నిమ్మగ‌డ్డకు తాత్కాలిక బెయిల్‌

  జ‌గ‌న్ అక్రమాస్తుల కేసులో చంచ‌ల్ కూడా జైలులో రిమాండ్ ఖైదిగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగ‌డ్డ ప్రసాద్‌కు బెయిల్ ల‌భించింది.వ్యక్తి గ‌త కార‌ణాల‌తో బెయిల్ కావాలంటూ నిమ్మగ‌డ్డ పెట్టుకున్న పిటిష‌న్ పై విచారించిన సిబిఐ కోర్టు 2 రోజుల పాటు తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. నిమ్మగ‌డ్డ బెయిలుకు సంభందించిన మంగ‌ళ వారం విచారించిన కోర్టు ఈ మేర‌కు ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో జైళులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌ను ఈ నెల 12కు వాయిదా వేసిన కోర్టు, మోపిదేవి ఆరోగ్య ప‌రిస్థితిపై నివేదిక ఇవ్వాల‌ని మెడిక‌ల్ బోర్డును ఆదేశించింది.

రిజ‌ర్వ్ బ్యాంక్ కొత్త గ‌వ‌ర్నర్‌

  సెప్టెంబ‌ర్ 4తో రిజ‌ర్వ్ బ్యాంక్ ప్రస్థుతం గ‌వ‌ర్నర్ దువ్వూరి సుబ్బారావు ప‌ద‌వీకాలం ముగుస్తుండ‌టంతో ఆ స్థానంలో కొత్త గ‌వ‌ర్నర్‌గా ర‌ఘురామ్ రాజ‌న్ బాధ్యత‌లు స్వీక‌రించ‌నున్నారు. ర‌ఘురామ్‌రాజ‌న్ రిజ‌ర్వ్ బ్యాంక్ 23వ గ‌వ‌ర్నర్‌గా బాద్యత‌లు చేప‌డ‌తారు. ఈయ‌న మూడేళ్ల పాటు ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ప్రస్థుతం రాజ‌న్ భార‌త ప్రభుత్వానికి ప్రదాన ఆర్ధిక స‌ల‌హాదారుగా వ్యవ‌హ‌రిస్తున్నారు,  సాధారణంగా రిజర్వ్‌ బ్యాంకుకు ఐఏఎస్‌ అధికారిని మాత్రమే గవర్నర్‌గా నియమిస్తుంటారు. దువ్వూరి సుబ్బారావు , అంతకుముందున్న గవర్నర్‌ వై.వి.రెడ్డి ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులే. త‌న‌కున్న అపూర్వ మేద‌స్సు కార‌ణంగానే రాజ‌న్ ఐఏఎస్ కాక‌పోయినా రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్నర్ ఎంపిక‌య్యారు. అసాధార‌ణ ప్రతిభావంతుడిగా రాజ‌న్‌కు పేరుంది. ప్రస్థుతం దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ త‌రుణంలో రాజ‌న్ రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్నర్‌గా బాధ్యత‌లు తీసుకుకోవ‌టం మంచి ప‌రిణామం అంటున్నారు విశ్లేష‌కులు. అత్యంత చిన్న వ‌య‌సులోనే ఆర్బీఐ గ‌వ‌ర్నర్‌గా బాద్యత‌లు చేప‌డుతున్న వ్యక్తిగా కూడా రాజ‌న్ రికార్డ్ క్రియేట్ చేశారు.

కెసిఆర్ హ‌త్యకు కుట్ర

  తెలంగాణ ప్రక‌ట‌న నేప‌ధ్యంలో త‌మ నాయ‌కుడు కెసిఆర్‌కు ప్రాణ హాని ఉంద‌ని టిఆర్ ఎస్ పార్టీ ప్రక‌టించింది. ఈ మేర‌కు త‌మ ద‌గ్గ‌ర విశ్వస‌నీయ స‌మాచారం ఉంద‌న్న టిఆర్ఎస్ నాయ‌కులు కెసిఆర్‌కు జెడ్ ప్లస్ క్యాట‌గిరి సెక్యూరిటీ కావాల‌ని డిమాండ్ చేశారు.కెసిఆర్ మీద ఈగ వాలినా రాష్ట్రం అల్లక‌ల్లోలం అవుతుంద‌న్నారు ఆ పార్టీ నాయ‌కుడు ఈటెల రాజేంద‌ర్‌. కెసిఆర్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న ఇంటిలిజ‌న్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందింద‌న్న రాజేంద‌ర్ ఆయ‌న‌కు త‌గిన భ‌ద్రత క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. కెసిఆర్ నాలుగున్నర కోట్ల ఆశాకిర‌ణం, అందుకే ఆయ‌నను హ‌తా మార్చాల‌ని విద్రోహ శ‌క్తులు ప్రయ‌త్రిస్తున్నాయ‌న్నారు. ఈ మేర‌కు ఇప్పటికే సుపారిలు కూడా అందాయ‌ని ఆ స‌మాచారం త‌మ ద‌గ్గర ఉంద‌ని అడిష‌న‌ల్ డిఐజి ఆ స‌మాచారాన్ని అందిస్తామ‌ని ప్రక‌టించారు. ఈ కుట్ర పై పూర్తి స్థాయి ద‌ర్యాప్తు జ‌రిపించ‌టంతో పాటు కెసిఆర్‌కు త‌గిన భ‌ద్రత క‌ల్పించాల‌న్నారు. కెసిఆర్‌కు ఏం జ‌రిగినా అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాద్యత వ‌హించాల‌న్నారు.

కాంగ్రెస్ మార్క్ క‌మిటీ

  తెలంగాణ ప్రక‌ట‌ణ‌తో అట్టుడుకుతున్న ప‌రిస్థితుల‌ను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ మ‌రోసారి త‌న పాత అస్త్రాన్ని ప్రయోగించింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డ్డ ప్రతిసారి క‌మిటీ ఏరుతో కాల‌యాప‌న చేసిన కాంగ్రెస్ ఈసారి సీమాంద్ర అల్లర్ల చ‌ల‌క‌లార్చేందుకు అదే అస్త్రాన్ని వాడుతుంది. ప్రక‌ట‌న‌కు ముందే చేయాల్సిన ప‌నిని కాస్త ఆల‌స్యంగా ప్రక‌ట‌న త‌రువాత మొద‌లుపెట్టింది. ఈ క‌మిటీలో కూడా ఆంద్ర ప్రదేశ్‌నుంచి ఏ ఒక్కరికి స్ధానం క‌ల్పించ‌లేదు. క‌మిటీ స‌భ్యులుగా ఎకె ఆంటోని, దిగ్విజ‌య్‌సింగ్‌, వీర‌ప్పమొయిలీ ఇరు ప‌క్షాల వాద‌న‌ల‌ను విన‌నున్నారు. వివాద ర‌హితుడిగా పార్టీతో పాటు దేశ రాజ‌కీయాల్లో కూడా మంచి ప‌ట్టున్న ఆంటోనికి విలీనం స్పెష‌లిస్ట్‌గా కూడా పేరుంది, చిరంజీవి మూన్నాళ్ల ముచ్చట‌గా ముగించిన ప్రజారాజ్యం పార్టీ విలీనంలో కీల‌క పాత్ర పోషించారు. ప్రస్థుతం ఈయ‌న రాజ‌కీయ చ‌తుర‌త టిఆర్ఎస్ విలీనానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఇక ప్రస్థుతం రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్‌గా వ్యవ‌హ‌రిస్తున్న దిగ్విజ‌య్ సింగ్ విభ‌జ‌న స్పెష‌లిస్ట్ గ‌తంలో రాష్ట్రాలు విడిపోయిన సంద‌ర్భంలో ఆ రాష్ట్రాల‌తో పరోక్షంగానో ప్రత్యక్షంగానో సంబందం ఉన్న డిగ్గీ ఆంద్ర ప్రదేశ్ విష‌యంలో కూడా అంతే వేగంగా ప‌నిముగించేశారు. ఇక మూడో వ్యక్తి వీర‌ప్పమొయిలికి కూడా రాష్ట్ర ప‌రిస్ధితుల‌పై మంచి అవ‌గాహ‌న ఉంది. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న ఈయ‌న‌కు రాష్ట్రనాయ‌కుల‌తో స‌న్నిహిత సంభందాలు ఉన్నాయి. మ‌రి ఈ క‌మిటీ రాష్ట్రంలో పెల్లుబుకుతున్న ఆగ్రహ జ్వాల‌ల‌ను ఎంత‌వ‌ర‌కు చ‌ల్లారుస్తుందో చూడాలి.

స‌మ్మెకు స‌ర్వం సిద్దం

  రాష్ట్రంలో మ‌రో సారి స‌మ్మెసైర‌న్ మోగింది, గ‌తంలో స‌క‌ల జ‌రనుల స‌మ్మెతో కుదేల‌యిన రాష్ట్ర ఆర్ధిక వ్యవ‌స్థ మ‌రోసారి అదే ఉప‌ద్రవాన్ని ఎదుర్కొనబోతుంది. సీమాంద్ర పై ఎటూ తేల్చకుండానే తెలంగాణ ప్రక‌ట‌న చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇక మూల్యం చెల్లించ‌క త‌ప్పదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. స‌మైక్యాంద్రకు మ‌ద్దతుగా ఈ నెల‌12 అర్ధరాత్రి నుంచి స‌మ్మెకు దిగుతున్నట్టుగా ఏపి ఎన్జీవోలు హెచ్చరించారు. అందుకు సంబందిచిన స‌మ్మె నోటిసును ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యద‌ర్శికి అంద‌చేశారు ఏపి ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు. రాష్ట్ర విభ‌జ‌నపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్యతిరేఖిస్తూ స‌మ్మెకు దిగుతున్నట్టుగా అశోఖ్ బాబు వెల్లడించారు. రాష్ట్ర  విభ‌జ‌న జ‌రిగితే ఉద్యోగుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యార‌వుతుంది, విద్యా ఉపాది అవ‌కాశాలు దెబ్బతింటాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. హైద‌రాబాద్ పై తెలంగాణ ప్రాంత వాసుల‌తో పాటు సీమాంద్ర వాసుల‌కు కూడా స‌మాన హ‌క్కులు ఉంటాయిని, త‌మ ప్రాంత ప్రజ‌ల మ‌నోభావాల‌నుతెలుసుకోకుండా ఏక ప‌క్షంగా విభ‌జ‌న చేయటం స‌రికాదు అన్నారు. ఏపీ ఎన్జీవోల‌కు మ‌ద్దతుగా 12 అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బ‌స్సుల‌ను నిలిపివేస్తామ‌ని ఎన్ఎంయూ, ఈయులు మద్దతు తెలిపాయి.

విభజనతో ఆంధ్రాలో రియల్ బూమ్

  ప్రస్తుతం రాష్ట్ర విభజనతో సీమంద్రా ప్రాంతం అట్టుడుకుతున్నపటికీ, త్వరలోనే అంతా సద్దు మణిగి తిరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటే, రెండు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకొంటుందని, ముఖ్యంగా కొత్త రాజధాని, శాసనసభ, హైకోర్టు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు మొదలయిన నిర్మాణ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగబోతున్నందున ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకొంటుందని ఆ రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణ రంగం, దానిని అనుబంధంగా ఉన్న పరిశ్రమలకి, వ్యాపారాలకి ఆయా రంగంలో పనిచేస్తున్ననిపుణులకి, కార్మికులకి మంచి గిరాకి ఏర్పడుతుందని నిపుణులు చెపుతున్నారు. అదే విధంగా రాజధాని పరిసర జిల్లాలు కూడా త్వరితగతిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకొంటాయి, గనుక రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దాదాపు 40 శాతం వరకు పెరుగుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.   అయితే, ఇది వెన్వెంటనే మొదలవకపోయినా రానున్న 6 నుండి 8 నెలలో క్రమంగా పెరుగుతుందని, రానున్న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అది మరింత పుంజుకొని, రెండు మూడు సం.లలో పతాక స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని బహుశః ఒంగోలు గుంటూరు మద్య ఎక్కడయినా ఏర్పరిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపద్యంలో ఆ పరిసర జిల్లాలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం రెట్టింపు అవుతుందని అంచనా.   ఇక విశాఖ, రాజమండ్రీ, తూర్పు, పశ్చిమ గోదావరి కర్నూలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలలో కూడా దీని ప్రభావం బాగా కనిపిస్తుందని భావిస్తున్నారు. అయితే, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు వంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరీ భారీ పెరుగుదల ఉండకపోవచ్చును. కానీ, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన కారణంగా 10 నుండి 15 శాతం పెరిగే అవకాశం ఉంటుందని నిపుణుల చెపుతున్నారు.   ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భూములు కొనుగోలు చేసి ఉంచుకొన్న ప్రవాసాంధ్రులు నిర్మాణ కార్యక్రమాలు చెప్పట్టే అవకాశం ఉందని, అదేవిధంగా మరనేక మంది భూములు కొనుగోలుకు ఆసక్తి చూపించే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. ఇక రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంది గనుక రాష్ట్ర వ్యాప్తంగా భూముల కొరత ఏర్పడి ధరలకు రెక్కలు రావచ్చునని నిపుణులు చెపుతున్నారు.   ఇక, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మొదలవగానే దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున పరిశ్రమలు, వ్యాపారాలు, మౌలిక వసతులు వంటి వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలామంది చొరవ చూపవచ్చునని, కానీ అందుకు సుస్థిరమయిన ప్రభుత్వము, ఆకర్షణీయమయిన ప్రభుత్వ విధానాలు ఉన్నపుడే అభివృద్ధి శరవేగంతో జరుగుతుందని, ఒకవేళ మొదటి రెండు సం.లలో ప్రభుత్వం అస్థిరంగా ఉంటే కనుక, దాని ప్రభావం రాష్ట్రంపై చిరకాలం ఉండిపోయే ప్రమాదం ఉందని, అదే జరిగితే అభివృద్ధి నత్త నడకన సాగుతుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   మంచి పరిపాలనా, వ్యాపార దక్షులుగా పేరున్నఆంధ్ర రాజకీయ నేతలు, వ్యాపారులు అందివచ్చిన ఈ సువర్ణావకాశాన్నిచక్కగా అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడం ఖాయమని వారు దృడంగా చెపుతున్నారు.

సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ

      హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో ఉన్న జలసౌధ నీటి పారుదల కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు..సీమాంధ్ర ఉద్యోగుల మధ్య తోపులాట జరగడంతో..అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బోజన విరామ సమయంలో టీ ఎన్‌జీవో ఉద్యోగులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఏపీ ఎన్‌జీవో ఉద్యోగులు విభజనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రామాన్ని చేపట్టారు. ఏపీ ఎన్‌జీవో ఉద్యోగులు సమైక్య నినాదాలు చేయగా..వారికి పోటిగా టీ ఎన్‌జీవో ఉద్యోగులు తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వివాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి నచ్చజెప్పి ఇరు ప్రాంతాల ఉద్యోగులను శాంతింపజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

చోద్యం చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

  కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేసినప్పటి నుండీ నానాటికి సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరమవుతోంది. ఇదివరకు తెలంగాణా ఉద్యమాలతో అల్లకల్లోలంగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు సమైక్య ఉద్యమాలతో మళ్ళీ అదే పరిస్థితికి చేరుకొంది. అయితే, ఒక దశ దిశా లేకుండా సాగుతున్న ఈ ఉద్యమాలకు అసలు ముగింపు ఎప్పుడో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజనపై ఇక ఎంత మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా చెపుతోంది. అంతే కాకుండా రాష్ట్ర విభజన ప్రక్రియను కూడా మొదలుపెట్టేసింది. ప్రస్తుతం హోంశాఖ రాష్ట్ర విభజన, హైదరబాద్ ఉమ్మడి రాజధాని అనే రెండు అంశాలపై ఒక నోట్ తయారుచేస్తోంది. దానిని కేంద్ర క్యాబినెట్ ఆమోదించడంతో విభజన ప్రక్రియ జోరందుకొంటుంది. అయితే, రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడానికి కాంగ్రెస్ ఎంత మాత్రం ప్రయత్నించక పోవడంతో ఉద్యమం నానాటికి తీవ్ర తరం అవుతోంది. మొదట అనంతపురంలో మొదలయిన ఈ సమైక్యాంధ్ర ఇప్పుడు సీమంధ్ర జిల్లాలంతటికీ వ్యాపించడంతో జన జీవనం అస్తవ్యస్తమయిపోయింది. సమైక్యాంధ్ర కోసం కూడా ఆత్మహత్యలు మొదలవడం చాలా విచారకరం. అయితే వాటిని నిలువరించే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం వల్ల అవి కూడా క్రమంగా పెరుగుతున్నాయి. నేటికి దాదాపు 26వరకు చనిపోయినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒకవైపు వరద భీభత్సంతో ప్రజలు నానా బాధలు పడుతుంటే, ఈ సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడుతుండటంతో వరదలలో చిక్కుకొన్న ప్రజలకి సహాయం అందక నానా బాధలు పడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి నానాటికి దిగజారుతున్నపటికీ, ముఖ్యమంత్రి గానీ, ఇతర మంత్రులు గానీ ఏమాత్రం చొరవ తీసుకొనే ఆలోచనలో లేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ పరిస్తిత్కి ప్రజలను తప్పు పట్టడం కంటే, చోద్యం చూస్తూ కూర్చొన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ముందుగా తప్పు పట్టవలసి ఉంటుంది.

ముఖ్యమంత్రి కనబడుట లేదు

  నిన్న మొన్నటి వరకు తన బంగారు తల్లిని వెంటబెట్టుకొని ఇందిరమ్మ కలలు కంటూ ఊరువాడా తిరిగుతూ, ప్రజల కోసమే ఈ జీవితమంటూ మైకులు బ్రద్దల్లయ్యేలా పెద్ద గొంతుతో స్వీయ చాటింపు వేసుకొన్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గత వారం రోజులుగా కనబడుటలేదని రాష్ట్ర ప్రజలు చాలా కంగారు పడుతున్నారు.   అసలు ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా లేక డిల్లీలో ఉన్నారా? అని మీడియా వాళ్ళు కూడా ఆయన కోసం తెగ వెదుకుతున్నారు. కానీ  వాళ్ళు కూడా ఆయన ఆచూకీ కనుగొనలేకపోయారు.   అయితే, (తెలంగాణా) పంచాయితీలకి పెద్దన్నజానారెడ్డి మాత్రం రెండు మూడు రోజుల క్రితం ఆయన సీమంధ్ర మంత్రులతో తలుపులేసుకొని మాట్లాడుతుంటే తానూ కిటికీలోంచి చూశానని, అప్పుడు ఆయన పక్కన బొత్స బాబు కూడా ఉన్నారని, వారిద్దరూ ఏదో సమైక్య లేఖలు సంతకాలు చేస్తున్నారని, దానిని తానూ ఖండిస్తున్నానని చెప్పడంతో జనాలు కూడా తేలికపడ్డారు.   మేము కట్టిన పన్నులతో వాళ్ళక్కడ పనిచేయకుండా ఏసి గదుల్లో కులాసాగా కబుర్లు చెప్పుకొంటుంటే మేము మాత్రం ఆఫీసులలో పని చేయలా ఇదేమి (సమ) న్యాయం? అంటూ, అధికారులు, ప్రభుత్వోద్యోగులు, జనాలు అందరూ కూడా గిన్నెలు ముంతలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేసారు.    ‘యదారాజ తదా ప్రజా’ అంటే ఏమిటో ఇప్పుడు మన రాష్ట్రాన్నిచూస్తే ఎవరికయినా ఇట్టే అర్ధమవుతుంది.   ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ సచివాలయం మొహం చూసి చాలా రోజులయింది. ఇక కేసీఆర్ వ్యాఖ్యలతో సచివాలయ ఉద్యోగులు ఆంధ్ర, తెలంగాణా ఉద్యోగులుగా విడిపోయి రోడ్ల మీద కత్తులు దూసుకొంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు అందరూ కూడా ఆఫీసులు కంటే రోడ్డు పదిలం అనుకొంటూ సమైక్యంగా రోడ్డు మీద వంటా వార్పులు చేసుకొంటూ రకరకాల ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. మాకు మాత్రం ఆట విడుపు ఉండకపోతే ఎలా మేము ప్రజలమే (మనుషులమే) అంటూ జనాలు కూడా కార్యాలయాలకు, కాలేజీలకు, ఖార్కానాలకు, దవాఖానలకు తాళాలు వేసుకొని వచ్చి రోడ్ల మీద అవేశపడుతూ సేద తీరుతున్నారు.   ప్రజల వెనుక ప్రజా ప్రతినిధులున్నారో లేక వారి వెనుక ప్రజలున్నారో తెలియని పరిస్థితిలో మన ప్రజా ప్రనిధులు కూడా రాజీనామా లేఖలను ముక్కు మొహం తెలీని వాళ్ళ చేతుల్లో పెట్టి ‘సమైక్య చాంపియన్ షిప్’ పోటీలో పరుగులు పెడుతున్నారు.   ఇక త్వరలో ఆర్టీసీ, విద్యుత్, మునిసిపాలిటీ సిబ్బంది కూడా రోడ్లమీద వంట వార్పూ రుచి చూడాలని ఉవ్విళ్ళురుతున్నారు. ఇక ఏవయినా శాఖలు మిగిలి ఉంటే వాళ్ళు కూడా తమ కార్యలయాలకి తాళాలు వేసుకొని వచ్చేస్తే, విజయమ్మ కోరుకోన్నట్లు అందరికీ సమన్యాయం జరుగుతోందని పండగ చేసుకోవచ్చును. కానీ, ఆ పండగ చేసుకోవడానికి డబ్బులెక్కడి నుంచి వస్తాయన్నదే పెద్ద ప్రశ్న.

వలస బాటలో తెరాస నేతలు

      తెలంగాణ పై కాంగ్రెస్‌ సానుకూలంగా అడుగులు వేస్తుండటంతో టిఆర్‌ఎస్‌ వర్గాలు గుబులు రోజు రోజుకు ఎక్కువవుతుంది. కాంగ్రెస్‌ ఎత్తులతో ఇప్పుడు చాలా మంది టిఆర్‌ ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ తలుపు తడుతున్నారు. ఎలాగూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ ఎస్‌ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది కాబట్టి తాము అంతకన్నా ముందే ఆ పార్టీలో చేరడం మేలని భావిస్తున్నారు.   ఇప్పటికే టిఆర్‌ఎస్‌ ఎంపి విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీకి అనూకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణతో పార్టీ నుంచి సస్పెండ్‌ అవ్వగా, మరో ముగ్గురు నాయకులు సోమవారం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌తో చర్చలు జరిపారు. గతంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న విజయరామారావుతో పాటు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్‌, సోయం బాబు రావులు దిగ్విజయ్‌ సింగ్‌తో మంతనాలు జరిపారు. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే టిఆర్‌ఎస్‌ పార్టీ కాలీ అవ్వడం కాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు.

తెలంగాణలో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్

      రాబోయే సాధారణ ఎన్నికలలో తెరాసకు పది లేదా పదకొండు సీట్లు మాత్రమే వస్తాయని, కాంగ్రెసు పార్టీకి ఎనబై సీట్ల వరకు వస్తాయని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందన్నారు. ఏర్పాటు ప్రకటన వచ్చిందంటే అది టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఒక్కరిది కాదని, అమరవీరులతో పాటు తామందరిదని మెదక్ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. 16 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. నేనేంటో రాష్ట్రంలోనేకాక, దేశంలో అందరికీ తెలుసునని, షోకాజ్ నోటీసు వచ్చిన తర్వాతే తన అభిమానులతో చర్చించి భవిష్యత్ కార్యాచారణపై నిర్ణయం తీసుకుంటామని విజయశాంతి స్పష్టం చేశారు.

హైదరాబాద్ పై విజయమ్మ స్పందన

      ప్రజలకు సమన్యాయం చేయలేని కాంగ్రెస్ పార్టీ విభజన బాధ్యత ఎలా తీసుకుందో చెప్పాలని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. జగన్ కోసమే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ఆమె ఆరోపించారు. విభజనపై కాంగ్రెస్ నేతలు ఒక్కక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారని విజయమ్మ వ్యాఖ్యానించారు. విభజన విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కేంద్రం ఓ తండ్రిలాగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని ఆమె అంటున్నారు.   హైదరాబాద్ను తెలంగాణలో కలపటం ఏ విధంగా సబబో కేంద్రం చెప్పాలని విజయమ్మ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవాలని కేసీఆర్ ఎలా అంటారని విజయమ్మ ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్దికే రాజశేఖరరెడ్డి పాటు పడ్డారని ఆమె అన్నారు. అయితే హైదరాబాద్ కు సంబందించి ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇంత బహిరంగంగా వ్యాఖ్యానించలేదు.

విలీనం కాకపోతే తెరాస ఖాళీ అయిపోతుందా

  తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలా వద్దా? చేస్తే లాభమా నష్టమా? అయితే ఎంత శాతం? అని కేసీఆర్ మదనపడుతుంటే, మరో వైపు దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే జ్ఞానం పొందిన తెరాస నేతలు కొందరు డిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం ముందు క్యూలు కడుతున్నారు.   మొన్నరాములమ్మ డిల్లీ వెళ్లి దిగ్గీరాజాకు రాఖీ కట్టి రావడంతో అగ్గి మీద గుగ్గిలమయిపోయిన కేసీఆర్, తన ముద్దుల చెల్లెమ్మని కూడా ఆలోచించకుండా వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసేసాడు. అయితే, ఆమె వెనుక మరో నలుగురైదుగురు కూడా క్యూలో నిలబడిన సంగతి తెలిసిన తరువాత ఇప్పుడు వారి నందరినీ కూడా సస్పెండ్ చెయాలా వద్దా? చేస్తే ఇక పార్టీలో తన కుటుంబ సభ్యులు తప్ప మరేవరయినా మిగులుతారా? అనే భయం కేసీఆర్ కి పుట్టుకొచ్చింది.   రాములమ్మ తరువాత తాజాగా డిగ్గీ రాజాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టేందుకు తెరాస నేతలు ఏ. చంద్రశేఖర్, విజయరామారావు, ఓ. చందులాల్‌లు, సోయం బాబు రావు, దిలీప్ తదితరులు డిల్లీలో ఎదురుచూస్తున్నారు.   కానీ, బేరం కుదిరితే ఇవాళ్ళోరేపో తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖాయమని వార్తలు వస్తున్న తరుణంలోకూడా తెరాస నేతలు, అంత కంటే ముందుగానే తమ టైటానిక్ నావలోంచి కాంగ్రెస్ నావలోకి దూకేయాలను కోవడం వారి ముందు చూపుకి నిదర్శనం.   ఒకవేళ వారు తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే వరకు కూర్చుంటే, విలీనం తరువాత టికెట్ల కేటాయింపు వ్యవహారం మొత్తం కాంగ్రెస్ అధిష్టానం చేతిలోకే వెళ్ళిపోతుంది. అప్పుడు కేసీఆర్ ముందుగా తన ఇంట్లో వాళ్ళకి, ఆ తరువాత బాగా కావలసిన వారికే టికెట్స్ ఇప్పించుకొంటాడు గానీ, తెరాసలో ఉన్న అందరికీ ఇప్పించడు. ఒకవేళ అలా అడిగినా కాంగ్రెస్ తన పార్టీ నేతలని కాదని వారికి ఇవ్వదు. ఇవ్వదలుచుకొన్నా కాంగ్రెస్ లో ఉన్న నేతలు అడ్డుపడటం ఖాయం. అందుకే వారందరూ ముందుగానే వెళ్లి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ పట్టుకొని మన దిగ్గీరాజ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.   ఇక మరో కారణం ఏమిటంటే, ఒకవేళ బేరం కుదరక కేసీఆర్ తెరాసను నడుపుకోదలిస్తే, అప్పుడు వారు ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడక తప్పదు. ఎలాగో కష్టపడి టికెట్ సంపాదించుకొన్నా, తెలంగాణా ఇచ్చిన ఊపు మీద ఉన్న బలమయిన కాంగ్రెస్ నేతలతో వారు పోటీ పడిగెలవడం చాలా కష్టం. ఇక, ఒకవేళ కష్టపడి ఎలాగో కొందరు గెలిచినా, తెరాస భారీ మెజార్టీతో గెలిచి మొట్ట మొదటిసారిగా ఏర్పడబోతున్నతెలంగాణా ప్రభుత్వంలో అధికారం దక్కించుకోగలదని నమ్మకం లేదు.   కొత్త ప్రభుత్వంలో తప్పని సరిగా జేరాలని అందరికీ ఆరాటం ఉంటుంది. ఆ ఆరాటం ఉన్నవారి మధ్య తీవ్రమయిన పోటీ కూడా ఉంటుంది. అందుకే దీపం ఉండగానే తమ టికెట్స్ రిజర్వ్ చేసుకోవాలనే ప్రయత్నంలో తెరాస నేతలు డిల్లీలో దిగ్గీ రాజ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.   ఇదంతా చూస్తున్న పార్టీలో మిగిలిన నేతలు విలీనం సంగతి త్వరగా తేల్చకపోతే, మా పరిస్థితి టైటానిక్ షిప్పులో పయనిస్తున్నట్లే ఉంది అంటూ ఆందోళనగా గంట కొడుతున్నారు. మరి కెప్టెన్ కేసీఆర్ వారిని కాంగ్రెస్ నావలోకి ఎక్కనిస్తాడో లేక మధ్యలోనే ముంచేస్తాడో చూడాలి.

టిఆర్‌ఎస్‌ పార్టీకి ఝలక్‌

  తెలంగాణ పై కాంగ్రెస్‌ సానుకూలంగా అడుగులు వేస్తుండటంతో టిఆర్‌ఎస్‌ వర్గాలు గుబులు రోజు రోజుకు ఎక్కువవుతుంది. సీమాంద్రలో నిరసన జ్వాలలు భగ్గుమతున్నా కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాత్రం విభజన దిశగా ప్రక్రియ కూడా మొదలు పెట్టేసింది. కాంగ్రెస్‌ ఎత్తులతో ఇప్పుడు చాలా మంది టిఆర్‌ ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ తలుపు తడుతున్నారు. ఎలాగూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ ఎస్‌ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది కాబట్టి తాము అంతకన్నా ముందే ఆ పార్టీలో చేరడం మేలని భావిస్తున్నారు. ఇప్పటికే టిఆర్‌ఎస్‌ ఎంపి విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీకి అనూకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణతో పార్టీ నుంచి సస్పెండ్‌ అవ్వగా, మరో ముగ్గురు నాయకులు సోమవారం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌తో చర్చలు జరిపారు. గతంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న విజయరామారావుతో పాటు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్‌, సోయం బాబు రావులు దిగ్విజయ్‌ సింగ్‌తో మంతనాలు జరిపారు. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే టిఆర్‌ఎస్‌ పార్టీ కాలీ అవ్వడం కాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు.

హీరో పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ

  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసంచలనానికి తెర తీశాడు. ఎప్పుడు ట్వీటర్ ద్వారా తన ఆలోచనలను అభిమానలతో పంచుకునే వర్మ ఇప్పుడు ఓ స్టార్ హీరోపై తన కామెంట్ చేశాడు. ఎప్పుడు నెగెటివ్ కామెంట్స్ మాత్రమే చేసే వర్మ ఈసారి మాత్రం ఈ ఆ హీరోని ఆకాశానికి ఎత్తేశాడు. ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్థుతం టాలీవుడ్ లొ  పవర్ స్టార్ మేనియా నడుస్తుంది. పవన్ తో సినిమా అంటే రిలీజ్ కు ముందే మ్యాగ్జిమమ్ బిజినెస్ జరిగిపోతుంది. పవన్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే చాలు గంటల్లోనే మ్యాగ్జిమమ్ హిట్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రేజ్ గమనించిన రామ్ గోపాల్ వర్మ ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు. పవన్ కళ్యాన్ పొలిటికల్ పార్టీ పెడితే చాలా బాగుంటుందన్నాడు. స్వతహాగా అభ్యుదయ భావాలున్న పవన్ స్క్రీన్ హీరోగానే కాదు, రియల్ హీరోగా కూడా మంచి మార్కులు సాధింస్తాడన్నారు. అంతేకాదు గతంలో ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎంజిఆర్, చిరంజీవిల కంటే పవన్ డైనమిక్ లీడర్ అవుతాడని కితాబిచ్చాడు.

అహ్మదుల్లా కాన్వాయ్‌పై చెప్పుల‌తో దాడి

  ఉదృతంగా జ‌రుగుతున్న స‌మైక్య ఉద్యమంతో సీమాంద్ర నాయ‌కులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రజాభీష్టం మేర‌కు ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధుల రాజీనామ చేశారు. అయితే ఇప్పుడు రాజీనామ చేయ‌ని నాయ‌కుల‌పై ఆప్రాంతంలో తీవ్ర వ్యతిరేఖ‌త వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా మంత్రుల‌కు ఈ ఇబ్బంది ఎక్కువ‌గా ఉంది. అందుకే చాలా మంది సీమాంద్ర మంత్రులు హైద‌రాబాద్ కే ప‌రిమితం అవుతున్నారు. సోమవారం త‌న నియోజిక‌వ‌ర్గానికి వ‌చ్చిన మంత్రి అహ్మదుల్లాకు ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. క‌డ‌ప జిల్లాకు వ్యక్తిగ‌తప‌ని మీద వ‌చ్చిన అహ్మదుల్లా కాన్వాయ్ పై స‌మైక్య వాదులు చెప్పుల‌తో దాడిచేశారు. వెంట‌నే రాజీనామ చేయాల‌ని నినాధాలు చేశారు. ఓ ఆందోళ‌న కారుడు విసిరిన చెప్పుడు మంత్రి త‌గ‌ల‌టంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంట‌నే తేరుకున్న అహ్మదుల్లా ఆందోళ‌న కారుల‌ను స‌ముదాయించారు. తాను కూడా రాజీనామ చేయ‌డానికి సిద్దంగా ఉన్నాని ప్రక‌టించి ఆందోళ‌న‌కారుల‌ను శాంతింప చేసే ప్రయ‌త్నం చేశారు.

విభ‌జ‌న ప్రక్రియ మొద‌లైంది

  రాష్ట్రంలో స‌మైక్య సెగ‌లు ఏ స్థాయిలో ఉన్నా కేంద్ర మాత్రం త‌న పని తాను చేసుకు పోతుంది. ఇప్ప‌టికే రాష్ట్ర‌విభ‌జ‌న ప్రక్రియ మొద‌లైన‌ట్టుగా ప్రక‌టించారు కేంద్రమంత్రి చిదంబ‌రం. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందుగా అనేక అంశాల‌ను చ‌ర్చించాల్సి ఉంటుంద‌ని చెప్పిన చిదంబ‌రం ఆ దిశ‌గా ప్రయ‌త్నాలు మొద‌లు పెట్టామ‌న్నారు.ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం రాజ్యస‌భ‌లో ఒక ప్రక‌ట‌న చేశారు. తెలంగాణ అంశానికి సంభందించిన త్వ‌ర‌లోనే కేంద్ర హోం శాఖ ఓ విధాన ప‌త్రాన్ని కేభినేట్ ముందు ఉంచుతుంద‌రి చెప్పారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంభందించి రాజ్యంగంలో కొన్ని విధి విదానాలు ఉన్నాయ‌న్న చిదంబ‌రం ఆ అంశాల‌తో కూడిన నోట్ సిద్దం చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ నోట్‌లో విద్యుత్. న‌దీ జ‌లాల పంపిణీ, ప్రజ‌ల భ‌ద్రత లాంటి అంశాల‌ను కూడా ప్రస్థావించ‌నున్నట్టు తెలిపారు. ముందుగా తాము త‌యారు చేసిన బిల్లు కేభినేట్ ఆమోదానికి వెలుతుంద‌ని. ఆత‌రువాత ఏర్పాడే మంత్రి వ‌ర్గ ఉప‌సంఘంతో అన్ని ప్రాంతాల వారు త‌మ అభిప్రాయాల‌ను చెప్పుకోవ‌చ్చన్నారు. దీంతో పాటు ఈ నోట్ పై కేంద్ర ఉభ‌య స‌భ‌ల్లో చ‌ర్చ‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు.

నిర్భయ అత్యాచార కేసులో బాలనేరస్తుడికి శిక్ష ఖరారు

  గతేడాది డిశంబరు నెలలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసుని మూడు నెలల్లో తేలిపోతుందని అందరూ హామీలు గుప్పించినప్పటికీ, ఇంతవరకు ఆ కేసులు తేలలేదు, దేశంలో అత్యాచారాలు ఆగలేదు. అదృష్టవశాత్తు ప్రజలకి, ప్రజా ప్రతినిధులకి కూడా షార్ట్ మెమొరీ ప్రాబ్లెం ఉండటం చేత అటువంటి నేరస్తులు కూడా తమకు ఉజ్వల భవిష్యత్ ఉందని దృడంగా నమ్ముతూ జైల్లో పరీక్షలకి కూడా ప్రిపేర్ అవగలుగుతున్నారు.   వయసులో అందరికంటే చిన్నవాడయినప్పటికీ మానవ జాతే అసహ్యించుకొనే విధంగా ఘోరంగా అత్యాచారం చేసి, నిర్భయ మరణానికి కారకుడయిన బాలనేరస్తుడికి కూడా మన చట్టాలలో ఉన్న లొసుగులు బాగానే ఉపయోగపడుతున్నాయి. నేరం చేసిన సమయానికి అతని వయసు 17సం.ల ఆరు నెలలు కనుక, అతను కటినమయిన శిక్షను తప్పించుకోగలుగుతున్నాడు. అసలు తను నేరమే చేయలేదని, ఆ రోజు తను బాగా తాగి పార్కులో పడుకొని ఉంటే తన తండ్రి తనను ఇంటికి మోసుకు వెళ్ళాడని వాదించాడు.   అయితే, ఈ రోజు బాలనేరస్థుల కోర్టు అతను నేరస్తుడని నిర్దారించింది. ఈ నెల 19న కోర్టు తన తీర్పు వెలువరించనుంది. కానీ, అతనికి అత్యధికంగా కేవలం మూడున్నర సం.లు జైలు శిక్ష మాత్రమే విధించే అవకాశం ఉంటుంది. అందులో ఇప్పటికే అతను ఒక సం.జైలులో గడిపేడు గనుక ఇక కేవలం రెండున్నర సం.లు శిక్ష అనుభవిస్తే సరిపోతుంది.   అంత ఘోరమయిన నేరం చేసిన్నపటికీ, ఇంత కాలం పాటు విచారణ కొనసాగడం, అంత తేలికపాటి శిక్షలతో తప్పించుకొనే అవకాశం కలిగి ఉండటం ఇటువంటి నేరాలు చేసే వారికి చట్టం అంటే భయం లేకుండా చేస్తోంది.

తెలంగాణా-సమైక్య రేసు షురూ

  ఒకవైపు ఆంధ్రాలో సమైక్య సెంటిమెంట్ ని స్వంతం చేసుకోవడం కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వీధులకెక్కి పోరాటాలు చేస్తుంటే, మరోపక్క తెలంగాణాలో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. తెలంగాణా సాధించిన ఘనత ఎవరి ఖాతాలో వారు వ్రాసుకోవడానికి తెగ కష్టపడుతున్నారు.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై నిర్ణయం తీసుకొనే కీలక సమయంలో తనను పక్కన బెట్టి హర్ట్ చేసినప్పటికీ, మరీ హార్ట్ అయ్యి తన గుహలో (ఫాం హౌస్)లోనే కూర్చొండిపోతే, పెగ్గేసుకొని పడుకొన్నాడని ప్రజలు అపార్ధం చేసుకొంటారనో లేకుంటే మిగిలిన క్రెడిట్ కూడా కాంగ్రెస్ తన్నుకుపోతుందని భయపడో మొత్తం మీద కేసీఆర్ తన గుహలోంచి బయటకి వచ్చాడు. వచ్చి తానే తెలంగాణా సాధించినట్లు, అందువల్ల ప్రజలందరూ తనకే తెలంగాణా పునర్నిర్మాణ బాధ్యతలు కూడా అప్పగించేసినట్లు డిసైడ్ అయిపోయి, తను ఏఏ ఫైళ్ళ పాస్ చేయబోతున్నాడో, ఎవరికీ ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వదలచుకోన్నాడో, ఏఏ ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నాడో వగైరా వగైరా వివరాలను ముందుగానే ప్రకటించేస్తూ చాలా హడావుడిగా తిరుగుతున్నాడు.   అయితే, ఇన్నాళ్ళుగా ఆయన పక్కన కూర్చొని హోమాలు చేసి, ఆయన చేతికి బోలెడు రాఖీలు కూడా కట్టి తిరిగిన చెల్లెమ్మ రాములమ్మ మాత్రం “తెలంగాణా సాధన క్రెడిట్ మొత్తం కేసీఆర్ ఖాతాలో వ్రాసేసుకొంటే కుదరదు. నాతో సహా వెయ్యి మంది అమర వీరులకి కూడా ఆ క్రెడిట్ లో వాటా ఉంటుందని” రాములమ్మ మరిచిపోకుండా తన వాటా కూడా క్లైయిం చేసుకొంది. పనిలో పనిగా తను చేర బోతున్న కాంగ్రెస్ పార్టీని ప్రసన్నం చేసుకొనేందుకు “మా (మాజీ) అన్నగారు గురించి, ఆయన పార్టీ గురించి నేను చెప్పిన పాత రికార్డ్స్ సంగతి మర్చిపోండి. అప్పుడేదో అతను బాధపడతాడని అలా చెప్పాను కానీ నిజానికి అతనికి వంద సీట్లు కాదు కదా పది కూడా రావు. మహా అయితే మరో ఐదారు సీట్లు గెలుచుకొంటే అదే గొప్ప” అని తేల్చిపారేసింది. అంతే కాకుండా, “తెలంగాణాలో ప్రజలందరూ కూడా తెలంగాణ క్రెడిట్ ను కాంగ్రెస్ ఖాతాలోనే ఓట్ల రూపంలో జమా చేసేయడానికి ఎన్నికల కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఎంత వద్దనుకొన్నాకనీసం 80 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టడం ఖాయమని” ఆమె కన్ఫర్మ్ చేసేసారు. మెదక్ సీటు ఆ అపూర్వమయిన అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్నిపుటుక్కున త్రెంచేయడం వల్లనే ఆమె ఈవిధంగా మాట్లాడారని ప్రజాభిప్రాయం.   మరి సమైక్యాంధ్ర క్రెడిట్ ఎవరికీ దక్కదని తెలిసినప్పటికీ, “గెలిచామా ఒడామా? అని కాదు ఆటలో పాల్గోన్నామా లేదా?” అనే స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి కదా. అందుకే అందరూ రాజీనామాల పోటీలు నిర్వహించుకొంటున్నారు. కానీ వైకాపా మాత్రం ఈ రేసులో ఇంతమంది వచ్చి జాయిన్ అవుతారని ఊహించక పోవడంతో కంగు తిని అందరూ ఫౌల్ గేం అడేస్తున్నారని బాధపడుతోంది.   అయితే తెదేపా మాత్రం “ఎప్పుడు వచ్చేమన్నది కాదు ముఖ్యం! రిజైన్ చేసామా లేదా అనేదే ముఖ్యం!” అని వాదిస్తోంది. కనీసం ఇప్పటికయినా రాష్ట్రపతి గారు దయతలచి రెండు రాష్ట్రాలు తానే ఇస్తున్నట్లు ఒక సంతకం పెట్టి ఇస్తే తప్ప ఇప్పటిలో ఈ రేసు ఆగేలా లేదు. మళ్ళీ ఆ తరువాత ముఖ్యమంత్రి రేసోకటి ఉంది కదా! వెర్రి నాగాన్నలు అలిసిపోతే మళ్ళీ పరిగెత్తలేరు పాపం!