జయ స్నేహితురాలు శశికళ కూడా దోషే..

  జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె స్నేహితురాలు శశికళను కూడా బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్థారించింది. వీరిద్దరితో పాటు జయలలిత పెంపుడు కుమారుడు సుధాకరన్, ఇళవరసిలు కూడా దోషులుగా తేలారు. పురచ్చితలైవిగా, అమ్మగా పేరొందిన జయలలిత 1991లో తొలిసారి తమిళనాడు సీఎంగా ఎన్నికయ్యారు. 43 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన జయలలిత 1996 ఎన్నికల్లో ఓడిపోయారు. అధికారంలో ఉన్న సమయంలో జయలలిత భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి జయలలితపై ఫిర్యాదు చేశారు.

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం?

  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా ఖరారైన జయలలితకు నాలుగేళ్ళ జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆమె తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వుంటుంది. రెండేళ్ళకు మించి శిక్ష పడినందున తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో జయలలిత ఇలాగే ఓ కేసులో ఇరుక్కుపోతే తన వీర విధేయుడు పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టారు. ఇప్పుడు ఆయన తమిళనాడు ఆర్థికమంత్రి పదవిలో వున్నారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం మీద పన్నీరు సెల్వం కూర్చునే అవకాశం వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న ప్రతిపక్ష డీఎంకే స్పందించింది. తమిళనాడు అసెంబ్లీ రద్దు కావాలని తాము కోరుకోవడం లేదని, అలాగే తమిళనాడులో రాష్ట్రపతి పాలన రావాలని కూడా కోరుకోవడం లేదని డీఎంకే వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

సుబ్రహ్మణ్య స్వామి ఇంటిమీద రాళ్ళదాడి

  అక్రమాస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను దోషిగా నిర్ధారణ చేస్తూ బెంగళూరు కోర్టు తీర్పు చెప్పడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆవేశంతో రెచ్చిపోయారు. బీజేపీ నాయకుడు, న్యాయకోవిదుడు సుబ్రమణ్య స్వామి ఇంటిపై రాళ్లదాడి చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అదేవిధంగా డీఎంకే కార్యాలయంతో పాటు, ఆపార్టీ ముఖ్య నేతల నివాసాల వద్ద ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్నా డీఎంకే కార్యకర్తలు సుబ్రమణ్యస్వామి ఫొటోను కాల్చివేయటంతో పాటు, చెప్పుల దండలు వేసి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా డీఎంకే నాయకుడు కరుణానిధి ఇంటిమీద రాళ్లదాడికి యత్నించిన అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తమిళనాడు మొత్తం భారీగా పోలీసులు మోహరించారు.

తమిళనాడు: డీఎంకే లీడర్ల సంబరాలు.. ఉద్రిక్తం...

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిర్ధారణ అయ్యారు. దాంతో తమిళనాడులో జయలలిత రాజకీయ ప్రత్యర్థ పార్టీ డీఎంకే సంబరాలు చేసుకుంటోంది. 1996లో అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే జయలలితపై ఆరోపణలకు సంబంధించి అప్పటి అధికార పార్టీ డీఎంకే విచారణకు ఆదేశించింది. అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు పట్టువదలకుండా పోరాడిన కరుణానిధి పార్టీ... ఇప్పుడు ముఖ్యమంత్రి జయలలితదోషిగా నిర్దారణ కావడంతో ఆనందంతో ఉరకలు వేస్తోంది. ఈ కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి నివాసంలో కరుణానిధి కుమారుడు స్టాలిన్‌తోపాటు పార్టీ ముఖ్యనేతలు సమావేశమై తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. తమిళనాడు అంతటా డీఎంకే కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటున్నారు.

జయ దోషి.. అన్నాడీఎంకే కార్యకర్తల ఆగ్రహం.. ఆవేశం..

  అక్రమ ఆస్తుల కేసులో జయలలితను బెంగుళూరు కోర్టు దోషిగా నిర్ధారించడంతో తమిళనాడులో అన్నా డిఎంకె కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకురాలు నిర్దోషిగా విడుదలవుతుందన్న నమ్మకంతో వున్న అన్నా డీఎంకే కార్యకర్తలను కోర్టు తీర్పు నిర్ఘాంతపోయేలా చేసింది. కోర్టు తీర్పు వెల్లడయిన వెంటనే పలు ప్రాంతాల్లో ఆందోళనలు ప్రారంభించారు. తమిళనాడు- కర్నాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న బ్యారికేడ్లను విరగ్గొట్టారు. బెంగుళూరు కోర్టు పరిసరాల్లో కూడా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనతో నినాదాలు చేయడం మొదలుపెట్టారు. కోర్టు దగ్గర పదివేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేసినా కూడా పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాలేదు. కోర్టు తీర్పుతో తమిళనాడులోను, మరోవైపు కర్ణాటకలోను కూడా అల్లర్లు మొదలైపోయాయి. పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు, దుకాణాలపై దాడులు జరుగుతున్నాయి. అల్లర్ల నేపథ్యంలో తమిళనాడులో మొత్తం దుకాణాలు మూసేశారు. పోలీసులు అన్నాడీఎంకే కార్యకర్తలను అదుపు చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఈ తీర్పు నేపథ్యంలో డీఎంకే కార్యాలయంతోపాటు డీఎంకే నాయకుల ఇళ్ళు, ఆస్తులకు కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు.

జయలలిత దోషి: తమిళనాడు ఉద్రిక్తం

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషి అని బెంగళూరు ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. జయలలితకు ఏ శిక్ష విధించేదీ కాసేపట్లో తేలనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక రెండు రాష్ట్రాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హోసూరు దగ్గర డీఎంకే- అన్నా డీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దాంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఇక తీర్పు నేపథ్యంలో డీఎంకే నాయకుడు స్టాలిన్.. తన తండ్రి కరుణానిధి నివాసానికి చేరుకున్నారు. తీర్పు ఎలా వస్తే ఎలా స్పందించాలన్న అంశంపై ఆయన తండ్రితో చర్చించారు. తమిళనాడులోని అన్ని పార్టీల కార్యాలయాల్లో ఉన్న నేతలంతా తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు. తీర్పు సందర్భంగా తమిళనాడులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు దాదాపు లక్ష మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

విజయవాడ... దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ప్రారంభం

  ఆంధ్రప్రదేశ్‌లో దూరదర్శన్ సప్తగిరి ఛానల్‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు శనివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, వార్తను వార్తగానే వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానంగానే చెప్పాలని మీడియాకు హితవు చెప్పారు. సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా మీడియా పని తీరు ఉండాలని అన్నారు. టీవీలు, సినిమాలలో హింసాత్మక సంఘటనలు తగ్గించాలని సూచించారు. దూరదర్శన్‌కి 1417 ట్రాన్స్మీటర్లు, 32 ఛానెళ్లు ఉన్నాయని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తెలిపారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రానికి జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య పేరు పెట్టడం పట్ల వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.

వైఫై వున్న మొదటి రైల్వేస్టేషన్ చెన్నై సెంట్రల్

  ఇది ఇంటర్నెట్ యుగం. ఈ తరం నిరంతరం ఇంటర్నెట్ సదుపాయాన్ని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్ దేశంలోనే వైఫై సదుపాయం కలిగిన మొదటి రైల్వే స్టేషన్‌గా అవతరించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ శుక్రవారం నాడు ఈ రైల్వే స్టేషన్‌లో వైఫై సౌకర్యాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తన మొబైల్‌లో వైఫై సౌకర్యాన్ని పరిశీలించారు. ఇకపై చెన్నై రైల్వే స్టేషన్‌కు వచ్చే వారెవరైనా అరగంట పాటు తమ ల్యాప్ టాప్, మొబైళ్లలో ఉచితంగానే ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. ఉచిత ఇంటర్నెట్ సౌలభ్యంలో భాగంగా డౌన్ లోడింగ్‌పై ఎలాంటి పరిమితి లేదు. అయితే అప్ లోడింగ్‌‌కు మాత్రం ప్రయాణికులకు అనుమతి లేదు. ఇక 30 నిమిషాల పాటు ఉచితంగానే ఇంటర్నెట్‌ను ఉపయోగించిన తర్వాత ప్రయాణికులు ఇంకా ఇంటర్నెట్ కావాలనుకుంటే రీచార్జీ చేసుకోవాలి.

దూరదర్శన్‌కి ఇంకా ప్రధాని మన్మోహనే

  పాపం మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రి పదవి ఊడిపోయి ఆయన ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ దూరదర్శన్ వాళ్ళు మాత్రం ఆయన్ని ప్రధానిగా భావిస్తున్నారు. దూరదర్శన్ నేషనల్ ఛానల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సంబంధించిన వార్తలు వస్తున్నప్పుడు విజువల్స్‌లో మన్మోహన్ సింగ్‌ని చూపించి నాలుకలు కరుచుకున్నారు. మొన్నీమధ్య చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటన సందర్బంగా వార్తలు చదివిన న్యూస్ రీడర్ ఆయన పేరులోని ‘ఎక్స్‌ఐ’(XI) అక్షరాలను రోమన్ అంకెల్లోని 11గా భావించి, ‘ఎలెవన్’గా పలికి సస్పెండైన విషయం తెలిసిందే. ప్రధాని మోడీకి బదులు మన్మోహన్‌ని చూపించిన తప్పు ఒక్కసారితో ముగియకుండా పలు బులెటిన్లలో పునరావృతమైందని దూరదర్శన్ వర్గాలు చెప్పాయి.

పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ స్వాగతం

  తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అన్నివిధాలా సహకరిస్తామని, దీనికోసం తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల భూమి సిద్ధంగా వుందని ఆయన చెప్పారు. శంషాబాద్ వద్ద జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కూలిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ క్యాంపస్‌ని కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా కేసీఆర్ పారిశ్రామికవేత్తలకు ఈ పిలుపు ఇచ్చారు. అదేవిధంగా  శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ సిటీతోపాటు ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ని నిర్మిస్తామంటూ జీఎంఆర్ చేసిన ప్రతిపాదనకు కూడా కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

బెంగళూరు ప్రత్యేక కోర్టుకు చేరుకున్న జయలలిత

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద వున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగుళూరు కోర్టు శనివారం తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకు జయలలిత చేరుకున్నారు. కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట జయలలిత హాజరు కానున్నారు. ఈ తీర్పు విషయంలో తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని వుంది. ఈ కేసులో తీర్పు జయలలితకి వ్యతిరేకంగా వస్తే ఆమె తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వుంటుంది. గతంలో ఇలాగే జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తే తన నమ్మినబంటు పన్నీరు సెల్వాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టారు. మరి ఇప్పుడు ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. జయలలిత కేసు తీర్పు సందర్భంగా వేలాదిమంది ఎఐడీఎంకే కార్యకర్తలు ప్రత్యేక కోర్టు వద్దకు చేరుకున్నారు. జయలలితకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిమీద లాఠీఛార్జ్ కూడా చేశారు.

శ్రీవారే నాకు పునర్జన్మ ఇచ్చారు: చంద్రబాబు

  కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దైవం వేంకటేశ్వర స్వామే తనను పదకొండు సంవత్సరాల క్రితం అలిపిరిలో మందుపాతర పేలుడు నుంచి రక్షించి పునర్జన్మ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వేంకటేశ్వర స్వామి కటాక్షంతో తాను మరో జన్మ పొంది ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేశానని చంద్రబాబు చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా అంకురార్పణ జరిగిన శుక్రవారం నాడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సతీ సమేతంగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలో గోవిందనామాన్నే స్మరించాలని చంద్రబాబు సూచించారు.

నినాదాలతో మోడీకి ఘన స్వాగతం

  భారత ప్రధాని శుక్రవారం రాత్రి అమెరికా చేరుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత అమెరికాలో పాదం మోపిన మోడీకి న్యూయార్క్‌లో ఘన స్వాగతం లభించింది. మోడీ విమానంలోంచి దిగగానే స్థానిక భారతీయులు ‘మోడీ.. మోడీ’ అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. మోడీ బసచేసిన హోటల్ బయట ఆయనకు స్వాగతం పలికి, అభినందనలు తెలిపేందుకు అభిమానులు పోటీ పడ్డారు. మోడీ కూడా భద్రతా నియమాలను పక్కన పెట్టి అక్కడకి వచ్చిన వారిలో కలసిపోయి పలకరించారు. సాధారణంగా అమెరికాలో రాజకీయ నాయకుల దగ్గరకి జనం వెళ్ళిపోవడం అరుదుగా జరుగుతూ వుంటుంది. అమెరికా పర్యటనకు వచ్చే నాయకుల భద్రత విషయంలో అమెరికాలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు. ఏ దేశ ప్రధానికీ లభించనంత ఘన స్వాగతం మోడీకి లభించింది. దీనికోసం భద్రతా నిబంధనలను కూడా కొంచెం సడలించారు.

ఇళ్ళలో దూరి అణువణువూ వెతికిన పోలీసులు

  ఈమధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ‘కార్డ్ ఆన్ సెర్చ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రకారం రాత్రి వేళల్లో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వందలాదిమంది పోలీసులు ఆ ప్రాంతంలోని ఇళ్ళలోకి వెళ్ళి సోదాలు చేస్తారు. ఈ సోదాల్లో అనుమానితులను, దొంగ వస్తువులను స్వాధీనం చేసుకుంటారు. తాజాగా శుక్రవారం రాత్రి బంజారాహిల్స్, జూబిలీహిల్స్ ప్రాంతాల్లో వున్న రహమత్ నగర్, కృష్ణానగర్, ఫిలింనగర్, గౌరీశంకర్ బస్తీల్లో పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్ళి తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో అక్రమ మద్యం వ్యాపారులు, పేకాటరాయుళ్ళు, గొలుసు దొంగలు, రౌడీ షీటర్లు మొత్తం 65 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి లక్షన్నర నగదు, మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. పలు కేసుల్లో నాన్ బెయిల‌బుల్ వారెంట్లు వుండి తప్పించుకుని తిరుగుతున్నవారిని కూడా పోలీసులు పట్టుకున్నారు. నేరాల సంఖ్యను తగ్గించడమే ఈ ‘కార్డ్ ఆన్ సెర్చ్’ ప్రధాన ఉద్దేశమని పోలీసు అధికారులు చెబుతున్నారు.