ఫేస్‌బుక్‌లో అసభ్య మెసేజ్‌లు.. గోవా యువతి అరెస్టు..

  సాధారణంగా ఫేస్‌బుక్‌లో అసభ్య మెసేజ్‌లు పెట్టడం లాంటి పనులు అబ్బాయిలు చేస్తూ వుంటారు. అయితే ఇలాంటి పనులు ఓ అమ్మాయి చేసింది. గోవా రాష్ట్రంలోని పనాజీ సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామానికి చెందిన ఆమె తన స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేసింది. ఆ అకౌంట్లలో వాళ్ళ పేర్లతో రోజూ అసభ్య మెసేజ్‌లు పోస్టు చేయడమే పనిగా పెట్టుకుంది. తన ఎనిమిది మంది స్నేహితుల పేర్లతో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసిన ఆ యువతి, ఆ అకౌంట్ల ద్వారా తాను దొరికిపోకుండా కూడా సాంకేతికంగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంది. అయితే బాధితుల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్లు నిర్వహిస్తున్నదెవరో కనిపెట్టి 22 సంవత్సరాల ఆ యువతిని అరెస్టు చేశారు. ఆమె ఎందుకిలా చేసిందన్న విషయాన్ని పోలీసులు ఆ యువతి నుంచి తెలుసుకునే ప్రయత్నంలో వున్నారు.

ఐటీ హబ్‌గా విశాఖ... గూగుల్..

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిననాడే విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా మారుస్తానని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. తన లక్ష్య సాధనలో భాగంగా ఆయన అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే విప్రో, టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు విశాఖపట్నంలో తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయ స్థాయి పెద్ద సంస్థలతోపాటు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌ సంస్థ కూడా విశాఖపట్టణానికి వచ్చేలా చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 29న చంద్రబాబు నాయుడు విశాఖలో ఐటీ కంపెనీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థల ప్రతినిధులు వస్తున్నారని తెలుస్తోంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత గూగుల్ సంస్థ విశాఖలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా గూగుల్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కూడా కుదరనుందని సమాచారం.

20 ఏళ్ళ క్రితమే నరేంద్ర మోడీ అమెరికా యాత్ర..

  భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా ఆహ్వానం మీద అమెరికా పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే. అంతకుముందు గోధ్రా అల్లర్ల నేపథ్యంలో మోడీకి వీసా నిరాకరించిన అమెరికా ఇప్పుడు మోడీని తమ దేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా, నరేంద్రమోడీ అమెరికా వెళ్ళడం ఇది మొదటిసారి కాదు. 20 సంవత్సరాల క్రితం అమెరికా ఆహ్వానం మీద అక్కడికి వెళ్ళిన మోడీ అక్కడ 30 రోజులు గడిపారు. అమెరికాలోని అభివృద్ధిని పరిశీలించి ఒక అవగాహనకి వచ్చారు. భారతదేశం నుంచి ఆరుగురు ప్రతినిధులను అమెరికాలో పర్యటించాలని అప్పట్లో ఆదేశం అందినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు ప్రతినిధులు అమెరికా వెళ్ళారు. వారిలో నరేంద్రమోడీ, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇప్పటి కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కూడా వున్నారు. ఇప్పుడు మాదిరిగానే అప్పుడు కూడా గడ్డం పెంచుకుని వుండే నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి అద్వాని సూచన మేరకు నీట్‌గా షేవ్ చేసుకుని అమెరికా పర్యటనకు వెళ్ళారట.

శ్రీవారి బ్రహ్మోత్సవానికి అంకురార్పణ... పట్టు వస్త్రాలు

  కలియుగ ప్రత్యక్ష దైవం శీ తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవానికి గురువారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే శుక్రవారం నాడు సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతం పెద్ద శేషవాహనం మీద నాలుగు మాడ వీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజున జరిగే గరుడోత్సవానికి ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.

మహారాష్ట్రలో పొతులు కట్టయ్యాయి.. కొత్త కూటమి ప్రయత్నాలు

  బీజేపీ - శివసేన, కాంగ్రెస్ - ఎన్సీపీ మధ్య పొత్తు చిత్తు కావడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బహుముఖ పోటీ అనివార్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకు పోటీ చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఈ రెండు పార్టీల మధ్య పాతికేళ్ళ నాటి బంధం సీట్ల సర్దుబాటులో అవగాహన కుదరకపోవడం వల్ల తెగిపోయింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎన్సీపీకి మధ్య వున్న సుదీర్ఘమైన బంధం కూడా సీట్ల పొత్తు కుదరకపోవడం వల్ల తెగిపోయింది. ఇలా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా పోటీ చేయడం వల్ల నాలుగు పార్టీలకూ నష్టం జరిగే అవకాశం వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు చేయడం, వాటి ఉపసంహరణలోగా ఈ రెండు జట్ల మధ్య మళ్ళీ అవగాహన కుదిరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వెలిబుచ్చుతున్నారు. భారతీయ జనతా పార్టీ- శివసేన మధ్య పొత్తు కుదిరినట్టే కుదిరి బంధం తెగిపోవడం విచిత్రం. ఇదిలా వుండగా మహారాష్ట్రలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్సీపీ మద్దతు ఉపసంహరించింది. దాంతో ప్రభుత్వం కూలిపోయే అవకాశం కనిపిస్తోంది.

విజయ్ మాల్యా చీటీ చిరిగింది

  వ్యాపార ప్రముఖుడు, విలాస పురుషుడు, యూబీ గ్రూపు ఛైర్మన్ విజయ్ మాల్యా ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో వున్నాడు. ఆయన ఆర్థిక పరిస్థితి దుంపనాశనం అయిపోయిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు ఫోర్బ్స్ పత్రిక 100 మంది భారతీయ సంపన్నుల జాబితా ప్రకటించినా అందులో విజయ్ మాల్యా పేరు వుండేది. ప్రస్తుతం అప్పుల అప్పారావు అయిపోయిన విజయ్ మాల్యా పేరు ఈసారి ఫోర్బ్స్ లిస్టులో లేదు. సంపన్నుల జాబితాకు సంబంధించి విజయ్ మాల్యా చీటీ చిరిగిపోయినట్టే. 2013లో ప్రకటించిన భారతీయ సంపన్నుల జాబితాలో 800 మిలియన్ కోట్ల సంపదతో మాల్యా 83వ స్థానంలో నిలిచారు. ఈసారి ఆయనకు అంత సీన్ లేకుండా పోయింది. అప్పుల్లో కూరుకు పోయిన వారి జాబితా ఏదైనా తయారైతే అందులో విజయ్ మాల్యాకి చోటు దక్కే అవకాశం వుంటుంది. అనేక బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఉద్దేశపూర్వకంగా వాటిని ఎగగొట్టినందుకు ఆయన్ని ఉద్దేశ పూర్వక ఎగవేతదారు (డిఫాల్టర్)గా బ్యాంకులు ప్రకటించాయి. ఉద్దేశపూర్వకంగా రుణాల్ని ఎగవేసినందుకే జాబితాను తప్పించినట్టు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. విజయ్ మాల్యా మొత్తం 17 బ్యాంకులకు 7600 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు.

అమెరికా పర్యటనకు బయల్దేరిన మోడీ

  భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా బయల్దేరి వెళ్ళారు. నరేంద్ర మోడీ వెంట ఉన్నత అధికార బృందం కూడా బయల్దేరి వెళ్ళింది. మోడీ అమెరికాలో ఐదు రోజులపాటు పర్యటిస్తారు. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వడానికే నిరాకరించిన అమెరికా ఇప్పుడు మోడీ ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి 30 వరకు నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తారు. ఈనెల 29 లేదా 30వ తేదీన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోడీ భేటీ అవుతారు. 27న జరిగే ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో నరేంద్ర మోడీ హిందీలో ప్రసంగిస్తారు. భారత్‌కి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు. ఈ పర్యటనలోనే ట్విన్ టవర్స్‌ కూల్చివేతలో మరణించిన వారికి మోడీ శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అమెరికాలోని ఆరు ప్రధాన కంపెనీల సీఇఓలతో కూడా నరేంద్రమోడీ సమావేశమవుతారని సమాచారం.

విద్యార్థిని చంపిన ఆ తెల్లపులి మనుషుల్ని తినదట...

  ఢిల్లీలోని జూలో ఇంటర్ విద్యార్థి తెల్ల పులి కేజ్‌లో పడిపోవడం, తెల్లపులి ఆ విద్యార్థిని చంపడం తెలిసిందే. దీనిమీద జూ అధికారులు వివరణ ఇచ్చారు. నిజానికి ఆ తెల్లపులి విజయ్ మనుషుల్ని తినేది కాదని, ఆ జూలోనే పుట్టి పెరిగినదని చెబుతున్నారు. పులిలో సహజంగా వుండే క్రూరత్వం కారణంగా కందకంలోని విద్యార్థిని చంపిందే తప్ప అది మనుషుల్ని వేటాడే పులి కాదని అంటున్నారు. ఇలాంటి వివరణల మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ పులి మనుషుల్ని చంపుతుందా లేదా అనేది మీరెప్పుడైనా పరీక్షించి చూశారా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పులి కేజ్‌లోకి మనుషులు పడకుండా ఏర్పాట్లు చేయని జూ అధికారులు లేనిపోని వివరణలు ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థి కందకం లోపల పడిపోయిన తర్వాత బయట వున్న వారు పులి మీద రాళ్లు విసురుతూ అరవడం వల్ల దానికి కోపం వచ్చి చంపి వుండవచ్చని అధికారులు అంటున్నారు.

కాఫీ కప్ సెల్యూట్ చేసిన ఒబామా

  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకి ఇప్పుడు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళి హెలికాప్టర్ నుంచి కిందకి దిగిన ఒబామాకి బయట స్వాగతం పలకడానికి నిలుచుని వున్న మెరైన్ కార్ప్ గార్ట్స్ సెల్యూట్ చేశారు. అయితే ఆ సమయంలో కప్పుతో కాఫీ తాగుతున్న ఒబామా చేతిలో కాఫీ కప్పు వుంచుకునే వారికి సెల్యూట్ చేశాడు. ఈ సెల్యూట్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు మీడియాకి విడుదలయ్యాయి. ఒబామా అలా చేతిలో కాఫీ కప్పుతో సెల్యూట్ చేయడం ఎంతమాత్రం పద్ధతిగా లేదని విమర్శలు మొదలయ్యాయి. అలా సెల్యూట్ చేసి ఒబామా మెరైన్ కార్ప్ గార్డ్స్ ని అవమానించారన్న వాదన బయల్దేరింది. కుడి చేతిలో కాఫీ కప్పు వుంటే దాన్ని ఎడంచేతిలోకి తీసుకుని సెల్యూల్ చేయాలిగానీ, ఎంతమాత్రం మర్యాద లేకుండా ఆ చేత్తోనే సెల్యూట్ చేయడం దారుణం అని సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. మరికొంతమంది గార్డ్స్‌కి ఒబామా సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదని, ఏదో ఒక రకంగా సెల్యూట్ చేశాడు కాబట్టి దానిలో తప్పులు వెతకొద్దని అంటున్నారు.

కూతుర్ని సజీవంగా పాతిపెట్టి సవతి తల్లి

  ఆరేళ్ళ కూతుర్ని గొయ్యి తీసి సజీవంగా పాతిపెట్టి కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ సవతి తల్లి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో బయటపడింది. అర్చన అనే 22 ఏళ్ళ మహిళ గత ఆదివారం నాడు తన సవతి కూతుర్ని గొయ్యి తీసి పాతిపెట్టింది. ఆ తర్వాత ఆ పాప కనిపిచండం లేదని భర్తకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పాపని పాతిపెట్టిన ఆ దుర్మార్గురాలు ఆ రహస్యాన్ని తన బంధువులలో ఒకరి దగ్గర వెల్లడించింది. అది విని బిత్తరపోయిన ఆ బంధువు ఈ విషయాన్ని పోలీసుల దగ్గర బయటపెట్టాడు. దాంతో పోలీసులు ఆమెని అరెస్టు చేశారు. గోతిని తవ్వి చూడగా సజీవంగా పాతిపెట్టిన పాప చనిపోయింది. తాను తను కన్న కొడుకు భవిష్యత్తు కోసమే సవతి కూతుర్ని చంపేశానని అర్చన అంగీకరించింది.

మర్డర్లు చేశాక బిర్యానీ తిని వెళ్ళిన హంతకులు

  విజయవాడ-ఏలూరు జాతీయ రహదారి మీద కారులో వెళ్తున్న తండ్రీ కొడుకులను చంపిన ఘటనకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు, సమాచారం లభిస్తోంది. హంతకులు వాడిన కారును గుర్తించారు. హంతకులు తాము బస వేసిన రాయల్ హంపీ హోటల్ వెనుకే కారును వదిలి వెళ్ళిపోయారు. కారును, కారులో వున్న రెండు పెద్ద పెద్ద కత్తులు, ఒక తుపాకీతో పాటు కొన్ని ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు హత్యలు చేసిన తర్వాత హంతకులు హోటల్కు చేరుకుని, తాపీగా బిర్యానీ తిని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ బీహార్ ప్రొఫెషనల్ హంతకులు రాయల్ హంపీ హోటల్ నుంచి బయట పడిన తర్వాత వారందరూ రెండు కార్లలో వారు రాజమండ్రి వైపు వెళ్లినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. హంతకుల్లో అయిదుగురు బీహార్కు చెందినవారు కాగా ఒకరు స్థానికుడని పోలీసులు అనుమానిస్తున్నారు.

కేసీఆర్ మీద గవర్నర్‌కి టీ టీడీపీ కంప్లయింట్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి, ఆశ్రిత పక్షపాత మీద తెలంగాణ టీడీపీ నాయకులు గురువారం నాడు గవర్నర్ నరసింహన్‌కి ఫిర్యాదు చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నాయకత్వంలో టీటీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ని కలిశారు. గవర్నర్‌కి కేసీఆర్ మీద కంప్లయింట్ చేసిన అనంతరం ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ వ్యవహార శైలి, ఆశ్రిత పక్షపాతం మీద గవర్నర్‌కి ఫిర్యాదు చేశాము. అక్రమ భూబదలాయింపులను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాము. అలాగే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచేలా ఆదేశాలని కోరాము. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఇప్పుడు రైతాంగం, విద్యుత్, విద్యార్థి, సంక్షేమ పథకాలకు నిధుల సమస్యతో ఇబ్బంది పడుతోంది. మెట్రో అంశం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కి ఆటంకం కలిగించింది. ఇటువంటి సమస్యలన్నిటినీ చర్చించి పరిష్కారాలు కనుగొనడానికి వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరపాలి’’ అని ఎల్.రమణ అన్నారు.

విజయవాడ హత్యల కోసం లండన్‌లో ప్లాన్

  విజయవాడ సమీపంలోని అవుటపల్లి దగ్గర జరిగిన మూడు హత్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సినిమా ఫక్కీలో, మాఫియా తరహాలో కారు మీద దాడి చేసి మరీ చేసిన హత్యలు అత్యంత పకడ్బందీ వ్యూహంతో జరిగిన హత్యలుగా పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు కుట్రలో పాలుపంచుకున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ సమీపంలో ఈ మూడు హత్యలు చేయడానికి లండన్‌లో ప్లాన్ వేశారని తెలుస్తోంది. ఈ హత్యల కోసం ముంబైకి చెందిన ఓ ప్రొఫెషనల్ కిల్లర్స్ బ్యాచ్‌తో మూడు కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. కొద్ది నెలల క్రితం ఏలూరులోని జెకె ప్యాలెస్ అనే హోటల్‌ యజమాని దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగింది. ఆ హత్య కేసులో నిందితులైన తండ్రి, ఇద్దరు కొడుకులు హతులయ్యారు. హతులైన వారికి కెనడా, లండన్‌లో చాలా ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. లండన్‌లో నివసించే దుర్గారావు బంధువు ఇక్కడ తన అనుచరులతో నిఘా పెట్టి, తండ్రీ కొడుకుల కదలికలను గమనిస్తూ ఈ దారుణ హత్యలు చేయించారని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ముంబైలో జరిగాయని అంటున్నారు.

అలిపిరి మందు పాతర కేసులో తీర్పు ఇచ్చిన హైకోర్టు

  2003 సంవత్సరంలో తిరుపతిలోని అలిపిరిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద మందుపాతరతో దాడి చేసిన కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చింది. చంద్రబాబును హత్యచేసే ఉద్దేశంతో శక్తివంతమైన క్లైమోర్ మైన్‌ని పేల్చారు. అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ దాడి నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ఆ సంఘటనలో అప్పటి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా గాయపడ్డారు. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితులు ఉండగా, ఇప్పటికి ఐదుగురు వ్యక్తులు ప్రధాన నిందితులుగా వున్నారు. నిందితులలో ఇప్పటికే చాలామంది చనిపోయారు. ఈ ఐదుగురిలో దోషులుగా సరైన ఆధారాలు లేకపోవడం వల్ల ఇద్దరిని నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది. మిగతా ముగ్గురిని దోషులుగా ఖరారు చేసింది. ముగ్గురు దోషులకు నాలుగేళ్ళ జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధిస్తూ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో శిక్ష పడిన దోషుల పేర్లు: రామ్మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, కేశవ్.

అలిపిరి కేసులో ఈరోజే తుది తీర్పు

  2003 సంవత్సరంలో తిరుపతిలోని అలిపిరిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద మందుపాతరతో దాడి చేసిన కేసుకు సంబంధించి హైకోర్టు విచారణ పూర్తయింది. నిందితులు చంద్రబాబును హత్యచేసే ఉద్దేశంతో శక్తివంతమైన క్లైమోర్ మైన్‌ని పేల్చారు. అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ దాడి నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ఆ సంఘటనలో అప్పటి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా గాయపడ్డారు. ఈ కేసులో 33 మంది నిందితులు ఉండగా, ఇప్పటికి ఐదుగురు ప్రధాన నిందితులుగా వున్నారు. వీరిలో ఇద్దరిని నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది. ముగ్గురిని దోషులుగా ఖరారు చేసింది. దోషులకు శిక్షలను హైకోర్టు ఈరోజే ప్రకటించే అవకాశం వుంది.