తుమ్మితే ఊడే ముక్కు తెదేపా-బీజేపీల పొత్తులు

  తెదేపా-బీజేపీ ఎన్నికల పొత్తులు తెగిపోతాయనుకొన్న సమయంలో ఇరు పార్టీల కృషివల్ల మళ్ళీ కలిసికొనసాగేందుకు సిద్దపడ్డాయి. అయితే నేటికీ వాటి పొత్తులు తుమ్మితే ఊడిపోయే ముక్కు చందాన్నే కొనసాగుతున్నాయి. కారణం తెలుగుదేశం సూచించిన విధంగా కొన్ని నియోజక వర్గాలలో బీజేపీ తన అభ్యర్ధులను మార్చినప్పటికీ, బీజేపీకి కేటాయించిన ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు మరియు కడప అసెంబ్లీ సీట్లకు తెదేపా అభ్యర్ధులు నామినేషన్లు వేసారు. వారికి చంద్రబాబే స్వయంగా బీ-ఫారంలు అందజేయడం, బీజేపీకి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. వారిరువురి చేత వెంటనే నామినేషన్లు ఉపసంహరింపజేయమని బీజేపీ ఒత్తిడి తెస్తోంది. మరో రెండు రోజుల్లో ఎన్డీయే భాగస్వాములతో కలిసి నరేంద్ర మోడీ హైదరాబాదులో నిర్వహించే భారీ బహిరంగ సభలో చంద్రబాబు కూడా పాల్గొనవలసి ఉంది. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయన ఆ సభలో పాల్గోనకపోవచ్చును. అందువల్ల బీజేపీ కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అయితే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా కలిసి పనిచేయాలనుకొన్న ఆ రెండు పార్టీల మధ్య నేటికీ సరయిన సయోధ్య లేకపోగా, వాటిలో అవే కొట్లాడుకోవడం వల్ల ప్రత్యర్ధులకు వరంగా మారుతోంది. మరి ఇటువంటి పొత్తుల వలన ఆ రెండు పార్టీలు ఏవిధంగా ప్రయోజనం పొందగలవని భావిస్తున్నాయో వాటికే తెలియాలి.

నేడు శ్రీకాకుళంలో బాలయ్య ఎన్నికల ప్రచారం

  మొట్టమొదటిసారి హిందూపురం నుండి ఎన్నికలలో పోటీ చేయబోతున్ననందమూరి బాలకృష్ణ, తన నియోజక వర్గంలో ఇప్పటికే ఒకసారి ప్రచారం నిర్వహించారు. పార్టీలో మంచి ప్రజాకర్షణ గల ఆయన కేవలం హిందూపురంకే పరిమితం అవలేరు కనుక సీమాంధ్రలో అన్ని జిల్లాలలో కూడా ప్రచారం చేయనున్నారు. మొదటగా ఆయన ఈరోజు శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు హైదరాబాదు నుండి విమానంలో విశాఖ కు చేరుకొని అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సారవకోట చేరుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెడతారు. ఈరోజు ఆయన పోలాకి, ఉర్లాం, ఆముదాలవలస, భ్రుజ కొల్లివలస, సింగుపురం, శ్రీకూర్మం, శ్రీకాకుళం పట్టణంలో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈ నందమూరి లెజెండ్ ప్రచారానికి ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసినా చేయకపోయినా, ఆయనకున్న ప్రజాకర్షణ కారణంగా ప్రజలు ఆయనను చూసేందుకు, ఆయన చెప్పే డైలాగ్స్ వినేందుకు భారీ ఎత్తున తరలిరావడం తధ్యమని చెప్పవచ్చును.

తెలంగాణా ప్రజలపై రాహుల్ ప్రభావం చూపగలరా?

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోనున్నారు. మళ్ళీ 25వ తేదీన మరోమారు ప్రచారానికి వస్తారు. ఈ ఎన్నికలలో తెలంగాణాలో అన్ని యంపీ సీట్లు తన ఖాతాలో వేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీమాంధ్రలో పార్టీని, తమ నేతల భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ, కేసీఆర్ మాట తప్పడంతో కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. తెలంగాణాలో అవలీలగా గెలవగల స్థితి నుండి నేడు చెమటోడ్చినా గెలవలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎన్నడూ రాష్ట్రంలో అడుగు పెట్టని జైరామ్ రమేష్ వంటి సీనియర్ నేత, టీ-కాంగ్రెస్ కి అండగా నిలబడి పార్టీ తరపున కేసీఆర్ తో పోరాటం చేయవలసి వస్తోంది. నిజానికి కాంగ్రెస్ లో తెరాస విలీనమయినా లేక ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొన్నా ఇంత ప్రయాసపడవలసిన అవసరముండేదే కాదు. కానీ కేసీఆర్ పదవీ కాంక్ష వలన వాటి మధ్య పొత్తులు పొసగలేదు. అందుకే సోనియా, రాహుల్ గాంధీలు సైతం ఆయనను డ్డీ కొనేందుకు దిగిరావలసి వస్తోంది.   ఇక రాహుల్ గాంధీ తన ప్రచారంలో ప్రజలకు ఏమి చెప్పబోతున్నారో తేలికగానే ఊహించవచ్చును. ఆయన కూడా తన తల్లి సోనియాగాంధీ చెప్పినట్లే తెలంగాణా ఏర్పాటులో కేసీఆర్ కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమని, తన తల్లి తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, ఆమె పట్టుదల కారణంగానే తెలంగాణా ఏర్పడిందని చెప్పవచ్చును. అదేవిధంగా తనకు పక్కలో బల్లెంలా తయారయిన నరేంద్ర మోడీపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ, దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్న అటువంటి వ్యక్తితో చంద్రబాబు పొత్తులు పెట్టుకొన్నారని ఆక్షేపించవచ్చును. అయితే తనను ప్రధానిని చేయడం కోసమే బలమయిన ఆంద్ర రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన సంగతి ఆయన అంగీకరించరు.   ఈసారి ఎన్నికలలో తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్న కారణంగా ఆయన ఎంత గొప్పగా మాట్లాడినా, అది ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపలేవు. అదే పనిని టీ-కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా చేయగలిగితే మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

అవనిగడ్డ నుంచి రవిశంకర్ కంఠంనేని నామినేషన్

      దివిసీమను స్వర్గసీమగా మార్చడమే ధ్యేయంగా అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ కంఠంనేని శనివారం అవనిగడ్డ ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గా రవిశంకర్ కంఠంనేని నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి అవనిగడ్డ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ రవిశంకర్ కంఠంనేనికి దక్కాల్సి వుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మండలి బుద్ధప్రసాద్ జంప్ చేయడంతో బుద్ధప్రసాద్‌కి చంద్రబాబు అవనిగడ్డ టిక్కెట్ ఇచ్చారు.   అయితే బుద్ధ ప్రసాద్‌కి స్థానిక సమస్యలు, వాటి పరిష్కారం మీద అవగాహన లేదని, ఆయన ఇక్కడ నుంచి గెలిచే అవకాశాలు లేవని స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఎంతోకాలంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేయడంతోపాటు, పదవి లేకపోయిన్పటికీ తన సొంత ప్రాంతం మీద అభిమానంతో అవనిగడ్డ పరిసరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రవిశంకర్ కంఠంనేనికి అవనిగడ్డ టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో స్థానిక ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల ప్రోత్సాహంతో రవిశంకర్ కంఠమనేని అవనిగడ్డ నియోజకవర్గానికి నామినేషన్ వేశారు. శనివారం నాడు రవిశంకర్ కంఠమనేని మోపిదేవిలోని తన నివాసం నుంచి నామినేషన్ వేయడానికి అవనిగడ్డ ఎం.ఆర్.ఓ. కార్యాలయానికి పదివేలమందికి పైగా మద్దతుదారులతో ప్రదర్శనగా బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయన కులమతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చ్ లను సందర్శించి సర్వమత సమానత్వాన్ని చాటారు. ఆ తర్వాత అవనిగడ్డ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రవిశంకర్ కంఠమనేనికి మోపిదేవి నుంచి అవనిగడ్డ వరకు స్థానికుల నుంచి మంచి ప్రతిస్పందన, అభినందనలు లభించాయి. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఈ స్థాయిలో, ఇంతమంది మద్దతుదారులతో నామినేషన్ వేసిన తొలి వ్యక్తి రవిశంకర్ కంఠమనేని అని స్థానికులు చెబుతున్నారు. రవిశంకర్ కంఠమనేని అవనిగడ్డ స్థానం నుంచి విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.

తవ్వకాల్లో దొరికిన 450 కిలోల బాంబు!

      ఒకటి కాదు.. రెండు కాదు.. 450 కిలోల బాంబు పశ్చిమ బెంగాల్లోని కలైకుండా ఎయిర్‌బేస్ ప్రాంతంలో వున్న మౌలిషూల్ గ్రామం దగ్గర జరిపిన తవ్వకంలో దొరికింది. ఒక స్ట్రీట్ లైట్ పాతడానికి చిన్న గుంట తవ్వుతూ వుండగా బయటపడిన ఈ భారీ బాంబుని చూసి ఎయిర్‌ఫోర్స్ అధికారులే నోళ్ళు తెరిచారు. ఈ బాంబు నాలుగు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో వుంది. భూమిలో మూడడుగుల గుంట తవ్వగానే బయటపడింది. 1939లో తయారైన ఈ బాంబు రెండో ప్రపంచ యుద్ధంలో పేలకుండా మిగిలిపోయిన భారీ బాంబుగా అధికారులు గుర్తించారు. ఈ బాంబు ఇప్పటికీ పేలే స్థితిలోనే వుందని అధికారులు చెబుతున్నారు. ఈ భారీ బాంబుని త్వరలో దూరంగా వున్న అరణ్య ప్రాంతంలోకి తీసుకెళ్ళి డిఫ్యూజ్ చేయనున్నట్టు ఎయిర్ బేస్ అధికారులు వెల్లడించారు.

మళ్ళీ మళ్ళీ ఆయనే గెలవాలని ప్రజలు కోరుకొంటున్నారుట

  మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు చీపురుపల్లిలో నామినేషన్ వేసారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో జిల్లా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొన్న ఆయన, అందరూ అనుకొంటునట్లుగా తన పట్ల ప్రజలలో ఎటువంటి వ్యతిరేఖత లేదని నిరూపించేందుకన్నట్లుగా ఈ సందర్భంగా భారీ ఊరేగింపుతో తరలివెళ్లి చాలా అట్టహాసంగా నామినేషన్ వేశారు. “గత పదేళ్లుగా నేను నా కుటుంబ సభ్యులు అందరూ కూడా జిల్లా ప్రజల సేవలోనే ఉన్నాము. చీపురుపల్లి నియోజక వర్గంలో, విజయనగరం జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పటిన సంగతి ప్రజలకు తెలుసు. నేను ఎక్కడి వాడినని ఎవరయినా ప్రశ్నిస్తే, చీపురుపల్లి వాడినని గర్వంగా చెప్పుకొంటాను. నేను నా కుటుంబ సభ్యులు అందరూ ఎల్లపుడూ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తుంటాము. అందుకే ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ నేనే కావాలని ఓటేసి గెలిపించుకొంటున్నారు. నాకు ఓటేసి గెలిపించిన నా అక్కలు, చెల్లెమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా నేను శిరసు వంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఈసారి కూడా మీరందరూ మళ్ళీ నాకే ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలలో చేరినవారు కొంతమంది చాలాచాలా గొప్పమాటలు, వాగ్దానాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకే ద్రోహం చేసిన వారికి ప్రజలు ఓటేసి గెలిపిస్తే రేపు వారు ప్రజలను మాత్రం మోసం చేయరని నమ్మకం ఏమిటి? అందువలన ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది,” అని బొత్స అన్నారు.   ఒకప్పుడు విభజన జరిగితే తప్పేమిటి? అని ప్రశ్నించిన  బొత్స సత్యనారాయణ, ఆ తరువాత సమైక్య ఉద్యమం జోరందుకొన్నపుడు, తాను విభజనను వ్యతిరేఖిస్తున్నాని అన్నారు. అనడమే కాకుండా నాటి  ముఖ్యమంత్రి కిరణ్ తయారుచేసిన వినతి పత్రం మీద అందరితో బాటు సంతకం కూడా చేసారు. కానీ మళ్ళీ ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు పసిగట్టగానే ఆయన తన దూకుడు తగ్గించుకొని విభజన వ్యవహారంలో అధిష్టానందే అంతిమ నిర్ణయమని దానిని అందరూ శిరసావహించాల్సిందే అంటూ వాదించారు.   కానీ తనను కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పదవి నుండి తప్పించిన తరువాత, పార్టీ మారబోతున్నట్లు మీడియా లీకులిచ్చారు. మళ్ళీ  ఇప్పుడు తన కుటుంబంలో అందరికీ పార్టీ టికెట్స్ కేటాయించడంతో, పార్టీ వదిలినవారు ద్రోహులని అంటున్నారు. రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తున్న ప్రజలకు, సీమాంధ్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కే ఓటేయాలని ఆయన కోరుతున్నారు. ఏది ఏమయినప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడిపోయినా బొత్స మాత్రం తప్పకుండా గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.  

వారణాశిలో 24న నరేంద్రమోడీ నామినేషన్

      భారతీయ జనతాపార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈనెల 24న వారణాశి పార్లమెంట్ నియోజకవర్గం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నరేంద్రమోడీ గుజరాత్‌లోని వదోదర, ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నియోజకవర్గాల నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వదోదరలో ఇప్పటికే మోడీ నామినేషన్ దాఖలు చేశారు. వారణాశిలో మోడీ 24న నామినేషన్ దాఖలు చేయనున్న విషయాన్ని మోడీ సన్నిహితుడు అమిత్ షా ప్రకటించారు. వారణాశిలో మే 12న పోలింగ్ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.

చంద్రబాబు కూడా సీట్లు అమ్ముకుంటున్నాడట!

      ఏ ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు మీద ఈ ఆరోపణ రాలేదు.. కానీ, ఈ ఎన్నికలలో మాత్రం చంద్రబాబు మీద ఈ ఆరోపణ వచ్చింది. ఇప్పటి వరకూ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి మీద, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్ మీద మాత్రమే టిక్కెట్లు అమ్ముకున్న ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. చంద్రబాబు మీద మాత్రం రాలేదు.   తాజాగా చంద్రబాబు మీద ఈ ఆరోపణ వచ్చింది. చంద్రబాబు టిక్కెట్లు అమ్మకుంటున్నారని ఆరోపించింది మరెవరో కాదు.. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డి. తెలుగుదేశం ఇప్పటికి ఆరు లిస్టులు ప్రకటించినా అందులో లింగారెడ్డి పేరు లేదు. ప్రొద్దుటూరు టిక్కెట్ మరొకరికి కేటాయించారు. తనకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని ప్రశ్నించడానికి శనివారం లింగారెడ్డి చంద్రబాబు నాయుడిని కలిశారు. తనకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని లింగారెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబు నుంచి మౌనమే సమాధానంగా ఎదురైందట. దాంతో లింగారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రొద్దుటూరి టిక్కెట్‌ని తనకు ఇవ్వకుండా మరొకరికి ఇచ్చారని, ప్రొద్దుటూరు టిక్కెట్‌ని అమ్ముకున్నారని ఆరోపించారు.

‘లెజెండ్’ ఆపేస్తే ‘సాక్షి’ని మూసేయాలి!

      నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా ఓటర్ల మీద ప్రభావం చూపించే అవకాశం వుంది కాబట్టి ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేసేలా ఎన్నిక కమిషన్ చర్యలు తీసుకోవాలని జగన్ పార్టీ కోరింది. ఇది తెలుగుదేశం వర్గాలకి ఆగ్రహం తెప్పిస్తోంది. జగన్ పార్టీ తెచ్చిన ఈ ప్రస్తావనని ఒక పనికిమాలిన ప్రస్తావన అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఎన్నికలలో పాల్గొంటున్న వారి సినిమాలను దూరదర్శన్‌లో ప్రదర్శించరాదని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. సినిమా థియేటర్లలో, ప్రైవేట్ చానెళ్ళలో ప్రదర్శించడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని, ఆ అంశం తమ పరిధిలో లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే అన్నీ తెలిసికూడా ఏదో ఇష్యూ క్రియేట్ చేద్దామనే జగన్ పార్టీ ‘లెజెండ్’ సినిమాని వేలెత్తి చూపిస్తోందని తెలుగుదేశం వర్గాలు జగన్ పార్టీని విమర్శిస్తున్నాయి. జగన్ పార్టీ కోరినట్టు ‘లెజెండ్’ సినిమా నిలిపేయడానికి తాము సిద్ధమని, అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా జగన్ పేరు ఊదరగొట్టే సాక్షి ఛానల్‌ని, జగన్ భజనలో తరించిపోయే ‘సాక్షి’ పేపర్ని జగన్ మూసేస్తారా?  అని అంటున్నారు. జగన్ ‘సాక్షి’ని మూసేయడానికి సిద్ధమైతే, తాము ‘లెజెండ్’ ప్రదర్శన నిలిపేయడానికి సిద్ధమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.

కిరణ్‌ ఎన్నికలలో పోటీ చేయడం లేదు

      మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆయన ఈరోజు చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేస్తారని అందరూ భావించారు. అయితే శనివారం నాడు పీలేరు నియోజకవర్గం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడంతో ఈసారి ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోవడం లేదన్న విషయం వెల్లడైంది. తాను సమైక్యాంధ్ర పార్టీని స్థాపించింది సీమాంధ్రకి ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరికతోనే అన్న విమర్శ ఇతర రాజకీయ పక్షాల నుంచి వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. తాను జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించింది తెలుగుజాతి సమైక్యంగా వుండాలనే ఉద్దేశంతోనే తప్ప సీమాంధ్రకి సీఎం అయిపోవాలన్న ఉద్దేశంతో కాదన్న సందేశాన్ని అందరికీ ఇవ్వడానికే ఆయన ఎన్నికలలో నిలబడటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మమతా బెనర్జీని చంపడానికి కుట్ర జరిగిందా?

      పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపడానికి కుట్ర జరిగిందా? అవును కుట్ర జరిగింది అని మమతా బెనర్జీతోపాటు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు కూడా అంటున్నాయి. గురువారం నాడు ఎన్నికల ప్రచారంలో వున్న మమతా బెనర్జీ ఒక హోటల్‌లో బస చేశారు. ఆమె తన హోటల్ రూమ్‌లో వుండగా ఏసీ కాలిపోయి హోటల్ రూమ్ మొత్తం పొగలు వ్యాపించాయి. మమతా బెనర్జీ ప్రాణభయంతో కేకలు వేశారు. సమయానికి ఆమె సహాయకులు స్పందించి మమతా బెనర్జీని కాపాడారు. ఏసీ కాలిపోవడానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు తర్వాత చెప్పారు. అయితే మమతా బెనర్జీ మాత్రం ఇది తనను చంపటానికి జరిగిన కుట్రేనని అంటున్నారు. ఈ సంఘటన మీద సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే మమత అంటే గిట్టని రాజకీయ వర్గాలు మాత్రం అనుకోకుండా జరిగిన సంఘటనని తన రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవడానికి మమత ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.

లెజెండ్ ఎంటర్ అయితే..మరి అంతే సంగతులట!

  బాలకృష్ణ ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నందున ఆయన నటించిన ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయమని కోరుతూ వైకాపా రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు నిన్న ఒక వినతి పత్రం అందజేసింది. ఎన్నికల జరుగుతున్న ఈ తరుణంలో ఆ సినిమా ప్రభావం ఆయన పోటీ చేస్తున్న హిందూపురం ఓటర్లను ప్రభావితం చేయవచ్చని, అదేవిధంగా రాష్ట్రంలో ఓటర్లను తెలుగుదేశంకు పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది గనుక తక్షణమే ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరింది.   లెజెండ్ సినిమా తెదేపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదిస్తున్న వైకాపా, ఇంత కాలంగా బాలకృష్ణ ఎన్నికలలో పోటీ చేస్తారో లేదో తెలియకనే ఎటువంటి అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. కానీ, అప్పుడు లేని అభ్యంతరము ఇప్పుడు ఎందుకంటే నిజంగానే ‘లెజెండ్’ ఓటర్లందరి మీద కాకపోయినా, వైకాపా వైపున్న ఆయన అభిమానులపైనా ఎంతో కొంత ప్రభావం చూపుతుందనే భయమే కారణమనుకావచ్చును.   వర్తమాన రాజకీయాలపై సినిమాలు తీయడం కొత్తేమీ కాకపోయినా, సరిగ్గా ఎన్నికల సమయంలోనే లెజెండ్ విడుదలవడం కాకతాళీయం మాత్రం కాదు. అయితే రాజకీయ చైతన్యవంతులయిన ప్రజలు ఇటువంటి సినిమాలను చూసి తమ అభిప్రాయాలను మార్చుకోనేంత బలహీన మనస్కులు కారని వైకాపా, తెదేపాలు రెండూ గ్రహించవలసి ఉంది. ప్రజలు కేవలం వినోదం కోసమే సినిమాలు చూస్తారు తప్ప వాటి నుండి ఏదో ప్రేరణ ఆశించి మాత్రం కాదని ఈ రాజకీయనేతలు ఎప్పుడు గ్రహిస్తారో పాపం!

సీమాంధ్ర నామినేషన్ల ఘట్టం నేటితో పూర్తి

      సీమాంధ్రలో నామినేషన్ల ఘట్టం నేటితో పూర్తి కానుంది. దాంతో రాజకీయ పార్టీలో తమ తుది జాబితాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. సీమాంధ్రలోని అనేకమంది ప్రముఖ నాయకులు ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేయలేదు. ఈరోజు నామినేషన్లకి చివరిరోజు కావడంతో నామినేషన్ల కేంద్రాలు ఈరోజు కిటకిటలాడుతున్నాయి. అలాగే పలు పార్టీలలో ఇప్పటికీ ఎవరికీ కేటాయించని సీట్ల విషయంలో పూర్తి క్లారిటీ రాబోతోంది. నామినేషన్ల ఘట్టం ఈరోజు ముగిస్తే సాయంత్రానికి ఏ స్థానం నుంచి ఏ పార్టీ అభ్యర్థి రంగంలో వున్నాడు. ఏ నియోజకవర్గంలో ఎవరెవరి మధ్య పోటీ జరిగే అవకాశం వుందనేది స్పష్టంగా తెలుస్తుంది.

ఐదుగురిని మింగేసిన కరెంటు తీగలు

  మధ్య ప్రదేశ్‌లోని భింద్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మీద విద్యుత్ తీగలు తెగి పడటంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మరణించారు. ఒక పెళ్ళి బృందానికి చెందిన బస్సు మొత్తం 60 మందితో ప్రయాణిస్తోంది. భింద్ సమీపానికి రాగానే బస్సుకి ఒక హై టెన్షన్ పోల్‌కి ఢీకొంది. ఆ పోల్‌కి వున్న విద్యుత్ తీగలు తెగి బస్సు మీద పడటంతో మొత్తం ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన పదిమందిని ఆస్పత్రికి తరలించారు. మొదట ఈ ప్రమాదంలో 50 మంది చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మృతుల సంఖ్య ఐదుగా పోలీసు వర్గాలు నిర్ధారించాయి.

పతాకస్థాయిలో కాంగ్రెస్-తెరాసల యుద్ధం

  తెలంగాణాలో ఎన్నికలకు ఇంకా కేవలం 11రోజులు సమయం మాత్రమే ఉండటంతో కాంగ్రెస్, తెరాసల మధ్య మాటల యుద్ధం చాలా భీకరంగా సాగుతోంది. వారి యుద్ధం ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే ఇప్పుడు తెదేపా-బీజేపీ నేతల ప్రచారాన్ని కూడా అది మరుగున పడేసేంతగా సాగుతోంది. మొదట రెండు మూడు ప్రజాగర్జన సభలను విజయవంతంగా నిర్వహించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిన చంద్రబాబు, ఇప్పుడు సీమాంధ్రకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నందున, కాంగ్రెస్, తెరాసలతో పోలిస్తే, తెదేపా ప్రచారంలో కొంచెం వెనుకబడిపోయినట్లే కనబడుతోంది.   కేసీఆర్ తెలంగాణా పది జిల్లాలలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ గట్టిగా ప్రచారం చేస్తుంటే, ఇటీవల తెరాస నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన శ్రావణ్ కుమార్, తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలు తెరాస నేతలను, కేసీఆర్ ను బలంగా డ్డీ కొంటున్నారు. కానీ, తెలంగాణా ఏర్పాడిన తరువాత మొట్ట మొదటిసారిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కరీంనగర్లో నిర్వహించిన సభకు, ఆశించినంత స్పందన కరువవడం గమనిస్తే తెరాస ఆధిక్యత కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.   మళ్ళీ ఈనెల 21న రాహుల్ గాంధీ మెహబూబ్ నగర్ మరియు నిజామాబాదు నగరాలలో రెండు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మళ్ళీ 25న మెదక్ మరియు హైదరాబాదులో మరో రెండు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఆ తరువాత మళ్ళీ సోనియా గాంధీ 27న తెలంగాణాలో మరొక బహిరంగ సభ నిర్వహించనున్నారు.   వీరిరువురి ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకొనే అవకాశం ఉన్నపటికీ, టీ-కాంగ్రెస్ నేతల మధ్య సరయిన సయోధ్య లేకపోవడం, వారినందరినీ ఒక్క త్రాటిపై నడిపించగల బలమయిన నాయకుడు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అయితే ఈ సమస్య తెరాసకు కూడా ఉందనే చెప్పవచ్చును. ఆ పార్టీలో కొందరు బలమయిన నేతలున్నపటికీ, వారందరూ తమ తమ నియోజక వర్గాలకే పరిమితమయి పోవడంతో, మిగిలిన అభ్యర్ధులు అందరూ కేసీఆర్ ప్రచారంపైనే ప్రధానంగా ఆధారపడుతున్నారు. అందువల్ల హేమాహేమీలయిన కాంగ్రెస్ నేతలందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడితే తప్పకుండా తెరాసపై పై చేయి సాధించవచ్చును.   తెదేపా-బీజేపీలకు సీమాంధ్రలో పొత్తులపై కుస్తీలు పడుతూ తీరికలేకపోవడంతో ఆ రెండు పార్టీలు రంగంలో దిగేందుకు ఇంకా ముహూర్తం నిర్ణయించుకొన్నట్లు లేదు. ఈరోజు పొత్తుల కధ ఒక కొలిక్కి వస్తే, 22న మోడీ సభతో ప్రచారం మొదలు పెడతారేమో!

ముసలాయన పొట్టలో 12 బంగారు బిస్కెట్లు

  ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రికి స్థానిక వ్యాపారి అయిన ఒక ముసలాయన వచ్చాడు. తాను మంచినీళ్ళు తాగుతూ వుండగా పొరపాటుగా బాటిల్ మూత గొంతులో పడి పొట్టలోకి వెళ్ళిపోయిందని, దాన్ని ఆపరేషన్ చేసి బయటకి తీయండని రిక్వెస్ట్ చేశాడు. ఎక్స్ రే, స్కానింగ్ గట్రాలు చేసిన డాక్టర్లకి పొట్టలో బాటిల్ మూత అయితే కనిపించలేదుగానీ, ఏవో లోహం తాలూకు ఆనవాళ్ళు కనిపించాయి. డాక్టర్లు ఆ ముసలాయనకి ఆపరేషన్ చేస్తే పొట్టలోంచి మొత్తం 12 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని డాక్టర్లు పోలీసుల చెవిలో వేశారు. పోలీసులు వచ్చి ముసలాయన్ని ఇంటరాగేట్ చేస్తే అసలు విషయం బయటపడింది. మొన్నీమధ్యే సదరు ముసలాయన సింగపూర్ వెళ్ళొచ్చాడు. సింగపూర్‌ నుంచి ఇండియాకి బంగారం తెచ్చుకోవాలని ముచ్చటపడ్డాడు. మామూలుగా అయితే కస్టమ్స్ వాళ్ళకి దొరికిపోతానని ఎంచక్కా పన్నెండు బంగారు బిస్కెట్లు మింగేశాడు. కస్టమ్స్ దగ్గర ఎలాంటి ఇబ్బందీ రాలేదుగానీ, ఆ తర్వాతే ముసలాయనకి అసలు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తాను మింగిన 12 బంగారు బిస్కెట్లు నంబర్ టూకి వెళ్తే బయటపడిపోతాయని అనుకున్నాడు. కానీ అలాంటిది జరగకపోవడంతో టెన్షన్ పడిపోయాడు. బాటిల్ మూత సాకు చెప్పి ఆస్పత్రిలో చేరాడు. ఆపరేషన్ చేసిన డాక్టర్లు మీ పొట్టలో బంగారం మీదే అని తనకే ఇచ్చేస్తాడని అనుకున్నాడు. అయితే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముసలాయన ప్లాన్ అడ్డం తిరిగింది.