జయమ్మకు కోపం వచ్చింది
మన దేశంలో ప్రధానమంత్రి కావాలని కోరుకొనే రెండు డజన్ల మంది నేతలలో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత కూడా ఒకరు. ఆ కారణంగానే అటువంటి కోరికున్న నేతలందరూ కలిసి పెట్టుకొన్న థర్డ్ ఫ్రంటులో ఆమె కూడా చేరారు. కానీ అంత మందితో వేగడం కంటే, తనకి బాగా పట్టున్న తన స్వంత రాష్ట్రంలో ఉన్న మొత్తం 40 యంపీ సీట్లు సంపాదించుకొంటే, అప్పుడు ‘మీరే ప్రధాని కావాలని’ కోరుతూ వారందరూ తన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారని జయలలిత భావించారు. అందుకే ఎంతో కష్టపడి థర్డ్ ఫ్రంట్ వేదికని నిర్మించిన లెఫ్ట్ పార్టీలతో కూడా పొత్తులకు ఆమె ‘నో’ చెప్పేసి షాక్ ఇచ్చేసారు. అటువంటప్పుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీకో, లేకపోతే మోడీని ప్రధాని అభ్యర్ధిగా చెప్పుకొంటున్న బీజేపీతోనో ఆమె పొత్తులు పెట్టుకొంటారని ఆశించడం అవివేకమే అవుతుంది.
అయినప్పటికీ, బీజేపీ శాస్త్రం ప్రకారం ఆమెను కూడా ఓసారి కదిపి చూసింది, కానీ ఊహించినట్లే వారికి కూడా ఆమె ‘నో’ చెప్పేశారు. రెండాకుల పార్టీకి అధినేత అయిన ఆమే బీజేపీని పొమ్మని చెపుతున్నపుడు, ఆమెకంటే నాలుగాకులు ఎక్కువే చదివిన తాము మాత్రం కాంగ్రెస్, బీజేపీలను ఎందుకు చేరదీయాలని అనుకొన్న డీయంకే అధినేత కరుణానిధి కూడా వాటికి ‘నో’ చెప్పేయడంతో పాపం చేసేదేమీలేక ఆ రెండు జాతీయ పార్టీలు తమిళనాడులో వీదికొకటి చొప్పున ఉండే చిన్న చితకా పార్టీలను పోగేసుకొని ఎన్నికలు ఎదుర్కోవడానికి నానా తిప్పలు పడుతున్నాయి.
అయితే ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని ఎవరో సిమ్కార్డ్ అమ్ముకొనే వాళ్ళు చెప్పిన సంగతి గుర్తుకురావడంతో బీజేపీ, తమిళనాట ఆ రెండు పార్టీలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్, మంచి ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ కి ఏకంగా వలేసేపట్టేసింది. దానితో కంగారు పడిన జయమ్మ, కాకి మీద పిల్లి మీద పెట్టి తిట్టిన్నట్లు బీజేపీని, పనిలోపనిగా ఆ నోటితోనే తన ప్రియమయిన ముసలి శత్రువు కరుణానిధిని కలిపి, కావేరీ నది జలాల పంపకం వంక పెట్టి తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా తిట్లు లంఖించుకొన్నారు.
గత నాలుగయిదు దశాబ్దాలుగా ఆమెతో నిరవధికంగా ‘టామ్ అండ్ జెర్రీ షో’ నడిపిస్తూ తమిళ ప్రజలందరికీ మంచి వినోదం కల్పిస్తున్న కరుణానిధికి ఆమె బాధ ఏమిటో అర్ధమయింది, కానీ అరవం ఒక్క ముక్క కూడా అర్ధం కానీ బీజేపీ నేతలు మాత్రం ఆమె అంత తీయతీయగా తమిళంలో తిట్టి పోస్తుంటే, రజనీకాంత్ తో తాము దోస్తీ చేసినందుకు ఆమె తమను తిడుతోందో లేక పోగుడుతోందో తెలియక వెర్రి నవ్వులు నవ్వుతున్నారు.