ప్రపంచంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం రెడీ.. కేసీఆర్...

  ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తమ ప్రభుత్వం రెడీ చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో వున్న కేసీఆర్ అడ్డాకులలోని కోజెంట్ పరిశ్రమని సందర్శించారు. అక్కడ అదనపు ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వం రూపొందించిన ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం గురించి చెప్పారు. తమ ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని ప్రపంచంలోని పెట్టుబడిదారులందరూ ప్రశంసిస్తారని కేసీఆర్ చెప్పారు. తమ విధానం ఏక గవాక్ష విధానం అని, అది చాలా పారదర్శకంగా వుంటుందని ఆయన తెలిపారు. పెట్టుబడిదారులు నేరుగా తన కార్యాలయానికి రావొచ్చని, పరిశ్రమలకు సంబంధించిన అన్ని అనుమతులనూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒకేసారి పొందవచ్చని అన్నారు. పరిశ్రమలకు ఇచ్చే అనుమతులను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఏపీలో మూడు కేన్సర్ ఆస్పత్రులు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కేన్సర్ ఆస్పత్రలను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, నెల్లూరు, కర్నూలు నగరాల్లో ఈ ఆస్పత్రలను ఏర్పాటు చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విశాఖపట్నంలో వెల్లడించారు. ఈ మూడు కేన్సర్ ఆస్పత్రుల ఏర్పాటుతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నామని, దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోందని కామినేని శ్రీనివాస్ వివరించారు.

ఇండియా - చైనా మధ్య 12 ఒప్పందాలు

  చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రస్తుతం భారత పర్యటనలో వున్న విషయం తెలిసిందే. పర్యటనలో రెండోరోజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జిన్ పింగ్, నరేంద్రమోడీ మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య 12 కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల మీద ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇండియా - చైనా మధ్య కుదిరిన ఒప్పందాలలో భారత - చైనా ఆర్థిక, వాణిజ్య ప్రణాళిక ఒప్పందం, సమాచార శాఖ ఒప్పందం, రైల్వేల అభివృద్ధిపై ఒప్పందం, భారత - చైనా మధ్య మానస సరోవర్ మార్గ నిర్మాణ ఒప్పందం, ముంబై - షాంఘై నగరాల అభివృద్ధి ఒప్పందాలు వున్నాయి.

నిజాలు దాచి పత్రికల మీద నిందలెందుకు?... కిషన్ రెడ్డి

  తెలంగాణ ప్రభుత్వం, మెట్రో రైల్ నిర్మాణ పనులు చేస్తున్న ఎల్ అండ్ టి సంస్థ ప్రాజెక్టుకు సంబంధించిన నిజాలను దాచిపెట్టి పత్రికల మీద నింద వేయడం సరైన పద్ధతి కాదని తెలంగాణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వాస్తవాలను ప్రచురించే హక్కు పత్రికలకు లేదని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టును ఆపేస్తామని ఉత్తర ప్రత్యుత్తరాలు రాసుకుంటే తప్పులేదుగానీ, వాటిని పత్రికలు ప్రచురిస్తేనే తప్పయిందా అని ఆయన ఎల్ అండ్ టీ సంస్థని అడిగారు. మెట్రో రైలు కోసం ఎల్ అండ్ టీ సంస్థ భారీగా ఖర్చు పెట్టిందని, ప్రభుత్వ విధానం వల్ల మెట్రో పనులు ఆగిపోతున్నాయని బీజేపీ నాయకులు అన్నారు. కొన్ని పత్రికల్లో వచ్చిన లేఖ వివరాలు నిజమో కాదో ఎల్ అండ్ టీ సంస్థ స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ అండ్ టీ సంస్థని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టయితే వారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

యువతిపై వేధింపులు.. ప్రిన్సిపాల్ అరెస్ట్...

  హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఒక విద్యాసంస్థకి చెందిన జూనియర్ కళాశాలలో శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. పిల్లలకు బుద్ధులు చెప్పాల్సిన విధి నిర్వహణలో వున్న అతను తానే బుద్ధి తక్కువ పని చేయడం మొదలుపెట్టాడు. అదే కళాశాలలో పనిచేస్తున్న ఒక యువతిని శ్రీనివాస్ గత పది రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తాను చెప్పినట్టు వినకపోతే ఉద్యోగం తీయించేస్తానని, నీ గురించి దుష్ప్రచారం చేస్తానని ఆమెని బెదిరిస్తున్నాడు. పదిరోజులుగా ఓర్పు వహించిన ఆమె గురువారం నాడు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జీవితంలో ప్రిన్సిపుల్స్ లేని ఆ ప్రిన్సిపాల్‌ని అరెస్టు చేశారు.

స్కాట్లాండ్ వేర్పాటుపై బ్రిటన్‌లో రెఫరెండం పూర్తి...

  బ్రిటన్ నుంచి వైదొలగాలని, స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా అవతరించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ వుండటంతో అక్కడ గురువారం నాడు రెఫరెండం జరిగింది మొత్తం బ్రిటన్‌లోని ప్రజలందరూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. స్కాట్లాండ్ బ్రిటన్‌లో వుండాలా వద్దా అనే ప్రశ్నకు ఎస్ ఆర్ నో చెప్పడం ద్వారా ప్రజలు స్కాట్లాండ్ భవితవ్యాన్ని తేల్చారు. అయితే ఫలితం శుక్రవారం వెల్లడిస్తారు. స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి విడిపోవడాన్ని ప్రస్తుత బ్రిటన్ ప్రధాని కామెరూన్‌తోపాటు ఇతర ప్రముఖ రాజకీయ నాయకులందరూ వ్యతిరేకిస్తున్నారు. అయితే స్కాంట్లాండ్ ప్రజలు మాత్రం బ్రిటన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. రిఫరెండం కనుక స్కాట్‌లాండ్‌ విడిపోవడానికి అనుకూలంగా వస్తే మాత్రం బ్రిటన్ రాజకీయాలలో పెను మార్పులు రావొచ్చని తెలుస్తోంది.

సవతి మీద వేడివేడి నూనె పోసిన మహిళ...

  ఏ పోరు అయినా తట్టుకోవచ్చుగానీ, సవతి పోరు మాత్రం తట్టుకోలేం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రవణ్ యాదవ్‌ అనే మగపురుషుడు బుద్ధి గడ్డితిని రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదట సోను అనే యువతిని పెళ్ళి చేసుకున్న శ్రవణ్ ఆ తర్వాత ఆర్తి అనే మరో యువతిని కూడా పెళ్ళి చేసుకున్నాడు. తన ఇద్దరూ భార్యలూ అక్కా చెల్లెళ్ళలాగా కలసి మెలసి వుంటారని పాపం జీవుడు ఆశించాడు. కానీ ఇక్కడ నేచురల్‌గానే సీన్ రివర్స్ అయింది. సవతులు కలసి వున్నట్టు ఎక్కడైనా చరిత్రలో వుందా... ఇక్కడా అదే జరిగింది. తెల్లారిందంటే చాలు సోను, ఆర్తి జుట్టూ జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ వుండేవారు. ఎందుకొచ్చిన గొడవ అని ఇద్దర్నీ వేరువేరు ఇళ్ళలో వుంచినా వీరి మధ్య గొడవలు తగ్గలేదు. బుధవారం ఆర్తి సోను ఇంటికి వచ్చింది. రావడం కూడా ఖాళీ చేతులతో రాకుండా బాగా మరిగిన నూనెని తీసుకుని మరీ వచ్చింది. రావడం రావడం సోను మీద ఆ నూనెని పోసింది. వేడివేడి నూనె పడటంతో సోనుతోపాటు ఆమె కుమార్తె కూడా తీవ్రంగా గాయపడింది. సోను ఆర్తి మీద, భర్త శ్రవణ్ మీద కేసు పెట్టింది. దాంతో ఇద్దరూ పరారీలో వున్నారు.

గుంటూరు జిల్లాని అదరగొట్టిన వాన

  గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పేరేచర్ల - నల్లపాడు రైల్వే స్టేషన్ల మధ్య 20 మీటర్ల మేర రైల్వేట్రాక్ దెబ్బతింది. దాంతో ఈ మార్గంలో వెళ్ళే రైళ్ళను నిలిపేశారు. రైల్వే ఉద్యోగులు వర్షంలోనే ట్రాక్ మరమ్మతులు చేపట్టారు. అలాగే సత్తెనపల్లి మండలం చినమక్కెన దగ్గర వర్షం వల్ల వంతెన కూలిపోవడంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చిలకలూరిపేటలో భారీ వర్షం ధాటికి ఎస్ఎస్‌పీ కార్యాలయం, పోలీస్ స్టేషన్ జలమయమయ్యాయి. ఓగేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. ఈ వాగు ఉద్ధృతికి చిలకలూరిపేట - కోటప్పకొండ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కొండవీటివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులకు గండ్లు పడి పొలాలు నీట మునిగాయి. హైదరాబాద్ - గుంటూరు రహదారి మీద నీటి ప్రవాహం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.

కట్టుకున్నోడి కళ్ళలో జిల్లేడు పాలు...

  హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కి చెందిన ఓ మహిళకి చక్కని సంసారం వుంది. భర్త, ఇద్దరు పిల్లలు... ఆర్థిక ఇబ్బందులు లేని సంసారం. అయితే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వున్నాడని భావించింది. కళ్ళలో జిల్లేడుపాలు పోస్తే చనిపోతారని ఎవరో చెప్పుకుంటే విన్న ఆ మహా ఇల్లాలు తన భర్త కళ్లలో జిల్లేడు పాలు పోసి చంపేయాలని నిర్ణయించుకుంది. దాంతో తాను అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలసి పథక రచన చేసింది. ఓ గిన్నెడు జిల్లేడు పాలు సేకరించి, నిద్రపోతున్న భర్త కళ్ళలో పోసింది. అయితే ఆ జిల్లేడు పాలు కారణంగా ఆమె భర్త ప్రాణాలు అయితే పోలేదుగానీ, చూపు మాత్రం మందగించింది. సదరు భర్త లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు భర్తని చంపేయాలని నిర్ణయించుకున్న ఆ మహా ఇల్లాలి మీద, ఆమెకి సహకరించిన ప్రియుడి మీద కేసు నమోదు చేశారు. ఇద్దర్నీ రిమాండ్‌కి తరలించారు.

కోటిన్నర పరిహారం పొందిన భారతీయ యువతి... శభాష్...

  అమెరికా అధికారుల తిక్క కుదిరింది. చేసిన తప్పుకు చెంపలు వేసుకుని భారతీయ యువతికి కోటిన్నర పరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీని పూర్వాపరాల్లోకి వెళ్తే, అమెరికాలో భారత దౌత్యవేత్తగా వున్న వ్యక్తి కుమార్తె కృతికా బిశ్వాస్ అమెరికాలోని ఓ స్కూల్లో చదువుతోంది. ఆమె టీచర్‌కి అసభ్య మెయిల్స్ పంపిందన్న అపవాదుతో అమెరికా అధికారుడు ఆమెను స్కూలు నుంచి సస్పెండ్ చేశారు. అక్కడితో ఆగకుండా ఆమెను ఒకరోజు జైల్లో కూడా పెట్టారు. చేయని తప్పుకు తనను బాధ్యురాలిని చేస్తున్నారంటూ కృతికా బిశ్వాస్ న్యూయార్క్ నగర అధికారుల మీద, విద్యాశాఖ మీద కేసు పెట్టింది. దీనిపై విచారించిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కోల్టెల్ అధికారులను మందలించారు. ఆమెకు పూర్తి సంతృప్తి కలిగేలా 1.4 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. దాంతో కేసులన్నింటినీ ఉపసంహరించుకునేందుకు కృతికా బిశ్వాస్ అంగీకరించారు.

మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌కి చంపేస్తామంటూ ఫోన్లు..

  సికింద్రాబాద్ నియోజకవర్గం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌‌కి గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ బెదిరింపు కాల్స్ చేసినవాళ్ళు అంజన్‌కుమార్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. దాంతో ఠారెత్తిపోయిన అంజన్ కుమార్ యాదవ్ హుస్సేనీ ఆలం పోలీసులకు ఆగస్టు 31న ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు మీద కేసు నమోదు చేయాలా వద్దా అని పోలీసులు తర్జనభర్జన పడ్డారు. ఆ సందేహంతోనే హుస్సేనీ ఆలం పోలీసులు నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసిన హుస్సేనీ ఆలం పోలీసులు అంజన్ కుమార్ యాదవ్‌కి బెదిరింపు కాల్స్ ఎక్కడినుంచి వస్తున్నాయన్న అంశం మీద దర్యాప్తు ప్రారంభించారు.

మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలు: మావోయిస్టుల ఖండన...

  తెలంగాణలో వుండాలంటే తమకు సలాం కొట్టాలని, మీడియావాళ్ళ మెడలు విరిచేస్తామని, పది కిలోమీటర్ల లోతున పాతిపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మావోయిస్టులు ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెళ్ళ నిషేధం విషయంలో ఎంఎస్‌ఓల ప్రతిస్పందన న్యాయంగానే వుందని, అయితే వారి ప్రతిస్పందన పాలకుడి నియంతృత్వానికి దారి తీయకూడదని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్ ఒక లేఖను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా మీద చేసిన నియంతృత్వ వ్యాఖ్యలు, నిషేధ ఫత్వాలను ఖండిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ మీడియా మీద నిషేధం తగదని ఆ లేఖలో పేర్కొన్నారు.

వర్మ మీద కేసులు... కోర్టు స్టే...

  ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద నమోదైన కేసుల మీద హైకోర్టు స్టే విధించింది. రామ్‌ గోపాల్ వర్మ వినాయకుడి మీద తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయన మీద కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్లోనే అనేక పోలీసు స్టేషన్లలో ఆయన మీద కేసులు పెట్టారు. రాంగోపాల్ వర్మ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని, అవి బాధ్యతారహితంగా ఉన్నాయంటూ మహారాష్ట్రలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది రామ్ ‌గోపాల్ వర్మకి ఊరట ఇచ్చే విషయమే.

మెట్రోపై లేఖ రాసిన మాట వాస్తవమే... గాడ్గిల్

  మెట్రోపై తెలంగాణ ప్రభుత్వానికి తమ సంస్థ లేఖ రాసిన మాట వాస్తవమేనని, సెప్టెంబర్ 10వ తేదీన తమ సంస్థ లేఖ రాసిందని ఎల్ అండ్ టీ ఛైర్మన్ గాడ్గిల్ వ్యాఖ్యానించారు. మెట్రో రైలు విషయంలో ఎల్ అండ్ టీ సంస్థ రాసిన లేఖ గురించి మీడియాలో వచ్చిన నేపథ్యంలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ని కలిశారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. మెట్రో ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మెట్రో పనులు ఎక్కడా ఆగలేదని చెప్పారు. ఒక పెద్ద ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పుడే కాంట్రాక్ట్ సంస్థకు ప్రభుత్వానికి మధ్య లేఖలు సహజమేనని ఆయన అన్నారు. తాము తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవమే అయినప్పటికీ, పత్రికల్లో కథనాలు రావడమే దురదృష్టకరమని ఆయన అన్నారు. భారీ ప్రాజెక్టులు అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు రావడం సహజమేనని ఆయన చెప్పారు. తమ సంస్థపై దుష్ప్రచారం జరుగుతోందని, తాము ఏ మీడియా సంస్థకీ లేఖలకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని గాడ్గిల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో తమకున్న సమస్యలను సున్నితంగా పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతమని పేర్కొన్నారు.

ఉక్రెయిన్ ఎంపీని చెత్త తొట్టిలో కుక్కేశారు...

  ఉక్రెయిన్ ప్రజల్ని చూసి మన దేశ ప్రజలు చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ప్రజా ప్రతినిధులు పనులు చేయకపోయినా, అవినీతికి పాల్పడుతున్నా జనం అతగాడి పదవీకాలం ముగిసేవరకూ దిగులు ముఖాలు వేసుకుని చూడ్డం తప్ప మరేమీ చేయలేరు. అయితే ఉక్రెయిన్ ప్రజలు అలా కాదు. వాళ్ళు టైమ్ వేస్ట్ చేయరు.. పనికిమాలిన నాయకులను అస్సలు స్పేర్ చేయరు. ఉక్రెయిన్‌లో విటలీ జురవ్ స్కీ అనే ఎంపీ వున్నాడు. ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రజలకు ముఖం చూపించిన పాపాన పోలేదు. ప్రజల సమస్యలను పట్టించుకున్న పుణ్యానా పోలేదు. ఆయనగారి నియోజకవర్గం ప్రజలు చూశారూ చూశారు.. చివరికి పార్లమెంట్ ఎదురుగానే ఆయనకు ఘన సత్కారం చేశారు. మీతో మాట్లాడాలి సార్ అని పార్లమెంట్ నుంచి బయటకి పిలిచి, తమ దగ్గరకి వచ్చిన ఆయన్ని గట్టిగా పట్టుకుని మోసుకెళ్ళి పార్లమెంట్ ముందు వున్న చెత్తకుండీలో పారేశారు. చెత్తకుండీలోంచి బయటకి లేవబోయిన ఆయన మీదపడి అందరూ ఆయన్ని చెత్తకుండీలో మరింత లోపలకి నెట్టేశారు. పోలీసులు వచ్చి ఆయన్ని చెత్తకుండీలోంచి బయటకి తీశారు. తన నియోజకవర్గ ప్రజలు ఈ రకంగా అవమానించాక ఆయన ఊరుకున్నారా? ఆ మురికిబట్టలతోనే పార్లమెంట్‌ లోపలకి వెళ్ళి తన ఎంపీ పదవికి రాజీనామా చేసేశాడు.

మెట్రోపై టీ సీఎం కార్యాలయం ప్రకటన

  మెట్రో రైలు నిర్మాణం నుంచి తప్పుకుంటామంటూ ఎల్ అండ్ టీ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం బయటపడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టకే భంగం ఏర్పడింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. మెట్రో రైలు నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాధారణమని ముఖ్యమంత్రి కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, తెలంగాణ ప్రజలకు నష్టం జరిగేలా పత్రికల్లో కథనాలు వస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.