విజయమ్మని వైజాగ్ నుండి ఎందుకు నిలబెట్టానంటే..

  వైకాపా నేత దాడి వీరభద్రరావు మొన్న పార్టీని వీడుతూ “జగన్ తన తల్లిని, చెల్లిని కూడా నమ్మరని, చెల్లికి టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తే ఆమె పార్టీలో రెండో అధికార కేంద్రంగా మారుతుందనే భయంతోనే ఆమెకు టికెట్ ఇవ్వకుండా జగన్ తన తల్లిని వైజాగ్ నుండి నిలబెట్టారని, కానీ ఆయన తన తల్లిని కూడా నమ్మరు గనుకనే ఆమె విజయానికి గట్టిగా కృషి చేయలేదని, అందుకే ఆమె ఓడిపోయారని” జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దాడి జగన్ పై చేసిన మాటల దాడికి ఆ పార్టీ నేతలు కూడా దీటుగానే జవాబిచ్చారు. కానీ జగన్ కూడా ఆయనకు సంజాయిషీ ఇచ్చుకోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   దాడి విమర్శలపై జగన్ స్పందిస్తూ “నేను నా తల్లి విజయమ్మను వైజాగ్ నుండి నిలబెట్టడాన్ని కొందరు విమర్శిస్తున్నారు. ఆమె విశాఖకు ప్రాతినిధ్యం వహిస్తే ఉత్తరాంద్రాలో మూడు జిల్లాలకు ఆమె అండగా ఉంటారనే ఉద్దేశ్యంతోనే ఆమెను అక్కడి నుండి పోటీ చేయించాను. పైగా ఆమె అక్కడ ఉంటే నాకూ చాలా భరోసాగా ఉంటుందని భావించాను. విశాఖ జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తల మీద పూర్తి నమ్మకంతోనే ఆమెను అక్కడ నుండి పోటీకి దింపి నేను మిగిలిన ప్రాంతాలలో ప్రచారంపై దృష్టి పెట్టాను తప్ప వేరే కారణం చేత కాదు” అని చెప్పుకొచ్చారు.   జగన్ తన తల్లి విజయమ్మను వైజాగ్ నుండి ఎందుకు పోటీలో నిలబెట్టారో వివరించారు, కానీ వైజాగ్ నుండి పోటీ చేద్దామనుకొన్న షర్మిలకు వైజాగ్ లోనే కాక మరెక్కడి నుండీ కూడా పోటీ చేసేందుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో మాత్రం వివరించలేదు. జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తల మీద పూర్తి నమ్మకంతోనే తను స్వయంగా తల్లి కోసం ప్రచారం చేయలేదని చెపుతున్న జగన్మోహన్ రెడ్డి, మిగిలిన జిల్లాలలో ప్రచారం చేసారంటే అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తల మీద ఆయనకు నమ్మకం లేదనుకోవాలా?   దాడి విమర్శలకు జగన్ స్వయంగా స్పందించనవసరం లేదు. కానీ స్పందించారు. అటువంటప్పుడు ఆయన లేవనెత్తిన ప్రతీ అంశం, చేసిన అన్ని ఆరోపణల పైనా స్పందించి ఉంటే బాగుండేది. కానీ ఎందువలనో స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్ తో జగన్ కున్న రహస్య అవగాహన గురించ ప్రశ్నించినపుడు, దానికీ జగన్ నేరుగా జవాబు చెప్పలేకపోయారు. అతని సోదరి షర్మిల పవన్ కళ్యాణ్ పై ప్రతి విమర్శలు చేశారే తప్ప, పవన్ అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబీయలేదు. పవన్ చేసిన ఏ ఒక్క ఆరోపణను ఖండించలేదు.   ఇటువంటి వ్యవహారాల వలననే వైకాపా ఓటమి పాలయింది. వైకాపా ఓటమికి వేరెవరో కారణం కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డే కారణమని దాడి వీరభద్రరావు చేసిన ఆరోపణలు నమ్మవలసివస్తుంది.

చంద్రబాబు మంత్రివర్గ సమావేశ వివరాలు

  ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రి వర్గ సమావేశం దాదాపు ఆరు గంటల పాటు సాగింది. ఉదయం 11 గంటలకు మొదలయిన సమావేశం సాయంత్రం దాదాపు ఆరున్నర గంటల వరకు సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో మొత్తం మంత్రులు అందరూ పాల్గొన్నారు. సమావేశం తరువాత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి సమావేశ వివరాలు వెల్లడించారు.   ఆయన చెప్పిన విషయాలలో ముఖ్యాంశాలు: 1. రాష్ట్ర విభజన తరువాత బడ్జెట్ లోటు రూ.15,900 కోట్లు. 2. ఈనెల నుండే ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ 58 నుండి 60సం.లకు పెంపు అమలు. హైదరాబాదులో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కూడా ఇది వర్తింపు. 3. అక్టోబర్ 2నుండి పెంచిన పెన్షన్లు చెల్లింపు మొదలవుతుంది. వృద్ధులకు, వితంతువులకు రూ.1000 పెన్షన్, 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వికలాంగులకి రూ.1500, 80 శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్నవారికి రూ.1000 పెన్షన్. 4. బెల్ట్ షాపులు రద్దు చేయబడ్డాయి. త్వరలో ఎక్సయిజ్ శాఖ నిభందనలు మరింత కటినతరం. 5. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ కోసం కమిటీకి ఆమోదం. వీలయినంత త్వరగా రుణాలు మాఫీకి అవసరమయిన చర్యలు చేపడతాము. 6. యన్టీఆర్ సుజల స్రవంతి పధకం క్రింద రాష్ట్రంలో అన్ని పట్టణాలు, గ్రామాలకు రక్షిత మంచి నీరు పధకం అమలుకు అవసరమయిన ఏర్పాట్లు చేయడానికి పంచాయితీ రాజ్ శాఖ అధీనంలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు. 7. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రూ.5,00,00,000 కోట్లు అవసరం ఉంటుంది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుండి రాబట్టేందుకు కృషి చేస్తాము. 8. అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాము. 9. వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తాము. 10. వైజాగ్ నగరానికి మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగు రోడ్డు, అవసరమయిన చోట ఫ్లై ఓవర్ల నిర్మాణం. 11. వ్యవసాయానికి 8గంటలు, గృహలకు, పరిశ్రమలకు 24గంటలు నిరంత విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమయిన అన్ని చర్యలు చేపడతాము. అవసరమయితే పక్క రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు. సోలార్ మరియు విండ్ ఎనర్జీ కొరకు అవసరమయిన చర్యలు చేపడతాము. 12. ఇంతవరకు నిర్లక్ష్యం చేయబడిన ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు మళ్ళీ అభివృద్ధి చేసిభూగర్భ జలాలను పెంచుతాము.  

పందెం కాశాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు

      ఒక పిచ్చి పందెం ప్రాణం తీసింది. స్నేహితుల మధ్య గొప్పకోసం చేసిన పని ఒకరి ప్రాణం తీయగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో పడేలా చేసింది. ఆ పందెం మరేమిటో కాదు.. 15 నిమిషాల వ్యవధిలో ఫుల్ బాటిల్ మద్యాన్ని నీళ్ళు కలపకుండా తాగడం. ఈ పందెం ఫలితం.. ఒక నిండు ప్రాణం. కరీంనగర్ జిల్లా సిరిసిల్లా మండలం తంగళ్లపల్లిలో కొంతమంది స్నేహితులు పావుగంటలో పుల్ బాటిల్ తాగినవాడే వెరీ స్ట్రాంగ్ అన్నారు. అది విని రవి అనే యువకుడితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ఫుల్ బాటిల్ మద్యం తాగడానికి ముందుకొచ్చారు. రవి అనే వ్యక్తి బాటిల్ మొత్తం తాగేసి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు బాటిల్ మద్యం తాగి కోమాలోకి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు బతకడం కూడా సందేహాస్పదమే అని వైద్యులు అంటున్నారు. వీళ్ళు ఇలా పనికిమాలిన పందాలు కాసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

దడపుట్టిస్తున్న వడదెబ్బ: 14 మంది మృతి

      గురువారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో వడదెబ్బ దడ పుట్టించింది. ఆంధ్రప్రదేశ్ అంతటా వడగాలులు వీస్తున్నాయి. వడగాలులకు భయపడిన జనం ఇళ్ళలోంచి బయటకి కూడా రావడం లేదు. స్కూళ్ళు కూడా మూసేశారు. వడదెబ్బ కారణంగా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో గురువారం నాడు మొత్తం 14 మంది మరణించారు. విశాఖ జిల్లా కశింకోటలో నలుగురు, విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ముగ్గురు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఒకరు, విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఒకరు, గొల్లప్రోలు మండలంలో ఒకరు వడదెబ్బ కారణంగా మరణించారు. ఈ వాతావరణ పరిస్థితి మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం వుందని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఢిల్లీలో ‘స్కిల్’ చూపించిన కవిత!

      రాజకీయ తెలివితేటల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తెలివితేటల్లో తండ్రి పోలికలను పుణికి పుచ్చుకున్న నిజామాబాద్‌ ఎంపీ కవిత ఢిల్లీ లెవల్లో తన తెలివితేటలు, ‘స్కిల్’ చూపించారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా నరేంద్రమోడీ ప్రసంగిస్తూ ఇండియాని స్కామ్ ఇండియాగా కాకుండా ‘స్కిల్’ ఇండియాగా తీర్చిదిద్దాలనేది తన స్వప్నమని చెప్పారు. ఈ ప్రసంగాన్ని విన్న పార్లమెంటు సభ్యురాలు కవిత మైండ్‌లో ఫ్లాష్ వెలిగింది. తన స్కిల్ చూపించాలన్న ఉత్సాహం వచ్చేసింది. మోడీ ఉపయోగించిన ‘స్కిల్’ అనే మాటని పట్టుకుని కవిత ఉత్సాహంగా ముందడుగు వేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామ‌న్‌ కలిసిన కవిత, ప్రధానమంత్రి దేశంలో స్కిల్ పెరగాలని ఆశిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో అర్జెంటుగా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. తెలంగాణ‌ ప్రజల్లో స్కిల్ (వృత్తి నైపుణ్యం) పెరిగేలా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమెని కోరారు. అదేవిధంగా నిజామాబాద్ లో పసుపు నిల్వ, విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుతో పాటు పలు విషయాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. కవిత ప్రస్తావించిన అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

టీడీపీలోకి దాడి వీరభద్రరావు?

      టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన విశాఖకు చెందిన తెలుగుదేశం నాయకుడు దాడి వీరభద్రరావు ఇప్పుడు జగన్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వైసీపీలోంచి బయటకి వచ్చేశారు. ఇప్పుడాయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాడి వీరభద్రరావు అలా వైసీపీని వీడారో లేదో ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు దాడికి ఆహ్వానం పలికారు. ఎన్టీఆర్‌కి పరమ భక్తుడైన దాడి తెలుగుదేశం పార్టీలోకి వస్తే సాదరంగా స్వాగతం పలుకుతామని అన్నారు. తనకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం రావడం దాడికి సంతోషాన్ని కలిగించినట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.   ఇదిలా వుంటే వైసీపీని వీడిన తర్వాత దాడి వీరభద్రరావు జగన్ మీద మాటల దాడి చేశారు. జైల్లో వున్నప్పుడు జగన్ వేరని, జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత మరోలా వున్నారని దాడి చెప్పారు. జగన్ ఎన్నికల వరకు జైలులోనే వుంటే గెలిచేవారని, ఆయన జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం చూసిన జనం అమ్మో జగన్ అని భయపడే స్థితికి చేరుకున్నారని దాడి వీరభద్రరావు అన్నారు. జగన్ ఎవరినీ నమ్మరని, చివరికి తల్లిని, చెల్లిని కూడా నమ్మరని ఆయన విమర్శించారు. తనకంటే తన చెల్లి షర్మిల ఎదిగిపోతుందని భయపడిన జగన్ ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించేశారని తెలిపారు. తన తల్లిని విశాఖపట్నం నుంచి పోటీ చేయించి, కనీసం ఆమెను గెలిపించుకునే ప్రయత్నం కూడా జగన్ చేయలేదని దాడి అన్నారు. విజయమ్మ ఓటమికి జగనే కారణమని ఆరోపించారు. భవిష్యత్తులో పార్టీని నడిపే శక్తి స్థాయి జగన్‌కు లేవన్నారు. రైతు రుణాల మాఫీ ప్రకటించవయ్యా మగడా అని ఎంత మొత్తుకున్నా జగన్ పట్టించుకోలేదన్నారు. భవిష్యత్తులో వైసీపీ మనుగడ కష్టమే అన్నారు.

అఖిలేష్ సర్కార్‌కి రాష్ట్రపతి పాలన గండం?

      ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా వున్న ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశం వుందని, త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతల అంశాన్ని ప్రధానంగా తీసుకుని కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   గత కొంతకాలంగా ఉత్తర ప్రదేశ్‌లో అత్యాచారాలు, హత్యలు మామూలైపోయాయి. కొద్ది రోజుల క్రితం ఇద్దరు అక్కాచెల్లెళ్ళ మీద  కొంతమంది దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. రెండు మూడు రోజులకోసారి మహిళల అత్యాచారం, హత్యలు మామూలైపోయాయి. వీటిని అరికట్టాల్సిన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం అత్యాచారానికి గురైన వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు వున్నాయన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన  విధించడంతోపాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలుగా విభజించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని 80 ఎంపీ స్థానాలలో ఎన్డీయే కూటమి 78 స్థానాల్లో విజయం సాధించింది. కాబట్టి యు.పి.లో ఎలాంటి చర్యలు చేపట్టినా మోడీ ప్రభుత్వానికి ఎదురు వుండే అవకాశం లేదు. ఉత్తర ప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రంగా ఉన్నందున పరిపాలనా సౌలభ్యం చాలా తక్కువగా వుందన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. మాజీ ముఖ్యమంత్రి మాయావతి అయితే ఉత్తర ప్రదేశ్‌ని ఏకంగా 5 రాష్ట్రాలుగా విభజించాలని గతంలో యు.పి. అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని పాస్ చేయించారు. ఇప్పుడు యుపిని మూడు రాష్ట్రాలుగా విభజించడం పరిపాలన పరంగా మేలు జరగడమే కాకుండా, యు.పి.లో అరాచకాలను సమర్థంగా నియంత్రించవచ్చని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో వాహనాలకు ఇక ‘టిఎస్’ సిరీస్!

      తెలంగాణ రాష్ట్రంలో తిరిగే వాహనాల నంబర్లు మారనున్నాయి. ఇప్పుడున్న ‘ఎ.పి.’ పేరును తొలగించి ‘టి.ఎస్.’ అని మార్చుకోవాల్సి వుంటుంది. ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు బుధవారం నుంచి ‘టి.ఎస్.’ సిరీస్‌లో రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ప్రతి జిల్లాకు కోడ్ నెంబర్ ఇస్తామని ఆయన చెప్పారు. దాని ప్రకారం వాహనాల నెంబర్లు మార్చాల్సి ఉంటుందన్నారు. నాలుగు నెలల్లో పాత వాహనాల నెంబర్లన్నీ మార్చుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు. అవసరమైతే నాలుగు నెలల గడువును పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఇంకా విధి విధానాలను రూపొందించాల్సి వుందని, ‘ఎ.పి.’ నుంచి ‘టి.ఎస్.’కి మారడానికి వాహనానికి ఎంత ఖర్చు అయ్యేది కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కొత్త వాహనాలకు మాత్రం బుధవారం నుంచి టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు.

ఢిల్లీ విమానాశ్రయంలో ముందు జాగ్రత్త చర్యలు

      పాకిస్థాన్ వాణిజ్య రాజధాని కరాచీలో పదిమంది తెహ్రీక్-ఎ- తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు 48 గంటల వ్యవధిలో రెండుసార్లు దాడులకు పాల్పడ్డారు. భారీ భద్రత వుంటుందని తెలిసి కూడా రెండుసార్లు కరాచీ విమానాశ్రయంపై దాడి చేసి మొత్తం 27 మందిని కాల్చి చంపారు. ఈ సంఘటన భారత ప్రభుత్వంలో కదలిక తెచ్చింది.   కరాచీ ఎయిర్‌పోర్టు మీద జరిగిన తరహాలోనే ఢిల్లీలోని విమానాశ్రయం మీద ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు దగ్గర సెక్యూరిటీ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ తదితర ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సంస్థలన్నీ రంగంలోకి దిగి ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నాయి. ఒకవేళ ఢిల్లీ ఎయిర్‌పోర్టు మీద ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా సమర్థంగా తిప్పికొట్టాలన్న అంశం మీద వ్యూహరచన ఈ సందర్భంగా చేశారు. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు.  

గంగలో ఉమ్మితే మూడు రోజుల జైలు!

      కేంద్ర ప్రభుత్వం కొత్తరకం చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి ఉమాభారతి ఈ చట్టానికి రూపకర్త అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చట్టం ఏంటంటే, భవిష్యత్తులో ఎవరైనా గంగానదిలో ఉమ్మినా, చెత్త వేసినా వారికి మూడు రోజుల జైలు శిక్ష పడుతుంది.   ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయగానే గంగానదిని ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. ఆయన ఆల్రెడీ వారణాశికి ఎంపీ కావడంతో ఈ విషయం మీద చాలా సీరియస్‌గా వున్నారు. గంగా ప్రక్షాళనకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ని కూడా ఆయన సిద్ధం చేశారు. గంగానదిని శుభ్రం చేయడం, ముందుముందు కలుషితం కాకుండా చూడటం అంతవరకూ ఓకే. దానిని ఎవరూ కాదనరు. ఇంకా ఇంత మంచి పని చేస్తున్నందుకు హర్షిస్తారు. అయితే కేంద్ర మంత్రి ఉమాభారతి ఈ విషయంలో ఎక్కువగా స్పందిస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరైనా గంగానదిలో చెత్త వేసినా, కనీసం ఉమ్ము ఊసినా వారికి మూడు రోజులు జైలు శిక్ష వేయాలన్న ప్రతిపాదనని ఆమె నరేంద్రమోడీ ముందు వుంచినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు అందరి నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఉమాభారతి చేసిన ప్రతిపాదనను మోడీ ఆమోదించరాదని, ఇలాంటి చట్టం తేవడం వల్ల దుర్వినియోగమయ్యే అవకాశం వుందని పలువురు అంటున్నారు. పొరపాటుగా ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఎవరైనా గంగాస్నానం చేస్తూ గంగా నది జలాన్ని నోట్లో పోసుకుని తుపుక్కున ఊయడానికి కూడా భయపడాల్సి వస్తుంది.  గంగానదిలో స్నానం చేస్తే పాపం పోవడానికి బదులు విచిత్రమైన అవమానాలు ఎదుర్కునే పరిస్థితి వస్తుంది.

విశాఖలో నేడు మంత్రివర్గ సమావేశం

  ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్ట మొదటి మంత్రివర్గ సమావేశం విశాఖనగరంలో గల ఆంద్ర విశ్వవిద్యాలయంలో జరగబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కొద్ది సేపటిలో వైజాగ్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి నేరుగా సింహాచలం వెళ్లి దైవ దర్శనం చేసుకొంటారు. ఆ తరువాత అక్కడి నుండి ప్రభుత్వ అతిధి గృహం చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని ఆంద్ర విశ్వవిద్యాలయంలోగల టీ.యల్.యన్. రెడ్డి సమావేశ మందిరం చేరుకొని మంత్రివర్గం సమావేశం మొదలుపెడతారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2గంటల వరకు సమావేశం జరుగుతుంది. ఈరోజు సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ రుణాల మాఫీకి కమిటీ ఏర్పాటు, ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలపడం, ప్రభుత్వపాలనా విధానం, ఆర్ధిక లోటుని భర్తీ చేసుకొనే మార్గాలు, కొత్త రాజధాని నిర్మాణం, కేంద్రం నుండి నిధులు రాబట్టేందుకు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని నియామకం వంటివి చర్చకు రావచ్చును. మంత్రివర్గ సమావేశం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ ప్రభుత్వ అతిధి గృహానికి చేరుకొని అక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. అనంతరం రాత్రి తిరిగి హైదరాబాదు చేరుకొంటారు.

పొన్నాలపై కోమటిరెడ్డి ఫైర్

  మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనసభ కమిటీ హాల్‌లో బుధవారం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభం నుంచి గరమ్ గరమ్‌గా వున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదును చూసుకుని టీపీసీపీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పొన్నాల సీఎల్పీ సమావేశానికి అధ్యక్షత వహించడం తాను భరించలేనని అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎల్పీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. పొన్నాల వల్లే కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి విమర్శించారు. ఓటమికి బాధ్యత వహించి పొన్నాల తన పదవి నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటే బాగుండేదని కోమటిరెడ్డి అన్నారు.

గవర్నర్ ప్రసంగం చప్పగా వుంది: ప్రతిపక్షాలు

  తెలంగాణ రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం చప్పగా వుందని ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. గవర్నర్ ప్రసంగం, కొత్త ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చేలా లేవని ప్రతిపక్షాలు విమర్శించాయి. కెజి నుండి పిజి వరకు విద్యపై మార్గదర్శకాలు లేవన్నారు. గవర్నర్ ప్రసంగంతో రైతులకు నిరాశే అన్నారు. రుణమాఫీ పైన నిర్దిష్ట ప్రణాళికలు లేవన్నారు. తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న విషయాలనే గవర్నర్‌తో మరోసారి చదివించారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ ప్రకటనలపై స్పష్టత వస్తుందని ఆశించామని అయితే, ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ ప్రజలు నిరాశకు గురయ్యారని అన్నారు. గవర్నర్ ప్రసంగం కొత్త సీసాలో పాత సారాలా వుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని, గవర్నర్ ప్రసంగంలో ఆ ఊసే లేదన్నారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల ప్రస్తావన కూడా లేదన్నారు. ఖరీఫ్ రైతులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌పై మాటల ‘దాడి’: పార్టీకి గుడ్ బై

  వైసీపీ అధ్యక్షుడు జగన్ మీద ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్రరావు మాటల దాడి చేశారు. జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జైల్లో వున్నప్పుడు జగన్ వేరని, జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత మరోలా వున్నారని దాడి చెప్పారు. జగన్ ఎన్నికల వరకు జైలులోనే వుంటే గెలిచేవారని, ఆయన జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం చూసిన జనం అమ్మో జగన్ అని భయపడే స్థితికి చేరుకున్నారని దాడి వీరభద్రరావు అన్నారు. జగన్ ఎవరినీ నమ్మరని, చివరికి తల్లిని, చెల్లిని కూడా నమ్మరని ఆయన విమర్శించారు. తనకంటే తన చెల్లి షర్మిల ఎదిగిపోతుందని భయపడిన జగన్ ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించేశారని తెలిపారు. తన తల్లిని విశాఖపట్నం నుంచి పోటీ చేయించి, కనీసం ఆమెను గెలిపించుకునే ప్రయత్నం కూడా జగన్ చేయలేదని దాడి అన్నారు. విజయమ్మ ఓటమికి జగనే కారణమని ఆరోపించారు. విజయమ్మ గెలుపు కోసం జగన్‌ది నియంతృత్వ ధోరణి అని, వైసీపీ ఓటమికి కారణం కేవలం జగన్ మాత్రమేనని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ లేదని, పార్టీలో అసలు కమిటీలే లేవన్నారు. అసలు పార్టీకి విధివిధానాలే లేవని ధ్వజమెత్తారు. జగన్ పెద్ద పెద్ద మాటలు విని ఆయన మారిపోయాడని నమ్మి తాను మోసపోయానని అన్నారు. భవిష్యత్తులో పార్టీని నడిపే శక్తి స్థాయి జగన్‌కు లేవన్నారు. రైతు రుణాల మాఫీ ప్రకటించవయ్యా మగడా అని ఎంత మొత్తుకున్నా జగన్ పట్టించుకోలేదన్నారు. భవిష్యత్తులో వైసీపీ మనుగడ కష్టమే అన్నారు.

స్కాం ఇండియా నుంచి స్కిల్ ఇండియాకి: మోడీ

  ఇండియా మొన్నటి వరకూ స్కాముల మయమైపోయింది. స్కామ్ ఇండియాగా చెడ్డపేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇండియాని స్కామ్ ఇండియా నుంచి స్కిల్ ఇండియాగా మార్చడమే తన స్వప్నమని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బుధవారం నాడు ఆయన లోక్‌సభలో స్ఫూర్తిదాయమైన ప్రసంగం చేశారు. యువతలో స్కిల్ పెంచడానికి సాహసోపేత నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పేదవారిని దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు తీసుకురాగలనన్న నమ్మకం తనకు వుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. అధికధరలను తగ్గించేందుకు రియల్‌ టైం డేటాను అందుబాలోకి తీసుకుకొస్తామని చెప్పారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు భద్రత ఇవ్వడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత అని చెప్పారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

వైకాపాలో చేరినందుకు చింతిస్తున్నా: దాడి

  తెదేపాతో ముప్పై ఏళ్ల అనుబంధాన్ని పుటుక్కున తెంచుకొని గతేడాది వైకాపాలో చేరిన దాడి వీరభద్రరావు, పట్టుమని ఏడాది తిరగకుండానే వైకాపా ను ఈరోజు వదిలించుకొని బయటపడ్డారు. వైకాపాలో చేరి ఘోర తప్పిదం చేసానని, ఇప్పుడు ఆ తప్పు సవరించుకొనేందుకే ఈరోజు పార్టీకి తను, తన కుటుంబ సభ్యులు రాజీనామా చేస్తున్నామని మీడియాకు తెలియజేసారు.   ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా విమర్శించారు. “జగన్మోహన్ రెడ్డి చాలా నిరంకుశంగా వ్యవహరిస్తారు. ఆయనకి పార్టీ నేతలెవరినీ సంప్రదించే అలవాటు లేదు. ఎవరి సలహాలు వినే అలవాటు అసలే లేదు. తనకు తోచిన నిర్ణయాలు తీసుకొంటారు. నేను జైల్లో చూసిన జగన్ వేరు. ఇప్పుడు కనబడుతున్న జగన్ వేరు. ఆయన 18 నెలలు జైల్లో ఉన్నారు గనుక ఆయనలో చాలా మార్పు వస్తుందని అందరం భావించాము. కానీ ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. జైలు నుండి వచ్చిన తరువాత కూడా ఆయన అదే అహంకారం ప్రదర్శించడం చూసి అందరం చాలా ఆశ్చర్యపోయాము."   "ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను నిర్ణయించే విషయంలో కూడా ఆయన ఎవరి మాట వినలేదు. తనకు నచ్చిన వారిని నిలబెట్టారు. జైలులో పరిచయమయిన వ్యక్తులకు టికెట్స్ ఇచ్చి తను ఎవరిని నిలబెట్టినా ప్రజలు గుడ్డిగా నమ్మి వారికే ఓటేస్తారనే అహం ప్రదర్శించారు. ఆయన తీరు చూసి పార్టీలో నేతలే కాదు ప్రజలు కూడా చాలా భయపడ్డారు. అందుకే ఎన్నికలలో వైకాపాను ఓడించారు. అటువంటి నిరంకుశుడు, అహంకారం కలవాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా చాలా భయం వేస్తోంది. అందుకే ప్రజలు అయనకు ఓటేయకుండా చాలా విజ్ఞత ప్రదర్శించారు."   "నిజానికి ఆయన తన తల్లిని, చెల్లిని కూడా విశ్వసించరు. తన చెల్లి షర్మిలకు టికెట్ ఇస్తే ఆమె తనకు ఎక్కడ పోటీగా తయారవుతుందో అనే భయంతోనే ఆమెకు టికెట్ ఇవ్వకుండా తల్లికి ఇచ్చేరు. అయినప్పటికీ ఆయన తన తల్లి కూడా ఎన్నికలలో గెలవాలని మనస్పూర్తిగా కోరుకోలేదు, ప్రయత్నించాను లేదు. అందుకే ఆమె కూడా ఓడిపోయారు. స్వంత తల్లిని, చెల్లినే నమ్మని వ్యక్తి ఇక పార్టీలో నేతలను ఎందుకు నమ్ముతారు? అటువంటి వ్యక్తిని ప్రజలు మాత్రం ఎందుకు నమ్ముతారు?పార్టీలో ఉండాలంటే ఆయన చెప్పినట్లు చేయాలి తప్ప స్వంత ఆలోచనలు చేయడానికి వీలులేదు. మేము ఎన్నికల సమయంలో ఆయనకీ కొన్ని సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించాము కానీ ఆయన మా మాటలను ఎన్నడూ ఖాతరు చేయలేదు."   "అసలు పార్టీని ఎలా నడపాలో తెలియని ఆ వ్యక్తి, ఎంత కాలం పార్టీని నడుపుతారో, అసలు నడుపుతారో లేక మూసేసివెళ్లిపోతారో లేకపోతేవేరే ఏదయినా పార్టీలో కలిపేస్తారో ఎవరికీ తెలియదు. అందువల్ల పార్టీలో కార్యకర్తలు,నేతలూ అందరూ కూడా ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మేలని నా సలహా. నియంతృత్వ పోకడలు పోతున్న జగన్మోహన్ రెడ్డి క్రింద ఇక ఎంతమాత్రం పనిచేయడం అసంభవమని గ్రహించినందునే నేను, నా కుటుంబ సభ్యులు పార్టీకి రాజీనామా చేస్తున్నాము. ప్రస్తుతం నేను ఏ పార్టీలోను చేరబోవడం లేదు. కొంతకాలం తరువాత తగిన నిర్ణయం తీసుకొంటాను,” అని చెప్పారు.

కేసీఆర్ శ‌ృంగారపురుషుడు: వర్మ ట్విట్

  తన ‘ఐస్ క్రీం’ సినిమా రిలీజ్‌కి రెడీ అయింది కదా.. అందుకే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ రంగంలోకి దిగాడు. ఏదోరకంగా వార్తల్లోకి వచ్చే తన పథకంలో భాగంగా ట్విట్టర్‌లో ట్విట్లు చేయడం ప్రారంభించాడు. ఈసారి రామ్ గోపాల్ వర్మ తన ట్విట్లలో కేసీఆర్ని టార్గెట్ చేశాడు. ఆ ట్విట్లు ఎలా వున్నాయో చూడండి.   1. టీఆర్ఎస్ ఆఫీస్ అవతల కేసీఆర్ లో భగవంతుడి అవతారాన్ని చూసుకున్నామని చాలా మంది అమ్మాయిలు నాతో అన్నారు. రాముడు, కృష్ణుడు కన్నా కేసీఆరే శృంగార పురుషుడిగా కనపడుతారు.   2. అతిపెద్ద కేసీఆర్ విగ్రహాలు, హోర్డింగ్‌లతో హైదరాబాద్ పట్టణం సుందరంగా ఉంటుంది అని ఓ కాలేజీ అమ్మాయి నాతో అంది.   3. కేసీఆర్ ను మహిళలు ప్రేమించడం విషయం మీద నాకు ఆశ్చర్యం కలిగిస్తూ వుంటుంది. ఎక్కువ మంది మహిళలు అధికారాన్ని ప్రేమిస్తుంటారని.. అందుకే కేసీఆర్‌ని ప్రేమించి ఉంటారని అనుకుంటున్నా.   4. కేసీఆర్ అంటే తనకి చెప్పలేనంత ఇష్టమని.. హైదరాబాద్ సిటీలోనే అంత అందగాడు ఉండరని మరో అమ్మాయి నాతో అంది.   5. హైదరాబాద్‌లోని ఉద్యానవనం లాంటి అద్భుతమైన కేసీఆర్ ముఖాన్ని ఇప్పటివరకు నేను చూడలేదు. కేసీఆర్ ముఖాన్ని ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఎవరూ మరిచిపోరు. చివరికి గజనీ కూడా గుర్తుంచుకుంటాడు.