గవర్నర్ గారు వచ్చేశారు..

      తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వేదిక దగ్గరకి రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర రాజ్యాంగ బాధ్యుడు నరసింహన్ వచ్చేశారు. ఆయన కాసేపట్లో చంద్రబాబు చేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న గవర్నర్ వెంటనే బెజవాడ కనకదుర్గమ్మను సందర్శించుకున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో వుండే ప్రముఖ దేవాలయాలను సందర్శించుకునే సంప్రదాయాన్ని గవర్నర్ ఈ సందర్భంగా కూడా కొనసాగించారు. గవర్నర్‌కి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు.

కాసేపట్లో బాబు ప్రమాణం.. క్రిక్కిరిసిన సభ

      నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం లక్షలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులతో క్రిక్కిరిసిపోయింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, సినీ నటులకు సభా స్థలి దగ్గర ఘన స్వాగతం లభిస్తోంది. వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తల జయధ్వానాలతో సభా ప్రాంగణం హోరెత్తుతోంది. కాగా ఆదివారం ఉదయం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌‌లో ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించి ఎన్టీఆర్‌‌కి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో షంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయన బాగా బిజీగా వున్నారు. కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న మహామహులందరినీ కలిసి వారికి బాబు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పుడు మరికొన్ని నిమిషాలలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ మధుర క్షణాల కోసం సభలోని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.

చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

      ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున ఉబ్బసం నివారణ కోసం బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని నాంపల్లి గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. అస్త్మా రోగులకు ఎన్నో ఏళ్లుగా బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్నాన్నారు. చేప ప్రసాదం స్వీకరించడానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వేలాదిగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్.కి తరలి వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు రోగులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మందు పంపిణీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదానికి శాస్త్రీయత లేదని జనవిజ్ఞాన వేదిక ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రతి ఏటా మందు స్వీకరించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు తండోపతండాలుగా వస్తూనే వున్నారు.

థాంక్యూ పవన్ కళ్యాణ్: ప్రకాష్ జవదేకర్

  బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి థ్యాంక్స్ చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన జవదేకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జవదేకర్ పవన్ కళ్యాణ్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేలు మరువలేనిదని ప్రకాష్ జవదేకర్ అన్నారు. అలాగే ఎన్డీయే కూటమితోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాచంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు.

మెదక్ మెరవాలి: స్మితా సబర్వాల్

  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాని దేశంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని స్మితా సభర్వాల్ అన్నారు. మొన్నటి వరకు మెదక్ కలెక్టర్‌గా పనిచేసిన స్మితా సబర్వాల్ తెలంగాణ సీఎం అదనపు కార్యదర్శి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో స్మితా సబర్వాల్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో కేవలం 8 నెలలే కలెక్టర్‌గా పనిచేసినా, ఈ ప్రాంత ప్రజలిచ్చిన సహకారం తనకు ఎల్లప్పుడు గుర్తుంటుందన్నారు. ఇదే స్ఫూర్తితో నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఎంతో పుణ్యం చేస్తేకాని కలెక్టర్‌గా ప్రజలకు సేవ చేసే అవకాశం రాదని, అంతటి భాగ్యం తనకు లభించినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుందన్నారు. కలెక్టర్‌గా ఉన్న వ్యక్తి బాధ్యతతో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరిగి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సేవలందినప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందన్నారు. అందుకు ప్రభుత్వ ఉద్యోగులంతా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల నిర్వహణలో, ప్రజాభివృద్ధి కార్యక్రమాల అమలులోనూ జిల్లా యంత్రాంగం అందించిన సహకారానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు కేబినెట్.. కులాల కూర్పు!

  సమాజంలో కుల వ్యవస్థ వుండకూడదని అందరూ అంటారు. కానీ కులం అనేది లేకుండా సమాజంలో ఏపనీ జరగదు. అది సామాన్యుల నుంచి మంత్రుల వరకూ వుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గంలో కులాల కూర్పు ఎలా వుందో చూద్దాం. చంద్రబాబు ప్రకటించిన తొలివిడతల మంత్రివర్గం ప్రకారం చంద్రబాబుతో సహా ఐదుగురు కమ్మ, ఇద్దరు రెడ్డి, ఆరుగురు బిసి, నలుగురు కాపు, ఇద్దరు ఎస్.సి, ఒక వైశ్య వున్నారు. వీరిలో కమ్మ కులానికి చెందిన పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్ వున్నారు. రెడ్డి వర్గం నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాధరెడ్డి, కాపు నుంచి నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, నారాయణ వున్నారు. బిసి వర్గం నుంచి అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు (కొప్పుల వెలమ), మృణాళిని (తూర్పుకాపు), యనమల రామకృష్ణుడు (యాదవ), కె.ఇ.కృష్ణమూర్తి (గౌడ), కొల్లు రవీంద్ర (మత్సకార) ఉన్నారు. వైశ్య సమాజికవర్గం నుంచి సిద్ధా రాఘవరావు ఉండగా, ఎస్.సి. వర్గం నుంచి పీతల సుజాత, రావెళ్ల కిషోర్‌ వున్నారు. ముస్లిం ల నుంచి టిడిపి కి ఎమ్మెల్యేలు లేకపోవడం వల్ల ఆ వర్గానికి అవకాశం దక్కలేదు. అయితే గిరిజనులు ఉన్నా, ఇవ్వలేదు. ఆసక్తికరంగా తెలంగాణ మంత్రివర్గంలో కూడా గిరిజనుడికి అవకాశం రాలేదు. గిరిజనవర్గానికి కూడా అవకాశం దక్కలేదు. అయితే చంద్రబాబు కేబినెట్ కులాల విషయంలో సమతుల్యంగానే వుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

కంగ్రాట్స్ చంద్రబాబూ: ప్రధాని మోడీ శుభాకాంక్షలు

  పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకపోయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చంద్రబాబు ప్రమాణోత్సవ శుభవేళ చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా మోడీని అహ్వానించారు. అయితే అధికారిక కార్యక్రమాలతో తీరికలేకుండా ఉండటం, పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ వుండటంతో మోడీ రావడం లేదు. బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని మోడీ పేర్కొన్నారు.

ప్రియాంకని తనిఖీ చేయరట!

  సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వధేరా దేశంలోని విమానాశ్రయాలకు వెళ్ళినప్పుడు తనిఖీ సిబ్బంది వారిని తనిఖీ చేయకుండానే విమానాల్లో ప్రయాణించడానికి అనుమతించేవారు. ఆ సదుపాయం యు.పి.ఎ. అధికారం కోల్పోయిన తర్వాత కూడా కొనసాగనుంది. ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో సాధారణ తనిఖీల నుంచి మినహాయింపులు ఇకపైనా కొనసాగుతాయని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు తెలిపింది. కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఈ మినహాయింపులు ఎత్తివేయనున్నారనే ప్రచారం సాగింది. దీనిపై ఎస్పీజీ విభాగానికి చెందిన అధికారులు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ప్రియాంకాగాంధీ ఎస్పీజీ భద్రత కింద ఉన్నారు. దీంతో విమానాశ్రయాల్లో ప్రియాంకకు సాధారణ తనిఖీల నుంచి మినహాయింపులు ఉన్నాయి. ఒక వేళ ఆమె వెంట భర్త రాబర్ట్ వాద్రా, పిల్లలు వెళ్లినా ఇదే మినహాయింపులు వర్తిస్తాయి. ప్రాణాలకు ముప్పును బట్టే ఎవరికైనా భద్రత, మినహాయింపులు ఉంటాయి’’ అన్నారు.

చంద్రబాబు ప్రమాణానికి తరలివస్తున్న ప్రముఖులు

  చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి యావత్ నందమూరి కుటుంబ సభ్యులు గుంటూరు తరలివచ్చేరు. ఇంతవరకు ఎడమొహం, పెడమొహంగా వ్యవహరిస్తున్నబాలకృష్ణ, హరికృష్ణ అయన కుమారుడు జూ.యన్టీఆర్ అందరూ కలిసి సభా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో తెదేపా కార్యకర్తల చాలా సంబరపడుతున్నారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేక విమానంలో మధ్యాహ్నమే గన్నవరం చేరుకొని అక్కడి నుండి సభాస్థలి వరకు రోడ్డు మార్గం ద్వారా వచ్చి అక్కడ నాగార్జున విశ్వవిద్యాలయ భవనంలో బస చేసారు. కొందరు కేంద్రమంత్రులు, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ తదితరులు సభాస్థలి వద్ద విడిది గృహాలకు చేరుకొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా సభాస్థలి వద్దకు చేరుకొన్నారు. ప్రముఖుల రాకతో గుంటూరు విజయవాడ మధ్య ట్రాఫిక్ పూర్తిగా స్థంబించిపోయింది. మండే ఎండను సైతం లెక్కజేయకుండా వేలాది ప్రజలు తరలివస్తున్నారు. అప్పుడే సభావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయిపోయాయి.

తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి

  తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావును తెలంగాణ అసెంబ్లీ శాసనసభాపక్షం నాయకునిగా, ఉపనేతలుగా ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, రేవంత్ రెడ్డిని నియమించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అసెంబ్లీలో పార్టీ విప్‌గా, కౌన్సిల్‌లో ఎ నర్సారెడ్డిని పార్టీ పక్షం నాయకుడిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియమించినట్టు తెలుస్తోంది. కోశాధికారిగా మాగంటి గోపినాథ్, కార్యదర్శులుగా సాయన్న, మంచిరెడ్డి కిషన్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారని తెలుస్తోంది. టిటిడిఎల్పీ నేత పదవి కోసం ఎర్రబెల్లి, తలసాని, ఆర్ కృష్ణయ్యల పేర్లు చివరి దాకా పరిశీలనలోకి వచ్చాయి. సీనియారిటీని పరిగణలోకి తీసుకొని తమకే అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి, తలసానిలు పట్టుబట్టారు. చివరకు ఎర్రబెల్లిని శాసన సభా పక్ష నేతగా చంద్రబాబు ఎంపిక చేసినట్టు సమాచారం. తనను కాదని ఎర్రబెల్లిని శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేసినందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకుంటే రుణమాఫీ: కేసీఆర్

  రైతుల రుణాలు మాఫీ చేసే విషయంలో పప్పులో కాలేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులు, ప్రజల విషయంలో విలువ పోగొట్టుకున్నారు. ఈ ఊబి నుంచి ఎలా బయటపడాలా ఆనే ఆలోచనలో ఆయన వున్నారు. అందుకే ఈ రుణమాఫీ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్‌ మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. రైతుల రుణమాఫీ అవ్వాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆమోదం కావాలని చావుకబురు చల్లగా చెప్పినట్టు చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆరునూరైనా పంటల రుణమాఫీ చేసి తీరుతామని అయితే రుణ మాఫీకి రిజర్వు బ్యాంకు ఆమోదం కావాలని చెప్పారు. ఢిల్లీలో మోడీని కలిసిన తాను తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్టు కేసీఆర్ తెలిపారు. తమ విజ్ఞాపనలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. పక్షపాత వైఖరి ఉండదని మోడీ హామీయిచ్చారని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని సలహాలిచ్చారని తెలిపారు.

కంగ్రాట్స్ మరిదిగారూ: పురందేశ్వరి

  మరిదిగారికి వదినమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఎవరా మరిది? ఎవరా వదినమ్మ? ఆ మరిది చంద్రబాబు నాయుడు, వదినమ్మ కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబునాయుడి పరిపాలనా దక్షత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. బీజేపీ సహకారం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చిందని ఆమె తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్రమాణానికి వస్తున్న ప్రముఖులు వీరే!

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. వారిలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, భాజపా అగ్రనేతలు ఎల్.కె.అద్వానీ, మురళీమనోహర్ జోషి, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్, కల్ రాజ్ మిశ్రా, పీయూష్ గోయల్, నజ్మా హెప్తుల్లా, అనంత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను కూడా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. వారు ఈ కార్యక్రమానికి రానున్నారు. వారిలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె సింధికా, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వున్నారు. ప్రముఖ సినీనటులు రజనీకాంత్, పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఢిల్లీ నుంచి 180 సీట్లతో వున్న విమానం, హైదరాబాద్ నుంచి 212 సీట్లు వున్న విమానం అతిథులను తీసుకుని గన్నవరం విమానాశ్రయానికి రానున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు, మిత్రులు 122 సీట్లు వున్న విమానంలో గన్నవరం వచ్చారు. వీరికోసం గన్నవరం నుంచి సభా స్థలి వరకు మూడు బస్సులను కూడా సిద్ధం చేశారు. జాతీయ మీడియాకు చెందిన 30 మంది ప్రతినిధులు కూడా ఢిల్లీ నుంచి రానున్నారు. పైన పేర్కొన్న ప్రముఖులలో చాలామంది ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. త్వరలో సభాస్థలికి చేరుకుంటారు.

19 మందితో బాబు తొలి మంత్రివర్గం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం రాత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబుతోపాటు 19 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. వీరిలో ఇద్దరు బీజేపీకి చెందిన వారు కూడా వున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన నిమ్మకాయల చిన్నరాజయ్య ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. అలాగే మంత్రులుగా పరిటాల సునీత (రాప్తాడు-అనంతపురం జిల్లా), పల్లె రఘునాథరెడ్డి (పుట్టపర్తి-అనంతపురం), యనమల రామకృష్ణుడు (ఎమ్మెల్సీ-తూర్పు గోదావరి), బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (శ్రీకాళహస్తి-చిత్తూరు), కిమిడి మృణాళిని (చీపురుపల్లి-విజయనగరం), నారాయణ (నెల్లూరు), పత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట-గుంటూరు), రావెల కిశోర్ (ప్రత్తిపాడు-గుంటూరు), దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం-క‌ృష్ణాజిల్లా), కొల్లు రవీంద్ర (మచిలీపట్నం-కృష్ణాజిల్లా), పీతల సుజాత (చింతలపూడి-పశ్చిమ గోదావరి), అచ్చెన్నాయుడు (టెక్కలి-శ్రీకాకుళం), గంటా శ్రీనివాసరావు (భీమిలి-విశాఖ), అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం-విశాఖ), శిద్ధా రాఘవరావు (దర్శి-ప్రకాశం), మాణిక్యాలరావు (బీజేపీ - తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి), కామినేని శ్రీనివాస్ (బీజేపీ, కైకలూరు, కృష్ణాజిల్లా).

మామయ్య పిలిచారు అందుకే వచ్చా: జూ.ఎన్టీఆర్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం సంతోషాన్ని కలిగిస్తోందని, మామయ్య చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందని నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆయన చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హరికృష్ణ కుటుంబ సభ్యులతో కలసి హాజరవుతుున్నారు. హరికృష్ణ కుటుంబ సభ్యులు ఉదయం నిమ్మకూరుకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. మావయ్య చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం అందిందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం... అదీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందటం గర్వంగా ఉందన్నారు. కొత్త రాష్ట్రానికి మామయ్య తొలి ముఖ్యమంత్రి కావడం గర్వకారణమన్నారు. తాను కుటుంబ సభ్యులతో ప్రమాణ స్వీకారాన్ని తిలకించబోతున్నట్లు చెప్పారు.

ఇది పేదోడి ఇంటిలో పెళ్ళి: జగన్‌‌కి లోకేష్ కౌంటర్

  చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని వైసీపీ నాయకుడు జగన్ విమర్శించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ జగన్‌కి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని లోకేష్ పేదోడి ఇంటిలో పెళ్లితో పోల్చారు. పేదవాడి ఇంటిలో పెళ్లి జరిగినా పందిరేస్తారు. వాయిద్యాలు ఏర్పాటు చేస్తారు. వందలాది మందికి భోజనాలు పెడతారు. అదే రీతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ప్రమాణ స్వీకారానికి ముప్పై కోట్లు వ్యయమా అన్న విమర్శను లోకేష్ కొట్టిపారేశారు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పట్లో ఎంత ఖర్చుచేశారో ఇప్పుడూ అంతే ఖర్చవుతోందని లోకేష్ అన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు. రోడ్లు లేవు... మౌలిక వసతులు లేవనే విషయాన్ని దేశం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ తరహాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

చంద్రబాబుకు వివేక్ ఓబెరాయ్ శుభాకాంక్షలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారోత్సవానికి చంద్రబాబు తనను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో నడుస్తుందని ఆశిస్తున్నాని వివేక్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీతకు వివేక్ శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్‌గోపాల్ వర్మ పరిటాల జీవితం ఆధారంగా రూపొందిన రక్తచరిత్ర సినిమాలో వివేక్ ఓబెరాయ్ పరిటాల రవిని పోలిన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. వివేక్ ఓబెరాయ్ బాలీవుడ్ నటుడు అయినప్పటికీ ఆయన మూలాలు పూర్వ ఆంధ్రప్రదేశ్‌లోనే వున్నాయి. వివేక్ ఓబెరాయ్ తండ్రి సురేష్ ఓబెరాయ్ హైదరాబాద్‌లో జన్మించి, చాలాకాలం హైదరాబాద్‌లోనే నివసించారు. ఆ తర్వాత ఆయన బాలీవుడ్ నటుడిగా బిజీ అయ్యారు.