కాంగ్రెస్‌లో శశిథరూర్ కలకలం
posted on Jun 6, 2014 @ 6:01PM
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ, మాజీ మంత్రి శశిథరూర్ నరేంద్రమోడీని పొగడ్డం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. హఫింగ్‌టన్ పోస్ట్ అనే అమెరికన్ వెబ్‌సైట్‌లో రాసిన ఒక వ్యాసంలో శశిథరూర్ నరేంద్రమోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆ పొగడ్తలన్నీ కేవలం మోడీని పొగిడినట్టు మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీని తిట్టినట్టు ఉన్నాయని కాంగ్రెస్‌లో చాలామంది ముఖాలు మాడ్చుకున్నారు. ‘‘మోడీ 1.0 వెర్షన్ నుంచి 2.0 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయ్యారు. రాజకీయాలలోకి ప్రవేశించిన మొదటి దశలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రతినిధిగా ఉన్న మోడీ.. ఇప్పుడు రెందో దశలో ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా ఆదరిస్తుండడం, ప్రజలందరినీ కలుపుపోయేలా చర్యలు తీసుకుంటుండం ఆయనలోని మార్పుకు నిదర్శనం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధునిక అవతారం అభ్యుదయశీలంగా ఉంది. అందరినీ కలుపుకుని పోయేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలను గుర్తించకపోవడం అమర్యాదకరం’’ అంటూ శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల విషయంలో మణిశంకర్ అయ్యర్ లాంటి నాయకులు శశిథరూర్‌కి వ్యతిరేకంగా చాలా ఘాటుగా స్పందించారు. అయ్యర్ శశిథరూర్‌ని ఏకంగా ‘ఊసరవెల్లి’ అని సంభోదించి మాట్లాడారు. థరూర్ పరిపక్వత లేని రాజకీయ నాయకుడని, ఆయన ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలు నడపటం మంచిది కాదని అయ్యర్ వ్యాఖ్యానించారు. థరూర్ చేసిన వ్యాఖ్యలు తనను బాధకు గురిచేశాయని అయ్యర్ అన్నారు. కాంగ్రెస్‌లో రేగిన ఈ కలకలం ఎటు దారి తీస్తుందో చూడాలి.