ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్న పార్టీల విభేదాలు
posted on Sep 23, 2014 @ 12:09PM
రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుండి కూడా తెరాస ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూనే ఉంది. కానీ చంద్రబాబు మాత్రం సంయమనం కోల్పోకుండా రాజకీయ పరిణతి కనబరుస్తూ తెలంగాణా ప్రభుత్వంతో సయోధ్యకే ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిత్వం వహించే వరకు తెలంగాణా ప్రభుత్వం ఘర్షణ వైఖరినే అవలంబించింది. ఆ తరువాత నుండే రెండు రాష్ట్రాల మధ్య కొంచెం సర్దుబాటు, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి కనబడుతోంది. అది రెండు రాష్ట్రాల అభివృద్ధికి చాలా అవసరం కూడా. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణా ప్రభుత్వంపై తెదేపా నేత రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలతో పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తున్నట్లు కనబడుతోంది. ఈ వ్యవహారంలో తెదేపా వైఖరిని తెరాస తీవ్రంగా తప్పు పడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణా నుండి తెదేపాను ఖాళీ చేసేస్తామని కుండ బ్రద్దలు కొడుతున్నట్లు చెపుతున్న తెరాస, అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది. తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాసలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. ఒకవేళ ఆ వార్తలు నిజమయితే ఇప్పటికే సీనియర్ నేత నామా నాగేశ్వరరావును తెరాసకు వదులుకొన్న తెదేపాకు ఇది మరో పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది కనుక సహజంగానే ఇది తెదేపాకి ఆగ్రహం కలిగించే విషయం అవుతుంది.
ఈవిధంగా రెండు రాజకీయ పార్టీల నడుమ తలెత్తుతున్న విభేదాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవలసిన ఈ సమయంలో ఈవిధంగా వ్యవహరించడం ఎవరికీ మేలు చేయదని గ్రహించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.