హిందూపురం నుంచి బాలకృష్ణ: ఏడవలేక నవ్వుతున్న సిట్టింగ్
posted on Apr 15, 2014 @ 3:43PM
నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వుండటం ఆయన అభిమానులలో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఉత్సాహభరితమైన వాతావరణంలో గురువారం నాడు బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేబోతున్నారు. అంతటా ఉత్సాహంగానే వున్నారు. అందరూ హాయిగా నవ్వుతున్నారు. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ కూడా అందరితోపాటు నవ్వుతున్నారు.
బాలకృష్ణ కోసం తన సీటు త్యాగం చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని నవ్వుతూ చెబుతున్నారు. కానీ ఆ నవ్వు వెనుక బోలెడంత ఏడుపు వుందని, ఆయన ఏడవలేకే నవ్వుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈసారి తెలుగుదేశం సీమాంధ్రలో పవర్లోకి వస్తే తనకి మంత్రిపదవి దక్కుతుందని ఇంతకాలం ఆశించిన ఆయన తన స్థానం నుంచి బాలకృష్ణ పోటీ చేయడానికి అంగీకరించడంతో నిరాశకు గురయ్యారు.
అయితే తన నిరాశను బయటపెట్టే సాహసాన్ని కూడా ఆయన చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యే పదవి కూడా వుండదు. నియోజకవర్గంలోని మిగతా కార్యకర్తల తరహాలోనే తాను కూడా బాలకృష్ణ వెంట తిరిగే కార్యకర్తలా వుండిపోవాల్సి వస్తుందన్న ఆవేదన అబ్దుల్ ఘనీలో ఘనీభవించి వుందని తెలుస్తోంది.