దుర్గమ్మ పాదాల చెంత దేవాదాయ శాఖ

  త్వరలో హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ తరలిరానున్నాయి. అన్నిటికంటే ముందుగా దేవాదాయ కమీషన్ తరలి వచ్చేందుకు సన్నధం అవుతోంది. కృష్ణానది ఒడ్డున సీతానగరంలో భక్తుల వసతి కోసం ఇటీవల కొత్తగా నిర్మించిన రెండంతస్తుల భవనం అన్ని విధాల అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 2500 మంది ఉండేందుకు వీలుగా నిర్మించబడిన ఈ భవనం కమీషన్ కార్యాలయానికి అన్ని విధాల సరిపోతుందని, చిన్నచిన్న మార్పులతో దానిని కమీషన్ కార్యాలయానికి అనువుగా మార్చుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. త్వరలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి భవనాన్ని పరిశీలించిన తరువాత అంతిమ నిర్ణయం తీసుకొంటామని అధికారులు తెలిపారు.

కేసీఆర్‌కి వ్యతిరేకంగా చెన్నైలో జర్నలిస్టుల నిరసన

  తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కి వ్యతిరేకంగా వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు చెన్నైలోని ప్రెస్ క్లబ్ వద్ద ధర్నా తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేసీఆర్ జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని, దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెన్నై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమాలలో తమిళ, తెలుగు, మలయాళ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు, జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ చెన్నై సభ్యులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రతికా స్వేచ్పను కాలరాసే విధంగా వ్యాఖ్యలు చేశారని చెన్నై ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి భారతీ తమిజాన్ అన్నారు. తెలంగాణలో ప్రైవేట్ ఛానెల్స్ ప్రసారాలపై ఆంక్షలు విధించడాన్ని భారతీ తమిజాన్ ఖండించారు.

తెలంగాణ ‘ఫాస్ట్’ జీవోపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

  సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవడంతోనే సరిపోయింది. సోమవారం ఉదయం వాహనాల నంబర్ ప్లేట్ల మీద తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం అక్షింతలు వేసింది. ఇష్టమొచ్చినట్టు నంబర్ ప్లేట్లు మార్చుకోవాలని, రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడం మీద హైకోర్ట ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే సోమవారం మధ్యాహ్నం మరో అంశం మీద హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం మీద సీరియస్ అయింది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి జారీ చేసిన ‘ఫాస్ట్’ పథకం జీవోను హైకోర్టు తప్పు పట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేయడం రాజ్యాంగపరంగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. జాతీయ సమగ్రతను దెబ్బ తీసేలా ఈ జీవో వుందని హైకోర్టు ఆగ్రహించింది. ఈ జీవో విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించింది. తెలంగాణ ఎక్కడో ప్రత్యేకంగా లేదని, తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వ ‘ఫాస్ట్’ జీవోను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రులు పితాని, డొక్కా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద కౌంటర్ అఫిడవిట్‌ని దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆరు వారాల తర్వాతకి వాయిదా వేసింది.

లేడీ సీఎంలకు బతుకమ్మ ఆహ్వానాలు...

  బతుకమ్మ ఉత్సవాలకు మా నాయకురాలు సోనియాగాంధీని ఆహ్వానించండి మహాప్రభో అని కాంగ్రెస్ వాళ్ళు ఎంత మొత్తుకున్నా తెలంగాణ ముఖ్యమంత్రి ఎంతమాత్రం కరగలేదు. అయితే నాలుగు రాష్ట్రాల మహిళా ముఖ్యమంత్రులను మాత్రం సాదరంగా ఆహ్వానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె సింధియా, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కేసీఆర్ బతుకమ్మ ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా తెలిపారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమాలలో తాను కూడా పాల్గొంటానని కేసీఆర్ చెప్పారు. దళిత, గిరిజన వధువులకు పెళ్ళి సందర్భంగా 51 వేల రూపాయల ఆర్థికసాయం అందించే ‘కళ్యాణలక్ష్మి’ పథకాన్ని దసరా నుంచి ప్రారంభించనున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఫేస్‌బుక్‌ వాడితే నెలనెలా బిల్లు కట్టాలా?

  ఇప్పుడు ఎంచక్కా ఫ్రీగా వాడేసుకుంటున్న ఫేస్‌బుక్‌ని నవంబర్ 1 నుంచి ఉపయోగించాలంటే నెలనెలా దాదాపు మూడు డాలర్ల బిల్లు కట్టాలా? వామ్మో... భయపడకండి.. గత రెండు రోజులుగా కొన్ని వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్ వాడేవారు నవంబర్ నుంచి నెలనెలా దాదాపు మూడు డాలర్ల బిల్లు కట్టాల్సి వుంటుందని, ఈ విషయాన్ని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ వినియోగదారులు బిత్తరపోయారు. ఏంటీ అన్యాయం అంటూ ఫేస్‌బుక్‌లోనే తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వెలిబుచ్చారు. అయితే ఈ కథనంలో ఎంతమాత్రం వాస్తవం లేదని ఫేస్‌బుక్ ప్రతినిధులు వెల్లడించారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్

  తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావు, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు హరగోపాల్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల కాలంలోనే ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని కేసీఆర్ చూస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజాసంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామనని, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం పద్ధతి కాదని వారు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన విధానాన్ని మార్చుకోకుండా భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణలో మరో ఉద్యమం చేయక తప్పదని వారు హెచ్చరించారు. కాళోజీ, జయశంకర్ లాంటివాళ్ళు కోరుకుంది ఇలాంటి నిర్బంధాలతో కూడిన తెలంగాణను కాదని వారు అన్నారు.

కీలక పరీక్ష పాసైన ‘మామ్’

  మామూలుగా పిల్లలు పరీక్ష పాసవుతూ వుంటారు. ఇప్పుడు ‘మామ్’ పరీక్షలో పాసైంది. ఇదేదో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలోనో, వయోజన విద్య పరీక్షలోనో కాదు.. అంతరిక్ష పరీక్షలో... ఇస్రో నిర్వహించిన పరీక్షలో. మూడు వందల రోజుల క్రితం ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ‘మార్స్ ఆర్బిటరీ మిషన్’ (మామ్)కి కీలక పరీక్షను ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించారు. మామ్ ప్రధాన ఇంజిన్ ద్రవాన్ని ప్రయోగాత్మకంగా మండించారు. ఈ పరీక్షలో ‘మామ్’ పాసైనట్టు తెలుస్తోంది. ఈ పరీక్షలో పాసైన అనంతరం ‘మామ్’ మార్గ సవరణ ప్రక్రియను చేపట్టారు. ‘మామ్’ వేగాన్ని గంటకు 22.1 కిలోమీటర్ల నుంచి 4.4 కిలోమీటర్లకు తగ్గించనున్నారు. అనంతరం మార్స్ కక్ష్యలోకి ప్రవేశపెడతారు.

ఎంపీ కొత్తపల్లి గీతకు అరెస్టు వారెంట్... ఉపసంహరణ

  విశాఖపట్టణం జిల్లా అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత అరెస్టుకు నాన్ బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. చెల్లని చెక్కు ఇచ్చిన నేరం మీద ఆమెకు ఎర్రమంజిల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. విశ్వేశ్వరయ్య ఇన్ఫ్రాస్టక్చర్ సంస్థ నుంచి రుణం తీసుకున్న కొత్తపల్లి గీత రుణాన్ని తిరిగి చెల్లించే నిమిత్తం ఆ సంస్థకు చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ బౌన్స్ అయింది. దాంతో సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసు విచారణ నిమిత్తం కొత్తపల్లి గీత న్యాయస్థానానికి హాజరు కావడం లేదు. దీంతో కొత్తపల్లి గీత అరెస్టుకు కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్తపల్లి గీత తనపైన జారీ చేసిన అరెస్టు వారెంట్‌ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోర్టును కోరారు. దాంతో కోర్టు అరెస్టు వారెంట్‌ని ఉపసంహరించుకుంది.

పౌరుల్ని ఎందుకు వేధిస్తున్నారు?: టీ సర్కారుకు హైకోర్టు ప్రశ్న

  వాహనాల రిజిస్ట్రేషన్ పేరిట పౌరులను ఎందుకు వేధిస్తున్నారని హైకోర్టు ధర్మాసనంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని వాహనాలన్నిటి నంబర్ ప్లేట్లు అన్నీ ‘ఏపీ’ నుంచి ‘టీఎస్’ అని మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం మీద కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం తెలంగాణలో నంబర్ ప్లేట్ల రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై స్టే విధించింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం మీద పలు ప్రశ్నల్ని సంధించింది. చట్టాన్ని రూపొందించకుండా పాత రిజిస్ట్రేషన్లు ఎలా మారుస్తారు? రీ రిజిస్ట్రేషన్ పేరిట పౌరుల్ని ఎందుకు వేధిస్తున్నారు? అధికారం ఉంది కదా అని ఏది చేసినా నడుస్తుందని అనుకుంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఛత్తీస్‌ఘడ్‌కి చేరుకున్న చంద్రబాబు బృందం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రతినిధి బృందం ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌కి చేరుకుంది. చంద్రబాబుతోపాటు ఈ పర్యటనలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నారాయణ, రావెళ్ళ కిషోర్ బాబుతోపాటు నీటి పారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు, పదిహేను మంది పారిశ్రామికవేత్తలు రాయ్‌పూర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఛత్తీస్‌ఘడ్ కొత్త రాజధాని నయా రాయ్‌పూర్‌ని సందర్శించడానికి చంద్రబాబు బృందం బయల్దేరింది. ఛత్తీస్‌ఘడ్ పర్యటన సందర్భంగా చంద్రబాబు అక్కడి ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ని కూడా కలుస్తారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు గ్రామాలు కొన్ని ఆ రాష్ట్రంలో కూడా వున్నాయి. వాటికి సంబంధించి రమణ్‌సింగ్‌తో చంద్రబాబు మాట్లాడతారు.

హలో ఉద్ధవ్... అమిత్ షా ఫోను...

  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మిత్రపక్షాలైన భారతీయ జనతాపార్టీ, శివసేన మధ్య సీట్ల సర్దుబాటు కుదరని విషయం తెలిసిందే. బీజేపీకి 119 సీట్లు ఇస్తామని శివసేన ఇచ్చిన ఆఫర్ని స్థానిక బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనీసం 130 సీట్లన్నా బీజేపీకి కేటాయించాలని, లేకపోతే మీ పార్టీతో పొత్తుకో నమస్కారం అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే బీజేపీ, శివసేన పొత్తు కుదురుతుందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. స్థానిక బీజేపీ నాయకులయితే మహారాష్ట్రలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలన్న ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరేకి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలలో రెండు పార్టీలూ సామరస్యపూర్వకంగా కలసి వెళ్తేనే రెండు పార్టీలకూ మేలు జరుగుతుందని, లేకపోతే రెండు పార్టీలే నష్టపోతాయని ఆయనక చెప్పినట్టు సమాచారం.

శశికపూర్‌కి తీవ్ర అస్వస్థత

  అలనాటి బాలీవుడ్ అందాల కథానాయకుడు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఆయనను ఆదివారం సాయంత్రం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వున్నారు. శశికపూర్ ఛాతిలో ఇన్‌ఫెక్షన్ కారణంగా బాధపడుతున్నారు. ఆదివారం ఆయన శ్వాస అందక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఇంటెన్సివ్ కేర్‌లో వున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదని వైద్యులు చెబుతున్నారు. శశికపూర్ 160కి పైగా సినిమాలలో నటించారు. ఆయన మూడుసార్లు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు.

మార్స్ ఆర్బిటర్ (మామ్)కి నేడు కీలక పరీక్ష

  సంవత్సరం క్రితం అంగార గ్రహం మీదకు ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)కు నేడు కీలక పరీక్ష చేపట్టనున్నట్లు షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ట్రయిల్ ఆపరేషన్లో భాగంగా ప్రధాన ఇంజన్కు ఫైర్ చేస్తామని చెప్పారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం మన దేశానికి ఎంతో కీలకమైందని ఆయన అన్నారు. మార్స్ ఆర్బిటర్ని గత ఏడాది నవంబర్ 5న శ్రీహరి కోట నుంచి ప్రయోగించారు. ఇది అంగారకుడిపై ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం. ఇప్పటివరకు అనుకున్నట్లుగానే ప్రయోగం విజయవంతంగా సాగుతోందని, పది నెలలుగా రోదసిలో నిరంతరం మార్స్ వైపు ప్రయాణిస్తున్న మామ్ ఈ నెల 24న.. బుధవారం తెల్లవారుజామున అరుణుడిని చేరుకోనున్నట్టు షార్ డైరెక్టర్ తెలిపారు.

ప్రజా సంఘాల నాయకుల అరెస్ట్

  పలువురు ప్రజా నాయకులు, కవులు, కళాకారులు నిర్వహించ తలపెట్టిన ‘ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక’ సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ (ఎం) పార్టీ ఆవిర్భవించి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల నేతలు, సానుభూతి కార్యకర్తలు రాజధానిలో సభ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. సభలో పాల్గొనడానికి వచ్చిన జార్ఖండ్ రాష్ట్ర ప్రజా గాయకుడు జీత్ మరాండీ, పినాకపాణి, పద్మకుమారి, వరలక్ష్మితోపాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆదివారం హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సభకు అటు పోలీసు శాఖ అనుమతించలేదు. దీంతో వరవరరావు హైకోర్టును ఆశ్రయించగా సభ నిర్వహణకు హైకోర్టు కూడా అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ సభ నిర్వహించి తీరుతామని సభ నిర్వాహకులు, విరసం నేతలు ప్రకటించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి విబి కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా బలగాలు మోహరించారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, సభ నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.