కాసేపట్లో బాబు ప్రమాణం.. క్రిక్కిరిసిన సభ
posted on Jun 8, 2014 @ 7:16PM
నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం లక్షలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులతో క్రిక్కిరిసిపోయింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, సినీ నటులకు సభా స్థలి దగ్గర ఘన స్వాగతం లభిస్తోంది. వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తల జయధ్వానాలతో సభా ప్రాంగణం హోరెత్తుతోంది. కాగా ఆదివారం ఉదయం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించి ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో షంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయన బాగా బిజీగా వున్నారు. కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న మహామహులందరినీ కలిసి వారికి బాబు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పుడు మరికొన్ని నిమిషాలలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ మధుర క్షణాల కోసం సభలోని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.