మాజీ లవరు మైండు తింటున్నాడు: ప్రీతీజింతా ఫిర్యాదు

  ప్రీతీజింతా తన మాజీ లవర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలీవుడ్ నటిగా మాత్రమే కాకుండా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఓనర్ కూడా అయిన ప్రీతీజింతా బిజినెస్‌మేన్ అయిన నెస్‌వాడియాతో గతంలో ప్రేమాయణం నడిపింది. ఇద్దరి మధ్య ఏమైందోగానీ కొంతకాలంగా వీళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా వున్నారు. లేటెస్ట్.గా నెస్‌వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 30న వాంఖేడ్ స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని, తనమీద చెయ్యి చేసుకున్నాడని, ఈ విషయాన్ని బయటపెడితే తనను చంపేస్తానని కూడా బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రీతి ఫిర్యాదు మేరకు ముంబయి మెరైన్ డ్రైవ్ పోలీసులు నెస్ వాడియాపై పలు సెక్షన్ల (354, 504, 506,509 సెక్షన్లు) కింద కేసు నమోదు చేశారు.

షర్మిలమ్మని అవమానిస్తున్నారు: పోలీసులకు ఫిర్యాదు

  వైసీపీ నాయకురాలు షర్మిలను కొంతమంది ఇంటర్నెట్‌లో కించపరుస్తున్నారని వైసీపీ నేతలుహైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, సోమయాజులు శనివారం ఉదయం పోలీసు కమిషనర్‌ని కలసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘షర్మిలమ్మపై కొన్ని రోజులుగా పథకం ప్రకారం సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం జరుగుతోంది. దానిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరాం. చెప్పుకోలేని రీతిలో ఈ ప్రచారం చేస్తున్నారు. అది చాలా బాధాకరం’’ అని ఆయన అన్నారు. షర్మిలపై దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ని కోరామని చెప్పారు. ఈ సైబర్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని సీపీ మహేందర్ రెడ్డి హామీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదిలా వుంటే, షర్మిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, ఫొటోలు మార్ఫింగ్ చేసి పెట్టిన ఇద్దరు యువకులను సీసీఎస్ సైబర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

యుద్ధనౌకలో ప్రధాని మోడీ ప్రయాణం

  భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకలో ప్రయాణించారు. ఈ యుద్ధ నౌకను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో భాగంగా గోవాకి వెళ్ళిన మోడీ, మొదట ఆ నౌకలో ప్రయాణించిన అనంతరం ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. అంతకుముందు మోడీ భారత నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించి యుద్ధ నౌక మొత్తాన్ని పరిశీలించారు. యుద్ధనౌకలో ఉన్న మిగ్-29కె యుద్ధవిమానంలో కూడా మోడీ కాసేపు కూర్చుని దాని మీద నుంచి అభివాదం చేశారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది. ఇది భారత నౌకాదళంలోనే అత్యంత భారీ నౌక. దీని పొడవు 283.5 మీటర్లు, వెడల్పు 59.8 మీటర్లు. మొత్తం 35 యుద్ధ విమానాలను ఒకేసారి మోసుకెళ్లే సామర్థ్యం విక్రమాదిత్యకు ఉంది. 44,500 టన్నుల బరువున్న విక్రమాదిత్యను రష్యా నుంచి కొనుగోలు చేశారు. యుద్ధనౌకను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో మోడీతో పాటు నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్కే ధవన్ కూడా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కి ఆ అర్హత వుంది: మంత్రి

  ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే అర్హత లేదని మొదట బాంబు పేల్చిన కేంద్ర ప్రణాళికా సంఘం ఆ తర్వాత ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉపశమనం మాటలు చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక రాష్ట్ర హోదా పొందడానికి అన్ని అర్హతలూ వున్నాయని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ళ కిషోర్ అన్నారు. రాజధాని లేకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం, రాష్ట్ర విభజన కారణంగా పరిస్థితులు గందరగోళంగా , ఉండడం, ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం ఈ అర్హతలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాని ఇస్తూ త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక రాష్ట్ర హోదా సాధించి తీరుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

పనికిమాలిన అమెరికా: ఒబామా నిస్పృహ

  భద్రత విషయంలో అమెరికా అంత పనికిమాలిన, దరిద్రపు దేశం మరొకటి లేదని సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. అమెరికాలో ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకోవడం మామూలైపోయింది. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకూ తమ దగ్గర వున్న తుపాకీని ఎప్పుడు ఉపయోగించాలా అని తహతహలాడిపోతూ వుంటారు. వీలు దొరికితే ఏ కారణం లేకుండానే కనిపించినవారిని కనిపించినట్టు పిట్టల్లా కాల్చేస్తూ వుంటారు. ఈ దారుణాలు ఎక్కువగా అమెరికా స్కూళ్ళలో జరుగుతూ వుంటాయి. ఇలాంటి సంఘటనల మీద అమెరికా అధ్యక్షుడు ఒబామా తీవ్రంగా స్పందించారు. పాఠశాలల్లో వరుసపెట్టి కాల్పులు సంఘటనలు జరుగుతుండటంతో వాటికి ఇంతవరకు అడ్డుకట్ట వేయలేనందుకు అమెరికా సిగ్గుపడాలని ఒబామా అన్నారు. 18 నెలల వ్యవధిలో ఏకంగా 74 కాల్పుల సంఘటనలు అమెరికాలో జరిగాయి. లేటెస్ట్.గా ఓరెగాన్ హైస్కూల్లో 14 ఏళ్ల అబ్బాయిని ఒకడు కాల్చి చంపాడు. ఈ సంఘటన ఒబామా మనసును కలచివేయడంతో ఆయన చాలా నిస్పృహతో మాట్లాడారు. అమెరికాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరగడం లేదని, తరచుగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు అమెరికా పరువుని ప్రపంచవ్యాప్తంగా తీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారానికోసారి ఇలా కాల్పులు జరుగుతున్న అభివృద్ధి చెందిన దేశం ఏదీ ఈ భూప్రపంచం మీద లేదని, అమెరికాలోనే ఇలా జరుగుతోందని అన్నారు. 2012 డిసెంబర్లో జరిగిన హత్యాకాండ తర్వాత ఇప్పటివరకు 74 సంఘటనలు జరిగాయి. అమెరికాలో విచ్చలవిడిగా ఉన్న గన్ కల్చర్ మీద ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగినా, దాన్ని మాత్రం ఇంతవరకు అరికట్టలేకపోయారు. చివరకు చిన్నపిల్లల చేతుల్లో కూడా తుపాకులు ఉండటం, వాళ్లు వాటిని ఇష్టారాజ్యంగా ఉపయోగించడం లాంటివి కనిపించాయి.

232 మందిని బలితీసుకున్న ప్రత్యక్ష దైవం

  యావత్ ప్రపంచానికి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. ఈ భూగోళం మీద జీవకోటి మనగలుగుతూ వుందంటే దానికి కారణం సూర్యభగవానుడే. అయితే సృష్టికి కారణమైన ఆయన లయానికి కూడా కారణం అవుతున్నాడు. తాను సృష్టించిన జీవుల్ని ఆయనే మాడ్చేస్తున్నాడు. ప్రచండుడి ఎండ ధాటికి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 222 మంది మరణించగా, తెలంగాణలో పదిమంది కన్నుమూశారు. రోజురోజుకూ పెరుగుతున్న వడగాడ్పుల తీవ్రత తట్టుకోలేక వృద్ధులు, బాలలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండని తట్టుకోలేక శుక్రవారం ఒక్కరోజే 160 మంది మృత్యువాత పడ్డారు. గురువారం 62 మంది కన్నుమూశారు. దీంతో రెండు రోజుల్లో 222 మంది ఎండలకు బలైనట్లయింది. శుక్రవారం పలుజిల్లాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో రికార్డుస్థాయిలో 45 డిగ్రీలకు చేరుకుంది. రుతుపవనాల రాక కొంత ఆలస్యం కావడంతో ఎండవేడిమి తట్టుకోలేని స్థాయికి చేరిపోయింది. అలాగే తెలంగాణలోని వివిధ జిల్లాల్లో శుక్రవారం వడదెబ్బకు 10 మంది మృతి చెందారు.

రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యుల్ ఖరారు

  కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్ధన రెడ్డి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో, ఆయన స్థానాన్ని మళ్ళీ భర్తీ చేసేందుకు ఎన్నికల కమీషన్ రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యుల్ నిన్న ప్రకటించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ భన్వర్ లాల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపబడిన ఈ స్థానానికి, ఉప ఎన్నికల నోటిఫికేషన్ జూన్ 16న వెలువడుతుందని తెలిపారు. నామినేషన్లు వేయడానికి గడువు జూన్ 23, వాటి పరిశీలన 24, నామినేషన్ల ఉపసంహరణ జూన్ 26న ముగుస్తుందని తెలిపారు. జూలై 3న ఓట్ల కౌంటింగ్ జరిపి అదేరోజున ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క శాసనసభ్యుడు గెలవనందున ఆ పార్టీకి ఈ ఉపఎన్నికలలో పాల్గొనే అవకాశం లేదు. ఇక తెలుగుదేశం, వైకాపాలకు తగినంత మంది శాసనసభ్యులు ఉన్నందున రెండు పార్టీలు ఈ సీటుకోసం పోటీపడవచ్చును. కానీ, వైకాపా కంటే తెదేపాకే ఎక్కువమంది శాసనసభ్యులు ఉన్నందున తెదేపా అభ్యర్ధి గెలుపు ఖాయం. అందువలన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈ సీటుకోసం అనేకమంది పోటీ పడటం కూడా ఖాయం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన అనేకమంది తెదేపా నేతలు ఈ సీటుకోసం పోటీ పడవచ్చును.

ప్రత్యేక హోదాపై ఆశలు ఇంకా వున్నాయి

  కేంద్ర ప్రణాళికా సంఘం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని వచ్చిన వార్తలు ఆంధ్రప్రదేశ్‌లో కలవరాన్ని కలిగించాయి. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రణాళికాసంఘం క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. కేంద్రం నుంచి అదనపు సాయం పొందే అర్హత కు సంబంధించి, జాతీయ అభివృద్ధి మండలి నిర్దేశించిన సూత్రాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ఇంకా పరిశీలనలోనే ఉందని తెలిపింది. ఇప్పటికే బీహార్, రాజస్థాన్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. బీహార్ కి ఆ హోదా ఇవ్వనవసరం లేదని, మిగతా రాష్ట్రాలకు మాత్రం ఇవ్వవచ్చునని ప్రణాళికా సంఘం భావిస్తోంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రానికి గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ప్రకారం ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు 90 శాతం ప్రణాళికా గ్రాంట్ గా , మిగతాది అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. జాతీయ అభివృద్ధి మండలి నిబంధనల ప్రకారం కొండలు, దుర్గమ ప్రాంతాలు ఉండటం, జన సాంద్రత తక్కువగా ఉండటం, పెద్ద సంఖ్యలో గిరిజన జనాభా ఉండటం, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న సరిహద్దు రాష్ట్రమై ఉండటం వంటి లక్షణాలున్న రాష్ట్రాలకే ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడానికి వీలవుతుంది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, సిక్కింలకు మాత్రమే ప్రత్యేక హోదా ఉంది.

తమిళనాడు బాటలో తెలంగాణ

      తమిళనాడు బాటలో తెలంగాణ పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పయనించేది డెవలప్‌మెంట్ విషయంలో కాదు... మీడియాని అదుపుచేసే విషయంలో. తెలంగాణలో కూడా తమిళనాడు తరహాలో కేబుల్ నియంత్రణ చట్టం తెచ్చే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో దొర్లిన తప్పులను ఎత్తి చూపిన టీవీ9, ఆంధ్రజ్యోతిని ఆయన అసెంబ్లీలో విమర్శించారు. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజా ప్రతినిధులను టీవీ9, ఆంధ్రజ్యోతి తీవ్రంగా విమర్శిస్తున్నాయని, దీనిని సహించమని కేసీఆర్ అన్నారు.

ఒకపక్క లేఖలు.. మరోపక్క కాల్పులు: పాక్ తీరు

      మొదట్నించీ పాకిస్థాన్ తీరేవేరు. ఒకవైపు స్నేహం అంటుంది. మరోవైపు కాల్పులు జరుపుతుంది. మొన్నీమధ్యే పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఇండియాకి వచ్చి వెళ్ళాడు. మోడీ మదర్‌కి మంచి చీర పంపించాడు. ఆ తర్వాత భాయీ భాయీ అంటూ లేఖ రాశాడు. మోడీ కూడా షరీఫ్‌కి తిరుగు లేఖ రాశాడు. అయితే ఇంతలోనే వాస్తవాధీన రేఖ వెంబడి భారత జవాన్లపై పాకిస్థాన్ జవాన్లు కాల్పులకు దిగారు. ఈ విషయాన్ని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండిస్తున్నారు. పాకిస్థాన్ చేస్తున్న ఇలాంటి చర్యలను ఉపేక్షించడానికి వీల్లేదని ఒమర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం జమ్ము కాశ్మీర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో జరిగిన కాల్పులు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ(ఎల్‌వోసి) వెంబడి భారత్ సైనిక శిబిరాలు లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం భారీగా కాల్పులు జరిపింది. మోర్టార్లు వాడింది. దీంతో భారత్ సైన్యం ఎదురు కాల్పులకు దిగింది. జనావాసాల్లోకి బుల్లెట్లు దూసుకొచ్చాయి.

ఎక్కువ చేస్తే మీడియాపై యాక్షన్: కేసీఆర్

      తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాకి వార్నింగ్ ఇచ్చారు. గతంలో మీడియాకి వార్నింగ్ ఇచ్చిన నాయకులు ఎలాంటి ఫలితాలను చవిచూశారో తెలిసినప్పటికీ కేసీఆర్ మీడియాకి వార్నింగ్ ఇచ్చేశారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో వెటకారంగా వార్తలు ప్రచారం చేస్తే మీడియాపై చర్చలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో హెచ్చరించారు. టీవీ9, ఆంధ్రజ్యోతి మీద ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ప్రమాణ స్వీకారం కూడా చేయడం రాదన్నట్టు కథనాలు ప్రసారం చేసినందుకు సదరు ఛానళ్ళ మీద కేసీఆర్ విరుచుకుపడ్డారు. కొన్ని ఛానళ్ళు, పత్రికల తీరు మీద శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. తెలంగాణ శాసనసభ, ఎమ్మెల్యేలను అవమానించిన మీడియాపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరిచిన మీడియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిమీద కేసీఆర్ స్పందిస్తూ మీడియా మీద మండిపడ్డారు.

ఏపీకి ప్రత్యేకహోదా వీలుపడదు: ప్లానింగ్ కమీషన్

  రాష్ట్ర విభజన తరువాత అన్ని విధాల చితికిపోయున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకొనేందుకు రాష్ట్రానికి ఐదేళ్ళ పాటు ప్రత్యేకహోదా ఇస్తున్నట్లు ఇంతకుముందు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వము కూడా ప్రకటించాయి. యూపీయే ప్రభుత్వమే ఆ ప్రతిపాదనను మార్చి రెండున ప్రణాళికా సంఘానికి పంపింది. కానీ మధ్యలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రణాళికా సంఘం ప్రకటన చేయలేకపోయింది. ఇప్పుడు అటువంటి సమస్యలేదు గనుక త్వరలోనే ప్రకటన వెలువడుతుందని కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన రోజునుండి రాష్ట్రానికి ప్రత్యేకహోదా కలుగజేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ప్రణాళికా సంఘం నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.   ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా పొందేందుకు తగిన అర్హతలేదని అందువలన ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ప్రధాని నరేంద్ర మోడీకి తేల్చి చెప్పినట్లు తాజా సమాచారం. ఈ ప్రత్యేకహోదా కోసం బీహార్, రాజస్థాన్, ఓడిశా, ఛత్తిస్ ఘర్, ఝార్ఖండ్ రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. తాజాగా ఆంధ్ర, తెలంగాణాలు కూడా ఆ జాబితాలో చేరాయి. జాతీయ అభివృద్ధి కౌన్సిల్ (యన్.డీ.సి.) నియమ నిబందనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వీలు కుదరకపోతే కేంద్రం నుండి భారీగా నిధులు, పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు వంటివి కేటాయించడం సాధ్యం కాదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటే, ప్రధానమంత్రి నేతృత్వంలో మొత్తం అందరు కేంద్రమంత్రులు మరియు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన యన్.డీ.సి. కమిటీ ఆమోదం తెలుపవలసి ఉంటుంది. ప్రధాని, కేంద్రమంత్రులు దానికి ఆమోదం తెలుపవచ్చునేమో కానీ ప్రత్యేకహోదా కోరుతున్న మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా కేసీఆర్ అందుకు అంగీకరిస్తారనే నమ్మకం లేదు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పొందలేక పోవచ్చును.   అందువల్ల ప్రధాని మోడీ వేరే ఇతర మార్గం ద్వారా రాష్ట్రానికి సహాయా సహకారాలు అందించ వలసి ఉంటుంది. లేదా ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేసి కొన్ని అదనపు సౌకర్యాలు కల్పించవలసి ఉంటుంది. అయితే మరి ఈవిషయం ఇంకా చంద్రబాబు చెవిన పడిందో లేదో తెలియదు కానీ నిన్న మంత్రివర్గం సమావేశంలో రాష్ట్రానికి మరో పదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసినట్లు చెప్పారు.

మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు హైదరాబాద్‌కి

      హిమాచల్ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మరణించిన మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు హైదరాబాద్‌కి చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం ఉపేంద్ర, అరవింద్ అనే ఇద్దరు విద్యార్థులను తీసుకువచ్చిన విమానం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. హైదరాబాద్‌లోనిన వనస్థలిపురం నివాసి అయిన అరవింద్ మృతదేహాన్ని తీసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు విమానాశ్రయానికి తరలి వచ్చారు. వారి రోదనలతో విమానాశ్రయంలో విషాద వాతావరణం నెలకొంది. అలాగే ఉపేంద్ర మృతదేహన్ని అతడి స్వస్థలం ఖమ్మం జిల్లా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా, బియాస్ నదిలో గల్లంతైన మొత్తం 24 మందిలో ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలు మాత్రమే దొరికాయి.

సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

      సివిల్ సర్వీసెస్ -2013 ఫరీక్షల ఫలితాలను యుపిఎస్‌సి గురువారం ప్రకటించింది. ఈ పరీక్షల్లో పరీక్షల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి సత్తా నిరూపించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాదాపు 40 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఐఏఎస్ కేడర్‌కి 20 మంది ఎంపికయ్యారు. సివిల్స్ పరీక్షల్లో 2013 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా 1122 మంది విజయం సాధించారు. జైపూర్‌కు చెందిన గౌరవ్ అగర్వాల్ జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. రెండు, మూడు ర్యాంకుల్ని ఢిల్లీకి చెందిన మునీష్ శర్మ, జార్ఖండ్‌కు చెందిన రచిత్ రాజ్ సాధించారు. మహిళల విభాగం నుండి టాపర్‌గా ఐదో ర్యాంకర్ భారతి దీక్షిత్ ఎంపికయ్యారు. హైదరాబాద్‌ విద్యావజ్రం క్రితిక జ్యోత్స్న జాతీయ స్థాయిలో 30వ ర్యాంకును సాధించారు. హైదరాబాదీ ముషారఫ్ అలీ ఫరూఖీ 80వ ర్యాంక్ సాధించారు. నల్గొండ జిల్లాకు చెందిన కృష్ణ ఆదిత్య 99వ ర్యాంక్ సాధించారు.

సోనియా వల్లే తెలంగాణ కల సాకార౦: కేసిఆర్

      కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా సభ్యుల ధన్యవాదాలు ముగిసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ మొదటిస్థానంలో నిలిస్తే రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలోని బీజేపీ రెండో స్థానంలో ఉంటుందన్నారు. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన దేశంలో 33 పార్టీలకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు వమ్ముకావని, బంగారు తెలంగాణ తప్పకుండా సాకారమవుతుందని స్పష్టం చేశారు. సాగు నీటిని, ఉద్యోగులను పూర్తిస్థాయిలో దక్కించుకుంటామన్నారు. ప్రభుత్వ పని విధానం ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదని, అందువల్ల ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఎలాంటి కాలపరిమితి చెప్పలేమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పునఃర్నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు.

జల 'జగడం' మొదలైంది..!

      ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడి నెల రోజులు కూడా కాకుండానే జల వివాదాలు మొదలయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి పది టీఎంసీల తాగునీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేయాలని అంతర్రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నీటి విడుదలను ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభించాలని కూడా నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. మొత్తం కృష్ణా నదీ జలాల లభ్యత, వినియోగ అవసరాలపై పూర్తిస్థాయి అవగాహన వచ్చిన తర్వాతే కృష్ణా డెల్టాకు తాగునీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు కమిటీ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టాలని తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో, కృష్ణా డెల్టాకు నీటి విడుదల సంక్షోభంలో పడింది. ఇరు రాష్ట్రాలకూ జల వివాదాలే తలనొప్పిగా మారనున్నాయని తొలినుంచీ విశేష్లకులు చెబుతూనే ఉన్నారు. అన్నట్లుగానె రెండు రాష్ట్రాలూ మధ్య జల జగడం మొదలైంది! అంతర్రాష్ట్ర కమిటీవి సిఫార్సులు మాత్రమేనని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు చెబుతుంటే.. కమిటీ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం సమీక్షించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. కమిటీ నిర్ణయాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎలాంటి జోక్యం లేదని జీవో 358లోనే పేర్కొన్నారని వివరిస్తున్నారు. ఇప్పుడు కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్ నుంచి నీళ్లు అవసరమైతే.. సమీప భవిష్యత్తులో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు వంటి ఎత్తిపోతల పథకాలకు నీళ్లు అవసరమవుతాయని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి విడుదలకు అంగీకరించకపోతే ఏమి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జలాలపై ఏ రాష్ట్రానికి అధికారం లేదని, కేంద్రం నేతృత్వంలోని కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, అప్పటిదాకా జీవో 358 ద్వారా ఏర్పాటైన కమిటీదే తుది నిర్ణయమని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలను తిరగదోడడం, నిర్ణయాల అమలుకు తొలి దశలోనే అభ్యంతరాలు చెప్పడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదని స్పష్టం చేస్తున్నారు.

పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు గుండె కాయ

      పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు గుండె కాయ అని, రాజకీయ అవసరాల కోసమే పోలవరం ఆర్డినెన్స్‌పై మాట్లాడుతున్నారని మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. పోలవరం, పులిచింతల పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యమని అన్నారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేసి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పులిచింతల పనులు పూర్తికాకుండానే జాతికి అంకింతం చేశారని విమర్శించారు.ఈ నెల 15న పులిచింతల పనులను పర్యవేక్షిస్తామని, నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామని మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు.

ఫేస్ బుక్ లో కామెంట్స్ చేస్తే జైలుకేనా!

  దాదాపు ఏడాదిన్నర క్రితం ముంబైలో ఒక యువతి ఫేస్ బుక్ లో ఒక రాజకీయ ప్రముఖుడి గురించి చిన్న విమర్శ చేస్తే దానిని మరొక అమ్మాయి లైక్ చేసినందుకు ఆ ఇద్దరినీ ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. అప్పుడు ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో, కోర్టు జోక్యం చేసుకొని పోలీసులకి చివాట్లు పెట్టిన తరువాత వారిరువురినీ విడిచి పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఫేస్ బుక్ లో రాజకీయ నేతలపై కామెంట్స్ చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయడం సబబా కాదా?అనే అంశంపై మీడియాలో చాలా చర్చ జరిగింది. కానీ మీడియాకు ఆ తరువాత మరో హాట్ టాపిక్ దొరకడంతో దానిని వదిలి కొత్త టాపిక్కి జంపైపోవడంతో ఆ ఫేస్ బుక్-కామెంట్స్, చర్చ కధ అలా ముగిసిపోయింది.   మళ్ళీ ఈ మధ్య నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో అటువంటి కేసు మరొకటి బయటపడింది. జిల్లాకు చెందిన తుమ్మల రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్ బుక్ లో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పోలీసులకి పిర్యాదు చేయడంతో, పోలీసులు వెంటనే స్పందించి రమేష్ రెడ్డిపై కేసు నమోదు చేసారు.   తను గల్ఫ్ దేశానికి చెందిన ఒక బ్యాంక్ నుండి అప్పు తీసుకొని ఎగవేశానని, ఆర్మూరులో దాదాగిరీ చెలాయిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నానని, రమేష్ రెడ్డి ఫేస్ బుక్ లో తనపై అసత్య ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నట్లు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు రమేష్ రెడ్డిపై కేసు నమోదు చేసారు.   సాదారణంగా సోషల్ మీడియాలో అశ్లీల, అసభ్యకర, దేశ భద్రతకు భంగం కలిగించే అంశాలు పెడితేనే పోలీసులు తీవ్రంగా పరిగణించి కేసులు నమోదు చేస్తుంటారు. రాజకీయ నాయకులూ నిత్యం ఒకరిపై మరొకరు మీడియా ద్వారా దుమ్మెత్తి పోసుకోవడం సాధారణమే కనుక అటువంటి వాటిని వారు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకొంటే మరే ఇతర నేరాలను చూసేందుకు వారికి సమయం కూడా మిగలదు.   రమేష్ రెడ్డి ఆరోపణల వలన తన పరువుకు భంగం కలుగుతోందని ఎమ్మెల్యేగారు గనక భావిస్తే, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లుగా ఆయన కూడా కేసు వేసుకోవచ్చును. కానీ ఆయన పోలీసులకి పిర్యాదు చేయడం, దానిపై వారు స్పందిస్తూ అతనిపై కేసు నమోదు చేయడంతో కధ మళ్ళీ పునరావృతమయి, ఇదివరకు మధ్యలో నిలిపివేసిన ఫేస్ బుక్ చర్చ తిరిగి మొదలయ్యేలా ఉంది.