బంగారు నగలు కొనకండి.. ఎందుకంటే...
posted on Jun 7, 2014 @ 11:56AM
రేపో ఎల్లుండో బంగారమో, బంగారు నగలో కొనాలని అనుకుంటున్నారా? అయితే ఆగండి.. ఆగిపోండంతే! ఒక వారం పదిహేను రోజులు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని ఆ తర్వాత బంగారం కొన్నారంటే బోలెడంత తక్కువ ధరకే బంగారు నగలు వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే బంగారం మీద వున్న ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించడానికి ఎన్డీయే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం 15 శాతంగా వున్న దిగుమతి సుంకాన్ని 2 నుంచి 4 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలా జరిగితే బంగారం దిగుమతులు బాగా పెరుగుతాయి.
అప్పుడు ఆకాశంలో విహరిస్తున్న బంగారం ధర నేల మీదకి దిగివచ్చే అవకాశం వుంది. యుపిఎ హయాంలో బంగారం దిగుమతి విషయంలో చిదంబరం లేనిపోని ఆంక్షలు విధించడంతో బంగారం ధర కొండెక్కి కూర్చుంది. ఇప్పుడు యుపిఎ ప్రభుత్వం ఎలాగూ కొండెక్కి పోయింది కాబట్టి, ఆ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా బంగారం దిగుమతులపై వున్న ఆంక్షలను సరళీకృతం చేయడంతోపాటు దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్య వల్ల బంగారం ధరలు దిగివచ్చే అవకాశం వుంది. కాబట్టి బంగారు నగలు కొనాలని అనుకుంటున్న వాళ్ళు కొంతకాలం ఆగితే బెటర్. అలాగే మీరు మీ దగ్గర వున్న బంగారాన్ని అమ్మేయాలని అనుకుంటున్నారా? అయితే అర్జెంటుగా అమ్మేయండి.. ఆలసించిన ఆశాభంగం.