మా కొత్త పార్టీలోకి రావచ్చుగా...ప్లీజ్..
posted on Mar 8, 2014 6:26AM
‘
నేను సీఎంగా ఉన్నప్పుడు మీరు అడిగిన పనులు చేశానుగా. ఈ సారి ఎన్నికల్లో మా పార్టీ తరపున పోటీ చేయొచ్చుగా. ఒక సారి వచ్చి కలిస్తే అన్నీ మాట్లాడుకుందాం’ పలు జిల్లాల్లోని ముఖ్యమైన నాయకులకు కిరణ్ కుమార్ రెడ్డి నుంచి వస్తున్న ఫోన్ల సారాంశమిది. ‘అన్న మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఒక సారి హైదరాబాద్‌కు వచ్చి కలవచ్చుగా’ అని కిరణ్ సోదరులు సంతోష్, కిషోర్ కూడా మరికొందరికి ఫోన్లు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల విషయంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డితో కిరణ్‌కు చెడింది. అప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్న ఆదాల సైకిలెక్కేందుకు వేగంగా నిర్ణయం తీసుకున్నారు. కిరణ్ పార్టీ పెడతారో లేదోనన్న అనుమానాలు రావడంతో ఆయన వైపు నిలిచిన ఒకరిద్దరు నేతలు కూడా మెల్లగా జారుకున్నారు. దాదాపు ఇదే పరిస్థతి అన్ని జిల్లాల్లోనూ కనపడుతోంది. మరోవైపు ముహూర్తం (12వ తేదీ) ముంచుకురావడంతో ఆ రోజుకు స్టేజీ నిండేంత మంది నేతలను పోగేయడానికి రంగం సిద్ధమవుతోంది.