వైసిపిలోకి కొనసాగుతున్న వలసలు

  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌పై విడుదల అయిన దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు అధికార ప్రతిపక్ష పార్టీలతో పొసగక అసమ్మతి వర్గంగా ముద్రపడిన నాయకులు వైసిపి తీర్ధం పుచ్చకోవటానికి రెడీ అవుతున్నారు. ప్రస్థుత రాజకీయాల్లో విజయావకాశాలతో పాటు బలమైన నేతగా పేరున్న జగన్‌ పార్టీలో చేరడానికి ఎక్కువ మంది నాయకులు సుముఖంగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా మంది నాయకులు జగన్‌ పార్టీలో చేరగా తాజా కాంగ్రెస్‌ పార్టీ ఎంపి ఎస్‌పివై రెడ్డి జగన్‌ పంచన చేరారు. వీరితో పాటు సిబిఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ధర్మాన కూడా జగన్‌ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే కేసులులో చాలా రోజులుగా జైళ్లో ఉండి ఇటీవలే బయటికి వచ్చిన మోపిదేవి వెంకటరమణ కూడా వైసిపిలో చేరడానికి పావులు కదుపుతున్నారు. ఇక ఇటీవల రాజీనామ చేసిన మంత్రి విశ్వరూప్‌తో పాటు, రాజీనామలకు సిద్దమయిన ఎంపిలు సాయిప్రతాప్‌, అనంత వెంకటరామిరెడ్డిలు కూడా జగన్‌తో జతకట్టాలనుకుంటున్నారు. ప్రస్థుతం ఉన్న పరిస్థిత్తుల్లో సమైక్యాంద్ర కోసం బలంగా పోరాడుతున్న పార్టీ వైసిపి క్రెడిట్‌ సాధించటంతో పాటు అర్ధబలంగా కూడా బాగా ఉన్న జగన్‌ పంచన ఉంటే రాబోయే ఎలక్షన్స్‌లో ఈజీగా గట్టెక్కేయోచ్చని భావిస్తున్నారు చాలా మంది నేతలు. ఇది ఇలాగే కొనసాగితే మరింద మంది నాయకులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

టిడిపికి కాపుల అండ

  కేంద్రం తెలంగాణ ప్రకటించిన తరువాత అన్ని పార్టీల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు అధికార పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని భావించిన నేతలు కేంద్ర ఏమాత్రం వెనక్కి తగ్గకపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా కాపు సామాజికి వర్గానికి చెందిన చాలా మంది నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే పలువురు నేతలు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి సంకేతాలు పంపగా, మరి కొంత మంది అదే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన కాపులు, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటంతో డైలామాలో పడ్డారు. అయితే ఇప్పుడు సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నేపధ్యంలో కొందరు నేతలు తమ భవిష్యత్ ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా కోస్తా, రాయల సీమలలో స్థానిక రాజకీయాల్లో బలంగా ఉన్న కాపులు తెలుగుదేశంలో చేరే అవకాశా లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా చిరంజీవికి ప్రధాన అనుచరులలో ఒకరైన మంత్రి గంటా శ్రీనివాసరావు తన మాతృ సంస్థ అయిన తెలుగుదేశం పార్టీలో చేరుతారని కొంతకాలంగా బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరనున్నరన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

విశ్వసనీయత జాగాలో వచ్చి చేరిన కొత్త పదం నిజాయితీ

  ఇంతకు ముందు వైకాపా ‘విశ్వసనీయత’కు పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడేది. కానీ తెలంగాణాలో జండా పీకేసినప్పటి నుండి దైర్యంగా ఆ పదం పలకలేకపోతోంది. దానికి బదులు ఇప్పుడు కొత్తగా ‘నిజాయితీ’ అనే పదం అందుకొంది. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలని చెపుతున్నజగన్, కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తరువాత ఆయన పార్టీ అన్ని రంగులు ఎందుకు మార్చిందో, ఆ క్రమంలో తెలంగాణా ప్రజలను, కొండా సురేఖ వంటి తన పార్టీ నేతలను నిర్దాక్షిణ్యంగా ఎందుకు వదిలించుకొందో మరిచిపోయినట్లున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నప్పుడు ఆయన పార్టీ అంత హటాత్తుగా తెలంగాణాను ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చిందో చెప్పాల్సి ఉంది.   అదే విధంగా, ఇంతవరకు ఆయనకు, ఆయన పార్టీకి అండగా నిలిచిన కాంగ్రెస్ యంపీ సబ్బం హరిని, కనీసం పిలిచి సంజాయిషీ అయినా కోరకుండా, మీడియా ద్వారానే ‘అతనికి మాకు సంభందం లేదని’ చెప్పి వదిలించుకోవడం ఎటువంటి నిజాయితీ? పైగా అంత నమ్మకస్తుడిగా పనిచేసిన సబ్బం హరికి వైకాపా చివరిగా ఇచ్చిన బహుమానం ఏమిటంటే ‘కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగస్తుడనే ముద్ర.’ దీనిని ఎటువంటి రాజకీయం అనాలి?   జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా సమైక్యాంధ్ర గురించి పోరాడితే ఎవరు తప్పపట్టారు. ఇతర పార్టీలతో ప్రమేయం లేకుండా తన పోరాటమేదో తను చేసుకొంటే నచ్చిన వారు వచ్చి కలుస్తారు. నచ్చని వారు దూరంగా ఉంటారు. కానీ ఆ పేరుతో సీమాంద్రాలో పార్టీని బలపరచుకోవడం, ఆ మిషతో తన ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బతీయాలనుకోవడం గర్హనీయం.   ఒకవేళ ఆయనకున్నంత ‘నిజాయితీ’ ఈ రాష్ట్రంలో మరెవరికీ లేదని ప్రజలు భావిస్తే, వారే ఇతర పార్టీలకు, నేతలకు తగిన గుణపాఠం చెపుతారు. ఆ శ్రమ ఆయనెందుకు తీసుకోవడం? ముందు తన నిజాయితీ ఏమిటో నిరూపించుకొంటే చాలు కదా?

హైదరాబాదులో వైకాపా సమైక్యశంఖారవం సభ త్వరలో

  ఈ రోజు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన శాసనసభ్యులతో కలిసి గవర్నర్ నరసింహన్ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు గాను శాసనసభను సమావేశపరచమని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “కాంగ్రెస్ అధిష్టానం విభజనకు అంతా సిద్దం చేసి, టీ-నోట్ ను శాసనసభ అమోదానికి పంపినప్పుడు, శాసనసభ దానిని వ్యతిరేఖించినా దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. అదే ఇప్పుడే శాసనసభను సమావేశపరచి రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి కేంద్రానికి ముందే ఆ తీర్మానాన్ని పంపినట్లయితే అప్పుడు కేంద్రం కూడా పునరాలోచించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వైకాపా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని లేఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా తెదేపా, కాంగ్రెస్ పార్టీలు కూడా లేఖలు ఇచ్చినట్లయితే తప్పకుండా రాష్ట్ర విభజన నిలిచిపోతుంది. మా పార్టీ వచ్చేఅక్టోబర్ 15-20 తేదీల మధ్య హైదరాబాదులో సమైక్యశంఖారవం పేరిట ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది,” అన్నారు.  

లాలూకి మరిక గడ్డి మేసే అవకాశం దక్కదా

  కాంగ్రెస్ నేతృత్వంలో సాగుతున్న యూపీఏ ప్రభుత్వం క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను వెనకేసుకు వస్తూ చేసిన చట్ట సవరణను తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శలు చేసిన రెండు మూడు రోజులలోపునే, పశువుల దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ని దోషిగా నిర్దారిస్తూ సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.   బీహార్ ముఖ్యమంత్రి పుణ్యమాని రాష్ట్రంలో అధికారానికి దూరంగా బ్రతకవలసివస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ కి ఇప్పుడు రాహుల్ గాంధీ విమర్శల కారణంగా యుపీఏ ప్రభుత్వం తను చేసిన చట్ట సవరణను రద్దు చేసినట్లయితే, 2014 ఎన్నికలలోకూడా పోటీ చేసే అవకాశం ఉండదు. ఆలూ (బంగాళా దుంపలు) ఉన్నంత కాలం లాలూయే బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని స్వయంగా శలవిచ్చిన లాలూ ఇప్పుడు కటకటాలు పాలవడమే గాక, రాహుల్ పుణ్యమాని ఇక ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోల్పోతే, మరి ఎన్నటికీ గడ్డిమేసే అవకాశం కూడా ఉండదేమో.   బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ మరియు జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్దారించడంతో ఇరువురిని పోలీసులు అరెస్ట్ చేసి రాంచీలోని  జైలుకి తరలించారు. అక్టోబర్ 3న వారికి కోర్టు శిక్షలు ఖరారు చేస్తుంది.

జగన్ పార్టీలోకి ఆదినారాయణ రెడ్డి

      కడప జిల్లా జమ్మలమడుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సోమవారం ఆదినారాయణరెడ్డి జగన్‌ను కలిశారు. భేటీ ముగిశాక మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు చెప్పారు. ఆదినారాయణ రెడ్డి జగన్ కు మొదటి నుంచి జగన్ కు మద్దతుగానే ఉన్నారు. ఐతే జగన్ జైలుకెళ్లిన కార్యక్రమంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ కు దూరంగా ఉన్నారు. జగన్ బయటికి రావడంతో మళ్లీ ఆయన చెంతకు చేరారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

జగన్ బెయిల్ ఆంక్షలు సడలించవద్దు

      ఇడుపుల పాయకు, గుంటూరుకు వెళ్లేందుకు అనుమతివ్వాలన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం సాయంత్రం తీర్పివ్వనుంది. ఐతే జగన్ ను హైదరాబాదు విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. హైదరాబాదు విడిచి వెళ్లరాదనే షరతు నుంచి జగన్‌కు మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది. ఆయన నగరాన్ని విడిచి వెళితే జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సిబిఐ పిటిషన్‌లో పేర్కొంది. 16 నెలల జైలు వాసం తర్వాత వారం క్రితం జగన్ బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు వెళ్లడానికి అనుమతించాలని జగన్ కోర్టును కోరారు. దీంతో పాటు గుంటూరుకు కూడా వెళ్లేందుకు అనుమతించాలన్నారు.

జగన్ కు బెయిల్ రాజకీయ సమీకరణాల రహస్యం?!

        దుర్యోధనుడికి ధర్మం ఏమిటో తెలుసుకాని ఆ వైపు అతడి మనస్సు పోదట, అలాగే అతడికి అధర్మం ఏమిటో కూడా తెలుసుగాని దానినుంచి (ఆధర్మం నుంచి) అతనికి మనసు మళ్ళదట! అలాగే కొందరు రాజకీయ నాయకులూ, వారి అవకాశవాద పక్షాలూ తీరుతెన్నులు కూడా అలాగే ఉన్నాయి. వై.ఎస్.ఆర్. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం దాని ప్రభుత్వంచే పెట్టించిన నానారకాల కేసుల సందర్భంగా గత 16 మాసాలుగా జైలులో నిర్బంధం అనంతరం బెయిల్ పైన షరతులతో విడుదలైన తరువాత ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యపై ఇంతకాలం ఆకుకు అందకుండా పోకకు పొందకుండా ప్రకటనలు చేస్తున్న వివిధ రాజకీయ పక్షాల మధ్య సమీకరణల తతంగం ప్రారంభమైంది. ఇది జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయ్యేదాకా ఈ పక్షాలు అనుసరించిన తీరువేరు, గగ్గోలు పెట్టిన పరిస్థితి వేరు. కాగా, అతడి విడుదల తర్వాత ఇవే రాజకీయపక్షాల మధ్య ఆదరాబాదరా ఆఘమేఘాల మీద సాగుతున్న సమీకరణలు వేరు! విచిత్రమేమంటే - అటు కాంగ్రెస్ వర్గాలలోనూ, ఇటు కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న కొన్ని రాజకీయపక్షాలలోనూ జగన్ విడుదల తర్వాత సాగుతున్న మల్లగుల్లాలు ఇంతకూ ఈ పక్షాల కేంద్రీకరణ రాష్ట్ర విభజన సమస్యపైనా లేక జగన్ విడుదలవల్ల అతడి విడుదలవల్ల తమకు జరగబోయే లాభనష్టాలపైననా అన్నది ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.   రాష్ట్ర విభజన సమస్యపై వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ వచ్చిన విధానం, దానిపై అతని విడుదలకు చాలాకాలం ముందు చేసిన ప్రకటనకూ, విడుదలకు ముందు కొలదిరోజుల క్రితం తీసుకున్న వైఖరికీ తేడా ఉందని కొన్ని ప్రతిపక్షాల నాయకులు భావించి, 'అదిగో చూశారా జగన్ విడుదల కోసమే అధికార కాంగ్రెసూ జగన్ పార్టీ మధ్యలో లోపాయికారీ ఒప్పందం కుదిరంద'నీ విడుదల కోసమే జగన్ పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలిపి, 'రాష్ట్రప్రజల్ని మోసగించింద'నీ ప్రధాన ప్రతిపక్షమైన "తెలుగుదేశం'' పార్టీ నాయకులు కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు; వీరికి అండగా ఉన్న రెండు 'టీవీ'లూ, రెండు మూడు దినపత్రికలూ ఊహాజనితమైన కథనాలను జగన్ బెయిల్ పై విడుదలైన క్షణం నుంచీ ప్రచురణలూ, ప్రసారాలూ మొదలెట్టాయి. "గురివింద గింజ తన ముడ్డికింద నలుపు'' తెలియదట. కాని, ఈ కథనాలకు దిగిన కొందరు నాయకులూ, వారి ప్రచార యంత్ర్రాంగాలూ ఎందుకింత తొందరబాటుతో ముందుకు వచ్చి ఉంటాయి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు తనపైన ఉన్న స్పష్టమైన కనీసం మూడు కేసులలో తీవ్ర అభిగాలను కోర్టులలో ఎదుర్కోనవలసి వచ్చింది [ఐ.ఎం.జి., ఎమ్మార్, రహేజా, డెల్ఫ్ సంస్థలకు చెందిన లావాదేవీల్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కుదిరిన ఒప్పందాలలో]! అతని ముఖ్యమంత్రిత్వం ముగిసిన తరువాత, రాజశేఖరరెడ్డి పరిపాలనకు వచ్చిన అనంతరం కోర్టుల పరధిలోకి వెళ్ళిన కేసులవి. అందులో ఒకటి [ఈ వ్యాస రచయిత] ఐ.ఎం.జీ. సంస్థతో చంద్రబాబు నడిపిన లావాదేవీల తాలూకు భూముల కేటాయింపునకు సంబంధించిన కేసు! పైన తెల్పిన కేసులేవీ ఈ రోజుకీ ఒక కొలిక్కి రాలేదు.   పైగా ఏ కోనేరు ప్రసాదుకు సంబంధం ఉన్నదన్న ఆరోపణపైన ఆ ఎమ్మార్ కేసు గృహనిర్మాణ సంస్థ విషయంలో కూడా జగన్ అనుచరుడెవరికో సంబంధం ఉన్నదని, అతణ్ణీ అందులోకి లాగారు! కోనేరుతో పాటు అతడూ అభియోగాల సందర్భంగా సిబీఐ విచారణలోకి వెళ్ళాడు! తీరా చూస్తే, ఎమ్మార్ తో తనకేమీ సంబంధంలేదని చెబుతూ వచ్చిన చంద్రబాబుకు ఎమ్మార్ తో పూర్తి సంబంధం ఉన్నట్టు నిందితుడు అయిన కోనేరు స్పష్టంగా ప్రకటించడంతో కేసు ఇంకో రూపం తీసుకుంది; అలాగే ఐ.ఎం.జి. తాలూకు కేసుకూడా రాష్ట్ర హైకోర్టు ముందు ఉంటూ, పూర్తి విచారణకు రాకపోతున్న పరిస్థితుల్లో అందుకు సంబంధించి జగన్ తల్లి విజయమ్మ కూడా సుప్రీమ్ కోర్టును ఆశ్రయించగా ముందు కింది కోర్టులో చట్టం ప్రకారం తేల్చుకుని అప్పుడు సుప్రీమ్ ను ఆశ్రయించమని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది! అయినా కింది కోర్టు ఆవరణ నుంచి అదీ కదలడం లేదు. ఇలా తనపైకి దూసుకు వచ్చిన కేసులనుంచి బయటపడాలంటే ఎలాంటి చిట్కా అవసరమో చంద్రబాబుకి తెలుసు! సరాసరి కేంద్రప్రభుత్వ 'పెద్దల'తో [అంటే, మానిప్యులేటర్స్] లాలూచీపడి, ఈ కేసులనుంచి తనకు విముక్తి కలిగించే పక్షంలో రాష్ట్ర విభజన సమస్యపై కేంద్ర ప్రతిపాదనకు తాను మద్దతుగా నిలుస్తానని హామీపడి వచ్చినట్టు ఆనాడే వార్తలు పొక్కాయి! సరిగ్గా అందుకు అనుగుణంగానే రాష్ట్రవిభజనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం స్థాయిలో చేసిన తీర్మానానికి చంద్రబాబు (తెలుగుదేశం)ఆమోదం తెలుపుతూ కొన్ని ఇతర పక్షాలతో పాటు లేఖ రాసిచ్చారు! విభజన విషయంలో కాంగ్రెస్ ఎంత 'చావుతెలివి'తో వ్యవహరించిందంటే ఏ దేశంలోనైనా పాలకపార్టీ స్థాయిలో సమస్యలపై చేసే నిర్ణయాలను ముందుగా ప్రకటించాకనే ఇతర ప్రతిపక్షాల అభిప్రాయాల్ని కోరడం పార్లమెంటరీ వ్యవస్థలో ఆనవాయితీ! కాని ఇక్కడ జరిగిన పని - రాష్ట్ర విభజన విషయంలో అసలు తానేమనుకుంటున్నదో, తన నిర్ణయమేమిటో తెల్పకుండా, "ముందు మీ అభిప్రాయాలు చెప్పండి'' అని ప్రతిపక్షాలను కోరి, వాటిని ఇబ్బందుల్లోకి నెట్టడం! "అవునేవ్! ఆ వచ్చేవాడు కామమ్మ మొగుడే అయి ఉండాల''ని వెనకటికొకావిడ అన్నాదో లేదో మిగతా వాళ్ళంతా "అవును, అతడు కామమ్మ మొగుడే, సందేహం లే''దని గొర్రెదాటుడు పద్ధతిలో అందరూ అలాగే 'బృందగానం' చేశారట! సరిగ్గా ఆ పద్ధతిలోనే కాంగ్రెస్ తాను రాష్ట్రవిభజన సమస్యను తన నెత్తిమీదికి ఎందుకు తెచ్చుకోవాలనుకుని, రాష్ట్రంలోని ఇరుప్రాంతాల ఓట్లు, సీట్లపైన కన్నువేసి, తానుగా బయటపడకుండా, తన నిర్ణయమేమిటో చెప్పకుండా, సీమాంధ్రనుంచి వచ్చి తెలంగాణా తెలుగుప్రజల మధ్యన ఒక కలుపుమొక్కలా తిష్టవేసి ఒక 'మల్టీనేషనల్ కుటుంబాన్ని' నడుపుతున్న 'బొబ్బిలిదొర' కె.సి.ఆర్. అనే ఊరసవెల్లితో మంతనాలాడి,  అన్ని ప్రతిపక్షాలనూ ముగ్గులోకి లాగింది. ఇంకేముంది, కొన్ని ప్రతిపక్షాల నాయకులు కాంగ్రెస్ బుట్టలో పడిపోయి దేనికదే తామెక్కడ అభాసుపాలైపోతామోనని భావించి కాంగ్రెస్ ప్రతిపాదనకన్నా ముందుగానే విభజన భావనకు సమ్మతించి వచ్చాయి! ప్రధాన ప్రతిపక్షంగా "దేశం'' అధినేత తలూపి, లేఖరాసి ఇచ్చివచ్చారు; కమ్యూనిస్టుసహా మిగతా కొన్ని పార్టీలూ అలాగే తలూపివచ్చాయి! సరిగ్గా ఈ క్రమంలోనే విభజన ప్రతిపాదనను ఆమోదించేదిలేదని మార్కిస్టు పార్టీ, "మిమ్'' (ఓవైసీ), వై.ఎస్.ఆర్.సి.పి.లు స్పష్టం చేశాయి. అయితే, నెలలు గడిచినకొద్దీ, విభజనపై రకరకాల ప్రకటనలను రోజుకో తీరుచొప్పున కాంగ్రెస్ విడుదల చేస్తూ 'విభజన' తప్పదేమోనన్న అనుమానాలను "టూమ్రీ''లుగా వదులుతూ తీవ్రస్థాయిలో అవకాశవాద పటిమను కాంగ్రెస్ అధిష్ఠానం, చాటుకొంటున్న దశలో, 'బొబ్బిలిదొర' ధనస్వామ్య బెదిరింపులతో, స్వార్థపూరిత అరాచక ప్రవర్తనతో సృష్టించిన అనిశ్చిత పరిస్థితుల్లో వై.ఎస్.ఆర్. పార్టీ మధ్యే మార్గంగా ఒక ప్రకటన చేసింది - "ఒకవేళ కాంగెస్ మొండిగా రాష్ట్ర విభజనను అనివార్యం చేసి, ముందడుగు వేస్తే'' కనీసం అన్ని ప్రాంతాల ప్రజలకూ "సమన్యాయం'' చేసి తీరాలని ప్రకటించింది! ఎప్పుడైతే కాంగ్రెస్ అవకాశవాదం ముదిరిపోయి విభజనకు అనుకూల 'సిగ్నల్స్' నిరంతరం వదులుతూ వచ్చిందో, దాని ప్రభావం వల్ల "సమైక్యరాష్ట్ర''వాదం నాయకులు లేకుండానే ఎ.పి.ఎన్.జి.వో.ల సమ్మె మహోధృతిలో ముందుగా సాగానారంభించిందో ఆ క్షణమే వై.ఎస్.ఆర్.సి.పి. "సమన్యాయ సూత్రా''న్ని కూడా తుంగలో తొక్కి పూర్తిగా సమైక్యరాష్ట్రమే అన్ని ప్రాంతాల అభివృద్ధికీ శరణ్యమని భావించి, స్పష్టమైన నిర్ణయం తీసుకుంది; ఈ నిర్ణయాన్ని వై.ఎస్.ఆర్. (జగన్) పార్టీ ప్రకటించే నాటికి జగన్ కు బెయిల్ ప్రసక్తే రంగంలోకి రాలేదు! ఎటు తిరిగీ సీమాంధ్రయావత్తూ చుక్కాని పట్టే రాజకీయనాయకుడు లేకపోయినా ఉద్యోగ, రైతు, మహిళా, కార్మిక, విద్యారంగాలకు చెందిన వారంతా బహుళ సంఖ్యలో రోజుల తరబడి, మైళ్ళకొలదీ సమ్మెయాత్రలు చేస్తున్న తరువాతనే, విభజనను వ్యతిరేకిస్తూ స్పష్టమైన ప్రకటనతో జగన్ పార్టీ బేషరతుగా ముందుకు రావటం, జగన్ మరికొన్నేళ్ళు జైలులోనే ఉంటే బాగుంటుందని కొన్ని పక్షాలు [టి.డి.పి., బి.జె.పి., కమ్యూనిస్టు పార్టీ, కొన్ని చుల్లర పార్టీలూ] భావిస్తున్న తరుణంలో జగన్ బెయిల్ మీద షరతులతో విడుదలయ్యాడు! ఈ పరిణామాన్ని ఈ పక్షాలు సహించలేక జగన్ బెయిల్ కు తప్పుడు భాష్యాలు చెప్పడం ప్రారంభించారు! వాటిల్లో కొన్ని -కేసులనుంచి బయటపడడం కోసం కాంగ్రెస్ తో చేతులు కలిపిన టి.డి.పి., రేపు రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీ తమకు ఒక 'శని'గా దాపురించిందని భావిస్తున్న కొన్ని ఇతర నామమాత్రపు ప్రతిపక్షాలు గతపదేళ్లలో ఏ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో పట్టుమని డజను అసెంబ్లీ స్థానాలు కూడా గెలవలేని బిజెపి, కమ్యూనిస్టు పార్టీలు, కాసేపు కాంగ్రెస్ తో, మరికొంతసేపు టి.డి.పి.తోనూ ఇచ్చకాలాడి, తెలుగుజాతిని చీల్చడం కోసం కేవలం ద్వేషపూరిత ప్రచారాలతో మన తెలంగాణా ప్రాంతపు యువకులైన సొంతబిడ్డల్ని ఆత్మహత్యలవైపు పురిగొల్పి వాటినుంచి తన కుటుంబాన్ని మినహాయించుకున్న బొబ్బిలిదొర పార్టీ టి.ఆర్.ఎస్; ఏ తెలుగుజాతిని సమైక్యంగా ఒక్క గొడుగు కిందికి చేర్చి విశాలాంధ్ర ఏర్పాటుకు పునాదులు లేపి, దోహదం చేసిందో, ఏ దొరల, భూస్వామ్య, జాగిర్దారీ వర్గాల చెరనుంచి బడుగుబలహీన వర్గాల అండతో తెలంగాణా రైతాంగ సాయుధపోరాటానికి నాయకత్వం వహించి ఇప్పుడు తెలుగుజాతిని చీల్చడానికి వెనుదీయని కమ్యూనిస్టుపార్టీ, అదే పోరాటంలో ఎప్పుడో ఒకప్పుడు పాలుపంచుకుని తర్వాత అదే తానునుంచి లెక్కకు మించిపోయిన చిల్లరశాఖలు కొన్నీ!   ఇక కాంగ్రెస్ లో నాయకులు, వారి మంత్రులు, వారి శాసనకర్తలు ఎందరో పనికిమాలిన 'మహానుభావులు'! వీళ్ళూ రాష్ట్ర 'విభజన'అనే ముసుగును తగిలించుకుంటూనే "సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోనికి తీసుకోవాల''ని అధిష్ఠానానికి చెప్పినట్టు నటిస్తూనే, జగన్ పార్టీ రేపు ఎన్నికల్లో ప్రజాభిమానంతో దూసుకు రాకుండా అడ్డుకట్టలు వేయడం కోసమని "జగన్ కి బెయిల్ మంజూరు కావడంపైన ప్రజల మనస్సులుకొన్ని అనుమాలున్నాయం'టూ తీగలు తీస్తున్నారు! "ప్రజల'', "ప్రజాభిమానం'' అన్న మాటలు, ముసుగులూ రాజకీయపక్షాలకు ప్రత్యేక తొడుగులని మాత్రమేనని ఇంతకుముందు గ్రహించకపోయిన ప్రజలకు రాష్ట్ర విభజన ప్రతిపాదన వచ్చిన తరువాత తెలిసిపోయింది! అంటే, అంత పెద్దఎత్తున 60రోజులుగా రాష్ట్రవిభజన ప్రతిపాదనను తిరస్కరిస్తూ సాగుతున్న అంతటి రాజకీయేతర ఉద్యమాన్ని ఎలా నట్టేటముంచడం ద్వారా తమ పదవులను, హోదాలనో రక్షించుకునే దశలో ఈ 'గందోళీ' నాయకులు ఉన్నారు.   మరొక వేర్పాటు వాదనాయకుడు సీమాంధ్రకు రూ.400-500 కోట్ల ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించిన మరుక్షణంలో "అయితే, అదే దామాశాలో ఇంతకాలం 'సమైక్యరాష్ట్రంలో' బాధలు పడిన ప్రాంతానికి కూడా అంతా, లేదా అంతకుమించిన ప్యాకేజీ రావాల్సి ఉంటుందని'' ప్రకటించడం ద్వారా కేంద్రంలో ఆ పార్టీని రద్దుచేసి, కాంగ్రెస్ లో కలిసిపోతానని మాటిచ్చివచ్చిన బొబ్బిలిదొర చేసిన ప్రకటన కొత్త అర్థాన్ని సంతరించుకుంది. అంటే, ఇంతకుముందెన్నడూ అతని నోటనుంచి రాని "ప్యాకేజీ'' భాషను ఆ పార్టీ క్యాడర్  బుర్రల్లోకి ఎక్కించి, తన పార్టీని క్రమంగా రాద్దుచేసుకొని, దశాదిశాలేకుండా ప్రారంభించిన స్వార్థపూరిత 'ఉద్యమాన్ని' నట్టేట ముంచడానికి సిద్ధమయ్యాడని స్పష్టమవుతోంది! వెనక కె.వి.రంగారెడ్డి, డా. చెన్నారెడ్డి వర్గాలు ఎలా యువత ప్రాణాలను వందలసంఖ్యలో తోడుకున్నారో, రేపూ ఈ 'బొబ్బిలిదొర'వల్ల జరగబోతున్నదీ అదే ప్రహాసనమని అర్థం చేసుకోవాలి!   ఇక బిజెపి వైఖరి "నేను అధికారంలోకి వస్తే రాష్టాన్ని విభజిస్తానని చెప్పి'' ఏళ్ళూ వూళ్ళూ గడిచినా కేంద్రంలో దాని ప్రభుత్వం వెలగబెట్టినన్నాళ్ళూ అందుకు ధైర్యం చేయలేక,ఆ వాదనను ఆనాడు "చంద్రబాబే విభజన వద్దన్నాడని'' చెప్పి తప్పించుకొంటూ వచ్చింది; ఇక ఇప్పుడేం చేస్తోందంటే "రేపు విభజన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే, ఆ బిల్లులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించుకునిగాని ఏ నిర్ణయానికీ రాము'' అని ప్రచారం చేసుకొంటోంది' ఈలోగా ప్రదానమంత్రిత్వ పదవిపైన ఆశలు పెంచుకుంటున్న బిజెపి అభ్యర్థి, 2000 మంది మైనారిటీలను ఊచకోతకు వెరవని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ సభ అనంతరం చేసిన ప్రకటనలో "విభజన ప్రతిపాదనను కాంగ్రెస్ తొందరపడి చేసింద''ని విమర్శించడం ద్వారా ఆ పార్టీ నిర్ణయంలో స్పష్టత పూర్తిగా కొరవడింది! పైగా బిజెపితో పొత్తుకోసం మరోసారి తహతహలాడుతున్న చంద్రబాబుతో పొత్తు ప్రమాదకరమని, తొందరపడవద్దనీ, బిజెపిని నడిపించే దాని మతపరమైన బ్రాండ్ "ఆర్.ఎస్.ఎస్.'' రెండురోజులనాడు హెచ్చరించిందని మరవరాదు! అయినా, విభజనకు సానుకూలంగా లేఖలు ఇచ్చి, సంకెళ్ళు తొడుక్కున్న రాజేకీయ ప్రతిపక్షాలు - వై.ఎస్.ఆర్. (జగన్) పార్టీలాగా 'సమన్యాయ' సిద్ధాంతాన్నీ విడిచిపెడుతూ లేఖలను ఉపసంహరించుకుని, సమన్యాయానికి ఇంట్లోనే పోరాడాలన్నా, దాన్ని సాధించుకోవాలన్నా అందుకు మార్గం "సమైక్య ఆంధ్రప్రదేశ్'' ఉనికి మాత్రమేగాని, తెలుగువారు "విడిపోయి వికాసం సాధించుదా''మనే నెగెటివ్ నినాదం మాత్రం కాదు, కానేకాదు! ఈ పార్టీలకు తెలుగుజాతిని చీల్చే కుట్రను అడ్డుకోవడానికి ఒకే ఒక్క మార్గం - రాజ్యాంగం శాసిస్తున్నట్టు రాష్ట శాసనసభలో విభజనకు వ్యతిరేకంగానూ ఆంద్రప్రదేశ్ యథాతథంగా విభక రాష్ట్రంగానే ఉండాలని ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించడం అన్ని పార్టీల బాధ్యత! లేదా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ సహా అన్ని పక్షాలూ ప్రజలనుంచి దూరమైపోతాయి.

అధిష్టానం దెబ్బకు సీమంధ్ర కాంగ్రెస్ నేతలు విలవిలా

  తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం తన టీ-కాంగ్రెస్ నేతల రాజకీయ జీవితాలతో చెలగాటమాడుకొంది. ఇప్పుడు తన సీమాంధ్ర నేతల రాజకీయ జీవితాలతో ఆడుకొంటోంది. ఒక రాజకీయ పార్టీ ఎదుట పార్టీ నేతలని దెబ్బతీయడానికి ప్రయత్నించడం సహజమే అయినప్పటికీ, ఇలా స్వంత పార్టీ నేతలనే దెబ్బతీయాలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత రెండు మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నతమను కాదని, ఇంతకాలం తనను ఎవరయితే సవాలు చేస్తున్నారో, ఎవరిపై కేసులు మోపి జైలులో నిర్భందించిందో వారికోసమే పార్టీని, నేతలని పణంగా పెట్టాలనుకోవడం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయంతో సగం చచ్చి ఉన్నతమకు, విభజన ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లేందుకు అదే జగన్మోహన్ రెడ్డి సాయం తీసుకొని స్వంత ప్రభుత్వమే కూల్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వైఖరితో వారు నివ్వెర పోయారు. హర్షకుమార్, లగడపాటి, సాయి ప్రతాప్ వంటి నిఖార్సయిన కాంగ్రెస్ నేతలందరూ దీనిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. ఈ పరిణామాలతో కలత చెందిన అనేక మంది ఇప్పుడు తాము ఏ పార్టీని ఆశ్రయించాలో తెలియక విలవిలలాడుతున్నారు.   కాంగ్రెస్ పార్టీ బీసీ, యస్సీ,ఎస్టీ, మైనార్టీ ఓట్ల మీదే ప్రధానంగా ఆధారపడినప్పటికీ, ఆ పార్టీలో ఆధిపత్యం మాత్రం రెడ్డి మరియు కాపు కులస్తుల చేతుల్లోనే ఉందనేది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ ఆడుతున్న ఈ రాజకీయ జూదంలో బలమయిన ఆ రెండు వర్గాల నేతలు తాము ఓడిపోయామనే భావనలో ఉన్నారు. అందువల్ల రెడ్డి కులస్తులు కొందరు వైకాపా గూటికి చేరుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, కాపు కులస్తులు మాత్రం తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇక మిగిలిన వారు కొత్త పార్టీ పెట్టడం గురించి ఆలోచనలు చేస్తున్నారు.   అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి ఎంత మాత్రం భయపడటం లేదు. కారణం తమ పార్టీ నేతలలో ఎక్కువ మంది అంతిమంగా వైకాపా గూటికే చేరుకొంటారని దాని నమ్మకం. వైకాపా కూడా కాంగ్రెస్ చెట్టుకు మొలిచిన మరో కొమ్మే గనుక ఎన్నికల తరువాత వైకాపాతో మళ్ళీ అంటూ కట్టుకోవచ్చుననే దృడ (గుడ్డి)నమ్మకంతోనే కాంగ్రెస్ తన నేతలను వదులుకొనేందుకు సిద్దపడుతోంది. కానీ అది ఊహిస్తున్నట్లుగా రెడ్డి కులస్తులు అందరూ వైకాపాలోనే చేరెందుకు సిద్ధంగా లేరని సమాచారం.   అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనితో చేతులు కలపడం ఇష్టం లేక కొందరు, ఏ కాంగ్రెస్ పార్టీని కాదనుకొని తాము బయటకి వచ్చేమో మళ్ళీ భవిష్యత్తులో అదే కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం ఉన్నకారణంగా వైకాపాలో చేరేందుకు మరికొందరు ఇష్టపడటం లేదు. తెదేపా, వైకాపాలలో చేరలేని పరిస్థితుల్లో ఉన్న అటువంటి వారు తప్పనిసరిగా మరో రాజకీయపార్టీ పెట్టుకోక తప్పదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా సరిగ్గా అదే కోరుకొంటోంది. తెలుగుదేశం పార్టీని అధికారం చెప్పట్టకుండా నిలువరించేందుకు నేతలలో, ప్రజలలో కొంత గందరగోళం సృష్టించి ఓట్లు చీల్చడం ద్వారానే తను లాభపడాలని దురాశకు పోతోంది. కానీ కాంగ్రెస్ హస్తంలో గీతలను తెలుగు ప్రజలు గతంలో మార్చిన సంగతిని మరిచిపోతోంది.

బొత్స హడావుడి దేనికో

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్నిధిక్కరించి మరీ చేస్తున్న సమైక్యవాదనతో సీమంధ్రలో ఆయన రేటింగ్స్ అమాంతం పెరిగిపోవడంతో, అనేక మంది మంత్రులు కలవరపడుతున్నారు. తాము ఎంత ప్రయత్నించినా ప్రసన్నం చేసుకోలేని ఉద్యోగులను, ముఖ్యమంత్రి ఒకే ఒక మీడియా సమావేశం నిర్వహించి తన వైపుకి తిప్పుకొంటున్నరనే దుగ్ధ వారి మనసులో ఉంది. ఒకవైపు అధిష్టానం నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంటే, మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి తమ అందరినీ కలుపుకొని పోకుండా ఒంటరిగా తన సమైక్యవాదంతో తన ఇమేజ్ పెంచుకోవడం చాల మందికి జీర్ణం కావడం లేదు. అందుకే ఇటీవల కొందరు సీమంధ్ర మంత్రులు ప్రత్యేక సమావేశం అవడం, గవర్నర్ ను కలవడం వంటివి మొదలయ్యాయి.   ఎప్పటికయినా ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్నబొత్స సత్యనారాయణ, ఇంతకాలం ఏమిచేయాలో పాలుపోక చేతులు ముడుచుకొని కూర్చొన్నపటికీ, ఇంకా అలాగే కూర్చొంటే తన రాజకీయ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారుతుందని గ్రహించి రంగంలోకి దూకారు. ఇంతవరకు శాసన సభ్యులను రాజీనామాలు చేయవద్దని వారిస్తూ వచ్చిన ఆయనే స్వయంగా (కేవలం మంత్రి పదవికే) రాజీనామా చేసేసి, ప్రజలలో తన పొలిటికల్ రేటింగ్ పెంచుకోవాలని భావించారు. అయితే మళ్ళీ ఎందుకో మనసు మార్చుకొన్నట్లు సమాచారం.   అయితే ఏదో ఒక హడావుడి చేస్తే తప్ప మనుగడ కష్టమని గ్రహించిన ఆయన సోనియా గాంధీకి లేఖ వ్రాసి మీడియాను ఆకట్టుకొన్నారు. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని, కనుక “టీ-నోట్ క్యాబినెట్ సమావేశంలో ప్రవేశ పెట్టక మునుపే” అంటోనీ కమిటీని రాష్ట్ర పర్యటనకు పంపవలసిందిగా ఆయన తన లేఖలో సోనియమ్మను అభ్యర్దిoచారు. అంతే గాక నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో హాట్ లైన్లో మాట్లాడి ఆయనను సూత్రప్రాయంగా అంగీకరింపజేసినట్లు కూడా వార్తలకెక్కారు.   “టీ-నోట్ క్యాబినెట్ సమావేశంలో ప్రవేశ పెట్టక మునుపే” అనే షరతు లేదా విన్నపాన్నికాంగ్రెస్ అధిష్టానం గనుక మన్నిస్తే, ఆయన కూడా ‘రాష్ట్ర విభజనకు (ఆపలేకపోయినా) బ్రేకులేసిన హీరో’గా ప్రజల ముందుకు రాగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకొనే మిగిలిన మంత్రులు కూడా, తమ రాజకీయ మనుగడ కోసం ఎవరికి తోచిన మార్గాలను వారు అన్వేషించుకోక తప్పదు.

పాపం సబ్బం...

  వైజాగ్ మాజీ మేయర్ సబ్బం హరి కాంగ్రెస్ యంపీగా కొనసాగుతున్నపటికీ ఇంతకాలంగా వైకాపాకు మద్దతుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే అనేకమంది కాంగ్రెస్ నేతలు వైకాపాలో జేరినప్పటికీ, ఆయన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తరువాత వైకాపాలో చేరుతానని చెపుతూ ఇంత కాలంగా తన రెండు పడవల ప్రయాణం సాఫీగా లాగించేస్తున్నారు. కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిలుపై విడుదలయ్యి బయటకి వచ్చేసారు గనుక ఇక నేడో రేపో వైకాపాలో జేరవచ్చునని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన మళ్ళీ తన పాత పాటే పాడుతూ త్వరలో జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తరువాత వైకాపాలో చేరుతానని తాజాగా మరోమారు ప్రకటించారు.   అయితే, ఈ లోగా అత్యుత్సాహంతో తను ఇంకా కాంగ్రెస్ యంపీగానే కొనసాగుతున్నననే సంగతి మరిచిపోయి, తమ పార్టీ (వైకాపా) 2014ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే లేదా తర్డ్ ఫ్రంట్ కి మాత్రమే మద్దతు ఇస్తుందని ప్రకటించేశారు.   కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అవడం వలనే జగన్మోహన్ రెడ్డికి బెయిలు వచ్చిందని తెదేపా ఆరోపణలు చేస్తున్నఈ తరుణంలో సబ్బం హరి, ఇంకా వైకాపాలో చేరక ముందే వైకాపా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని ప్రకటించడంతో వైకాపా కంగు తింది. గతంలో విజయమ్మ, భారతి, షర్మిల ముగ్గురూ కూడా 2014ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే లేదా తర్డ్ ఫ్రంట్ కి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు అదే మాట సబ్బంహరి సమయం కాని సమయంలో ప్రకటించడంతో తెదేపా చేస్తున్న ఆరోపణలు నిజమేనని ఆయన ఋజువు చేసినట్లయింది. పైగా ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండటంతో అ రెండు పార్టీల మధ్య గట్టి బంధమే ఉన్నట్లు దృవీకరించినట్లయింది.   ఈ ప్రకటన చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తరువాత వైకాపాలో చేరుతానని సబ్బం హరి ప్రకటించడం వైకాపాకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. అందుకే ఆ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “సబ్బం హరి ఒక సీనియర్ రాజకీయనేత అని మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాల గౌరవం ఉండేది. కానీ మొన్నఆయన మాట్లాడిన మాటలతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బాధ పడ్డారు. సబ్బం హరి మాటలతో కానీ, ఆయనతో గానీ మా పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. ఆయన మా పార్టీ సభ్యుడు కూడా కాదు. ఒకవేళ ఆయన వచ్చి పార్టీలో చేరుతామన్నా మేము చేర్చుకోదలచుకోలేదు,” అని తెలిపారు.   ఇంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, జగన్ కి జై కొడుతూ, తన పార్టీ అధిష్టానాన్ని విమర్శించిన పాపానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతనిని పట్టించుకొనేవారు లేరు. పాపం అత్యుత్సాహానికి పోయి నోరు జారినందుకు ఇప్పుడు వైకాపా తలుపులు మూసుకు పోయాయి. రెంటికీ చెడిన రేవడి అంటే ఇదేనేమో. సబ్బం సంగతి ఎలా ఉన్నపటికీ, కుమ్మక్కు ఆరోపణలను ఎదుర్కోలేక అవస్థలు పడుతున్న వైకాపాకి సబ్బం హరి, పార్టీలో చేరకపోయినా పార్టీ పరువు మాత్రం తీసిపోయాడు.  

రాష్ట్రంలో సమైక్య, విభజన సభలు

  ఈ రోజు రాష్ట్రం ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని డిమాండ్ చేస్తూ 'సకల జన భేరి' సభ జరుగుతుంటే, మరో వైపు అదే సమయంలో, సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలులో ఎస్టీబీసీ కళాశాల మైదానంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్య ప్రజాగర్జన సభ జరుగుతోంది. ఇరు సభలు వారి వారి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పై హక్కులపై ఇరు సభలు బలమయిన వాదనలు వినిపించాయి.   ఇక టీ-సభలో ప్రసంగించిన కేసీఆర్ ఒక ఆసక్తికరమయిన సంగతిని ప్రకటించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవీకాలం మరో ఆరు రోజుల్లో(అక్టోబర్ 6) ముగియబోతోందని, అందుకు తనవద్ద ఖచ్చితమయిన సమాచారం ఉందని ప్రకటించారు. అదేవిధంగా రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ అద్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడవచ్చనే సంకేతమిస్తూ, ఒకవేళ యూపీయే ప్రభుత్వం ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేయకపోతే, తరువాత వచ్చే బీజేపీ రాష్ట్ర ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పడం మరో విశేషం.   ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానంతో ఎన్నికల పొత్తుల ఆలోచనలు చేస్తూనే కేసీఆర్ ఈవిధంగా మాట్లాడటం చూస్తే, ఆయన అవసరమయితే బీజేపీతో జతకట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని స్పష్టం జేస్తోంది. మరి బీజేపీ తెలుగుదేశం పార్టీతో జత కట్టే ఆలోచనలోఉందని తెలిసినప్పుడు, ఆయన ఈవిధంగా మాట్లాడటం విశేషమే. ఆయన ఈ సనదర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ఏర్పాటుకి పూర్తి మద్దతు ప్రకటించిన బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు.   ఈ సభలో ప్రసంగించిన కే.కేశవ్ రావు, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తగా, అంతకు ముందు ప్రసంగించిన బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి సుష్మ స్వరాజ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సభలో ప్రసంగించిన వక్తలు అందరు సహజంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి, ఆయనని వెంటనే పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేసారు.   ఇక సమైక్య సభలో మాట్లాడిన వక్తలందరూ హైదరాబాదుపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని గట్టిగా వాదించారు. విద్యుత్, ఉపాద్యాయ, సాగునీరు,ఆర్టీసీ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘనేతలు రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి ఎటువంటి సమస్యలు వస్తాయో వివరించారు.   వారు రాజకీయ పార్టీలన్నిటికి మరోమారు తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. రాజకీయాలు పక్కనబెట్టి ఇప్పటికయినా స్పష్టమయిన సమైక్యవాదంతో ముందుకు రానట్లయితే రానున్న ఎన్నికలలో గట్టిగా బుద్ధిచెపుతామని హెచ్చరించారు.   రెండు సభలలో కొట్టవచ్చినట్లు కనబడిన తేడా ఏమిటంటే, టీ-సభలో తెరాస, బీజేపీ, ఇతర తెలంగాణా ఫోరం నేతలందరూ పాల్గొనగా, సమైక్య సభలో రాజకీయపార్టీలన్నీ దూరంగా ఉన్నాయి. పైగా నేతలకీ, వారి పార్టీలకు ఉద్యోగులు తీవ్ర హెచ్చరికలు చేసారు. అయితే ఉద్యోగులు రాజకీయ నేతలను, పార్టీలను దూరం ఉంచినప్పటికీ, అన్ని ఉద్యోగ సంఘాల నేతలు తమ నేత అశోక్ బాబుకు విస్పష్టంగా తమ మద్దతు ప్రకటించడం ద్వారా పూర్తి ఐకమత్యం చూపుతూ, తమ పోరాటానికి రాజకీయ పార్టీల అండ అవసరం ఎంతమాత్రం లేదని స్పష్టం చేసారు.

20 ఎంపీ సీట్లు గెలిపిస్తాం: రాయపాటి

    రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం వెనుకడుగు వేయకపోయినా, కాంగ్రెస్‌ ఎంపిలు మాత్రం ఇంకా అధిష్టానం నిర్ణయం వెనక్కు తీసుకుంటుందన్న ఆశతోనే ఉన్నారు. 60 రోజులుగా సీమాంద్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నేపధ్యంలో గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు మరోసారి అదే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన రాజీనామా ఆలోచనలో ఉన్న బొత్సా వైఖరి పై కూడా స్పందిచారు. అందరిని రాజీనామా చేయోద్దని వారించిన బొత్సా ఇప్పుడు తాను ఎందుకు రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నారో అర్ధం కావటం లేదు అన్నారు. సీనియర్లను కాదని పార్టీ కూడా మొండిగా నిర్ణయాలు తీసుకోవటం తగదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే 20 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తామన్నారు. తెలంగాణ ఇచ్చినా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుకురావడం కష్టమేనని, తెలంగాణ ఇచ్చిన పేరుతో ఆంద్రాలో కూడా పార్టీ నష్టపోతుందని అన్నారు. కేవలం పైరవీలతొనే సీయం పోస్టు వచ్చిందనడం పొరబాటన్నారు.

హైకోర్టులోనూ చుక్కెదురు

  డైరెక్టర్‌ జనరల్‌ ఆప్‌ పోలీస్‌ దినేష్‌ రెడ్డి చేసుకున్న అభ్యర్థనను హై కోర్టు తొసిపుచ్చింది. క్యాట్‌ తీర్పును సమర్ధించిన కోర్టు దినేష్‌ రెడ్డిని కొనసాగించాల్సిన అవసరం లేదని భావించింది. దీంతో రేపటితో పదవీ కాలం ముగియనున్న దినేష్‌  రెడ్డి ఇక విధుల నుంచి వైదొలగక తప్పని పరిస్థితి.   పదవీ విరమణ వయసుతో సంభందం లేకుండా పదవి చేపట్టినప్పటి నుండి రెండేళ్ల పాటు సేవ  చేయోచ్చని, ఆ మేరకు తన పదవీ కాలాన్ని పొడిగించాలని దినేష్‌ రెడ్డి క్యాట్‌ను కోరారు. అయితే క్యాట్‌ ఆయన అభ్యర్ధనను తిరస్కరించడంతో దినేష్‌ రెడ్డి హై కోర్టు ను ఆశ్రయించారు. అయితే హై కోర్టు కూడా క్యాట్‌ తీర్పునే సమర్ధించింది.

జగన్, కెసిఆర్ లు సోనియా వదలిన బాణాలు

      టిడిపి అడ్డు తొలగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణాలు వైఎస్ జగన్, కేసీఆర్ లు అని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కానీ ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మేము తట్టుకోగలం. మాది రామబాణం అని ఆయన అన్నారు. లక్ష కోట్లు తిన్న వ్యక్తికి జైలులో సకల మర్యాదలు కల్పించారని, జైలు నుంచి జగన్‌ను బయటకు తీసుకురావడం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కాదా అని ప్రశ్నించారు. ప్రత్యర్థులపై సిబిఐని ప్రయోగించి బెదిరిస్తున్నారని, ఆ తరువాత వారి పబ్బం గడుపుకుంటున్నారని, అవినీతిపై గొంతెత్తిన ప్రజలను సర్వశక్తులొడ్డి నీరుగార్చారంటూ అన్నా హజారే ఉద్యమం ఉదాహరణగా చూపారు. దేశంలోని అన్ని సమస్యలకు యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌లే కారణం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.

దినేష్‌రెడ్ది పదవి పై తీర్పు వాయిదా

      డీజీపీ దినేష్‌రెడ్ది పదవి కాలాన్ని పొడిగించాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిసాయి. తీర్పు ఆదివారం సాయంత్రం గానీ, లేదా సోమవారం ఉదయం గానీ వెల్లడిస్తామని జస్టిస్ అశుతోష్ మొహంతా, జస్టిస్ శేషాద్రి నాయుడు బెంచ్ పేర్కొంది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ దినేష్‌రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిసన్‌ను వేసిన విషయం తెలిసిందే. ఆదివారం జస్టిస్ అశుతోష్ నివాసంలో హౌస్ మోషన్ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ మేరకు వాయిదా వేశారు

కిరణ్ కు రాయపాటికి అండ

      రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన సీనియర్లను కాదని విభజనపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే తెలంగాణలో వచ్చే సీట్లకన్నా ఎక్కువే వస్తాయని ఆయన తెలిపారు.   మమ్మల్ని రాజీనామా చేయవద్దని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేస్తున్నారో అర్థం కావడంలేదని రాయపాటి అన్నారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే 20 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తామన్నారు. తెలంగాణ ఇచ్చినా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుకురావడం కష్టమేనని రాయపాటి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పైరవీతోనే కిరణ్‌కు సీఎం పోస్టు వచ్చిందనడం పొరబాటన్నారు. ఢిల్లీకి ఆలస్యంగా రావడం వల్లే నిన్న లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కలవలేకపోయానని రాయపాటి వెల్లడించారు. తమ రాజీనామాలను ఆమోదించాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నిన్న స్పీకర్ను కలిశారు. వీరితో రాయపాటి వెళ్లలేదు. దీంతో రాయపాటి వివరణ ఇచ్చారు.