రాష్ట్ర విభజన తెదేపా, వైకాపాలను దెబ్బతీయడానికే జరుగుతోందా
posted on Aug 13, 2013 @ 2:42PM
కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక, రాష్ట్రంలో అతని ప్రాభల్యం తగ్గించేందుకే రాష్ట్ర విభజన చేస్తోందని వైకాపా ఆరోపిస్తుంటే, అదేమీ కాదు, కాంగ్రెస్ పార్టీ తెరాస, వైకాపాలను తనలో విలీనం చేసుకొని రాష్ట్రంలోతమ పార్టీని భూస్థాపితం చేయడానికే ఈ ఎత్తు వేసిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిజానికి ఆ రెండు పార్టీలు కూడా రాష్ట్ర విభజనకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూ అఖిలపక్ష సమావేశంలో లేఖలు ఇచ్చిన సంగతిని కూడా ఇప్పుడు మరుగుపరుస్తూ, కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు అమలు చేస్తోందని వాదించడం చాలా అసమంజసం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వారు ఆరోపిస్తున్నట్లుగానే తమని రాజకీయంగా దెబ్బతీయడానికే రాష్ట్ర విభజన చేస్తోందని అనుకోన్నపటికీ, అందుకు కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టలేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాటిలాగే ఒక రాజకీయ పార్టీయే గనుక, తనకు లబ్ది చేకూర్చేవిధంగానే నిర్ణయం తీసుకోవడం సహజం. రాష్ట్రంలో ఒక సీపీఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజన ను సూత్రప్రాయంగా ఆమోదిస్తూ లేఖలు ఇచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ తనకనుకూలంగా పావులు కదుపుతోందని ఆ పార్టీపై ఆరోపణలు చేయడం అవివేకం.
తెదేపా, వైకాపాలు రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుతం ఏవిధంగా రాజకీయ చదరంగం ఆడుతున్నాయో, కాంగ్రెస్ కూడా అదేవిధంగా ఆడుతోంది. ఈ ఆటలో కాంగ్రెస్ పార్టీ తమపై పైచేయి సాధించిందని బాధపడుతూ ఉద్యమాలు చేయడంకంటే, స్పష్టమయిన వైఖరితో మాట్లాడితే ప్రజలందరి అభిమానం పొందగలుగుతారు. అందుకోసం, ముందుగా ఆ రెండు పార్టీలు తాము తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అనుకూలమా కాదా? అనే విషయంపై స్పష్టత ఏర్పరచుకొన్న తరువాత మిగిలిన విషయాలు మాట్లాడటం మంచిది. ఎందుకంటే, ఆ విషయంపై స్పష్టత ఈయకుండా, విభజన ప్రక్రియలో సమన్యాయం పాటించాలని ఉద్యమాలు చేయడం అనుచితం.
ఒకవేళ వారు తెలంగాణా ఏర్పాటుకి మనస్పూర్తిగా అంగీకరిస్తున్నట్లయితే, డొంక తిరుగుడు లేకుండా ఆ విషయం విస్పష్టంగా ప్రకటించి, ఆ తరువాత విభజన ప్రక్రియ ఏవిధంగా జరగాలని వారు కోరుకొంటున్నారో స్పష్టంగా ప్రకటించడం వలన, ప్రజలకి వారి విధానం ఏమిటో అర్ధం అవుతుంది. అంతేగాక రాష్ట్రంలో నెలకొన్న ఈ రాజకీయ అనిశ్చితి తొలగే అవకాశం కూడా ఏర్పడుతుంది. కానీ వారు ఆవిధంగా చేయకుండా తెలంగాణకు తాము వ్యతిరేఖం కాదంటూనే సమన్యాయం కోసం ఉద్యమాలు చేస్తామనడం వలన, అంతిమంగా వారే రెండు చోట్ల నష్టపోవడం ఖాయం.
సీపీఎం నేత సీతారం ఏచూరి నిన్నరాజ్యసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కూడా ఇదేవిధంగా హెచ్చరించారు. రాబోయే ఎన్నికలలో రెండు ప్రాంతాలలో గెలవాలనే తాపత్రయంతో, కాంగ్రెస్ పార్టీ ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడితే అది నిప్పుతో చెలగాటమే అవుతుందని, అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారడం ఖాయమని ఆయన హెచ్చరించారు.
ఈ హెచ్చరిక వైకాపా, తెదేపాలకు కూడా చక్కగా వర్తిస్తుందని చెప్పవచ్చును. కానీ, వైకాపా తెలంగాణాలో తన పార్టీని వదులుకోవడానికి సిద్దపడినందున ఆ పార్టీకి కొత్తగావచ్చేనష్టం ఏమిలేకపోయినా, తెదేపా ఈ రెండు కళ్ళ సిద్ధాంతం మళ్ళీ అమలు చేయాలని చూస్తే, ఆ పార్టీ రెండు రాష్ట్రాలలో కూడా తీవ్రంగా నష్టపోక తప్పదు.