బాగో అన‌లేదు కాని వెళ్లిపోవాల్సిందే

  సీమాంద్ర ప్రజ‌ల‌కు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌దు అంటునే మ‌రోసారి కేసిఆర్ వివాదాస్పద స్టేట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న సీమాంద్ర ఉద్యోగులు ఎట్టి ప‌రిస్థితుల్లో వెళ్లిపోవాల్పిందే అన్నారు కెసిఆర్‌.హైద‌రాబాద్ టిఎన్‌జీవొలు ఏర్పాటు చేసిన స‌భ‌లో పాల్గొన్న కెసిఆర్ మ‌రోసారి ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణ‌లో నివ‌సిస్తున్న వారు ముఖ్యంగా ఇక్కడ ఓటు హ‌క్కు క‌లిగిన వారంతా ఇక్కడి ప్రజ‌లుగానే పరిగ‌ణింప‌బ‌డ‌తార‌ని దిగ్విజ‌య్ సింగ్ చెప్పి 24 గంట‌లు కూడా కాక ముందే కెసిఆర్ చేసిన ఈ ప్రక‌టన వివాదాస్పద‌మైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించి ఎలాంటి చ‌ర్యలు జ‌ర‌గ‌క‌ముందే కెసిఆర్ ఇలా మాట్లాడ‌టంతో ఆ వ్యాఖ్యల‌కు ప్రదాన్యత సంత‌రించుకుంది. ఇప్పటికే హైద‌రాబాద్‌లో ఉన్న సీమాంద్రులు త‌మ భద్రత విష‌యంలో భ‌య‌ప‌డుతుంటే ఇప్పుడు కెసిఆర్ వ్యాఖ్యల‌తో ఆ భ‌యం మ‌రింత ఎక్కువ‌యింది. అస‌లు త‌న ఎప్పుడు సీమాంద్రుల‌ను బాగో అన‌లేద‌ని చెప్పిన కెసిఆర్. ఉద్యోగులు త‌ప్పకుండా వెళ్లిపోవాలి అన‌టం బాగో అన‌టం కాదా అంటున్నారు విశ్లేష‌కులు. ఇప్పటికైనా ఇలాంటి నాయ‌కులు ఇరు ప‌క్షాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయ‌కుండా క‌ట్టడి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

చిరంజీవి కాళ్లు విర‌గొడ‌తా

  సీమాంద్రలో రేగుతున్న విభ‌జ‌న సెగ‌లు ఇన్నాళ్లుగా ఇంటిప‌ట్టున ఉన్న నేత‌లు కూడా ప‌ని క‌ల్పిస్తున్నాయి. చాలా కాలం క్రితం ప్రజారాజ్యం పార్టీలో కీల‌క పాత్ర పోషించి, త‌రువాత చిరు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయ‌డంతో ఆయ‌న మీద దుమ్మెత్తిపోసిన నాయ‌కురాలు శోభారాణి. చిరు కాంగ్రెస్‌లో చేర‌డంతో త‌రువాత కొద్ది రోజులు వైకాపా వెంట తిరిగిన వాళ్లు కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మైకుల ముందు క‌నిపించ‌ట‌మే మానేసింది. అయితే తాజాగా తెలంగాణ‌కు అనుకూలంగా కాంగ్రెస్ ప్రక‌ట‌న చేయ‌డంతో మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చింది శోభారాణి. విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి పై తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. చిరంజీవి క‌నిపిస్తే రాళ్లతో, చెప్పుల‌తోకొడ‌తాన‌న‌ట‌మే కాకుండా కాళ్లు విర‌గొడ‌తానన్నారు.. అంతేకాదు రాష్ట్ర విభ‌జ‌న‌కు నిర‌స‌న‌గా త‌న నివాసంలోనే ఆమె ఆమ‌ర‌ణ నిర‌హార దీక్షకు దిగారు. చిరంజీవి స‌మైక్యాంద్రకు మ‌ద్దతు ఇవ్వటం వ‌ల్లే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కోసం ప‌ని చేశామ‌ని, ఇప్పుడు అదే విష‌యంలో చిరు మౌనంగా ఉంటడ‌టం బాధ‌క‌ర‌మ‌న్నారు. చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ మంచి నటుడని నిరూపించుకున్నారని, ఇకపై చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోల చిత్రాల ప్రదర్శనను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

టిడిపి సీమాంధ్ర ఎంపీల రాజీనామా

      సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కొణకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్, సీఎం రమేష్, సుజనా చౌదరిలు తమ పదవులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని కొనకళ్ల నారాయణ అన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాజకీయ లబ్ది కోసం ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై స్పష్టమైన క్లారిటీ లేదని, ఏక పక్ష నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర ప్రజలు నష్టపోతున్నారని కొణకళ్ల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడ్డానికి ప్రజల్లోకి వెళ్ళి ఉద్యయం చేస్తామని, కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమం ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యులుగా ఉండి ఏం చేయలేని పరిస్థితి ఉన్నందున తాము రాజీనామాలు చేస్తున్నామన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించకుండా డిగ్గీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ తీరు దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ఉందన్నారు. తమ ప్రాంతానికి న్యాయం చేసేందుకు కేంద్రం దిగి వచ్చే వరకు తాము ఉద్యమిస్తామన్నారు. వైయస్సే తెలంగాణకు అనుకూలమని కాంగ్రెసు పార్టీ నేతలే చెబుతున్నారన్నారు. చర్చలు జరపకుండా కాంగ్రెసు తమ నిర్ణయాన్ని ప్రజల పైన రుద్దారన్నారు.

జగన్ పార్టీలో బయటపడుతున్న దొంగలు

      ఇప్పటికే వరుసగా ముగ్గురు మోసగాళ్లు ఇటవలే వైసీపీలో బయటపడిన సంగతి తెలిసిందే తాజాగా గుంటూరులో మరో ఆణిముత్యం బయటకు వచ్చింది. మేడికొండూరుకు చెందిన ధనేకుల కళ్యాణి వైఎస్సార్ కాంగ్రెస్లో క్రియాశీలక నేత. జిల్లాలో షర్మిల పాదయాత్ర జరిగినపుడు అక్కడ కట్టిన బ్యానర్లలో అధిక శాతం కళ్యాణివే. నిరంతరం నాయకులతో కలిసి తిరిగేది.   ఇదిలా ఉండగా….నాలుగు రోఉల క్రితం గుంటూరు బ్రాడీపేటలోని ఓ జువెలరీ దుకాణానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత పేరుతో ఫోన్ చేసింది. మా వాళ్లను పంపుతున్నాను. కొన్ని డిజైన్లు పంపితే నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటానని చెప్పింది. తర్వాత కొంతసేపటి తర్వాత ఓ వ్యక్తి ఆ దుకాణానికి వెళ్లాడు. తనను ఎమ్మెల్యే పంపారని, ఇరవై లక్షల విలువైన నగలు తీసుకెళ్లారు. ఎంత బాగా నమ్మించారంటే రెండ్రోజుల తర్వాత ఆరు లక్షల నగలు తిరిగి ఇచ్చేశారు. తీసుకున్న వాటికి డబ్బలు ఆన్లైన్లో పంపుతామని చెప్పారు. తీరా ఎన్నాళ్లకీ డబ్బు రాకపోయేటప్పటికి పోలీసుల వద్దకు వ్యవహారం వెళ్లింది. అపుడు ఆ వ్యక్తిని విచారిస్తే కళ్యాణి పేరు బయటకు వచ్చింది. ఆమెను విచారిస్తే నగలు బయటకు వచ్చాయి. ఈ మేడమ్ గారి చరిత్ర ఏంటో తెలుసా… హైదరాబాదులో చదువుకుంది. ఇక్కడే ఒక వ్యక్తిని పెళ్లాడింది. రెండు నెలలకే అతనితో విడిపోయింది. ఆ తర్వాత వైసీపీ అయితే తనకు అడ్డంకి ఉండదని అనుకుని తన గ్లామర్ తో అక్కడ సెటిలైంది.  

అందాల తమ్మన్నాకు సమైక్య సెగ

  ఈరోజు తన సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన అందాల తార తమ్మన్నాకు వైజాగ్ విమానశ్రయంలో సమైక్యాంధ్ర సెగ తగిలింది. అక్కడ మంత్రులు యంపీలకోసం కాపుకాసుకొని కూర్చొన్న కొందరు సమైక్యవాదులు ఆమె కారును చుట్టూ ముట్టి ‘జై సమైక్యాంధ్ర’ అని నినాదం చేయమని అడిగినప్పుడు ఆమె తనకీ ఉద్యమాలతో సంబంధం లేదని తానొక కళాకారిణినని, తనకు అన్ని ప్రాంతాల ప్రజలతో అనుబంధం ఉందని జవాబివ్వడంతో వారు కనీసం “తెలుగువారు కలిసుండాలి” అని అనమని కోరారు. కానీ ఆమె అనకపోవడంతో కొంచెం అసహనానికి గురయిన వారు ‘జై తెలుగు’ అనమని ఒత్తిడి చేసారు. కానీ ఆమె ‘జై ఇండియా’ అని తన కారులో వెళ్లిపోయింది.   ఇంత కాలం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెలంగాణావాదులు చుక్కలు చూపించారు. ఇప్పుడు సమైక్యవాదులు ఆ పనికిపూనుకోవడం విచారకరం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో అనుబంధం ఉన్నట్టి చిత్రపరిశ్రమను ఉద్యమకారులు ఈవిధంగా ఇబ్బందులకు గురిచేయడం సబబు కాదు. ముఖ్యంగా సినీపరిశ్రమలో అత్యధికులు సీమంద్రా ప్రాంతానికి చెందినవారేననే విషయం గమనించాలి. అందువల్ల వారిచేత బలవంతంగా ఇటువంటి నినాదాలు చేయమని ఒత్తిడి చేయడం షూటింగులకి ఆటంకం కలిగించడం వంటివి చేయకుండా, వారి పని వారిని చేసుకోనిస్తే తమ ఉద్యమానికి వన్నె పెరుగుతుందే తప్ప తగ్గదని తెలుసుకోవాలి.

వాళ్ళ మాట...ప్రజల తూటా

వాళ్ళ మాట...ప్రజల తూటా       వాళ్ళ మాట   1. అన్ని పార్టీల అధినేతల అంగీకారంతోనే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాం.    ప్రజల తూటా   1.అధినేతలు అరడజను మంది... ప్రజలు ఆరు కోట్లు మంది...ఎవరి    అభిప్రాయం ముఖ్యం. వాళ్ళ మాట   2. గీ ఉద్యమాలన్నీ పక్కన బెట్టి అన్న దమ్ములేక్క ఇడిపోదాం.    ప్రజల తూటా   2. అవును...నువ్వు నీ వాటాగా బంగాళా తీస్కో...మేము మా వాటాగా గుడిసె తీస్కుని అన్నదమ్ముల్లా విడిపోదాం. వాళ్ళ మాట   3. హైదరాబాద్ కెల్లి మేం పోమ్మనట్లే..ఈడనే మీరూ ఉండండి..మేమేం అనం   ప్రజల తూటా   3. దానికి ప్రత్యేక రాష్ట్రం అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నట్టే  ఉండొచ్చు.   వాళ్ళ మాట 4. డిగ్గీ సింగ్..పదేళ్ళు హైదరాబాద్ మీద పెత్తనం తెలంగాణ వాళ్ళదే!    ప్రజల తూటా   4. సీమాంధ్రవాళ్లకి అన్యాయం జరగదన్నావ్..ఇదా?   వాళ్ళ మాట 5. విగ్రహాలు ధ్వంసం మంచి పద్దతికాదు.    ప్రజల తూటా   5. అవును..అది..నిజమే.....ఆవిషయం ఈ రోజు తెలిసిందే? హైదరాబాద్ లోని  ట్యాంక్ బండ్ మీద మహామహుల విగ్రహాలు కూల్చినప్పుడు ఈ మాట ఎందుకనలేదు.   వాళ్ళ మాట 6. డిగ్గీ సింగ్..ఈ సమ్మెలు ఉద్యమాలు చెయ్యడం మాములే.    ప్రజల తూటా   6. అలాగే అనుకుని ప్రత్యేక రాష్ట్రం జోలికి వెళ్ళకుండా ఉండాల్సింది.   వాళ్ళ మాట 7. చిరంజీవి.. నేను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటాను.   ప్రజల తూటా   7. ఇప్పుడు కట్టిపడేసినట్లు మాట్లాడాకుండా కూర్చున్నాడు.     వాళ్ళ మాట                        8. చంద్రబాబు...సెపరేట్ రాజధాని నిర్మించుకోవడానికి నేను 5 లక్షల కోట్లు కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.   ప్రజల తూటా   8. ఈయన డిమాండ్ చేస్తే ఇవ్వడానికి అక్కడి వాళ్ళు రెడీగా ఉన్నారు.    వాళ్ళ మాట          9. మీరు ఆడ మరో రాజధాని మంచిగా డెవలప్ చేస్కోవచ్చు.   ప్రజల తూటా   9. ఆ పనేదో మీరూ చేస్తే బాగుంటుందేమో కదా..మంచిగా!   వాళ్ళ మాట      10. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని అన్నవారు. అలాంటి వారి విగ్రహాలు...     ప్రజల తూటా   10. వాళ్ళంటే అంత గౌరవం ఉన్నవాల్లయితే రాష్ట్రాన్ని విడగొట్టి ఉండేవారు కాదు.   వాళ్ళ మాట     11. డిగ్గీ సింగ్...ఇప్పుడు మడమ తిప్పే ప్రసక్తే లేదు.   ప్రజల తూటా   11.అదే మేము అంటున్నాం.    

రాజీనామాలు అనవసరం: పనబాక

  ఈ రోజు కొందరు కాంగ్రెస్ యంపీలు రాజీనామాలు చేయడంపై కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి స్పందిస్తూ, “ఇప్పుడు రాజీనామాలు చేయడం వల్ల పార్టీని ఇబ్బంది పెట్టడం తప్ప మరే ఇతర ప్రయోజనమూ ఉండదు. ప్రజా ప్రతినిధులమయిన మేము ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామాలు చేసి సమస్యలో భాగం కావడం కంటే, ప్రజలకు, మా పార్టీకి మధ్య వారధిగా నిలవడం అందరికీ మేలు చేస్తుందని నా అభిప్రాయం. రాజీనామాలు చేయడమనేది వ్యక్తిగత అభిప్రాయాలతో ముడిపడి ఉంటుంది. ఈ సమయంలో పార్టీ వెన్నంటి ఉండి సమస్యను పరిష్కరించడంలో నా వంతు పాత్రను పోషించడమే సమంజసమని భావిస్తున్నాను,” అని ఆమె మీడియాతో అన్నారు. అందరూ రాజీనామాలు చేస్తున్న ఈ తరుణంలో ఆమె ఈవిధంగా మాట్లాడటం పదవులపట్ల ఆమెకున్న యావేనని అందరూ భావించవచ్చును. ఆమె నిజంగా ఈ సమస్య పరిష్కారం కోసం కృషిచేస్తే ఆమె నిర్ణయం నూటికి నూరుపాళ్ళు సరయినదేనని చెప్పవచ్చును.

ఆంధ్రాలో ఉద్రుతమవుతున్న ఉద్యమాలు

  కేంద్రం తెలంగాణా ప్రకటన చేసి నేటికి మూడవరోజు. క్రమంగా సీమంధ్ర జిల్లాలంతటా కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉద్రుతమవుతూ పలు చోట్ల హింసాయుతంగా మారుతున్నాయి. అనేక జిల్లాలో ఉద్యమకారులు ఇందిరా, రాజీవ్ గాంధీల విగ్రహాలు విధ్వసం చేస్తున్నారు. ఇంతవరకు వివిధ ప్రాంతాలలో దాదాపు 15-20 విగ్రహాలు ఉద్యమకారుల చేతిలో విద్వంసమయినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పోలీసులు విద్వంసానికి పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసారు.   తెలంగాణాలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తుంటే, మిగిలిన ప్రాంతాలు మాత్రం అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇటువంటి అరాచక పరిస్థితుల్లో రాష్ట్రంలో పోలీసులు, పారా మిలెటరీ బలగాలు తప్ప అసలు ప్రభుత్వం ఉనికి కానరావట్లేదు. ఇంత వరకు ముఖ్యమంత్రి గానీ, బొత్ససత్యనారాయణ గానీ, మరే ఇతర మంత్రులు గానీ బయటకి వచ్చి మీడియాతో మాట్లాడకపోవడం చాలా విచిత్రం.   సీమంధ్ర జిల్లాలంతటా బస్సులు డిపోలకే పరిమితమయిపోగా కొన్నిమారుమూల ప్రాంతాలలో మాత్రం యదావిధిగా తిరుగుతున్నాయి. గత మూడు రోజులుగా అన్ని జిల్లాలలో విద్యాసంస్థలు మూత పడ్డాయి. అదేవిధంగా రవాణ వ్యవస్థ స్తంబించిపోవడంతో ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయాలు కూడా బోసిపోయాయి. ఇక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, యంపీలు, మంత్రులు అందరూ వరుసబెట్టి రాజీనామాలు చేస్తున్నప్పటికీ ఇందిరా, రాజీవ్ గాంధీల విగ్రహాలు విధ్వసం మాత్రం ఆగలేదు. బహుశః ప్రజాగ్రహానికి భయపడటం వలననేమో ఉద్యమాలలో కాంగ్రెస్ నేతలెవరు కూడా చురుకుగా పాల్గొంటున్నట్లు కనబడటం లేదు.   తెదేపా, వైకాపాలు మాత్రం ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే, పార్టీల వారిగా ఉద్యమాలు జరుగుతున్న కొన్ని ప్రాంతాలలో విభజనకు ఇతర పార్టీలే కారణమని నిందించడం గమనిస్తే, ఉద్యమం వెనుక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్, తెదేపాలలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు రెండు పార్టీలకు చెందిన దాదాపు పదిమంది శాసనసభ్యులు రాజీనామాలు చేసారు.

పక్క దారి పడుతున్న ఉద్యమాలు

  మిలియన్ మార్చ్ సందర్భంగా కొందరు తెలంగాణావాదులు హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై ఉన్న మహానీయుల విగ్రహాలు కూల్చినప్పుడు యావత్ తెలుగు జాతి సిగ్గుతో తలవంచుకొంది. దానిని సమర్ధించిన సదరు నేతలను కూడా ప్రజలు తీవ్రంగా అసహ్యించుకొన్నారు. అదేవిధంగా అఖిలపక్షం తరువాత జరిగిన సభలో తెరాస అధ్యక్షుడు జాతీయ నాయకులయిన నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను నోటికొచ్చినట్లు తూలనాడినప్పుడు కూడా ప్రజలు అంతే తీవ్రంగా స్పందించారు. అయితే, ఇప్పుడు అదే తప్పును కొందరు సమైక్యవాదులు చేస్తుండటం చాలా విచారకరం. ఇటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా తప్పనిసరిగా తీవ్రంగా ఖండించవలసిందే.   అనంతపురం జిల్లాలో కొందరు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలకు నిప్పు పెట్టడం, కూల్చివేయడం చాలా హేయమయిన చర్య. కాంగ్రెస్ పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేఖించడాన్నిఎవరూ తప్పు పట్టరు. కానీ, అందుకు ఆ పార్టీకి చెందిన నేతల విగ్రహాలను ద్వంసం చేయడం మాత్రం చాలా తప్పు. ఆవిధంగా చేయడం కేవలం ఒక వికృతి సంస్కృతికి అద్దం పడుతుంది.   అదేవిధంగా 365 రోజులు ప్రజలకు సేవ చేస్తున్న ఆర్టీసీ బస్సులను తగులబెట్టడం, ద్వంసం చేయడం అంటే మన స్వంత ఆస్తులను మనమే నాశనం చేసుకోవడమే అవుతుంది. ఇక, వివిధ సంస్థల కార్యాలయాలలోకి జొరబడి ఆస్తులను ద్వంసం చేయడం, రోడ్డు మీద కనబడిన వాహనాలకి నిప్పుపెట్టడం వంటి చర్యల వల్ల సాటి ప్రజలకు నష్టం కలిగించడమే తప్ప అది ఉద్యమానికి ఎంత మాత్రం ఉపయోగపడదు.   ఉద్యమం ఎవరు పాల్గొన్నా లేకున్నా కొనసాగుతూనే ఉంటుంది. కానీ, ఇటువంటి సంఘ వ్యతిరేఖ చర్యలకు పాల్పడినవారు మాత్రం పోలీసు కేసులలో ఇరుకొని తమ జీవితాలు పాడుచేసుకొన్నవారవుతారు. అందువల్ల సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమం చేస్తున్న వారు రాజకీయ నేతల ప్రభోదాలకి లొంగి ఆవేశపూరితంగా ప్రవర్తించడం కంటే, తమ ఉద్యమంతో ఇతరులకు కూడా ఆదర్శప్రాయంగా నిలవాలి.

వైకాపాకు విరుగుడు మంత్రం వేసిన కాంగ్రెస్

  కాంగ్రెస్ పార్టీపై వైకాపా సంధించిన సమైక్యాస్త్రాన్నిఎదుర్కొనేందుకు ఒక బ్రహ్మాస్త్రమే సిద్దంగా ఉంచుకొంది. కాంగ్రెస్ పార్టీ ఎవరినడిగి రాష్ట్ర విభజన చేసిందని ప్రశ్నిస్తూ ఉద్యమంలోకి దూకిన వైకాపాకు, గతంలో తెలంగాణా కోరుతూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి స్వయంగా సంతకం చేసి ఇచ్చిన లేఖను ఇప్పుడు బయటపెట్టింది. 2004లో ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తెలంగాణ కోరుతూ 32 మంది ఎమ్మెల్యేలతో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీకి ఆయన సంతకం చేసి పంపిన లేఖను కాంగ్రెస్ ఇప్పుడు బయట పెట్టింది. దీనితో వైకాపా కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనేందుకు మరో కొత్త అస్త్రం చూసుకోక తప్పదు. అయితే, అది తన శాసనసభ్యుల రాజీనామాలతో రాజేసిన సమైక్యమంటలు నేడు రాష్ట్రమంతా వ్యాపించడమే కాకుండా ఇతర పార్టీలని కూడా దహించివేస్తున్నాయి.   అయితే, ఈ నిరసనలను, ఆందోళనలను కాంగ్రెస్ ఎంత మాత్రం పట్టించుకొనే ఆలోచన లేదని సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ నిన్న చెప్పడం జరిగింది. రాష్ట్ర విభజన వంటి కీలక నిర్ణయం తీసుకొన్నపుడు ఇటువంటి ప్రతిస్పందన చాల సహజమేనని ఆయన చెప్పడం పార్టీ కూడా ఈవిషయమై పెద్దగా ఆందోళన చెందడంలేదని తెలియజేస్తోంది.   మంత్రులు, శాసనసభ్యుల రాజీనామాలతో రాజ్యంగా సంక్షోభం ఏర్పడితే, దానిని అదిగమించేందుకు కూడా కాంగ్రెస్ మరో అస్త్రం సిద్దంగా ఉంచుకొంది. రాష్ట్ర విభజనపై శాసనసభ ఆమోదించడం సంప్రదాయమే అయినప్పటికీ, అది తప్పని సరి కాదని కాంగ్రెస్ ముందే ప్రకటించింది. అందువల్ల అది 2009 ఫిబ్రవరి 12న రాజశేఖర్ రెడ్డి అద్వర్యంలో రాష్ట్ర శాసనసభలో తెలంగాణపై జరిగిన చర్చను, నాటి సభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాన్నిప్రాతిపదికగా తీసుకొని నేడు ముందుకుపోయేందుకు సిద్దపడుతోంది. అందువల్ల రాష్ట్రంలో మంత్రులు, శాసనసభ్యుల రాజీనామాలతో రాజ్యంగా సంక్షోభం ఏర్పడినప్పటికీ, అది రాష్ట్ర విభజన ప్రక్రియకు అవరోధం కాబోదు. అది కేవలం రాష్ట్రపతి పాలనకు మాత్రమే దారి తీస్తుంది.   ప్రస్తుతం తెలంగాణా ప్రక్రియ కొనసాగించడంకంటే పార్టీకి చెందిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు, యంపీలు, శాసనసభ్యులు, యంయల్సీలు చేస్తున్న రాజీనామాలను తట్టుకొని నిలబడటమే కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష. ఈ పరీక్షలో పార్టీ ఎంత త్వరగా విజయం సాధిస్తే అంత మంచిది.

వాళ్లవి ఉత్తర కుమార ప్రగల్బాలేనా

      ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతాం అలా జరగని పక్షంలో తన పదవులకు పార్టీకి రాజీనామ చేస్తామంటూ ఉత్తర కుమార ప్రగల్బాలు పలికిన నాయకులు ఇప్పుడు మొహం చాటేశారు. ప్రకటనకు ముందు వరకు రాజీనామాల డ్రామా ఆడిన ఈ నాయకులు తెలంగాణ ప్రకటన తరువాత మీడియాకు కనిపించటమే మానేశారు.   అయితే ఈవిషయం పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో సమావేశం అయిన మంత్రులు భిన్న వాధనలు వినిపించారు.. కొంత మంది రాజీనామాలకు మొగ్గు చూపగా మరి కొందరు మాత్రం అధిష్టాన నిర్ణయమే శిరోదార్యం అంటున్నారు. ఆఖరికి ముగ్గురు మంత్రులు మాత్రమే రాజీనామలు అందించగా మిగతా వారు అధిష్టానానికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో అధిష్టానం దూతలుగా వచ్చిన ఏఐసీసీ కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియా వారిని కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీమాంధ్రలో ఆందోళనలు తీవ్రతరమవుతున్నందున ప్రజల్లోకి వెళ్లాలంటే రాజీనామాలు తప్పవని మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇక ఆ విషయంలో నో కాంప్రమైజ్‌

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంతో సీమాంద్రలో నిరసలు వెల్లువెత్తాయి. ప్రత్యేక రాష్ట్ర నిర్ణయం పై కేంద్రం మరోసారి పునరాలోచించుకోవాలి అన్నడిమాండ్‌ బలంగా వినిపిస్తుంది.. ఈ నేపధ్యంలో అలాంటి అవకాశం లేదని స్పంష్టం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే.   ఆయన హోం శాఖ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో తెలంగాణ నిర్ణయం పై కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయంపై పునరాలొచించేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్ర విభజనకు అవసరమైన రాజ్యాంగబద్ధ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు. అయితే ఈ 5వ తారీఖు నుంచి జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో కూడా చాలా సార్లు తెలంగాణ విషయం చర్చ జరిగినందున మరోసారి అసెంబ్లీ తీర్మానం కూడా అవసరం పడక పోవచ్చు అన్నారు.

విదర్భకు కూడా ఒకే

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ప్రకటన చేసి కాంగ్రెస్‌ పుట్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో మరిన్ని డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. అంతేకాదు ఇన్నాళ్లు ఈ డిమాండ్‌లకు దూరంగా ఉన్న నాయకులు కూడా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు పలుకుతున్నారు.   ఇన్నాళ్లు తెలంగాణకు మద్దతు పలికినా… తన సొంతం రాష్ట్రంలోని విదర్భ ఏర్పాటు గురించి ఏనాడు నోరు విప్పని శరద్‌ పవార్‌ తొలిసారిగా విదర్భ ఏర్పాటు గురించి మాట్లాడారు.. అక్కడి ప్రజలు మనోభావాలను గౌరవించి విదర్భ ప్ర్యతేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశంపై ఎన్‌సిపి ఉపాధ్యక్షుడు, కేంద్రమంత్రి ప్రపుల్‌ పటేల్‌ ప్రకటన విడుదల చేశారు. అక్కడి ప్రజల మనోభావాలకనుగుణంగా విదర్భ ఏర్పాటుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. రెండో ఎస్సార్సీ ద్వారా రాష్ట్రాల విభజనకు కూడా తమ మద్దతు ఉంటుందన్నారు.

రాజీనామాలు రాష్ట్రపతి పాలనకి ఆహ్వానమా

  మెల్లగా రాజుకొన్న సమైక్య ఉద్యమం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలని తాకుతోంది. ఊహించినట్లుగానే సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు తెదేపాను కూడా తాకాయి. ఇంత కాలం చంద్రబాబు అతికష్టం మీద పార్టీ నేతలను కట్టడిచేసి ఉంచినప్పటికీ, రోజురోజుకి తీవ్రతరమవుతున్నఉద్యమం నుండి తప్పించుకోవడం వారి వల్లకాలేదు.   పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, ప్రభాకర్ రావు, రఘునాథ రెడ్డి, శ్రీరామ్ తాతయ్య, అబ్దుల్ ఘని, ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీదర్, నరేంద్ర, ఆనంద బాబు, పార్థ సారధి, కేవీ వెంకట ప్రసాద్, దేవినేని ఉమ తదితరులు రాజీనామాలు చేసారు. వీరు గాక పార్టీకి చెందిన అనేక మంది యంయల్సీలు కూడా రాజీనామాలు చేస్తున్నారు. బహుశః రేపటికి అన్ని రాజకీయ పార్టీలు దాదాపు ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే, కాంగ్రెస్ చెందిన అనేక మంది మంత్రులు, శాసన సభ్యులు, యంయల్సీలు తమ రాజీనామాలు సమర్పించారు.   ఇక ప్రస్తుతం సీమంధ్ర ప్రాంతానికి చెందిన పల్లంరాజు, కావూరి, చిరంజీవి, పురందేశ్వరి, శీలం తదితర కేంద్ర మంత్రులు డిల్లీలో కేవీపీ రామచంద్ర రావు ఇంట్లో సమావేశమయ్యారు. వారు కూడా రాజీనామాలు చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే సమైక్య ఉద్యమం పరాకాష్టకు చేరుకోన్నట్లే భావించవచ్చును.   అయితే, తమ రాజీనామాల వలన కేంద్ర నిర్ణయం మారదని వారందరికీ తెలిసినప్పటికీ వారు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారంటే, రాజ్యంగ సంక్షోభం సృష్టిండం ద్వారా రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విదించబడితే, రాజధాని హైదరాబాద్ పై ప్రస్తుతం తెలంగాణా నేతలు చేస్తున్న వాదనలకు అడ్డు కట్ట వేయవచ్చునని వారి ఆలోచన కావచ్చును. హైదరాబాద్ ను ఎట్టిపరిస్థితుల్లో వదులుకొనేందుకు రెండు ప్రాంతాల వారు ఇష్టపడని కారణంగా మధ్యే మార్గంగా హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు ఈ రాజీనామాల ద్వారా ఒత్తిడి తేవచ్చునని వారి ఆలోచన కావచ్చును.   రాష్ట్ర విభజనపై ఎంతో లోతుగా అధ్యయనం చేసి అనేక మందితో సంప్రదింపులు జరిపిన తరువాతనే నిర్ణయం ప్రకటించామని కొద్ది సేపటి క్రితమే దిగ్విజయ్ సింగ్ మీడియాతో చెప్పారు. అయితే, కాంగ్రెస్ అంచనాలకు విరుద్దంగా సమైక్యాంధ్ర ఉద్యమం మళ్ళీ పుంజుకొంది. కాంగ్రెస్ హైదరాబాదు పై ఉన్న పీటముడులను గమనించి కేంద్రపాలిత ప్రాంతంగా ముందే ప్రకటించి ఉంటే బహుశః ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. నానాటికి తీవ్రమవుతున్న ఉద్యమానికి బహుశః అదొక్కటే పరిష్కారం అవుతుందేమో!

బొత్స ఇళ్ళు ముట్టడి

    సమైక్యాంధ్ర జేఏసి నేతలు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బొత్స సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులంతా తమ పదవులకు రాజీనామా చేసి పాలనా పరమైన సంక్షోభాన్ని సృష్టించాలని సమైక్యాంధ్రవాదులు డిమాండ్ చేశారు. ఉద్యమానికి సహకరించని నాయకులకు తీవ్రపరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో విజయనగరం పట్టణం మొత్తం పోలీసులు వలయంలో చిక్కుకొంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్ర ప్రక్రియ ఐదారు నెలల్లో పూర్తి: షిండే

      రాష్ట్ర విభజన ప్రక్రియకు సాధారణంగా ఎనిమిది నెలలు పడుతుందని, కాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ఐదారు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నోట్‌ను రాష్ట్రపతికి పంపడం జరుగుతుందని షిండే చెప్పారు.   హోంమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరిందని, ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. దేశంలో చాలా చోట్ల ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లు వస్తున్నాయని, అయితే విధర్భ కంటే ముందే తెలంగాణ డిమాండ్ ఉందని షిండే పేర్కొన్నారు. కేబినెట్‌లో తెలంగాణ అంశంపై నోట్ సిద్ధం కాగానే హైదరాబాద్‌పై మరింత స్పష్టత వస్తుందని షిండే స్పష్టం చేశారు. భాష ఆధారంగానే రాష్ట్రం ఉండాలని ఎక్కడా లేదని, రాష్ట్ర విభజనపై అందరూ సయంమనం పాటించాలని షిండే విజ్ఞప్తి చేశారు.

సస్పెన్షన్: కెసిఆర్ కు విజయశాంతి కృతజ్ఞతలు

      టీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ కు గురైన మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి బహిరంగ లేఖ రాశారు. ఆరేళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి లో పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన అన్న, పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. తనకు సస్పెన్షన్ షోకాజ్ ఇంకా అందలేదని, అందాక దానిపై స్పందిస్తానని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగ ఫలితం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. మెదక్ ప్రజలకు తన ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. విజయశాంతి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని ఆమె అనుచరుడు రఘువీర్ తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదన్నరు. అలాంటప్పుడు వేటు ఎందుకు వేస్తారని ప్రశ్నించారు.

హరికృష్ణ తెదేపా వఖల్తా ఎందుకు పుచ్చుకొన్నట్లో

  వైకాపా పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్ చిచ్చుతో తెదేపాకు దూరమయి, పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్ననందమూరి హరికృష్ణ నిన్నజరిగిన పంచాయితీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ అవినీతి, అసమర్థ పార్టీలను త్రిప్పికొట్టి, తెలుగు దేశం పార్టీని గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇంత కాలం పార్టీ అంటే గిట్టనట్లు వ్యవహరించిన హరికృష్ణ, ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ తరపున మాట్లాడటం ఆశ్చర్యం కలిగించినా, ఆయన తెదేపా ద్వారా తన రాజకీయ జీవితం కొనసాగించేందుకే ఆసక్తి చూపుతున్నందునే ఆవిధంగా మాట్లాడినట్లు అర్ధం అవుతోంది.   రాజ్యసభ సభ్యుడయిన హరికృష్ణ మరో తొమ్మిది నెలలలో జరగనున్నఎన్నికలలో ఈ సారి గన్నవరం నియోజక వర్గం నుండి శాసనసభకు పోటీచేసే ఆలోచన ఉన్నట్లు ఇదివరకు ఒకసారి తెలిపారు. బహుశః దానిని దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు మళ్ళీ పార్టీ తరపున మాట్లాడి ఉండవచ్చును. అయితే, మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో తెదేపా తప్పని సరి విజయం సాదించాలంటే కేవలం గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్స్ ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరి తెదేపా ఆయనకు టికెట్ కేటాయించగలదని భావించలేము. అదీగాక రాష్ట్ర విభజన తరువాత, దాదాపు 140 సీట్లు మాత్రమే ఉండే అవకాశం ఉన్నందున టికెట్స్ కోసం పోటీ చాల అధికంగా ఉండబోతోంది. రానున్న ఎన్నికలలో గెలవడం తేదేపాకు ఎంత ముఖ్యమో వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు కూడా అంతే ముఖ్యం గనుక వారి మధ్య చాల తీవ్రమయిన పోటీ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో హరికృష్ణ పార్టీ టికెట్ ఆశిస్తూ మళ్ళీ చంద్రబాబుకి దగ్గర కావాలని ప్రయత్నిస్తే మాత్రం ఆయనకు నిరాశ తప్పదు.