కనబడిపోవడానికి రాలేదు: పవన్ కళ్యాణ్
posted on Apr 15, 2014 @ 1:00PM
జనసేన పార్టీ స్థాపించిన తరువాత కనబడకుండా పోయిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మళ్ళీ చాలా రోజుల తరువాత కర్ణాటకలో రాయచూర్ లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో కనబడ్డారు. అక్కడ స్థిరపడిన తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ “ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఇలా హెలికాఫ్టర్ లో నుండి దిగి నాలుగు ముక్కలు చెప్పేసి, మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు మొహం చూపించకుండా మాయమయిపోయే రాజకీయ నేతల వంటివాడిని కాను నేను. ఈ దేశంపట్ల నాకూ బాధ్యత ఉందని భావించి ప్రజల తరపున పోరాడేందుకే జనసేన పార్టీ స్థాపించాను. మన దేశాన్నిసరయిన మార్గంలో నడిపించగల బలమయిన నాయకుడు నరేంద్ర మోడీయేనని నేను దృడంగా నమ్మినందునే, ఆయనను సమర్ధిస్తున్నాను. ఆయనకు వెనుక ఆస్తులు ఏవీ లేవు. రాజకీయాలలోకి తీసుకొని వచ్చేందుకు ఆయనకు బంధువులు లేరు. అందువలన ఆస్తులు సంపాదించుకోవాలనే యావ ఆయనకి లేదు. ఆయన జీవితం ఈదేశం కోసమే పూర్తిగా ధార పోశారు. మంచి పరిపాలనా దక్షుడు, సమర్ధుడు, అనుభవశాలి, గుండె దైర్యం ఉన్నవాడు అయిన మోడీ వంటి వారి నేతృత్వంలోనే మన దేశం అభివృద్ధి పధంలో పయనించగలదు. అందుకే అటువంటి నాయకుడిని ఎన్నుకోవలసిన అవసరం ఉందని చెప్పేందుకే మీ ముందుకు వచ్చాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.