ఓం.. హ్రీం.. క్లీం.. మళ్ళీ పూజలు మొదలెట్టిన కేసీఆర్!
posted on Jun 9, 2014 @ 6:54PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడూ రెండు పనుల్లో బిజీగా వుంటారు. ఒకటి సీమాంధ్రులను తిట్టేపని, రెండు పూజలు పునస్కారాలు చేసేపని. ఇప్పటి వరకూ కేసీఆర్ చేసిన భారీ పూజలకి లెక్కలేదు. ఈపూజ అని, ఆ పూజ అని, ఈ హోమం అని, ఆ హోమం అని ఏదో ఒక పూజ చేసేస్తూ వుంటారు. కొంతమంది అయితే కేసీఆర్ ఎలాంటి రాజకీయ నాయకుడైనప్పటికీ, ఆయన్ని కాపాడుతున్నది ఆయన చేసే పూజలు, హోమాల బలమేనని అంటూ వుంటారు. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం.. కేసీఆర్ ఎప్పుడైనా ఏదైనా పూజో, హోమమో మొదలుపెట్టారంటే అప్పుడు తాను ఏదో ప్రాబ్లంలో వున్నట్టు ఫీలవుతున్నారని అర్థం. పూజల తర్వాత మళ్ళీ కేసీఆర్ పుంజుకుని తిడుతూ వుంటారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి పది రోజులు కూడా కాకుండానే తెలంగాణలో ఆయన పరువు అడ్డంగా పోయింది. కేసీఆర్నీ గెలిపించిన రైతులే ఇప్పుడు కేసీఆర్ పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ మళ్ళీ పూజలు మొదలుపెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కోసం బేగంపేటలోని కుందన్ బాగ్ ప్రాంతంలో కొత్త క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ప్రస్తుతం ముమ్మరంగా పూజల మీద పూజలు చేసేస్తున్నారు. ఈ పూజల వెనుక అసలు అంతరార్థం ప్రస్తుతం తాను రైతుల రుణ మాఫీ ఇష్యూలో ఇరుక్కుపోయి వున్నారు కాబట్టి, దాంట్లోంచి బయటపడటమేనని పరిశీలకులు అంటున్నారు.