ఇది పేదోడి ఇంటిలో పెళ్ళి: జగన్‌కి లోకేష్ కౌంటర్
posted on Jun 8, 2014 @ 4:12PM
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని వైసీపీ నాయకుడు జగన్ విమర్శించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ జగన్‌కి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని లోకేష్ పేదోడి ఇంటిలో పెళ్లితో పోల్చారు. పేదవాడి ఇంటిలో పెళ్లి జరిగినా పందిరేస్తారు. వాయిద్యాలు ఏర్పాటు చేస్తారు. వందలాది మందికి భోజనాలు పెడతారు. అదే రీతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ప్రమాణ స్వీకారానికి ముప్పై కోట్లు వ్యయమా అన్న విమర్శను లోకేష్ కొట్టిపారేశారు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పట్లో ఎంత ఖర్చుచేశారో ఇప్పుడూ అంతే ఖర్చవుతోందని లోకేష్ అన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు. రోడ్లు లేవు... మౌలిక వసతులు లేవనే విషయాన్ని దేశం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ తరహాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.