ఉద్యమంలో ఉన్నానంటున్న 'నెల'బాలుడు
posted on Dec 18, 2013 @ 2:00PM
"నాది విశాలాంధ్ర వాదం'' అన్నారాయన. సమైక్యం విన్నాం, విభజనవాదం విన్నాం. ఈ విశాలాంధ్ర వాదం ఏమిటి? దీన్ని మోసుకోచిన కొత్త శాల్తీ ఎవరా అనుకుంటున్నారా? రాష్ట్రానికి అత్యధికకాలం ముఖ్యమంత్రిగా చేసింది చంద్రబాబునాయుడు అని మనకు తెలుసు. మరి అత్యల్పకాలం చేసింది ఎవరు? ఆయనేనండీ మన రాష్ట్రానికి నెలరోజుల ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించిన నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన అకస్మాత్తుగా బుధవారం వెలుగులోకి వచ్చారు.
"నేను గతంలో విశాలాంధ్ర ఉద్యమాల్లో పాల్గొన్నా''నంటూ ఆయన విలేఖరులకు వివరించారు. ఎవరి బాగు కోసం, ఎవరి లాభం కోసం ఈ విభజన అంటూ గర్జించారు. ఈ విభజనతో ఏమీ సాధించలేమని తేల్చేశారు. అసలు తెలంగాణా ముసాయిదా బిల్లులో పసలేదని, అదంతా తప్పుల తడకనీ తెలంగాణా అని ఉండాల్సిన చోట తమిళనాడు అని ఉందంటూ ఎద్దేవా చేశారు.
ఈ తప్పుల బిల్లును పాస్ చేయించాలనే కేంద్రం పప్పులు ఉడకబావని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం సమైక్య, విభజన గందరగోళాలకు కేంద్రంగా మారిన అసెంబ్లీని నడిపే సారథి ఈయన కుమారుడైన నాదెండ్ల మనోహర్ కావడం కొసమెరుపు. ఏమైతేనేం ... సమైక్యానికి మరో గళం కలిసింది.