ఆఖరి పంచాయితీ

      ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న ఆఖరి పంచాయితీ ఎన్నికలు మొదలయ్యాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 16 మండలాల్లో 272 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు మొదలయ్యాయి.ఇప్పటికే 14 తెలుగుదేశం, పది కాంగ్రెస్ మద్దతుదారులు, ఇద్దరు వైసీపీకి చెందిన 31 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మరో 23 పంచాయతీల్లో సర్పంచ్‌లతో సహా పూర్తికార్యవర్గం ఏకగ్రీవమయ్యాయి. 241 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు జరిగే ఎన్నికల్లో 723 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో అన్ని పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతున్నా సీమాంద్రల్లోని కొన్ని డివిజన్లలో మాత్రం ఎలక్షన్లకు ఇబ్బందులు తలెత్తాయి. బంద్‌లు, నిరసనలతో హోరెత్తుతున్న చాలా చోట్ల ఎన్నికలు వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. ఇవాల వాయిద పడ్డ డివిజన్‌లలో ఆగస్టు 8 తిరిగి ఎన్నికలు నిర్వహించనున్నారు.

మంత్రులు మాట మీద నిలబడతారా

      తెలంగాణ ఏర్పాటు పై సీమాంద్రలో నిరసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా మరి కొందరు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. మరి ఈ సమయంలో ముందుగానే రాజీనామా చేస్తామన్న నేతలపై విమర్శలు వస్తున్నాయి.   గత కొద్ది రోజులుగా సమైక్యాంద్ర కోసం డిల్లీలో భారీ లాభియింగ్‌ నిర్వహించిన రాష్ట్రమంత్రులు తమ ఆకాంక్ష నెరవేరని పక్షంలో రాజీనామాలకు కూడా వెనుకాడమని అధిష్టానాన్ని హెచ్చరించారు. అయితే వీరి బెదిరింపులను అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. అనుకున్నట్టుగానే అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసింది. అన్ని విషయాలపై ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్న అధిష్టానం నాలుగు నెలలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా తేల్చేసింది. మరి ఇప్పుడు తెలంగాణ మంత్రుల స్టెప్‌ ఏంటి.. ఇప్పటికే పలువురు ఏమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామ బాట పట్టగా ఇంతవరకు మాట ఇచ్చిన మంత్రులు మాత్రంనోరుమెదపలేదు.. దీని కారణం ఏంటి అన్న ఆగ్రహంలో ఉన్నారు సీమాంద్ర ప్రజానీకం.

విలీనానికి కేసీఆర్ సై ఎందుకు

  కాంగ్రెస్ అధిష్టానం నిన్న తెలంగాణా ప్రకటన చేసిన వెంటనే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత దిగ్విజయ్ సింగ్ చేసిన పార్టీ విలీనం వ్యాక్యలకు స్పందిస్తూ “తాను మాట తప్పే మనిషిని కాదని, అయితే, పార్టీ విలీనం గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఆయన కోరారు. ఆ తరువాత ఆ పార్టీ రాష్ట్ర విభజనను ఏవిధంగా చేయాలనుకొంటున్నదో, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గురించి తన ఉద్దేశ్యాలు ఏమిటో వంటి విషయాలను స్పష్టం చేయాలని కోరారు. అది గాక, పార్టీ విలీనం చేసేందుకు రెండు పార్టీల మధ్య తగిన ఒప్పందం జరిగిన తరువాతనే సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ విలీనం చేయడానికి అభ్యంతరం ఏమి లేదన్నట్లే ఆయన మాట్లాడారు.కానీ, తెలంగాణాలో పునర్నిర్మాణంలో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడం గమనిస్తే, వీలయితే తన పార్టీ అస్తిత్వాన్ని నిలుపుకోవాలనే కోరిక ఆయనలో ఉందని అర్ధం అవుతోంది.   అయితే, కాంగ్రెస్ తన ప్రమేయం లేకుండానే తెలంగాణా ప్రకటన చేయడంతో ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీదే పైచేయి అవుతుందని ఆయనకీ తెలుసు. మారిన పరిస్థితుల్లో బలపడిన కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో డ్డీకొని మొక్కుబడిగా సీట్లు సంపాదించుకొని ప్రతిపక్ష బెంచీలకి పరిమితమయి పోతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తన ప్రాభల్యం తగ్గిపోవడం ఖాయం. అంతకంటే, కాంగ్రెస్ లో తెరాసను విలీనం చేసి రానున్న ఎన్నికలకి తన పార్టీ నేతలకి వీలయినన్ని ఎక్కువ టికెట్స్  దక్కేలా చూసుకొంటే, కాంగ్రెస్ తో పోటీపడేబదులు దాని బలమయిన మద్దతు కూడా పొంది అధికార పార్టీలో చక్రం తిప్పవచ్చును. ఒకవేళ కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనాలని భావించినా కూడా మారిన రాజకీయ పరిస్థితుల్లో, ఆపార్టీలో నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని తెరాస నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలుపెడితే ఇక వారిని ఆపడం ఆయన తరం కాదు. అప్పుడు ఆయన ఎటువంటి షరతులు పెట్టకుండా తెరాసను కాంగ్రెస్ లో విలీనానికి ముందుకు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ అందుకు అంగీకరించక పోవచ్చును. అంతకంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే మేలని అర్ధం చేసుకొన్నకేసీఆర్ విలీనం గురించి సానుకూలంగా స్పందించారు.

తెరమీదకు మరిన్ని విభజనలు

      కేంద్రం తెలంగాణ ప్రకటించిన నేపధ్యంలో ఇప్పుడు మరిన్ని ప్రత్యేక వాదాలు తెరమీదకు వస్తున్నాయి. 50 ఏళ్లుగా నలుగుతున్న తెలంగాణ సమస్యను మూడు రోజుల్లో తేల్చేసిన కాంగ్రెస్‌ తమ డిమాండ్లను కూడా అదే స్థాయిలో పరీష్కరించాలని కోరుతున్నారు.       తెలంగాణ సమస్యకు పరిష్కారం దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేయడం మొదలవగానే గూర్ఖాలండ్‌ ప్రతిపాదన కూడా ఊపందుకుంది. ప్రస్థుతం ఆ ప్రాంతంలో 72 గంటల బంద్‌ కొనసాగుతుండగా, రాష్ట్రం ఏర్పడే వరకు వెనకడుగు వేసేది లేదంటున్నారు ఉద్యమకారులు.     దీంతో పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్‌ నాయకులు కూడా విదర్భ రాష్ట్రం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో పాటు అస్సాంలో బోడాలాండ్‌, పశ్చిమ యుపిలో హరిత్‌ ప్రదేశ్‌, బీహార్‌లో మిథిల, యుపిలో పూర్వాంచల్‌, లాంటి మరిన్ని డిమాండ్‌లు తెరమీదకు వస్తున్నాయి.    

కృత‌జ్ఞత‌లు తెలిపిన కెసిఆర్‌

  తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చినందుకు గాను కాంగ్రెస్ పార్టీకి ప్రముఖంగా సోనియా గాంధికి, ప్రదాని మ‌న్మోహ‌న్ సింగ్‌కు కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. దీంతో పాటు ఉద్యమంలో త‌న‌తో పాటు క‌లిసి న‌డిచిన క‌వులు క‌ళాకారులు నాయ‌కులు, పాత్రికేయ‌ల‌కు కూడా త‌న కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. త‌రువాత తెలంగాణ ఏర్పాటును అందుకు కాంగ్రెస్ సూచించిన అన్ని మార్గాల‌ను స్వాగ‌తించిన కెసిఆర్ ఉమ్మడి రాజ‌ధాని విష‌యం అన్న విష‌యంలో మాత్రం కాంగ్రెస్ నుంచి మరింత క్లారిటీ రావాల‌ని కోరారు. దీంతో పాటు ఇప్పటితో మ‌న పని అయిపోయిన‌ట్టుకాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వ‌ర‌కు ప్రతి తెలంగాణ వాది అప్రమ‌త్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. దీంతో పాటు తెలంగాణ ఏర్పడిన ప‌క్షంలో టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో క‌లుపుతాను అన్న మాట‌ను కూడా కెసిఆర్ ప్రస్థావించారు. ఇప్పుడే అంతదూరం ఆలొచించాల్సిన అవ‌స‌రం లేద‌న్న కెసిఆర్, పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయిన త‌రువాత త‌ప్పుకుండా ఆ విష‌యం గురించి ప్రక‌ట‌న చేస్తామ‌న్నారు. తెలంగాణ సాదనే కాదు తెలంగాణ పున‌ర్మిమాన ప్రక్రియ‌లో కూడా టిఆర్ఎస్ చురుకైన పాత్ర పోషిస్తుంద‌ని ప్రక‌టించారు.

సీమాంద్రలో పంచాయితీ డౌట్‌

  కేంద్ర తెలంగాణ ప్రక‌ట‌న నేప‌ధ్యంలో సీమాంద్రలో నిర‌స‌న‌లు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే ప‌లువురు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాగా మ‌రి కొంత మంది అదే బాట‌లో న‌డ‌వ‌డానికి రెడీ అవుతున్నారు. ప‌లు జేఎసికి సంబందించిన నాయ‌కులు బంద్‌కు పిలుపు నిచ్చారు దీంతో రేపు సీమాంద్ర ప్రాంతంలో జ‌ర‌గాల్సిన పంచాయితీ మూడో ద‌శ ఎల‌క్షన్లపై ఆ ప్రభావం ప‌డ‌నుంది. ప‌లు సీమాంద్ర జిల్లాల్లో రేపు చివ‌రి ద‌శ పంచాయితీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌ధ్యంలో సీమాంద్ర నాయ‌కులు ఎన్నిక‌లను బ‌హిష్కరించాల్సిందిగా పిలుపునివ్వగా, చాలా మంది టీచ‌ర్లు త‌మ విధుల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకున్నారు. దీంతో రేపు సీమాంద్రలో జ‌ర‌గాల్సిన పంచాయితీ ఎన్నిక‌ల‌పై స్పష్టత రావాల్సి ఉంది.

సీమాంద్రలో రాజీనామాలు షురూ

  తెలంగాణ పై తేల్చేసిన కాంగ్రెస్ పై సొంతం పార్టీ నాయ‌కులే భ‌గ్గుమంటున్నారు. తమ అభిప్రాయాల‌కు ఏ మాత్రం విలువ నివ్వకుండా ఏక‌ప‌క్షంగా తెలంగాణపై నిర్ణయం తీసుకున్న అధిష్టానంపై సీమాంద్ర నాయ‌కులు ఫైర్ అవుతున్నారు. ఈ సంప్రదింపుల‌కు ముందే రాజీనామ చేసిన వీర‌శివారెడ్డి సీమాంద్రలో హీరో కాగా ఇప్పుడు మ‌రింత మంది నేత‌లు అదే బాట‌లో న‌డ‌వ‌నున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న తుల‌సిరెడ్డి త‌ను అధ్యక్షునిగా ఉన్న 20 సూత్రాల ప్రణాలిక క‌మిటీకి రాజీనామ చేశారు. ఆయ‌న‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తూ ఎమ్మేల్యేలు స‌తీష్‌కుమార్‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి, తోట త్రిమూర్తులు రాజీనామ చేశారు. వీరితో పాటు ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కూడా రాజీనామ‌కు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సీమాంద్ర జేఎసి బంద్‌కు పిలుపు నివ్వగా ఆ బంద్‌ను 72 గంట‌ల పాటు కొన‌సాగించాల‌ని భావిస్తున్నారు. దీనికి తోడు స‌మైక్యాంద్ర జేఎసి విద్యార్దులు ఆమ‌ర‌ణ నిర‌హార దీక్షకు కూడా దిగారు. అయితే రేపు స‌మావేశం కానున్న సీమాంద్ర నాయ‌కులు మూకుమ్మడి రాజీనామాల‌కు రెడీ అవుతున్నట్టుగా స‌మాచారం.

10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్

      హైదరాబాద్ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ కాంగ్రెస్ సీడబ్ల్యూసీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ పదేళ్లలో ఆంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని, సీమాంధ్ర అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం సమకూరుస్తుందని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్ర ప్రాంతంలో రాజధాని ఏర్పడేవరకూ పరిపాలనా కార్యక్రమాలన్నీ హైదరాబాద్‌నుంచే నడుస్తాయని, హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలలోనూ ప్రజలు దేని గురించీ భయపడవలసిన అవసరం లేదని, అన్నిరకాల భద్రతా చర్యలనూ కేంద్రం తీసుకుంటుందని సీడబ్ల్యూసీ నిర్ణయంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.

తెలంగాణకు యూపీఏ పచ్చజెండా

      సోనియా గాంధీ నివాసంలో కీలకమయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణాపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణాపై చర్చించేందుకు సోనియా నివాసంలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యుపిఏ సమన్వయ కమిటీ, సిడబ్ల్యూసీ లో తెలంగాణ పై ఏకగ్రీవ తీర్మానం జరిగాయి. హైదరాబాద్ ను రెండు ప్రాంతాలకు రాజధానిగా నిర్ణయించడం జరిగింది. రేపు జరగనున్నకేంద్ర క్యాబినెట్ సమావేశంలో యూపీఎ మరియు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు తీసుకొన్ననిర్ణయాన్నిఆమోదం పొందిన తరువాత, దానిని రాష్ట్రపతి అనుమతికి పంపుతారు. అప్పుడు రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభకు ఆ ప్రతిపాదనను పంపి దానిపై తీర్మానం కోరుతారు. రాష్ట్ర శాసనసభ తెలంగాణా బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేసినట్లయితే, అప్పుడు దానిని పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఒకవేళరాష్ట్ర శాసనసభ తెలంగాణాను వ్యతిరేఖిస్తూ తీర్మానం చేసినప్పటికీ, కేంద్రందే అంతిమ నిర్ణయం గనుక యుపీయే ప్రభుత్వం తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతుంది. పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవుతుంది.

7 గంటలకు తెలంగాణపై ప్రకటన

  కొద్ది సేపటి క్రితం ముగిసిన యుపీయే మిత్ర పక్షాల సమావేశంలో పాల్గొన్న అన్నిభాగస్వామ్య పార్టీలు తెలంగాణా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ తీసుకొన్న నిర్ణయానికి తమ ఆమోదం తెలిపాయి. దాదాపు 50 నిమిషాలు సాగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ పెద్దలందరూ మరియు యుపీయే భాగస్వాములయిన అజిత్ సింగ్, శరద్ పవర్, ఫరూక్ అబ్దుల్లా, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన అజిత్ సింగ్ తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు.   ప్రస్తుతం సోనియా గాంధీ నివాసంలో కీలకమయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మొదలయింది. అయితే, ఈ కమిటీలో ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి సభ్యులు కాకపోవడం చేత వారిని ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. తెలంగాణా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ అధిష్టానం కేవలం తన నిర్ణయాన్ని ఆమోదించడానికి మాత్రమే ఈ సమావేశం నిర్వహిస్తోంది.   అ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలంగాణా ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటన చేస్తుంది. రేపు జరగనున్నకేంద్ర క్యాబినెట్ సమావేశంలోయుపీయే మరియు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు తీసుకొన్ననిర్ణయాన్నిఆమోదం పొందిన తరువాత, దానిని రాష్ట్రపతి అనుమతికి పంపుతారు. అప్పుడు రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభకు ఆ ప్రతిపాదనను పంపి దానిపై తీర్మానం కోరుతారు. రాష్ట్ర శాసనసభ తెలంగాణా బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేసినట్లయితే, అప్పుడు దానిని పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఒకవేళరాష్ట్ర శాసనసభ తెలంగాణాను వ్యతిరేఖిస్తూ తీర్మానం చేసినప్పటికీ, కేంద్రందే అంతిమ నిర్ణయం గనుక యుపీయే ప్రభుత్వం తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతుంది. పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవుతుంది.   ఇప్పుడు రాష్ట్ర విభజన ఖాయమని తెలిసిపోవడంతో, ఇక హైదరాబాద్ విషయంలో కాంగ్రెస్ ఏవిధమయిన నిర్ణయం తీసుకొంటుందనే విషయం తేలవలసి ఉంది. అయితే ఆ విషయంపై ఇప్పటికిప్పుడు ప్రకటన చేయక పోవచ్చును. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు మాత్రమే సూత్రప్రాయంగా ఒక ప్రకటనతో సరిపెట్టవచ్చును.

కొద్ది సేపట్లో తెలంగాణ పై ప్రకటన

        యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం యుపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధి నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం సుమారు గంట, గంటన్నరపాటు జరగవచ్చునని భావిస్తున్నారు. ఆ తర్వాత ఏడు గంటల ప్రాంతంలో సీడబ్ల్యూసీ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలపైనా, తీర్మానం గురించీ అధికారికంగా మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.   తెలంగాణా అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం అంతిమ నిర్ణయం ప్రకటించే క్షణాలు సమీపిస్తుండడంతో ప్రధాని డాక్టర్ మన్‌మోహ న్ సింగ్ నివాసం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమన్వయ కమిటీ సమావేశం దాదాపు గంటసేపు జరిగింది. గతంలో ఎప్పుడూ ప్రధాని ఇంటివద్ద ఇంత పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయలేదు. తెలంగాణాపై ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తితో ప్రధాని ఇంటి సమీపంలో మీడియా ప్రతినిధులు గుమికూడారు.

తెలంగాణ పై నిర్ణయం జరిగిపోయింది: సోనియా

      ప్రత్యేక తెలంగాణ పై నిర్ణయం జరిగిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సీమాంధ్ర నేతలకు స్పష్టం చేశారు. అయితే అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం ఉంటుందని కూడా ఆమె చెప్పారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నేతలకు సోనియా సూచించారు. కాంగ్రెస్ ఎవరికి వ్యతిరేకం కాదని ప్రజలకు చెప్పాలని ఆమె అన్నారు. ఈ రోజు సోనియా గాంధీని కలిసిన సీమాంధ్ర నేతలను ఆమె బుజ్జగించినట్లు సమాచారం. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, ఈ పరిస్థితుల్లో వెనక్కి వెళ్లలేమని ఆమె వారితో చెప్పినట్టు తెలియవచ్చింది. ఈ ఒక్కరోజుతో అంతా అయిపోందని అనుకోవద్దని ఆమె నచ్చ చెప్పినట్లు సమాచారం.

ఉత్కంఠ: యూపిఎ సమావేశం ప్రారంభం

      ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో యూపిఎ సమన్వయ కమిటీ భేటి ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, షిండే చిదంబరం, అజిత్ సింగ్ హాజరయ్యారు. అంతకముందు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్య నారాయణ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వార్తల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు టివిలకు అతుక్కుపోయారు. రాష్ట్ర పరిణామాల పైన ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న తమ బంధువుల నుండి సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.  

టి పై నిర్ణయం తీసుకోవచ్చు..తీసుకోకపోవచ్చు

      తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లో ఏకాభిప్రాయం రాకపోతే నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చునని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తెలంగాణ సమస్య చాలా ఏళ్ళుగా అంటే 1956 నుంచి పెండింగ్‌లో ఉందని, దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. తెలంగాణకు సంబంధించి ముసాయిదా సిద్ధమయిందని, దానిని సీడబ్ల్యూసీలో ప్రవేశపెడతామని షిండే చెప్పారు.   ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని సుశీల్ కుమార్ షిండే తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెలంగాణపై హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతల మంతనాలు ముమ్మరంగా సాగుతున్నాయి.  

టి.బిల్లుపై సుష్మాకు ప్రధాని ఫోన్

      తెలంగాణపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌ కోరారని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు, అంబర్ పేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డి విలేకరులతో చెప్పారు. దీంతో తెలంగాణ ఏర్పాటు తధ్యం అని తేలిపోయింది. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలపాలని సుష్మ స్వరాజ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. తాము హైదరాబాదు రాజధానికి పది జిల్లాలతో కూడిన తెలంగాణపై బిల్లు పెడితే మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.

సెంటిమెంట్ గౌరవించాలి: టిపై చిరంజీవి

      రాష్ట్ర విభజన పై ఈరోజు నిర్ణయం వస్తుందన్న నేపథ్యంలో ముగ్గురు కేంద్రమంత్రులు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు మధ్యాహ్నం పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలుసుకున్నారు. చిరు, పళ్లం రాజు, జెడి శీలం, కనుమూరి బాపిరాజు తదితరులు ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.   అన్ని ప్రాంతాల సెంటిమెంట్ లను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని, పార్టీ, ప్రజల భవిష్యత్తు ,సెంటిమెంటును పరిగణనలోకి తీసుకోవాలని కోరామని వారు అన్నారు. అందరికి న్యాయమైన నిర్ణయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. రాహుల్ తోకూడా తాము సమావేశం అయ్యామని, అందరూ తమకు సమానమేనని ఆయన స్పష్టం చేశారని అన్నారు. ఎవరికి అన్యాయం జరిగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించామని చిరంజీవి తెలిపారు. ఇరు ప్రాంతాల భవిష్యత్తు ముఖ్యమన్నారు. తనకు అందరూ సమానమే అన్నారు. ఇరువర్గాల సెంటిమెంట్‌ను అర్థం చేసుకోవాలన్నారు. తమకు తమ భవిష్యత్తు ముఖ్యం కాదని ప్రజలు, పార్టీ భవిష్యత్తు ముఖ్యమన్నారు.