ఆందోళ‌న కారుల‌కు డిజిపి వార్నింగ్‌

  తెలంగాణ ప్రక‌ట‌న‌తో ఇరుప్రాంతాల్లో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. దీంతో ప‌రిస్థితుల‌ను కొలిక్కి తీసుకొచ్చేందుకు డిజిపి దినేష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించి హెచ్చరిక‌లు జారీ చేశారు. త్వర‌లో ఉద్యమం మ‌రింత ఉదృతం అవుతుంద‌న్న ఆందోల‌న కారుల హెచ్చరిక‌ల నేప‌ధ్యంలో దినేష్ రెడ్డి పోలీసులు ఉద్యమ‌కారులపై వ్యవ‌హ‌రించే తీరుపై మాట్లాడారు. రైల్ రోకో లాంటి ఆందోల‌న‌లు చేప‌డితే క‌ఠినమైన శిక్షలు ప‌డ‌తాయ‌ని హెచ్చరించారు. అంతేకాదు జాతీయ‌నాయ‌కులు విగ్రహాలు ద్వంసం చేయడం కూడా తీవ్రమైన నేరం అన్న ఆయ‌న అలాంటి త‌ప్పుల‌కు క‌నీసం మూడేళ్ల జైళు శిక్ష ప‌డుతుంద‌న్నారు. ప్రజ‌ల ధ‌న మాన ప్రాణాల‌ను కాపాడ‌మే పోలీసుల క‌ర్తవ్యం అన్నారు. విభ‌జ‌న స‌మైక్య ఉద్యమాల‌ నేప‌ధ్యంలో పోలీసులపై విమ‌ర్శలు చేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.. ఈవిష‌యంలో మీడియా కూడా సంయ‌మ‌నం పాటించాల‌న్నారు. పోలీసులకు అన్ని ప్రాంతాల వారు స‌మాన‌మేనని వారు ఎవ‌రికి సాయంగానే, ఎవ‌రి పై క‌క్షపూరితంగానో ప‌ని చేయ‌ర‌ని చెప్పారు. సీమాంద్రులు ప్రజాస్వామ్య ప‌ద్దతుల్లో ఎలాంటి ఉద్యయం అయినా చేసుకోవ‌చ్చన్న ఆయ‌న ప్రజాస్వామ్య ప‌ద్దతుల్లో ఎవ‌రు నిర‌స‌న‌లు తెలిపిన తాము అడ్డుచెప్పమ‌న్నారు.

సారీ, అధిష్టానాన్ని ఇక ఆపలేను: లగడపాటి

      రాష్ట్ర విభజన జరిగిన మరుక్షణమే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రగల్భాలు పలికిన లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తన పోరాటమంతా తెదేపా వల్ల వృదా అయిపోయిందని, చంద్రబాబు ఇకనయినా నోరు విప్పి రాష్ట్ర విభజనపై తన అభిప్రాయం స్పష్టం చేయాలని, లేకుంటే తెలుగు జాతి ఆయనను ఎన్నటికీ క్షమించదని అన్నారు. తను రాష్ట్రం విడిపోకుండా ఉండాలని విశ్వప్రయత్నాలు చేసానని, కానీ ఆపలేకపోయానని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తన నిర్ణయం వెనక్కు తీసుకొనేలా చేయగల శక్తి తనకు లేదని ఆయన తెలిపారు. తెదేపా, వైకాపాలు తమ ద్వంద వైఖరి కట్టిపెట్టి రాష్ట్ర సమైక్యతకోసం కృషిచేయాలని ఆయన హితవు పలికారు. ఇక మొన్నటి వరకు రాష్ట్ర విభజన చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసేస్తానని ప్రగల్బాలు పలికిన కావూరి సాంభ శివరావు, తన చిరకాలవాంచ అయిన కేంద్ర మంత్రి పదవి స్వీకరించిన కారణంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పోయారు. ఇప్పుడు నేనేమి చేయలేని నిస్సాహయుడనని ఆయన అన్నారు. మరి కొద్ది రోజులలో మరి కొంత మంది మంత్రులు యంపీలు కూడా ఇదే పాట పాడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆంటోనీ కమిటీ కూడా ఏర్పాటయిపోయింది కనుక ఇక కాంగ్రెస్ వ్యూహం ప్రకారం మెల్లగా కమిటీతో సమావేశాలు మొదలుపెట్టి, కొన్ని వరాలు ప్రకటింప జేసుకొని  అంతిమంగా రాష్ట్ర విభజనకు అయిష్టంగానే ఒప్పుకొంటున్నట్లు నటిస్తూ ఎన్నికలకి సిద్దం అయిపోతారు. వారితో బాటే మిగిలిన పార్టీ నేతలు కూడా సమైక్య విరమణ చేసేయడం మనం చూడవచ్చును.

ఉద్యోగుల సమ్మె వద్దు

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నిరసిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసి కార్మికులు సమ్మెకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నెల12 నుండి సమ్మె చేస్తామంటూ ప్రభుత్వానికి నోటీసు కూడా ఇచ్చారు. దీంతో తెలంగాణ బిల్లు వెంటనే పార్లమెంట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తూ తాము కూడా సమ్మెకు వెళ్తామని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళ్లొద్దని, సమ్మెల మూలంగా ప్రజలు ఇబ్బందులు పడతారని, ఉద్యోగులు జీతాలు కోల్పోతారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు తాము అన్ని విధాలుగా పోరాడుతున్నామని, ఉద్యోగులు సమ్మె యోచనను విరమించుకోవాలని ఆయన అన్నారు.

సరిహద్దులు నిర్దారణకొరకు భద్రాచలం వచ్చిన కేంద్ర బృందం

  ఈ రోజు ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆసక్తికరమయిన వార్త వచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర అధికారుల బృందం ఒకటి తెలంగాణ రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల నిర్ధారణ నిమిత్తం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌కు వచ్చి అక్కడ సరిహద్దులను నిర్దారించుకొనట్లు ప్రచురించింది. భద్రాచలం డివిజన్‌న్ను తెలంగాణ నుండి తప్పించి, దానికి సమీపంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలిపేందుకు వీలుగా స్థానిక అధికారుల సహాయంతో సరిహద్దుల మార్పులకి అవసరమయిన వివరాలను వారు సిద్దం చేసుకొంటున్నట్లు సమాచారం. ఈ సంగతిని ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి దృష్టికి తీసుకు వెళ్ళగా, తనకు కనీసం మాట మాత్రంగా చెప్పకుండా కేంద్రం అధికారుల బృందాన్ని పంపడాన్నిఆమె నిరసన తెలియజేసారని ఆ పత్రికలోవార్త వచ్చింది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను ఎట్టి పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లాలో కలపకుండా అడ్డుకొనేందుకు ఆమె సూచన మేరకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు తమ అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీకి ప్రయాణమవుతున్నట్లు తెలిసింది. కేంద్రం ఇంకా విభజన ప్రక్రియ మొదలు పెట్టక ముందే ఇంత వేగంగా కేంద్ర బృందం రంగంలోకి దిగడం విశేషమే. ఇదే నిజమయితే, కాంగ్రెస్ పార్టీ చెపుతున్నట్లు నాలుగు నెలలోనే విభజన ప్రక్రియ మొత్తం పూర్తి చేయగలదేమో.

కాంగ్రెస్ బీజేపీలకి వీర సైనికుడి భార్య చెంపపెట్టు

  రక్షణ మంత్రి అంటోనీ “పాక్ సైనికుల దుస్తులలో వచ్చిన కొందరు వ్యక్తులు భారత సైనికులను చంపారని” చేసిన ప్రకటనను పట్టుకొని పార్లమెంటులో కాంగ్రెస్ బీజేపీలు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటుంటే, వారికి గడ్డి పెడుతున్నట్లుగా పాకిస్తాన్ సైనికుల దాడిలో మృతి చెందిన సైనికుడు విజయ రాయ్ భార్య పుష్పారాయ్ ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని తిరస్కరింఛి, ముందు తన భర్తను పొట్టన బెట్టుకొన్న పాకిస్తాన్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు.   ప్రభుత్వం నిర్లక్ష్యం వలననే తన భర్త చనిపోయాడని, ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూ అనేకమంది సైనికులు చనిపోతున్నపటికీ, ప్రభుత్వంలో ఎటువంటి మార్పు కలగకపోవడం చాలా విచారకరమని ఆమె అన్నారు. ఇకనయినా ప్రభుత్వం మేల్కొని అటువంటి దుష్కర మూకలను పెంచి పోషిస్తున్న పాక్ ప్రభుత్వానికి దీటుగా జవాబు చెప్పాలని ఆమె కోరారు. ఇంకా ఎంత కాలం ఈవిధంగా సైనికులు తమ ప్రాణాలు పాక్ సైనికులకు బలివ్వాలి అని ఆమె ఆవేదనతో ప్రశ్నించారు.   చనిపోయిన ఐదుగురు జవాన్లలో నలుగురు బీహార్ రాష్ట్రానికే చెందిన వారే కావడంతో సర్వత్రా నిరసనలు, రైల్ రోకోలు జరుగుతున్నాయి. రక్షణ మంత్రిని క్షమాపణ చెప్పమని బీజేపీ పట్టుబడుతుంటే, ఆయన పూర్తి సమాచారంతో మళ్ళీ పార్లమెంటుకు సమాధానం చెపుతానని శలవు తీసుకొన్నారు. కానీ రెండు పార్టీలు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో మాత్రం చర్చించేందుకు మాత్రం ఆసక్తి కనబరచలేదు.   ఆ సైనికుడి వీరపత్ని ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని తిరస్కరించిన తరువాతయినా ఈ కాంగ్రెస్ బీజేపీలకి జ్ఞానోదయం అవుతుందని భావించడం అడియాసే అవుతుందేమో!

విభజనకు జీజం వేసింది రాజశేఖర్‌రెడ్డే

      రాష్ట్ర విభజనకు జీజం వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై 40 మంది శాసనసభ్యులతో చిన్నారెడ్డి నాయకత్వంలో అధిష్ఠానానికి వైఎస్ లేఖ పంపారని గుర్తు చేశారు. వైఎస్ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా పయనించారని వ్యాఖ్యానించారు. 2009 ఎన్నికల్లో వేర్పాటువాదానికి అనుకూలంగా కేసీఆర్‌తో కలిసి టీడీపీ పోటీ చేసిందని గుర్తుచేశారు. అలాగే తెలంగాణ ఉద్యమంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అఖిల పక్ష భేటీలో వేర్పాటువాదానికి అనుకూలంగా అభిప్రాయాలు చెప్పడంతో చివరగా కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించిందన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ను దోషిగా నిలపాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండటం నీచమన్నారు. దేశ సమగ్రతకు పాటుపడిన ఇందిరా, రాజీవ్ గాంధీ విగ్రహాల ధ్వంసానికి వైసీపీ నేతలు పాల్పడుతుండటం దౌర్భాగ్యమని, ఆ పార్టీలో విష పురుగులు ఉన్నందునే ఇలా జరుగుతోందన్నారు.

కెసిఆర్ కు భద్రత పెంపు

      కెసిఆర్ హత్యకు కుట్ర జరుగుతోందని తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌లు రెండు రోజుల క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెసిఆర్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ వ్యవసాయ క్షేత్రం వద్ద ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొత్త బుల్లెట్ కారును సమకూర్చింది. కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకోగానే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబు స్క్వాడ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. స్థానిక ఎస్సై, ఎఆర్ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుండి వచ్చిన ఎనిమిద మంది ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

టిఆర్‌ఎస్‌లో మరో వికెట్‌ పడింది

  కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేస్తుండటంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి దిక్కుతోచడం లేదు.  ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కూడా ఒకరొకరుగా పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీ వైపు వెళుతున్నారు. తాజాగా టిఆర్‌ఎస్‌ పార్టీ కి చెందిన మాజీ మంత్రి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే విజయరామారావు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. మంగళవారం రాత్రి పార్టీ పెద్దలతో ఆయన జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో వెంటనే ఆయన రాజీనామా చేశారు. గత ఆరునెలలుగా పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదన్న విజయరామారావు, తన నియెజిక వర్గంలో ఉధ్యమానికి ఉపయోగపడని వారికి ప్రాదాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రోజులుగా తనకు అసంతృప్తి ఉన్నా ఉద్యమానికి నష్టం కలుగ కూడదనే ఇన్నాళ్లు వేచి చూశానన్నారు.

విభజన ఆగదు : చాకో

  సీమాంద్రలో పరిస్థితులు ఎలా ఉన్నా కాంగ్రెస్‌ మాత్రం తన నిర్ణయం నుంచి వెనక్కి వెల్లటానికి సిద్దంగా ఉన్నట్టుగా కనిపిచటం లేదు. నలుగురు సభ్యులతో ఆంటోని నేతృత్వంలో కమిటీ వేసిన అధిష్టానం, ఆ కమిటీ కేవలం సీమాంద్రుల అపోహలు నివృత్తి చేయడానికి మాత్రమే అని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణపై తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు మళ్లే  ప్రసక్తే లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో స్పష్టం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్న ఉధ్యమం పై కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరితో ఉంది అన్న చాకో కమిటీ కేవలం సీమాంద్రులు అభిప్రాయ సేకరణ కు మాత్రమే అని చెప్పారు. ఆంటోని నేతృత్వంలోని కమిటీ తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అమలులోఎదురయ్యే సమస్యలపై  చర్చించి, తగిన పరిష్కారాలను మాత్రామే సూచిస్తుందన్నారు. కమిటీ ద్వార అభిప్రాయ సేకరణ మాత్రమే ఉంటుందన్న ఆయన దీని ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం లేదన్నారు.

కిరణ్, బొత్స అధిష్టానం మాటకి కట్టుబడితే బెటర్: డీ.యస్

  రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన సీమంధ్ర నేతలని వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారని, సమైక్యాంధ్ర ఉద్యమాలు హోరెత్తుతున్నావాటిని అదుపుచేసే ప్రయత్నం చేయడం లేదని స్వపక్షంలో నేతలు, తెరాస నేతలు విమర్శిస్తుంటే, రోమ్ నగరం తగులబడుతుంటే ఫిడేలు వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిలా రాష్ట్రంలో అరాచకం నెలకొన్నా, పరిపాలన స్తంభించినా చేష్టలుడిగి ప్రజలకి కనబడకుండా దాకోన్నాడని తెదేపా నేత సోమిరెడ్డి విమర్శించారు.   ఇక మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ మాట్లాడుతూ “కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరూ కూడా పార్టీ అధిష్టానం చేసిన నిర్ణయానికి కట్టుబడి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అన్ని విధాల సహకరించాలి. అధిష్టానం వారిరువురినీ కూడా సంప్రదించిన తరువాతనే నిర్ణయం తీసుకొంది గనుక, వారు తమకిష్టమున్నా లేకున్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ కూడా పార్టీనిర్ణయాన్ని అమలుచేయవలసిన బాధ్యత తమపై ఉందని జ్ఞాపకం ఉంచుకొని తదనుగుణంగా వ్యవహరించాలి. రాష్ట్ర విభజనపై ఎవరికయినా అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని విని పరిష్కరించేందుకు ఆంథోనీ నేతృత్వంలో వేసిన కమిటీకి నివేదించుకోవచ్చును,” అని అన్నారు.   ఇటువంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నపుడు, అశాంతి నెలకొని ఉన్నపుడు రాష్ట్ర పెద్దగా ఆయన చొరవ తీసుకొని పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేయాలి. కనీసం మీడియా ద్వారానయినా ప్రజలతో సంబంధాలు నెలకొలుపుకొని, వారి భయాందోళనలు దూరం చేసే ప్రయత్నాలు చేయాలి. అంతా సవ్యంగా ఉన్నపుడు క్షణం కార్యాలయంలో కూర్చోకుండా రాష్ట్రమంతా చుట్ట బెడుతూ స్వోత్కర్ష చేసుకొనే ఆయన, రాష్ట్రంలో తీవ్ర అరాచక పరిస్థితులు నెలకొని ఉన్నవేళ, పరిపాలన పూర్తిగా స్తంభించిన వేళ, కీలకమయిన రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్నవేళ, రాష్ట్ర సమస్యలతో, ప్రజలతో తనకేమి సంబంధం లేనట్లు ఆయన తన గుహలోకి వెళ్లిపోయి కూర్చొవడం చాలా తప్పు. డీయస్ చెప్పినట్లు, ఆయన తప్పనిసరిగా పార్టీ నిర్ణయాన్నిఖచ్చితంగా అమలు చేయాలి. అలా చేయడం ఇష్టం లేదనుకోన్నపుడు తన పదవికి రాజీనామా చేసి గౌరవంగా తప్పుకోవడం మంచిది.   ప్రజలను, ప్రభుత్వాన్ని, పాలనను గాలికొదిలేసి ఈవిధంగా కూర్చోవడం వలన ఇంత కాలం ఆయన సంపాదించుకొన్న మంచి పేరు పోగొట్టుకోవడమే కాక ఆయన రాజకీయ భవిష్యత్ కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. అటు తెలంగాణా ప్రజల నమ్మకం కోల్పోయి, ఇటు ఆంద్ర ప్రజల నమ్మకం కోల్పోతే రాజకీయంగా నష్టపోయేది ఆయనేనని తెలుసుకోవాలి.

పాక్ దుశ్చర్యపై అధికార విపక్షాలు యుద్ధం

  రెండు రోజుల క్రితం కొందరు తీవ్రవాదులు మరియు పాకిస్తాన్ సైనికులు కలిసి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లా పూంచ్ వద్ద భారత్ భూభాగంలోకి జొరబడి ఐదుగురు సరిహద్దు భధ్రతా సిబ్బందిని కాల్చి చంపారు. ఈ విషయాన్నీభారత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ స్వయంగా దృవీకరించారు. అయితే, రక్షణ మంత్రి ఏకే ఆంథోనీ ఈ విషయాన్నీలోక్ సభకు వివరిస్తూ “కొందరు తీవ్రవాదులు మరియు పాకిస్తాన్ సైనికుల దుస్తులలో ఉన్న మరికొందరు వ్యక్తులు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని” చెప్పడంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు తెలియజేసాయి.   ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ స్వయంగా “తీవ్రవాదులతో కలిసి పాక్ సైనికులు భారత సైనికులపై దాడి చేసి హతమార్చారని” స్పష్టంగా దృవీకరించినప్పుడు, మరి రక్షణ మంత్రి పాక్ సైనికులను తప్పుపట్టకపోగా, వేరెవరో వ్యక్తులు పాక్ సైనికుల దుస్తులలో వచ్చినట్లు పేర్కొంటూ, మన సైనికులను పొట్టన బెట్టుకొన్న పాక్ సైనికులను ఎందుకు వెనకేసుకు వస్తున్నారని నిలదీశారు. అసలు ఆర్మీ చీఫ్ చెప్పిన మాటలను ఎందుకు మార్పు చేశారు? మన భూభాగంలోకి జొరబడి మన సైనికులను పొట్టన బెట్టుకొంటున్న పాక్ సైనికులకీ, పాక్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ది చెప్పకపోగా వారిని ఎందుకు వెనకేసుకు వస్తున్నారు? వారిని ప్రసన్నం చేసుకోవలసిన అవసరం మనకేమవసరం? అని బీజేపీ ప్రశ్నించింది. రక్షణ మంత్రి ఆంథోనీ యావత్ భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్లమెంటును స్తంభింపజేసింది.   సాక్షాత్ రక్షణ మంత్రే ఆవిధంగా చెప్పడం వలననే పాకిస్తాన్ ప్రభుత్వం అది తమ సైనికుల పని కాదని, ఆదాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని, అసలు తమ సైనికులు అటువంటి తప్పులు ఎన్నడూ చేయరని, ఉభయ దేశాల మధ్య 2002 జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తామెన్నడూ జవదాటలేదని, భారత్ సైనికులే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని తిరిగి ప్రత్యారోపణలు చేసింది.   పాక్ ప్రభుత్వం తప్పించుకోవడానికి, తిరిగి ఈవిధంగా ప్రత్యారోపణలు చేయడానికి రక్షణ మంత్రి ఆంథోనీ చేజేతులా అవకాశం కల్పించారని అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉభయ సభలను స్తంభింపజేసింది. దీనితో రక్షణలో పడిన రక్షణ మంత్రి మళ్ళీ పూర్తి వివరాలతో వచ్చి సభకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు.   బీజేపీ చేస్తున్న ఈ దాడి నుండి తనను తానూ ఎలాకాపాడుకోవాలా అని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే ఆపార్టీని ఏవిధంగా ఈ వ్యవహారంలో దోషిగా నిలబెట్టాలా అని బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. అయితే, రెండు పార్టీలు కూడా పాక్ చేతిలో మన సైనికులు చనిపోయారనే బాధ కానీ, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే చర్చకానీ, పాక్ ప్రభుత్వానికి భారత్ ప్రభుత్వం తరపున తీవ్ర హెచ్చరిక జారీ చేయాలనీ కానీ ఆలోచించకపోవడం చాలా విచారకరం.   దేశ రక్షణ విషయంలో కూడా ఈవిధంగా రెండు ప్రధాన పార్టీలు రాజకీయ చదరంగం ఆడుకోవడం పాక్ సైనికుల దుశ్చర్యకంటే కూడా హీనాతిహీనమయినది. గతంలో కూడా పాక్ సైనికులు తీవ్రవాదులతో కలిసి భారత భూభాగంలోకి జొరబడి ఇద్దరు బారత సైనికుల తలలు నరికి అందులో ఒకరి తల తమ వెంట తీసుకుపోయారు. అప్పుడు కూడా ఈ రెండు పార్టీలు ఇదేవిధంగా పార్లమెంటు సాక్షిగా కత్తులు దూసుకొన్నాయి తప్ప ఆ సంఘటన నుండి ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదు. కనీసం అందుకు సిగ్గు కూడా పడలేదు.   పైగా ఇప్పుడు మరో సారి అదే డ్రామా మొదలుపెట్టాయి. ఎంత గంభీరమయిన సమస్యనయినా కేవలం రాజకీయకోణం లోంచి మాత్రమే చూడగలిగే ఇటువంటి నేతలున్నంత కాలం పాక్, చైనా, శ్రీలంక అన్ని దేశాలు కూడా నిర్భయంగా దాడికి పాల్పడుతూనే ఉంటాయి. ఇటువంటి ఘటనలు జరిగినసారి మన రాజకీయ పార్టీలు ఇదే తంతు నిర్వహించి చేతులు దులుపుకొంటునే ఉంటాయి.

కమిట్మెంట్ లేని కమిటీలు దేనికోసం?

....సాయి లక్ష్మీ మద్దాల       ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఈరోజు ఒక అధికారిక ప్రకటన చేశారు. అదేమంటే సీమాంద్రలో విభజన ప్రకటన వెలువడిన అనంతరం వెల్లువెత్తిన ఉద్యమ సెగల దృష్ట్యా ఒక కమిటీని వేస్తున్నాం అని. ఈ కమిటీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి AK ఆంటోని చైర్మన్ గా ఉంటారని,వీరప్పమొయిలి,అహమద్ పటేల్,గులాంనబీ ఆజాద్ అనబడే ముగ్గురు వ్యక్తులతో కలిపి మొత్తం నలుగురు వ్యక్తులతో ఈ కమిటి ఉంటుందని ప్రకటించటం జరిగింది. ఈ కమిటి యొక్క కార్యాచరణ ఏమిటి అంటే,సీమాంద్ర ప్రజల అభ్యంతరాలు తెలుసుకోవటం ,విద్యార్ధి జెఎసి తో,ఉద్యోగస్తుల జెఎసి తో,మరియు వివిధ వర్గ ప్రజలతో సమావెశమై వారి అభిప్రాయ సేకరణ చేయటం. అయితే మొన్న CWC చేసిన తీర్మానం వాయిదా వేస్తారా అంటే, లేదని CWC చేపట్టిన తీర్మాన ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు. మరి ఈ కమిటీ ఎవరి కంటి తుడుపు కోసమని ఆ ప్రాంత ప్రజలు అనుకోవాలి? ఎపి ఎన్జీవోలు సమ్మె విరమించుకోవాలని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. అలాగే సీమాంద్ర ప్రాంత ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. కమిటీ ద్వారా ఏ కార్యాచరణ అయితే చేపట్టాలని అనుకుంటున్నారో దాని గురించి ప్రకటన వెలువరించక ముందు ఎందుకు ఆలోచించ లేదు? ఒక ప్రాంతం లో వీరి నిర్వాకం కారణంగా ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున లేచి,అక్కడి ప్రజాజీవనం స్తంభించిన తరువాత కాని తమకి ఈ కమిటీ డ్రామా గుర్తుకొచ్చినందుకు వారినేమనాలి. అయినా విభజన ప్రకటనకు ముందు విభజన అనే వ్యవహారానికి పూర్తిగా వ్యతిరేకించినది కేంద్ర రక్షణశాఖ మంత్రి AKఆంటోని. మరి ఇప్పుడు ఆయనే చైర్మన్ గా ఉండబోయే కమిటీ ద్వారా సీమాంద్ర ప్రాంత ప్రజలకు చేకూరబోయే ప్రయోజనం ఏమిటి   కాని ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం మరో కమిటీ కూడా వేసింది. అదే 2014 ఎన్నికల మానిఫెస్టో కమిటీ. మళ్ళి దీనిలో సభ్యులుగా ఉండే వారు బొత్స, కిరణ్, ఉండవల్లి. ఈ కమిటీకి చైర్మన్ మళ్ళి ఆంటోనీనే. కాని ఈ కమిటీకి సభ్యులుగా ఉన్న కిరణ్, బొత్స, ఉండవల్లులను ఏమనాలి? మొన్నటి వరకూ సమైఖ్యాంద్ర కోసం తామేదో కష్టపడిపోతున్నట్లు నాటకాలాడిన వీరిని ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కాంగ్రెస్ అధిష్టానం నియమించినదంటే, వీరంతా అధిష్టానానికి పాదాక్రాంతులనే కదా అర్థం.     అంటే ఒక పక్క అభద్రతా భావంతో,తమ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో ఉన్న ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా,మరోసారి ఇలాంటి కమిటీలతో అంటే ఎన్నికలే పరమావధిగా ప్రజలముందుకు వెళ్ళే అర్హత సదరు నేతలకు ఎక్కడిది?ప్రజలు కలిసుండాలని కోరుకుంటుంటే విడిపోవాలని కోరుకునే నీచమైన నేతలు బహుశా చరిత్రలో వీరే కావొచ్చు. ఏది ఏమైనా ఈ మొత్తం వ్యహారాన్ని బట్టి ప్రజలకు పూర్తిగా అర్ధమైంది ఏమంటే బొత్స,కిరణ్ కుమార్ రెడ్డి,ఉండవల్లి మాత్రం సమైఖ్యాంద్ర ద్రోహులు అని.

నలుగురు స‌భ్యుల‌తో హైలెవ‌ల్ క‌మిటీ

  ఎట్టకేల‌కు సీమాంద్రలో జ‌రుగుతున్న ఉద్యమాల‌పై కాంగ్రెస్ హైక‌మాండ్ స్పందించింది. ఆంద్రప్రదేశ్ విభ‌జ‌న‌పై న‌లుగురు స‌భ్యుల‌తో హైలెవ‌ల్ క‌మిటీని ప్రక‌టించింది అధిష్టానం. ఈ సారి క‌మిటీలో కూడా రాష్ట్రానికి సంభందించిన ఎవ‌రికీ స్థానం క‌ల్పించ‌కుండా కాంగ్రెస్ త‌న మార్క్ చూపించింది. బుధవారం ప్రక‌టించిన క‌మిటీలో ఎకె ఆంటనీ, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్‌లు ఉన్నారు. న‌లుగురు స‌భ్యులున్న ఈ క‌మిటీకి ఆంటోని నేతృత్వం వ‌హిస్తారు. వీరు ముందుగా సీమాంద్రుల అభిప్రాయాల‌ను విని వాటిపై పూర్తి స్ధాయి నివేదిక సిద్దం చేయ‌నున్నారు. ముఖ్యంగా ఈ క‌మిటీ సీడ‌బ్ల్యూసి స‌మావేశం త‌రువాత రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై ఆరాతీయ‌నుంది. ఈ మేరుకు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జ‌నార్ధన్ ద్వివేది ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. అయితే ఈ క‌మిటీ కేవ‌లం సీమాంద్రుల అభ్యంతరాలు విన‌డానికా లేక రాష్ట్ర విభ‌జ‌న ప్రక్రియ‌లో భాగంలో క‌మిటీని వేశారా అన్న విష‌యం మాత్రం చెప్పలేదు.

మహా నాయకుడు KCR హత్యకు కుట్ర

      తెలంగాణా జాతి పిత, త్యాగశీలి, మహానాయకుడు తెరాస అధ్యక్షుడు KCRని హత్య చేయడానికి కుట్ర జరుగుతుందని హరీష్ రావు ఆందోళన చెందుతున్నారు. కానీ... KCRని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది? KCR ని హత్య చేస్తే.... 1.  సెపరేట్ తెలంగాణా ప్రక్రియ ఆగిపోదు. 2. తెలంగాణా ఉద్యమం ఆగిపోదు. 3. అసలు డిల్లీ పెద్దలు సెపరేట్ తెలంగాణా ఏర్పాటు గురించి KCRని సంప్రదించడమే లేదు. అది! ఆయనకున్న ఇంపార్టేన్స్. 4. ఇక ఉద్యమం విషయానికి వస్తే.... ప్రస్తుతం తెలంగాణా ఉద్యమం KCR చేతిలో లేనే లేదు. 5. సెపరేట్ తెలంగాణా ఒకవేళ ఏర్పడిన దానికి ముఖ్యమంత్రి KCR కానే కాడు. అంతే కాదు... అతని కుటుంబ సభ్యులు ఎవ్వరికీ తెలంగాణా ప్రభుత్వంలో ఏ రకమైన పాత్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదు. మరి KCR ని హత్య చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? సీమాంధ్ర వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఈ మధ్య KCR అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దానివల్ల వచ్చే తెలంగాణా రాష్ట్రం కూడా రాకుండా పోతుందని తెలంగాణా నాయకులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణా రాష్ట్రం చేజారిపోతే అది KCR వల్లే చేజారిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. మరి KCR ని హత్య చేసే అవసరం ఎవరికి ఉన్నట్లు...?         

ధ‌ర్మాన, స‌భిత‌ల‌కు ఊర‌ట‌

  ధ‌ర్మాన స‌భితా ఇంద్రారెడ్డిల‌కు సిబిఐ కోర్టులో ఊర‌ట ల‌భించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడార‌న్న అభియోగాల‌ను ఎదుర్కొంటున్న వీరికి నాంప‌ల్లి కోర్టులో అనుకూల తీర్పు వ‌చ్చింది. ధ‌ర్మాన, స‌భితల‌ను త‌మ క‌స్టడికి అప్పగించాలంటూ కోరిన సిబిఐ వాద‌న‌ను కోర్టు కొట్టి వేసింది. జ‌గ‌న్ అక్రమాస్తుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు సాక్షుల‌ను బెందిరించి తారుమారు చేసే అవ‌కాశం ఉందంటూ సిబిజఐ చేసిన ఆరోప‌ణ‌ను కోర్టు తోసి పుచ్చింది. సిబిఐ దాఖ‌లు చేసిన మెమోపై వాదోప‌వాద‌న‌లు విన్న కోర్టు ధ‌ర్మాన స‌భిత‌ల‌ను వాద‌న‌ను స‌మ‌ర్ధించింది. గ‌తంలో వారు మంత్రులుగా ఉన్నారు క‌నుక సాక్షులను ప్రభావితం చేసే అవ‌కాశం ఉంది కాని వారు ఇప్పుడు ప‌ద‌వుల‌లో లేరు గ‌నుక ఆ అవ‌కాశం లేద‌ని భావించిన కోర్టు ధ‌ర్మాన స‌భిత‌ల క‌స్టడికి నిరాక‌రించింది.

మన హీరోలు జీరోలా ?

      సినిమాలో మన హీరోలు ఎడమ చేత్తో వంద మందిని తంతారు. ఎక్కడైనా చిన్న అన్యాయం జరిగితే న్యాయం జరిగేదాకా వీరంగాలు వేస్తారు. అన్యాయాల్ని, అక్రమాల్ని అసలు సహించారు. ప్రపంచంలో ఎవరికీ లేనంత ఆత్మాభిమానం కూడా వారికి వుంటుంది. మరి నిజ జీవితంలో  సీమాంద్ర ప్రజలకు అన్యాయం జరిగేలా హైదరాబాద్ తో సహా ప్రత్యేక తెలంగాణా ప్రకటన ఢిల్లీ పెద్దలు చేసి వారం రోజులు దాటినా, ఒక్కరు కూడా స్పందించలేదు. నిజానికి మన హీరోలంతా సీమాంద్ర కి చెందిన వారే. మరి వాళ్ళు  ఢిల్లీ పెద్దల చర్యని ఎందుకు ఖండించలేదు? వాళ్ళ హీరోయిజమంతా సినిమాలా వరకేనా ? నిజ జీవితంలో వాళ్ళు జీరోలేనా ?       కచ్చితంగా జీరోలే !! తెరమీద రచయితలు రాసిన పవరఫుల్ డైలాగులు వల్లిస్తూ వాళ్ళ డూప్ లతో ఫైట్స్ చేయిస్తారు.. వీళ్ళు ఒట్టోట్టి ఫైట్స్ చేస్తారు. అది చూసి వాళ్ళ పిచ్చి అభిమానులు వారిని వెర్రిగా అభిమానిస్తారు. వాళ్ళ కటౌట్ లకి పూల దండలతో, పాలాభిషేకాలు ! ఎనిమిది రోజులుగా ఒక్క మాట మాట్లాడని వారికి అంతా అర్హత ఉందా ? తెలంగాణా గురించి మాట్లాడితే వాళ్ళ సినిమాలు ఆడనివ్వారని భయమా ? వాళ్ళని  ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు మాట్లాడక పోతే జనం ఎలాగూ వాళ్ళ సినిమాలు ఆడనివ్వరు. నిజానికి మన హీరోలకంటే రజనీకాంత్, సూర్య, విక్రం లాంటి తమిళ హీరోలకే మన ఆంధ్రాలో ఎక్కువ క్రేజ్ వుంది. ఇంకా మేము గొప్ప హీరోలం అనుకుంటే అది వారి భ్రమ మాత్రమే. మన నిర్మాతలూ ఏం తీసిపోలేదు. ఒకవేళ తెలంగాణా నేతలు పొమ్మంటే " ఓ... అలాగే... మేం విశాఖపట్నం పోయి స్టూడియోలు  నిర్మించుకుంటాం" అంటూ చీము, నెత్తురూ లేని వాళ్ళలా వ్యాఖ్యలు చేస్తారు. దేశంలో అతి పెద్దదైన మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఒక్కళ్ళూ పెదవి విప్పకపోవడం  సిగ్గులేని తనం. 

వైకాపాకు శ్రీశైలం గౌడ్ రాజీనామా

      తెలంగాణలో వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ పై వైకాపా యూ టర్న్ తీసుకుందని ఆ పార్టీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ నుంచి ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా తప్పుకున్నట్లయింది. కుత్బుల్లాపూర్ నుంచి ఆయన ఇండిపెండెంటుగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. ఇటీవలే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే పలువురు నేతలు మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, జిట్టా బాలకృష్ణా రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితరులు రాజీనామా చేశారు. తాజాగా కూన తన రాజీనామాతో హైదరాబాదులోని జగన్‌కు షాక్ ఇచ్చారు.

కెసిఆర్ కు జెడ్ప్లస్ రక్షణ కల్పించాలి

      తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై హత్యయత్నం కుట్ర విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్రావు మండిపడ్డారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, డీజీపి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. కెసిఆర్ కు వెంటనే జెడ్ప్లస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాకుండా అల్లకల్లోలం సృష్టించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ హత్యకు కుట్ర జరుగుతుందనే విషయాన్ని మూడు రోజుల కిందట పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని హరీష్ రావు ఆరోపించిన విషయం తెలిసిందే.