తెలుగోడి ఘనత....ఏమవునో ఈ చరిత ?
....సాయి లక్ష్మీ మద్దాల
నేడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా జరుగుతున్న వివాదం రాష్ట్ర విభజన. ఆంధ్ర - తెలంగాణాలుగా రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణ ప్రాంతవాసులు కోరుతుంటె, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంద్ర ప్రాంతవాసులు కోరుతున్నారు. తెలంగాణాప్రాంతం అభివృద్ధికి వెనుకబడిందని, తమ ప్రాంతం వారికి ఉద్యోగాలలో అన్యాయం జరిగిందని వారు వినిపిస్తున్న వాదన. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంద్ర ప్రాంతం అభివృద్ధికి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. తమ ప్రాంతం వారికి ఉద్యోగాలు ఉండవని వారి వాదన. ఈ రెండు వాదనల సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక, సామాజిక, రాజకీయ స్థితి గతులను కూలంకషంగా పరిశీలించాలి.
గుజరాత్,రాజస్థాన్ ల నుండి వచ్చిన టాటాలు, బిర్లాలు, అంబానీలు లేకుండా ఎంత కష్టమో...నేడు ఆంధ్ర, రాయలసీమవాసులు లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ని ఉహించడం అంతే కష్టం. ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ముఖ్యంగా సీమాంద్ర ప్రాంతంలో సాగుబడి లో ఉన్న పంట భూమి ఎక్కువ. అలాగే హైదరాబాద్ ను మినహాయిస్తే హైదరాబాద్ చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతం, మిగిలిన తెలంగాణా జిల్లాలలోను వ్యవసాయం ప్రధాన ఆధారం. భారతదేశం లో పల్లెలు ఎక్కువ అన్నది ఎంత సత్యమో... ఆంధ్రరాష్ట్రంలోను గ్రామీణ ప్రాంతం ఎక్కువ అన్నది అంత నిజం. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు వ్యవసాయంతో బాటుగా వారి వారి కుల వృత్తులు, చేతి వృత్తులు ఆధారంగా వారి జీవనోపాధి సాగుతుంది. అలాగే కళాకారులకు, నాటకరంగం ఆధారం.
రాను రాను దేశం, రాష్ట్రం ఆధునీకరణను సంతరించుకుంటున్న తరుణంలో హైదరాబాద్ రాజధానిగా అవతరించిన ఆంధ్రరాష్ట్రం ఎన్నో కొత్తపుంతలు తోక్కనారభించింది. అందులో భాగంగానే వివిధ పరిశ్రమలు, వ్యాపారాలు, వాణిజ్య సముదాయాలు హైదరాబాద్ లో అవతరించాయి. దీనికి ముఖ్యకారణం పరిశ్రమలనుకూలమైన వాతావరణం ఉండటం. హైదరాబాద్ దేశంలో మద్య ప్రాంతంగా ఉండటం, పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రభుత్వ భూములు అధికంగా ఉండటం.
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను పాలించిన రాజులు కళాకారులను, కవులను ఎంతగానో ఆదరించారు. తద్వారానే అక్కడ నాటక రంగం గణనీయమైన పేరు ప్రఖ్యాతలు గడించింది. ఆ కారణంగానే ఆ సీమాంద్ర ప్రాంతం నుండి విజయనగరం జిల్లా, కృష్ణా, గోదావరి జిల్లాల నుండి ఎందరో కళాకారులూ పుట్టుకొచ్చారు. కాలభ్రమేణ నాటక రంగం నుండి సినిమా రంగం అవతరించి సినీపరిశ్రమగా ఎదిగింది అలా మద్రాసు నుండి N.T రామారావు గారి ప్రోద్భలంతో హైదరాబాద్ సినీ పరిశ్రమ తరలివచ్చి నేటి హైదరాబాద్ అభివృద్దికి సినీ పరిశ్రమ కూడా ఒక కారణమయ్యింది.
ఇక విద్య విషయానికొస్తే ఉస్మానియా యూనివర్సిటీ స్వాతంత్ర్యం రాక ముందు నుంచి ఉన్నప్పటికీ కొన్ని కార్పోరేట్ కళాశాలలు, విశ్వవిద్యలయాలు, మరికొన్ని విభిన్నమైన రంగాల అధ్యయనానికి ఉపయోగపడే విద్యాసంస్థలు ( ఇంజనీరింగ్, మెడికల్, బిజినెస్ మేనేజ్ మెంట్, చైతన్య , నారాయణ కాలేజీలు) వంటివి ఆవిర్భవించాయి. ఇవన్ని ఆధునీకరణను బాటలు వేసే యోచనతో వచ్చినవే. తదననుగుణంగా విద్యారంగంలోను ఆంధ్ర రాష్ట్రం ప్రపంచందేశాలతో పోటీపడగలుగుతోంది.
ఇక కంప్యూటర్ రంగంలో నిపుణుల విషయానికొస్తే ఒక్క హైదరాబాద్ లోనే కాక మద్రాస్, బెంగుళూర్, పూణే, నోయిడా లాంటి నగరాలన్నిటిలోను ఆంధ్ర,రాయలసీమప్రాంతం నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రగతిలోనే కాదు. భారతదేశ ప్రగతిలోను ప్రపంచ ప్రగతిలోను వీరి భాగస్వామ్యాన్ని ఎవరు కాదనలేని సత్యం. Infosys,Wipro,Tcs,IBM, లాంటి సంస్థలన్నిటి లో తెలుగువారు ముఖ్యంగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులు ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఇక తెలంగాణా ప్రాంతం వ్యవసాయరంగ అభివృద్ధి విషయానికొస్తే స్వయంగా ఆంధ్రప్రాంతం రైతులను పిలిపించుకొని వ్యవసాయం చేయటం అంటేనే వీరి పాత్ర ఎంతవరకు తెలంగాణాలో ఉందో చెప్పవచ్చు. ఆ రకంగానే నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతంలో వ్యవసాయం అంతగా శోభిల్లుతోంది.
ఒకనాడు తెలంగాణాలో దొర పెత్తనం ఎంతగా విలయ తాండవం చేసిందో అందరికి తెలుసు. ఆ కారణంగానే తెలంగాణాలో బానిసత్వం, పెట్టిచాకిరి విధానం భయంకరంగా ఉండేది. దానికి కారణం తెలంగాణా ప్రాతంలోని కొన్ని ప్రధాన సామాజిక వర్గాలు అని అందరికి తెలుసు,. కానీ సీమాంద్ర ముఖ్యమంత్రులైన యన్.టి. రామారావు, చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రాంతంలోని పటేల్,పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, మండల వ్యవస్థను ప్రవేశ పెట్టి ప్రజల జీవన స్థితి గతులలో ఎంతో మార్పును తీసుకువచ్చారు. తెలంగాణ ప్రాంత అభివృద్దికి ఎంతగానో కృషి చేసారు.
ప్రతి పల్లెలో కూడా విద్యుతీకరణ జరిగింది . వీరిహయంలోనే రోడ్ల నిర్మాణం గాని, రవాణా సౌకర్యం గాని జరిగింది. Hitech ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాడు. నేడు గుజరాత్ ను అందరు అభివృద్దికి చిహ్నంగా చూపిస్తూన్నారు. గుజరాత్ అభివృద్దికి ముఖ్య కారణం అక్కడి వ్యాపార వ్యవస్థ సూరత్ లోని కాటన్ మిల్లుల నేపద్యంలో స్థాపించబడిన వస్త్ర వ్యాపారం గణనీయ అభివృద్ధిని సాధించి, గుజరాత్ అభివృద్ధికి దోహదపడింది. కానీ అక్కడ చదువు కున్నవారి శాతం బాగా తక్కువ. ఆ కారణంగానే నెలకొల్పబడిన IT పరిశ్రమ పనిచేయటానికి నిపుణులైన విద్యావేత్తలు లేని కారణంగా అనేకమంది తెలుగు వాళ్ళు అక్కడి IT పరిశ్రమలలో పనిచేస్తూన్నారు. తద్వారా గుజరాత్ అభివృద్ధిలో తెలుగువారు భాగస్వాములయ్యారు. అలాగే గుజరాతీయులు పాకిస్తాన్ లోను వ్యాపారాలు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్ధికాభివృద్ధిలో దాదాపు 50% వాటా గుజరాత్ వారి శ్రమ ఉందనేది వాస్తవం.
ముంబాయిలో మరాఠీ భాష, గుజరాతీ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు కానీ ముంబాయ్ సినీ పరిశ్రమను ఎలుతున్నది మాత్రం నార్త్ ఇండియన్లు. దీనికి ఎవరిని తప్పు పట్టాలి? కళనా ? భాషనా?
ఒక ప్రాంత్రం అభివృద్ధి అనేది అన్ని రంగాల మీద ఆధారపడి ఉంటుంది. విద్యారంగం, వ్యవసాయ రంగం, వ్యాపార రంగం,పారిశ్రామిక రంగం, సీని రంగం, వార్త పత్రికలు, వర్తక, వాణిజ్య రంగాలు అన్నింటిని సాముహిక కృషి తోనే ఆ' ప్రాంతం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సక్రమమైన పద్దతిలో వినియోగించుకో గలిగేతెలివితేటలు, సామర్ధ్యం, ఆర్ధికశక్తి, శ్రామిక శక్తి కావాలి. వీటన్నింటి ఒకచోట చేర్చగలిగే సమర్ధతే అభివృద్ధికి చిహ్నం.
ఒక ప్రాంతంలోని వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే మరొక ప్రాంతంలో పరిశ్రమలకు అనువైన మౌళిక పరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారం చేయటానికి అవసరమైన పెట్టుబడిని అందించడంతో పాటుగా అభిలాషకూడా ఉండాలి. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేయగల సంకేతిక నైపుణ్యం తెలిసిన నిపుణులై శ్రామిక వర్గం కావాలి. అన్నింటికి మించి వ్యాపార రంగ అభివృద్దికి దోహదపడే భూమి కావాలి. అ రకంగానే పారిశ్రామిక అభివృద్ధి జరిగింది.
ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి లో అందరి సమిష్టి కృషి లేకపోయి వుంటే. సీమాంద్ర ప్రాంత వాసులు తెలంగాణా అభివృద్ధిలో భాగస్వాములు కాకపోయి ఉంటే హైదరాబాద్ రాష్ట్రంగానే ఉండి ఉంటే ఖచ్చితంగా తెలంగాణా ప్రాంతం బీహార్,ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల లగే ఉండేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఒకనాడు కలసికట్టుగా ఒకరి నుండి ఒకరు పని పాటలు, నైపుణ్యలు తెలిసుకుని ముందుకు సాగిన తెలుగు జాతి నేడు రాజకీయ దుష్టశక్తులు ఆడుతున్న చదరంగంలో అమాయకంగా బలవడం ధర్మమా ? మనలో ఎక్కడైనా వెనుకబాటు తనం ఉంటే దానికి కారకులైన వారిపై కలసి కట్టుగా పోరాడాలే కానీ విడిపోయి సాధించేదేముంది ? మరింతగా వైషమ్యాలు పెరిగి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నుండి నేతలకు విశ్రాంతి కలిగించడం తప్ప.