తంగిరాల మృతి పార్టీకి తీరని లోటు: బాబు

      గుండెపోటుతో హఠాన్మరణం పొందిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేను ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి బాధాకరమైన విషయమని, కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తంగిరాల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. దేవినేని కుటుంబం తరువాత నందిగామ నియోజకవర్గానికి తంగిరాల పేరు తెచ్చారని బాబు గుర్తుచేశారు. అందరితో కలివిడిగా ఉండే తంగిరాల మన మద్య లేకపోవడం పార్టీకి తీరని లోటు అని, పదవులను ఆశించకుండా పని చేసిన వ్యక్తి తంగిరాలని చంద్రబాబు సంతాపం ప్రకటించారు. గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ, మండలి బుద్ధ ప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మంత్రి దేవినేని ఉమ తంగిరాల బౌతికకాయానికి నివాళులర్పించారు.

నూజివీడు-ఖమ్మం మధ్యలో కొత్త అంతర్జాతీయ విమానశ్రయం

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నందున, రాజధానికి సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ రాజధాని నిర్మాణం కోసం తగిన స్థలం కనుగొనేందుకు వేయబడిన శివరామ కృష్ణన్ కమిటీతో మొన్న సమావేశమయిన తరువాత, బహుశః వారి సూచనలు, సలహాల ప్రకారమే తన అభిప్రాయం మార్చుకొన్నట్లున్నారు. కృష్ణా జిల్లాలో నూజివీడు నుంచి ఖమ్మం జిల్లా సరిహద్దు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేసి, ఆ ప్రాంతంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యా వైద్య తదితర సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు తగు చర్యలు, ప్రతిపాదనలు వీలయినంత త్వరలో సిద్దం చేయాలని చంద్రబాబు అధికారులకు నిన్న ఆదేశాలు జారీ చేసారు. ఖమ్మం-కృష్ణా జిల్లాల మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అన్ని రంగాలలో ముఖ్యంగా సాఫ్ట్ వేర్, విద్యా, వైద్య రంగాలలో అభివృద్ధి చెందిన హైదరాబాదుతో చక్కగా అనుసంధానం ఏర్పడి త్వరితగతిన అభివృద్ధి సాధించగలదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతి

    కృష్ణాజిల్లా నందిగామ తెలుగుదేశం ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు (64) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే నందిగామలోని మదర్‌థెరిస్సా ఆస్పత్రికి తరలించారు. అరుుతే 12 గంటల సమయంలో ఆయన కన్నమూశారు. టీడీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ప్రభాకర్ 2009లో తొలిసారిగా నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికలలో కూడా ఆయన నందిగామ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామం తంగిరాల ప్రభాకరరావు స్వస్థలం. ఆయన న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు వీరులపాడు జెడ్పీటీసీగా, ఎంపీపీగా పనిచేశారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతో కలసి ఆదివారం ఉదయ పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు.

షర్మిలపై విషప్రచారం దారుణం: ప్రభాస్

  వైసీపీ నాయకురాలు షర్మిలపై, తనపై కొన్నాళ్లుగా జరుగుతున్న విషప్రచారాన్ని కథానాయకుడు ప్రభాస్ ఖండించారు. షర్మిలను తానెప్పుడూ కలవడం కానీ, మాట్లాడడం కానీ జరగలేదని ప్రకటించారు. ‘‘ప్రచారంలో ఉన్న గాలి వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. వాటిలో వీసమెత్తయినా నిజం లేదు’’ అని ప్రభాస్ తాను చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో తన ఆరోగ్యం గురించి కూడా పుకార్లు వచ్చాయని ఈ సందర్భంగా ప్రభాస్ తెలిపారు. తాను తీవ్రంగా గాయపడ్డానని, కోమాలో వున్నానని.. ఇలా పుకార్లను సృష్టించారని, ఆ పుకార్ల వల్ల తన కుటుంబం ఎంతో బాధపడిందని, అయినా తాను వాటిని తాను ఉపేక్షించానని, అయితే నాతో పాటు మరో వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలిగించేలా విషప్రచారం సాగుతున్నప్పుడు నేను వాటిని ఉపేక్షించకూడదు. అందుకే ఆ దుష్ర్పచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని ప్రభాస్ తన ప్రకటనలో వివరించారు. ‘‘పెళ్లి చేసుకుని, పిల్లలు కూడా ఉన్న అత్యంత గౌరవనీయురాలైన ఓ మహిళ గురించి ఇంత అమానవీయంగా, అగౌరవకరమైన రీతిలో, ఆమె గౌరవమర్యాదలను దెబ్బ తీసే రీతిలో పుకార్లను ప్రచారం చేయడం శోచనీయం. నాకు రాజకీయ ఆసక్తులేవీ లేవని మీ అందరికీ తెలుసు. ఈ ప్రచారం వ్యక్తిగతంగా హృదయాన్ని తీవ్రంగా బాధించడంతో ఈ ప్రకటన చేస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘ఈ రకమైన నిరాధారమైన గాలి వార్తల వల్ల ఒక వ్యక్తి ఎంతటి బాధకు గురవుతారో, మానసిక క్షోభను అనుభవిస్తారో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఈ దుష్ర్పచారానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యాను’’ అని ప్రభాస్ పేర్కొన్నారు. ‘‘ఇలాంటి వదంతుల వల్ల సంబంధిత వ్యక్తుల గౌరవమర్యాదలకు తీరని నష్టం వాటిల్లుతుంది గనుక ఈ పుకార్లను సృష్టించిన, వాటిని ప్రచారంలో పెట్టడానికి బాధ్యులైన వారిపై పోలీసులు, సంబంధిత అధికారులు తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నాను’’ అని ప్రభాస్ ప్రకటించారు.

మహారాష్ట్ర బార్లలో డాన్స్‌లకు ఫుల్ స్టాప్

  ప్రస్తుతం మహారాష్ట్రలోని బార్లలో మహిళలు డాన్స్ చేసే దుష్ట సంప్రదాయం వుంది. బార్లలో యువతులతో చేయించే అశ్లీల నృత్యాలపై నిషేధం విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం గల కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే దీనికి అనేక అవరోధాలు ఎదురవుతూ వచ్చాయి. ఎట్టకేలకు బార్లలో అశ్లీల నృత్యాలను నిషేధిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లు ఆమోదం పొందింది. బార్లలో డాన్సులపై నిషేధం విధించేందుకు తాము కొత్త బిల్లును ఆమోదించినట్టు మహారాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రకటించారు. ఇప్పుడు మహారాష్ట్రలో బార్లలో మహిళలు, యువతులతో డాన్సులు చేయించడం నేరం. ఇదిలా వుంటే మహారాష్ట్రలోని పలు బార్ల యాజమానులు ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిషేధం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోతారని న్యాయస్థానానికి విన్నవించారు. మరికొంతమంది ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటారని కూడా కోర్టుకు తెలిపారు.

కేసీఆర్ పరిశీలనలో భూగర్భ మెట్రో రైలు

  మెట్రోరైలు అలైన్‌మెంట్ కారణంగా హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ ప్రాంతంలో చారిత్రక కట్టడాలను కోల్పోతున్నామని టీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెబుతోంది. మెట్రో రైలు ఎలైన్‌మెంట్‌ని మార్చాలని టీఆర్ఎస్ గతంలో ఎన్నోసార్లు డిమాండ్ చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెట్రోరైలు పనులను కేసీఆర్ ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి , ఎల్ అండ్ టీ ప్రతినిధులు శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు డిజైన్ మార్పుపై చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సుల్తాన్ బజార్ ప్రాంతంలో మెట్రో రైలు మార్గాన్ని భూ గర్భంలోనుంచి వేసే ఎలా వుంటుందన్న ఆలోచనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో రైలు అధికారుల ముందు వుంచినట్టు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ 11 తీర్మానాలు ఇవే!

  శనివారం నాడు ముగిసిన తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లో 11 తీర్మానాలను ఆమోదించారు. ఈ పదకొండు తీర్మానాలను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అవి ఇలా వున్నాయి... 1. తెలంగాణ అమరులకు సంతాపం. 2. హిమాచల్ మతులకు సంతాపం. 3. ఎవరెస్ట్ విజేతలకు అభినందన. 4. టీవీ-9పై చర్య అధికారం స్పీకర్‌కు. 5. పోలవరం ఆర్డినెన్స్ ఉపసంహరణ. 6. తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి హోదా. 7. సింగరేణి కార్మికులకు ఆదాయం పన్ను మినహాయింపు. 8. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు. 9. బీసీలకూ 33 శాతం రిజర్వేషన్. 10. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు. 11. రాష్ట్ర హైకోర్టు విభజన.

టీడీపీ ఎంపీకి బెదిరింపు ఫోన్లు

  తాజా ఎన్నికలలో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన విద్యావేత్త, మల్లారెడ్డి గ్రూపు విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసిన ఆ వ్యక్తి 30 కోట్లు విరాళం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అలా ఇవ్వకపోతే మీ విద్యాసంస్థలని బాంబులతో పేల్చివేస్తామని హెచ్చరించాడు. దాంతో మల్లారెడ్డి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు నమోదు చేశారు. ఎంపీ సెల్‌ఫోన్‌కు వచ్చిన కాయిన్ బాక్స్ ఫోన్ నంబర్‌పై నగర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మల్లారెడ్డి ఎంపీగా గెలుపొందిన రోజు నుంచి ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తాను నక్సలైట్‌నని, తమ పార్టీకి రూ. 30 కోట్లు విరాళంగా ఇవ్వాలని, లేని పక్షంలో నీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

హాలోగ్రామ్ చూశాక మందు కొట్టవలెను!

  ఇక నుంచి తెలంగాణలో మందుబాబులు మందు బాటిల్ ఓపెన్ చేసేముందు సదరు బాటిల్ మీద హాలోగ్రామ్ వుందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే, మీరు తాగే బాటిల్లో కల్తీ మద్యం వుందేమో ఎవరికి ఎరుక? కల్తీమద్యాన్ని నిరోధించే చర్యల్లో భాగంగా మందు బాటిళ్ళ మీద హాలోగ్రామ్ అతికించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ పద్మారావు తెలిపారు. ఆయన సెక్రటేరియట్‌లో మద్యం విక్రయాలకు సంబంధించిన విధివిధానాలతోపాటు తమ ప్రభుత్వ మద్యం పాలసీని ప్రకటించారు. జూలై 1 నుంచి అన్నిరకాల మద్యం సీసాలపై ప్రభుత్వం నిర్దేశించిన 2డీ బార్‌కోడ్‌తో కూడిన హోలోగ్రాంలను అతికించబోతున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అధిక ధరలకు మద్యం విక్రయిస్తే మొదటి తప్పునకు రూ.లక్ష, అదే తప్పు రెండోసారి చేస్తే రూ.2 రెండు లక్షలు జరిమానా విధిస్తామన్నారు. అప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

షర్మిలపై దుష్ప్రచారం దారుణం: మహిళా ఎంపీలు

  వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైకాపా అధ్యక్షుడు జగన్ సోదరి అయిన షర్మిల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించడం దారుణమని వైసీపీ మహిళా ఎంపీలు సంబంధీకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీలు కొత్తపల్లి గీత (అరకు), బుట్టా రేణుక (కర్నూలు) మీడియాతో తమ ఆవేదనని, ఆగ్రహాన్ని వ్వక్తం చేశారు. రాజకీయాల్లో ఎదుగుతున్న ఒక మహిళా నాయకురాలిపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. షర్మిలను సోషల్ మీడియాలో అవమానించడం వెనుక రాజకీయ హస్తం వుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసం షర్మిలపై అభూత కల్పనలు సృష్టించి ప్రచారం చేయడమనేది దిగజారుడు చర్య అని వారు విమర్శించారు. కొందరు వ్యక్తులు, వెబ్‌సైట్లు షర్మిలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని సమాజంలో మనసున్న ప్రతి మహిళా ప్రతిఘటించాలని, తనపై జరుగుతున్న దుష్ర్పచారంపై ఆమె చేస్తున్న పోరాటంలో తాము వెంట నిలుస్తామని వైకాపా మహిళా ఎంపీలు చెప్పారు.

బియాస్ నదిలో ‘సోనార్’ గాలింపు

  హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో బియాస్ నదిలో గల్లంతైన వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆచూకీ కోసం ఆదివారం నుంచి అత్యాధునిక సోనార్ (సైట్ స్కాన్ రాడార్) పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన 16 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ కోసం ఏడోరోజైన శనివారం నావికాదళం, ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రత్యేక ఈత నిపుణులు, మరో 450 మంది పనివారు రోజంతా గాలించినా లాభం లేకపోయింది. ప్రమాద స్థలి నుంచి మూడు కిలోమీటర్ల మేరకు నదిలో నీటిమట్టాన్ని గంట పాటు కనీస స్థాయికి తగ్గించి వెదికినా ఒక్క మృతదేహం కూడా లభించలేదు. గురువారం వరకు 8 మంది విద్యార్థుల మృతదేహాలు లభించాయి. శుక్రవారం మానవరహిత విమానాన్ని రంగంలోకి దించినా లాభం లేకపోయింది. ఇప్పుడు జరుపుతున్న సోనార్ గాలింపులో కూడా మృత దేహాలు కనిపించకపోతే ఏం చేయాలో అధికారులకు కూడా పాలుపోవడం లేదు. తమ బిడ్డల ఆచూకీ కోసం డ్యామ్ వద్దే పడిగాపులు కాస్తూ, తమ పిల్లల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల మనోవేదనకు అంతులేకుండా పోయింది. ప్రమాదం జరిగిన మండి జిల్లాలోనే వున్న తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం స్థానిక ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

ప్రత్యేక హోదాపై డౌట్లు వద్దు: వెంకయ్య

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని కేంద్ర పట్టణాభివద్ధి శాఖా మంత్రి ఎం వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం నాడు విశాఖలో వెంకయ్య నాయుడిని ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పై విధంగా భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో ప్రణాళికా సంఘం అనేదే లేదని, ఏర్పాటు కావలసి వుందని, అలాంటప్పుడు ప్రణాళికా సంఘం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాదని చెప్పిందన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన అన్నారు. ఏ విషయంలో అయినా తెలంగాణకు నష్టం కలిగించే ఏ పనిని బీజేపీ చేయదని, అలాగని ఆంధ్రకు అన్యాయం జరగనీయమన్నారు. కొత్త రాష్ట్రమైన ఏపీకి అభివద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. విశాఖను అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వేజోన్ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ట్యూషన్ చెప్పినందుకు ఇండియన్ల అరెస్ట్

  సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులను పోలీసులు అరెస్టు చేసి లోపలేశారు. వారు చేసిన తప్పు ఏంటంటే, తమ ఇళ్ళలో స్కూలు పిల్లలకు ట్యూషన్ చెప్పారు. రియాద్‌లోని ఇంటర్నేషన్‌ ఇండియన్ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్న కర్నాటకకు చెందిన మహబూబ్ పాషా, తమిళనాడుకు చెందిన మహ్మద్ రిఫాయ్, ఉత్తర ప్రదేశ్‌కి చెందిన అహ్మద్ సిద్ధికి అనే ముగ్గురు వ్యక్తులు తమ ఇళ్ళలో స్కూలు పిల్లలకు ట్యూషన్లు చెబుతూ పోలీసులకు దొరికిపోయారు. సౌదీ అరేబియా చట్టాల ప్రకారం స్కూళ్ళలో పనిచేసే టీచర్లు ట్యూషన్లు చెప్పకూడదు. ఇది చట్ట విరుద్ధం. అలా ట్యూషన్లు చెప్పిన వారికి సౌదీ చట్టాల ప్రకారం భారీ శిక్షలు పడతాయి. తమ స్కూలుకు చెందిన టీచర్లు అరెస్టు కావడంతో ఉలిక్కిపడిన స్కూలు యాజమాన్యం వారికి బెయిల్ తెప్పించుకునేందుకు తంటాలు పడుతోంది.

కేసీఆర్ మీద భట్టి విక్రమార్కుడికి డౌటొచ్చింది!

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కి చిత్తశుద్ధి లేదన్న సందేహం కలుగుతోందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణలోనే కొనసాగించేలా చూడటంలో కేసీఆర్ చిత్తశుద్ధిని కనబరచడం లేదన్న అభిప్రాయాన్ని భట్టి వ్యక్తం చేశారు. కేసీఆర్ మొదటి నుంచి 1956 నాటి తెలంగాణ కావాలని పదేపదే డిమాండ్ చేసేవారని, అందువల్లే కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందని ఆయన అన్నారు. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రికి 14 పాయింట్లతో ఇచ్చిన వినతిపత్రంలోనూ, అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంలోనూ పోలవరం ప్రస్తావన లేకపోవడం తన అనుమానాలకు బలం చేకూర్చుతోందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

సీఎం ఇల్లు ఖాళీ చేస్తున్న కేజ్రీవాల్

  ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని అయితే వదిలిపెట్టాడుగానీ, ముఖ్యమంత్రి హోదాలో తనకు కేటాయించిన ఇంటిని మాత్రం ఖాళీ చేయకుండా ఇంతకాలం దర్జాగా అందులోనే వుంటున్నాడు. ఈ నివాసాన్ని ఖాళీ చేయాలని గతంలోనే ఢిల్లీ ప్రభుత్వ అధికారులు కేజ్రీవాట్‌ని కోరారు. ఒకవేళ ఖాళీ చేయడం కుదరని పక్షంలో నెలకు 85 వేల రూపాయల అద్దె చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అయితే కేజ్రీవాల్ తన కూతురు ప్లస్ టూ పరీక్షలు ఉన్నందున ఇప్పుడు తాను ఇల్లు ఖాళీ చేయలేనని ప్రభుత్వ అధికారులకు తెలిపాడు. ఇప్పుడు కేజ్రీవాల్ కూతురు ప్లస్ టూ పరీక్షలతోపాటు ఐఐటీ ఎంట్రన్స్ కూడా రాసేసింది. దీంతో కేజ్రీవాల్‌కి ఇల్లు ఖాళీ చేయక తప్పలేదు. త్వరలో తూర్పు ఢిల్లీలోని నివాసానికి మారడానికి కేజ్రీవాల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. కేజ్రీవాల్ కొత్త ఇంటిని వెతుక్కుంటున్నారు. త్వరలో ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీచేస్తారు అని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెప్పాయి.

చంద్రబాబు-శివరామకృష్ణన్ కమిటీ భేటీ

  ఇప్పుడు అందరి దృష్టీ ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఎక్కడ ఏర్పడబోతోందనే దానిమీదే. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదిక ఎలా ఇస్తుందో అనేదానిమీద కూడా ఎదురుచూపులు వున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో శనివారం శివరామకృష్ణన్ కమిటీ జరిపిన సమావేశమైంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో ఉన్న పట్టణాల్లో ఒక దాన్ని అభివృద్ధి చేయడం, లేదా కొత్తగా స్థల సేకరణ చేయడం అనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అయితే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిమీద శివరామక‌ృష్ణన్ కమిటీ ఇంతవరకు చంద్రబాబుకు ఎలాంటి సూచన చేయనట్టు తెలుస్తోంది. ఈ కమిటీతో చంద్రబాబు మరోసారి సమావేశమవుతారు.