బొత్సకి సమైక్య సెగ

      పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించేందుకు ఉపాధ్యాయ జేఏసీ నేతలు ప్రయత్నించారు. జిల్లా కేంద్రంలో ఉన్న పీసీసీ చీఫ్ బొత్స ఇంటిని ముట్టడించేందుకు ఉపాధ్యాయ నేతలు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఉద్యమకారులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్యమకారుల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయనగరం జిల్లాలో సమైక్య ఉద్యమం తారాస్థాయికి చేరుతోంది. జిల్లా అంతటా ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. విజయనగరం వచ్చిన మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కుటుంబానికి సమైక్య సెగ తగిలింది. సెప్టెంబరు 1 నుండి విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెకు సిద్దమవుతున్నారు. గత నాలుగు రోజులుగా సమ్మె మూలంగా జిల్లాలో జనజీవనం స్థంభించింది.

గొల్లపూడి వద్ద దేవినేని ఉమ అరెస్ట్

      ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరావును పోలీసులు అరెస్ట్ చేశారు. సీమాంధ్ర పరిరక్షణ కోసం దీక్ష తలపెట్టిన ఆయన శనివారం ఉదయం తన నివాసం నుంచి దీక్ష శిబిరానికి బయలుదే రగా గొల్లపూడి వద్ద దేవినేని సహా కేశినేని నాని, పలువురు టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు యత్నించడంతో పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది.ఉమాను ఎక్కడికి తరలించినా దీక్ష కొనసాగుతుందని వర్ల రామయ్య తెలిపారు.మరోవైపు మొగల్రాజపురంలో బోండా ఉమాను తన స్వగృహంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆయన తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

రాజకీయ వ్యూహాలు మేడ్ ఇన్ తెదేపా

  నాయకత్వ లోపంతో బాధపడుతున్న వైకాపా ఇటీవలకాలంలో రాజకీయంగా చాలా చురుకుగా వ్యవహరిస్తూ తెదేపాకు సవాలుగా నిలుస్తోంది. సమైక్య నినాదంతో రాజీనామాలు చేసిన తరువాత మధ్యలో కొంచెం చల్లబడినప్పటికీ, జగన్, విజయమ్మల రాజీనామాలతో మళ్ళీ ఆపార్టీ కొంచెం వేగం పుంజుకొంది. తెదేపా నిరాహార దీక్షలకు సిద్దపడుతున్నసంగతి కనిపెట్టిన ఆ పార్టీ, వారికంటే ముందుగానే ఈ నెల 19న విజయమ్మ దీక్ష మొదలుపెట్టబోతోంది. ఇక, చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర గురించి మీడియాలో వార్తలు రాగానే, ఆయన కంటే ముందుగానే వైకాపా కూడా ఈనెల 22 నుండి బస్సు యాత్రలు మొదలుపెట్టబోతోంది. తెదేపా తన ఆలోచనలతో, ప్రణాళికలతో స్వయంగా ప్రయోజనం పొందలేకపోతున్నపటికీ, ఈవిధంగా వైకాపాకు మాత్రం చక్కటి మార్గదర్శనం చేయడం విశేషం. వైకాపా కూడా వ్యుహాలకోసం బుర్రలు బ్రద్దలు కొట్టుకొనే బదులు తెదేపా దగ్గర రెడీ మేడ్ గా దొరుకుతున్న వ్యూహాలను అమలు చేస్తూ తెదేపా కంటే దూసుకుపోతోంది.

వైకాపాతో రాజీకొచ్చిన కొణతాల వర్గం

  దాడి వీరభద్రరావు చేరికతో వైకాపాకు దూరమయిన కొణతాల రామకృష్ణ, కాంగ్రెస్ లేదా తెదేపాలో చేరుతారని అందరూ ఊహించారు. అయితే, ఆయన మాత్రం అటువంటి ప్రయత్నాలేవీ చేసినట్లు కనబడలేదు, కానీ ఇంతకాలం పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే, ఈ నెల 19నుండి వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయవాడలో విజయమ్మ చేపట్టే దీక్ష చేపట్టబోతున్న సందర్భంగా, ఆమెకు సంఘీభావంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దీక్షలు చేపట్టాలని, అదేవిధంగా ఈ నెల 22 నుంచి పార్టీ నిర్వహించే సమైక్య బస్సు యాత్రలను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలకి పిలుపునిచ్చారు. అంటే, ఆయన దాడి వీరభద్రరావుతో కలిసి పనిచేయడానికి కూడా సిద్దపడినట్లే భావించవచ్చును. ఇది పార్టీకి, అయన ప్రత్యర్ధులకు కూడా ఊహించని పరిణామమే. బహుశః కొణతాల వర్గం ప్రస్తతం నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో కేవలం తాత్కలికంగా వెనక్కి తగ్గి ఉండవచ్చును. ఎన్నికలు దగ్గరపడిన తరువాత ఆయన వర్గం పార్టీ మరే అవకాశం ఉంది.

20న జాతీయ రహదారుల దిగ్బంధం

      సమ్మె ఆగదు. ఆపేది లేదు. మరింత తీవ్రం చేస్తాం. సీమాంధ్ర ఎంపీలందరూ రాజీనామాలు చేసేదాకా వెనక్కి తగ్గేదే లేదు.. అని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. ఈ నెల 19 నుంచి సీమాంధ్ర వ్యాప్తంగా ఒకేవిధమైన ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని అశోక్‌బాబు ప్రకటించారు. "19న అన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాలి. 20వ తేదీన పూర్తిస్థాయిలో రహదారులను దిగ్బంధించాలి. 21వ తేదీన సీమాంధ్రలో ప్రజలు తరలివచ్చి ఉదయం 10.30 గంటల నుంచి 11 వరకు అన్ని జాతీయ రహదారులపై మానవ హారాలు నిర్మించి సమైక్యాంధ్ర నినాదాలు చేయాలి. అదే రోజున సాయంత్రం 6.30 గంటల నుంచి కొవ్వొత్తులు, కాగడాలతో ప్రదర్శన నిర్వహించాలి. 22, 23వ తేదీలలో తాలూకా, డివిజన్, జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలి. ఇందులో... అన్ని సంఘాల నాయకులు పాల్గొనాలి.   24 నుంచి 30వ తేదీ వరకు వరకు ఉద్యోగులు, నాయకులు, కార్మికులు కుటుంబ సభ్యులతో సహా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలి'' అని అశోక్‌బాబు పిలుపునిచ్చారు. త్వరలో హైదరాబాద్‌లో మహాసభ నిర్వహిస్తామని... రాష్ట్రం ఎందుకు సమైక్యంగా ఉండాలో అవగాహన కల్పించడమే దీని ఉద్దేశమని ప్రకటించారు. ఉద్యోగులు చేపట్టిన సమైక్య సమ్మెకు మద్దతు ఇచ్చే ఏ రాజకీయ పార్టీ నాయకుడినైనా తాము ఆదరిస్తామని అశోక్‌బాబు స్పష్టం చేశారు.

తెలంగాణలో బ్రోకర్ ఎవరో తేలాలి

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ తనను బ్రోకర్ అనడంపై ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ మండిపడ్డారు. తాను బ్రోకర్ ను కానని, తెలంగాణలో బ్రోకర్లు ఎవరో అందరికీ తెలుసు అని టీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టారు. టీఆర్ఎస్ పై 10 అంశాలకు సంబంధించిన ఆరోపణలున్న కవర్ ను జేఏసీకి పంపిస్తున్నానని, ఈ అంశాలపై జేఏసీ విచారణ జరిపించాలని దిలీప్ కుమార్ కోరారు.   రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మధ్య బ్రోకర్ గా వ్యవహరించిందెవరు?ఒడిషాలో వ్యాపారిని కిడ్నాప్ చేసిందెవరు?సినిమా వాళ్ల దగ్గర వసూళ్లకు బ్రోకర్ గిరి చేసిందెవరు అంటూ పలు ప్రశ్నలను ఆయన సంధించారు. అయితే ఇటీవల టీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ లో చేరుతున్న నేతలకు మధ్య వర్తిత్వం వహిస్తున్నారని కెసిఆర్ అన్నట్లు వార్తలు వచ్చాయి.

హైకమాండ్ వెనక్కి తీసుకోదు

      తెలుగువారు మన ఒక్క రాష్ట్రంలోనే లేరని, అనేక రాష్ట్రాలలో ఉన్నారని, అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని,కొందరు అత్యంత ప్రముఖ స్థానాలలో కూడా ఉన్నారని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. తెలుగుజాతి ఐక్యతను కాపాడుకోవాలని, రాష్ట్రాలుగా విడిపోయినా, ఒకే జాతిగా కలిసుందామని పేర్కొన్నారు.   విభజన ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణపై నిర్ణయాన్ని అధిష్టానం వెనక్కి తీసుకునే అవకాశమే లేదని డీఎస్ స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్రాష్ట్ర నదీ జలాల పంపకంలో సమస్యలుండవని ఆయన అన్నారు. మంచి రాజదానికి ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం సిద్దంగా ఉందని కూడా డి.శ్రీనివాస్ తెలిపారు. కనుక సీమాంధ్ర అభివృద్దికి ఇది మంచి అవకాశం అని కూడా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 12 సంవత్సరాలుగా సంప్రదింపులుగా ప్రక్రియ జరిపిన తరువాతే విభజనకు కేంద్ర నాయకత్వం పూనుకుందని చెప్పారు. ఉద్యోగుల మధ్య అపోహలు తొలగించడానికి గాను ఉభయులు కలసి చర్చించుకోవచ్చని అన్నారు. తనకు రెండువైపులా ప్రజలతో సత్సంబందాలు ఉన్నవ్యక్తిగా ఈ పరిస్థితిని చూసి ఆవేదన చెందుతున్నానని అన్నారు.

తెలంగాణ నా ఇల్లు: శ్రీహరి

      తెలంగాణ నా ఇల్లు. అలాంటిది ఇల్లు గురించి అడిగితే ఏం చెబుతాను అని ప్రముఖ నటుడు రియల్‌స్టార్ శ్రీహరి అన్నారు. సినీ జీవితంలో విజయం సాధించాను..అలాగే రాజకీయాల్లో కూడా ఎదుగుతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుండి నేను ప్రజలకు సేవ చేయగలనని అనుకుంటున్నానని, ముందు ఆ పార్టీలో చేరి ప్రజలకు సేవ చేస్తానని ఆ తరువాత అవకాశాన్ని బట్టి కూకట్ పల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పోటీ చేసే విషయం ఆలోచిస్తానని అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే తాను జగన్‌ను కలిశానని చెప్పారు. అయితే శ్రీహరి తొలుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం కోసం చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెసు నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

విజయమ్మ దీక్ష యాసిడ్ దాడిలాంటిదే

      రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైయస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాననడం తెలంగాణపై యాసిడ్ దాడి చేయడంతో సమానమని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. అమ్మాయికి ఇష్టం లేకపోయిన ప్రేమించమని వెంటబడే యువకుడి ప్రేమను ఆ అమ్మాయి తిరస్కరిస్తే.. భరించలేక ఎలాగైతే యాసిడ్ దాడి చేస్తాడో అలాగే తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగానైనా కలిసి ఉండాలని విజయమ్మ దీక్షకు కూర్చోబోతున్నట్లు చేసిన ప్రకటనను యాసిడ్ దాడిగా అభివర్ణించారు.   నాలుగేళ్ల క్రితం కెసిఆర్ దీక్ష చేస్తే ప్రభుత్వం అనుమతివ్వకుండా అడ్డుకుందని, ఇప్పుడు విజయమ్మ దీక్ష పట్ల ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు కట్టుబడి ఉన్నామని లేఖ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రకటన రావడంతో తనలో ఉన్న సమైక్యవాదాన్ని ప్రధానికి పంపిన లేఖ ద్వారా బహిర్గతమైందన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ఆంటోని కమిటీ అని, అది తెలంగాణను అడ్డుకోవడానికి ఏమాత్రం కాదన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయులుగా కలిసి ఉందామని సీమాంధ్ర ప్రజలకు సూచించారు.

తెలంగాణ పై వెనక్కి తగ్గేది లేదు: దిగ్విజయ్

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిపోయింది. దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. సీడబ్లూసీ నిర్ణయం జరిగిపోయాక వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. దీనికి అందరూ ఒప్పుకోవాలి. ముందు ఒప్పుకొని ఇప్పుడు అడ్డం తిరిగితే ఒప్పుకునేది లేదు. మీకు ఏవయినా సమస్యలు ఉంటే ఆంటోని కమిటీకి చెప్పుకోండి. ఈ నెల 19, 20 తేదీలలో రాష్ట్రానికి వస్తుంది. పార్లమెంటు సమావేశాల కారణంగా ఇప్పటికిప్పుడు రావడం కుదరదు అని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ గురువారం రాత్రి మరోసారి వార్‌రూమ్‌లో సమావేశమైంది.   దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అంటోనితో పాటు దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, వీరప్పమొయిలీలు ఉన్నారు. సీమాంధ్రులు కోరుకునే డిమాండ్ల మీదనే కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. కేంద్ర మంత్రులు పళ్లం రాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు కమిటీకి తమ వాదనను వినిపించారు. రాయల తెలంగాణ ఇవ్వాలని కోట్ల కోరగా, సమైక్య రాష్ట్రాన్ని ఎక్కువ మంది ప్రజలు కోరుతున్నారని, రాష్ట్రానికి వచ్చి పరిస్థితి గమనించాలని పళ్లం రాజు విజ్ఞప్తి చేశారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని చిరంజీవి కోరారు.

సురాజ్యమవని .. స్వరాజ్యం

      .....సాయి లక్ష్మీ మద్దాల   నేడు భారతావని అంతటా 67వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకుంటోంది. భారతదేశం సస్యశ్యామల దేశం. ఎన్నో సహజ వనరులు పుష్కలంగా ఉన్న దేశం. అభివ్రిద్ది విషయంలో మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నామనే చెప్పుకుంటున్నాం. 67 వసంతాలు గడిచినా భారత ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు అనేకం.  పేదరికం,నిరుద్యోగం,నిరక్షరాస్యత,పౌష్టికాహారలోపం,బాలకార్మికులు, లంచగొండితనం,నానాటికి పతనమవుతున్న దేశ ఆర్ధిక వ్యవస్థ.   ఇవే కాదు ఇంకా చాలా సమస్యలు నేడు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. సహజవనరులను దేశ సంక్షేమానికి వినియోగిచుకోవటం లో విఫలమైన,సహజ వనరుల కుంభ కోణాల్లో మాత్రం ఆరి తేరిపోయారు మన పాలకులు. గత 9ఏళ్ళుగా యు.పి.ఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మన దేశం చూడని కుంభకోణం లేదు. కాని ప్రజా సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేశారు. ప్రజలను  నానాటికి సోమరిపోతులను చేసే విధంగా ప్రజాకర్షక పధకాలు. దేశంలో ఎక్కడ చూసినా అదుపులో లేని శాంతి భద్రతలు. మెరుగైన విద్యను అందించలేని ప్రభుత్వ వైఫల్యం కారణంగా వీధికోకటిగా పుట్టుకొస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు,ఫలితంగా అందరికి అందుబాటులో లేకుండా పోతున్న విద్య. ఎలాంటి వసతులు లేని,పరికరాలు లేని ప్రభుత్వ ఆసుపత్రులు,దీనికారణంగా వెలుగు చూస్తున్న కార్పోరేట్ ఆసుపత్రులు ఫలితంగా సామాన్యుడికి అడుబాటు లో లేని వైద్యం. తాగటానికి గుక్కెడు నీళ్ళు కావాలంటే మైళ్ళ కొద్ది దూరం వెళ్ళాల్సిన పరిస్థితి.                గ్రామాల పరిస్థితి మరీ దుర్భరం. వ్యవసాయాన్ని ఆదుకొనేవాడు కనబడక రైతు దిగాలుపడిపోతు,ఆత్మహత్యలు చేస్కుంటున్న రైతన్నలు. మగ్గాలు కదలనంటున్న చేనేత రైతుల పరిస్థితి మరీ దారుణం. ఇవన్ని దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు. ఇంక నేతల విషయానికి వస్తే దేశ సమగ్రతను కాపాడాలన్న బలమైన తపన ఏ ఒక్క రాజకీయ నేతకు లేదు. కేవలం దేశం లో ని అంతర్గత సమస్యలెకాదు,దేశ సరిహద్దులో పొంచి ఉన్న సమస్యల నుండైన దేశాన్ని కాపాడే యోచనలో పాలకులు ఉన్నారా అంటే అది సందేహమే. ఒక పక్క నుంచి పాకిస్తాన్ మరోపక్క నుంచి చైనా ఎప్పుడు ఏదో ఒక సమస్యను దేశం మీదికి విసురుతూనే ఉన్నాయి. ఇది మన దేశాన్ని ఏలుతున్న నేతల వైఫల్య ఫలితం కాదా. దేశం పుట్టెడు సమస్యల్లో చిక్కుకొని ఉంది. కాని ఆ సమస్యలపై చర్చించే తీరిక మన నేతలకు లేదు. కనీసం చట్ట సభ్లలోనైన ప్రజా సమస్యలు చర్చకు వస్తాయా అంటే అక్కడ ఉండేది   యుద్ద వాతావరణమే.                ఇంక ప్రజల విషయానికి వస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 66 వసంతాలు పూర్తి అయినా,వారు బానిస మనస్తత్వాన్ని వదులుకుంటున్నట్లు లేరు. ఎందుకంటే నెహ్రు తర్వాత ఇందిరాగాంధీ,ఆ తరువాత రాజీవ్ గాంధి,తరువాత సోనియా గాంధి తరువాత రాహుల్ గాంధికి అధికారాన్ని కట్టపెట్టాలని ప్రయతిస్తున్నారే తప్ప,సమర్ధులైన నాయకులను ఎన్నుకోవటం లేదు. ఎంతో అనుభవం సమర్ధత కలిగిన ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కాలేక పోయారు. ఇది రాచరికానికి మరో రూపం అవుతుందే తప్ప ప్రజాస్వామ్యం కాజాలదు. ఎన్నాళ్ళి వారసత్వ రాజకీయాలు?ప్రజాస్వామ్యమంటే ప్రజలు వోట్లు వేసి నేతలను ఎన్నుకోవటం మాత్రమే కాదు చేయాల్సింది. వారసత్వ రాజకీయాలను తిప్పికొట్ట గలగాలి. అవినీతి పరులైన నేతలకు బుద్ధి చెప్పగలగాలి,సమర్ధులైన నాయకులను ఎన్నుకోవాలి. 

గద్దె బాబురావు ముందు చూపు

      విజయనగరం జిల్లాకు చెందిన చీపురుపల్లి శాసనసభ్యుడు గద్దె బాబురావు గతంలో తెదేపాలో ఉన్నప్పుడు పార్టీలో తనకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని, పార్టీకోసం పనిచేసేవారికి గుర్తింపు లేదని నిందిస్తూ తెదేపాను వీడి వైకాపాలో జేరారు. అయితే, ఆయన ఆపార్టీలో కూడా సరిగా ఇమడలేకపోవడంతో, మళ్ళీ అవే ఆరోపణలు చేస్తూ పార్టీని వీడేరు. ఒకనాడు ఏ పార్టీలో తనకు సరయిన గుర్తింపు గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసారో, మళ్ళీ అదే పార్టీని ఇప్పుడు తల్లి వంటి పార్టీ అనడం, తెదేపాను వీడినందుకు బాధపడుతున్నానని చెప్పడం చూస్తే ఆయన తెరిగి స్వంత గూటికి చేరుకొనేందుకు సిద్దపడుతున్నారని అర్ధం అవుతోంది. ఆయన వైకాపాలో జిల్లా సమన్వయ కర్తగా కీలక బాధ్యతలు చెప్పటినప్పటి నుండి పార్టీకి చెందిన స్థానిక నేతలతో విభేదాలు మొదలయ్యాయి. తత్ఫలితంగా ఇటీవల ఆ పార్టీ నేత షర్మిల విజయనగరం జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ఆయన వ్యతిరేఖ వర్గంవారు, ఆమెకు పిర్యాదులు చేయడంతో ఆయనకు చేదు అనుభవం ఎదురయినట్లు సమాచారం. దానితో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలనే ఆలోచనతో, తన చీపురుపల్లి నియోజక వర్గం సీటును తెదేపా మరెవరికో కేటాయించక ముందే, తిరిగి స్వంత గూటికి చేరుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. కానీ, తెదేపా తిరిగి ఆయనకు స్వాగతం పలుకుతుందా అంటే అనుమానమే. ఎందుకంటే ఆ పార్టీలో కూడా స్థానికంగా ఆయనకు వ్యతిరేఖించేవారు చాలామందే ఉన్నట్లు తెలుస్తోంది.

టీడీపీ నేత లాల్‌జాన్ భాషా కన్నుమూత

      టీడీపీ సీనియర్ నేత లాల్‌జాన్ భాషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భాషా అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా నల్గొండ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.   1984లో గుంటూరు నుంచి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా టిడిపి తరఫున ఎన్నికయ్యారు. 1991లో ఆయన ఎన్‌జి రంగాను ఎన్నికల్లో ఓడించారు. ముంబైలోని ప్రఖ్యాతి గాంచిన మార్కంటైల్ బ్యాంక్ చైర్మన్‌గా ఆయన పనిచేస్తున్నారు. బాషా మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు నల్లగొండకు బయలుదేరారు. లాల్ జాన్ బాషా మృతి తనకు వ్యక్తిగతంగా తీరనిలోటు అని ఆయన అన్నారు. పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలను కోల్పోయిందని అన్నారు.

ఆలూ లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం

  ఆలూ లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్లు, ఇంకా రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలు కాకముందే తెలంగాణకు ప్రత్యేక పిసిసి వేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు రక్షణ శాఖ మంత్రి ఆంటోనిని కలిసి విన్నవించుకొన్నారు. తెలంగాణా కోసం ఎన్ని త్యాగాలకయినా సిద్దం అని ఉత్తర ప్రగల్భాలు పలికేవారందరూ ఇంకా తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందే పదవులకోసం పడుతున్న తాపత్రయం చూస్తుంటే, రేపు రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి పదవికోసం, ఇతర మంత్రి పదవులకోసం తమ సహచర నేతలతో వారు ఎటువంటి యుద్దాలు చేస్తారో చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనమయితే గనుక, ఈ పోటీ మరింత రసవత్తరంగా ఉంటుంది. అప్పుడు తెరాస వర్గం, కాంగ్రెస్ వర్గం అనే రెండు కొత్త వర్గాలు కాంగ్రెస్ పార్టీలో పుట్టుకొచ్చి, ఆదిపత్యం కోసం ఒకదానితో మరొకటి కత్తులు దూసుకొంటాయేమో? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పార్టీని విలీనం చేసుకొంటే అక్కడా ఆ పార్టీకి అదే పరిస్థితి ఏర్పడుతుందేమో? ఇంతకీ రాష్ట్ర విభజనతో తన ప్రత్యర్ధులను దెబ్బ తీసి తను లాభపడాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి, తెరాస, జగన్ పార్టీలే తిరిగి ఎసరుపెట్టినా ఆశ్చర్యం లేదు. అత్యాశకుపోతే, ఏపార్టీకయినా అదే పరిస్థితి తప్పదని చెప్పవచ్చును.

దేవినేని ఆమ‌ర‌ణ దీక్ష

  15రోజుల గ‌డుస్తున్న సమైక్యాంద్ర కోసం జ‌రుగుతున్న ఉద్యమాలు త‌గ్గక పోగా మ‌రింత తీవ్రమ‌వుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేత‌లు నిర‌హార దీక్షలు చేస్తుండగా ఇప్పుడు ఈ మ‌రో నాయ‌కుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించ‌డానికి రెడీ అవుతున్నారు. సమైక్యాంధ్రాకు మద్దతుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమమహేశ్వరరావు  ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడిన‌ రాష్ట్రం సమైక్యం కోసం స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ఆగస్టు 15న తాను ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విభ‌జ‌న విష‌యంలో అనుస‌రిస్తున్న వైఖ‌రితో పాటు రాష్ట్రాన్ని స‌మైక్యంగా ఉంచాల‌నే డిమాండ్ల‌తో ఆయ‌న నిర‌వ‌ధిక దీక్ష చేప‌డుతున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాల‌తో  సీమాంధ్రలో ఇప్పటికే 300 మందికి పైగా  ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆయ‌న‌ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంద్రల విష‌యంలో కాంగ్రెస్ నిర్లక్షంగా వ్యవ‌హ‌రిస్తుంద‌న్న ఆయ‌న సోనియా రాహుల్‌ని ప్రదానిని చేయ‌డానికే విభ‌జ‌న నిర్ణయం తీసుకుంద‌ని విమ‌ర్శించారు.

తిరుమ‌ల‌కు పెరుగుతున్న ర‌ద్ధీ

  స‌మైక్యాంద్ర ఉధ్యమం 24గంట‌ల పాటు సాక్షాత్తు తిర‌మ‌ల వెంక‌టేశ్వరున్నే అల్లాడించింది. సీమాంద్ర ఉద్యొగులు ఇచ్చిన సమ్మెపిలుపుతో తిరుమ‌ల తిరుప‌తిల‌లో జ‌న‌జీవ‌నం స్థంభించింది. క‌నీసం కొండ‌పైకి వెళ్లడానికి కూడా బ‌స్సులు లేక‌పోవ‌డంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నిన్న రాత్రి నుంచి ఉద్యోగులు స‌మ్మె నుంచి తిరుమ‌ల కొండ పైకి వెళ్లే బ‌స్సుల‌కుస‌డ‌లింపును ఇవ్వటంతో ఆధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. దీంతో తిరుమలలో బుధవారం రద్దీ క్రమేణా పెరుగుతోంది. అలిపిరి నుంచి కొండకు ఆర్టీసీ బస్సుల రాకపోకలు సాగుతుండటంతో శ్రీవారి దర్శనానికి భక్తుల బారులు తీరారు. బుధ‌వారం కేవలం సొంత వాహనాలు, ట్యాక్సీలు, అద్దె జీపులు, ద్విచక్రవాహనాలు మాత్రమే ఠాట్ రోడ్‌లో తిరిగాయి. దీంతో రద్దీ అంతంతమాత్రంగా ఉంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు, అధికారులతో మంగళవారం రాత్రి టీటీడీ ఈవో, కలెక్టర్ తదితరులు జరిపిన చర్చలు ఫ‌లించాయి.య దీంతో నిన్న రాత్రి నుంచి 100 బ‌స్సులు కొండ పైకిన‌డుస్తున్నాయి. అయిన ప్రస్థుతం న‌డుస్తున్న బ‌స్సులు స‌ర్వీసులు స‌రిపోక భ‌క్తులు ఘ‌ర్షణ‌ల‌కు దిగుతున్నారు. ప్రభుత్వం, టిటిడిలు చొర‌వ తీసుకుని తిరుమ‌ల తిరుప‌తికి స‌మ్మె నుంచిపూర్తి స్థాయి మిన‌హాయింపు కోరాల‌ని భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు.

19 నుంచి విజ‌య‌మ్మ దీక్ష

  రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో వైసిపి మ‌రో అడుగు ముందుకు వేసింది. ఇన్నాళ్లు తాము విభ‌జ‌న వ్యతిరేకం కాదు అన్న ఆ పార్టీ నేత‌లు ఇప్పుడు స‌మైక్య రాష్ట్రం కోసం ప్రత్యక్ష యుద్దంలోకి దిగుతున్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రక‌ట‌న నేప‌ధ్యంలో ముందుగా రాజీనామాలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీమాంద్రల్లో హీరోలుగా మారారు. ఇదే ఊపులో ఇప్పుడు స‌మైక్యాంద్ర ఉద్యమ క్రెడిట్ అంత త‌మ ఖాతాలో వేసుకోవాల‌నుకుంటుంది ఆపార్టీ. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర‌వ‌ధిక దీక్షకు దిగ‌నున్నారు. ఈ నెల 19 నుంచి విజయవాడలో దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్రాన్ని విభ‌జించి ఇరు ప‌క్షాల‌కు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని స‌మైక్యంగా ఉంచాలని డిమాండ్‌తో ఆమె దీక్షకు దిగ‌నున్నారు. రాష్ట్రవిభ‌జ‌న విష‌యం కాంగ్రెస్ పార్టీ ఏక‌ప‌క్షంగా తీసుకుంద‌ని విమ‌ర్శిస్తూ వ‌స్తున్న వైసిపి ఇప్పుడు ప్రత్యక్షంగా నిర‌స‌న‌లు చేయ‌డానికి రెడీ అవుతుంది. రాజకీయ అబ్దికోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్ర విభజన తప్పనిసరైతే కేంద్రం ఓ తండ్రిలా వ్యవహరించి రెండు ప్రాంతాలకు సమ న్యాయం చేయమని వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేస్తుంది.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు

      వేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తప్పుడు పౌరసౌత్వ ధ్రువీకరణ పత్రం ఇచ్చినందున ఆయన ఎన్నిక చెల్లదని కోర్ట్ తీర్పునిచ్చింది. రమేష్ ఎన్నికపై ప్రత్యర్ధి ఆది శ్రీనివాస్ కోర్టుకు వెళ్లారు. దీనిపై కోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది. రమేష్ జర్మనీ పౌరసత్వం, భారత పౌరసత్వం కలిగి ఉన్నారని, జర్మనీ ప్రభుత్వం నుండి వేతనం అందుకుంటున్నాడని ఆది శ్రీనివాస్ ఆరోపిస్తూ కోర్టు కెక్కారు. ఆయన ఇక్కడ రాజకీయాలలోకి వచ్చి రెండువేల తొమ్మిదిలో టిడిపి తరపున గెలిచారు. ఆ తర్వాత ఆయన టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరి తిరిగి ఉప ఎన్నికలో గెలుపొందారు.

హైదరాబాద్ వాసులకు జానారెడ్డి హామీలు

  తెలంగాణా ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డిని, టీ-కాంగ్రెస్ నేతలు కానీ, తెరాస గానీ, ఉద్యమంలో ఉన్నవారు గానీ ఎవరూ ఎన్నడూ నమ్మలేదు. ఆయన తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారనే అపవాదు కారణంగానే ఎవరూ కూడా ఆయన మాటలను విశ్వసించలేకపోయారు. అటువంటి ఆయన ఇప్పుడు సీమాంధ్ర ప్రజలకు, ఉద్యోగులకు యావత్ టీ-మంత్రుల తరపున ఒక గొప్ప హామీ ఇచ్చారు.   ఎపి ఎన్జీఓలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారి భద్రతకు తానూ పూర్తి భరోసా ఇస్తున్నానని హామీ ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ నివసిస్తున్న ఆంద్ర, రాయలసీమ వాసులకు ప్రజలకు ఉండదలిచిన వారెవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని అందుకు తాను హామీ అని అన్నారు. అవసరమైతే వారి భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి అందుకు తగిన అన్ని చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.   ప్రస్తుతం హైదరాబాదులో పనిచేస్తున్నఆంధ్ర ఉద్యోగులు ఏవిధంగాను నష్టపోకుండా వారికి తగిన సదుపాయాలు, సర్వీస్ నిబంధనలను అమలుచేస్తామని జానారెడ్డి హామీ ఇచ్చారు. తెలుగు ప్రజలు ప్రాంతాలుగా విడిపోయినా ఒకే కుటుంబంగా కలిసి ఉంటామని ఆయన చెప్పారు. ఎన్.జి.ఓలకు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నాకేంద్రం నియమించిన అంటోనీ కమిటీకి తెలియచేయాలని, వెంటనే వారు తమ సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.   ఇటువంటి హామీలు కాంగ్రెస్ నేతలే కాదు, తెరాస నేతలు సైతం ఇస్తున్నసంగతి ఆయనకీ తెలిసే ఉండాలి. కానీ, వారి మాటలకు చేతలకు చాలా తేడా కనబడుతున్న విషయం కూడా ఆయనకి తెలిసే ఉండాలి. ఒకవైపు ఆంధ్ర ప్రజలను ఎవరూ బయటకి పొమ్మనలేదని చెపుతూనే ‘కబడ్దార్ కొడకల్లారా!’ అంటూ అదే నోటితో ప్రజలను భయపెడుతున్నకొందరు అతివాద నేతల ఆలోచనలను జానారెడ్డి వంటి వారే కాదు సాక్షాత్ ప్రధాని హామీ ఇచ్చినా భద్రత ఉండదు.   అందువల్లే హైదరాబాద్ లో స్థిరపడిన ప్రజలు తీవ్ర అభద్రతా భావంతో బాధపడుతున్నారు. తెరాస నేతలు చేపట్టిన ఉద్యమంతో ప్రజల మధ్య అగాధం ఏర్పడింది. ఇప్పటికే, స్థానికంగా విద్యా ఉద్యోగ విషయాలలో తీవ్ర వివిక్షను ఎదుర్కొంటున్నఆంధ్ర, రాయలసీమ ప్రాంతవాసులకు, జానారెడ్డి వంటి వారిచ్చే హామీలు ఎటువంటి న్యాయం, భద్రతను కల్పించలేవని ఖచ్చితంగా చెప్పవచ్చును. కేవలం చట్టపరమయిన రక్షణలు మాత్రమే వారి భయాలను కొంత మేరయిన తగ్గించగలవు. అయితే, ఇది తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాతనే సాధ్యం గనుక, అంతవరకు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని అక్కడి ప్రజల కోరుతున్నారు.   దీనికి సరయిన పరిష్కారం కనుగొనకుండా ముందుకు సాగినట్లయితే, హైదరాబాదులో తరచూ చెలరేగే మత ఘర్షణల వలెనే, ఆంధ్ర తెలంగాణా ప్రాంత ప్రజల మధ్య కూడా తరచూ ఘర్షణలు, ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉంటుంది.