఇంకా నవ్వు ఆపలేదు. నా నవ్వు చూసి అర్థం చేసుకున్న ఆయన మరేమీ అనకుండా వెళ్లిపోయారు. ఆయన చెప్పిన మాట గురించి ఒకసారి ఆలోచించాను. నాకు సినిమా తీసేంత సామర్థ్యం ఉందా అనిపించింది. తర్వాత ఆ విషయాన్ని నేను మర్చిపోయాను.  ఆ తర్వాత దర్శకుడు వి.మధుసూదనరావుగారి సతీమణి సరోజిని నా దగ్గరకి వచ్చారు. ‘నేను ఒకటి అడుగుతాను నువ్వు తప్పకుండా  ఒప్పుకోవాలి’ అన్నారు. ‘సరే’ అన్నాను. ఇంతకీ ఏమిటంటే.. ఆడవాళ్లంతా కలిసి ఒక సినిమా చెయ్యాలన్నది సరోజిని ఆలోచన. అది విన్న నేను కాసేపు ఏమీ మాట్లాడలేదు. నా సమాధానం కోసం ఆమె ఎదురుచూస్తోంది. ‘ఆయన్ని కనుక్కొని చెబుతాను’ అంటూ ఫోన్‌ చేశాను. విషయం చెప్పగానే తప్పకుండా చెయ్యి అన్నారు. అలా ‘చిన్నారి పాపలు’ టైటిల్‌తో సినిమా స్టార్ట్‌ చేశాం. అయితే విశేషం ఏమిటంటే ఈ సినిమాకి చాలా మంది మహిళలు టెక్నీషియన్లు పనిచేశారు. ఈ సినిమాకి పి.లీలగారు సంగీతం, కథను సరోజిని, మోహన కళా దర్శకురాలిగా, నృత్య దర్శకురాలిగా రాజసులోచన, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొప్పరపు సరోజిని పనిచేశారు. సినిమా ప్రారంభమైంది. సావిత్రి ఎలా డైరెక్ట్‌ చేస్తుందో చూడాలని ప్రముఖ దర్శకులు షూటింగ్‌ దగ్గరికి వచ్చేవారు. సినిమాలో నటించిన షావుకారు జానకి ‘నువ్వు మొదటిసారి డైరెక్ట్‌ చేస్తున్నట్టు లేదు. ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న డైరెక్టర్‌లా చేశావు’ అన్నారు. ఇలా నేను ఒక్కసారే డైరెక్టర్‌ అయిపోవడం వెనుక కొన్ని కారణాలు వున్నాయి. నటించే సమయంలోనే కొన్ని సీన్స్‌ని అలా చేస్తే బాగుండేది అనే ఆలోచన వచ్చేది. ఏ సినిమాకైనా డైరెక్టర్‌ చెప్పినట్టుగానే చెయ్యాలి. డైరెక్షన్‌ చెయ్యడం అంత ఈజీ కాదు అని నేను డైరెక్టర్‌ అయిన తర్వాత తెలిసొచ్చింది’ అని చెప్పారు సావిత్రి.x ఈ చిత్రం 14 ఆగస్ట్‌, 1968న రిలీజ్‌ అయింది. అయితే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా తర్వాత ‘చిరంజీవి’, ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు దర్శకత్వ వహించారు సావిత్రి. ‘చిన్నారి పాపలు’ సినిమా నిర్మాణంలో ఎంతో మంది భాగస్వాములు ఉన్నారు. వారితో అభిప్రాయ భేదాలు రావడంతో సినిమా నిర్మాణం సజావుగా సాగలేదు. దాంతో సొంత ఆస్తులు అమ్మి షూటింగ్‌ పూర్తి చెయ్యాల్సి వచ్చింది. సావిత్రి పతనం ఈ సినిమాతోనే ప్రారంభమైంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘మూగమనసులు’ చిత్రాన్ని తమిళ్‌లో శివాజీ గణేశన్‌తో నిర్మించారు సావిత్రి. ఆ సినిమా కూడా ఫ్లాప్‌ అవ్వడంతో సావిత్రి ఆర్థికపరంగా మరింత కుంగిపోయారు.

ఎన్నో విమర్శల మధ్య రిలీజైన ‘సంపూర్ణ రామాయణం’.. వారం రోజులు బయటకు రాని శోభన్‌బాబు!

తెలుగు చలన చిత్ర దర్శకుల్లో బాపుకి ఒక విశిష్టమైన స్థానం ఉంది. రొటీన్‌ చిత్రాలకు భిన్నంగా ఉండే ఆయన సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు.  చిత్రకారుడిగా, కార్టూనిస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బాపు ‘సాక్షి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత మరో నాలుగు సినిమాలు చేసి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో రామాయణ గాధను తెరకెక్కించాలనే ఆలోచన వచ్చింది బాపుకి. అనుకున్నదే తడవుగా అన్నీ సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. శోభన్‌బాబు రాముడిగా ‘సంపూర్ణ రామాయణం’ చిత్ర నిర్మాణం ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. ఇది చూసి అందరూ నవ్వుకున్నారు. ఈ సినిమాకి రచన చేస్తున్న ఆరుద్ర కమ్యూనిస్టు భావాలున్న రచయిత, ముళ్ళపూడి వెంకటరమణ కామెడీ కథలు రాస్తారు, ఇక బాపు కార్టూన్లు వేస్తారు. వీళ్ళంతా కలిసి రామయణాన్ని సినిమాగా తీయడమేంటి? పైగా శోభన్‌బాబు రాముడిగా నటిస్తారట. అసలు జనం ఈ సినిమాని చూస్తారా? ప్రేక్షకుల దృష్టిలో రాముడంటే ఎన్‌.టి.రామారావే. మరో నటుడ్ని ఊహించుకోలేరు, సినిమా ఖచ్చితంగా ఆడదు.. ఇలా రకరకాల విమర్శల మధ్య సినిమాను ప్రారంభించారు.  ఈ సినిమా ప్రారంభించే సమయానికి ‘శ్రీరామపట్టాభిషేకం’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఎన్‌.టి.రామారావు. స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి చేసేశారు. ‘సంపూర్ణ రామాయణం’ చిత్రాన్ని ప్రారంభించే ముందు ఎన్టీఆర్‌ను కలిసి స్టోరీలైన్‌ చెప్పారు బాపు, రమణ. అది విన్న ఎన్టీఆర్‌ ‘మేం శ్రీరామట్టాభిషేకం సినిమా చేయబోతున్నాం. స్క్రీప్ట్‌ కూడా రెడీ అయింది. మీరు వినే ఉంటారు’ అన్నారు. ‘మీరు చేయబోతున్న సినిమా గురించి విన్నాం. మీరు సినిమా ప్రారంభించడానికి ఇంకా సమయం ఉంది కదా. ఈలోగా మా సినిమా తీస్తాం’ అని చెప్పారు బాపు, రమణ. ‘అలాగే కానివ్వండి. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి’ అన్నారు ఎన్టీఆర్‌. సాధారణంగా పౌరాణిక చిత్రాలు స్టూడియోల్లోనే తీసేవారు. కానీ, మొదటిసారి ఔట్‌డోర్‌లో సెట్స్‌ వేసి ఈ సినిమాను నిర్మించారు. రూ.7 లక్షల్లో పౌరాణిక చిత్రాలు నిర్మాణం జరుపుకుంటున్న ఆరోజుల్లో ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి రూ.17 లక్షలకుపైగా బడ్జెట్‌ అయింది.  పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌ను పూర్తి చేశారు బాపు. రచయితలు రమణ, ఆరుద్ర, సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్‌, సినిమాటోగ్రాఫర్‌ రవికాంత్‌ నగాయిచ్‌ల సహకారంతో వాల్మీకి రామాయణాన్ని ఓ దృశ్యకావ్యంలా తీర్చిదిద్దారు బాపు. సినిమా రిలీజ్‌ అయ్యే ముందు రోజు శోభన్‌బాబు ఒక్కరే ఎన్టీఆర్‌ను కలిసేందుకు వెళ్లారు. తను చేసిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ రేపే సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు శోభన్‌బాబు. ‘సినిమా ఎలా వచ్చింది?’ అని అడిగారు ఎన్టీఆర్‌. ‘బాగానే వచ్చింది సర్‌’ అని చెప్పారు శోభన్‌. ‘ఇదే విషయాన్ని మీరు ఎల్లుండి వచ్చి చెప్పండి’ అన్నారట ఎన్టీఆర్‌. సినిమా రిలీజ్‌ అయింది. ఆశించిన స్పందన రాలేదు. కలెక్షన్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో అప్పటివరకు సినిమా గురించి విమర్శించిన వారంతా మరోసారి రకరకాల కామెంట్స్‌ చేయడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్‌ను కలిసేందుకు శోభన్‌బాబుకి మొహం చెల్లలేదు. వారం రోజుల పాటు ఇంటి నుంచి బయటికి రాలేదాయన.  రెండో వారం కాస్త కలెక్షన్లు పెరిగాయి. మూడో వారం ఒక్కసారిగా కలెక్షన్లు పుంజుకున్నాయి. ‘సంపూర్ణ రామాయణం’ చిత్రాన్ని చూసేందుకు జనాలు బళ్ళు కట్టుకొని మరీ వచ్చారు. థియేటర్‌లో హారతులు, పూజలు మొదలయ్యాయి. ‘లవకుశ’ తర్వాత మళ్ళీ అంతటి ప్రభంజనం ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికే దక్కింది. అప్పట్లో శోభన్‌బాబుకి థియేటర్‌ ఉండేది. ఒకరోజు ఎన్టీఆర్‌ సినిమాని చూపించమని శోభన్‌బాబుని అడిగారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేసి పక్కనే కూర్చున్నారు శోభన్‌బాబు. సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్‌ ఎంతో ఆనందంగా శోభన్‌బాబుని కౌగిలించుకొని అభినందించారు.  ఈ సినిమా 10 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. పదిహేళ్ళ తర్వాత అంటే 1987లో మళ్ళీ ఈ సినిమా రిలీజ్‌ చేస్తే కొన్ని థియేటర్లలో 100 రోజులు, మరికొన్ని థియేటర్లలో 50 రోజులు రన్‌ అయింది. ఈ సినిమాను హిందీలోకి డబ్‌ చేయగా 1973లో హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ సాధించిన టాప్‌ 5 సినిమాల్లో ‘సంపూర్ణ రామాయణం’ చోటు దక్కించుకుంది. అలాగే ఈ సినిమాను బెంగాలీలో రీమేక్‌ చేశారు. అప్పటికే వరస హిట్‌ సినిమాలతో మంచి జోరు మీద ఉన్న శోభన్‌బాబు ఇమేజ్‌ ఈ సినిమా విజయంతో మరింత పెరిగింది.

మహేష్‌తో అనుకున్న సినిమా ‘యమస్పీడ్‌’గా ఆ హీరోతో...

‘దానే దానే పె లిఖా హై ఖానే వాలే కా నామ్‌’ అనే హిందీ సామెత గురించి అందరికీ తెలిసిందే. ఏది ఎవరికి ప్రాప్తమో వారికే దక్కుతుందనే అర్థం ఉన్న ఆ సామెతను సినిమా రంగంలో నటీనటులకు కూడా అన్వయిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక హీరో కోసం అనుకున్న కథతో మరో హీరో సినిమా చేస్తాడు. ఒక హీరో రిజెక్ట్‌ చేసిన కథతో మరో హీరో సూపర్‌హిట్‌ కొడతాడు. ఇలాంటి అనుభవాలు హీరోలందరి కెరీర్‌లోనూ ఉంటాయి. అలాంటి ఓ సినిమా గురించి కమెడియన్‌ అలీ ఓ ఇంటర్వ్యూలో వివరించారు.  సూపర్‌స్టార్‌ కృష్ణతో ‘నెంబర్‌వన్‌’ వంటి సూపర్‌హిట్‌ సినిమా చేసిన తర్వాత ఎస్‌.వి.కృష్ణారెడ్డికి మహేష్‌బాబును హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ ఓ సినిమా చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. ఒకసారి హైదరాబాద్‌ నుంచి చెన్నయ్‌ వెళ్ళే విమానంలో అనుకోకుండా కలిసిన సూపర్‌స్టార్‌ కృష్ణతో ‘నా దగ్గర ఓ మంచి కథ ఉంది సార్‌. మీ అబ్బాయితో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను’ అన్నారు కృష్ణారెడ్డి. చెన్నయ్‌ వెళ్ళే లోపు తను అనుకున్న కథ మొత్తం చెప్పారాయన. కథ విన్న కృష్ణ చాలా బాగుందని మెచ్చుకున్నారు. అయితే మహేష్‌ ఇంకా చిన్నవాడని, అతను హీరోగా ఇంట్రడ్యూస్‌ అవ్వడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పారు కృష్ణ. ఈ గ్యాప్‌లో ఒక విచిత్రం జరిగింది. ‘మాయలోడు’ ఆడియో ఫంక్షన్‌లో ‘చినుకు చినుకు అందెలతో..’ పాటకు అలీ డాన్స్‌ పెర్‌ఫార్మ్‌ చేశారు. అది చూసిన కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు ఒక ఆలోచన వచ్చింది. తాము అనుకున్న కథలో కామెడీ, సెంటిమెంట్‌ ఉంది. అలీ అయితే కామెడీ, సెంటిమెంట్‌ చెయ్యగలడు. అలాగే డాన్స్‌ కూడా చేస్తాడు. ఆ క్యారెక్టర్‌కి అలీ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతాడని, అతనితోనే సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి.  ఒకరోజు అలీని తమ ఆఫీస్‌కి పిలిపించి అగ్రిమెంట్‌ మీద సంతకం పెట్టమన్నారు కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి. ‘అంతకుముందు చేసిన సినిమాలకు అగ్రిమెంట్‌ చెయ్యలేదు కదా. ఇదేంటి కొత్తగా’ అని అడిగారు అలీ. ‘నువ్వు సంతకం పెట్టు. చెప్తాం’ అన్నారు. అలీ సంతకం చేసిన తర్వాత ‘నేను నెక్స్‌ట్‌ చేయబోయే సినిమాలో నువ్వే హీరో’ అన్నారు కృష్ణారెడ్డి. అప్పుడు అలీ ఆశ్చర్యపోయి ‘కామెడీ చెయ్యకండి సార్‌.. నేను హీరో ఏమిటి?’ అన్నారు. ‘నిజమేనయ్యా.. నువ్వే హీరో’ అన్నారు అచ్చిరెడ్డి. అలా కమెడియన్‌ కాస్తా హీరో అయిపోయారు. ఆ సినిమాయే ‘యమలీల’. అలా మహేష్‌తో చెయ్యాలనుకున్న సినిమా చివరికి అలీతో చేశారు కృష్ణారెడ్డ్డి. అయితే ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్‌ ‘యమస్పీడ్‌’. కథను బట్టి, అందులో యమధర్మరాజు పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ‘యమలీల’గా పేరు మార్చారు. హీరోగా ఆ సినిమాకు అలీ అందుకున్న పారితోషికం రూ.50 వేలు. ‘యమలీల’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన తర్వాత అలీకి హీరోగా చాలా అవకాశాలు వచ్చాయి. హీరోగా అలీ అందుకున్న అత్యధిక పారితోషికం రూ.15 లక్షలు. కమెడియన్‌గా 1000కి పైగా సినిమాలు చేసిన అలీ హీరోగా 25 సినిమాలు చేశారు.

ఎనిమిదేళ్ళ వయసులో శవం పక్కన ఒంటరిగా గడిపిన దిలీప్‌కుమార్‌.. ఇంట్రెస్టింగ్ స్టోరీ.!

పాతతరం బాలీవుడ్‌ హీరోల్లో దిలీప్‌కుమార్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన పోషించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. విషాద రసాన్ని అభినయించడంలో దిలీప్‌కుమార్‌కి చాలా మంచి పేరు ఉంది. అందుకే ఆయన్ని కింగ్‌ ఆఫ్‌ ట్రాజెడీ అనేవారు. అంతేకాదు, కొన్ని సినిమాల్లో హాస్యరసంలోనూ చక్కని అభినయాన్ని కనబరచి కింగ్‌ ఆఫ్‌ కామెడీ అని కూడా అనిపించుకున్నారు. దిలీప్‌ కుమార్‌ది ఒక విభిన్నమైన మనస్తత్వం. ఆయన నలుగురిలో కలిసేవారు కాదు. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడేవారు. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో కూడా షాట్‌ పూర్తి చేసిన తర్వాత దూరంగా కూర్చునేవారు. అందరికీ ఆయన ప్రవర్తన విచిత్రంగా అనిపించేది. దిలీప్‌ గురించి తెలియనివారు ఆయనకు పొగరు అనుకునేవారు. నిజానికి అలా దూరంగా ఉండడం వెనుక ఒక బలీయమైన కారణం ఉంది. అదేమిటంటే.. దిలీప్‌ చిన్న వయసులో జరిగిన ఓ ఘటన ఆయన మనసులో గాఢమైన ముద్ర వేసింది. అందుకే ఎవరితోనూ కలవకుండా ఒంటరిగానే గడిపేవారు. ఎనిమిదేళ్ళ వయసులో ఉండగా ఆయన బంధువు ఒకరు చనిపోయారు. ఆ మృతదేహాన్ని ఒక గదిలో ఉంచారు. పిల్లలెవరూ ఆ గదిలోకి వెళ్ళకూడదని పెద్దవారు చెప్పారు.  అలా ఎందుకన్నారో దిలీప్‌కి అర్థం కాలేదు. తన స్నేహితుల్ని అడిగినా చెప్పలేదు. అక్కడ ఏముందో తెలుసుకోవాలని ఆ గదిలోకి నెమ్మదిగా వెళ్లాడు. ఈలోగా అక్కడికి వచ్చిన కొందరు తలుపు తీసి ఉండడం గమనించి తలుపు వేసి బయట గడియ పెట్టి వెళ్లిపోయారు. ఆ క్షణం అక్కడ ఉన్న శవాన్ని చూసి ఎంతో భయపడ్డాడు దిలీప్‌. భయంతో కేకలు వేశాడు. తలుపులు బాదుతూ అరవసాగాడు. కానీ, దగ్గరలో ఎవరూ లేకపోవడంతో అతని కేకలు ఎవరికీ వినిపించలేదు. తను ఏ పరిస్థితుల్లో ఉన్నానో చూసుకొని గొల్లున ఏడవడం మొదలుపెట్టాడు. అలా కొన్ని గంటలపాటు మృతదేహంతోనే గడపాల్సి వచ్చింది.  ఆరోజు జరిగిన ఘటన దిలీప్‌కుమార్‌ మనసుపై ఎంతో ప్రభావం చూపింది. అతనిలో అతిభయం అనేది చోటు చేసుకుంది. ఆ భయంతోనే ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడూ ఇంట్లో ఒంటరిగానే ఉండేవాడు. అలా ఆయనకు ఒంటరితనం అలవాటైపోయింది. ఆ తర్వాత బొంబాయిలో ఉన్నత విద్యను అభ్యసించారు. సినిమాలంటే ఆసక్తి ఉండడం వల్ల నటుడిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించడం ద్వారా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయినా చిన్నతనంలో ఆయన మనసులో పడిన ముద్ర అలాగే ఉండిపోయింది. ట్రాజెడీ పాత్రలను పోషించడంలో అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు అంటారు ఆయన సన్నిహితులు. దిలీప్‌కుమార్‌ సొంతంగా ‘గంగ జమున’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం ఔట్‌డోర్‌ వెళ్ళారు. షూటింగ్‌ లొకేషన్‌లో యూనిట్‌ సభ్యులు బస చేసేందుకు హోటల్‌లో అందరికీ రూమ్స్‌ ఇప్పించి తను మాత్రం బయటికి వచ్చి ఓ చెట్టు కింద పడుకున్నారట. 1961లో విడుదలైన ‘గంగ జమున’ చిత్రం ఆరోజుల్లో హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రం రికార్డు సృష్టించింది.

తన ఇంట్లోనే బియ్యం దొంగిలించి 3 రూపాయలు అప్పు తీర్చిన అల్లు రామలింగయ్య!

పాతతరం నటీనటులకు నాటకరంగమే ఇన్‌స్టిట్యూట్‌. హీరో, హీరోయిన్‌ నుంచి హాస్యనటుల వరకు అక్కడే నటనలోని మెళకువలు నేర్చుకునేవారు. ఏ పాత్రను ఎలా పోషించాలి, ఎలా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే విషయాలను ఆకళింపు చేసుకొని నటనలో గట్టి పునాది వేసుకునేవారు. పాతతరం హాస్య నటుల్లో అల్లు రామలింగయ్యది ఒక ప్రత్యేకమైన శైలి. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి అందరిచేతా శభాష్‌ అనిపించుకున్నారు. ఆయన సినిమా రంగానికి రావడం వెనుక ఒక విచిత్రమైన కథ దాగి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన అల్లు రామలింగయ్యకు చదువు అబ్బలేదు. వ్యవసాయమైనా చెయ్యమని తండ్రి చెబితే.. అది కూడా చేసేవారు కాదు. ఎప్పుడూ ఆకతాయిగా తిరుగుతూ, అందర్నీ అనుకరిస్తూ నవ్విస్తుండేవారు. అలా నాటకాల్లో నటించాలనే కోరిక పుట్టింది. ఎక్కడ నాటకం ప్రదర్శిస్తున్నా అక్కడికి వెళ్ళిపోయి అందులో నటించిన వారిని వారికి విసుగుపుట్టే వరకు అభినందించేవారు. ఏదో విధంగా నాటకాల్లో ప్రవేశించాలని విశ్వప్రయత్నం చేసేవారు. ఎలాగైతే ‘భక్తప్రహ్లాద’ నాటకంలో బృహస్పతి వేషం లభించింది. మూడు రూపాయలు ఆ నాటక కాంట్రాక్టరుకు ఎదురిచ్చేలా మాట్లాడుకొని ఆ పాత్రను దక్కించుకున్నారు. నాటకాల్లో అనుభవం లేకపోయినా తనకు ఉన్న అవగాహనతో బృహస్పతి పాత్రకు న్యాయం చేశారు. ఆ తర్వాత కాంట్రాక్టరుకు మూడు రూపాయలు ఇచ్చేందుకు తన ఇంట్లోనే బియ్యాన్ని దొంగిలించి వాటిని అమ్మి అప్పు తీర్చారు. ఆ నాటకం తర్వాత ప్రజా నాట్యమండలిలో చేరి ఎన్నో నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. పలువురు ప్రముఖుల్ని అనుకరించడం, కొన్ని తమాషా విషయాల గురించి చెప్పడం ద్వారా అందర్నీ నవ్వించేవారు. నాటకాల్లో నటిస్తున్న సమయంలోనే మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్ళారు. జైలులో అందర్నీ పోగేసుకొని నాటకాలు వేసేవారు. అంతేకాదు, అంటరానితనంపై కూడా అల్లు రామలింగయ్య పోరాటం చేశారు.  1952లో గరికపాటి రాజారావు నిర్మించిన ‘పుట్టిల్లు’ అల్లు రామలింగయ్య తొలిచిత్రం. ఈ చిత్రంలో శాస్త్రి పాత్రను పోషించి అందర్నీ ఆకర్షించారు. ఆ తర్వాత వద్దంటే డబ్బు, పరివర్తన, పల్లె పడుచు చిత్రాల్లో అల్లు పోషించిన పాత్రలు ఆయనకు హాస్యనటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పటివరకు సినిమాల్లో కనిపించిన హాస్యనటులకు పూర్తి భిన్నమైన శైలి అల్లు వారిది. కొన్ని పాత్రలు ఆయన్ని దృష్టిలో పెట్టుకొనే సృష్టించేవారు రచయితలు. అయితే అల్లు మాత్రం తన కెరీర్‌లోని వెలితి గురించి పదే పదే చెప్పేవారు. 100 సినిమాల్లో 100 రకాల హాస్యపాత్రలు చేసారు అల్లు. అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు. తనకు మాత్రం సీరియస్‌ పాత్రలు చెయ్యాలని, ‘నువ్వు హాస్యనటుడివి మాత్రమే కాదు’ అనిపించుకోవాలనే కోరిక ఉండేది. హాస్యంతో నిండిన క్రూర పాత్రలు, క్రౌర్యంతో ఉండే హాస్యపాత్రలు ఎన్నో పోషించారు అల్లు రామలింగయ్య. మిస్సమ్మ, ఇలవేల్పు, దొంగరాముడు, మూగమనసులు, దాగుడు మూతలు, ఉమ్మడి కుటుంబం వంటి సినిమాలు  ఆయనకు చాలా మంచి పేరు తెచ్చాయి. డిఫరెంట్‌ మేనరిజంతో అల్లు చేసే కామెడీని అందరూ ఎంజాయ్‌ చేసేవారు. హోమియోపతి వైద్యంలో పట్టభద్రుడైన అల్లు రామలింగయ్య సినిమాల్లో నటిస్తూనే ఉచితంగా వైద్య సేవలు అందించేవారు. నటుడుగా కొనసాగుతూనే సినిమా నిర్మాణం కూడా చేపట్టారు అల్లువారు. గీతా ఆర్ట్స్‌ బేనర్‌ను స్థాపించి బంట్రోతు భార్య, దేవుడే దిగివస్తే, బంగారు పతకం వంటి సినిమాలను నిర్మించారు. అల్లు రామలింగయ్య తర్వాత ఆయన కుమారుడు అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలను నిర్మిస్తూ స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. మెగాస్టార్‌ చిరంజీవిని అల్లుడుగా చేసుకోవడం, మనవడు అల్లు అర్జున్‌ హీరోగా మంచి పేరు తెచ్చుకోవడం తనకు సంతృప్తినిచ్చిన అంశాలని అల్లు రామలింగయ్య చెప్పేవారు.   1952లో ‘పుట్టిల్లు’ చిత్రంతో ప్రారంభమైన అల్లు రామలింగయ్య సినీ ప్రస్థానం 2004లో వచ్చిన ‘జై’ వరకు కొనసాగింది. ఆయన చివరి శ్వాస వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ తరం నుంచి యంగ్‌ హీరో నవదీప్‌ వరకు ఎంతో మంది హీరోలతో కలిసి నటించిన ఘనత అల్లు రామలింగయ్యకే దక్కుతుంది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 1990లో పద్మశ్రీ పురస్కారంతో అల్లు రామలింగయ్యను సత్కరించింది. రేలంగి తర్వాత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న హాస్యనటుడు అల్లు రామలింగయ్య కావడం విశేషం. 2001లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది. 2013లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన 50 తపాలా బిళ్ళల్లో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదల చేశారు.

1967లో అన్నీ ప్రమాదాలే.. ప్రాణాలతో బయటపడిన జయలలిత!

ప్రేక్షకులకు వినోదాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించడమే నటీనటుల లక్ష్యం. తాము చేసే సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలంటే డాన్సుల్లో, ఫైట్స్‌లో రకరకాల విన్యాసాలు చెయ్యాల్సి ఉంటుంది. అలా చేసే క్రమంలో కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల హీరోలైనా, హీరోయిన్‌లైనా ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేకుండా, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, పాతరోజుల్లో ఆ సదుపాయాలు లేనందువల్ల అనుకోని ప్రమాదాలు జరిగి నటీనటులు ఇబ్బందులు పడేవారు. అలాంటి ఘటనలు పాతతరం హీరోయిన్‌ జయలలిత సినీ జీవితంలో చాలా జరిగాయి. ముఖ్యంగా 1967వ సంవత్సరం తన కెరీర్‌లో మరచిపోలేనిది అంటూ అప్పట్లో ఓ పత్రికలో స్వయంగా జయలలిత చెప్పిన విషయాలను ప్రచురించారు.  ‘నూతన సంవత్సరం మొదటి రోజు ‘గోపాలుడు భూపాలుడు’ చిత్రంలోని ఓ వీధినాట్యంతో కూడిన పాటలో నటించాను. అలాంటి పాటలు ఎంతో హుషారుగా చేస్తానని నాకు పేరు ఉంది. ఆ పాటలో ఓ కష్టమైన భంగిమ చేశాను. షాట్‌ ఓకే అయింది. కానీ, లేచి నిలబడలేకపోయాను. సహాయం కోసం గట్టిగా అరిచాను. అప్పుడు అక్కడున్న వారు వచ్చి నన్ను లేపి నిలబెట్టారు. ఆ తర్వాత హాస్పిటల్‌లో జాయిన్‌ చేసి ఎక్స్‌రేలు తీయించారు. ఇరవై రోజులపాటు కదలకుండా బెడ్‌ మీదే ఉండాలని చెప్పారు. ఇకపై అలాంటి హుషారు పాటలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ‘నాన్‌’, ‘సూడివిట్టు మాప్పిళ్లై’ చిత్రాల షూటింగ్‌ కోసం ఊటీ వెళ్ళాల్సి వచ్చింది. ‘నాన్‌’ చిత్రం షూటింగ్‌ ఓ జలపాతం దగ్గర జరుగుతోంది. అంతకుముందు చాలామంది ఆ ప్రదేశంలో షూటింగ్‌ చేశారు. కానీ, నీళ్ళలోకి వెళ్ళే సాహసం ఎవరూ చెయ్యలేదు. ఎందుకంటే అక్కడ నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తాయి. పట్టు తప్పితే కొట్టుకుపోతారు. అయినా ఆ జలపాతం మధ్యలో ఉన్న రాయిపైన డాన్స్‌ చేస్తే బాగుంటుందని దర్శకులు చెప్పారు.  ఇలాంటి సాహసాలు చెయ్యకూడదని అంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని వదిలేసి ధైర్యంగా అక్కడికి చేరుకున్నాను. జలపాతం మధ్యలో ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి విజృంభించి డాన్స్‌ చేస్తున్నాను. సడన్‌గా నా కాలు జారింది. ముందుకు పడిపోయాను. సమయానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నీళ్ళలోకి దూకి నన్ను రక్షించారు. నేను ప్రాణాలతో బయటపడ్డానంటే ఆయనే కారణం.  ఇక ‘సూడివిట్టు మాప్పిళ్లై’ షూటింగ్‌ ఉదకమండలానికి నాలుగు వేల అడుగుల దిగువన ఉన్న టీ ఎస్టేట్‌లో జరిగింది. పాటలోని ఓ ప్రేమ సన్నివేశం అది. దూరం నుంచి పరిగెత్తుకుంటూ రావాలి. ఆ నేలంతా ఎత్తు పల్లాలతో ఉంది. అలా పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు నా కాలు ఒక కన్నంలో ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా కిందపడిపోయాను. నడవడం కూడా సాధ్యం కాలేదు. అతి కష్టం మీద కారు దగ్గరికి వెళ్లగలిగాను. ఆ తర్వాత అక్కడికి 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న హాస్పిటల్‌లో కట్టు కట్టించారు. మరుసటిరోజు అలా కుంటుతూనే ఆ పాటను పూర్తి చేశాను. అయితే అదృష్టవశాత్తు ఆ పాటలో నా ఇబ్బందిని ఎవరూ గుర్తించలేకపోయారు. మద్రాస్‌ వచ్చిన తర్వాత కూడా కాలు నొప్పి తగ్గలేదు. డాక్టర్‌గారు వారం రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కానీ, ఆ మర్నాడు పాండిచ్చేరిలో ఓ భరతనాట్య ప్రదర్శనకు హాజరు కావాల్సి వచ్చింది. అది ముందే నిర్ణయించిన కార్యక్రమం. వెళ్ళకుండా ఉండాలని చాలా ప్రయత్నించాను. కానీ, నేను స్టేజి మీద కనిపించకపోతే జనం గొడవ చేస్తారని ఆ ప్రదర్శన ఏర్పాటు చేసిన వారు చెప్పారు. నా కాలుకు ఉన్న కట్టుమీద మరో కట్టు కట్టి ఆ ప్రోగ్రాం పూర్తి చేశాను. తను చెప్పిన మాట వినలేదని మా డాక్టర్‌గారు నన్ను కోప్పడ్డారు.  ఇక మే నెలలో హిందీ సినిమా ‘ఇజ్జత్‌’ షూటింగ్‌ కోసం కులు లోయకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ ప్రదేశమంతా ముళ్ళతో నిండిపోయి ఉంది. నా కాళ్ళలో లెక్కలేనన్ని ముళ్లు గుచ్చుకున్నాయి. ప్రతిరోజూ మా అమ్మగారు ఆ ముళ్ళను తీసేవారు. ఆ షూటింగ్‌ పూర్తయిన తర్వాత మద్రాస్‌ వచ్చేశాను. అయినా నా కాళ్ళలో చాలా ముళ్ళు ఉన్నాయి. మా డాక్టర్‌గారు కొన్నింటిని తీసారు. కానీ, ఒక ముల్లు మాత్రం కాలులో ఉండిపోయింది. అది ఎక్కడుందో ఆయన కూడా కనిపెట్టలేకపోయారు. ఒకరోజు ‘చిక్కడు దొరకడు’ చిత్రానికి సంబంధించి రామారావుగారితో కలిసి ఒక పాట చిత్రీకరణలో పాల్గొన్నాను. ఆ సమయంలో ఆయన చూసుకోకుండా నా కాలు తొక్కారు. అప్పటివరకు జాడలేని ముల్లు ఒక్కసారిగా బయటికి వచ్చింది. అంత బాధలోనూ నాకు సంతోషం కలిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే నాకు జరిగిన ప్రమాదాలు ఇవి. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాపాయం లేకుండా బయటపడ్డందుకు చాలా ఆనందించాను. 1968 అయినా నాకు ఎలాంటి ప్రమాదాలు లేని సంవత్సరం అవుతుందని ఆశిస్తున్నాను’ అంటూ తన అనుభవాల గురించి వివరించారు జయలలిత.

త్రివిక్రమ్‌ కథ విని పవన్‌కళ్యాణ్‌ నిద్రపోయారు... మహేష్‌ బయటికి వెళ్ళిపోయారు.. ఎందుకంటే!

ఒక సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి, కమర్షియల్‌గా విజయం సాధించాలి అంటే  అప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు తియ్యాలి అంటారు. ఆ జనరేషన్‌లోని ప్రేక్షకులు ఎలాంటి వినోదాన్ని కోరుకుంటున్నారు, ఎలాంటి ట్విస్టులను ఆశిస్తున్నారు అనేది దర్శకుడు పసిగట్టగలిగినపుడే అందరూ మెచ్చే సినిమా బయటికి వస్తుంది.. సాధారణంగా ఒక సినిమా విజయం వెనుక దాగి ఉన్న విషయాలివే. కానీ, కొన్ని సూపర్‌హిట్‌ అయిన సినిమాలు కొందరికి నచ్చకపోవచ్చు, అలాగే సినిమా బాగుంది అనే టాక్‌ ఉన్నప్పటికీ కలెక్షన్లు లేక ఫ్లాప్‌ అవ్వొచ్చు. అలా అందరూ బాగుందని చెప్పుకున్నా రిలీజ్‌ సమయంలో నిర్మాతకు నష్టం తీసుకొచ్చిన సినిమాల్లో మహేష్‌, త్రివిక్రమ్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ ఒకటి. అప్పటివరకు పలు సినిమాలకు రచయితగా వ్యవహరించిన త్రివిక్రమ్‌కి నిర్మాత స్రవంతి రవికిషోర్‌ ‘నువ్వే నువ్వే’ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే పవన్‌కళ్యాణ్‌ని కలిసి ‘అతడు’ కథ వినిపించారు. కథ మొదలు పెట్టిన 15 నిమిషాల్లోనే పవన్‌కళ్యాణ్‌ నిద్రలోకి జారుకోవడంతో అక్కడి నుంచి వచ్చేశారు త్రివిక్రమ్‌. ఆ తర్వాత పద్మాలయా స్టూడియోలో మహేష్‌కి వినిపించారు. కథ విన్న మహేష్‌ ఒక్కసారిగా లేచి బయటికి వెళ్లిపోయారు. దీంతో షాక్‌ అయిన త్రివిక్రమ్‌కి ఏం చెయ్యాలో తోచలేదు. తన కథ విని పవన్‌కళ్యాణ్‌ నిద్రపోయారు, మహేష్‌ ఏ విషయం చెప్పకుండా లేచి వెళ్లిపోయారు. దీన్నిబట్టి తను చెప్పిన కథలోనే లోపం ఉందా అనే అనుమానం వచ్చింది త్రివిక్రమ్‌కి. కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన మహేష్‌.. కథ చాలా అద్భుతంగా ఉందని, నాన్నగారికి కూడా నచ్చిందని చెప్పడంతో త్రివిక్రమ్‌ రిలాక్స్‌ అయ్యారు. ఈ సినిమాను పద్మాలయా బేనర్‌లోనే సినిమా చేద్దాం అన్నారు మహేష్‌. కానీ, అప్పటికే తన రెండో సినిమా జయభేరి ఆర్ట్స్‌ మురళీమోహన్‌కి కమిట్‌ అయి ఉన్నారు త్రివిక్రమ్‌. దానికి సంబంధించి కొంత అడ్వాన్స్‌గా కూడా ఇచ్చారు. ఇదే విషయాన్ని మహేష్‌కి చెప్పారు. సరే దాని గురించి ఆలోచిద్దాం, మళ్ళీ మీకు కబురు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు మహేష్‌. ఆ సమయంలో మహేష్‌ ‘టక్కరిదొంగ’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయింది. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు ‘అతడు’ సినిమా గురించి మహేష్‌ నుంచి త్రివిక్రమ్‌కి ఎలాంటి పిలుపు రాలేదు. ఈలోగా బాబీ, ఒక్కడు, నిజం, నాని, అర్జున్‌ సినిమాలు కంప్లీట్‌ చేశారు. మహేష్‌తో సినిమా చేసేందుకు రెండు సంవత్సరాలు వెయిట్‌ చేశారు త్రివిక్రమ్‌.  ‘అర్జున్‌’ రిలీజ్‌ అయిన తర్వాత పైరసీకి సంబంధించి జరిగిన కొన్ని పరిణామాల వల్ల కోర్టు కేసులతో మహేష్‌ కొంత ఆందోళనగా ఉన్నారు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత త్రివిక్రమ్‌కి కబురు చేశారు మహేష్‌. అప్పుడు ‘అతడు’ ఫుల్‌ స్క్రిప్ట్‌ నేరేట్‌ చేశారు. చాలా కొత్తగా ఫీల్‌ అయ్యారు మహేష్‌. త్రివిక్రమ్‌ కోరినట్టుగానే జయభేరి ఆర్ట్స్‌ బేనర్‌పై సినిమా ప్రారంభమైంది. షూటింగ్‌ సమయంలో త్రివిక్రమ్‌ వర్కింగ్‌ స్టైల్‌ చూసి మహేష్‌ ఫిదా అయిపోయారు. అప్పటివరకు తను చేసిన సినిమాల్లో లేని కొత్తదనం ‘అతడు’లో కనిపించింది. తనకు ఎక్కువ డైలాగులు ఇవ్వకుండా, కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మంచి ఎఫెక్ట్‌ తీసుకురావడం మహేష్‌కి నచ్చింది. సినిమా మొత్తంలో మహేష్‌కి నాలుగైదు పేజీల డైలాగులు కూడా లేవట. మహేష్‌ తన డబ్బింగ్‌ని కేవలం రెండు గంటల్లో పూర్తి చేశారంటే సినిమాలో అతని డైలాగులు ఎంత తక్కువ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  2005లో రిలీజ్‌ అయిన ‘అతడు’ చిత్రాన్ని అప్పట్లోనే రూ.25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్‌ అయి మంచి టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా హిట్టా, ప్లాపా అనే సందేహం చాలా మందిలో ఉంది. దానికి తగ్గట్టుగానే రిలీజ్‌కి ముందు బిజినెస్‌ ఆశించిన స్థాయిలో జరగలేదు. థియేట్రికల్‌ బిజినెస్‌  రూ.17 కోట్లకే పరిమితమైంది. అలా సినిమా రిలీజ్‌ సమయానికి నిర్మాత రూ.8 కోట్లు డెఫ్‌షీట్‌లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో ‘అతడు’ శాటిలైట్‌ రైట్స్‌ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది ‘మా’ టీవీ. అంతేకాదు, అగ్రిమెంట్‌ కాలం ఐదేళ్ళు పూర్తయిన తర్వాత ‘మా’ టీవీ మరో రూ.7 కోట్లు చెల్లించి రెన్యువల్‌ చేయించుకుందంటే ప్రేక్షకుల్లో ఈ సినిమాకి ఎంతటి క్రేజ్‌ వుందో అర్థం చేసుకోవచ్చు. అలా ‘అతడు’ నిర్మాత నష్టాల నుంచి లాభాల వైపు వెళ్ళగలిగారు. ఇక టీవీలో ‘అతడు’ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమాను వెయ్యిసార్లకు మించి టెలికాస్ట్‌ చేశారంటే ‘అతడు’ జనంలోకి ఎంతగా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో ఎక్కువ సార్లు టీవీలో టెలికాస్ట్‌ అయిన సినిమాగా ‘అతడు’ రికార్డు సృష్టించింది.