అదొక వేస్ట్ కార్యక్రమం...దానికి నేనెందుకు?

  రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డితో తనకున్న రాజకీయ విభేదాలను పక్కనబెట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. కారణం అతను ప్రధాన ప్రతిపక్షనాయకుడనే. అప్పుడు చంద్రబాబును అభినందించిన జగన్మోహన్ రెడ్డి, ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.   “చంద్రబాబు నాయుడు ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవని చెపుతూనే దాదాపు ముప్పై కోట్లు ఖర్చు చేసి ఇంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయడం సబబా? అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉందని చెపుతున్నపుడు ఇంకా అనవసర వృధా ఖర్చులు ఎందుకు చేస్తున్నట్లు? తెదేపా నేతలు కొందరు ఈ కార్యక్రమం కోసం కూడా విరాళాలు సేకరిస్తున్నట్లు నేను విన్నాను. మరి అటువంటప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంత ఆర్భాటంగా ఎందుకు చేస్తున్నట్లు? ఇంత భారీగా ప్రజాధనం వృధా చేసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత వృధా చేయాలని నేను కోరుకోవడం లేదు,” అని అన్నారు.   “చంద్రబాబు రుణమాఫీ ఫైలుపై తోలి సంతకం చేసినా దానిని ఆయన ఖచ్చితంగా అమలు చేస్తారనే నమ్మకం నాకు లేదు. ఏవో కుంటి సాకులు చెప్పి తప్పుకోవడం ఖాయం. అదేజరిగితే ప్రజల తరపున వైకాపా ఆయనను తప్పకుండా నిలదీస్తుంది. ఎన్నికల సమయంలో ఆయన అనేక భూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచారు. అందువల్ల ఇప్పుడు ఆయన చేసిన హామీలన్నిటినీ నెరవేర్చేవరకు ఆయన ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉంటాము. ప్రజలు మమ్మల్ని ఆపని చేసేందుకే ప్రతిపక్ష హోదా కల్పించారు. మేము మా బాధ్యత విస్మరించకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము,” అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

బంగారు నగలు కొనకండి.. ఎందుకంటే...

      రేపో ఎల్లుండో బంగారమో, బంగారు నగలో కొనాలని అనుకుంటున్నారా? అయితే ఆగండి.. ఆగిపోండంతే! ఒక వారం పదిహేను రోజులు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని ఆ తర్వాత బంగారం కొన్నారంటే బోలెడంత తక్కువ ధరకే బంగారు నగలు వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే బంగారం మీద వున్న ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించడానికి ఎన్డీయే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం 15 శాతంగా వున్న దిగుమతి సుంకాన్ని 2 నుంచి 4 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలా జరిగితే బంగారం దిగుమతులు బాగా పెరుగుతాయి. అప్పుడు ఆకాశంలో విహరిస్తున్న బంగారం ధర నేల మీదకి దిగివచ్చే అవకాశం వుంది. యుపిఎ హయాంలో బంగారం దిగుమతి విషయంలో చిదంబరం లేనిపోని ఆంక్షలు విధించడంతో బంగారం ధర కొండెక్కి కూర్చుంది. ఇప్పుడు యుపిఎ ప్రభుత్వం ఎలాగూ కొండెక్కి పోయింది కాబట్టి, ఆ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా బంగారం దిగుమతులపై వున్న ఆంక్షలను సరళీకృతం చేయడంతోపాటు దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్య వల్ల బంగారం ధరలు దిగివచ్చే అవకాశం వుంది. కాబట్టి బంగారు నగలు కొనాలని అనుకుంటున్న వాళ్ళు కొంతకాలం ఆగితే బెటర్. అలాగే మీరు మీ దగ్గర వున్న బంగారాన్ని అమ్మేయాలని అనుకుంటున్నారా? అయితే అర్జెంటుగా అమ్మేయండి.. ఆలసించిన ఆశాభంగం.

ప్రధాని, రాష్ట్రపతిలను కలవనున్నకేసీఆర్

  తెలంగాణా ముఖ్యమత్రి హోదాలో కెసిఆర్ ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలవబోతున్నారు. మొదట ఆయన ప్రధాని మోడీని సాయంత్రం 4.15 గం.లకు కలిసి, తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వవలసినదిగా కోరనున్నారు. దానితో బాటు పోలవరం ముంపు గ్రామాల సమస్య, తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమయిన నిధులు, అనుమతులు, అదనపు విద్యుత్తు కేటాయింపు మరియు పెండింగులో ఉన్న అనేక ఇతర ప్రాజెక్టుల గురించి చర్చించి, వాటి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరనున్నారు. కేసీఆర్ తన ప్రమాణ స్వీకారానికి కేంద్రమంత్రులెవరినీ ఆహ్వానించనందున, ఇప్పుడు తన ప్రభుత్వం నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు ప్రధాని మోడీని, కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించనున్నారు. తరువాత సాయంత్రం 6.15 గం.లకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు. కేసీఆర్ ప్రధానిని కలిసే ముందు కొంతమంది కేంద్రమంత్రులను కలిసి వారితో కూడా తెలంగాణకు సంబంధిన వివిధ అంశాలను చర్చించి, వారి సహకారం కోరనున్నారు. కేసీఆర్ నిన్న సాయంత్రం డిల్లీ చేరుకొన్నారు. మళ్ళీ ఈరోజు రాత్రి హైదరాబాదుకు తిరిగివస్తారు.

గూగుల్‌ నుంచి అద్భుత ట్యాబ్లెట్ పీసీ ‘ట్యాంగో’

  ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ రంగంలో రారాజు గూగుల్ కంప్యూటర్ ఉపకరణాల రంగంలో కూడా తన ముద్రని వేయడానికి ప్రయత్నిస్తోంది. సాంకేతికంగా ఒక అద్భుతంలా వుండే ట్యాబ్లెట్ పీసీని త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ ట్యాబ్ పేరు ‘ట్యాంగో’. ఈ ఏడాది చివరికల్లా ‘ట్యాంగో’ మార్కెట్లోకి వచ్చే అవకాశం వుందని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌విడియా టెగ్రా కె1 ప్రాసెసర్‌తో ‘ట్యాంగో’ రూపొందింది. అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, వైఫై, 4జీ దీనిలో ఇతర ప్రత్యేకతలు. నిర్మాణాలు, రోడ్లు, కదిలే వస్తువులు, వ్యక్తులు ఎంత దూరంలో ఉన్నారు, పరిమాణం.. ఇలా పరిసరాలను పూర్తిగా అర్థం చేసుకునేలా ట్యాబ్లెట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పరిసరాలను 3డీలో స్కాన్ చేసేందుకు వీలుగా మోషన్ ట్రాకింగ్ కెమెరాలు మూడింటిని వెనుకవైపు అమరుస్తున్నారు. సెకనుకు 2.5 లక్షలకుపైగా 3డీ కొలతలను ఇవ్వగలదు. మొబైల్ 3డీ సెన్సింగ్ రంగంలో పనిచేసేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. తొమ్మిది దేశాలకు చెందిన యూనివర్సిటీలు, పరిశోధనశాలలు, పరిశ్రమ నిపుణులతో కూడిన బృందం దీని అభివృద్ధిలో నిమగ్నమయ్యారు. ధర రూ.60 వేలు.

కేసీఆర్ ప్రభుత్వ వైఖరికి తెలంగాణలో ఇద్దరు రైతుల బలి!

  తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరు రైతులను బలి తీసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసిన ఒక రైతు పరిస్థితి విషమంగా వుంది. ఏ రైతుల అండతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో అదే రైతులను తన వైఖరి ద్వారా బలి తీసుకోవడం విషాదం. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. టీఆర్ఎస్ అధినేత పలు సందర్భాలలో ఈ విషయాన్ని ప్రకటించారు. రుణమాఫీ చేస్తే తమ కష్టాలు తీరిపోతాయని భావించిన రైతులు టీఆర్ఎస్‌కి ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ మాట మార్చింది. రుణ మాఫీ విషయంలో రకరకాల మెలికలు పెట్టింది. దాంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఖిన్నులయ్యారు. తాము నమ్మిన టీఆర్ఎస్ తమను దారుణంగా మోసం చేస్తూ వుండటంతో తట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. కొంతమంది ఆగ్రహంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తూ వుండగా, కొంతమంది సున్నిత మనస్కులు ప్రాణాలే కోల్పోయారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో ఒక రైతు కేసీఆర్ వైఖరి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కి చెందిన రైతుబిడ్డ దత్తాత్రేయ (55) తాను బ్యాంకులో చేసిన రుణం తీరే అవకాశాలు కనిపించకపోవడంతో దిగులు చెందాడు. టీవీలో రుణమాఫీ విషయంలో టీఆర్ఎస్ అభ్యంతరాలకు సంబంధించిన వార్త చూస్తూ గుండెపోటుతో మరణించారు. అలాగే కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన నూనె స్వామిరెడ్డి (50) కూడా తన అప్పు తీరదేమో, తనకు రుణమాఫీ వర్తించదేమోనన్న బెంగతో గుండెపోటుతో కన్నుమూశారు. అలాగే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రైతు రుణమాఫీ అవదమోనన్న బెంగతో పురుగుల మందు తాగారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా వుంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారం తిరగకుండానే ఇన్ని ఘోరాలకు కారణమైంది. ఇక భవిష్యత్తు ఎలా వుంటుందో ఊహించడానికే భయమేస్తోంది.

ముదనష్టపు మొగుడు: నెట్‌లో భార్య నగ్న ద‌ృశ్యాలు

  మహారాష్ట్రలోని థానేలో పరమ నీచుడైన ఒక మొగుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని పెళ్ళిలో ప్రమాణం చేసిన ఆ నీచుడు డబ్బు కోసం అతి దారుణమైన పనికి ఒడిగట్టాడు. తన భార్య నగ్న దృశ్యాలను వీడియో చిత్రీకరణ చేసి వాటిని ఓ బూతు ‌వెబ్ సైట్‌కి అమ్మేశాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. థానేకి చెందిన ఆశిష్ గుప్తా అనే ఒక ముప్పయ్యేళ్ళ త్రాష్టుడు ఉద్యోగం, సంపాదన లేకపోవడంతోపాటు దురలవాట్లు కూడా బాగా పెరిగిపోవడంతో కట్టుకున్న భార్యని వ్యాపార సాధనంగా భావించాడు. భార్యకు రక్షణగా ఉండాల్సిన భర్తే సంపాదన కోసం నీచుడిగా మారాడు. తన భార్య నగ్నంగా వున్నప్పుడు ఆ దృశ్యాలను వీడియో తీసి ఒక బూతు సైట్లో వుంచాడు. ఆ విషయం బయటపడి భార్యకి తెలిసిపోయింది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ముదనష్టపు మొగుడిని అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి నిర్మలా సీతారామన్

  కేంద్రమంత్రిగా నియమితురాలైన బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మంత్రి పదవి స్వీకరించిన ఆరు నెలల లోపున లోక్‌సభకు గానీ, రాజ్యసభకు గానీ ఎన్నిక కావలసి వుంటుంది. అందువల్ల నిర్మలా సీతారామన్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి మృతితో ఏర్పడిన రాజ్యసభ ఖాళీని సీతారామన్‌కు కేటాయించనున్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఉభయసభల్లో సభ్యత్వం లేని నిర్మలా సీతారామన్‌కు స్వతంత్ర హోదాతో కూడిన మంత్రి పదవిని నరేంద్ర మోడీ కేటాయించారు. నిర్మలా సీతారామన్ తమిళనాడుకు చెందిన మహిళ అయినప్పటికీ ఆమె ఆంధ్రప్రదేశ్ కోడలు. విశాలాధ్ర మహాసభ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా వుండటానికి ప్రయత్నించిన పరకాల ప్రభాకర్ భార్యే నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం వల్ల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ వెయిట్ మరింత పెరిగే అవకాశం వుంది.

శిల్పాశెట్టికి మరో జీవితం

  నేత్రదానం చేయండి... మరోసారి జీవించండి అనేది నేత్రదానానికి సంబంధించిన సందేశం. నిజమే. మనం నేత్రదానం చేస్తే మరణించి కూడా జీవిస్తాం. రెండో జన్మ పొందుతాం. ఈ విషయాన్నే బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కూడా చెబుతోంది. చెప్పడమే కాదు ఆచరించి కూడా చూపించింది. అన్ని దానాల్లో నేత్రదానం గొప్పదని చాటుతూ బాలీవుడ్ తార శిల్పాశెట్టి నేత్రదానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. ముంబైలోని యశ్వంత్ సమాజిక్ ప్రతిస్థాన్ సామాజిక సంస్థకు తన నేత్రాలను శిల్పాశెట్టి దానం చేశారు. శిల్ప భర్త రాజ్ కుంద్రా, సోదరి షమితాశెట్టి కూడా తన నేత్రాలను దానం చేసే డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శిల్ప మాట్లాడుతూ, ‘‘నా మరణం తర్వాత నా కళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నేత్రదానం చేస్తే నా మరణం తర్వాత నా నేత్రాలు మరొకరికి దృష్టిని ప్రసాదిస్తాయనే విషయం నాకు సంతృప్తిని కలిగిస్తోంది’’ అన్నారు.

యాచకవృత్తి ఏటా టర్నోవర్ అక్షరాలా 140 కోట్లు!

  తెలంగాణలో యాచకుల ద్వారా ఏటా 140 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయనే జరుగుతున్నాయనే ఆశ్చర్యకరమైన వాస్తవం తాజాగా బయటపడింది. ఈ బిచ్చగాళ్ళ వ్యవస్థను తెలంగాణలో కొనసాగించరాదంటూ ఒక లాయర్ హైకోర్టులో వేసిన పిటిషన్ కారణంగా ఈ నిజం బయటపడింది. హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ చూసినా యాచకులు కనిపిస్తూ వుంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అయితే ఏదో శారీరక లోపం వున్నవారిలా నటిస్తూ యాచిస్తూ వుంటారు. హైదరాబాద్‌లో యాచించే వారిలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వారి సంఖ్యే ఎక్కువగా వుంటుంది. వీరందరూ వందల సంఖ్యలో వుంటారు. వీరంతా ఐకమత్యంగా వుంటారు. ప్రతిరోజూ తెల్లవారగానే తమ సొంత ఆటోలలో ఎక్కి వివిధ సిగ్నల్స్ దగ్గర దిగిపోయి బాగా చీకటి పడిపోయే వరకూ అక్కడే యాచిస్తారు. చీకటి పడ్డాక వారిని ఆటో వచ్చి పికప్ చేసుకుంటుంది. ఉత్తర భారతదేశ: నుంచి వచ్చే బిచ్చగాళ్ళ టీమ్‌లు సిగ్నల్స్ దగ్గర యాచించే స్థానిక బిచ్చగాళ్ళను తన్ని తరిమేస్తూ వుంటారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే యాచకుల సంఖ్యాబలం ఎక్కువగా వుండటం వల్ల స్థానికంగా, ఒక్కరే వుండే బిచ్చగాళ్ళు వారిని ఎదుర్కోలేక వేరే ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతూ వుంటారు. సినిమాల్లో చూపించినట్టుగా వడ్డీలకు డబ్బులు తిప్పే బిచ్చగాళ్ళు, లక్షల రూపాయల ఆస్తులు వున్న బిచ్చగాళ్ళు కూడా వుంటారట. హైదరాబాద్‌లో పెరిగిపోయిన బిచ్చగాళ్ళ వ్యవస్థను రూపుమాపాలనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే అవి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

స్మితా సబర్వాల్ పర్సనల్, ఇంట్రస్టింగ్ మేటర్స్

      మెదక్ జిల్లా కలెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న స్మితా సబర్వాల్. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2001లో ట్రైనీ కలెక్టర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. యువతరానికి స్ఫూర్తిదాయకంగా వుండే స్మితా సబర్వాల్ పర్సనల్ విశేషాలు....     1977 సంవత్సరం జూన్ 19వ తేదీన జన్మించిన స్మిత  గ్రాడ్యుయేషన్ హైదరాబాద్‌ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో పూర్తి చేశారు. ఈమె ఎన్ఎస్ఎస్‌లో చురుకైనవాలంటీర్. బిజినెస్ లా అకౌంటెన్సీ మార్కెటింగ్‌లో డిగ్రీ హోల్డర్.  ఏ గ్రేడులో ఉత్తీర్ణులైన ప్రతిభాశాలి. 2001  ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన స్మితా... 2001లో మొదట అదిలాబాద్‌లో ట్రైనీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్‌గా, గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా, కడపలో ప్రాజెక్టు డైరక్టర్‌గా, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, విశాఖపట్టణంలో వాణిజ్యపన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. అనంతరం హైదరాబాద్‌లో జాయింట్ కలెక్టర్‌గా, 2010లో కరీంనగర్ కలెక్టర్‌గా, నిన్నటి వరకుమెదక్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా అనేక మంచి పనులు చేసి జిల్లా వాసుల నుంచి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. తెలుగు, బెంగాల్, ఇంగ్లీషుల్లో అనర్గళంగా మాట్లాడే స్మితా సబర్వాల్ అండర్ 16 బ్యాడ్మింటన్ విభాగంలో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించారు. అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో కూడా ఈమె పాల్గొన్నారు. స్మితా సబర్వాల్ భర్త పేరు అకున్ సబర్వాల్. ఆయన ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.

కాళ్ళమీద పడొద్దు: మోడీ వార్నింగ్

      రాజకీయ రంగంలో, సినిమా రంగంలో సక్సెస్‌లో వున్న వాళ్ళ కాళ్ళమీద పడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా వుంది. ఎవరితో అయినా ఏదైనా పనివుంటే కాళ్ళమీద పడిపోయి కాకాపట్టడం ఈ రెండు ఫీల్డులలో మామూలే. అలాగే ఈ రెండు రంగాల్లో చాలామందికి ఎదుటివారిని తమ కాళ్ళమీద పడేలా చేసుకునే అలవాటు వుంటుంది. ఎవరి కాళ్ళమీదా పడకుండా వెన్నెముక నిటారుగా పెట్టి నిలుచునేవారికి బాగుపడే అవకాశాలు ఈ రెండు రంగాల్లో చాలా తక్కువగా వుంటాయి. యు.పి.ఎ. ఛైర్ పర్సన్‌గా, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదేళ్ళు పదవి వెలగబెట్టిన సోనియాగాంధీ మేడమ్ గారికి కూడా ఈ పాదాభివందనాలంటే చాలా ఇష్టమని చెబుతూ వుంటారు. అయితే ఇలాంటి వ్యక్తిపూజ సంస్కృతిని ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకిస్తున్నారు. తనకు పాదనమస్కారం చేయొద్దని ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మోడీ శుక్రవారం ప్రసంగించిన సందర్భంగా ఈ సూచన చేశారు. ఎవరూ తనకు పాదాభివందనం చేయద్దని ఆయన కోరారు. వ్యక్తిపూజకు తాను వ్యతిరేకమని తేల్చిచెప్పారు. కష్టపడి పనిచేయాలని ఎంపీలకు ఆయన సూచించారు. ప్రతిభ, సామర్థ్యాలు పెంచుకుని మంచి పార్లమెంటేరియన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంపీలకు మోడీ చెప్పారు.

కాంగ్రెస్‌లో శశిథరూర్ కలకలం

        కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ, మాజీ మంత్రి శశిథరూర్ నరేంద్రమోడీని పొగడ్డం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. హఫింగ్‌టన్ పోస్ట్ అనే అమెరికన్ వెబ్‌సైట్‌లో రాసిన ఒక వ్యాసంలో శశిథరూర్ నరేంద్రమోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆ పొగడ్తలన్నీ కేవలం మోడీని పొగిడినట్టు మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీని తిట్టినట్టు ఉన్నాయని కాంగ్రెస్‌లో చాలామంది ముఖాలు మాడ్చుకున్నారు. ‘‘మోడీ 1.0 వెర్షన్ నుంచి 2.0 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయ్యారు. రాజకీయాలలోకి ప్రవేశించిన మొదటి దశలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రతినిధిగా ఉన్న మోడీ.. ఇప్పుడు రెందో దశలో ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా ఆదరిస్తుండడం, ప్రజలందరినీ కలుపుపోయేలా చర్యలు తీసుకుంటుండం ఆయనలోని మార్పుకు నిదర్శనం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధునిక అవతారం అభ్యుదయశీలంగా ఉంది. అందరినీ కలుపుకుని పోయేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలను గుర్తించకపోవడం అమర్యాదకరం’’ అంటూ శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల విషయంలో మణిశంకర్ అయ్యర్ లాంటి నాయకులు శశిథరూర్‌కి వ్యతిరేకంగా చాలా ఘాటుగా స్పందించారు. అయ్యర్ శశిథరూర్‌‌ని ఏకంగా ‘ఊసరవెల్లి’ అని సంభోదించి మాట్లాడారు. థరూర్ పరిపక్వత లేని రాజకీయ నాయకుడని, ఆయన ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలు నడపటం మంచిది కాదని అయ్యర్ వ్యాఖ్యానించారు. థరూర్ చేసిన వ్యాఖ్యలు తనను బాధకు గురిచేశాయని అయ్యర్ అన్నారు. కాంగ్రెస్‌లో రేగిన ఈ కలకలం ఎటు దారి తీస్తుందో చూడాలి.

మోడీ పర్యటించే దేశాలు ఏవి?

      ప్రధానమంత్రి విదేశాలలో పర్యటించడం అనేది మామూలు విషయం. ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ పర్యటించనున్న మొదటి దేశం ఏదో తెలుసా? మన దేశం పక్కనే వున్న బుజ్జి దేశం భూటాన్. ఆ తర్వాతి దేశం ఏమిటో తెలుసా? అది ఆషామాషీ దేశం కాదు.. అభివృద్ధిలో ప్రపంచం మొత్తానికీ ఆదర్శంగా నిలిచే జపాన్. యుపిఎ ప్రభుత్వం హయాంలో నాశనమైపోయిన దేశాన్ని మళ్ళీ అభివృద్ధి పథం వైపు నడిపించడానికి నడుం కట్టుకున్న మోడీ తన విదేశీ పర్యటనకు జపాన్‌‌ని ఎంపిక చేసుకోవడం సమయోచితంగా వుంది. జూలైలో మోడీ జపాన్కు వెళ్లనున్నారు. ప్రధాని కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.మోడీ తొలి విదేశీ పర్యటనకు ఈ నెలాఖరులో భూటన్ వెళ్లనున్నారు. ఇక సెప్టెంబర్ చివర్లో అమెరికాకు వెళ్లనున్నారు.

కాశ్మీరీ పండిట్లకు మోడీ అండ

      కాశ్మీరీ పండిట్లకు అండగా నిలవటానికి మోడీ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. కాశ్మీర్‌లో చాలామంది కాశ్మీరీ పండిట్లు తీవ్రవాదులకు భయపడి కాశ్మీర్ నుంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లో జీవిస్తున్నారు. వారికి భరోసా ఇచ్చి, వారిని మళ్ళీ కాశ్మీర్‌కి తీసుకువచ్చేలా ప్రయత్నించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు జమ్ము, లఢక్ ప్రాంతాల అభివృద్ధికి క‌ృషి చేయాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. 1990లో తీవ్రవాదుల భయంతో రాష్ట్రం విడిచి వెళ్లిన పండిట్లు తిరిగి స్వస్థలాలకు రావాలంటే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అలాగే ఇప్పటి వరకూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా వ్యవహరిస్తున్న ప్రాంతాన్ని ఇక నుంచి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌గా పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కాశ్మీర్ సమస్యను అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మోడీ ప్రభుత్వం గుర్తించినట్లయింది. ఒక ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని మాత్రమే పిలవడం వల్ల ఇతర ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందని ఎన్డీయే ప్రభుత్వంఅభిప్రాయపడుతోంది.

టీఆర్ఎస్, కాంగ్రెస్ వల్లే హైదరాబాద్ నాశనం: బాబు

      హైదరాబాద్ నగరాన్ని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భ్రష్టు పట్టించాయని తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. తెలంగాణలో అభివ‌ృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని, తెలుగుదేశం హయాంలోనే తెలంగాణ మిగులు బడ్జెట్‌లోకి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఘనత అంతా తెలుగుదేశం పార్టీకే చెందుతుందని, ఈ అభివృద్ధిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ సహకారంగానీ, తోడ్పాటు గానీ లేదని చంద్రబాబు అన్నారు. ఈ రెండు పార్టీలు హైదరాబాద్‌ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశాయని ఆయన విమర్శించారు. తెలంగాణ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశామని, బాబ్లిపై మహారాష్ట్రానికి వెళ్లి పోరాటం చేశామని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ కోసం పరాయి రాష్ట్రంలో జైలులో ఉన్నది తెలుగుదేశం నేతలేనని ఆయన అన్నారు. తెలంగాణ టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నడూ రాజీ పడలేదని ఆయన అన్నారు. తాను ఆంధ్రప్రదేశ్‌‌కి ముఖ్యమంత్రిగా వున్నప్పటికీ తెలంగాణ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని, వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చెప్పారు.