తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నారు
posted on Aug 13, 2013 @ 10:16AM
తెలుగువారి ఆత్మగౌరవాన్ని చట్టసభలో అవమానిస్తున్నారని నందమూరి హరికృష్ణ అన్నారు. తెలంగాణ అంశంపై రాజ్యసభలో చర్చకు అనుమతించడంతో హరికృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఆయన తెలుగులో ప్రసంగిస్తుండగా ఉపసభాపతి అందుకు అడ్డుచెప్పటంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
మీరు తెలుగులో మాట్లాడాలనుకుంటే మీరు ముందుగా చెప్పాలని ఉపసభాపది ఆయనకి సూచించారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, నాకు అర్థం కావాలి కదా అంటూ పలుమార్లు ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో ఇది మా దౌర్భాగ్యం అని హరికృష్ణ కోపంగా అన్నారు.
తెలుగు నేలకు చెందిన మేము తెలుగులో మాట్లాడకూడదా? నేను తెలుగులోనే మాట్లాడతాను. మీకు తెలుగులో అర్థం కాకపోతే ట్రాన్స్‌లేటర్‌ను పెట్టుకోండి అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు హరికృష్ణ. తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి అన్నట్టు తెలంగాణాపై నిర్ణయం చేసేశారు. కాంగ్రెస్ ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్న ఆయన ఒక కంట్లో కన్నీరు, మరో కంట్లో పన్నీరా, ఒక కంట్లో కారం, మరో కంట్లో కాటుక పెతడారా? అని ఆయన విమర్శించారు.