కేసీఆర్ తో పోటీకి చంద్రబాబు సై!
posted on Aug 9, 2014 @ 1:18PM
అభివృద్ధిలో తనతో పోటీపడమని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరినా సవాలును ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. తను ఇటువంటి ఆరోగ్యకరమయిన పోటీకి ఎప్పుడూ సిద్దమేనని, ఐదేళ్ళ తరువాత రెండు రాష్ట్రాలలో ఎక్కడ ఎక్కువ అభివృద్ధి జరిగిందనే విషయం ప్రజలే స్వయంగా చూడబోతున్నారని ఆయన ధీటుగా బదులిచ్చారు. తాను కేసీఆర్ కంటే అన్ని విధాల మిన్నగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని, దానిని చూసి వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కూడా తమ పార్టీకే పట్టడం కట్టడం ఖాయమని అప్పుడు తెలంగాణాను కూడా అభివృద్ధి చేస్తానని అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజలను మరింత రెచ్చగొట్టడం, విడగొట్టడం తగదని ఆయన కేసీఆర్ కు హితవు పలికారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలే తప్ప శత్రువుల్లా పోరాడుకోవడం వలన ప్రయోజనం ఉండదని అన్నారు. నేటికీ తన ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉందని ఆయన తెలిపారు.