కాళ్ళమీద పడొద్దు: మోడీ వార్నింగ్
posted on Jun 6, 2014 @ 6:07PM
రాజకీయ రంగంలో, సినిమా రంగంలో సక్సెస్‌లో వున్న వాళ్ళ కాళ్ళమీద పడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా వుంది. ఎవరితో అయినా ఏదైనా పనివుంటే కాళ్ళమీద పడిపోయి కాకాపట్టడం ఈ రెండు ఫీల్డులలో మామూలే. అలాగే ఈ రెండు రంగాల్లో చాలామందికి ఎదుటివారిని తమ కాళ్ళమీద పడేలా చేసుకునే అలవాటు వుంటుంది. ఎవరి కాళ్ళమీదా పడకుండా వెన్నెముక నిటారుగా పెట్టి నిలుచునేవారికి బాగుపడే అవకాశాలు ఈ రెండు రంగాల్లో చాలా తక్కువగా వుంటాయి.
యు.పి.ఎ. ఛైర్ పర్సన్‌గా, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదేళ్ళు పదవి వెలగబెట్టిన సోనియాగాంధీ మేడమ్ గారికి కూడా ఈ పాదాభివందనాలంటే చాలా ఇష్టమని చెబుతూ వుంటారు. అయితే ఇలాంటి వ్యక్తిపూజ సంస్కృతిని ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకిస్తున్నారు. తనకు పాదనమస్కారం చేయొద్దని ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మోడీ శుక్రవారం ప్రసంగించిన సందర్భంగా ఈ సూచన చేశారు. ఎవరూ తనకు పాదాభివందనం చేయద్దని ఆయన కోరారు. వ్యక్తిపూజకు తాను వ్యతిరేకమని తేల్చిచెప్పారు. కష్టపడి పనిచేయాలని ఎంపీలకు ఆయన సూచించారు. ప్రతిభ, సామర్థ్యాలు పెంచుకుని మంచి పార్లమెంటేరియన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంపీలకు మోడీ చెప్పారు.