క్లీన్ ఇండియా కోసం చీపురు పడతానన్న మోడీ

  దేశాన్ని మురికి నుంచి రక్షించుకోవడానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం వుందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ‘మామ్’ని మార్స్ కక్ష్యలో ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని తిలకించడానికి బెంగుళూరుకు వచ్చిన నరేంద్రమోడీని స్థానిక విమానాశ్రయ ఆవరణలో స్థానిక బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ‘‘గాంధీ జయంతి నుంచి స్వచ్ఛమైన భారత్ అనే ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈమధ్య జపాన్‌కి వెళ్ళినప్పుడు అక్కడి రోడ్లు అద్దాల్లా మెరిసిపోతూ వుండటం గమనించాను. ఎక్కడా చెత్త అనేదే కనిపించలేదు. మన దేశాన్ని కూడా అలా ఎందుకు మార్చుకోలేం అనిపించింది. అందుకే మనం మన దేశాన్ని మురికి నుంచి కాపాడుకోవడానికి చేతులు కలపాలి. దేశంలో అందరూ వారానికి రెండు గంటలను మురికిని వదిలించడానికి కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం నాకుంది. ఈ ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమంలో నేను కూడా పాల్గొని చీపురు పడతాను. దేశాన్ని చెత్త రహిత సుందర భూమిగా మార్చుకోవాలన్న సంకల్పం అందరిలోనూ కలగాలి. మన దేశాన్ని పరిశుభ్రంగా వుంచుకోవాలా వద్దా అనేది అందరూ ఆలోచించుకోవాలి’’ అని అన్నారు.

కారం నీళ్ళతో స్వామీజీకి అభిషేకం

  సాధారణంగా కొంతమంది స్వామీజీలు భక్తుల కోరిక మేరకు పూలూ గట్రాలతో అభిషేకం చేయించుకుని అనుగ్రహిస్తూ వుంటారు. అయితే తమిళనాడులోని ఓ స్వామీజీ మాత్రం తన భక్తుల చేత కారం నీళ్ళతో అభిషేకం చేయించుకున్నాడు. ఆ కారం కూడా యాభై గ్రాములో వంద గ్రాములో కాదు.. ఏకంగా 31 కిలోల కారం పొడి కలిపిన నీళ్లు. తమిళనాడులోని వేలూరు ప్రాంతంలో వున్న గంగమ్మ ఆలయానికి సంబంధించిన తోటలో గత నాలుగు నెలలుగాల ఓ స్వామీజీ నివసిస్తున్నాడు. ఆయన పేరు, వివరాలు ఎవరికీ తెలియదు. ప్రత్యంగరా దేవిని పూజించే స్వామీజీ తమిళ, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషలను అనర్గళంగా మాట్లాడతాడు. ఆయన దగ్గరకి భక్తుల రాకపోకలు వుండేవి. మంగళవారం నాడు స్వామీజీ ప్రపంచ శాంతి కోసం తాను కారం నీళ్ళతో అభిషేకం చేయించుకోవాలని అనుకుంటున్నానని ప్రకటించారు. కొంతమంది భక్తులు వారించినా ఆయన మనసు మార్చుకోలేదు. 31 కిలోల కారంపొడి కలిపిన నీళ్ళతో ఆయన అభిషేకం చేయించుకునే ముందు ప్రత్యంగరా దేవిని పూజించారు. ఆ తర్వాత నాన్ స్టాప్‌గా కారం నీళ్ళను మీద పోయించుకున్నారు. అయితే కారం నీళ్ళు మీద పోసే సమయంలోగానీ, ఆ తర్వాతగానీ ఆయన ఒళ్లు మండుతోందని అనకపోవడం విశేషం. ఈ అభిషేకాన్ని వేలాదిమంది తిలకించారు.

స్కూలు బస్సుకు ప్రమాదం.. 15 మందికి గాయాలు...

  తిరుపతి సమీపంలోని తపన్‌పల్లి క్రాస్ దగ్గర ఒక స్కూలు బస్సును ఒక ఇసుక లారీ, తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూలు బస్సులో వున్న 20 మంది విద్యార్థులలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను వెంటనే తిరుపతిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాదం కారణంగా బస్సు అద్దాలన్నీ ముక్కలు ముక్కలు అయిపోయాయి. ఆ అద్దాలు తగలడం వల్లే విద్యార్థులు రక్తసిక్తమయ్యారు. బస్సులోని స్కూలు బ్యాగులన్నీ రక్తసిక్తమయ్యాయి. విద్యార్థులకు తగిలిన గాయాలన్నీ ప్రమాదకరమైనవి కావని, వారెవరికీ ప్రాణాపాయం లేదని తెలుస్తోంది.

కేంద్ర చట్టం పరిధిలోకి హైదరాబాద్ మెట్రో

  హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోంచి జారిపోయి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. హైదరాబాద్‌ మెట్రో రైలును కేంద్ర మెట్రో రైలు చట్టం పరిధిలోకి తెస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పనులు ట్రామ్‌ వే చట్టం పరిధిలో వున్నాయి. అందువల్ల రైల్వే భద్రత బోర్డు మెట్రో ప్రాజెక్టు భద్రతా వ్యవహరాలను పరిశీలించడానికి నిరాకరిస్తోంది. కేంద్ర మెట్రో చట్టం పరిధిలోకి తెస్తేనే పర్యవేక్షిస్తామంటోంది. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖరాస్తూ మెట్రో ప్రాజెక్టును కేంద్రం పరిధిలోకి తీసుకోవాల్సిందిగా కోరింది. ఆ లేఖను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును కేంద్ర మెట్రో రైలు చట్టం పరిధిలోకి తీసుకుని వచ్చింది. మూడు మార్గాలలో మెట్రో రైలు ప్రయాణించే ప్రాంతాలను, స్టేషన్లను కూడా ఖరారు చేసింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయినట్టుగా భావించవచ్చు. మెట్రో రైలు మార్గాన్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టయితే దాన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే చేయాల్సి వుంటుంది. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మెట్రో రైలు మార్గం మార్పు విషయంలో ఒత్తిడి ఎదుర్కొంటోన్న ఎల్ అండ్ టీ సంస్థకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఊరటను ఇచ్చిందని భావించవచ్చు.

ఇస్రో ‘మామ్’ ప్రయోగం సక్సెస్

  భారతదేశ అంతరిక్ష శాస్త్రవేత్తలు కంటున్న కల నిజమైంది. అంగారక గ్రహం కక్ష్యలోకి ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటల్ మిషన్ (మామ్) మార్స్ కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది. ఈ పరిణామంతో భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం నమోదైంది. మార్స్ (అరుణ గ్రహం, మంగళ గ్రహం) గ్రహానికి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన నాలుగో దేశంగా భారతదేశం నమోదైంది. అలాగే ఆసియాలోనే ఈ ఘనతను సాధించిన మొదటి దేశంగా, మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా ఘనతను సాధించింది. బుధవారం నాడు మామ్‌ని అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియలో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు మామ్‌లోని లిక్విడ్ ఎమినిది దశల్లో ఇంజన్‌ని మండించారు. మామ్‌లోని అన్ని ఇంజన్లూ సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత క్షణానికి 22 కిలోమీటర్ల వేగం నుంచి 4 కిలోమీటర్ల వేగానికి మామ్‌ని తగ్గించారు. ఆ తర్వాత మామ్‌ని అంగారక గ్రహ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అనంతరం ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలందరూ హర్షధ్వానాలు చేశారు. ఈ ప్రయోగం మొత్తాన్ని బెంగుళూరులోని ఇస్రో కార్యాలయంలో కూర్చుని తిలకించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది భారత అంతరిక్ష చరిత్రలోనే అద్భుతఘట్టమని, ఒక హాలీవుడ్ సినిమా నిర్మాణ వ్యయం కంటే తక్కువ వ్యయంతో ప్రపంచం ముందు భారతదేశం తలెత్తుకుని నిలబడగలిగే స్థాయి విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారని ఆయన అన్నారు. అంగారక గ్రహంపై పంపిన ఉపగ్రహం విజయం సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన ఉపగ్రహం మధ్యాహ్నం పన్నెండున్నల తర్వాత మార్స్ గ్రహ తొలి ఫొటోను భూమికి పంపించనున్నట్టు తెలుస్తోంది. అలాగే భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఒక ప్రకటనలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది ఒక చారిత్రక ఘట్టమని ఆయన పేర్కొన్నారు.

అమెరికాలో మోడీ హిందీ ప్రసంగం

  భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ఖరారు అయింది. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వడానికే నిరాకరించిన అమెరికా ఇప్పుడు మోడీ ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తోంది. మోడీకి ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 26 నుంచి 30 వరకు మోడీ అమెరికా పర్యటన ఖరారు అయింది. ఈనెల 29 లేదా 30వ తేదీన మోడీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అవుతారు. 27న జరిగే ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. ఈ సభలో మోడీ హిందీలో ప్రసంగించనున్నారు. ఎప్పటి నుంచో భారత్ ఆశిస్తున్న భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. ట్విన్ టవర్స్‌ కూల్చివేతలో మరణించిన వారికి కూడా మోడీ ఈ పర్యటనలో శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అమెరికాలోని ఆరు ప్రధాన కంపెనీల సీఇఓలతో కూడా నరేంద్రమోడీ సమావేశమవుతారు.

పోయిరా పొన్నాలా... శంకర్రావు...

  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అర్జెంటుగా తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఎక్కువైపోయాయి. మొన్నటి వరకూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నాల మీద విరుచుకుపడ్డారు. పొన్నాల రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఇప్పుడు ఆయన కొంచెం చల్లబడినట్టున్నారు. ఆ బాధ్యతని ఇప్పుడు మాజీ మంత్రి శంకర్రావు తీసుకున్నట్టున్నారు. పొన్నాల అర్జెంటుగా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ బాధ్యత తాను తీసుకుంటానని పొన్నాల అన్నారని, అంచేత పొన్నాల పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని శంకర్రావు డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ సభ్యుల మధ్యనే సమన్వయం లేదని, ఇక వీళ్ళు పార్టీలో సమన్వయం ఎలా తెస్తారని శంకర్రావు ప్రశ్నించారు. పొన్నాల పదవిని పీకేసి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం మీద సమర్థుడిని కూర్చోబెట్టాలని సోనియాగాంధీకి లేఖ రాశానని శంకర్రావు వెల్లడించారు.

ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలవంపులు...

  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్’ పథకాన్ని హైకోర్టు విమర్శించడం, ఇది జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించే విషయమని అనడం తెలంగాణ ప్రభుత్వానికి తలవంపులను తెచ్చిందని భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ‘ఫాస్ట్’ పథకాన్ని ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును కోర్టులు ఇప్పటికి ఐదుసార్లు తప్పు పట్టాయని ఆయన గుర్తు చేశారు. కోర్టుల్లో ఎదురు దెబ్బలు ఎదురవుతున్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఒంటెత్తు పోకడలను, ఏకపక్ష వైఖరిని మానుకోవడం లేదని ఆయన విమర్శించారు. స్థానికత అంశంలో కేసీఆర్ భేషజాలు, పట్టింపులకు పోవడం, లేనిపోని రాద్ధాంతం చేయడం మంచిది కాదని లక్ష్మణ్ కేసీఆర్‌కి హితవు చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో ఏర్పడిన గందరగోళానికి తెరదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇండియా నుంచి ఆస్కార్‌కి ‘లయర్స్ డైస్’

  ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్ అవార్డు బరిలో హిందీ చిత్రం ‘లయర్స్ డైస్’ చిత్రం నిలిచింది. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు పొందిన ఈ సినిమా భారతదేశం తరఫున ఆస్కార్ అవార్డు పరిశీలకు పంపడానికి ఎంపికైంది. గీతాంజలి థాపా, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ఈ సినిమా మలయాళ నటి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందింది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన 12 మంది జ్యూరీ సభ్యులు ఈ సినిమాను ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక చేశారు. ఒక గిరిజన మహిళ తన మూడేళ్ళ కూతురుతో కలసి తన భర్తను వెతుక్కుంటూ వెళ్ళే కథాంశంతో రూపొందిన సినిమా ఇది. 61వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘లయర్స్ డైస్’ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంతోపాటు రాజీవ్ రవికి ఉత్తమ సినిమాటోగ్రఫీ, గీతాంజలికి ఉత్తమ నటి అవార్డు లభించాయి. ఇప్పుడు ఈ సినిమా 87వ ఆస్కార్ అవార్డుల పోటీలో నిలిచింది.

ఢిల్లీ జూలో దారుణం.. విద్యార్థిని చంపిన పులి

  ఢిల్లీలోని జంతు ప్రదర్శన శాలలో దారుణం జరిగింది. తెల్ల పులిని ఉంచిన ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన విద్యార్థి మీద పులి దాడి చేసి చంపేసింది. హిమాంశు అనే ఇంటర్మీడియట్ విద్యార్థి ఈ దాడిలో చనిపోయాడు. తెల్లపులిని ఉంచిన ఎన్‌క్లోజర్ చాలా కిందకు వుండటంతో విద్యార్థి లోపలకు పడిపోయాడని, దాంతో అందరూ చూస్తుండగానే పులి ఆ విద్యార్థి మీద దాడిచేసి చంపేసిందని తెలుస్తోంది. ఈ సంఘటన హిమాంశుతోపాటు జూకి వెళ్ళిన విద్యార్థుల సమక్షంలోనే జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో పులి ఎన్‌క్లోజర్ సమీపంలో భద్రతా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పులి నుంచి విద్యార్థిని కాపాడలేకపోయారు. విద్యార్థి పులి వున్న కంచె మీదకి ఎక్కి లోపలకి తొంగి చూస్తూ వుండగా లోపలకి పడిపోయాడని ఒక కథనం వినిపిస్తూ వుండగా, లోపలకి తొంగి చూస్తున్న విద్యార్థి మీద పులి దాడి చేసి లోపలకి లాగేసిందన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీని వీడను: ఎర్రబెల్లి

  తెలుగుదేశం పార్టీని ఎప్పటికీ విడిచిపెట్టనని, తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టాల్సి వస్తే తన గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానే తప్ప మరో పార్టీలో చేరనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఎప్పుడూ చెబుతూ వుంటారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని, ఆయనకు మంత్రిపదవి కూడా ఇవ్వబోతున్నారని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఆయన మరోసారి స్పందించారు. 32 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే వున్నానని, టీడీపిని విడిచిపెట్టే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని చెప్పారు. తన పార్టీ మార్పు విషయంలో వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. తాను తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కలవటం వాస్తవమే కానీ, అర్ధరాత్రి వేళ కలవలేదని, రాత్రం ఏడుగంటల ప్రాంతంలో కలిశానని చెప్పారు. కొందరు మిత్రులతో కలసి తాను వెళ్ళానని వివరించారు. పార్టీలో తనకు ఏవైనా సమస్యలు వుంటే పార్టీ అధినేతతో చర్చించి పరిష్కరించుకుంటానని ఆయన అన్నారు.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసనీయమైన పరిపాలన నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల నుంచి కూడా ఆమోదం, హర్షం లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నిర్ణయాలను కోర్టులు కూడా ఆమోదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు మంచి శుభవార్తని వినిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగ నియామకం వయో పరిమితిని 34 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది నిరుద్యోగులకు ఎంతో మేలు చేసే అంశం. ఏజ్ బార్ అయిపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు మానుకున్న ఎంతోమంది నిరుద్యోగులకు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. అలాగే భవిష్యత్తులో కూడా నిరుద్యోగులకు ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది.

అప్పు ఇవ్వలేదని చంపబోయాడు

  అప్పు అప్పుడే విరోధం అన్నారు. అంటే అప్పు ఇచ్చినా, ఇవ్వకపోయినా విరోధం మొదలైపోతుందన్నమాట. దీనికి ఉదాహరణగా నిలిచే సంఘటన ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో జరిగింది. స్థానికంగా నివాసం ఉండే మొండెయ్య అనే వ్యక్తి ఇంటికి దత్తు అనే బంధువు వచ్చాడు. తనకు అప్పుగా డబ్బు కావాలని దత్తు మొండెయ్యని అడిగాడు. అయితే మొండెయ్య అప్పు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో దత్తు ఈరోజుకు మీ ఇంట్లోనే వుండి, మర్నాటి ఉదయం వెళ్ళిపోతానని చెప్పాడు. దానికి మొండెయ్య అంగీకరించాడు. అయితే అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో దత్తు కత్తి, సుత్తి తీసుకుని మొండెయ్య మీద అతని భార్య, కుమారుడి మీద దాడి చేసి వారిని చంపడానికి ప్రయత్నించాడు. అయితే మొండెయ్య కుటుంబం అతని నుంచి తప్పించుకుని కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి దత్తుని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే దత్తు పారిపోయాడు. దత్తు దాడిలో తీవ్రంగా గాయపడిన మొండెయ్య కుటుంబం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్న పార్టీల విభేదాలు

  రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుండి కూడా తెరాస ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూనే ఉంది. కానీ చంద్రబాబు మాత్రం సంయమనం కోల్పోకుండా రాజకీయ పరిణతి కనబరుస్తూ తెలంగాణా ప్రభుత్వంతో సయోధ్యకే ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిత్వం వహించే వరకు తెలంగాణా ప్రభుత్వం ఘర్షణ వైఖరినే అవలంబించింది. ఆ తరువాత నుండే రెండు రాష్ట్రాల మధ్య కొంచెం సర్దుబాటు, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి కనబడుతోంది. అది రెండు రాష్ట్రాల అభివృద్ధికి చాలా అవసరం కూడా.  హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణా ప్రభుత్వంపై తెదేపా నేత రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలతో పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తున్నట్లు కనబడుతోంది. ఈ వ్యవహారంలో తెదేపా వైఖరిని తెరాస తీవ్రంగా తప్పు పడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణా నుండి తెదేపాను ఖాళీ చేసేస్తామని కుండ బ్రద్దలు కొడుతున్నట్లు చెపుతున్న తెరాస, అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది. తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాసలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. ఒకవేళ ఆ వార్తలు నిజమయితే ఇప్పటికే సీనియర్ నేత నామా నాగేశ్వరరావును తెరాసకు వదులుకొన్న తెదేపాకు ఇది మరో పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది కనుక సహజంగానే ఇది తెదేపాకి ఆగ్రహం కలిగించే విషయం అవుతుంది.   ఈవిధంగా రెండు రాజకీయ పార్టీల నడుమ తలెత్తుతున్న విభేదాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవలసిన ఈ సమయంలో ఈవిధంగా వ్యవహరించడం ఎవరికీ మేలు చేయదని గ్రహించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కృష్ణ, గోదావరిపై కుట్ర జరిగిందట...

  కృష్ణ, గోదావరి జలాల విషయంలో తెలంగాణ మీద కుట్ర జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్‌కె పండిట్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎమ్మెస్ అగర్వాల్‌తో కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులకు నిబంధనలు రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రెండు నదులపై నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు, నీటి విడుదల తదితర కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను ఇరు రాష్ట్రాలకు అప్పగించకుండా బోర్డులే నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని ప్రాజెక్టుల వద్ద సిఐఎస్‌ఎఫ్ సాయుధ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ సహా అన్ని నగరాలు, పట్టణాలు, ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం నీటిని కేటాయించిన తర్వాతనే ఇతర అవసరాలకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా సీమాంధ్ర పాలకులు వ్యవహరించారని కేసీఆర్ అన్నారు.