విభజనకు 'జగన్' సపోర్ట్ !

        తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు వీలయినంత ఎక్కువగా సహకరిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో జరిగిన ఒప్పందంలో భాగంగా బెయిలు మీద బయటకు వచ్చాడని జగన్ మీద విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రకటనకు ముందే సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ తన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాడు. ఇప్పుడు తాజాగా వాటిని ఆమోదించుకునేందుకు మొగ్గు చూపుతున్నాడు.     కాంగ్రెస్ సూచనల మేరకే జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే జగన్ పార్టీలో చేరి అనర్హత వేటుపడిన సీమాంధ్ర శాసనసభ్యులు 15 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు జగన్ పార్టీ టికెట్ మీద గెలిచిన 17 మంది కూడా రాజీనామాలు చేస్తున్నారు. అంటే మొత్తం 32 మంది.  దీంతో సీమాంధ్ర ఎమ్మెల్యేల సంఖ్య  175 నుండి 143కు చేరుతుంది. అంటే తెలంగాణ (117)ఎమ్మెల్యేల కంటే సీమాంధ్ర ఎమ్మెల్యేలు కేవలం 26 మంది మాత్రమే ఎక్కువ అవుతారు.  అందులో కొందరు వివిధ కారణాలతో గైర్హాజరయితే తెలంగాణ తీర్మానం సులభంగా నెగ్గుతుంది. సమైక్యవాదానికి కట్టుబడ్డందుకు జగన్ కు సీమాంధ్రలో ఆదరణ ఎలాగు ఉంటుంది. ఇటు తెలంగాణ ఏర్పాటు జరిగిపోతుంది.

మ్యాచ్ ఎప్పుడో అయిపోయింది: శ్రీధర్ బాబు

  ఆఖరి బంతి పడేవరకు మ్యాచ్ పూర్తవదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ “తెలంగాణా మ్యాచ్ ఎప్పుడో పూర్తయిపోయింది. మ్యాచ్ పూర్తయిపోయిన తరువాత ఇక ఆఖరి బంతి పడదు. కాంగ్రెస్ నేతలందరూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి తప్పని సరిగా కట్టుబడి ఉండాలని” ఆయన అన్నారు.   ఇప్పటికే చాలా మంది తెలంగాణా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పదవిలోంచి తప్పించి, రాష్ట్రపతి పాలన విధించయినా రాష్ట్ర విభజన ప్రక్రియను వీలయినంత వేగంగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరున్న మంత్రి శ్రీధర్ బాబు ఇంతవరకు ఆయనకు వ్యతిరేఖంగా ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రికి దూరం జరిగినట్లు ఈ వ్యాఖ్యలతో అర్ధం అవుతోంది.   సీమాంధ్ర శాసన సభ్యులు, మంత్రులు సమైక్య హడావుడిలో తిరుగుతుంటే, మరో పక్క టీ-కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి దూరంగా మసులుతున్నారు. అదేవిధంగా లక్షలాది ఉద్యోగులు కూడా సమ్మె బాట పట్టి రెండు నెలలు కావస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిపాలన కొనసాగడం అసాధ్యమని స్పష్టమవుతోంది. అయినప్పటికీ, కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో పరిస్థితులు భేషుగ్గా ఉన్నాయని శలవిస్తూ ప్రజలకి మరింత ఆగ్రహం కలిగిస్తున్నారు.

ఆఖరి బంతి వరకు ఆడుతా: స్టార్ బ్యాట్స్ మ్యాన్

  సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ‘స్టార్ బ్యాట్ మ్యాన్’ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నమరో సిక్సర్ కొట్టారు. ఆఖరి బంతి పడేవరకు ఏ మ్యాచు ముగియదని ఆయన వ్యాఖ్యానించారు. అంటే రాష్ట్ర విభజన అంశంపై తుది వరకు పోరాటం కొనసాగిస్తానని చెప్పినట్లే అనుకోవచ్చును. సరిగ్గా అంతకు ముందు రోజే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ “ఆయన రాష్ట్రమంతటికీ ముఖ్యమంత్రి గనుక అందరినీ కలుపుకుపోవలసిన అవసరం ఉందని” హెచ్చరికలు జారీ చేసారు. అయినప్పటికీ, కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ సమైక్యవాదం వినిపించడం చూస్తే, ఇక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని సిద్దం అయినట్లే ఉన్నారు.   “రాజకీయ సమీకరణాలు, పార్టీల అభిప్రాయాల కంటే ప్రజాభిప్రయమే ముఖ్యమని, పార్టీలు కూడా తదనుగుణంగానే నడుచుకోవాలని ఆయన అన్నారు. “దాదాపు ఆరున్నర లక్షల మంది ఉద్యోగులు, మూడున్నర లక్షల మంది ప్రజలు గత రెండు నెలలుగా రోడ్ల మీద ఉండి చేస్తున్న ఉద్యమాలను, వారి ఆందోళనను పట్టించుకోకుండా ముందుకు సాగితే పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేసారు.   హైదరాబాద్, విద్యుత్, ఉద్యోగాలు, నదీ జలాల పంపకాలలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపకుండా రాష్ట్ర విభజన చేయడం వలన సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తరగవని ఆయన మరో మారు స్పష్టం చేసారు. ఇంతవరకు నదీ జలాల పంపకాలపై వేసిన ఏ ట్రిబ్యునల్స్ కూడా సమస్యలను ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించలేకపోయిన సంగతిని కేంద్రం గుర్తుంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు. ఒక రాష్ట్రంలో ఏర్పరిచిన ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలకి సమానంగా విడదీసి ఈయడం ఏవిధంగా సాధ్యమో కేంద్రమే ఆలోచించుకోవాలని” అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి పట్ల తన అసంతృప్తిని బహిరంగంగానే వెలిబుచ్చినప్పటికీ ఆయన మరో మారు తన వైఖరిని ఈవిధంగా స్పష్టం చేయడంతో, ఇప్పుడుకాంగ్రెస్ అధిష్టానం ఆయనతో ఏవిధంగా వ్యవహరించాలనే సంగతి నిర్ణయించుకోవలసి ఉంటుంది.   ఇంతవరకు ఆయన సీమాంద్రా నేతలందరినీ రాజీనామాలు చేయకుండా పట్టి ఉంచారు. ఒకవేళ అధిష్టానం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకొన్నా, లేదా విభజనపై ముందుకు వెళ్ళినా, ఆయనతో సహా అందరూ కూడా హెచ్చరిస్తున్నట్లుగానే తమ పదవుల నుండి తప్పుకోవచ్చును. అయినా కాంగ్రెస్ అధిష్టానం మొండిగా ముందుకు సాగితే వారందరూ పార్టీ నుండి తప్పుకొని మరో కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యం లేదు. మరి కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితిని అంతవరకు రానిస్తుందా లేక వేరే ఏమయినా ఉపాయం ఆలోచిస్తుందా? అనేది చూడాలి.

తెలంగాణ నుంచి రాహుల్‌ పోటి

  వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం అందుకు తగ్గట్టుగానే ప్రణాళిక రూపొందిస్తుంది. ముఖ్యంగా రాహుల్‌ ప్రదానిని చేసే దిశగా ఈ ప్రణాళికా రచన సాగుతుంది. అందుతో భాగంగానే రాహుల్‌ను తెలంగాణ ప్రాంతం నుంచి పోటికి దించాలని భావిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగంగా పూర్తి చేసే ఆలోచనలో ఉంది కాంగ్రెస్‌. అందుకోసం ఈసారి రాహుల్‌ మహుబూబ్‌ నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటి చేసేందుకు రాహుల్‌గాంధిని ఒప్పించాలంటే డీసిపి బృందం రాహుల్‌ సన్నిహితులను కొరారు.ప్రస్తుతం కేంద్రం తెలంగాణకు అనుకూలంగా పావులు కదుపుతున్న నేపధ్యంలో రాహుల్ తెలంగాణ నుంచి పోటి చేస్తే అది పార్టీకి రాష్ట్రంలో కేంద్రలో ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు. దీని వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రాభవాన్ని పెంచుకోవటంతో పాటు టిఆర్‌ ఎస్‌ బలాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారట కాంగ్రెస్‌ నాయకులు.

అప్పుడు తెలంగాణా, ఇప్పుడు సీమాంధ్ర నేతలతో

  ఇంత కాలంగా టీ-కాంగ్రెస్ నేతల రాజకీయ జీవితాలతో చెలగాటమాడి రాక్షాసానంధం అనుభవించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల రాజకీయ జీవితాలతో ఆట మొదలు పెట్టింది. ఒకప్పుడు తెరాస, టీ-జేఏసీ, టీ-విద్యార్ధుల ఆగ్రహానికి గురయిన టీ-కాంగ్రెస్ నేతలు అధిష్టానంతో తమ పరిస్థితి గురించి ఎంత మోర పెట్టుకొన్నపటికీ పట్టించుకోకపోవడం వలన, పార్టీలో అత్యంత సీనియర్ నేతలు కే.కేశవ్ రావు, మందా జగన్నాథం, వివేక్ వంటివారనేకమంది చిన్నాపెద్దా నేతలు పార్టీని వీడి ఇతరపార్టీలలో చేరవలసి వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం చలించలేదు. మళ్ళీ ఇప్పుడు సీమాంద్రాలో కూడా అదే పరిస్థితి తలెత్తినా కాంగ్రెస్ అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. పైగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ సీమాంద్రా యంపీలు రాజీనామాలు చేసుకోవచ్చునని వారికెవరూ అడ్డు చెప్పబోరని పలికి పుండుమీద కారం జల్లినట్లు మాట్లాడారు.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా పార్టీలో అనేకమంది నేతలు అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో తమ ప్రాంతంలో పార్టీ కనబడకుండా పోవడం తధ్యమని హెచ్చరిస్తున్నాఅది చెవిటివాడి ముందు శంఖమే అయ్యింది.   దీనర్ధం రాష్ట్ర విభజనను నిలిపివేయమనో, కొనసాగించామనో కాదు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పడమే. గత రెండు నెలలుగా13జిల్లాలలో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయినా కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమాత్రం చొరవ చూపకపోవడం క్షమార్హం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల పట్ల చూపిస్తున్నఈ ఉదాసీనతకి,నిర్లక్ష్యానికి, వైఫల్యానికి రానున్న ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ప్రజలు చెపుతున్నమాటే కాదు, స్వయంగా కాంగ్రెస్ నేతలే చెపుతున్నారు. ఇప్పటికయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని సమస్య పరిష్కారానికి ప్రయత్నించకపోతే తాము కూర్చొన్న కొమ్మను తామే నరుకొంటున్నట్లుగా భావించవలసి ఉంటుంది.

రాజీనామాలు చేసుకో(వచ్చు)వద్దు: దిగ్విజయ్ సింగ్

  “తెలంగాణా అంశంపై వెనకడువేసే ప్రసక్తే లేదు. కానీ, అంటోనీ కమిటీ తన నివేదికను సమర్పించిన తరువాతనే టీ-నోట్ ను క్యాబినెట్ సమావేశంలో ప్రవేశపెడతాము. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నసీమాంధ్ర యంపీలు రాజీనామాలు చేసుకోదలిస్తే వారిని మేము ఆపబోము,” అని మూడు రోజుల క్రితమే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర యంపీలతో అన్నారు. కానీ అదే దిగ్విజయ్ సింగ్ ఈరోజు “త్వరలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే టీ-నోట్ సిద్దం చేసి క్యాబినెట్ ముందు పెడతారని అన్నారు. ఇక సీమాంధ్ర యంపీలు రాజీనామాలు చేసుకోవచ్చని నిర్భయంగా చెప్పిన ఆయన, ఈ రోజు వారిని రాజీనామాలు చేయవద్దని కోరారు. ఇక ఒకవైపు టీ-నోట్ ప్రస్తావన తెస్తూనే దానిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న ఏపీయన్జీవోలను తమ నిరవధిక సమ్మెవెంటనే విరమించమని ఆయన కోరారు. ఉద్యోగుల సమ్మె వలన రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, అదేవిధంగా సీమాంధ్రలో ప్రజలు చాలా ఇబ్బంబులు పడుతున్నారని, అందువలన వెంటనే ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆయన కోరారు. కేవలం దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు మాత్రమే ఒక అంశంపై ఈ విధంగా రెండు రకాలుగా మాట్లాడగలరేమో.

బెయిల్ కోసం విజయసాయి రెడ్డి పిటీషన్

      జగన్ అక్రమాస్తుల కేసులో ఏ1 ముద్దాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిలు మీద విడుదల కావడంతో ఇక ఇవే కేసులలో ఉన్న ఇతర నిందితులు మెల్లమెల్లగా బెయిలు పిటీషన్లు దాఖలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిలు పిటీషన్ వేశారు. ఇప్పుడు జగన్ సంస్థల అడిటర్ విజయసాయి రెడ్డి, జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డిలు బెయిలు పిటీషన్లు దాఖలు చేశారు.     సునీల్ రెడ్డికి వాస్తవంగా ఎప్పుడో బెయిలు వచ్చేది. కానీ ఆయన ఇంతవరకు బెయిలు కొరకు ధరఖాస్తు చేసుకోలేదు. జైల్లో అతను జగన్ కు సహాయకుడిగా, పీఏ గా వ్యవహరించేవాడని, జగన్ ములాఖత్ ల పేరుతో ఎక్కువ మంది కలిసేందుకు వీలుగా ఇతను బెయిలు తీసుకోకుండా ఉన్నాడని ఆరోపణ ఉంది. జగన్ కు బెయిలు మంజూరయ్యే రోజు కూడా జగన్ కుటుంబ సభ్యులతో పాటు ఇతర రాజకీయ నాయకులు జగన్ ను కలిశారు. పరిమితికి మించి లోపలికి వెళ్లి జగన్ ను కలిశారు. అయితే ములాఖత్ ల రికార్డులలో మాత్రం ఇతరుల పేరు మీద ఉండడం విశేషం.

నాలుకలు కోసినా, కాళ్లు విరగకొట్టినా...

      తమ నాలుకలు కోసినా, కాళ్లు విరగకొట్టినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తమ పోరాటం ఆగదని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. హిందూపురంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అశోక్‌బాబు తెలిపారు. కావాలంటే తన ప్రసంగం సీడీలను టీఆర్ఎస్ నేతలకు ఇస్తామని తెలిపారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు దానిని వ్యతిరేకించాలని అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం జరుగుతుందని, 29న కర్నూలులో ఏపీ ఎన్జీవోల సభ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 30న భవిష్యత్ కార్యాచరణ ప్రకటన చేస్తామని అశోక్‌బాబు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని వేరుగా చూడాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజలపై మేము ఎలాంటి విమర్శలు చేయలేదని అశోక్‌బాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలనే తమ ఉద్దేశమని, తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

బిజెపి పార్టీ బుర్కాల ప్లాన్!

      భారతీయ జనతా పార్టీ వెంట ముస్లిం మైనారిటీలు కూడా ఉన్నారని చాటుకునేందుకు ఆ పార్టీ ఓ పది వేల బుర్కాలను తయారు చేయిస్తోందని, ఆ బుర్కాలను తమ పార్టీ కార్యకర్తలకు వేయించి మైనారిటీలు బీజేపీతో ఉన్నారన్న భ్రమలు కల్పించే ప్రయత్నాలలో ఆ పార్టీ ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సభలో ఈ ప్రయోగం చేయనున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించి బీజేపీ బుర్కాలకు ఆర్ఢర్ ఇచ్చిందని ఓ బిల్లును దిగ్విజయ్ మీడియాకు చూపారు. అయితే గుజరాత్ లో 33 శాతం ముస్లింలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఇటీవల ఎన్నికల్లో తేలింది. ఇక ముస్లింలు మాత్రమే గెలుపు ఓటములు నిర్ణయించగల ఎనిమిది స్థానాలలో ఆరు స్థానాలు బీజేపీకి దక్కాయి. 2002 గుజరాత్ అల్లర్లను బూచిగా చూపడమే తప్ప నరేంద్ర మోడిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ కు ఎలాంటి కారణమూ దొరకడం లేదు.

జగన్ కు పోలీసులు రెడ్‌కార్పెట్‌: సోమిరెడ్డి

      బెయిల్‌పై విడుదలైన వైఎస్ జగన్‌ను పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక నేరస్థుడు జగన్‌కు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతారా అని ప్రశ్నించారు. జగన్‌కు గవర్నర్ ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని విమర్శించారు.   పోలీసులు దగ్గరుండి సెక్యూరిటీ కల్పించారని, ఇలా చేస్తే సాక్షుల భయపడరా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సీబీఐ ఎందుకు బలహీనమతోందన్నారు. కాంగ్రెస్, జగన్, కేసీఆర్ ఒక టీం అని, అందుకే జగన్‌ను కేసీఆర్ పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ మంచి పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని సోమిరెడ్డి తెలిపారు. సమైక్య ఉద్యమానికి జగన్ నాయకత్వం వహిస్తే ఉద్యమానికి చెడ్డపేరు వస్తుందన్నారు. జగన్‌కు బెయిల్ వచ్చిన రాత్రి విజయలక్ష్మి సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారన్నారు. రాహుల్ కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చాక రాహుల్ ప్రధాని పదవి చేపట్టేందుకు భయపడ్డారని సోమిరెడ్ది ఎద్దేవా చేశారు.  

బ్లాక్ బెర్రీని కాపాడిన హైదరాబాదీ

  ప్రపంచ ప్రసిద్ది చెందిన బ్లాక్ బెర్రీ మొబైల్ ఫోన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల కాలంలో ఆ ఫోన్ తయారీ సంస్థ పీకల్లోతు ఆర్ధిక సమస్యలలో కూరుకుపోవడంతో వందలాది ఉద్యోగులను తొలగించే పరిస్థితి కూడా ఏర్పడింది.   కష్టాలలో మునిగున్న బ్లాక్ బెర్రీని హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకు చెందిన పూర్వ విద్యార్ధి ప్రేమ్ వత్స ఆదుకొన్నారు. ప్రస్తుతం కెనడా దేశంలో స్థిరపడిన ఆయన ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ అనే సంస్థకు ముఖ్యకార్యనిర్వకుడు (సీ.ఈ.ఓ) మరియు అధిపతిగా ఉన్నారు. అదేవిధంగా బ్లాక్ బెర్రీ సంస్థలో ఆయన సంస్థ ప్రధాన షేర్ హోల్డర్ కూడా. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందిన బ్లాక్ బెర్రీ ఇప్పుడు కష్టకాలంలోఉండటంతో ఆయన ఆ సంస్థను కొనుగోలు చేసారు. ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ మరియు బ్లాక్ బెర్రీ సంస్థలు ఈ ఒప్పందంపై ఇటీవలే సంతకాలు చేసారు.   ఒక భారతీయుడు బ్లాక్ బెర్రీ వంటి ప్రపంచ ప్రసిద్ది చెందిన ఒక ప్రముఖ సంస్థను ఆదుకొని దాని బాధ్యతలు స్వీకరించడం ప్రజలందరికీ గర్వ కారణం. హైదరాబాద్ పబ్లిక్ స్కూలు బోర్డు సభ్యులలో ఒకరయిన ఫయీజ్ ఖాన్ ఇందుకు తాము ఎంతో గర్వపడుతున్నామని తెలిపారు. ఈ డిశంబర్ నెలలో జరగనున్న తమ కళాశాల 90వవార్షికోత్సవ వేడుకలకు హాజరవనున్న ప్రేమ్ వత్స రాక కోసం తామంతా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నామని అన్నారు.   ప్రేమ్ వత్స తండ్రి యంసీ. వత్స గతంలో అదే కళాశాలలో వైస్ ప్రినిసిపాల్ గా, ప్రినిసిపాల్ గా కొంత కాలం పనిచేసి ఆ తరువాత కుటుంబముతో సహా కెనడా వెళ్లి స్థిర పడిపోయారు. ప్రేమ్ వత్ససోదరి ఒకామె హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని వివాహమాడారు. కానీ వారు కూడా ఆ తరువాత కెనడాకు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు.

జగన్ తో సచివాలయ సీమంధ్ర ఉద్యోగుల సమావేశం

  దాదాపు రెండు నెలలుగా మహోదృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాకతో మరో కొత్త మలుపు తిరుగనున్నాయా? అంటే అవుననే చెప్పవచ్చును. దాదాపు నెల రోజులుగా సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తున్న సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు, జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు కొద్ది సేపటి క్రితమే అతను నివసించే లోటస్ పాండ్ వద్దకు చేరుకొన్నట్లు తాజా సమాచారం. వారు తమ ఉద్యమానికి, సమ్మెకి అతని మద్దతు కోరేందుకు వెళ్ళినట్లు సమాచారం.   ఇంతవరకు వైకాపాతో సహా అన్ని రాజకీయ పార్టీలను దూరంగా ఉంచిన సీమాంద్రా ఉద్యోగులు, మొట్ట మొదటిసారిగా వారంతట వారే జగన్ మద్దతు కోరుతూ అతనిని కలవలనుకోవడంతో సమైక్యాంధ్ర ఉద్యమం కొత్త మలుపు తీసుకోబోతోందని స్పష్టం చేస్తోంది.   ఈ విషయం గురించి సచివాలయ ఉద్యోగులు ముందుగానే ఏపీయన్జీవోల నేతల చర్చించి వారి అనుమతితోనే జగన్ కలిసేందుకు వెళ్లి ఉంటారని భావించవలసి ఉంటుంది. అదే జరిగితే, త్వరలో ఉద్యమం ఉద్యోగుల చేతిలోంచి వైకాపా చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా ముందుగా తెదేపా నష్టబోవచ్చును.   ఒకవేళ సచివాలయ ఉద్యోగులు ఏపీ ఎన్జీవో నేతలను సంప్రదించకుండా జగన్మోహన్ రెడ్డిని కలిసిన పక్షంలో అది ఉద్యోగులలో చీలికలు తేవడం ఖాయం. వీటిలో ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీ ఒడ్డున పడుతుంది.   ఏపీ యన్జీవోలు వైకాపా సారధ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయదలిస్తే, రానున్న ఎన్నికలలో ఆ పార్టీకి విజయవకాశాలు మెరుగవుతాయి. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచే పరిస్థితిలోఉంటే అప్పుడు వైకాపా మద్దతు స్వీకరించవచ్చును. వైకాపా అద్వర్యంలో మరికొంత కాలం సమైక్య ఉద్యమాలు సాగిన తరువాత ఎన్నికల గంట కొట్టి, ఉద్యమాలకు ఫుల్ స్టాప్ పెట్టించడం ద్వారా కాంగ్రెస్ తన ఈ వ్యూహం బహు చక్కగా అమలు చేయగలదు.   అలా కాకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏపీ యన్జీవోలలో చీలికలు వచ్చినట్లయితే, ఇంతవరకు వారి సమైక్యాంధ్ర ఉద్యమాల ప్రభావం వలన తెలంగాణా ఏర్పాటుపై అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో ఉన్నకాంగ్రెస్ అధిష్టానం ఇక చకచకా రాష్ట్ర విభజన చేసి రెండు ప్రాంతాలలో తనకనుకూలంగా పావులు కదపవచ్చును.   కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి విడుదల ద్వారా ఆశిస్తున్నఅనేక రాజకీయ ప్రయోజనాల్లో బహుశః ఇది కూడా ఒకటి  అయ్యి ఉండవచ్చును.

జగన్ కు తెలంగాణ సెగ

      జగన్ ఇలా విడుదలై బయటకు రాగానే ఆయనకు తెలంగాణ సెగ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాకుత్ పురా నియోజకవర్గ కన్వీనర్ మైల్ కోల్ మహేందర్ యాదవ్ తెలంగాణ విషయంలో జగన్ వైఖరి తెలపాలంటూ జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణకు అనుకూలమని చెప్పి సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయడం, దీక్ష చేయడానికి నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ వస్తున్న సమయంలో తెలంగాణ నినాదాలు మొదలు కావడంతో మాజీ ఎమ్మెల్సీ రెహమన్, ఇతర నేతలు ఆగ్రహంతో దాడికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఏసీపీ జోక్యం చేసుకుని మహేందర్ యాదవ్ ను అక్కడి నుండి పంపించారు. దీంతో తెలుగుతల్లి విగ్రహం వద్దకు వెళ్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని భావించి దానిని మానుకున్నారు. ఇక నగరంలో కూడా తెలంగాణ వాదులు నిరసన తెలుపుతారని పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

బలప్రదర్శనలా సాగిన జగన్‌ ప్రయాణం

  16 మాసాల తరువాత జైళు నుంచి బయటికి వచ్చిన జగన్‌ తొలి అడుగు నుంచే తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. 23 సాయంత్రం బెయిల్‌ ఇస్తున్నట్టుగా కోర్టు ప్రకటించిన దగ్గరనుంచి హడావిడి ప్రాంభించిన జగన్‌ వర్గం నిన్న ఉదయం నుంచి మరింత హడావిడి చేసింది. ఉదయం నుంచే చంచల్‌గూడ జైళు దగ్గర గుమికూడిన జగన్‌ పార్టీ కార్యకర్తలు రాజకీయ సభను తలపించారు. కార్యకర్తలతో పాటు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా జైళు వద్ద చేరి జగన్‌ రాకకోసం ఎదురు చూశారు. సాయంత్రం నాలుగంటల ప్రాంతంలో జగన్‌ అభిమానలకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ జైళు నుంచి బయటికి వచ్చారు. జగన్‌ జైళు నుంచి బయటి వచ్చిన దగ్గర నుంచే మొదలైంది అసలు కథ, ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి తీసుకోక పోయిన ప్రతి కూడలిలో అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తే జగన్‌ కాన్వాయ్‌ ఊరేగింపులా సాగింది. సాయంత్ర వేల కావడంతో ప్రతి చోట భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అయితే ప్రదర్శనకు అనుమతి లేకపోయినా ఎక్కడ పోలీసులు జగన్‌ కాన్వాయ్‌ని త్వరగా తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా బలప్రదర్శనకు సహకరించారు. ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఖైరాతాబాధ్‌ చేరుకున్న జగన్‌ కాన్వాయ్‌ ట్రాఫిక్‌కు మరింత ఆటంకం కలింగించింది. దీంతో పంజాగుట్టలో వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూల మాల వేయలన్న జగన్‌ను వారించి తాజ్‌కృష్ణ మీదుగా లోటస్‌పాండ్‌ తరలించారు.

ఢిల్లీ లో సమైక్యపోరాటం

  సచివాలయ సీమాంద్ర ఉద్యోగులు ఢిల్లీ వెళ్లనున్నారు. తమ ఆకాంక్షను అధిష్టానానికి తెలియ జేయటానికి నాలుగు రోజుల పాటు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను విరమించుకోవాలని వారు కేంద్రాన్ని కోరనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26 న కొవ్వత్తుల ప్రదర్శన, 27న జంతర్‌ మంతర్‌ వద్ద దర్నా జరుపుతారు. తరువాత పలువురు జాతీయ నేతలతో సమావేశమయి రాష్ట్ర విభజన వల్ల తమ ప్రాంతానికి కలిగే అన్యాయాలను వివరించనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన సచివాల సీమాంద్ర ఉద్యోగలు ఫోరం చైర్మన్‌ మురళీ కృష్ణ, ఇప్పటికి వారి ఢిల్లీ పర్యటనకు సంభందించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

ఎవరూ జైలులో ఉండాలని కాంగ్రెస్ కోరుకోదు: చాకో

   బెయిలుపై విడుదల అయిన జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంత వరకు ఇంటికి కూడా చేరుకోలేదు. కానీ  కాంగ్రెస్స్ పార్టీలో అప్పుడే ప్రతిస్పందనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎవరూ జైలులో ఉండాలని కోరుకోదని అన్నారు.   "ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది గనుక అప్పటిలోగా తేలాల్సిన వ్యవహారాలు చాలానే ఉన్నాయి. అందువలన పొత్తుల గురించి ఇప్పటి నుండే మాట్లాడటం అనవసరం. జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యాడు. అతనిని ఆ సంతోషం పూర్తిగా అనుభవించనీయండి. అతని విడుదలపై వస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధము లేదు,” అని అన్నారు.   దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మేలే కోరుకొంటున్నదని, అదేవిధంగా పొత్తులకి అవకాశం కూడా ఉందని స్పష్టం అవుతోంది. అలా కాకుంటే పొత్తుల ప్రసక్తే లేదని ఆయన ఖరాఖండిగా చెప్పేవారు. కాంగ్రెస్-వైకాపాలు ఇప్పటికిప్పుడు పొత్తుల గురించి మాట్లాడకపోయినా ఎన్నికలు దగ్గరపడేలోగా అందుకు తగిన సానుకూల వాతావరణం కల్పించుకోవచ్చును.

ప్రజాప్రతినిధులకు జైలు నుండి ఎన్నికలలో పోటీ సౌలభ్యం

  క్రిమినల్ కేసుల్లో అరెస్టయిన ప్రజాప్రతినిధులు జైలు నుండి ఎన్నికలలో పాల్గొనడానికి వీలులేదని సుప్రీంకోర్టు జూలై 10న చెప్పిన తీర్పుతో రాజకీయ నేతలలో కలకలం మొదలయింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కోర్టు తీర్పును తప్పు పట్టాయి. కోర్టు తీర్పును రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక బిల్లును సెప్టెంబర్ 6న పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ రోజు దానిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలుపుతూ సంతకం చేసారు. అందువల్ల యంపీలు, యం.యల్యే.లు క్రిమినల్ కేసులో జైలుకి వెళ్ళినా దర్జాగా జైలు నుండే ఎన్నికలలో పోటీ చేసుకోవచ్చును.

జగన్ రిలీజ్: ఇంటి నుంచే..

      485 రోజుల సుధీర్ఘ జైలు జీవితం తరువాత విడుదలయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు విధించిన షరతుల మేరకు హైదరాబాద్ లోని ఇళ్లు, పార్టీ కార్యాలయం నుండి కార్యక్రమాలు వేగవంతం చేస్తారని తెలుస్తోంది. జగన్ రాకతో తమకు ఇబ్బంది తప్పిందని, విధిలేని పరిస్థితుల్లోనే తాము ఇంటి నుండి బయటకు రావాల్సి వచ్చిందని వైఎస్ విజయమ్మ అన్నారు.     గత ఏడాదికి పైగా ఇబ్బందుల్లో ఉన్న పార్టీని మరింత ఉదృతంగా ముందుకు తీసుకుకెళ్లేందుకు జగన్ హైదరాబాద్ నుండి నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. రేపు ఉదయం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ నేతలతో సమావేశం అవుతారని సమాచారం. ఎన్నికలకు ఎంతో దూరం లేని నేపథ్యంలో ఇక సమయాన్ని వృదా చేయడానికి సిద్దంగా లేరని అంటున్నారు.