వరవరరావు అరెస్టు

  విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడు వరవరరావును పోలీసులు అరెస్టు చేశారు. రాయకీయ ప్రత్యామ్నాయ వేదిక పేరుతో ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో సభను నిర్వహించాలని విరసం నేతలు భావించారు. కాగా ఆ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎలా అయిన సభను నిర్వహించాలని భావించిన విరసం నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో శనివారం రాత్రి వరవరరావుతోపాటు దాదాపు 50 మంది విరసం నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం వారందరిని కంచన్బాగ్ పోలీసు స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఉన్నారు.

బీజేపీకి శివసేన కొత్త ప్రతిపాదన

  అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన, బిజెపి మధ్య మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకం వ్యవహారంలో ప్రతిష్టంభన ఏర్పడింది. శనివారంనాడు ఆ ఇరు పార్టీల మధ్య ఏ విధమైన చర్చలూ జరగలేదు. పాతికేళ్ల స్నేహబంధాన్ని కాపాడుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదిలా వుంటే, శనివారం నాడు బిజెపి ముందు శివసేన కొత్త ఫార్ములాను పెట్టినట్లు వార్తలు వచ్చాయి. బిజెపికి 126 సీట్లు ఇచ్చి, తాము 155 సీట్లకు పోటీ చేస్తామని శివసేన ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, అటువంటి ప్రతిపాదనేది తమ వద్దకు రాలేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆదివారం నాడు  కొలిక్కి వచ్చే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం మీద చిరంజీవి కామెంట్స్

  తెలుగుదేశం నాయకులు సినిమాల్లో లాగా 100 రోజుల తర్వాత బొమ్మ ఎక్కడ తీసేస్తారోనని, ముందుగానే పండుగ చేసుకుంటున్నారని చిరంజీవి ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చిరంజీవి అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ఎక్కడ చక్కర్లు కొడుతున్నారని చిరంజీవి ప్రశ్నించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు. జన్మభూమి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రఘువీరా సూచించారు.

ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది...

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లోనే వుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏ విజయవాడ పరిసరాల్లోని ఏ ప్రాంతంలో రాజధాని అయితే బాగుంటుందన్న విషయంలో పూర్తిస్థాయిలో సర్వే జరుపుతోంది. మోడల్ రాజధానిగా వుండాలంటే ఏ ప్రాంతంలో రాజధాని నిర్మించాలన్న విషయంలో అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. త్వరలో మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని, దానిని ఇంటర్నెట్‌లో వుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని, సలహాలు, సూచనలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అన్ని విధాలా అనుకూలంగా వున్న ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటవుతుందని ఆయన అన్నారు.

కాశ్మీర్ మీద బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడు

  పాకిస్థాన్ మాజీ ప్రధానులు బేనజీర్ భుట్టో, ఆసిఫ్ జర్దారీల కొడుకు బిలావల్ భుట్టో అతిగా వాగుతున్నాడు. కాశ్మీర్ విషయంలో పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తున్నాడు. పాకిస్థాన్ రాజకీయాలలో పాగావేసి తన తాత, అమ్మమ్మ, తల్లి, తండ్రి తరహాలోనే పాకిస్థాన్‌కి నాయకత్వం వహించాలని కలలు కంటున్న బిలావల్ కాశ్మీర్ విషయంలో పనికిమాలిన, తనకు మాలిన కామెంట్లు చేసి పాకిస్థాన్ ప్రజల దృష్టిలో హీరో అయిపోవాలని అనుకుంటున్నాడు. భవిష్యత్తులో తమ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కాశ్మీర్ మొత్తాన్నీ పాకిస్థాన్‌లోకి తీసుకొస్తుందని, కాశ్మీర్‌లో ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టదని, ఎందుకంటే కాశ్మీర్ పాకిస్థాన్‌కి చెందినది అని అన్నాడు.   అంతేలే, ఇండియాలోనే వున్న కొంతమంది దుష్టశక్తులు కాశ్మీర్ ఇండియాకి చెందినది కాదు అని నోటికొచ్చినట్టు వాగుతున్నప్పుడు పాకిస్థాన్ వాళ్ళు ఎందుకు వాగరు? నీలాంటి పిచ్చుకకి కొమ్ములు తెచ్చింది మావాళ్ళే! 2018లో పాకిస్థాన్‌లో జరిగే ఎన్నికలలో పోటీ చేసి పాకిస్థాస్‌కి ప్రధానమంత్రి అయిపోవాలని కలలు కంటున్న బిలావల్‌కి కాశ్మీర్‌ మీద కామెంట్లు చేయడం తప్ప మరేమీ చేతై చావదు కాబట్టి ఇలా అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఓవైపు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ భారతదేశంతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని చెబుతూ వుంటుంది. మరోవైపు ఆ తానులో ముక్కే అయిన బిలావల్ మాత్రం నోటికొచ్చిన కామెంట్లు చేస్తూ వుంటాడు.   కాకపోతే బిలావల్ భుట్టో జర్దారీ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్‌ని స్వాధీనం చేసుకోవడం తన తాత జుల్ఫ్‌కర్ అలీ భుట్టో వల్ల కాలేదు, తల్లి బేనజీర్ భుట్టోకి చేతకాలేదు. తండ్రి ఆసిఫ్ జర్దారీకి వీలు కాలేదు. పిల్లకాకి బిలావల్‌కీ కుదరదు. చూడు మిస్టర్ బిలావల్... నువ్వు పాకిస్థాన్‌కి ప్రధానమంత్రి కావడం, కాశ్మీర్‌ని ఇండియా నుంచి లాక్కోవడం సంగతి తర్వాత... ముందు పాకిస్థాన్‌ మిలటరీ నుంచి, అతివాదుల నుంచి, ఉగ్రవాదుల నుంచి నీ ప్రాణాలు కాపాడుకో చాలు. ఫ్యూచర్లో నువ్వు ప్రాణభయంతో పాకిస్థాన్ నుంచి పారిపోవాలనుకుంటే శరణార్థిగా బతకడానికైనా ఇండియాతో మర్యాదగా వ్యవహరించు.

కేసీఆర్ నీ ఆర్థిక విధానమేంటో జర చెప్పరాదె: గద్దర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు ప్రకటించడం మాని తన ఆర్థిక విధానమేంటో ప్రకటించాలని ప్రజా గాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. వందలాది కేసులు పెట్టిన తెలంగాణ యువత పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజా పోరాటాల వల్ల మాత్రమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇక అభివృద్ధిని కూడా పోరాడి సాధించుకోవాలని గద్దర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మావోయిస్టుల ఎజెండా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 25 శాతం అమలు చేసినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. రానున్న రోజ్లులో తెలంగాణ అభివృద్ధి యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తానని ప్రజా గాయకుడు గద్దర్ వెల్లడించారు.

ఆరు నెలల్లో జగన్ పార్టీ హుష్‌కాకి: జేసీ

  మరో ఆరు నెలల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వుండదని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు మీద జగన్ పార్టీ నాయకుడు దాడి చేయడమే కాకుండా, తిరిగి ఆయన మీదే కేసు కేసు పెట్టడం విచిత్రంగా వుందని జేసీ అన్నారు. కుక్కునూరులో కలెక్టర్ పర్యటనను జగన్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకున్నాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ముంపు మండలాల విషయంలో టీఆర్ఎస్ పార్టీనే చప్పుడు చేయకుండా వుందని, అలాంటప్పుడు జగన్ పార్టీ ఎందుకు లేనిపోని హడావిడి చేస్తోందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎక్కువ లాభపడేది రాయలసీమ ప్రాంతమేనని ఎంపీ జేసీ దివాకరరెడ్డి వివరించారు.

రెండు ప్రమాదాలు.. ఇద్దరు విద్యార్థులు..

  తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బి.వెంకటాయపాలెం వద్ద కారు ఢీకొనడంతో స్థానిక బీసీ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న మన్నం సాయి అనే విద్యార్థి మరణించాడు. విద్యార్థి రోడ్డు దాటుతూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. అలాగే రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నందిత అనే నాలుగు సంవత్సరాల విద్యార్థిని స్కూలు బస్సు నుంచి కిందకి దిగి, అదే బస్సు కింద పడి మరణించింది. విద్యార్థిని మరణానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. స్థానికులు ఆగ్రహంతో స్కూలు బస్సును ధ్వంసం చేశారు.

అమెరికా అధ్యక్ష పీఠంపై బాబీ జిందాల్?

  అమెరికా అధ్యక్ష పీఠం మీద ఒక భారతీయుడు కూర్చుంటే ఎలా వుంటుంది? ఇంకెలా వుంటుంది? అద్భుతంగా వుంటుంది. ఆ అద్భుతాన్ని సాధించే వ్యక్తి ప్రస్తుత లూసియానా రాష్ట్ర గవర్నర్ బాబీ జిందాల్ ఎందుకు కాకూడదు? అవును.. బాబీ జిందాల్ అవ్వొచ్చన్న అభిప్రాయాలు అమెరికాలో వినిపిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బాబీ జిందాల్ కుటుంబం శతాబ్దాల క్రితం అమెరికాకి వలస వెళ్ళి స్థిరపడింది. బాబీ జిందాల్ రెండుసార్లు లుసియానా రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2015 వరకు వుంది. 2016 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ బాబీ జిందాల్‌ను అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో నిలపాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బాబీ జిందాల్ ఇమేజ్ కేవలం లుసియానా గవర్నర్ పదవితోనే ఆగిపోలేదు. ఇటీవల జరిపిన సర్వేలో ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి వున్న పదిమంది వ్యక్తుల్లో బాబీ జిందాల్ కూడా ఒకరని తేలింది. రిపబ్లికన్ పార్టీలో కూడా ఎక్కువ శాతం మంది బాబీ జిందాల్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా చూస్తే అమెరికాలో వున్న లక్షలాది మంది భారతీయుల ఓటు బ్యాంకు కూడా బాబీ జిందాల్‌కి అండగా నిలుస్తుంది. ఒక తెలుగువాడు అమెరికా అధ్యక్షుడు అయితే చూడాలని వుంది అని గతంలో ఎన్టీఆర్ అంటే చాలామంది నవ్వారు. ఇప్పుడు ఒక భారతీయుడు అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలం తర్వాత తెలుగువాడు కూడా అమెరికా అధ్యక్షుడు అవుతాడేమో!

‘దొరల కుట్ర’ అంటూ రేవంత్ ఆరోపణల చిట్టా...

  తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో వనరుల మీద దొరల కుట్ర జరుగుతోందంటూ కొన్ని ఆరోపణలు చేశారు. ఆ వివరాలు..   * తెలంగాణలో వనరులు దోచుకోవడానికి దొరల కుట్ర జరుగుతోంది.   * మెట్రో రైలు భూమిని నందగిరి దొర మైహోమ్ రాజేశ్వరరావుకు కేటాయించడం నూటికి నూరుపాళ్ళు నిజం.   * ముఖ్యమంత్రి కేసీఆర్ బ్లాక్ మెయిలింగ్‌‌కి భయపడి మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్ వాస్తవాలు దాచిపెడుతున్నారు. మొన్న గాడ్గిల్ చేసింది కూడా కేసీఆర్ చేయించిన బలవంతపు ప్రకటనే.   * మెట్రో రైలుకు కేటాయించిన 18 ఎకరాల స్థలం నుంచి వైదొలగితే తమకు నష్టమని, ఈ స్థలాన్ని మరొకరికి కేటాయించరాదనిఎన్వీఎస్ రెడ్డి గతంలో లేఖ రాస్తే అప్పటి సీఎం కిరణ్ కుమార్ ఈ విషయంలో ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రెండు వేల కోట్ల విలువైన స్థలాన్ని రామేశ్వరరావుకు ఉచితంగా కేటాయించింది. 26 కోట్ల స్టాంపు డ్యూటీని మినహాయించింది.   * తెలంగాణలో అభివృద్ధి జరగలాంటే దొరలు అవినీతికి పాల్పడకూడదు. సాటి దొరల కోసం కేసీఆర్ మెట్రోను పణంగా పెట్టడం అన్యాయం.

ఏపీలో మెట్రో, పెట్రో పర్యటనలు...

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం నాడు మెట్రో, పెట్రో పర్యటనలు జరిగాయి. విజయవాడలో మెట్రోరైలు ఏర్పాటుకు సంబంధించి మెట్రో నిపుణుడు శ్రీధరన్ విజయవాడ పరిసరాల్లో పర్యటన జరిపారు. ఆయన మెట్రో నిపుణుల బృందంతో కలసి విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. మెట్రో రైలు ఏర్పాటుకు గల అవకాశాలు, సాధ్యాసాధ్యాలు, మెట్రో రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మిస్తే మంచిదన్న అంశం మీద ఆయన పరిశీలన జరిపారు. అలాగే రాజమండ్రిలో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర బృందం రాజమండ్రిలో పర్యటించింది. పెట్రో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కోసం అనువుగా వుండే స్థలం కోసం ఈ బృందం అన్వేషణ జరిపింది. ప్రస్తుతం తాత్కాలికంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి అవసరమైన భవంతులను కూడా పరిశీలించింది. వచ్చే ఏడాది నాటికి సొంత భవనాలలో పెట్రో యూనివర్సిటీ కార్యకలాపాలు జరిగే అవకాశం వుందని బృంద సభ్యులు చెబుతున్నారు.

ఏపీ రైల్వేజోన్‌పై త్వరలో నిర్ణయం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశం మీద త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు. ఈ విషయం మీద అధ్యయనం జరుపుతున్న కమిటీ కాల పరిమితిని అక్టోబర్ 15 వరకు పెంచామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తిలేదని ఆయన తేల్చిచెప్పారు. సదానంద గౌడ శుక్రవారం ఇక్కడ రైల్ నిలయంలో ఆయన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 21,022 కోట్ల రూపాయల పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు 2106 కోట్ల రూపాయల నిధులను కేటాయించామన్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో 35 ప్రాజెక్టులు వివిద దశల్లో ఉన్నాయన్నారు. 4,325 కి.మీ పొడవు రైల్వే మార్గం పనులకు 20 వేల కోట్ల రూపాయలు అవసరమన్నారు. 958 కి.మీ పొడువు రైల్వే లైన్ల పనులు పూర్తయ్యాయన్నారు. 29 కొత్త మార్గాల్లో సర్వే పనులు చేపట్టగా, 20 మార్గాల్లో సర్వే వివిధ దశల్లో ఉందన్నారు. ఈ ఏడాది మిగిలిన 9 మార్గాల్లో సర్వే పూర్తవుతుందన్నారు.

ఏటీఎం‌కి తాళం వేయలేదు.. 26 లక్షలు...

  హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్‌లో లతీఫ్ అనే విద్యార్థి ఏటీఎంలోనుంచి రెండు వందలు తీసుకుందామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ ఏటీఎంకి వెళ్ళాడు. ఏటీఎం‌లో అలా కార్డు పెట్టాడో లేదో ఇలా ఏటీఎం బీరువా తెరుచుకున్నట్టు తెరుచుకుంది. ఆ ఏటీఎంలో వున్న 26 లక్షల రూపాయలు కూడా బయటపడ్డాయి. అంత డబ్బు చూసి లతీఫ్ బిత్తరపోయాడు. ఇంకా ముదరని చిన్నపిల్లాడు కావడంతో అతి తెలివితేటలేవీ ప్రదర్శించకుండా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. అధికారులు వచ్చే వరకూ ఏటీఎం‌కి కాపలా వున్నాడు. పోలీసులు, బ్యాంక్ అధికారులు హడావిడిగా వచ్చి, ఏటీఎంలో డబ్బు పెట్టిన సిబ్బంది తాళం వేయలేదని తెలుసుకున్నారు. లతీఫ్‌కి థాంక్స్ చెప్పారు. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే, ఆ ఏటీఎంలోగానీ, పరిసరాల్లోగానీ సీసీ కెమెరాలు లేవు. లతీఫ్ బదులు ఆ సమయంలో ఎవరైనా ముదుర్లు వెళ్ళినట్టయితే పావలా కూడా తిరిగి దొరికేది కాదు.

లోదుస్తుల్లో బంగారు బిస్కెట్లు...

  బంగారం స్మగ్లింగ్ చేసేవారి తెలివితేటలు చూసి కస్టమ్స్ అధికారులకే కళ్ళు తిరుగుతున్నాయి. చెన్నై విమానాశ్రయంలో గురువారం నాడు ఏడుగురు మహిళలు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఏడుగురు మహిళలు బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడం చైన్నై విమానాశ్రయంలో సంచలనం సృష్టించింది. వీరిలో ఒక మహిళ లో దుస్తులో 14 బంగారం బిస్కెట్లు దొరికాయి. అలాగే ఐదుగురు మహిళల బృందం బంగారు బిస్కెట్లను బిస్కెట్ ప్యాకెట్లలో పెట్టుకుని వస్తూ వుండగా కస్టమ్స్ కళ్ళు పట్టేశాయి. అలాగే సింగపూర్ నుంచి వచ్చిన మహిళ దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ వున్నాయి. ఆ నాలుగు సెల్ ఫోన్స్ బ్యాటరీల స్థానంలో బంగారు బిస్కెట్లున్నాయి. మొత్తం ఈ ఏడుగురు మహిళల దగ్గర మూడున్నర కిలోల బంగారం దొరికింది.

‘ఆగడు’ని ప్రత్యేక ఆస్కార్‌‌కి పంపించాలి: వర్మ

  దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకి వెటకారం ఎక్కువైపోయింది. అంతకు ముందు మీడియా ముందుకు వచ్చి లేనిపోని వాడుగు వాగేవాడు. ఇప్పుడు ఈ ట్విట్టర్ పుణ్యమా అని ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తున్నాడు. కేసీఆర్ మీద నోటికొచ్చిన కామెంట్లు చేస్తూ వుంటాడు. మొన్నామధ్య వినాయకుడి మీద కామెంట్లు చేసి నాలుక కరుచుకున్నాడు. ఇప్పుడు మహేష్ నటించిన ‘ఆగడు’ సినిమా మీద ట్విట్టర్లో కామెంట్లు చేశాడు. ఈయనగారు తీసేవన్నీ చెత్త సినిమాలు. నేను నా ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తా. చూస్తే చూడండి లేకపోతే లేదు అంటాడు. ఈయన మాత్రం వేరే వాళ్ళ సినిమాలు చూసి వెటకారం కామెట్లు చూస్తూ వుంటాడు. ‘ఆగడు’ సినిమా రామ్‌గోపాల్ వర్మకి నచ్చినట్టులేదు. ఆ విషయాన్ని ట్విట్టర్లో వెటకారంగా వెళ్ళగక్కాడు. ‘ఆగడు’ సినిమాని ప్రత్యేక ఆస్కార్‌కి పంపించాలని వ్యాఖ్యానించాడు. ఈ సినిమాకి డైలాగ్స్, డైలాగ్స్ మాడ్యులేషన్ విభాగంలో ఆస్కార్ వచ్చే అవకాశం వుందన్నట్టు ట్విట్ చేశాడు. ‘ఆగడు’ సినిమాని ఆస్కార్‌కి పంపిస్తే ప్రపంచ సినిమాను ఆస్కార్ నిర్వాహకులు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. అంతేకాకుండా తన కెరీర్ లో ఓ ఉత్తమ పాత్రను ‘ఆగడు’ సినిమాలో పోషించే అవకాశాన్ని ప్రకాశ్ రాజ్ కోల్పోయాడని మరో ట్విట్ చేశారు. కోన వెంకట్ అంత అద్బుతమైన డైలాగ్స్ రాస్తారంటే తనకు నమ్మబుద్ది కావడం లేదు. సినిమా టైటిల్స్ తాను చూడలేదు. టైటిల్స్ ను కూడా కోన వెంకట్ రాశారా అంటూ చమత్కరించారు. టోటల్‌గా అసలు విషయం ఏమిటంటే, ‘ఆగడు’ సినిమాలో రామ్‌గోపాల్ వర్మ మీద దర్శకుడు శ్రీను వైట్ల కామెంట్లు చేయించాడట. ఆ కోపం వర్మ మనసులో పెట్టుకున్నాడు. అందుకే ఇలా ‘ఆగడు’ మీద ట్విట్లు చేస్తున్నాడు.

ఒమన్‌లో భారతీయ కుటుంబం మృతి

  గల్ఫ్‌లోని ఒమన్‌లో ముగ్గురు సభ్యులన్న భారతీయ కుటుంబం మరణించింది. తమిళనాడుకు చెందిన అనే ఓ వ్యక్తి, తన పదేళ్ళ కూతురుతోపాటు వెళ్తున్న కారును ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. ఈ వార్తను వారి కుటుంబానికి తెలియజేయడానికి మృతుడి దగ్గర దొరికిన ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా, ఇంటి దగ్గర ఎవరూ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పోలీసులు సమాచారం చెప్పడం కోసం ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ మృతుడి భార్య కూడా చనిపోయి కనిపించింది. మృతుడు ఒమన్‌లోని సోహర్ స్టీల్ కంపెనీలో పని చేసేవాడు. ఆయన భార్య ఎల్ అండ్ టి సంస్థలో పనిచేసేది. కుమార్తె నాలుగో తరగతి చదువుతోంది. ఈ కుటుంబం మొత్తం ఒకేసారి చనిపోవడం మిస్టరీగా మారింది. తండ్రీ కూతురున్న వాహనాన్ని ట్యాంకర్ ఢీకొందా... లేక ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో వారే ట్యాంకర్‌కి వాహనాన్ని అడ్డు తెచ్చారా అనేది తేలాల్సి వుంది. మొత్తమ్మీద కుటుంబ తగాదాల వల్ల ఈ మరణాలు సంభవించాయని ఒమన్ పోలీసులు అనుమానిస్తున్నారు.