ఇంజనీరింగ్ విద్యార్థిని దారుణహత్య

  తమిళనాడులోని కంచి దగ్గర ఒక ఇంజినీరింగ్ విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తులు సజీవదహనం చేశారు. కంచి సమీపంలోని పరుత్తికులం గ్రామంలో కాంచీపురం - చెంగల్పట్టు రైల్వే పట్టాల పక్కన కాలిపోయిన స్థితిలో 20 ఏళ్ల యువతి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ మృతదేహం షకీనా (23) అనే ఇంజనీరింగ్ విద్యార్థినిదిగా నిర్ధారించారు. షకీనా మృతదేహం దగ్గర్లో ఒక బ్యాంక్ పాస్ బుక్ చినిగిపోయిన స్థితిలో కనిపించింది. పక్కనే ఏటీఎం కార్డు లభించింది. షకీనా కంచి సమీపంలోని పొన్నేరికరై ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఆమె సొంత ఊరు దిండుగల్ జిల్లా ఇలాపటి గ్రామం. షకీనా కాలిపోయిన స్థితిలో ఉన్నందున గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమె మృతి చెందిన ప్రాంతంలో ఒక లేఖ కూడా లభించినట్లు తెలుస్తోంది. అందులో కళాశాల ఫీజును చెల్లించలేక పోతున్నందున మనోవేదనతో ఉన్నట్లు విద్యార్థిని రాసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే వాస్తవాలను తారుమారుచేసేందుకు హంతుకుడు ఈ లేఖను రాసి ఉండవచ్చని భావిస్తున్నారు.

జగన్ నిర్ణయం కరక్టే

  నిన్నచంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మాట్లాడిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అగ్ర నేత యల్.కె.అద్వానీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ తదితరులు చంద్రబాబును ప్రశంసించి, ఆయనతో తమకున్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని, ఆయన నేతృత్వంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలని కోరుకొంటూ తమ ప్రసంగం ముగించారు. కానీ ఆ తరువాత మాట్లాడిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఇరువురూ కూడా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అదేవిధంగా గత వారం రోజులుగా తనను తీవ్రంగా విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో చురకలు వేసారు. ఒకవేళ ఆయన ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్, వైకాపా నేతలు వచ్చి ఉంటే పరిస్థితి ఏవిధంగా ఉండేదో కానీ, వారు ఇటువంటి విమర్శలేవో వినవలసి వస్తుందనే ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఒకవేళ హాజరయినా వారు కూడా తప్పనిసరిగా గవర్నర్ నరసింహన్ తో బాటే ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయిన వెంటనే వెళ్ళిపోవలసి వచ్చేది. ఈ కార్యక్రమానికి తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యేరు గనుక ఒకవేళ జగన్ హాజరయి ఉండి ఉంటే అవమానం ఎదుర్కోవలసి వచ్చేది. ప్రమాణ స్వీకార కార్యక్రమం తరువాత తెదేపా రాజకీయ సభ నిర్వహించబోతోందనే సంగతి గ్రహించిన జగన్మోహన్ రెడ్డి, రఘువీరారెడ్డి అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలన్నట్లు, ఈ కార్యక్రామానికి రామని ముందే ప్రకటించి, అవమానకర పరిస్థితులు ఎదుర్కోకుండా చాలా తెలివిగా తెప్పించుకొన్నారు. వారిరువురూ ఈ కార్యక్రమానికి హాజరు కాకూడాదని మంచి నిర్ణయమే తీసుకొన్నారని చెప్పవచ్చును.

ఎంసెట్ ఫలితాలు: టాపర్లు వీరే

      ఎంసెట్-2014 పరీక్షా ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఎంసెట్ పరీక్షల్లో 70.77 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 76.2 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 67.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ మెడికల్ పరీక్షల్లో మొత్తం 83.16 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 84.75 శాతం ఉత్తీర్ణత, బాలురు 80.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను విద్యార్థులు సంక్షిప్త సందేశాల ద్వారా పొందవచ్చని జగదీష్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ టాపర్స్ ... 1. పవన్‌కుమార్ 99.02 158 (హైదరాబాద్) 2. చాణిక్య వర్ధన్‌రెడ్డి 88.59, 157 (హైదరాబాద్) 3. నిఖిల్ కుమార్, 98.43, 157 (రంగారెడ్డి) 4. దివాకర్ రెడ్డి 98.30, 157(కృష్ణా) 5. ఆదిత్య వర్ధన్ 97.66, 155 (విజయనగరం) 6. ప్రేమ్ అదనవ్ 97.53,155 (హైదరాబాద్) 7. అక్షయ్‌కుమార్, 97.41, 155 (మహబూబ్‌నగర్) 8. సాయికశ్వప్, 97.24,155 (నల్గొండ) 9. ర్యాంక్ బాల సాయిసూర్యప్రహర్ష, 97.19, 154 (రాజమండ్రి, తూగో) 10. ర్యాంక్ చింతపూడి సాయిచేతన్, 97.15, 154 (హైదరాబాద్) మెడిసిన్ టాపర్స్ ... 1. గుర్రం సాయిశ్రీనివాస్, 99.45, 159 (ప్రకాశం) 2. బి.దివ్య, 99.45,159 (నెల్లూరు) 3. కందిగొండ పృద్వీరాజ్, 99.24, 159 (హైదరాబాద్) 4. హరిత, 99.02, 158 (గుంటూరు) 5. గీతారెడ్డి99.02, 158(విజయవాడ) 6. బి భరత్‌కుమార్, 99.02,158(ఖమ్మం) 7. శ్రీవిద్య, 98.98,158(విశాఖ) 8. సాత్విక్ గంగిరెడ్డి, 98.98,158(హైదరాబాద్) 9. సాయిహర్షతేజ, 98.90, 158(ఖమ్మం) 10. గంట సాయినిఖిల, 98.8, 158(గుంటూరు, తెనాలి)

ఓం.. హ్రీం.. క్లీం.. మళ్ళీ పూజలు మొదలెట్టిన కేసీఆర్!

      తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడూ రెండు పనుల్లో బిజీగా వుంటారు. ఒకటి సీమాంధ్రులను తిట్టేపని, రెండు పూజలు పునస్కారాలు చేసేపని. ఇప్పటి వరకూ కేసీఆర్ చేసిన భారీ పూజలకి లెక్కలేదు. ఈపూజ అని, ఆ పూజ అని, ఈ హోమం అని, ఆ హోమం అని ఏదో ఒక పూజ చేసేస్తూ వుంటారు. కొంతమంది అయితే కేసీఆర్‌ ఎలాంటి రాజకీయ నాయకుడైనప్పటికీ, ఆయన్ని కాపాడుతున్నది ఆయన చేసే పూజలు, హోమాల బలమేనని అంటూ వుంటారు. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం.. కేసీఆర్ ఎప్పుడైనా ఏదైనా పూజో, హోమమో మొదలుపెట్టారంటే అప్పుడు తాను ఏదో ప్రాబ్లంలో వున్నట్టు ఫీలవుతున్నారని అర్థం. పూజల తర్వాత మళ్ళీ కేసీఆర్ పుంజుకుని తిడుతూ వుంటారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి పది రోజులు కూడా కాకుండానే తెలంగాణలో ఆయన పరువు అడ్డంగా పోయింది. కేసీఆర్నీ గెలిపించిన రైతులే ఇప్పుడు కేసీఆర్ పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ మళ్ళీ పూజలు మొదలుపెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కోసం బేగంపేటలోని కుందన్ బాగ్ ప్రాంతంలో కొత్త క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ప్రస్తుతం ముమ్మరంగా పూజల మీద పూజలు చేసేస్తున్నారు. ఈ పూజల వెనుక అసలు అంతరార్థం ప్రస్తుతం తాను రైతుల రుణ మాఫీ ఇష్యూలో ఇరుక్కుపోయి వున్నారు కాబట్టి, దాంట్లోంచి బయటపడటమేనని పరిశీలకులు అంటున్నారు.

అత్యాచారయత్నం నుంచి తప్పించుకున్న బాలికలు!

  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అత్యాచారాలకు నిలయంగా మారిపోయింది. రోజు మార్చి రోజు అత్యాచార వార్తలను వినాల్సిన దుస్థితి అక్కడ ఏర్పడింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా సోమవారం నాడు యుపిలో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు దళిత బాలికలు తమమీద జరిగిన అత్యాచార యత్నం నుంచి తప్పించుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని మైన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా దాబ్రా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఈ ఇద్దరు బాలికలు బయటకి వెళ్ళినప్పుడు ఇద్దరు యువకులు వీళ్ళని కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. అయితే వారిని తీవ్రంగా ఎదుర్కొన్న బాలికలిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఇంటికి వచ్చారు. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో ఆ బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, అత్యాచారాల రాజ్యంగా మారిపోయిన ఉత్తర ప్రదేశ్‌లో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఇద్దరు బాలికలు అదృష్టవంతులే.

బ్రాహ్మణులను తిట్టినందుకు కేసీఆర్‌కి సమన్లు

      సీమాంధ్రులను తిట్టడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ ఎన్నోసార్లు ఎంతోమందిని తిట్టారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన బ్రాహ్మణులను కూడా వదిలిపెట్టకుండా కేసీఆర్ తిట్టారు. ఇప్పుడు ఆ ఫలితం తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనిపిస్తోంది. ఆంధ్రా బ్రాహ్మణులకు ఆడంబరాలు ఎక్కువని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలా వ్యాఖ్యానించినందుకు సీమాంధ్రలోని బ్రాహ్మణుల సంఘం కేసీఆర్ మీద కేసు వేసింది. ఈ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 21న తమ ఎదుట హాజరుకావాలని జిల్లా రెండో అదనపు న్యాయస్థానం ఆదేశించింది.

మంత్రి పదవి రాలేదని కాదు.. వెంకట్రావు ఆరోగ్యం బాగాలేదంతే

      కృష్ణా జిల్లా టీడీపీ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అస్వస్థతకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం గత కొన్ని రోజులుగా కాగిత వెంకట్రావు బిజీగా వున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం రోజైన ఆదివారం నాడు ఉన్న ఆయన నిన్న ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఆస్పత్రిపాలయ్యారు. కాగిత వెంకట్రావుకు బీపీ, సుగర్ వ్యాధులు వున్నాయి. ఇదిలా వుంటే కాగిత వెంకట్రావుకు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించకపోవడం వల్ల గుండెపోటు వచ్చిందని ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఒక దినపత్రిక ఇంటర్‌నెట్‌లో కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తోందని వారు తెలుగుదేశం నాయకులు అంటున్నారు. శాసనసభ్యుడి అనారోగ్యాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న వారిని ఏమనాలని వారు ప్రశ్నిస్తున్నారు.

తెలుగుదేశంలో అలకలు

      తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలివిడతగా 19 మందిని చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ, విస్తరణలో మరికొంతమందికి అవకాశం లభించే అవకాశం వుంది. అయితే ఈలోపే కొంతమంది తెలుగు తమ్ముళ్ళు తమ అలకని ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తనకు మంత్రి పదవి రాకపోవడంతో ఫీలయ్యారు. ఎంతోకాలంగా పార్టీకి సేవ చేస్తు్న్నప్పటికీ తనకు మంత్రి పదవి రాలేదని బాధపడ్డారు. అక్కడితో ఆగకుండా పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాను ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని అంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

      తెలంగాణ శాసనసభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ నుంచి ఎన్నికైన దాదాపు అందరు శాసనసభ్యులు మొదటి రోజు సమావేశాలకు ఉత్సాహంగా హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొటెం స్పీకర్ హోదాలో జానారెడ్డి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దైవ సాక్షిగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన తెరాస ఎమ్మెల్యేలలో చాలామంది శాసనసభకు కొత్తవారు కావడంతో కొంతమంది ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తడబడ్డారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి అభినందనలు తెలిపారు. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానంలో వున్న జానారెడ్డికి పాదాభివందనం చేశారు.

హిమాచల్‌ ప్రమాదం: బాబు ప్రత్యేక విమానం

      హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రమాద స్థలానికి తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. ఈ విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి చండీగఢ్ కు వెళ్ళనుంది. అక్కడి నుంచి విద్యార్ధుల తల్లిదండ్రులని ఘటన స్థలానికి తీసుకువెళ్ళడానికి రెండు ప్రత్యేక బస్సులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రులు,అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి నారాయణ,ఏపీ అధికార ప్రతినిధి కంభంపాటి, ఏపీ రెసిడెంట్ కమిషనర్ సతీష్‌చంద్రను ఆదేశించారు.

పాకిస్థాన్: కరాచీ ఎయిర్‌పోర్టుపై తీవ్రవాదుల దాడి

  పాకిస్థాన్‌లో తీవ్రవాదుల కార్యకలాపాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తీవ్రవాదుల దాడులతో పాకిస్థాన్ నగరాలు వణికిపోతున్నాయి. తాజాగా కరాచి జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై తీవ్రవాదులు దాడి చేశారు. ఆదివారం రాత్రి పాత విమానాశ్రయం భవనాన్ని చుట్టుముట్టిన తీవ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 11 మంది మృతి చెందారు. ఎయిర్ భద్రతా సిబ్బంది వేషాల్లో వచ్చిన 10 మంది తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు.అయితే ఏ విమానాన్ని ధ్వంసం చేయలేదని వెల్లడించారు. తీవ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు. ప్రస్తుతం కరాచీ ఎయిర్ పోర్టులో పరిస్థితి అదుపులో వుంది.

హిమాచల్‌ప్రదేశ్: రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం

  హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రమాదస్థలికి నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ బృందం బయలుదేరి వెళ్లిందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. పంజాబ్‌లోని బతింద నుంచి 45 మంది రిస్క్యూ టీమ్ సభ్యులతో పాటు 4 పడవలు, గజ ఈతగాళ్లు బయలుదేరి వెళ్లారన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల గల్లంతు సమాచారం తెలియగానే అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడానని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. విద్యార్థులో సురక్షితంగా ఉన్నవారి నుంచి సమాచారాన్ని తీసుకుని మిగతావారి జాడ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా, బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌తో కూడిన ప్రత్యేక పోలీసు బృందం సోమవారం ఉదయం ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్ళిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.

కేసీఆర్ దిగ్భ్రాంతి.. హిమాచల్‌కి నాయిని

  హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన గురించి తెలియగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని, క్షేమంగా వున్న విద్యార్థులను తిరిగి హైదరాబాద్‌కి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే రాష్ట్ర హోంమంత్రి నాయిని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. సోమవారం ఉదయం రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బిఆర్ మీనా, గ్రేహౌండ్స్ ఎస్‌పి కార్తికేయలతో, కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక విమానంలో హిమాచల్ ప్రదేశ్‌లోని ఘటనా స్థలానికి బయల్దేరారు. అలాగే రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అక్కడి డీజీపీ, మండి ఎస్‌పితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

హిమాచల్‌ప్రదేశ్: ముమ్మరంగా సహాయక చర్యలు

  హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. కొంతమంది విద్యార్థుల మృతదేహాలు లభించాయని మండి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారులు వెల్లడించారు.సమాచారం అందగానే ఇరవైమంది గజ ఈతగాళ్లు, పదిమంది బోట్ డ్రైవర్స్‌తో సహాయక చర్యలు ప్రారంభించామని, అయితే, చీకటి కావడంతో ఆదివారం రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని, ఇప్పటివరకు మృతదేహాలేవీ లభించలేదన్నారు. మరోవైపు, 10 మృతదేహాలు లభించినట్లు తమకు సమాచారం ఉందని మండి జిల్లా పోలీసుకంట్రోల్‌రూమ్ అధికారులు వెల్లడించారు. డ్యామ్ గేట్లు తెరవడంతో అత్యంత వేగంతో నీటి ప్రవాహం కిందకు వెళ్తుందని, ఆ ప్రవాహం 35 కిలోమీటర్ల దూరంలోని పాంథా ప్రాజెక్టు వరకు సాగుతుందని మండీ జిల్లా ఎస్పీ ఆర్‌ఎస్ నేగీ వివరించారు. అందువల్ల గల్లంతైన విద్యార్థుల్లో ఎంతమంది ప్రాణాలతో ఉంటారనేది చెప్పలేమన్నారు. గల్లంతైన వారిలో చాలామంది పాంథా పాజెక్టులోనే లభించే అవకాశం ఉందన్నారు.