మోడీకి అంత సీను లేదు: బీజేపీ నేత జోషి

 

బీజేపీ నరేంద్ర మోడీని తమ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత నుండే ఆ పార్టీకి దేశంలో మంచి ఊపు వచ్చింది. నాటి నుండి నేటి వరకు మోడీ విస్తృతంగా చేస్తున్న ప్రచారం వలన నానాటికి ఆయన రేటింగ్, దానితో బాటే పార్టీ రేటింగ్ కూడా బాగా పెరిగింది. ఇది కాంగ్రెస్ నేతలు కూడా కాదనలేని సత్యం. అయితే ఆయన కోసం తన వారణాసి సీటుని వదులుకోవలసివచ్చిన మురళీ మనోహర్ జోషీ మాత్రం అలా భావించడం లేదు. దేశంలో అందరూ చెప్పుకొంటున్నట్లు మోడీ ప్రభంజనమేమీ లేదని అధికేవళం బీజేపీ ప్రభంజనమని దాని వలన మోడీయే లబ్ది పొందుతున్నారని అన్నారు. అంతే కాక మోడీ కేవలం పార్టీలో ఒక ముఖ్యమయిన పదవికి ఎంపిక చేయబడిన వ్యక్తి మాత్రమేనని అన్నారు. ఈ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించి కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతుంటే, ఇటువంటి అతి కీలకమయిన సమయంలో స్వంత పార్టీకి చెందిన మురళీ మనోహర్ జోషీ వంటి సీనియర్ నేతే వ్యక్తిగత కారణాలతో మోడీకి అంత సీను లేదని కించపరుస్తూ మాట్లాడటం వలన పార్టీకే కాదు, ఆయనకీ నష్టమే కలిగిస్తుంది. ప్రత్యర్ధ కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనవలసిన ఈ తరుణంలో ఆయన స్వంత పార్టీ ప్రధాని అభ్యర్ధి మీదే బాణాలు ఎక్కుపెడితే అందుకు కాంగ్రెస్ కూడా చాలా సంతోషిస్తుంది.

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

రేపో మాపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? రేపో మాపో రేవంత్ కెబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారా? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రేవంత్ హస్తిన పర్యటకు బయలుదేరనున్నారు. శనివారం (డిసెంబర్ 28) హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతారు. ఈ భేటీ ప్రధాన అజెండా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణే అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, ఎస్టీ కోటాలో బాలూ నాయక్ లూ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ కేవలం కేబినెట్ విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని హైకమాండ్ ను కోరనున్నారు. ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మార్పులు, చేర్పులతో కేబినెట్ ను పున్వ్యవస్థీకరించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

జగన్ విపక్ష నేత కావడం కల్ల.. రఘురామకృష్ణం రాజు

తనపై మూడు కేసులున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనదైన శైలిలో ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ఆరోపణలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ కేసులకు సంబంధించి తాను నిర్దోషిగా బయటకు వస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో తన కార్యాలయంలో    మీడియాతో మాట్లాడిన ఆయన తనపై ఆరోపణలు వస్తున్న కేసులో ఎలాంటి ఛార్జిషీటు దాఖలు చేయలేదన్నారు.   తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన..  11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.    తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న కొందరు వ్యక్తుల గురించి తాను మాట్లాడనని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తన కేసుపై తాను పోరాటం చేస్తానని, ఇందులో ఎవరి మద్దతు అవసరం లేదన్నారు.   తాను ఏ తప్పూ చేయలేలదన్న ఆయన  తనకు పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం  జరుగుతోందని ఆరోపించారు.  అలాగే ఏపీ మాజీ సీఎం తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు.  ఆయన తన తీరు మార్చుకోకుండా ఎప్పటికీ కనీసం ప్రతిపక్ష నేత కూడా కాలేరని అన్నారు.జగన్ తన ప్రవర్తన మార్చుకుంటే.. వచ్చే ఎన్నికలలోనైనా ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలలో గెలుపొంది ప్రతిపక్ష నాయకుడు అవుతారని తాను భావించాననీ, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ అవకాశం లేదనిపిస్తోందన్నా. 2020 నుంచే జగన్ తనపై బురద జల్లుతున్నారనీ, తనను హత్య చేయాలని కూడా చూశారన్న రఘురామకృష్ణం రాజు అయినా తాను భయపడకుండా పోరాడానన్నారు.   

తన హత్యకు కుట్ర.. దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్ మరో సారి తన మార్క్ రాజకీయ సంచలనం సృష్టించారు.  తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, తనను హత్య చేయడానికి కుట్రపన్నారంటూ శుక్రవారం (డిసెంబర్ 27) అర్ధరాత్రి  నిమ్మాడ హైవేపై ఆయన  హల్‌చల్ చేశారు.  ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికి దువ్వాడ మాధురి ఓ ఆడియో క్లిప్పింగ్ విడుదల చేశారు.  తన ఆరోపణలకు ఆధారాలు అన్నట్లుగా   దువ్వాడ వీడియో విడుదలైన కొద్దిసేపటికే.. దివ్వెల మాధురి ఒక ఆడియో క్లిప్పింగ్‌ను బయటపెట్టారు.   ఆ ఆడియో క్లిప్పింగ్ లోని  దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు   కింజారపు అప్పన్న, దివ్వెల మాధురిల సంభాషణ మేరకు.. రామస్వామి అనే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్‌పై దాడికి ప్రణాళిక రూపొందించాడని కింజారపు అప్పన్న దివ్వెల మాధురితో చెబుతున్నారు.   దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో, దివ్వెల మాధురి బయటపెట్టిన ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి.  సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని దువ్వాడ చేస్తున్న ఆరోపణలు వైసీపీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతమయ్యాయి. ఇంతకీ తనను హత్య చేసేందుకు కుట్రపన్నుతున్నది వైసీపీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ అని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తాను చావుకు భయపడనన్న దువ్వాడ.. తనపై దాడి చేయడానికి ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో తాను స్వతంత్రంగానే రాజకీయాలు చేస్తానన్న దువ్వాడ    తనను వైసీపీ నుంచి పూర్తిగా బయటకు పంపిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇండిపెండెంట్ గా నిలబడి తన సత్తా ఏంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు. పార్టీలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తనపై హత్యకు కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.