జయ వెడలె కుర్చీ వెంటరాగ...

  ఇంతవరకు జనాలకి రాజు వెడలె రవి తేజములరియగా...కుడి ఎడమల్ దాల్ కత్తుల మెరియగా అనే పాత పద్యం మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో కత్తులు, బల్లేలు వెంట తెచ్చుకోవడం అనాగరికంగా ఉంటుంది గనుక మన జయమ్మ..అంటే తమిళనాడు ముఖ్యమంత్రి తన కుర్చీ వెంటబెట్టుకొని డిల్లీ వెళ్ళారు.   గతంలో మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు డిల్లీ నుండి ప్రత్యేక విమానంలో తన చెప్పులను తెప్పించుకొన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మన జయమ్మ వంతు. ఆమె నిన్న ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసేందుకు డిల్లీ వచ్చినప్పుడు, తను నిత్యం వాడే ఒక కుర్చీను కూడా తన వెంట తీసుకువెళ్ళారు. ప్రధానిని, ఆర్ధికమంత్రిని కలిసినప్పుడు ఆమె వారి కార్యాలయం ఉండే కుర్చీలో కూర్చోకుండా, తను వెంట తెచ్చుకొన్న కుర్చీని వేయించుకొని అందులో కూర్చొని వారితో సమావేశమయ్యారు. వారి సమావేశం ముగిసిన తరువాత, ఆమె సిబ్బంది ఆ కుర్చీని మళ్ళీ వెంట తీసుకుపోయారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలిస్తున్న ఆమె ఈవిధంగా ప్రవర్తించడం చూసి జనాలు ముక్కున వేలేసుకొన్నారు.   అయితే ఆమెకు ఆ కుర్చీలో కూర్చొంటే అంతా మంచే జరుగుతుందనే సెంటిమెంటు ఉందని కొందరు, కాదు..ఆమెకు నడుం నొప్పి ఉన్నందున ఆమె ప్రత్యేకంగా తయారుచేయించుకొన్న కుర్చీ వెంటబెట్టుకొని తిరగవలసి వస్తోందని ఆమె అభిమానులు.. ఇలా రకరకాల కుర్చీ కబుర్లు వినబడుతున్నాయి. అదేమీ కాదు..ఆమె తన కుర్చీని చెన్నైలో వదిలిపెట్టి డిల్లీ వెళితే, అందులో ఆ పెద్దాయన కరుణానిధి ఎక్కడ సెటిల్ అయిపోతారో అనే భయంతోనే ఆమె తన కుర్చీని వెంటమోసుకొని తిరుగుతున్నారని గిట్టని వాళ్ళు ఒకటే ఇకఇకలు, పకపకలు. ఇంతకీ ఆమె ఆ కుర్చీలో కూర్చొని డిల్లీలో ఏమి సాధించేరో ఇంకా తెలియవలసి ఉంది.

బంగారం రుణాలు కూడానా? మావల్లకాదు బాబోయ్: ఈటెల

  రైతులు తీసుకున్న పంటరుణాల మాఫీకి ఓకే.. అది కూడా గత సంవత్సరం తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తాం.. అందులోనూ లక్ష రూపాయల లోపు రుణాలనే మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. రైతులు బంగారం బ్యాంకుల్లో పెట్టి తీసుకున్న రుణాలను మాత్రం మాఫీ చేయమని ఆయన స్పష్టం చేశారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి పంట రుణాలు మాఫీ చేస్తామని ఆయన తెలిపారు. బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణమాఫీపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని... అవి పంట రుణాల కిందకు రావని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఇదిలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బ్యాంకర్లతో సమావేశం అయ్యారు. బ్యాంకుల్లో రైతుల రుణాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రూ. లక్ష లోపు రుణమాఫీకి సహకరించాలని బ్యాంకర్లను ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు. మరో వారంరోజుల్లో మరోసారి భేటీ కావాలని కేసీఆర్ కోరారు.రూ.లక్ష వరకు రుణమాఫీకి నిర్ణయం తీసుకోవటంతో ప్రభుత్వంపై సుమారు రూ. 12 వేల కోట్ల భారం పడే అవకాశం ఉంది.

ముండే అంత్యక్రియలు: తలకొరివి పెట్టిన కూతురు

  మంగళవారం ఉదయం న్యూఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గోపీనాథ్ ముండే అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం మధ్నాహ్నం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని పర్లీలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముండేకు ముగ్గురు కుమార్తెలున్నారు. కుమారులు లేరు. దాంతో ఆయన పెద్ద కుమార్తె పంకజ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయనకు పంకజ తలకొరివి పెట్టారు. ఇక తమ అభిమాన నేతను కడసారి దర్శించుకునేందుకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు ముండే అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి పర్లి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు వచ్చారు. తమ ప్రియతమ నాయకులు ఆకస్మికంగా మరణించడంతో వారంతా భోరున రోదించారు.

18 మంది ప్రాణాలు తీసిన సెల్ ఫోన్

  సెల్ ఫోన్ హెల్ ఫోన్ అయింది. 18 మంది ప్రాణాలు తీసింది. నేపాల్‌లో జరిగిన ఒక బస్సు ప్రమాదంలో 18 మంది భారతీయులు మరణించారు. 53 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా వుంది. 74 మంది భారతీయ ప్రయాణికులతో వున్న ఒక బస్సు నేపాల్‌లోని ప్యూథాన్ నది ప్రాంతంలో లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో వున్నవారందరూ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఈ ప్రమాదంలో ఒకరిద్దరు తప్ప అందరూ తీవ్రంగా గాయపడ్డారు. 18 మంది సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఆస్పత్రికి తరలించిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారణం ఒక సెల్ ఫోన్.. అవును నిజంగా ఒక సెల్ ఫోన్. ఈ బస్సును నడుపుతున్న డ్రైవర్ ఒక ఇరుకు రోడ్డు మీద ప్రయాణిస్తూ తన చేతిలో వున్న సెల్‌ఫోన్‌ని డయల్ చేయడానికి ప్రయత్నించాడు. అంతే, ఒక్కక్షణం పాటు డ్రైవింగ్ మీద నుంచి దృష్టి సెల్ ఫోన్ మీదకి మళ్ళడంతో అతను డ్రైవ్ చేస్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే వున్న లోయలోకి దూసుకుపోయింది.

అన్నాచెల్లెళ్ళని రోడ్డు మింగేసింది!

మంగళవారం నుంచి రోడ్డు ప్రమాదాల సీజన్ మొదలైనట్టుంది. మంగళవారం నాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే కూడా రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. బుధవారం నాడు కూడా పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా కట్టంగూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నాచెల్లెళ్ళు దుర్మరణం పాలయ్యారు. అన్నాచెల్లెళ్ళు ప్రయాణిస్తు్న్న ద్విచక్ర వాహనాన్ని విజయవాడ నుంచి హైదరాబాద్‌కి వస్తున్న ఆర్టీసీ గరుడ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. అలాగే శ్రీకాకుళం మండలంలోని కొత్త వంతెన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు మరణించారు.

పిల్లలూ ఇండియాకి వచ్చేయండి!

  ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ శాంతిభద్రతల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దాంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న వేలాదిమంది భారతీయ విద్యార్థులను తిరిగి వచ్చేయాల్సిందిగా సూచించింది. అధికారిక లెక్కల ప్రకారం ఉక్రెయిన్‌లో 4700 మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యని చదువుకుంటున్నారు. అక్కడ పరిస్థితి సున్నితంగా ఉన్న నేపథ్యంలో పరిస్థితులు సర్దుమణిగే వరకూ భారతీయ విద్యార్థులు ఇండియాకి తిరిగి వస్తే మంచిదన్న అభిప్రాయాన్ని భారతీయ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడే ఇండియాకి తిరిగిరావడం ఇష్టంలేని విద్యార్థులు ఘర్షణ పూరిత వాతావరణం వున్న ప్రాంతాల నుంచి ప్రశాంతంగా ఉండే ప్రాంతాలకు వెళ్ళిపోవాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తోంది.

లోక్‌సభ ప్రారంభం.. ముండేకి సంతాపం... వాయిదా

  దేశ పదహారవ లోక్‌సభ సమావేశమైంది. అయితే లోక్‌సభ ప్రారంభం కాగానే మంగళవారం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండేకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన ఆకస్మిక మృతికి సభ సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది.. అనంతరం సభ వాయిదా పడింది. ఈ సమావేశాలకు కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కమల్ నాథ్ ప్రొటెం స్పీకర్‌గా వ్యహరించారు. సభ ప్రారంభం కాగానే ఆయన ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ సమావేశం కాగానే సెక్రటరీ జనరల్ శ్రీధరన్ 16వ లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనను చదివి వినిపించారు.. తర్వాత గోపీనాథ్ ముండే మరణానికి సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన అనంతరం సభ వాయిదా పడింది.

డాన్ శీను దొరికిపోయాడు

  అడవుల్లో ఎర్రచందనం దుంగలను నరకడం, ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేయడంలో హత్యల వరకూ వెళ్ళిపోయిన మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ శ్రీనివాసులు నాయుడు అలియాస్ డాను శ్రీనుని పోలీసులు అరెస్ట్ చేశారు. మైదుకూరు పోలీసులు అతడిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన ఇతడు కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం కేసుల్లో ప్రధాన నిందితుడు. రాష్ట్రంలో విచ్చలవడిగా జరుగుతున్న ఎర్రచందనం చెట్ల నరికివేత, ఎర్రచందనం స్మగ్లింగ్‌ని నిరోధించడానికి గవర్నర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నేపథ్యంలో ఇటీవల దాదాపు 300 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు డాన్ శీనుని అరెస్టు చేయడంతో ఈ కేసులో పోలీసులు పెద్ద విజయం సాధించారు.

శాసనసభాపక్ష నాయకుడిగా బాబు ఎన్నిక నేడే

  ఈరోజు సాయంత్రం 6.30 గంటలకి తిరుపతిలో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం సమావేశం జరుగబోతోంది. ఇటీవల ఎన్నికలలో గెలిచినా తెదేపా శాశనసభ్యులందరూ ఈసమావేశంలో తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తమ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకొంటారు. ఈ ఎన్నిక లాంచనప్రాయమే అయినా, ముఖ్యమంత్రిగా భాద్యతలు చెప్పట్టేందుకు ఈ ప్రక్రియ అవసరం. అందువల్ల ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం తిరుపతి బయలుదేరి వెళతారు. ఆయన మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో బాటు మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం కల్పిస్తారనే సంగతి చాల గుట్టుగా ఉంచారు. బహుశః ఈ సమావేశంలో దీనిపై ఏదయినా చర్చ జరిగితే కొంత సమాచారం తెలియవచ్చును.

పడవ బోల్తా: ఇద్దరి మృతి, ముగ్గురు గల్లంతు

  పశ్చిమ గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వున్న సున్నపు బట్టీ రేవు దగ్గర గోదావరి నదిలో నాటు పడవ మునిగిపోవడంతో ఇద్దరు మరణించగా, ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ప్రాంతంలో జరిగిన ఒక వివాహానికి హాజరైన కోరుకొండకు చెందిన ఏడుగురు నాటు పడవలో గోదావరిలో విహరిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈదురు గాలుల కారణంగా నాటు పడవ బోల్తా పడటంతో పడవలో ప్రయాణిస్తున్న ఏడుగురు నీటిలో మునిగిపోయారు. వీరిలో ఇద్దరిని స్థానికులు కాపాడారు. నీటిలో మునిగిపోయిన వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఇద్దరిని సత్య (11), మల్లీశ్వరి (30)గా గుర్తించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ళను పిలిపించి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చీకటి పడిపోవడంతో గాలింపు నిలిపివేశారు. బుధవారం తిరిగి గాలింపు చేపడతారు.

శాసనమండలికి సి రామచంద్రయ్య

  కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభాపక్షం నేతగా మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క నేత కూడా శాసనసభకు ఎన్నిక అవనందున, శాసనసభలో కాంగ్రెస్ ప్రతినిధులు ఉండబోరు. మున్ముందు ఎప్పుడయినా ఉపఎన్నికలు జరిగి, అందులో కాంగ్రెస్ సభ్యులు గెలవగలిగితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కాంగ్రెస్ కాలుపెట్టగలదు. లేకుంటే వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ బయట భజన చేసుకొంటూ కాలక్షేపం చేయవలసిందే. 543మంది సభ్యులుండే లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ హోదా పొందేందుకు  కనీసం 10 శాతం (55మంది ) యంపీలు ఉండాలి. కానీ  కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 మంది యంపీలే ఉన్నారు. అయినప్పటికీ బీజేపీ దయతలచి కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కల్పించేందుకు అంగీకరించింది. బహుశః ఈ అవమానం భరించలేకనే సోనియా, రాహుల్ గాంధీలు పార్టీ పార్లమెంటరీ నాయకులుగా బాధ్యతలు చెప్పట్టేందుకు నిరాకరించారు. మాజీ కేంద్రమంత్రి మల్లికార్జున్ ఖార్గే ను లోక్ సభలో పార్టీ నాయకుడిగా నియమించబడ్డారు. గత పదేళ్ళు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడం స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు. ఇక తెలంగాణా అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్షం నేతగా కే.జానా రెడ్డి ఎంపికయ్యారు. శానమండలికి పార్టీ తరపున డీ. శ్రీనివాస్ నాయకుడిగా, షబ్బీర్ ఆలి ఉపనాయకుడిగా ఎంపికయ్యారు.  

కరుణానిధి @ 91 నాటౌట్!

      డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఏ ఫుడ్డు తింటున్నారోగాని చక్కగా 90 సంవత్సరాలు పూర్తిచేసుకుని 91 సంవత్సరంలో అడుగుపెట్టారు. నాస్తికవాదిగా ప్రస్థానం ప్రారంభించి, సినిమా రచయితగా తన ప్రతిభను నిరూపించుకుని, రాజకీయ నాయకుడిగా రాణించి, తమిళనాడు ముఖ్యమంత్రిగా సంచలనాలు సృష్టించి, ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న కరుణానిధి తమిళనాడు రాజకీయాలలో ఒక లెజెండ్. అందులోనూ కరుణానిధి స్వతహాగా తెలుగువాడు కావడం మనకి గర్వకారణం. అధికారం నుంచి దూరమైనా, కుటుంబ సమస్యలు, కేసులు చుట్టుముట్టినా, మనిషి మాత్రం ఎంతమాత్రం క్రుంగిపోకుండా గట్టిగా వున్నాడు. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో డీఎంకే పార్టీ మట్టిగొట్టుకుని పోయినా పెద్దమనిషి ఎంతమాత్రం తొణకలేదు. మంగళవారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని చెన్నైలో డీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కరుణానిధికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చక్రాల కుర్చీకి పరిమితమైనప్పటికీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కరుణానిధి ఉత్సాహంగా పుట్టినరోజువేడుకలు జరుపుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలలో ఉత్సాహంగా వున్న కరుణానిధిని చూసి పెద్దాయన ఎలాంటి సమస్య లేకుండా సెంచరీ పూర్తి చేస్తాడన్న నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ మార్క్ రాజకీయాలతో చిరంజీవి కాలక్షేపం

  తెలంగాణా కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం నాయకుడిగా ఎన్నికయిన కే.జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టి మరీ తెలంగాణను ఏర్పాటుచేసిందని, అందుకు ధన్యవాదాలు తెలియజేసుకొంటునానని అన్నారు. సోనియాగాంధీ తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీనే కాదు, తనను ఇంత కాలం నెత్తిన పెట్టిన మోసిన సీమాంధ్ర ప్రజలను, వారి భవిష్యత్తును కూడా పణంగా పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం, రాష్ట్రాన్ని రెండుగా విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేతిలో చిల్లి గవ్వ లేకుండా నడిరోడ్డు మీద వదిలిపెట్టింది.   నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుకొనేందుకు భవన సముదాయాల కోసం వెతుకోవడం చూస్తుంటే ఆంధ్ర ప్రజల కడుపు తరుక్కుపోతోంది. ఒకప్పుడు దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేడు ఈ దుస్థితి ఏర్పడటానికి కారణం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే. అందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు ప్రజలు ఎన్నికలలో గట్టిగా బుద్ది చెప్పినప్పటికీ, వారిలో ఏ మాత్రం పశ్చాతాపం కనబడకపోవడం చాలా విచిత్రం. పైగా ముంజేతి కంకణంలా వారి ఓటమికి కారణం స్పష్టంగా కనబడుతుంటే, అది తెలియనట్లు వారందరూ తమ ఓటమికి కారణాలు విశ్లేషించుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే.   రాష్ట్ర విభజన దెబ్బకి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవడంతో, తంతే బూర్లె గంపలో పడినట్లుగా రాత్రికి రాత్రి మెగా కాంగ్రెస్ నేతగా ఎదిగిపోయిన చిరంజీవి, తాము సోనియాగాంధీని కలిసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమని కోరామని అందుకు ఆమె తక్షణం స్పందించి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ వ్రాసేసారని గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదం. వెనకటికి ఒక ముసలమ్మ నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారదన్నట్లే ఉన్నాయి చిరంజీవి మాటలు. ఆయన, జేడీ శీలం వంటి మరికొందరిని వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమని అర్దించడం, అందుకు ఆమె ఎంతో ఉదారంగా అంగీకరిస్తూ మోడీకి లేఖ వ్రాయడం, మళ్ళీ ఆవిషయం మీడియాను పిలిచి మరీ గొప్పగా చెప్పుకోవడం చాలా నవ్వు తెప్పిస్తోంది.   చిరంజీవి సోనియా గాంధీని అడగకపోతే మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేయరా? లేక సోనియా గాంధీ మోడీకి లేఖ వ్రాయకపోతే, మోడీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాలికొదిలేస్తుందా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయిన తరువాత, చిరంజీవికి, కాంగ్రెస్ నేతలకు పనేమీ లేకుండా పోయింది. అప్పటికీ ఓటమికి కారణాలు కనిపెట్టుకొనే మిషతో ఇన్ని రోజులు కాలక్షేపం చేసినప్పటికీ, రాజకీయాలలో ఉన్నపుడు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం నిత్యం మీడియాలో కనబడాలి కనుకనే చిరంజీవి ఈ డ్రామా ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   అయితే చిరంజీవితో సహా రాజకీయ నాయకులందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఎన్నికలు రానంత వరకు వారెన్ని డ్రామాలు ఆడినా ప్రజలు అమాయకంగా మొహాలు వేసుకొని చూస్తూనే ఉంటారు. చప్పట్లు కూడా కొడుతుంటారు. కానీ ఎన్నికలలో మాత్రం వారందరికీ తగిన గుణపాటం నేర్పిస్తారని గ్రహించాలి. జరిగిన దానికి చిరంజీవి వంటి కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పకపోయినా పరువలేదు. పశ్చాతాపపడకపోయినా పరువాలేదు. కానీ ఆత్మవంచన చేసుకొంటూ, ఈవిధంగా ‘కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు’ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని గ్రహిస్తే వారికే మంచిది.   ఇప్పుడు ప్రజలలో రాజకీయ చైతన్యం చాల పెరిగింది. ఇప్పుడు ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి, సమర్ధతకే ప్రాధాన్యం ఇస్తున్నారనేందుకు మొన్న జరిగిన ఎన్నికలే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అయినప్పటికీ చిరంజీవి వంటి కాంగ్రెస్ నేతలు ‘కాంగ్రెస్ మార్క్ రాజకీయాలే’ కంటిన్యూ చేద్దామనుకొంటే వారినెవరూ వద్దనరు.

ఆమెకి కోపం వచ్చింది.. మొగుణ్ణి ‘ఎక్కడో’ కొరికింది

      భోపాల్‌లో ఒక ఇల్లాలికి భర్తమీద కోపం వచ్చింది. భర్తకి కూడా ఆమె మీద కోపం వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. భర్తని కొరికేసింది. ఎక్కడ కొరికిందని మాత్రం అడక్కండి.. ‘ఎక్కడో’ కొరికేసింది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే, భోపాల్‌లో కాపురం వుండే జితేంద్ర, ఉమా పాటిల్ అనే జంటకి నాలుగేళ్ళ క్రితం పెళ్ళయింది. వీళ్ళిద్దరూ చిలకాగోరింకల్లా కాపురం చేసుకునేవారు.     ఇప్పటికి కరెక్ట్‌గా నెల రోజుల క్రితం ఇద్దరి మధ్య వంటకి సంబంధించిన పాయింట్ మీద చిన్న గొడవొచ్చింది. ఆ చిన్న గొడవ కాస్తా బాగా ముదిరి ఇద్దరూ చుట్టుపక్కల వాళ్ళకి వినిపించేలా తిట్టుకోవడం వరకు డెవలప్ అయి, చివరకి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ గొడవలో ఉమా పాటిల్‌కి బీపీ బాగా పెరిగిపోయింది. దాంతో భర్తని ‘ఎక్కడో’ కొరికేసింది. దాంతో ఆ భర్తగారు లబోదిబో అనుకుంటూ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య తన విషయంలో చేసిన సదరు ‘ఘనకార్యం’ గురించి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు మొగుడూ పెళ్ళాన్ని కూర్చోబెట్టి, కౌన్సిలింగ్ చేశారు. ఇద్దరికీ రాజీ కుదిర్చారు. ఆ తర్వాత కుక్కకాటు ఎంత డేంజరో, మనిషి కాటు కూడా అంతే డేంజర్ కాబట్టి డాక్టర్ దగ్గరకి వెళ్ళి ట్రీట్‌మెంట్ చేయిచుకోమని సదరు భర్త జితేంద్రకి సూచించారు. అయితే జితేంద్ర ఆ సూచనని పెద్దగా పట్టించుకోలేదు. అయితే భార్యగారి ‘కాటు’ ప్రభావం నెలరోజుల తర్వాత బయటపడింది. ఉమా పాటిల్ కొరికిన సదరు స్థానం బాగా వాచిపోయింది. అప్పటికి జ్ఞానోదయమైన జితేంద్ర నెత్తీ నోరూ బాదుకుంటూ మంగళవారం నాడు పోలీస్ స్టేషన్‌కి, అటు నుంచి అటే ఆస్పత్రికి చేరుకున్నాడు. భార్య కాటు విషపూరితమవ్వడం వల్ల బాగా వాచిపోయిందని డాక్టర్లు తేల్చారు. ఈ వాపు తగ్గాలంటే భారీ స్థాయిలో ట్రీట్‌మెంట్ చేయాలని తేల్చారు. దాంతో జితేంద్ర బేర్‌మని ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. పోలీసులు మాత్రం భర్తని కొరికిన భార్య మీద ‘హత్యాయత్నం’ కేసు నమోదు చేశారు.

జూన్ 3.. చాలా చెడ్డ రోజు!

        జూన్ మూడో తేదీ చాలా చెడ్డరోజులా కనిపిస్తోంది. ఎందుకంటే ఈరోజు చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంగళవారం చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల వల్ల రోడ్లు రక్తసిక్తమయ్యాయి.    1. కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై హుజూరాబాద్ సమీపంలో మంగళవారం తెల్లవారుఝామున బస్సు, లారీ, ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో 25 మంది బస్సు ప్రయాణికులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా వుంది. 2. హైదరాబాద్‌లో ఒక లారీ రోడ్డు మీద బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ఒక లారీ మొదట ఒక మోటర్ బైక్‌ని ఢీకొంది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీలలో వున్న డ్రైవర్లు లారీల్లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. 3. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి పట్టణంలో రెండు బైకులు ఢీకొన్న దుర్ఘటనలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగి మరణించారు. 4. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో రోడ్డు పక్కన వున్న లారీని ఒక ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో బస్సులో వున్న 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 5. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం దగ్గర బ్రాండిక్స్ సంస్థకు చెందిన బస్సును లారీ ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 6. నల్గొండ జిల్లా మునగాల దగ్గర ఓల్వో బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.. మొత్తంమీద జూన్ 3 చాలా డేంజరస్ డే మాదిరిగా కనిపిస్తోంది. అందువల్ల ప్రయాణికులూ.. జాగ్రత్త..

ముండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవాడే!

      విధి చిన్నచూపు చూడటంతో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్నప్పటికీ, ఆయన త్వరలో మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయ్యేవారని, కానీ ఇంతలోనే విధి ఆయన్ని బలి తీసుకుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. గత కొంతకాలంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో శివసేన, బీజేపీ మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి ఇవ్వడానికి శివసేన అంగీకరించిన పక్షంలో గోపీనాథ్ ముండేనే ముఖ్యమంత్రి పదవిని పొందేవారు. మహారాష్ట్ర రాజకీయాలలో ముండే చాలా చురుకైన నాయకుడు కావడం, బీసీ వర్గాల్లో గట్టి పట్టుండటం, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మహారాష్ట్ర వ్యవహారాలపై తిరుగులేని సాధికారత సాధించడంతో ముండే పేరును బీజేపీ సీఎం అభ్యర్థిత్వానికి ముందుకు తెచ్చింది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తే ముండేనే ముఖ్యమంత్రి అయ్యేవారు. అయితే ఇంతలోనే విధి వక్రించడంతో గోపీనాథ్ ముండే అకాలమరణం పాలయ్యారు.

కేకేకి, కాకాకి ‘బాత్‌రూమ్’ గండం

      తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను ‘బాత్‌రూమ్’ గండం పట్టి వేధించింది. ఇద్దరు ప్రముఖ తెలంగాణ నాయకులు బాత్రూమ్‌లో కాలు జారి పడిపోవడం వల్ల ఆస్పత్రి పాలయ్యారు. వాళ్ళలో ఒకరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి కాగా, మరొకరు టీఆర్ఎస్‌లో కీలక వ్యక్తిగా మారిన మాజీ కాంగ్రెస్ నాయకుడు కె.కేశవరావు. ఈ ఇద్దరిలో వయోవృద్ధుడైన వెంకటస్వామి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలోని బాత్‌రూమ్‌లో జారిపడ్డారు. ఈ సంఘటనలో ఆయన కాలు విరిగింది. ఆయన్ని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వెంకటస్వామికి కుడి మోకాలు పైన ఎముక విరిగింది. అలాగే సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కె.కేశవరావు అక్కడ టాయిలెట్‌కి వెళ్ళి జారి పడిపోయారు. ఆయన్ని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కేశవరావుకు గాయాలయ్యాయా, లేదా అనే విషయం ఇంతవరకు తెలియరాలేదు.

ఆంధ్రా మీద సోనియా ఆశ చావనట్టుంది..

      రాష్ట్రాన్ని విభజించొద్దు మొర్రో అని సీమాంధ్రులు ఎంతగా మొత్తుకున్నా వినకుండా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన సోనియాగాంధీ ఎన్నికలలో సరైన ఫలితం అనుభవించారు. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ స్థానంలో కూడా సీమాంధ్రలో గెలవలేదు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం గెలిచే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తుంటే, సీమాంధ్ర ప్రజలు తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు.   అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులురాలు సోనియాగాంధీకి కాంగ్రెస్ పార్టీ మీద ఆశ చావనట్టు కనిపిస్తోంది. అందుకే సీమాంధ్ర ప్రజలను దువ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని ఆమె కోరారు. ఎపి రాజధాని నిర్మాణం కోసం సహకరించాలని, ఆర్థిక లోటు రాకుండా చూడాలని ఆ లేఖలో కోరారు. ఇదిగో సోనియమ్మా.. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మటాషైపోయింది. ఇప్పుడు తమరెంత ట్రై చేసినా ఉపయోగం లేదు.