కొత్త ప్లేయర్స్ ఎవరు ఎవరితో ఆడుకొంటారు?
posted on Mar 7, 2014 @ 2:38PM
తెలుగు ప్రజల సేవ చేసుకొని తరించాలని తపించిపోతున్నమరో అరడజను కొత్త పార్టీలు తరలి వస్తున్నాయి గనుక వాటిలో ఇప్పుడు ఏ పార్టీ చేత సేవచేయించుకోవాలో ఎంచుకొనే చాయిస్ ప్రజలకి దొరుకుతోంది. అయితే ప్రజాసేవ చేసేందుకు తెగ ఆరాటపడిపోతున్నఈ పార్టీలు తమతో పోటీలో ఉన్న ఇతర పార్టీలకు మాత్రం ఎసరు పెట్టేయడం ఖాయం.
ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టబోయే పార్టీని తీసుకొంటే, గత ఎన్నికలలో మెగా బ్రదర్ చిరంజీవి తేదేపాకు గండి కొట్టినట్లే, ఈసారి కూడా తేదేపాకు పవన్ బాబుతో మెగా ప్రాబ్లెం రావచ్చును. అందువల్ల తెదేపా మళ్ళీ తన టైగర్లని, సింహాలని ముందుకు తీసుకు వచ్చి తన స్టార్ పవర్ అంతా ధారపోసి పోరాడవలసి ఉంటుంది.
ఇక మొన్నటి దాక గాలిలో బ్యాటు తిప్పుతూ అదిగో లాస్ట్ బాల్..ఇదిగో లాస్ట్ బాల్ అంటూ కనబడని ఆ బాల్స్ అన్నిటినీ ఫోర్లు,సిక్సర్లు బాదిపడేసిన కెప్టెన్ కిరణ్, విడిపోతున్న రాష్ట్రంలో సమైక్యగానం ఆలపిస్తూ గాయపడిన ప్రజల హృదయాలకు ఏదో మందు పూసేందుకు వస్తున్నట్లు ప్రకటించేరు. ఆయన టీం వేరే కలర్ టోపీలు, డ్రెస్సులు, వేసుకొస్తున్నపటికీ అది (హోం టీమ్) టీమ్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొనే గ్రౌండ్లోకి దిగుతోందని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ టీమ్ ముందు ‘హోం టీమ్’ తోనే ఆడుకొని వైడ్ బాల్స్ నో బాల్స్ తో రన్స్ సంపాదించుకొనే ప్రయత్నం చేస్తుంది. పనిలో పనిగా తనలాగే హోం టీమ్ తో మ్యాచు ఫిక్సింగ్ చేసుకొని అదే గ్రౌండ్లో తెలుగు తమ్ముళ్ళతో గేమ్ ఆడుకొంటున్న వైకాపా టీమ్ పై కూడా గుగ్లీలు విసురుతూ అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అవుట్ చేయబోదు.
ఇక డ్రీం బాయ్ బొత్స నేతృత్వంలో హస్తం పట్టుకొని గ్రౌండులోకి వస్తున్న హోమ్ టీమ్ కాంగ్రెస్ లో మిగిలిన వారు అందరూ ఫుట్ బాల్ తో క్రికెట్, క్రికెట్ బాల్ తో బాస్కెట్ బాల్ అఆడగల సమర్దులు గనుక, గ్యాలరీ ఉన్న ప్రేక్షకులకి ఏవో ప్యాకేజీలు ఇచ్చి టోపీలు పెట్టి మ్యాచ్ గెలిచేందుకు గట్టిగా కృషి చేస్తారు. ఈ మూడు (కాంగ్రెస్) టీమ్స్ కి కూడా పవన్- ఎఫ్ఫెక్ట్ తప్పదు.
అయితే కిరణ్, జగన్, బొత్స ప్రజాసేవ చేసేందుకు తమలో తాము పోరాడుకొంటుంటే, మధ్యలో తెలుగు తమ్ముళ్ళుకొంత మేర లాభపడే అవకాశం ఉంది. ఎందుకంటే వారందరూ విడివిడిగా ఆడుతున్నపటికీ అందరూ కూడా ఒకే కాంగ్రెస్ టీమ్ తరపునే ఈ మ్యాచ్ ఆడుతున్నారని గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొడుతున్న ప్రేక్షకులకి అందరికీ తెలిసు.
ఇక గ్రౌండ్ క్లీన్ చేసేందుకు చీపురు పట్టుకొని వస్తున్న ఆమాద్మీ టీం, అందరూ ఫౌల్ గేమ్ ఆడుతున్నారని విజిల్ వేసే లోక్ సత్తా, నల్ల జెండాలు పట్టుకొనొస్తున్న మందకృష్ణ మాదిగ, సీమ సింహం బైరెడ్డి అందరూ తలా పిడికెడు ఓట్లు పట్టుకుపోవడం ఖాయం గనుక, తెదేపా, వైకాపాలకు మెజార్టీ ఓట్లు, సీట్లు సంపాదించుకోవడం కష్టమే అవుతుంది.