సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తన పవర్‌కి తిరుగులేదని ప్రూవ్‌ చేసిన పవన్‌కళ్యాణ్‌!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌.. ఈ పేరు వింటేనే యూత్‌లో ఓ విచిత్రమైన వైబ్రేషన్‌. కేవలం తను చేసే సినిమాలతోనే కాదు, సమాజం పట్ల అతనికి ఉన్న బాధ్యత, ఎవరికి అన్యాయం జరిగినా చలించిపోయే తత్వం ఆయన్ని ప్రజలకు బాగా దగ్గర చేసింది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్య పరిచే సాధనం అని భావించే పవన్‌కళ్యాణ్‌ తన ప్రతి సినిమాలోనూ యూత్‌ని ఇన్‌స్పైర్‌ చేసే ఏదో ఒక పాట ఉండేలా చూసుకునేవారు. ఒక యంగ్‌ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో మెట్టూ ఎక్కుతూ పవర్‌స్టార్‌గా తనకంటూ ఓ బ్రాండ్‌ని క్రియేట్‌ చేసుకున్న పవన్‌కళ్యాణ్‌.. ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపనతో రాజకీయాల్లోకి ప్రవేశించి అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్‌ రాష్ట్ర ప్రజలకు తన విలువైన సేవలు అందిస్తున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తన పవర్‌ ఏమిటో చూపించిన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్‌ 2. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి, సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.   ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు మహామహులు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న రోజుల్లో ఓ సాధారణ నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్‌ చిరంజీవి. తన డాన్సులతో, ఫైట్స్‌తో, డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం తన స్వయంకృషితోనే ఒక్కో మెట్టూ ఎదుగుతూ మెగాస్టార్‌ స్థాయికి ఎదిగారు. చిరంజీవితోపాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలు వారి ఇమేజ్‌కి తగ్గట్టు సినిమాలు చేస్తూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని ఏర్పరుచుకున్నారు. ఆ సమయంలోనే మెరికలాంటి కుర్రాడు టాలీవుడ్‌లో మెరిశాడు. మెగాస్టార్‌ చిరంజీవి సోదురుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించాడు. అతనే పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.  అప్పటికే ఎంతో మంది యువ హీరోలు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని సినిమా రంగంలో ప్రవేశించారు. నటనలోనూ, డాన్సుల్లోనూ చిరంజీవిని అనుకరిస్తూ వచ్చారు. అయితే పవన్‌కళ్యాణ్‌ మాత్రం చిరంజీవి ప్రభావం తనపై ఒక్క శాతం కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. 1996లో మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో తనలోని టాలెంట్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. తను క్రియేట్‌ చేసుకున్న ప్రత్యేకమైన స్టైల్‌, డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో యూత్‌ని విపరీతంగా ఆకర్షించారు. ఆ తర్వాత 2000 సంవత్సరం వరకు గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఐదు వరస సూపర్‌హిట్స్‌తో స్టార్‌ హీరో ఇమేజ్‌ని సంపాదించుకున్నారు.  2001 పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌కి ఎంతో కీలకమైన సంవత్సరంగా మారింది. తమిళ్‌లో విజయ్‌ హీరోగా ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మించిన ఖుషి ఘన విజయం సాధించింది. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చెయ్యాలంటే ఎ.ఎం.రత్నంకి కనిపించిన ఏకైక ఆప్షన్‌ పవన్‌కళ్యాణ్‌. ఆ సినిమా పవన్‌కి కూడా విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పారు. తమిళ్‌ హీరో విజయ్‌ పోకడలు తెలుగు వెర్షన్‌లో ఎక్కడా కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు పవన్‌. 2001 ఏప్రిల్‌ 27న విడుదలైన ఖుషి.. తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. అప్పటివరకు చేసిన సూపర్‌హిట్‌ సినిమాలు ఒక ఎత్తయితే.. ఖుషి  పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌కి ఓ మైల్‌స్టోన్‌లా నిలిచింది.  ‘ఖుషి’ చిత్రం విడుదలైన రెండు సంవత్సరాల వరకు పవన్‌ మరో సినిమా చెయ్యలేదు. తన దర్శకత్వంలోనే రూపొందించిన జాని చిత్రం కోసం చాలా గ్యాప్‌ తీసుకున్నారు పవన్‌. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రిలీజ్‌ అయిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ సినిమా ప్రభావం.. పవన్‌ చేసిన తర్వాతి సినిమాలపై పడింది. కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవ్వగా, మరికొన్ని ఏవరేజ్‌గా నిలిచాయి. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వచ్చిన జల్సా చిత్రంతో తన పూర్వవైభవాన్ని సాధించారు పవన్‌. ఈ సినిమా తర్వాత కూడా మరికొన్ని ఫ్లాప్‌లు అతన్ని వెంటాడాయి. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో చేసిన గబ్బర్‌సింగ్‌ ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసి, పవన్‌లోని కొత్తకోణాన్ని పరిచయం చేసింది. ఆ తర్వాతి సంవత్సరం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసిన అత్తారింటికి దారేది పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత పవన్‌ కెరీర్‌ కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అందరి దృష్టీ పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాలపైనే ఉంది. డిప్యూటీ సీఎంగా ఎంతో బిజీగా ఉన్న పవన్‌ ఈ మూడు సినిమాలను పూర్తి చెయ్యాల్సి ఉంది. తమ అభిమాన హీరో ఎప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు వస్తారు, ఎప్పుడు థియేటర్లలో పవర్‌స్టార్‌ సినిమా చూస్తాము అంటూ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు అందిస్తోంది తెలుగువన్‌.

తెలుగు చిత్ర సీమలో తొలి నట వారసుడు.. విలక్షణ నటుడు నందమూరి హరికృష్ణ!

సినిమా రంగంలో వారసత్వం అనేది సర్వ సాధారణమైన విషయం. ఎంతో మంది హీరోల వారసులు సినిమా రంగంలో ప్రవేశించి ఎన్నో విజయాలు సాధించారు, సాధిస్తున్నారు. తెలుగు చలనచిత్ర సీమలో తొలి నట వారసుడు ఎవరూ అంటే.. నందమూరి హరికృష్ణ అని చెప్పాలి. అప్పటివరకు ఏ తెలుగు హీరో కుమారుడు సినిమా రంగానికి పరిచయం కాలేదు. ఆ ఘనత సాధించారు హరికృష్ణ. 1956 సెప్టెంబర్‌ 2న నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు మూడో సంతానంగా జన్మించారు నందమూరి హరికృష్ణ. 1967లో విడుదలైన ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంలో బాలకృష్ణుడుగా నటించడం ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తల్లా పెళ్లామా, తాతమ్మ కల, రామ్‌రహీమ్‌ చిత్రాల్లో నటించారు. ఎన్‌.టి.రామారావు స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దానవీరశూర కర్ణ చిత్రంలో అర్జునుడుగా నటించారు హరికృష్ణ. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టలేదు. నిర్మాణ రంగంపై దృష్టి సారించి తమ సొంత బేనర్‌లో నిర్మించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతగా హరికృష్ణ తొలి సినిమా ‘డ్రైవర్‌ రాముడు’. తమ్ముడు బాలకృష్ణ హీరో అయిన తర్వాత పట్టాభిషేకం, అనసూయమ్మగారి అల్లుడు, తిరగబడ్డ తెలుగుబిడ్డ, పెద్దన్నయ్య వంటి చిత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 21 సంవత్సరాల తర్వాత శ్రీరాములయ్య చిత్రంలో సత్యం అనే వైవిధ్యమైన పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దర్శకుడు వై.వి.ఎస్‌.చౌదరి దర్శకత్వంలో రూపొందిన ‘సీతారామరాజు’ చిత్రంలో ఓ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేశారు హరికృష్ణ. నందమూరి నట వారసుడు హరికృష్ణ, అక్కినేని నటవారసుడు నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా సాధించిన విజయంతో వై.వి.యస్‌.చౌదరి తన సొంత బేనర్‌లో నిర్మించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంలో మరో పవర్‌ఫుల్‌ పాత్రతో హరికృష్ణ ఇమేజ్‌ని ఒక్కసారిగా పెంచేశారు. ఆ తర్వాత చేసిన శివరామరాజు, సీతయ్య, టైగర్‌ హరిశ్చంద్రప్రసాద్‌, స్వామి వంటి సినిమాలు హరికృష్ణకు నటుడిగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒక స్టార్‌ హీరో ఇమేజ్‌ ఈ సినిమాలతో లభించింది. ఆ తర్వాత కృష్ణతో కలిసి చేసిన శ్రావణమాసం చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. అదే హరికృష్ణ నటించిన చివరి సినిమా.  ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు దేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించారు. దాని కోసం వినియోగించిన చైతన్య రథం వాహనానికి సారధిగా వ్యహరించారు హరికృష్ణ. 75,000 కిలోమీటర్లు ఆ వాహనాన్ని నడిపి రికార్డు సృష్టించారు. 1995లో అధికార మార్పిడి జరిగినపుడు తండ్రి ఎన్‌.టి.రామారావును వ్యతిరేకిస్తూ చంద్రబాబునాయుడిని సమర్థించారు హరికృష్ణ. ఆయన ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో తండ్రి మరణించడంతో హిందూపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2013లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  నందమూరి హరికృష్ణ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయనకు ముగ్గురు కుమారులు జానకిరామ్‌, కళ్యాణ్‌రామ్‌, తారక్‌రామ్‌. వీరిలో కళ్యాణ్‌రామ్‌, తారక్‌ ఇద్దరూ హీరోలుగా తమ టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకున్నారు. తండ్రి సూచన మేరకు చిన్నతనంలోనే తారక్‌ పేరును నందమూరి తారక రామారావుగా మార్చారు హరికృష్ణ. కళ్యాణ్‌రామ్‌, హరికృష్ణ, ఎన్టీఆర్‌ కలిసి ఓ సినిమా చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. 2014లో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్‌ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇది జరిగిన నాలుగు సంవత్సరాలకే హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించడం విచారకరం. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన నందమూరి హరికృష్ణ జయంతి సెప్టెంబర్‌ 2. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.

మీకు తెలుసా.. ఆ సినిమాకి డైరెక్టర్‌ రాఘవేంద్రరావు కాదు.. విఠలాచార్య!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ‘బాబు’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో ఆయన డైరెక్ట్‌ చేసిన చివరి సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’. అయితే 2021లో వచ్చిన ‘పెళ్లిసందడి’ చిత్రానికి మాత్రం దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 110 సినిమాల్లో మైల్‌ స్టోన్స్‌గా చెప్పుకోదగ్గ సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంటగా వైజయంతి మూవీస్‌ నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఒకటి. 1990 మే 9న ఈ సినిమా రిలీజ్‌ అయింది. ఆరోజుల్లో హయ్యస్ట్‌ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాకి ముందు అగ్ని, రుద్రనేత్ర, ఒంటరిపోరాటం వంటి ఫ్లాప్‌ సినిమాలు చేశారు రాఘవేంద్రరావు. అలాంటి సమయంలో మళ్ళీ చిరంజీవితో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా రిలీజ్‌కి ముందు, రిలీజ్‌ అయిన తర్వాత రకరకాల విమర్శలు వచ్చాయి. అవి ఏమిటి, ఎందుకు వచ్చాయి, సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాలను ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకున్నారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.  ‘ఈ సినిమా చేయడానికి ముందు మూడు ఫ్లాప్‌ సినిమాలు తీసాను. ఇక ఈ సినిమాతో రాఘవేంద్రరావు పనైపోయింది అని ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో నాతో సినిమా చెయ్యడానికి ముందుకొచ్చిన చిరంజీవి, అశ్వనీదత్‌లకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ఈ తరహా సినిమా నేను మాత్రమే తియ్యగలనని నమ్మి నన్ను డైరెక్టర్‌గా పెట్టుకున్నారు. సినిమా పూర్తయింది. ఇళయారాజా బ్యాక్‌గ్రౌండ్‌ చెయ్యాల్సి ఉంది. డబుల్‌ పాజిటివ్‌ రష్‌ చూసిన ఆయన ‘దీనికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అవసరం లేదు.. యాజిటీజ్‌గా రిలీజ్‌ చేసెయ్యొచ్చు. అంత అద్భుతంగా ఉంది’ అన్నారు. ఆ మాట విని నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఆ సంతోషంతోనే అమెరికా ఫ్లైట్‌ ఎక్కాను. సినిమా రిలీజ్‌ అయింది. మొదటి మూడు రోజులు సినిమాకి కలెక్షన్లు లేవు. ఈ సినిమాకి రాఘవేంద్రరావు కాదు డైరెక్టర్‌.. విఠలాచార్య అన్నారంతా. పోస్టర్ల మీద కూడా విఠలాచార్య పేరు వేస్తే బాగుంటుంది అన్నవారు కూడా ఉన్నారు. ఎందుకంటే అలాంటి సినిమాలు తియ్యడంలో విఠలాచార్య ఎక్స్‌పర్ట్‌. సినిమా టాక్‌ చూసి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ భార్య మెడలోని తాళిబొట్టు అమ్ముకోవాలి అంటూ ప్రచారం జరిగింది.  సినిమా రిలీజ్‌ అయిన మూడోరోజు నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా ఘనవిజయం దిశగా పయనించింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చారు. ఆ వర్షాల వల్లే తాడేపల్లిగూడెంలోని ఓ థియేటర్‌లోకి నీళ్లు వచ్చేశాయి. ఫైరింజన్లతో థియేటర్‌లోని నీళ్ళను బయటికి తోడుతుంటే ప్రేక్షకులు మాత్రం కుర్చీలపైకి ఎక్కి మరీ సినిమా చూశారు. ఫ్లాపుల్లో ఉన్న నేను మళ్ళీ డైరెక్టర్‌గా నిలదొక్కుకోగలిగాను అంటే అది ఈ సినిమా వల్లే. అంతటి సెన్సేషనల్‌ మూవీ మళ్ళీ రాదు, చెయ్యలేం కూడా’ అంటూ వివరించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు 

సహజ కవిగా, సామాజిక స్పృహ ఉన్న నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న ఎం.ఎస్‌.రెడ్డి!

ఎం.ఎస్‌.రెడ్డి.. ఈ పేరు వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. మరెన్నో అద్భుత విజయాలు దాగి ఉన్నాయి. కవిగా, గేయ రచయితగా, నిర్మాతగా ఎన్నో సంచలన విజయాలు సాధించారు. ఆయన రచనలు, సినిమాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ముక్కు సూటితనం ఆయనకు పెట్టని ఆభరణం. తప్పు జరిగితే నిలదీసే ధైర్యం, తెగువ ఉన్న వ్యక్తి. ఆయన జీవించి ఉన్న రోజుల్లోనే ‘ఇది నా కథ’ అంటూ తన స్వీయ చరిత్రను స్వయంగా రాశారు. ఇది పుస్తకరూపంలో వచ్చిన తర్వాత ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే అందులో తన సినీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను యధాతథంగా రాయడం వల్ల ఆ వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అయినా ఆరోజు జరిగిన వాస్తవ ఘటనల గురించే రాశాను అంటూ నిర్భయంగా సమాధానమిచ్చారు. సినీ కెరీర్‌ ప్రారంభం నుంచి చనిపోయే వరకు ఎం.ఎస్‌.రెడ్డి తన జీవనశైలిని ఏమాత్రం మార్చుకోలేదు. తాను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు. కవిగా, నిర్మాతగానే కాదు, నటుడిగా కూడా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ఎం.ఎస్‌.రెడ్డి జయంతి ఆగస్ట్‌ 15. ఈ సందర్భంగా ఆయన సాధించిన విజయాలు, ఆయన జీవితంలోని విశేషాల గురించి తెలుసుకుందాం.  ఎం.ఎస్‌.రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందరరామిరెడ్డి. 1924 ఆగస్ట్‌ 15న నెల్లూరులో జన్మించారు. ఆయన కలం పేరు మల్లెమాల. ఈ పేరుతోనే ఎన్నో కవితలు, సినీ గేయాలు రచించారు. ఆయన రాసిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. సహజకవిగా పేరు తెచ్చుకున్న ఎం.ఎస్‌.రెడ్డి ‘తెల్లా వారకముందే పల్లే లేచింది..తన వారినందరినీ తట్టీ లేపింది..’, ‘సన్నాజాజికి, గున్నామావికి పెళ్లి కుదిరింది.’, ‘సంగమం.. సంగమం.. అనురాగ సంగమం’ వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. దాదాపు 5,000 వరకు కవితలు, సినీ గేయాలు రచించారు ఎం.ఎస్‌.రెడ్డి. ఆ తర్వాత నిర్మాతగా మారి కౌముది ఆర్ట్స్‌ బేనర్‌ను స్థాపించి శ్రీకృష్ణ విజయం, ఊరికి ఉపకారి, కోడెనాగు, ముత్యాల పల్లకి, పల్నాటి సింహం, ఏకలవ్య వంటి మంచి సినిమాలను నిర్మించారు.  ఆ తర్వాత కుమారుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నిర్మాతగా, తన సమర్పణలో తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అరుంధతి వంటి సూపర్‌హిట్‌ సినిమాలను నిర్మించారు. అన్నింటినీ మించి బాలతారలతో శబ్దాలయా థియేటర్స్‌ పతాకంపై ‘రామాయణం’ చిత్రాన్ని నిర్మించారు ఎం.ఎస్‌.రెడ్డి. జూనియర్‌ ఎన్‌.టి.ఆర్‌.ను ఈ చిత్రం ద్వారానే పరిచయం చేశారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూర్చడమే కాకుండా పాటలు, పద్యాలు కూడా రాశారు. ఈ సినిమా ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టింది. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రం అవార్డు, రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు దక్కాయి. అంకుశం చిత్రానికి ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది.  తను నిర్మించే ప్రతి సినిమానూ లాభాపేక్షతో కాకుండా ప్రజలకు ఏదో ఒక సందేశాన్ని అందిచాలన్న తపనతోనే నిర్మించేవారు. తన మనసుకు దగ్గరగా ఉన్న కథ అయితే అందులో పాటలు రాసేవారు. చిన్నతనం నుంచీ గాంధేయవాదిగా పేరు తెచ్చుకున్న ఎం.ఎస్‌.రెడ్డి తన ఆలోచనలకు దగ్గరగా ఉంది అనిపిస్తే ఆ పాత్రలో నటించేవారు. అలా చేసిన సినిమాయే ‘అంకుశం’. ఒక స్కూల్‌ మాస్టారుగా జీవితాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిగా ఆ సినిమాలో తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. సహజకవిగా, సామాజిక స్పృహ ఉన్న నిర్మాతగా అందరి మన్ననలు పొందిన ఎం.ఎస్‌.రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.

సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్‌ స్టార్‌ అనిపించుకున్న శ్రీహరి!

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు..’. ఇది సర్వసాధారణంగా కొన్ని సందర్భాల్లో వినిపించే మాట. అయితే ఎందరు మహానుభావులు ఉన్నా.. కొందరు మాత్రమే జనం గుండెల్లోకి వెళ్ళగలరు, తమ మానవత్వంతో వారిని తట్టి లేపగలరు అనేది కొందరి విషయంలో మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా రంగం విషయానికి వస్తే.. ఎందరో మహానటులు ఉన్నారు. కానీ, కొందర్ని మాత్రమే ప్రేక్షకులు తమ గుండెల్లో దాచుకుంటారు. వారి ప్రతిభ పరంగా, సినిమా రంగానికి వారు చేసిన సేవపరంగా నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళే. కానీ, మంచితనం, మానవత్వం, సేవాగుణం, సమాజం కోసం మనమూ ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన మాత్రం కొందరిలోనే ఉంటుంది. అలాంటి కొందరు నటుల్లో రియల్‌ స్టార్‌ శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.  సినిమా హీరో అవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో.. ఒక నిరుపేద కుటుంబం నుంచి సినిమా రంగానికి వచ్చిన శ్రీహరి తను అనుకున్నది సాధించారు. కేవలం 49 సంవత్సరాల వయసులోనే శ్రీహరి మృత్యువు ఒడికి చేరినపుడు బాధపడనివారు లేరు. ప్రత్యక్షంగా, పరోక్షంగా శ్రీహరి వల్ల సాయం పొందినవారు, ఆయన అభిమానులు ఆరోజు లక్షల సంఖ్యలో శ్రీహరి నివాసానికి తరలి వచ్చారు. అతను సినిమాల్లో స్టార్‌ హీరో కాదు. కానీ, నిజజీవితంలో తన మంచితనంతో, మానవత్వంతో స్టార్‌ హీరో అయ్యారు. ఆయన్ని కడసారి చూడాలన్న తపనతో వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా అభిమానులు శ్రీహరి నివాసానికి చేరుకున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఆగస్ట్‌ 15న పుట్టిన శ్రీహరి దాన్ని సార్థకం చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. నిజజీవితంలో రియల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న శ్రీహరి జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని విశేషాలను ఒకసారి మననం చేసుకుందాం.  రఘుముద్రి శ్రీహరి 1964 ఆగస్ట్‌ 15న కృష్ణాజిల్లాలోని యలమర్రు గ్రామంలో జన్మించారు. తండ్రి సత్యనారాయణ, తల్లి సత్యవతి. శ్రీహరికి అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిల్‌ షాపు రన్‌ చేస్తూ సోడాలు అమ్ముతూ జీవనం సాగించేవారు. శ్రీహరి చిన్నతనంలోనే వారి కుటుంబం హైదరాబాద్‌లోని బాలానగర్‌కు వలస వచ్చింది. చదువుకుంటూనే శోభన థియేటర్‌ ఎదురుగా అన్నయ్య పెట్టిన మెకానిక్‌ షాపులో పనిచేసేవారు శ్రీహరి. ఖాళీ దొరికినప్పుడల్లా శోభన థియేటర్‌లో సినిమాలు చూసేవారు. తన 12వ ఏటనే సినిమా రంగంపై ఆసక్తి ఏర్పరుచుకున్నారు. ఎలాగైనా హీరో అవ్వాలి అని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని తను అక్కడ నెగ్గుకు రావాలంటే ఎవరి దగ్గరా లేని ప్రత్యేకత తనలో ఉండాలని భావించారు. చిన్నతనం నుంచి బ్రూస్‌లీ సినిమాలు చూడడం వల్ల శ్రీహరికి మార్షల్‌ ఆర్ట్స్‌పైన ఆసక్తి కలిగింది. అందులో జిమ్నాస్టిక్స్‌ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఉదయం, సాయంత్రం జిమ్నాస్టిక్స్‌లో కఠోర శిక్షణ తీసుకున్నారు. ఏడు సార్లు మిస్టర్‌ హైదరాబాద్‌గా ఎంపికయ్యారు. అలాగే జాతీయ స్థాయిలో రెండుసార్లు విజయం సాధించారు. ఏషియన్‌ గేమ్స్‌లో ఆడాలన్న తన కోరిక మాత్రం నెరవేరలేదు.  డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ సమయంలోనే వంగవీటి మోహనరంగా పరిచయమయ్యారు. చిన్నతనం నుంచీ జిమ్నాస్టిక్స్‌ చేయడం వల్ల పర్‌ఫెక్ట్‌ ఫిజిక్‌తో ఉన్న శ్రీహరిని చూసిన రంగా తను తియ్యబోయే ‘చైతన్యరథం’ సినిమా ద్వారా హీరోగా పరిచయం చెయ్యాలనుకున్నారు. శ్రీహరిని తను హీరోగా పరిచయం చేస్తానని, కొత్తవారితో కాకుండా అనుభవం ఉన్న హీరోతో సినిమా చెయ్యమని రంగాకి సలహా ఇచ్చారు దాసరి నారాయణరావు. అలా దాసరి క్యాంప్‌లో చేరిన శ్రీహరికి ‘బ్రహ్మనాయుడు’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించకపోవడంతో అవకాశాలు ఎక్కువగా రాలేదు. కానీ, అందులో శ్రీహరి చేసిన ఫైట్స్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ చిత్రంలో విలన్‌గా మంచి క్యారెక్టర్‌ లభించింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో శ్రీహరికి అవకాశాలు రావడం మొదలైంది. సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేసే స్థాయి నుంచి ఏడాదికి 10 సినిమాలు చేసే రేంజ్‌కి వెళ్లిపోయారు శ్రీహరి.  హీరో అవ్వాలన్నది శ్రీహరి కల. అందుకే రౌడీ ఇన్‌స్పెక్టర్‌ తర్వాత విలన్‌ క్యారెక్టర్స్‌ చాలా వచ్చినా వాటిని రిజెక్ట్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, మోహన్‌బాబు చెప్పిన మాటలు శ్రీహరిని ఇన్‌స్పైర్‌ చేశాయి. మొదట తామూ విలన్స్‌గానే నటించామని, వచ్చిన అవకాశాలను వదులుకోకుండా చేస్తూ పోతే ఏదో ఒకరోజు హీరోగా ఛాన్స్‌ వస్తుందని చెప్పడంతో అప్పటి నుంచి వచ్చిన ఏ అవకాశాన్ని శ్రీహరి వదులుకోలేదు. చివరికి 1999లో ‘సాంబయ్య’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు శ్రీహరి. ఈ సినిమాలో అతని నటన, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, డూప్‌ లేకుండా చేసిన ఫైట్స్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కె.ఎస్‌.నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం అతని డైరెక్షన్‌లోనే చేసిన ‘పోలీస్‌’ చిత్రం శ్రీహరిని రియల్‌ స్టార్‌గా నిలబెట్టింది. హీరో అవ్వాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి 50కి పైగా సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు, విలన్‌ క్యారెక్టర్స్‌ చెయ్యాల్సి వచ్చింది. శ్రీహరి హీరోగా 28 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. అతని కెరీర్‌లో ఉత్తమ విలన్‌గా, ఉత్తమ సహాయనటుడిగా 6 నంది అవార్డులు అందుకున్నారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు, ఫిలింఫేర్‌ అవార్డు లభించాయి.  ఇక శ్రీహరి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1996లో డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు శశాంక్‌, మేఘాంశ్‌, కుమార్తె అక్షర. అయితే నాలుగు నెలల వయసులోనే అక్షర కన్ను మూసింది. ఆమె జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్‌ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్లోరైడ్‌ బారిన పడి బాధపడుతున్న మూడు గ్రామాల ప్రజల కోసం రూ.50 లక్షల ఖర్చుతో ఫ్లోరైడ్‌ రహిత మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. అలాగే మేడ్చల్‌లోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ ఫౌండేషన్‌ స్థాపించక ముందు సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికీ నేనున్నానంటూ ధైర్యం చెప్పి వారిని ఆదుకునే వారు. తాము చేసే సహాయం కుమార్తె పేరున చేస్తే బాగుంటుందని భార్య శాంతి ఇచ్చిన సలహా మేరకు ఫౌండేషన్‌ స్థాపించి దాని ద్వారా సాయం అందిస్తున్నారు. తను సినిమాలు చేయడం ద్వారా సంపాదించిన దానిలో సగభాగం సేవా కార్యక్రమాలకే ఖర్చు పెట్టేవారు శ్రీహరి. తన నటనతో సినిమాల్లో రియల్‌ స్టార్‌ అనిపించుకోవడమే కాదు, నిజ జీవితంలోనూ రియల్‌ స్టార్‌ అనిపించుకున్న శ్రీహరి జయంతి సందర్భంగా మానవత్వం పరిమళించిన ఆ మంచి మనిషికి ఘనంగా నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.

టాప్‌ హీరోలందరితో నటించిన ఒన్‌ అండ్‌ ఓన్లీ హీరోయిన్‌.. అతిలోక సుందరి శ్రీదేవి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరి ఎవరు అంటే అందరూ ఠక్కున చెప్పే పేరు అందాల తార శ్రీదేవి. తెలుగుతోపాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో టాప్‌ హీరోయిన్‌ అనిపించుకోవడమే కాకుండా హిందీలోనూ తన అందచందాలతో, అభినయంతో ఉత్తరాది ప్రేక్షకుల్ని కట్టిపడేసారు. టాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌కీ లేని ప్రత్యేకత శ్రీదేవికి మాత్రమే ఉంది. అదేమిటంటే.. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కి పైగా సినిమాల్లో నటించారు. వీటిలో ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమాలే ఎక్కువ శాతం ఉండడం విశేషం. అంతకుముందు తరం హీరోయిన్లు అయినా, శ్రీదేవి తర్వాత వచ్చిన హీరోయిన్లు అయినా అంత ఎక్కువ సంఖ్యలో హీరోయిన్‌గా నటించలేదు. అన్ని భాషల్లోనూ అందరు టాప్‌ హీరోలతో కలిసి నటించిన ఘనత కూడా శ్రీదేవికే దక్కుతుంది. ఇప్పటికీ శ్రీదేవి అంటే అందరూ ఎంతో అభిమానాన్ని చూపిస్తారు అంటే దానికి కారణం ప్రేక్షకుల మనసుల్లో ఆమె అంత గాఢ ముద్రే. ఆగస్ట్‌ 13 శ్రీదేవి జయంతి. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.  1963 ఆగస్ట్‌ 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. తల్లిపేరు రాజేశ్వరి, తండ్రి పేరు అయ్యప్పన్‌. ఈమెకు సోదరి శ్రీలత, సోదరుడు సతీష్‌ ఉన్నారు. 1967లో వచ్చిన కన్‌దన్‌ కరుణై చిత్రంతో బాలనటిగా తన నటజీవితాన్ని ప్రారంభించారు శ్రీదేవి. అదే సంవత్సరం ఆమె నటించిన రెండో సినిమా తుణైవన్‌ విడుదలైంది. ఈ రెండు సినిమాల్లోనూ శ్రీదేవి బాలమురుగన్‌గా నటించడం విశేషం. తెలుగులో ఆమె తొలి చిత్రం మానాన్న నిర్దోషి. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో బాలనటిగానే 60కి పైగా సినిమాల్లో నటించింది. ఇంతవరకు హీరోయిన్‌ అన్ని సినిమాల్లో బాలనటిగా కనిపించలేదు.  1977లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 16 వయతినిలే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచమయ్యారు శ్రీదేవి. 1978లో పదహారేళ్ళ వయసు పేరుతో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేశారు. తెలుగు, తమిళ్‌ భాషల్లో ఒకే కథతో రూపొందిన సినిమా ద్వారా శ్రీదేవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత సౌత్‌లోని అన్ని భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తూ, అందరు హీరోల సరసన నటిస్తూ దాదాపు రెండు దశాబ్దాలపాటు హీరోయిన్‌గా నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారు శ్రీదేవి. దక్షిణాది సినిమాలతో ఎంత పేరు తెచ్చుకున్నారో దాన్ని మించిన స్థాయిలో ఉత్తరాదిన హీరోయిన్‌గా తనకు తిరుగులేదు అనిపించుకున్నారు. తొలిరోజుల్లో శ్రీదేవి నటించిన హిందీ సినిమాలకు నటి రేఖ డబ్బింగ్‌ చెప్పేవారు. ఆ తర్వాత తన సొంతంగానే డబ్బింగ్‌ చెప్పుకోవడం ప్రారంభించారు.  తెలుగులో అప్పటి స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు సరసన హీరోయిన్‌గా నటించారు శ్రీదేవి. ఈ హీరోలు నటించిన ఎన్నో సినిమాల్లో మనవరాలిగా, కూతురుగా నటించి వారి పక్కనే హీరోయిన్‌గా నటించడం విశేషం. ఆ తర్వాతి తరంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలతో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు. అప్పటి టాప్‌ హీరోల్లో బాలకృష్ణ సరసన నటించే అవకాశం శ్రీదేవికి రాలేదు. ఇక తమిళ్‌లో శివాజీ గణేశన్‌, రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి హీరోలతో లెక్కకు మించిన సినిమాలు చేశారు. అయితే శ్రీదేవి కెరీర్‌లో కమల్‌హాసన్‌తోనే ఎక్కువ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆ రికార్డును ఏ హీరో బ్రేక్‌ చెయ్యలేదు. ఇక హిందీ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరితోనూ శ్రీదేవి నటించారు. రాజేష్‌ ఖన్నా, ధర్మేంద్ర వంటి సీనియర్‌ హీరోలతోపాటు మిథున్‌ చక్రవర్తి, అనిల్‌ కపూర్‌, సన్నిడియోల్‌, రిషి కపూర్‌, జితేంద్ర వంటి యంగ్‌ హీరోలతోనూ జత కట్టారు. అయితే అందరికంటే జితేంద్రతోనే శ్రీదేవి ఎక్కువ సినిమాలు చేశారు. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన సినిమాల హిందీ రీమేక్స్‌ అన్నీ జితేంద్రతోనే నిర్మించేవారు. అందులో శ్రీదేవినే హీరోయిన్‌గా తీసుకునేవారు.  బాలనటి దగ్గర నుంచి తీసుకుంటే దాదాపు 50 సంవత్సరాలపాటు నటిగా కొనసాగిన శ్రీదేవి టాప్‌ హీరోయిన్‌గా 20 సంవత్సరాల పాటు తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. ఎన్ని భాషల్లో ఎన్ని సినిమాలు చేసినా ఎక్కడా ఎవరితోనూ వివాదాలకు తావులేకుండా తన కెరీర్‌ను కొనసాగించారు. 1996లో బాలీవుడ్‌ నిర్మాత, హీరో అనిల్‌కపూర్‌ సోదరుడు బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు శ్రీదేవి. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించారు. అయితే అందులో హిందీ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో శ్రీదేవి నటించిన చివరి సినిమా 1994లో చిరంజీవి హీరోగా వచ్చిన ఎస్‌.పి.పరశురామ్‌. తమిళ్‌లో 2015లో విజయ్‌ హీరోగా వచ్చిన పులి ఆమె చివరి సినిమా. హిందీలో ఆమె చివరి సినిమా షారూక్‌ఖాన్‌ హీరోగా వచ్చిన జీరో చిత్రం.  వ్యక్తిగత జీవితానికి వస్తే.. శ్రీదేవి హిందీ చిత్రం లమ్‌హే షూటింగ్‌లో ఉండగా తండ్రి అయ్యప్పన్‌ మరణించగా, జుదాయి చిత్రం షూటింగ్‌ సమయంలో తల్లి రాజేశ్వరి కన్ను మూశారు. హిందూ సంప్రదాయం ప్రకారం కొడుకు తల్లి చితికి నిప్పు అంటించాలి. కానీ, కూతురు అయినప్పటికీ శ్రీదేవే ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషి. జాన్వీ హిందీలో సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న ‘దేవర’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె చెల్లెలు ఖుషి కూడా నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.  తను హీరోయిన్‌గా ఎంత పేరు తెచ్చుకుందో తన కుమార్తెలు కూడా ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కలలు కన్నారు శ్రీదేవి. జాన్వీని హీరోయిన్‌గా ప్రమోట్‌ చేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, కూతురి తెరంగేట్రం చూడకుండానే తుది శ్వాస విడిచారు. దుబాయ్‌లో తమ బంధువు వివాహానికి హాజరైన శ్రీదేవి ఒక ప్రమాదంలో మరణించారు. శ్రీదేవి మరణం అందర్నీ కలచివేసింది. దేశవ్యాప్తంగా అంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న హీరోయిన్‌ మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. తన అందచందాలతో, అభినయంతో దేశ ప్రజల మనసుల్లో బలమైన ముద్ర వేసిన శ్రీదేవి జయంతి ఆగస్ట్‌ 13. ఈ సందర్భంగా ఆ అతిలోక సుందరికి ఘనంగా నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.

భారతదేశంలోనే పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి హాస్యనటుడు రేలంగి!

హాస్యాన్ని ఇష్టపడని ప్రేక్షకులు ఒక్క శాతం కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే హాస్యానికి అంతటి శక్తి ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది, ఏదో ఒక విషాదం ఉంటుంది. వాటన్నింటినీ మటు మాయం చేసేది హాస్యం. హాయిగా నవ్వుకోవడం వల్ల తక్కువ అనారోగ్యానికి గురవుతారని డాక్టర్లే చెబుతుంటారు. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన హాస్యాన్ని పండించడంలో ఎంతో మంది పేరు తెచ్చుకున్నారు. వారిలో రేలంగి వెంకట్రామయ్యకు ఓ విశష్ట స్థానం ఉంది. ఆయన హాస్యనటుడిగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. భారతదేశంలోనే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న తొలి హాస్యనటుడు రేలంగి. మిగతా నటీనటులతో పోలిస్తే ఆయన ప్రయాణం ఎంతో సుదీర్ఘమైనది. ఆగస్ట్‌ 9 రేలంగి వెంకట్రామయ్య జయంతి. ఈ సందర్భంగా ఈ హాస్య నటచక్రవర్తి అంతటి స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టాలు, ఆయన జీవితంలోని విశేషాల గురించి తెలుసుకుందాం.  1910 ఆగస్ట్‌ 9న రావులపాలెం సమీపంలోని రావులపాడులో జన్మించారు రేలంగి. తండ్రి రామస్వామి, తల్లి అచ్చాయమ్మ. వీరికి ఒక్కగానొక్క సంతానం రేలంగి. ఆయన మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తల్లి మరణించారు. ఆ తర్వాత అచ్చాయమ్మ చెల్లెలు గౌరమ్మను వివాహం చేసుకున్నారు రామస్వామి. ఆయన పూర్వీకులు ఆబ్కారీ వ్యాపారం చేసేవారు. దాన్ని ఇష్టపడని రామస్వామి ఓ స్కూల్‌లో సంగీతం మాస్టారుగా పనిచేసేవారు. పిల్లలకు సంగీతం, హరికథలు చెప్పడం నేర్పించేరు. అలా తండ్రి దగ్గర ఆ కళలన్నీ నేర్చుకున్నారు రేలంగి. కొడుకు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తే బాగుంటుందని అనుకున్నారు రామస్వామి. కానీ, రేలంగి నాటకాలపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు. దీంతో 9వ తరగతితో చదువుకు స్వస్తి పలికారు. నటనపట్ల వున్న ఆసక్తిని గమనించిన రామస్వామి అతని ప్రయత్నాలకు అడ్డు చెప్పలేదు. 1919లో యంగ్‌మెన్‌ హ్యాపీ క్లబ్‌లో చేరిన రేలంగి నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. ఎస్వీ రంగారావు, అంజలీదేవి వంటి వారితో కలిసి నటించేవారు. ఆరోజుల్లో స్త్రీ పాత్రలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ అవకాశాలన్నీ రేలంగికే వచ్చేవి. అలా 1935 వరకు నాటకాలు వేస్తూనే గడిపారు.  1935లో నిర్మించిన ‘శ్రీకృష్ణతులాబారం’ చిత్రంలో మొదటి అవకాశం వచ్చింది. అయితే అది విజయం సాధించకపోవడంతో రేలంగి చేసిన పాత్రకు కూడా అంతగా గుర్తింపు రాలేదు. దాంతో మళ్ళీ కాకినాడకు వచ్చేసి నాటకాలు వేయడం ప్రారంభించారు రేలంగి. తన ఆత్మీయుడైన పరదేశి సహకారంతో కలకత్తాలో ఉన్న దర్శకుడు సి.పుల్లయ్యను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా, క్యాస్టింగ్‌ అసిస్టెంట్‌గా, ప్రొడక్షన్‌ మేనేజర్‌గా.. ఇలా పలు శాఖల్లో దాదాపు 15 సంవత్సరాలు సి.పుల్లయ్య దగ్గరే పనిచేశారు రేలంగి. క్యాస్టింగ్‌ ఏజెంట్‌ కావడం వల్ల ఆయన చేతుల మీదుగా ఎంతో మంది కొత్త ఆర్టిస్టులు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. వీరిలో పుష్పవల్లి, కృష్ణవేణి, భానుమతి, అంజలీదేవి వంటి నటీమణులు ఉన్నారు. ఆ తర్వాత నిర్మాతలుగా మారిన భానుమతి, అంజలీదేవి కృతజ్ఞతగా రేలంగికి తాము నిర్మించిన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. 1948లో వచ్చిన ‘వింధ్యరాణి’, 1949లో వచ్చిన ‘కీలుగుర్రం’ చిత్రాలు రేలంగి కెరీర్‌ని మలుపు తిప్పాయి. ఈ రెండు సినిమాల్లో రేలంగి చేసిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. కె.వి.రెడ్డి రూపొందించిన ‘గుణసుందరి కథ’ చిత్రంతో రేలంగికి అవకాశాలు వెల్లువలా రావడం ప్రారంభమైంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన రేలంగికి అందరూ అవకాశాలు ఇచ్చేవారు. అప్పట్లో ప్రతి సినిమాలోనూ రేలంగి ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉండేవారు. మిస్సమ్మ, మాయాబజార్‌, పాతాళభైరవి, అప్పుచేసి పప్పుకూడు, వెలుగు నీడలు, నర్తనశాల, విప్రనారాయణ వంటి సినిమాల్లో చేసిన పాత్రలు కథానాయకుడితో సమానంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. నటుడిగానే కాదు, సింగర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు రేలంగి. వినవే బాల.. నా ప్రేమగోల, ధర్మం చెయ్‌ బాబూ, సరదా సరదా సిగరెట్టు.. వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆ తర్వాత ‘సామ్రాజ్యం’ పేరుతో ఓ సినిమాను నిర్మించారు రేలంగి. హాస్యనటుడు రాజబాబుకి ఇదే మొదటి సినిమా.  తను చేసిన సినిమాల ద్వారా మంచి పేరు, డబ్బు సంపాదించిన తర్వాత తనకు తానే అవకాశాలు తగ్గించుకున్నారు. తోటి హాస్యనటులకు అవకాశాలు రావాలన్న ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు రేలంగి. అంతేకాదు, ఉత్తమ హాస్యనటులకు ఇచ్చే పురస్కార పోటీ నుంచి కూడా స్వచ్ఛందంగా తప్పుకున్నారు. రేలంగికి లభించిన పురస్కారాలు, పొందిన సత్కారాలకు లెక్కే లేదు. అన్నింటినీ మించి భారతదేశంలోనే మొదటిసారి పద్మశ్రీ అవార్డును అందుకున్న హాస్యనటుడు రేలంగి. 1959 మే 14న మద్రాస్‌లోని తెలుగు జర్నలిస్టు అసోసియేషన్‌ రేలంగితో గజారోహణ చేయించారు. రేలంగిని ఏనుగుపై ఎక్కించి మద్రాసు పురవీధుల్లో తిప్పారు. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. రేలంగి పుట్టింది రావులపాడులో, పెరిగింది కాకినాడలో అయినా తాడేపల్లిగూడెం అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఎందుకంటే అక్కడి ప్రజలు ఆయన్ని ఎంతో అభిమానించేవారు. వారి కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశంతో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఆ ఊరిలో రేలంగి చిత్ర మందిర్‌ పేరుతో ఓ సినిమా థియేటర్‌ను నిర్మించారు. ఈ థియేటర్‌ ప్రారంభోత్సవానికి ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.  రేలంగి వివాహం 1933 డిసెంబర్‌ 8న బుచ్చియమ్మతో జరిగింది. తను ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి.. కళాశాలలకు విరాళాలు ఇవ్వడం ద్వారా, ఎంతో మందికి వివాహాలు చేయించడం ద్వారా కరిగిపోయింది. ప్రతిరోజూ రేలంగి ఇంట్లో అన్నదాన కార్యక్రమం జరిగేది. అడిగిన వారికి లేదనకుండా ఎన్నో దానధర్మాలు చేశారు రేలంగి. దానికి భార్య సహకారం కూడా ఎంతో ఉండేది. రేలంగికి కూడా ఒకే ఒక్క సంతానం. పేరు సత్యనారాయణబాబు. ఈయన కూడా చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ పెంచుకున్నారు. బాలానందం అనే సినిమాలో నటించారు కూడా. ఆ తర్వాత తండ్రికి ఇచ్చిన మాట కోసం సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరి దశలో రేలంగి నడుము నొప్పితో బాధపడ్డారు. అది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా గుర్తించారు. ఆరోగ్యం క్షీణించడంతో 1975 నవంబర్‌ 27న తాడేపల్లిగూడెంలోని తన స్వగృహంలో కన్నుమూసారు రేలంగి. హాస్యనట చక్రవర్తిగా ఏ హాస్యనటుడికీ లభించని గౌరవాన్ని, ఖ్యాతిని దక్కించుకున్న రేలంగి వెంకట్రామయ్యకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.  

రెహమాన్‌ మ్యూజిక్‌లో తమిళ్‌ పాట పాడేందుకు ఒప్పుకున్న మైఖేల్‌ జాక్సన్‌. కానీ...

పాప్‌స్టార్‌గా మైఖేల్‌ జాక్సన్‌కి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెపక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. జాక్సన్‌ పాటలంటే చెవి కోసుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన జాక్సన్‌.. సింగర్‌గా, డాన్సర్‌గా, మ్యూజిక్‌ కంపోజర్‌గా, లిరిక్‌ రైటర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి గొప్ప కళాకారుడ్ని కలవడమే మహాభాగ్యంగా అందరూ భావించేవారు. అలాంటిది అతనితో ఒక పాట పాడించాలనుకున్నారు ఆస్కార్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌.  సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా శంకర్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘రోబో’ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం జరుగుతున్న రోజులవి. ఈ సినిమాకి  సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఎ.ఆర్‌.రెహమాన్‌ లాస్‌ ఏంజిలిస్‌లో ఉన్నారు. అతనికి ఎందుకో మైఖేల్‌ జాక్సన్‌ని ఒకసారి కలవాలి అనిపించింది. ఇదే విషయాన్ని తన మేనేజర్‌కి చెప్పడంతో అతను జాక్సన్‌ పి.ఎ.తో మాట్లాడాడు. అతను మరో మాట లేకుండా ‘తప్పకుండా కలవొచ్చు’ అని చెప్పాడు. ఇది జరిగి వారం రోజులు గడిచినా అటువైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అదే టైమ్‌లో తాను ఆస్కార్‌ నామినేషన్స్‌లో ఉన్నట్టు అకాడమీ ప్రకటించింది. అప్పుడు జాక్సన్‌ తనని కలవాలనుకుంటున్నారని రెహమాన్‌కి మెయిల్‌ వచ్చింది. ఆస్కార్‌లో తన నామినేషన్‌ ఉంది కాబట్టి ఒకవేళ అవార్డు గెలిస్తే అతన్ని కలవాలని డిసైడ్‌ అయ్యారు. అందుకే జాక్సన్‌కి రెహమాన్‌ రిప్లై ఇవ్వలేదు.  ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం మేరకు అవార్డుల వేడుకకు హాజరయ్యారు రెహమాన్‌. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రంలోని ‘జయహో..’ పాటకు రెహమాన్‌ను ఆస్కార్‌ అవార్డు వరించింది. ఆ ఫంక్షన్‌ జరిగిన మరుసటి రోజు సాయంత్రం మైఖేల్‌ జాక్సన్‌ను కలిసేందుకు వెళ్లారు రెహమాన్‌. తనను ఓ గదిలో కూర్చోమని చెప్పారు. అప్పుడు చేతులకు గ్లోవ్స్‌ ధరించిన ఒక వ్యక్తి రెహమాన్‌ ఉన్న గదిలోకి వచ్చారు. అతనే మైఖేల్‌ జాక్సన్‌. అప్పుడు రెహమాన్‌ ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే తన చేతిలో గెలుచుకున్న ఆస్కార్‌ అవార్డులు ఉన్నాయి. రెహమాన్‌తో జాక్సన్‌ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అతన్ని కలుసుకున్న ఆ మధుర క్షణాలను తను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని రెహమాన్‌ చెబుతారు. ఇది జరిగిన తర్వాత చెన్నయ్‌ తిరిగి వచ్చేశారు రెహమాన్‌. ‘రోబో’ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ను మొదలు పెట్టారు. ఆ సమయంలోనే తను మైఖేల్‌ జాక్సన్‌ని కలిసిన విషయం డైరెక్టర్‌ శంకర్‌కి చెప్పారు రెహమాన్‌. అప్పుడు ‘మనం మైఖేల్‌ జాక్సన్‌తో పాట పాడిస్తే ఎలా ఉంటుంది?’ అని శంకర్‌ని అడిగారు రెహమాన్‌. ‘మరి తమిళ్‌ పాట పాడతారా’ అనే సందేహాన్ని వెలిబుచ్చారు శంకర్‌. ఇదే విషయం గురించి మైఖేల్‌ జాక్సన్‌తో మాట్లాడారు రెహమాన్‌. దానికి జాక్సన్‌ ‘తప్పకుండా పాడతాను’ అని అన్నారట. అయితే అది సాధ్యపడలేదు. ఇది జరిగిన కొన్నిరోజులకే మైఖేల్‌ జాక్సన్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత 50 సంవత్సరాల వయసులోనే ఆయన మరణించడం అందరికీ తెలిసిందే. అలా జాక్సన్‌తో పాట పాడించాలనుకున్న రెహమాన్‌ కోరిక నెరవేరలేదు.

డైరెక్టర్‌ టి.రాజేందర్‌ మోసానికి బలైన నిర్మాతలు.. విడుదలకు నోచుకోని సినిమా!

ప్రస్తుతం టాప్‌ హీరోలుగా ఇండస్ట్రీలో చలామణి అవుతున్న నట వారసులంతా కేవలం సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉండడం వల్లే ఆ స్థాయికి రాలేదు. టాలెంట్‌, క్రమశిక్షణ, కృషి, హీరోగా నిలబడాలన్న పట్టుదల వల్లే హీరోలుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే కొందరు హీరోల తనయులు ఆ విషయాలను అంత సీరియస్‌గా తీసుకోకుండా, కెరీర్‌ పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మరుగున పడిపోయారు. అలాంటి వారిలో సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు ఒకరు. 1974లో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రమేష్‌బాబు 1981 వరకు ఆరు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. ఆ తర్వాత 1987లో ‘సామ్రాట్‌ ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. హిందీలో సూపర్‌హిట్‌ అయిన ‘బేతాబ్‌’ చిత్రం రీమేక్‌గా ‘సామ్రాట్‌’ రూపొందింది.  1983లో టి.రాజేందర్‌ దర్శకత్వంలో వచ్చిన అనువాద చిత్రం ‘ప్రేమసాగరం’ తెలుగులో పెద్ద సంచలనం సృష్టించింది. రాజేందర్‌ దర్శకత్వంలో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, సంగీతం.. ఇలా పలు శాఖలు నిర్వహించేవారు. యూత్‌పుల్‌ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత రాజేందర్‌ దర్శకత్వంలోనే వచ్చిన ‘ప్రేమ సామ్రాజ్యం’, ‘మైథిలీ నా ప్రేయసి’ చిత్రాలు కూడా ఘనవిజయం సాధించాయి. ఆ సమయంలో రమేష్‌బాబు హీరోగా రాజేందర్‌ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేస్తే అతని కెరీర్‌కి బాగా ప్లస్‌ అవుతుందని భావించారు సూపర్‌స్టార్‌ కృష్ణ. అలా 1988లో రమేష్‌బాబు, టి.రాజేందర్‌ కాంబినేషన్‌లో ‘ప్రేమచరిత్ర’ చిత్రం ప్రారంభమైంది. రమేష్‌బాబు సరసన శ్రీభారతిని హీరోయిన్‌ ఎంపిక చేశారు. మొత్తం నాలుగు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఈ సినిమాకి కృష్ణ సోదరుడు హనుమంతరావు బావమరుదులు శాఖమూరి రాంబాబు, శాఖమూరి సూరిబాబు నిర్మాతలు.  ఫస్ట్‌ షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశారు. రెండో షెడ్యూల్‌ జరుగుతున్న సమయంలో ఒకరోజు సెట్‌లో హీరోయిన్‌ శ్రీభారతితో దర్శకుడు రాజేందర్‌కు గొడవ జరిగింది. తను చెప్పినట్టు చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంలో ఆమెపై చేయి చేసుకున్నారు కూడా. దాంతో భయపడిపోయిన శ్రీభారతి తను ఈ సినిమా చెయ్యనని సెట్‌ నుంచి వెళ్లిపోయింది. అప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్‌ చాందినిని ఎంపిక చేశారు. ఆ తర్వాత మూడో షెడ్యూల్‌ను ప్రారంభించి కొన్నిరోజులు షూటింగ్‌ చేశారు. కానీ, అనుకోని అవాంతరాల వల్ల షూటింగ్‌ సరిగా జరగలేదు. అలా కొన్ని నెలలపాటు షూటింగ్‌ ఆగిపోయింది.  1989 డిసెంబర్‌ 15న ‘ప్రేమచరిత్ర’ షూటింగ్‌ మళ్ళీ ప్రారంభమైంది. అయితే ఆలస్యమైన కారణంగా కథలో చాలా మార్పులు చేశారు. అంతేకాదు, అంతకుముందు అనుకున్న కొందరు ఆర్టిస్టులను కూడా పక్కన పెట్టి వేరే ఆర్టిస్టులను తీసుకున్నారు. అప్పటివరకు తీసిన సినిమాను పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్‌ చేశారు. ఈసారి ఎక్కడా బ్రేక్‌ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా సినిమా కంప్లీట్‌ అయింది. ఈ సినిమాకి సంబంధించిన ఆడియోను మార్కెట్‌లోకి విడుదల చేశారు. అప్పటికి టి.రాజేందర్‌ పాటలకు జనంలో మంచి క్రేజ్‌ ఉంది. ‘ప్రేమచరిత్ర’ పాటలు కూడా చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. 1990లో మే 31న సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు కానుకగా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్‌ చేశారు.  సినిమా ప్రారంభించే ముందు రాజేందర్‌ తయారు చేయించిన అగ్రిమెంట్‌లో ఏముందో చూసుకోకుండా నిర్మాతలు సంతకాలు పెట్టేశారు. తనకు అనుకూలంగా ఆ అగ్రిమెంట్‌ని తయారు చేయించుకున్నారు రాజేందర్‌. దాంతో ‘ప్రేమచరిత్ర’ చిత్రం పూర్తి హక్కులు ఆయన సొంతమయ్యాయి. ఈ విషయంలో దర్శకుడికీ, నిర్మాతలకు మధ్య పెద్ద గొడవే జరిగింది. అలా ‘ప్రేమచరిత్ర’ సినిమా విడుదల ఆగిపోయింది. ఇదే చిత్రాన్ని కొన్ని మార్పులు చేసి ‘శాంతియాంతు శాంతి’ పేరుతో తమిళ్‌లో విడుదల చేశారు రాజేందర్‌. తమిళ్‌ వెర్షన్‌లో రాజేందర్‌ ఓ ముఖ్య పాత్ర పోషించగా, అతనికి భార్యగా హీరోయిన్‌ రాధ నటించారు. అప్పటికే రాధ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉండడంతో టైటిల్‌ కూడా సినిమాలోని ఆమె పాత్ర పేరుతోనే పెట్టారు. ఆ సినిమా అక్కడ ఘనవిజయం సాధించి రాజేందర్‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అలా రమేష్‌బాబు నటించిన సినిమా తమిళ్‌లో కూడా విడుదలైంది. తమిళ దర్శకుడు టి.రాజేందర్‌ మోసానికి తెలుగు నిర్మాతలు రాంబాబు, సూరిబాబు బలయ్యారు. అప్పటికే ‘ప్రేమచరిత్ర’ పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. అదే ఊపులో సినిమా కూడా రిలీజ్‌ అయి ఉంటే కృష్ణ అనుకున్నట్టుగా రమేష్‌బాబుకి చాలా ప్లస్‌ అయి ఉండేది. ఈ సినిమా తెలుగులో రిలీజ్‌ కాకపోవడం అతని దురదృష్టమే అనుకోవాలి. రమేష్‌బాబు కెరీర్‌లో ప్రారంభమై ఆగిపోయిన సినిమాలు, మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఓ అరడజను ఉంటాయి.

12 ఏళ్ళ క్రితం నాగార్జున రిజెక్ట్‌ చేసిన రాఘవేంద్రరావు సినిమా.. అది ఇప్పటికీ రిలీజ్‌ కాలేదు!

కింగ్‌ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు వచ్చాయి. ఆఖరి పోరాటం, జానకి రాముడు, ఘరానాబుల్లోడు వంటి కమర్షియల్‌ హిట్స్‌ వీరి ఖాతాలో ఉన్నాయి. ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా వారి కాంబినేషన్‌లో భక్తిరసాత్మక చిత్రం ‘అన్నమయ్య’ రాబోతోందనే ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. కమర్షియల్‌ సినిమాలు చేసే రాఘవేంద్రరావు ఇలాంటి భక్తి చిత్రం చెయ్యడం ఏమిటి? అందులోనూ నాగార్జున అన్నమయ్య ఏమిటి? అంటూ అందరూ విమర్శలు గుప్పించారు. అవేవీ పట్టించుకోకుండా సిన్సియర్‌గా అన్నమయ్య చిత్రాన్ని తెరకెక్కించారు రాఘవేంద్రరావు. ఎవరూ ఊహించని విధంగానే సినిమా సంచలన విజయం సాధించింది. నాగార్జున, రాఘవేంద్రరావులపై ప్రశంసల వర్షం కురిసింది. విమర్శించిన వారు సైతం అభినందించారు. జాతీయ అవార్డులు, నంది అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు కొల్లగొట్టింది అన్నమయ్య. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లోనే రూపొందిన ‘శ్రీరామదాసు’ కూడా ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. అంతేకాదు, నంది అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు గెలుచుకుంది.  ‘శ్రీరామదాసు’ విడుదలైన ఆరు సంవత్సరాల తర్వాత మరో భక్తి సినిమా చెయ్యాలనుకున్నారు రాఘవేంద్రరావు. ఇదే విషయాన్ని నాగార్జునకు చెబుతూ ‘ఇంటింటా అన్నమయ్య’ పేరుతో ఓ సోషియో ఫాంటసీ సినిమా చేస్తే బాగుంటుంది అన్నారు. ఆ ప్రతిపాదన నాగార్జునకు నచ్చలేదు. కానీ, ఆ విషయాన్ని పైకి చెప్పలేదు. విని ఊరుకున్నారు. నాగార్జున ఉద్దేశంలో ‘అన్నమయ్య’లాంటి క్లాసిక్‌ను క్యాష్‌ చేసుకోవడానికి అదే పేరుతో మరో సినిమా చెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ పేరుతోనే మళ్ళీ సినిమా చేస్తున్నామంటే దాన్ని మించి ఏదో ఉండాలి. ప్రేక్షకులు కూడా ఆ ఊహతోనే థియేటర్‌కి వస్తారు. వారి అంచనాలను అందుకోలేకపోతే అందరం అభాసుపాలవుతాం అనుకున్నారు. రాఘవేంద్రరావు చెప్పిన దాన్ని ఔనని, కాదని అనుకుండా.. ‘మీరు సాయిబాబా భక్తులు కదా.. అలాంటి కథ చేస్తే బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి’ అన్నారు నాగార్జున. ఈ చర్చ జరిగిన కొన్ని రోజుల వరకు మళ్ళీ వారిద్దరి మధ్య ఆ టాపిక్‌ రాలేదు.  ప్రతి ఆదివారం నాగార్జున ఇంట్లో పార్టీ ఉంటుంది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌ అంతా సరదాగా ఆరోజు కలుస్తారు. అలా ఓ ఆదివారం పార్టీ జరుగుతున్న టైమ్‌లో సడన్‌గా నాగార్జునకు షిరిడీ వెళ్ళాలనిపించింది. అనుకున్నదే తడవుగా మరుసటిరోజు తన స్నేహితుడు మహేష్‌రెడ్డిని కలిసి షిరిడీ వెళ్లేందుకు రెడీ అయిపోయారు. రాఘవేంద్రరావుకు ఈ విషయం చెప్పకుండానే సాయిబాబాను దర్శించుకొని హైదరాబాద్‌ వచ్చేశారు నాగార్జున. అదేరోజు నాగార్జునను కలిసేందుకు రాఘవేంద్రరావు వచ్చారు. ‘మీరు చెప్పినట్టుగానే మనం షిరిడీ సాయి కథతో సినిమా చేస్తున్నాం. ఈసారి మీరు భక్తుడిగా కాదు, బాబాగా నటిస్తారు’ అని చెప్పడంతో నాగార్జున ఆశ్చర్యపోయారు. తాను అనుకోకుండా షిరిడీ వెళ్ళి రావడం, వచ్చిన వెంటనే ఈ సినిమా ఓకే అవ్వడం విచిత్రంగా అనిపించింది. పైగా ఈ సినిమాకి తన స్నేహితుడు మహేష్‌రెడ్డి నిర్మాత. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో చేసిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాల్లో భక్తుడిగా నటించిన నాగార్జున ‘శిరిడిసాయి’ చిత్రంలో సాయిబాబాగా నటించి మెప్పించారు.  ఇదిలా ఉంటే.. రాఘవేంద్రరావు మొదట ప్రతిపాదించిన ‘ఇంటింటా అన్నమయ్య’ చిత్రాన్ని ‘శ్రీరామరాజ్యం’ చిత్రాన్ని నిర్మించిన యలమంచిలి సాయిబాబు నిర్మించారు. 2012లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో నటించిన నందమూరి బాలకృష్ణ, నయనతార హాజరయ్యారు. నిర్మాత యలమంచిలి సాయిబాబు తనయుడు రేవంత్‌ ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ‘శిరిడిసాయి’ తర్వాత రాఘవేంద్రరావు రూపొందించిన సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఏర్పడలేదు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్‌ చేసేందుకు నిర్మాత ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రిలీజ్‌ను వాయిదాలు వేస్తూ వచ్చారు. విశేషమేమింటే.. ఫస్ట్‌ కాపీ రెడీ అయి దాదాపు 10 సంవత్సరాలు దాటిపోతున్నా ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్‌కి నోచుకోలేదు.

పరుచూరి బ్రదర్స్‌ పుణ్యమా అని.. ఒకేరోజు విడుదలైన రీమేక్‌ ఫ్లాప్‌, ఫ్రీమేక్‌ సూపర్‌హిట్‌!

ఒక సినిమాకి కథ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెపక్కర్లేదు. అందుకే కథల కోసం కొన్ని నెలలపాటు కుస్తీ పడుతుంటారు. తమకు నచ్చే కథ కోసం నిత్యం అన్వేషిస్తూనే ఉంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఒక భాషలో సూపర్‌హిట్‌ అయిన సినిమాను తమ భాషలో రీమేక్‌ చేసేందుకు ఇష్టపడతారు దర్శకనిర్మాతలు. అయితే విదేశీ చిత్రాలను చూసి వాటిని ఫ్రీమేక్‌ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది వేరే విషయం. ఇలాంటి విదేశీ చిత్రాల ఫ్రీమేక్‌ల వల్ల ఒక్కోసారి ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే కథతో సినిమాలు చేసేస్తూ ఉంటారు. అలాంటి ఓ విచిత్రమైన పరిస్థితి టాలీవుడ్‌లో రెండు సినిమాలకు వచ్చింది. అయితే అందులో ఒకటి రీమేక్‌ కాగా, మరొకటి ఫ్రీమేక్‌. పైగా రెండు సినిమాలూ ఒకే రోజున రిలీజ్‌ అయ్యాయి. అప్పుడు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ‘ఆర్యన్‌’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. రమ్యకృష్ణ, శోభన, శరత్‌ సక్సేనా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళంలో సూపర్‌ హిట్‌ అయి శతదినోత్సవం జరుపుకుంది. 1988లో విడుదలైన ఈ సినిమా ఆ సంవత్సరానికి హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో ఆర్యన్‌ మేరా నామ్‌ పేరుతో డబ్‌ చేశారు. తమిళ్‌లో సత్యరాజ్‌ హీరోగా ద్రవిడన్‌ పేరుతో రీమేక్‌ చేశారు. కన్నడలో చక్రవర్తిగా, తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్‌.ఎస్‌.రవిచంద్ర దర్శకత్వంలో ‘అశోక చక్రవర్తి’ పేరుతో రీమేక్‌ చేశారు. ఈ మూడు రీమేక్‌లలో కూడా శరత్‌ సక్సేనా ఒకే పాత్రలో నటించడం విశేషం.  అసలు విషయానికి వస్తే.. ఆర్యన్‌ రీమేక్‌ రైట్స్‌ను అశోకచక్రవర్తి నిర్మాతలు రూ.3లక్షలకు కొనుగోలు చేసి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్‌ రచన చేశారు. అదే సమయంలో వెంకటేష్‌ హీరోగా వై.నాగేశ్వరరావు దర్శకత్వంలో ధ్రువనక్షత్రం పేరుతో మరో సినిమాను ప్రారంభించారు. ఆ సినిమాకి పరుచూరి బ్రదర్స్‌ కథ, మాటలు అందించారు. అయితే స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్‌, మరికొన్ని సన్నివేశాలను మార్చి అదే కథతో సినిమాను నిర్మించారు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు అంటే 1989 జూన్‌ 29న విడుదలయ్యాయి. ధ్రువనక్షత్రం సూపర్‌హిట్‌ అవ్వగా, అశోకచక్రవర్తి ఫ్లాప్‌ అయ్యింది. ధ్రువనక్షత్రం తమ సినిమా కథతోనే రూపొందించారని తెలుసుకున్న అశోకచక్రవర్తి నిర్మాతలు ఆంధ్రజ్యోతి పేపర్‌లో ఓ ప్రకటన ఇచ్చారు. ‘అశోక చక్రవర్తి’ కథ ఇటీవల విడుదలైన మరో సినిమా కథ ఒక్కటే. అది యదార్థమా.. అయితే దానికి కారకులెవరు.. మూడు లక్షలు చెల్లించి రీమేక్‌ రైట్స్‌ తీసుకొని చిత్రాన్ని నిర్మించిన మాదా? కథాచౌర్యం చేసి చిత్రాన్ని నిర్మించిన వారిదా? మా చిత్రానికి మాటలు రాసి, అదే కథను స్వల్ప మార్పులు చేసి కథ, మాటలు అందించిన ఆత్మీయ రచయితల అమోఘ మేధా శక్తిదా? ఎవరిది?.. మీరే నిర్ణయించండి’ ఇదీ ఆ ప్రకటనలోని సారాంశం.  ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడం, కొన్ని మార్పులతో రెండు సినిమాల కథలు ఒకటే కావడంతో ధ్రువనక్షత్రం యూనిట్‌ విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. న్యాయంగా ఒరిజినల్‌ నిర్మాతల నుంచి రైట్స్‌ కొనుక్కొని తీసిన సినిమా ఫ్లాప్‌ అయింది. అన్యాయంగా కథాచౌర్యం చేసి నిర్మించిన సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్‌ ‘రెండు సినిమాల కథలూ ఒకటేనన్న విషయం తనకి తెలియదని, తెలిసి వుంటే ఈ సినిమా చేసేవాడినే కాదని అన్నారు. బాలకృష్ణ మాత్రం ఈ విషయం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దాంతో ఈ వివాదం సద్దుమణిగింది.

రాజమౌళి వల్లే డైరెక్షన్‌ ఛాన్స్‌.. మొదటి సినిమాతోనే హిట్‌ కొట్టిన కొరటాల శివ!

కొరటాల శివ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న డైరెక్టర్స్‌లో తనకంటూ ఒక మార్క్‌ని క్రియేట్‌ చేసుకున్న డైరెక్టర్‌. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే తపన కనిపిస్తుంది. స్వతహాగా అభ్యుదయ భావాలు కలిగిన శివ తన సినిమాల్లో తన భావాలను, అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. డైరెక్టర్‌గా అతను చేసిన సినిమాలు ఐదే అయినా టాలీవుడ్‌లోని టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో చేరిపోయారు. 2002లో వచ్చిన ‘గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రానికి కథ అందించడం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివ ఆ తర్వాత ఎనిమిది సినిమాలకు మాటలు అందించారు. మరో రచయిత బి.వి.ఎస్‌.రవితో కలిసి ఆయా సినిమాలకు పనిచేశారు. 2010లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’ చిత్రానికి సోలోగా కథ, మాటలు అందించారు. తను రాసిన కథలకు, మాటలకు డైరెక్టర్లు న్యాయం చెయ్యలేకపోతున్నారేమో అనే భావన అతనిలో ఉండేది. అందుకే తన కథలను తానే సినిమాలుగా రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ క్షణం నుంచి డైరెక్షన్‌ ఛాన్స్‌ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే ప్రభాస్‌ సన్నిహితుడు, తన క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిన వంశీకృష్ణతో ఆ విషయాన్ని చెప్పారు. తను కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు, ప్రభాస్‌ తన స్నేహితుడే కాబట్టి తప్పకుండా డేట్స్‌ ఇస్తాడు అనే నమ్మకం వంశీకి ఉంది. ఆ ధైర్యంతోనే శివను ప్రభాస్‌ దగ్గరికి తీసుకెళ్లాడు. శివకు మాత్రం ప్రభాస్‌తో సినిమా సెట్‌ అవుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ప్రభాస్‌ తన ఫ్రెండ్‌ని నిర్మాతగా పరిచయం చెయ్యడానికి ఎవరైనా పెద్ద డైరెక్టర్‌ని సెలెక్ట్‌ చేసుకుంటాడుగానీ తనతో ఎందుకు చేస్తాడు అనే అభిప్రాయంలోనే ఉండిపోయాడు శివ.  అప్పటికే ‘రెబల్‌’ వంటి డిజాస్టర్‌ చేసి ఉన్న ప్రభాస్‌ తన నెక్స్‌ట్‌ మూవీ రాజమౌళితో కమిట్‌ అయి ఉన్నాడు. ఆ సమయంలోనే వంశీ, శివ.. ప్రభాస్‌ని కలిశారు. శివ కథ చెప్పేముందు ప్రభాస్‌ ఒక మాట అన్నారు. ‘రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ఈగ కంప్లీట్‌ అవుతోంది. మా కాంబినేషన్‌లో నెక్స్‌ట్‌ మూవీ ‘బాహుబలి’ స్టార్ట్‌ కాబోతోంది. ఈ గ్యాప్‌లో నేను సినిమా చెయ్యలేను. అయినా మీరు చెప్పే కథ వింటాను. నేను సినిమా చెయ్యలేకపోతే.. మీ కథ బాగాలేదని మాత్రం అనుకోవద్దు’ అని చెప్పారు. సరేనని కథ చెప్పడం మొదలుపెట్టారు శివ. వింటున్న ప్రభాస్‌ చాలా ఎక్సైట్‌ అయ్యారు. కథ మొత్తం విన్న తర్వాత గట్టిగా షౌట్‌ చేశాడు. అతనికి కథ బాగా నచ్చింది. ‘కథ బాగుంది. కానీ, చేసే పరిస్థితి లేదు. అందుకే ముందే చెప్పాను నేను కమిట్‌ అయి ఉన్నానని. ఇప్పుడెలా’ అంటూ టెన్షన్‌ పడ్డారు. కాసేపు దాని గురించే ఆలోచిస్తూ బాధపడ్డారు ప్రభాస్‌. పరిస్థితిని అర్థం చేసుకున్న శివ, వంశీ అక్కడి నుంచి వచ్చేశారు.  మరుసటి రోజు రాజమౌళి దగ్గరకు వెళ్లారు ప్రభాస్‌. తను విన్న కథ గురించి డీటైల్డ్‌గా చెప్పారు. దానికి రాజమౌళి ‘కథ చాలా బాగుంది. మంచి కథలు దొరకడమే కష్టం. అలాంటిది అంత మంచి కథను ఎలా మిస్‌ చేసుకుంటావు. తప్పకుండా చెయ్‌. మన సినిమా స్టార్ట్‌ అవ్వడానికి మరో ఆరునెలలు పట్టొచ్చు. ఈలోగా అది కంప్లీట్‌ చేసెయ్‌’ అని ఎంకరేజ్‌ చేశారు. వెంటనే శివకు ఫోన్‌ చేసి తన గెస్ట్‌ హౌస్‌కి రమ్మని చెప్పారు ప్రభాస్‌. అలా ‘మిర్చి’ సినిమా ప్రారంభమైంది. అయితే అంతకుముందు శివకు డైరెక్షన్‌లో అనుభవం లేదు. కనీసం డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో కూడా పనిచేయలేదు. కానీ, తను స్టోరీ, మాటలు అందించిన అన్ని సినిమాల షూటింగ్స్‌కి అతను వెళ్ళేవాడు. స్క్రిప్ట్‌ ఇచ్చిన రోజు నుంచి ఫస్ట్‌ కాపీ వచ్చే వరకు ప్రతి క్రాఫ్ట్‌ని ఆయన దగ్గరగా పరిశీలించారు. అలా ప్రతి క్రాఫ్ట్‌పై అవగాహన ఏర్పరుచుకున్నారు. అందుకే ఎలాంటి అనుభవం లేకపోయినా ‘మిర్చి’లాంటి బ్లాక్‌బస్టర్‌ తియ్యగలిగారు. ఆరోజున ప్రభాస్‌కి రాజమౌళి ఆ సలహా ఇచ్చి ఉండకపోతే.. కొరటాల శివ అనే రచయిత డైరెక్టర్‌ అయ్యేందుకు మరెన్ని సంవత్సరాలు పట్టేదో. అంతేకాదు, ప్రభాస్‌ ఇప్పుడున్న పరిస్థితిలో శివకు సినిమా చేసే ఛాన్స్‌ కూడా ఉండేది కాదు. అలా రాజమౌళి చలవ వల్ల కొరటాల శివ దర్శకుడయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న ‘దేవర’ చిత్రంతో దర్శకుడుగా మరో స్టెప్‌ ఎదిగేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కొరటాల శివ.

ఆ విషం కైకాల సత్యనారాయణ పాలిట వరంగా మారింది.. హీరోను చేసింది!

పాతతరం నటుల్లో ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత చెప్పుకునే పేరు ఎస్‌.వి.రంగారావు. ఆయన తర్వాత నిస్సందేహంగా వినిపించే పేరు కైకాల సత్యనారాయణ. ఆయన ఒక పరిపూర్ణ నటుడు. నవరసాలనూ అవలీలగా పోషించగల సమర్థుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు కైకాల. అందుకే ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదుతో ఆరోజల్లోనే సత్కారాలు అందుకున్నారు. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కైకాలకు సినిమాల్లో అవకాశం రాక మునుపు ఆయన జీవితంలో జరిగిన ఓ ఘటన అతన్ని ప్రభావితుడ్ని చేసింది. జీవితంలో ముందుకు వెళ్ళగలను, అనుకున్నది సాధించగలను అనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. జూలై 25 కైకాల సత్యనారాయణ జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ ఘటన గురించి తెలుసుకుందాం.  చిన్నతనం నుంచి నటన అంటే మక్కువ ఏర్పరుచుకున్న కైకాలకు చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఆయనకు నటన అంటే ఎంత ఇష్టమో, చదువుపట్ల కూడా అంతే గౌరవం ఉండేది. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా డిగ్రీ పూర్తయ్యే వరకు సినిమాల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. తను అనుకున్నట్టుగానే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాస్‌ చేరుకున్నారు. అయితే ఆయనకు ఎప్పుడూ అదృష్టం ఆమడదూరంలో ఉండేది. ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోయేవి. అయినా ఆయన నిరాశ నిస్పృహలకు లోనవ్వలేదు, తన ప్రయత్నాలు మానలేదు. కైకాల ఉండేందుకు రూమ్‌ కూడా లేకపోవడంతో 15 రోజులపాటు ఒక పార్కునే ఇల్లుగా భావించి అక్కడే గడిపారు. ఆ తర్వాత భాగస్వామ్యంలో ఒక రూమ్‌ అద్దెకు తీసుకున్నారు. ప్రతిరోజూ అవకాశాల కోసం ప్రయత్నాలు చెయ్యడం, రూమ్‌కి వచ్చి విశ్రాంతి తీసుకోవడం జరుగుతూ ఉండేది.  అలా ఓ రోజు ఎప్పటిలాగే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి రూమ్‌కి చేరుకున్నారు కైకాల. అలసటగా అనిపించడంతో పనిమనిషిని కాఫీ తీసుకు రమ్మని పంపించారు. కాఫీ పూర్తిగా తాగిన తర్వాత కప్పు అడుగున చనిపోయిన సాలెపురుగు కనిపించింది. ఒక్కసారిగా కైకాల మనసు వికలమైపోయింది. చచ్చిన సాలె పురుగు విషంతో సమానమని, వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలని రూమ్‌లోని మిత్రులు చెప్పినా కైకాల వినలేదు. అప్పుడే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తనకు అదృష్టం ఉంటే, నటుడిగా రాణించగలను అని తన నుదుటన రాసి ఉంటే ఈ సాలెపురుగు నన్నేమీ చెయ్యలేదు అనుకున్నారు. అలాగే పడుకున్నారు. ఉదయం ఎప్పటిలాగే నిద్ర లేచారు. తనకు ఎలాంటి అనారోగ్యం కలగలేదు. దాంతో ఆయన ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.  అదే ఉత్సాహంతో మళ్ళీ స్టూడియోల చుట్టూ తిరిగేందుకు బయల్దేరారు. నిర్మాత డి.ఎల్‌.నారాయణ ఒక సినిమా నిర్మిస్తున్నారని తెలుసుకొని ఆయన్ని కలిసి ఏదైనా వేషం ఇవ్వమని రిక్వెస్ట్‌ చేశారు కైకాల. ‘చిన్న వేషం ఏమిటి.. హీరో వేషమే ఉంది వేస్తావా’ అని అడిగారు డి.ఎల్‌.నారాయణ. దానికి కైకాల ఆశ్చర్యపోయారు. తనను ఎగతాళి చేస్తున్నారు అనుకున్నారు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు కాదనాలి అనే ఉద్దేశంతో సరేనన్నారు. ఆ సినిమా పేరు ‘సిపాయి కూతురు’. అయితే ఆ సినిమా ఫ్లాప్‌ అయింది. దీంతో ఆయన పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత అడపా దడపా అవకాశాలు వచ్చినా ఆశించిన స్థాయిలో ఉండేవి కాదు. ఆ సమయంలోనే బి.విఠలాచార్యకు కైకాలలో ఒక మంచి విలన్‌ కనిపించాడు. తన డైరెక్షన్‌లో రూపొందిస్తున్న ‘కనకదుర్గ పూజా మహిమ’ చిత్రంలో కైకాలకు మొదటిసారి విలన్‌ వేషం ఇచ్చారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. విలన్‌గానే కాదు, అన్ని రకాల క్యారెక్టర్లు పోషించగల నటుడు అని పేరు తెచ్చుకున్నారు. ఎస్‌.వి.రంగారావు పోషించిన ఎన్నో పాత్రల్లో ఆ తర్వాత కైకాల సత్యనారాయణ నటించడం విశేషంగా చెప్పుకోవాలి. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లో దాదాపు 777 చిత్రాల్లో నటించారు కైకాల. నవరస నటనా సార్వభౌమగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కైకాల సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది తెలుగువన్‌. 

బాలకృష్ణతో సినిమా వివాదం.. కొడుకు కోసం కోర్టుకెక్కిన సూపర్‌స్టార్‌ కృష్ణ!

అవి టాలీవుడ్‌ ప్రముఖులు తమ వారసుల్ని సినిమా రంగంలో పరిచయం చేస్తున్న రోజులు. అప్పటికే నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్‌, ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు కుమారుడు కళ్యాణచక్రర్తి హీరోలుగా పరిచయమయ్యారు. అదే సమయంలో తన పెద్ద కుమారుడు రమేష్‌బాబుని  కూడా హీరోగా తెలుగు తెరకు ఇంట్రడ్యూస్‌ చేసేందుకు సూపర్‌స్టార్‌ కృష్ణ సిద్ధమయ్యారు. దాని కోసం రమేష్‌కి నటనలో, డాన్సుల్లో, ఫైట్స్‌లో మంచి శిక్షణ ఇప్పించారు. హిందీలో సూపర్‌హిట్‌ అయిన ‘బేతాబ్‌’ చిత్రం తెలుగు రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నారు. పరుచూరి బ్రదర్స్‌తో రచన చేయించారు. బాలీవుడ్‌ నుంచి బప్పిలహిరి రప్పించి పాటలు రికార్డ్‌ చేశారు. హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ను ఎంపిక చేశారు. తన కుమారుడి మొదటి సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా భారీగా నిర్మించాలన్న ఉద్దేశంతో సొంతంగా పద్మాలయా స్టూడియోస్‌ బేనర్‌లోనే సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాకి ‘సామ్రాట్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.  ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా టైమ్‌లో ఎన్టీఆర్‌, కృష్ణల మధ్య ఒక విషయంలో వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మాటలు లేవు. దీంతో రమేష్‌ తొలి సినిమా ప్రారంభోత్సవానికి అక్కినేని నాగేశ్వరరావును ఆహ్వానించారు కృష్ణ. నందమూరి బాలకృష్ణ అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నారు. అతనికి పోటీగానే కృష్ణ తన కుమారుడ్ని హీరోగా పరిచయం చేస్తున్నారనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. దీంతో ఈ సినిమా గురించి సాధారణ ప్రేక్షకులు సైతం చర్చించుకున్నారు. ఆ కారణంగానే ఈ సినిమా ప్రారంభోత్సవానికి బాలకృష్ణ నిర్మాతలు ఎవరూ హాజరు కాలేదు. మద్రాస్‌లోని ఎవిఎం స్టూడియోలో సినిమా ప్రారంభమైంది. మొదట ఈ సినిమాకి కన్నడ దర్శకుడు రాజేంద్రసింగ్‌బాబును దర్శకుడిగా నియమించారు. విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నప్పటికీ ఔట్‌పుట్‌ ఆశించిన స్థాయిలో రావడం లేదని భావించిన కృష్ణ.. దర్శకుడిగా అతన్ని తొలగించి, ఆ బాధ్యతను వి.మధుసూదనరావుకు అప్పగించారు.  ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే నందమూరి బాలకృష్ణ, విజయశాంతి జంటగా కె.రాఘవేంద్రరావు దర్శత్వంలో ఓ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఆ సినిమాకి కూడా ‘సామ్రాట్‌’ అనే పేరునే పెట్టారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య టైటిల్‌ వివాదం మొదలైంది. ఆ టైటిల్‌ తమదేనంటూ రెండు సినిమాల నిర్మాతలూ వాదించారు. ఈ వివాదం కోర్టు వరకు వెళ్ళింది. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ఆ టైటిల్‌ హక్కులు సూపర్‌స్టార్‌ కృష్ణకే చెందుతాయని తీర్పునిచ్చారు. అప్పుడు బాలకృష్ణ సినిమా టైటిల్‌ను ‘సాహస సామ్రాట్‌’గా మార్చుకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఈ వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ‘సాహస సామ్రాట్‌’ 1987 ఏప్రిల్‌ 13న రిలీజ్‌ అవ్వగా, ‘సామ్రాట్‌’ అదే ఏడాది అక్టోబర్‌ 2న విడుదలైంది.  ‘సామ్రాట్‌’ సూపర్‌హిట్‌ అయి రమేష్‌కి హీరోగా మంచి పేరు తెచ్చింది. అయితే ఆ తర్వాత అతను చేసిన సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం, కెరీర్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. మరో పది సంవత్సరాలు హీరోగా కొనసాగి ఓ 15 సినిమాల్లో నటించినప్పటికీ ఏదీ అతనికి మంచి పేరు తేలేదు. ఆ తర్వాత మహేష్‌ హీరోగా కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఏ హీరోకైనా సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఒక్కటే సరిపోదని, టాలెంట్‌ ఉంటేనే వృద్ధిలోకి రాగలరని చెప్పడానికి రమేష్‌బాబు ఒక మంచి ఉదాహరణ.

‘ఆదిత్య 369’ వంటి గొప్ప సినిమా బయటికి రావడం వెనుక ఇంత జరిగిందా?

  సినిమా అనే మాధ్యమం తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. గతంలోకి వెళ్లవచ్చు, అలాగే భవిష్యత్తులోకి కూడా వెళ్ళి గొప్ప అనుభూతిని పొందవచ్చు. సాధారణంగా హాలీవుడ్‌ సినిమాల్లోనే ఇలాంటి కథాంశాలు మనం చూస్తుంటాం. కానీ, ఒక ఇండియన్‌ మూవీ, అందులోనూ ఒక తెలుగు సినిమా అలాంటి కథాంశంతో రూపొందింది అంటే అది సాధారణమైన విషయం కాదు. అలాంటి అసాధారణ, అనూహ్యమైన సినిమా ‘ఆదిత్య 369’. ఇండియాలో గ్రాఫిక్స్‌ అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే ఇలాంటి సినిమా చెయ్యడం ఒక సాహసమనే చెప్పాలి. ఈ సినిమా తొలి ఇండియన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా చరిత్రకెక్కింది.  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం వెనుక ఎస్‌.పి.బాలు ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. 1991 జూలై 18న విడుదలైన ఈ సినిమా నేటికి 33 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ దివంగత ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంని స్మరించుకుంటూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ సినిమా గురించి చెప్పిన కొన్ని విశేషాలు.  సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఒకసారి నేను, బాలుగారు ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్నాం. ఆ  సమయంలో నా మనసులో మెదిలిన ట్రావెల్‌ మిషన్‌ స్టోరీని బాలుకి వినిపించాను. కథ విన్న బాలు ఎంతో ఎక్సైట్‌ అయిపోయి అద్భుతం అన్నారు. ఈ కథను నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌కి వినిపించమని సలహా ఇచ్చారు. అలా ఈ ప్రాజెక్ట్‌ సెట్‌ అవ్వడానికి బాలు కారణమయ్యారు. ఆ తర్వాత స్టోరీని కొంత డెవలప్‌ చేసి బాలకృష్ణగారికి వినిపించాను. అరగంటపాటు కథ విన్న బాలకృష్ణ ఎంతో ఎమోషనల్‌ అయ్యారు. ‘నాన్నగారు కృష్ణదేవరాయలు పాత్ర చేశారు. నాకూ చెయ్యాలని ఉంది’ అంటూ సినిమాని వెంటనే ఓకే చేశారు.  టైమ్‌ మెషీన్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎంతో ఖర్చు, కష్టంతో కూడుకున్నది.  అయినప్పటికీ నిర్మించడానికి ముందుకొచ్చారు కృష్ణప్రసాద్‌. 33 ఏళ్ళ క్రితం తీసిన ఈ సినిమా ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుంది’ అన్నారు.   నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దివంగత బాలుగారి గురించి. ఎందుకంటే ‘ఆదిత్య 369’ వంటి క్లాసిక్‌ తెలుగులో రావడానికి, తెలుగు సినిమా ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఆయనే కారణం. ఇలాంటి ఒక విభిన్నమైన సినిమా నిర్మించాలంటే ఆ నిర్మాతకు ఎంతో ధైర్యం ఉండాలి. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి దర్శకుడికి ప్యాషన్‌ ఉండాలి. ఈ సినిమాలోని రెండు క్యారెక్టర్లు చెయ్యడానికి హీరోకి ప్యాషన్‌తోపాటు ధైర్యం కూడా కావాలి. అలాగే సబ్జెక్ట్‌ గురించి పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే ఇలాంటి ట్రెండ్‌ సెట్టర్‌ మూవీస్‌ ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు మళ్ళీ అలాంటి సినిమా రాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు.. ఆరోజు మేం ఎంత అడ్వాన్స్‌గా ఆలోచించామో. గ్రాఫిక్స్‌ అందుబాటులో లేని రోజుల్లోనే ఈ సినిమా కోసం ఎన్నో ప్రయోగాలు చేశాం. భారతీయులు కూడా ఇలాంటి సినిమాలు చెయ్యగలరు అని నిరూపించాం. కృష్ణ్ణప్రసాద్‌గారు ‘ఆదిత్య 369’ తర్వాత ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. అయినప్పటికీ ఆయన కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిలా నిలిచిపోతుంది. ఈ సినిమాకి సీక్వెల్‌ తియ్యాలనే ఆలోచన ఉంది. దాన్ని త్వరలోనే ఆచరణలో పెడతాం’ అన్నారు.  నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘మా బేనర్‌లో చేసిన తొలి సినిమా ‘చిన్నోడు పెద్దోడు’. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో బాలుగారు ఓ సలహా ఇచ్చారు. ‘కృష్ణా.. ఓ పెద్ద సినిమా చెయ్యి. నేను హీరోలతో మాట్లాడతాను’ అని చెబుతూ సింగీతంగారిని కలవమని చెప్పారు. బాలుగారు చెప్పినట్టుగానే ఆయన్ని కలిశాను. అప్పుడు ‘ఆదిత్య 369’ కథ చెప్పారు. అలాంటి టైమ్‌ ట్రావెలింగ్‌ సినిమాను మనం చేయడం సాహసమే అవుతుందని ఆయనతో అన్నాను. ఈ సినిమా గురించి బాలుగారు ఒక మాట అన్నారు. ‘భవిష్యత్తులో నువ్వు ఎన్నో సినిమాలు చేస్తావు. కానీ, ఈ సినిమా నీ కెరీర్‌కి ఓ ల్యాండ్‌ మార్క్‌లా నిలుస్తుంది’ అన్నారు. బాలుగారు చెప్పిన మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి. అయితే ఈ సినిమా బాలకృష్ణగారు చేస్తానని చెప్పడమే నా అదృష్టంగా భావించాను. 1990లో ఈ సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత పి.సి.శ్రీరామ్‌గారి ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడు సినిమాటోగ్రఫీ బాధ్యతను వి.ఎస్‌.ఆర్‌.స్వామికి అప్పగించాం. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో వచ్చే సీన్లకు వి.ఎస్‌.ఆర్‌.స్వామి, భవిష్యత్తును చూపించే సీన్లకు కబీర్‌లాల్‌, మిగతా సన్నివేశాలకు పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రహణాన్ని అందించారు. ఈ చిత్రానికి పనిచేసిన కళాదర్శకుడు పేకేటి రంగాగారికి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ సాంబ శివరావుగారికి నంది అవార్డులు వచ్చాయి. గౌతమ్‌రాజుగారి ఎడిటింగ్‌, ఇళయరాజాగారి మ్యూజిక్‌, బాలుగారు, జానకిగారు, జిక్కీ గార్ల గానం.. అన్నీ అద్భుతం. అయితే సినిమాకి మేం అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్‌ అయింది. ఈ విషయంలో బయ్యర్లు సహకరించారు. ‘ఆదిత్య 369’  చిత్రం వల్ల వచ్చిన గౌరవం మరో 50 ఏళ్ళయినా అలాగే ఉంటుంది. ఇండియాలోని టాప్‌ 100 సినిమాల లిస్ట్‌లో నిలబడగలిగిన సినిమాను నిర్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు.

జ్యోతిలక్ష్మీ స్టార్‌డమ్‌ని తొక్కేసిన జయమాలిని.. మరి జ్యోతిలక్ష్మీ చివరి రోజులు ఎలా గడిచాయి?

ఒకప్పుడు నాట్య తారలకు మన సినిమాల్లో చాలా ఇంపార్టెన్స్‌ ఉండేది. జ్యోతిలక్ష్మీ, జయమాలిని, సిల్క్‌ స్మిత, అనూరాధ వంటి నాట్యతారలు కొన్ని దశాబ్దాలపాటు తమ డాన్సులతో కుర్రకారును ఉర్రూతలూగించారు. వీరిలో జ్యోతిలక్ష్మీ అందరి కంటే సీనియర్‌. వెయ్యికిపైగా సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించారు. అలాగే 300 సినిమాల్లో కొన్ని పాత్రలు పోషించారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మీ చెల్లెలు జయమాలిని రంగ ప్రవేశం చేసి ఆమె కూడా డాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి కొన్ని ఐటమ్‌ సాంగ్స్‌లో నటించారు కూడా. విచిత్రం ఏమిటంటే వీళ్ళిద్దరికీ చిన్నతనం నుంచి మాటలు లేవు. ఒకరినొకరు పలకరించుకోవడం గానీ, ఆప్యాయంగా మాట్లాడుకోవడం కానీ ఉండేది కాదు.  తమిళ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు జ్యోతిలక్ష్మీ, జయమాలిని. తండ్రిపేరు టి.కె.రాజరామన్‌, తల్లి శాంతవి. వీరికి ఎనిమిది మంది సంతానం. ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. వారిలో జ్యోతిక్ష్మీ అందరికంటే పెద్దది కాగా, జయమాలిని అందరికంటే చిన్నది. రాజరామన్‌ సోదరి అయిన ఎస్‌.పి.ఎల్‌.ధనలక్ష్మీ తమిళ్‌లో ప్రముఖ నటి. ఆమెకు పిల్లలు లేని కారణంగా జ్యోతిలక్ష్మీని దత్తత తీసుకున్నారు. అలా చిన్నతనం నుంచీ ధనలక్ష్మీ దగ్గరే పెరిగారు జ్యోతిలక్ష్మీ. ఆ విధంగా ఆమె తల్లితోగానీ, ఆమె కుటుంబంతో ఎక్కువగా కలవనిచ్చేవారు కాదు ధనలక్ష్మీ. వారు పెద్దయ్యేవరకూ అలాగే కొనసాగారు. జ్యోతిలక్ష్మీ, జయమాలిని కలిసి చాలా సినిమాల్లో నృత్యాలు చేశారు. కానీ, అది సినిమా వరకే పరిమితమయ్యేది. షాట్‌ పూర్తికాగానే ఎడమొహం పెడమొహంగా ఉండేవారు.  ఇద్దరూ ఒకే తల్లి పిల్లలైనా ఎందుకని అలా ఉండేవారు అనే విషయం ఆమధ్య జయమాలిని ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. జ్యోతిలక్ష్మీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తర్వాత చాలా ఆస్తులు కూడబెట్టారు. జ్యోతిలక్ష్మీ కంటే జయమాలిని 10 ఏళ్లు చిన్నది. ఒక విధంగా జ్యోతిలక్ష్మీ కంటే జయమాలిని ఫ్యామిలీ ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారు. దాంతో వారిని చులకనగా చూడడం మొదలుపెట్టారు జ్యోతిలక్ష్మీ. ఆ కారణంతోనే ఎప్పుడైనా జయమాలిని, వాళ్ళ అమ్మ జ్యోతిలక్ష్మీ ఇంటికి వెళితే మేం బయటకు వెళ్తున్నాం అంటూ వారిని తిప్పి పంపించేవారు. ఇలాంటి ఎన్నో అవమానాలను జయమాలిని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మీ వివాహం వాసుదేవన్‌ అనే వ్యక్తితో జరిగింది. ఆయనకు అంతకుముందే పెళ్ళయింది. అయితే వారికి పిల్లలు లేరు. దాంతో తల్లి ఆదేశం మేరకు వాసుదేవన్‌ని పెళ్ళి చేసుకున్నారు జ్యోతిలక్ష్మీ. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకపోవడం వల్ల వీరి పెళ్ళిని రహస్యంగా ఉంచి సహజీవనం సాగించారు. ఎనిమిదేళ్ళు ఇద్దరూ కాపురం చేశారు. వారికి మీనాక్షి అనే పాప పుట్టింది. అయితే ఈ ఎనిమిదేళ్ళ కాలంలో జ్యోతిలక్ష్మీని ఎంతో టార్చర్‌ పెట్టేవాడు వాసుదేవన్‌. తన నిర్మాతలతో అతను ప్రవర్తించే తీరు వల్ల సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గాయి.  1980లో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘సరదారాముడు’ చిత్రం షూటింగ్‌లో జ్యోతిలక్ష్మీ పాల్గొనాల్సి ఉండగా, సడన్‌గా ఆమె మాయమైంది. ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియలేదు. దాంతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. చివరి క్షణంలో విజయలలితను తీసుకున్నారు. వాసుదేవన్‌ భార్య నుంచి తప్పించుకునేందుకే జ్యోతిలక్ష్మీ బొంబాయి వెళ్లిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చింది. వాసుదేవన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించి సినిమాటోగ్రాఫర్‌ సాయిప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు జ్యోతిలక్ష్మీ. ఆమె కూతురు మీనాక్షి పేరును జ్యోతిమీనా అని మార్చారు. ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ, తల్లికి వచ్చినంత పేరు ఆమెకు రాలేదు. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికి వివాహం చేసుకొని చెన్నయ్‌లో స్థిరపడ్డారు జ్యోతి మీనా.  జ్యోతిలక్ష్మీ డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోవడం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. ఆ సమయంలో జయమాలిని బిజీ నృత్యతారగా వెలుగొందుతోంది. ఒకప్పుడు జ్యోతిలక్ష్మీ అనుభవించిన స్థానాన్ని జయమాలిని కైవసం చేసుకుంది. తన అక్కలకు, అన్నయ్యలకు తన డబ్బుతోనే పెళ్లిళ్లు చేసి వారికి అండగా నిలిచింది. జ్యోతిలక్ష్మీ చివరి రోజుల్లో అనారోగ్యం పాలైనప్పుడు తన కుటుంబం గురించి ఆలోచించి ఎంతో బాధపడ్డారు. అప్పుడప్పుడు చెల్లెలు దగ్గరికి వచ్చి వెళ్ళేది. జయమాలిని కూడా గతాన్ని మర్చిపోయి అక్కను ఆదరించేది. చివరికి 2016 ఆగస్ట్‌ 9న బ్లడ్‌ క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచారు జ్యోతిలక్ష్మీ.

రాజేంద్రప్రసాద్‌ హీరో అయినా.. ‘చినుకు చినుకు అందెలతో..’ బాబూమోహన్‌తో చెయ్యడానికి రీజన్‌ ఇదే!

ఒక సినిమా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ అవ్వాలంటే యూనిట్‌లోని ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది. ఏ సినిమా అయినా ఇదే పద్ధతిలో పూర్తవుతుంది. సాదారణంగా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ సినిమా బాగా రావాలని, అనుకున్న టైమ్‌కి పూర్తి కావాలనే కోరుకుంటారు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ మధ్య సరైన సఖ్యత లేకపోవడం వల్ల, ఈగో ప్రాబ్లమ్స్‌ వల్ల డిలే అవుతూ ఉంటాయి. అలాంటివి సినీ పరిశ్రమలో అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. ‘మాయలోడు’ సినిమా నిర్మాణ సమయంలో హీరో రాజేంద్రప్రసాద్‌, డైరెక్టర్‌ ఎస్‌.వి.కృష్ణారెడ్డి మధ్య ఓ విచిత్రమైన వివాదం చోటు చేసుకుంది. దానివల్ల దర్శకనిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. హిట్‌ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్‌, ఎస్‌.వి.కృష్ణారెడ్డి కాంబినేషన్‌ ఆ ఒక్క సినిమాతో బ్రేక్‌ అయింది. ఎస్‌.వి.కృష్ణారెడ్డి తొలి సినిమా ‘కొబ్బరిబొండాం’. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం అందించడంతోపాటు కె.అచ్చిరెడ్డితో కలిసి నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత కృష్ణారెడ్డి దర్శకుడిగా మారి రాజేంద్రప్రసాద్‌ హీరోగా ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కూడా సూపర్‌హిట్‌ కావడంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాలూ మనీషా ఫిలింస్‌ బేనర్‌పైనే నిర్మించారు. రాజేంద్రప్రసాద్‌తో వేవ్‌లెంగ్త్‌ బాగా కుదరడంతో ఇకపై ‘మనీషా ఫిలింస్‌లో మీరు తప్ప మరో హీరో ఉండరు’ అని చెప్పారు కృష్ణారెడ్డి.  మనీషా ఫిలింస్‌ బేనర్‌లో మూడో సినిమాగా ‘మాయలోడు’ స్టార్ట్‌ చేశారు కృష్ణారెడ్డి. షూటింగ్‌ అంతా సజావుగానే జరిగింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా వేగంగా జరిగిపోతున్నాయి. ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ఆ సమయంలోనే కృష్ణారెడ్డిని రాజేంద్రప్రసాద్‌ అవమానించడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానగా మారాయి. ‘కేవలం నీ డైరెక్షన్‌ వల్లే సినిమాలు హిట్‌ అవ్వడం లేదు.. నా వల్లే జనం మన సినిమాలు చూస్తున్నారు’ అని రాజేంద్రప్రసాద్‌ వాదించారు. ఈ వివాదాం పెద్దది కావడంతో సీనియర్‌ ప్రొడ్యూసర్‌ ఎం.ఎస్‌.రెడ్డి జోక్యం చేసుకొని కాంప్రమైజ్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఆయన సలహాతోనే రాజేంద్రప్రసాద్‌కి ఫోన్‌ చేసి ‘సౌందర్య డేట్స్‌ ఇచ్చారు సర్‌.. బ్యాలెన్స్‌ ఉన్న ఒక పాట పూర్తి చేద్దాం’ అన్నారు కృష్ణారెడ్డి. ‘ఆవిడ డేట్స్‌ ఇచ్చేస్తే నేనొచ్చి చేసెయ్యాలా.. నేనిప్పుడు చెయ్యను. నువ్వు రిలీజ్‌ డేట్‌ కూడా పెట్టేసుకున్నావ్‌. ఆ డేట్‌కి సినిమా కంప్లీట్‌ అవుతుందనుకుంటున్నావా.. ఇంకా నేను డబ్బింగ్‌ కూడా చెప్పాలి. ఆ విషయం గుర్తుందా?’ అంటూ వెటకారంగా మాట్లాడారు రాజేంద్రప్రసాద్‌.  దానికి కృష్ణారెడ్డి ‘అయితే ముందు డబ్బింగ్‌ పూర్తి చేద్దాం సర్‌’ అన్నారు. ‘నేను ఒకేఒక్క రోజు టైమ్‌ ఇస్తాను. అది కూడా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లంచ్‌ తర్వాత 2 నుంచి 3 వరకు మరో గంట ఇస్తాను. నువ్వు డబ్బింగ్‌ పూర్తి చేసుకో. ఒక్కరోజులో డబ్బింగ్‌ పూర్తి కాదు. నీ సినిమా రిలీజ్‌ అవ్వదు’ అన్నారు. ఆ మాటతో కృష్ణారెడ్డికి టెన్షన్‌ మొదలైంది. ఒక్కరోజులో డబ్బింగ్‌ ఎలా పూర్తి చెయ్యాలా అని ఆలోచిస్తుండగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఎడిటర్‌ దగ్గరకు వెళ్ళి ముక్కలు ముక్కలుగా ఉన్న 1200 అడుగుల సినిమాని ఒకే రీల్‌గా ఎడిట్‌ చేయించేశారు. మరుసటి రోజు 9 గంటలకు రాజేంద్రప్రసాద్‌ థియేటర్‌కి వచ్చారు. అప్పటికే అతనికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌ అంతా ఇచ్చేశారు నిర్మాతలు. అయినా డబ్బింగ్‌ చెప్పడానికి ముందే ‘మాయలోడు’ చిత్రానికి సంబంధించిన తమిళ్‌ రైట్స్‌ తన పేరున రాయించుకున్నారు. డబ్బింగ్‌ చెప్పడం మొదలుపెట్టారు. ఎక్కడా బ్రేక్‌ లేకుండా వరసగా సీన్స్‌ వచ్చేస్తుండడంతో మధ్యాహ్నం ఒంటిగంటకు డబ్బింగ్‌ పూర్తయింది. రాజేంద్రప్రసాద్‌ ఆశ్చర్యపోయి ‘అప్పుడే అయిపోయిందా.. అయినా ఇంకా ఒక పాట బ్యాలెన్స్‌ ఉంది కదా. అది నేను చేస్తేనే సినిమా రిలీజ్‌ అవుతుంది. సౌందర్య డేట్స్‌ ఇచ్చిందన్నావుగా. ఆవిడతోనే చేయించుకో. నేను చెయ్యను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు రాజేంద్రప్రసాద్‌.  అప్పటికే బ్యాలెన్స్‌ ఉన్న పాటని ఎలా తియ్యాలి అనే విషయంలో ఒక క్లారిటీతో ఉన్నారు కృష్ణారెడ్డి. వెంటనే బాబూమోహన్‌కి కబురు పెట్టి విషయం చెప్పారు. సౌందర్యతో కలిసి ఒక పాట చెయ్యాలి అని అడిగారు. ఆయన ఓకే అన్నారు. అప్పటికే బాబూమోహన్‌తో కలిసి ఆ పాట చేసేందుకు సౌందర్య కూడా ఓకే చెప్పేసింది. అన్నపూర్ణ స్టూడియోలో పాటను షూట్‌ చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్న సమయంలో విషయం తెలుసుకున్న రాజేంద్రప్రసాద్‌.. తన మేనేజర్‌ని కృష్ణారెడ్డి దగ్గరకు పంపించారు. ‘బాబూమోహన్‌తో ఆ పాట తీస్తున్నారని తెలిసింది. నిజమేనా’ అని అడిగారు. నిజమేనని చెప్పారు కృష్ణారెడ్డి. ‘మీరు చెప్పిన డేట్స్‌లోనే ఆ పాటను పూర్తి చేస్తానని చెప్పమన్నారు హీరోగారు’ అన్నాడు మేనేజర్‌. దానికి కృష్ణారెడ్డి ‘నేను ఆల్రెడీ బాబూమోహన్‌కి మాట ఇచ్చేశాను. నాది రెండు నాలుకల ధోరణి కాదు. మాటంటే మాటే. అతనితోనే ఆ పాట పూర్తి చేస్తాను’ అని చెప్పారు.  యూనిట్‌ సభ్యులంతా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. బాబూమోహన్‌, సౌందర్యలకు కొరియోగ్రాఫర్‌ మూమెంట్స్‌ చెబుతున్నారు. ఆ సమయంలో మళ్ళీ రాజేంద్రప్రసాద్‌ మేనేజర్‌ వచ్చాడు. ‘హీరోగారు తన సొంత ఖర్చులతో హైదరాబాద్‌ వచ్చారు. ఈ పాట చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఓకే అంటే మేకప్‌తో వెంటనే వచ్చేస్తారు’ అని చెప్పాడు. ‘వస్తానంటే రమ్మని చెప్పండి. కానీ, షూటింగ్‌ చేయడానికి కాదు. ఈ పాటను మేం ఎలా తీస్తున్నామో చూడడానికి’ అన్నారు కృష్ణారెడ్డి. పాట చిత్రీకరణ మొదలైంది. మధ్యలో రాజేంద్రప్రసాద్‌ సెట్‌కి వచ్చి కాసేపు ఆ షూటింగ్‌ చూసి వెళ్ళిపోయారు. ‘మాయలోడు’ సినిమా రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా బాబూమోహన్‌, సౌందర్యలపై చిత్రీకరించిన ‘చినుకు చినుకు అందెలతో..’ పాటకు చాలా క్రేజ్‌ వచ్చింది. సినిమాలో ఈ పాట అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా తర్వాత రాజేంద్రప్రసాద్‌, కృష్ణారెడ్డిల మధ్య మాటలు లేవు. 13 సంవత్సరాల తర్వాత కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సరదా సరదాగా’ చిత్రంలో, 2023లో వచ్చిన ‘ఆర్గానిక్‌ మామ, హైబ్రిడ్‌ అల్లుడు’ చిత్రంలో నటించారు రాజేంద్రప్రసాద్‌.

ఆ పాత్రల్లో కొందరు నటిస్తారు, మరికొందరు జీవిస్తారు.. అరుదైన ఆ పాత్రల వెనుక ఉన్న కథ ఏమిటంటే..!

సినిమా రంగంలో ప్రతి ఆర్టిస్టూ తను చేసే పాత్రకు పూర్తి న్యాయం చెయ్యాలనుకుంటారు. అయితే కొందరు ఆ క్యారెక్టర్‌లో నటిస్తారు. కానీ, కొందరు మాత్రం జీవిస్తారు. అలా తమకు ఇచ్చిన క్యారెక్టర్‌లో జీవించాలంటే ఆ పాత్రను అర్థం చేసుకోవాలి. అందులో లీనమైన నటించాలి. ఆ సమయంలో ఆ క్యారెక్టరే కనిపించాలి తప్ప నటుడు కాదు. అలా కనిపించాలంటే దాని వెనుక ఎంతో కృషి అవసరం. డైరెక్టర్‌ తమకి ఇచ్చిన క్యారెక్టర్‌ తాలూకు లక్షణాలను ఆకళింపు చేసుకొని నటించడం అనేది పరిపూర్ణ నటుడి లక్షణం. ఆ క్యారెక్టర్‌ని పండిరచడానికి, ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చెయ్యాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరంలోని అవయవాల లోపం ఉన్న క్యారెక్టర్‌ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు. దాని కోసం ఎంతో మందిని పరిశీలించి వారి నుంచి ఎంతో నేర్చుకుంటారు. అలాంటి అరుదైన క్యారెక్టర్స్‌ చేసిన కొందరు నటుల గురించి తెలుసుకుందాం. సుప్రసిద్ధ తమిళ నటుడు, సీనియర్‌ నటి రాధిక తండ్రి ఎం.ఆర్‌.రాధ ‘రక్తకన్నీర్‌’ నాటకాన్ని స్టేజిపై ప్రదర్శించేవారు. ఈ నాటకంలో ప్రధాన పాత్ర ధారి అయిన గోపాల్‌ చివరి దశలో కుష్ఠు వ్యాధిగ్రస్తుడవుతాడు. ఆ పాత్రను స్టేజి మీద తొలిసారి ప్రదర్శించే ముందు కుష్ఠు రోగులున్న హాస్పిటల్‌కి వెళ్ళి వారితో రోజుల తరబడి గడిపారు. వారి ప్రవర్తన, మాట్లాడే తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. వాటన్నింటినీ ఆకళింపు చేసుకున్న తర్వాత వేదికపై ఆ నాటకాన్ని ప్రదర్శించారు. ఆయన ఆ పాత్రను రక్తి కట్టించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలా ఆ నాటకాన్ని ఎన్నోసార్లు ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. ఆ తర్వాత ఆ నాటకాన్ని సినిమాగా తెరకెక్కించారు. ఆ సినిమాని కూడా ప్రేక్షకులు సూపర్‌హిట్‌ చేశారు.  అదే నాటకాన్ని తెలుగు నటుడు నాగభూషణం ‘రక్తకన్నీరు’ పేరుతో కొన్ని వందల సార్లు స్టేజిపై ప్రదర్శించారు. అది ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. 1954లో వచ్చిన ‘రక్తకన్నీర్‌’ చిత్రంలోని ఎం.ఆర్‌.రాధ నటనను సునిశితంగా పరిశీలించారు నాగభూషణం. అంతేకాదు, తను కూడా కొందరు కుష్ఠు రోగులను దగ్గరకు వెళ్లి మరికొన్ని విషయాలను తెలుసుకున్నారు. అలా ఆ పాత్రలో జీవించేందుకు ఆ పరిశీలన ఎంతగానో ఉపయోగపడింది. భారతదేశంలోని ఎంతో మంది నటీనటులు ఎక్కువగా అంధుల పాత్రలను పోషించారు. అయితే పాతతరంలోని నటులు అంధులుగా నటించినా ఆ పాత్రలకు పూర్తి న్యాయం చెయ్యలేకపోయారనే చెప్పాలి. ఎందుకంటే దాన్ని ఒక పాత్రగా చేశారే తప్ప సహజంగా అంధులు ఎలా ప్రవర్తిస్తారు అనేదాన్ని చూపించలేకపోయారు.  ఇలాంటి అరుదైన పాత్రలు చేయడంలో మంచి పేరు తెచ్చుకున్న కమల్‌హాసన్‌ 1981లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘అమావాస్య చంద్రుడు’ చిత్రంలో అంధుడిగా నటించి అందర్నీ మెప్పించారు. ఆ పాత్రలో జీవించేందుకు కమల్‌ మద్రాసులో ఉన్న ఒక వికలాంగుల పాఠశాలకు వెళ్ళి, ఆ స్కూల్‌కి కొంత విరాళమిచ్చి అక్కడ వున్న అంధులను దగ్గరగా పరిశీలించారు. వారి బాడీ లాంగ్వేజ్‌, నడక, భావప్రకటన వంటి అంశాలను బాగా గ్రహించిన తర్వాతే సినిమాలోని ఆ పాత్రను పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కమల్‌హాసన్‌ చేసిన సినిమాల్లో ‘అమావాస్య చంద్రుడు’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. 1950లో వచ్చిన ‘షావుకారు’ చిత్రంలో సున్నం రంగడు పాత్ర కోసం ఎంతో మంది రిక్షావాళ్ళను పరిశీలించారు ఎస్‌.వి.రంగారావు. వాళ్ళు బీడీ కాల్చే విధానం, మాట్లాడే తీరు, వారు ఎలా నడుస్తారు వంటి విషయాలను బాగా తెలుసుకొని సున్నం రంగడు పాత్రకు న్యాయం చేశారు. ఇలాంటి ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తోంది. ప్రస్తుత జనరేషన్‌లో కూడా కొన్ని అరుదైన పాత్రలను పోషించాల్సి వచ్చినపుడు నటీనటులు ఆ క్యారెక్టర్ల గురించి పూర్తిగా తెలుసుకొని ఆయా పాత్రల్లో జీవించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కృష్ణ, శోభన్‌బాబు విడిపోవడానికి, మల్టీస్టారర్స్‌కి బ్రేక్‌ పడడానికి కారణమైన సినిమా ఇదే!

తెలుగు సినిమా రంగంలో మల్టీస్టారర్‌ చిత్రాలకు ఆద్యులుగా ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల గురించి చెప్పుకోవాలి. వారి కెరీర్‌ ప్రారంభం నుంచి దాదాపు 15 సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. అయితే వారి మధ్య ఎప్పుడూ మనస్పర్థలు రాలేదు. ఇద్దరిలో ఎన్టీఆర్‌ కంటే ఎఎన్నార్‌ సీనియర్‌. అయినా ఇద్దరూ కలిసి నటించిన సినిమాల్లో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది, ఎవరి పాత్ర తక్కువ ఉంది అనే విషయాల గురించి ఇద్దరూ పట్టించుకోలేదు. ‘మిస్సమ్మ’ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌ ప్రారంభంలోనే చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ హీరో కాగా, ఎఎన్నార్‌ డిటెక్టివ్‌గా ఒక కామెడీ క్యారెక్టర్‌ చేశారు. అయినా ఎఎన్నార్‌ ఆ విషయంలో ఫీల్‌ అవ్వలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఎలాంటి అరమరికలు లేకుండా ఇద్దరూ సినిమాలు చేశారు. అయితే ఆ తర్వాత ఇద్దరు హీరోలకు అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఇద్దరూ కలిసి చేసే సినిమాల్లో తమ హీరోకి ఎలాంటి ఇంపార్టెన్స్‌ ఇచ్చారు అని అభిమానులు డిస్కస్‌ చేసుకునేవారు.  ఆ క్రమంలోనే ఇద్దరూ కలిసి చేసిన ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడిగా, ఎఎన్నార్‌ అర్జునుడిగా నటించారు. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత అక్కినేని అభిమానులు తమ హీరో పాత్ర విషయంలో నిరాశ చెందారు. ఎన్టీఆర్‌ పాత్ర కంటే ఎఎన్నార్‌ పాత్రకు ప్రాధాన్యం తగ్గిందని వారు భావించారు. అంతటితో ఆగకుండా కొందరు సీనియర్‌ అభిమానులు ఈ విషయాన్ని అక్కినేని అన్నపూర్ణ చెవిలో వేశారు. అప్పుడు సినిమా చూసిన ఆమెకు కూడా అలాగే అనిపించింది. ఇకపై ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయవద్దని అక్కినేనిపై  ఆంక్ష విధించారు అన్నపూర్ణ. దీనికి సంబంధించి ఆయన నుంచి మాట కూడా తీసుకున్నారు. ఈ సినిమా 1963లో విడుదలైంది. ఆ తర్వాత 14 సంవత్సరాల పాటు ఇద్దరూ కలిసి సినిమా చెయ్యలేదు. 1977లో వచ్చిన ‘చాణక్య చంద్రగుప్త’ చిత్రంతో మళ్ళీ ఇద్దరూ కలిసి నటించడం ప్రారంభించారు.  మల్టీస్టారర్స్‌ విషయంలో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ తర్వాత మళ్ళీ అంతటి పేరు తెచ్చుకున్న జంట కృష్ణ, శోభన్‌బాబు. వయసు రీత్యా, కెరీర్‌ పరంగా కృష్ణ కంటే శోభన్‌బాబు సీనియర్‌. కృష్ణ కంటే నాలుగు సంవత్సరాల ముందే శోభన్‌బాబు ఇండస్ట్రీకి వచ్చారు. అందుకే శోభన్‌బాబును ఎంతో గౌరవించేవారు కృష్ణ. వీరిద్దరూ కలిసి మొదట నటించిన సినిమా ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి ఓ అరడజను సినిమాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చివరి సినిమా ‘మహా సంగ్రామం’. మొత్తంగా చూస్తే ఇద్దరూ కలిసి 17 సినిమాలు చేశారు. 1973 తర్వాత ఇద్దరూ విడివిడిగా సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పోటీ మొదలైంది. ఒకరిని మించి ఒకరు హిట్లు కొడుతూ దూసుకెళ్ళేవారు. ఇక్కడ కూడా ఇద్దరికీ అభిమాన సంఘాలు ఏర్పడడం, తమ హీరోల సినిమాల గురించి అభిమానులు చర్చా వేదికలు పెట్టుకోవడం వంటివి విరివిగా జరిగేవి.  దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత 1977లో ‘కురుక్షేత్రం’ చిత్రంలో ఇద్దరూ కలిసి నటించారు. ఇందులో శ్రీకృష్ణుడుగా శోభన్‌బాబు, అర్జునుడిగా కృష్ణ నటించారు. ఈ సినిమా నుంచి మళ్ళీ ఇద్దరి కాంబినేషన్‌ మొదలైంది. అప్పటికే ఇద్దరూ టాప్‌ హీరోలుగా వెలుగొందుతున్నారు. వీరు చేసే సినిమాలు అభిమానులకు చర్చనీయాంశాలుగా మారేవి. ఇద్దరిలో ఎవరి పాత్రకు ప్రాధాన్యం ఉంది అనే దానిమీదే ఎక్కువ చర్చ జరిగేది. అయితే కృష్ణ కంటే శోభన్‌బాబు సీనియర్‌ కావడం వల్ల తన పాత్ర ఇంపార్టెన్స్‌ తగ్గినా కృష్ణ ఫీల్‌ అయ్యేవారు కాదు. కానీ, అభిమానులు మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకునేవారు. ఆ క్రమంలోనే ఇద్దరూ కలిసి చేసిన ముందడుగు చాలా పెద్ద హిట్‌ అయింది. సిల్వర్‌ జూబ్లీ జరుపుకున్న ఏకైక మల్టీస్టారర్‌గా ‘ముందడుగు’ చిత్రాన్ని చెబుతారు. అంతకుముందు ఇద్దరి కాంబినేషన్‌లో ‘మండే గుండెలు’ చిత్రం వచ్చింది. అభిమానుల మధ్య ఎన్ని చర్చలు జరుగుతున్నా ఇద్దరూ కలిసి కృష్ణార్జునులు, ఇద్దరు దొంగలు, మహాసంగ్రామం వంటి సినిమాలు చేశారు.  సక్సెస్‌ఫుల్‌గా వెళుతున్న వీరిద్దరి కాంబినేషన్‌కి ‘మహా సంగ్రామం’ బ్రేక్‌ వేసింది. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత శోభన్‌బాబు అభిమానులు కోపంతో రగిలిపోయారు. ఈ సినిమాలో కృష్ణ క్యారెక్టర్‌ మెయిన్‌గా కనిపించడం, శోభన్‌బాబు క్యారెక్టర్‌ని తగ్గించి చూపించడంతో గొడవ మొదలైంది. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఈ విషయంలో శోభన్‌బాబు కూడా బరస్ట్‌ అయి పరుచూరి బ్రదర్స్‌ని చంపేస్తానని కోపంగా అన్నారని తర్వాత పరుచూరి గోపాలకృష్ణ  ఓ సందర్భంలో తెలిపారు. ఈ సినిమాలో శోభన్‌బాబు మిలటరీ ఆఫీసర్‌గా నటించారు. అతని క్యారెక్టర్‌తో కామెడీ చేయించారు. సినిమా రిలీజ్‌కి ముందే ఒక మిలటరీ ఆఫీసర్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సెన్సార్‌లో శోభన్‌బాబు పాత్ర నిడివిని తగ్గించాల్సి వచ్చిందని పరుచూరి బ్రదర్స్‌ తర్వాత వివరణ ఇచ్చారు. అయితే దీన్ని శోభన్‌బాబు అభిమానులు ఒప్పుకోలేదు. సెన్సార్‌లో కట్‌ అయిందనేది సాకు మాత్రమేనని, కావాలనే తమ హీరో క్యారెక్టర్‌ను తగ్గించారని వాదించారు శోభన్‌బాబు అభిమానులు. ఇది జరిగిన తర్వాత కలిసి మళ్ళీ సినిమా చెయ్యకూడదని డిసైడ్‌ అయ్యారు కృష్ణ, శోభన్‌బాబు.