అలిపిరి కేసులో ఈరోజే తుది తీర్పు

  2003 సంవత్సరంలో తిరుపతిలోని అలిపిరిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద మందుపాతరతో దాడి చేసిన కేసుకు సంబంధించి హైకోర్టు విచారణ పూర్తయింది. నిందితులు చంద్రబాబును హత్యచేసే ఉద్దేశంతో శక్తివంతమైన క్లైమోర్ మైన్‌ని పేల్చారు. అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ దాడి నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ఆ సంఘటనలో అప్పటి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా గాయపడ్డారు. ఈ కేసులో 33 మంది నిందితులు ఉండగా, ఇప్పటికి ఐదుగురు ప్రధాన నిందితులుగా వున్నారు. వీరిలో ఇద్దరిని నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది. ముగ్గురిని దోషులుగా ఖరారు చేసింది. దోషులకు శిక్షలను హైకోర్టు ఈరోజే ప్రకటించే అవకాశం వుంది.

కేసీఆర్‌ జూలో పెద్దపులి: రేవంత్ రెడ్డి విమర్శలు

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌ని నిరంతరం విమర్శిస్తూ వుండే తెలంగాణ టీడీపీ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ని పులితో పోల్చారు. సాధారణంగా ఏ మనిషినైనా పులితో పోల్చామంటే అది ఆయన్ని పొగిడినట్టే అర్థం. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ని పులితో పోల్చడం వెనుక ఆంతర్యం ఏమై వుంటుంది? పొగడ్డం మాత్రం కాదు. వివరాల్లోకి వెళ్తే, కేసీఆర్ తన బంధువు మైహోం జూపల్లి రామేశ్వరరావుకు భూములు కేటాయించే విషయంలో ఆయనపై ధ్వజమెత్తుతున్న రేవంత్ రెడ్డి బుధవారం కూడా దీనికి సబంధించి కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ జూలో పులి ముందు పడిన యువకుడి గురించి ప్రస్తావిస్తూ, ‘‘ఢిల్లీ జూలో పులిముందు పడిన యువకుడి లాంటి వ్యక్తి మా తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు. ఆ యువకుడి ఎదురుగా వున్న పులి కేసీఆర్. ఆ పులిమీద రాళ్ళు విసిరి రెచ్చగొట్టేది మైహోమ్ రామేశ్వరరావు’’ అన్నారు. గతంలో ప్రాంతీయవాదంతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ ఇప్పుడు కులవాదంతో ఎర్రబెల్లి దయాకర్ రావుని మభ్యపెడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను దోపిడిదారులైన దొరలను విమర్శిస్తున్నాను తప్పితే, తాను ఏదో ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని విమర్శించడం లేదని రేవంత్ రెడ్డి వివరించారు.

‘మేక్ ఇన్ ఇండియా’ పోర్టల్, లోగో ఆవిష్కరించిన మోడీ

  భారత దేశంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించే విధంగా భారత ప్రభుత్వం రూపొందించిన ‘మేక్ ఇన్ ఇండియా’ పోర్టల్ ప్రారంభోత్సవం గురువారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ఈ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 500 దేశాలకు చెందిన ప్రతినిధులు, పలువురు భారతీయ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. భారత్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల సందేహాలకు మేక్ ఇన్ ఇండియా పోర్టల్ ద్వారా 72 గంటల్లో సమాధానాలు ఇవ్వనుంది. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా నినాదం కాదు తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఇండియాని మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా తయారు చేసేందుకు తాము చిత్తశుద్ధితోఉన్నామని స్పష్టం చేశారు. పరిశ్రమలు ప్రారంభించేందుకు నిబంధనలు సరళతరం చేస్తామన్నారు. కార్మిక చట్టాలకు మరిన్ని సవరణలు తెస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం లండన్

  ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారీగా జీవన వ్యయం వుండే నగరం బ్రిటన్ రాజధాని లండన్ అని తేలింది. గతంలో హాంకాంగ్‌ నగరానికి ఈ గొప్ప హోదా వుండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని లండన్ ఆక్రమించింది. లండన్‌లో జీవన వ్యయాన్ని సిడ్నీతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. రియో డి జనీరోతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ అధిక జీవన వ్యయం వుండే నగరాలలో మన ముంబై జాబితా చివర్లో వుందట. ముంబైలో ఓ ఉద్యోగికి ఏడాదికి ఏడాదికి అయ్యే ఖర్చు 18 లక్షల 13 వేలు కాగా, అదే లండన్‌లో అయితే ఒక ఉద్యోగి ఖర్చును భారతీయ కరెన్సీతో పోల్చితే ఏడాదికి సగటుగా 73 లక్షలుగా వుంటుంది. ఆఫీసులు, గృహాల అద్దెలు, డాలర్‌తో పోల్చితే పౌండ్ విలువ తదితర అంశాలు లండన్‌లో జన జీవన వ్యయం ఎక్కువ కావడానికి కారణమయ్యాయని ఒక అధ్యయనం చెబుతోంది.

ఏపీలో 67 లక్షల బోగస్ తెల్ల రేషన్ కార్డులున్నాయట

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వున్న బోగస్ రేషన్ కార్డులను ఏరివేసే పనిలో ముమ్మరంగా వుంది. రాష్ట్రం మొత్తంలో 67 లక్షల బోగస్ తెల్ల రేషన్ కార్డు వున్నట్టు తెలుసుకుంది. కడు పేదవారి దగ్గర వుండాల్సిన తెల్ల రేషన్ కార్డులు ఆర్థికంగా స్థితిమంతులుగా వున్న లక్షలాది మంది దగ్గర వున్నట్టు తేల్చింది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రికి కూడా వైట్ రేషన్ కార్డే వుంది. ఈసారి విడుదల చేసే రేషన్ ‌బియ్యం కోటాలో ఆ  67 లక్షల బోగస్ కార్డులను తొలగించి అంటే 29 వేల టన్నుల బియ్యాన్ని కోత విధించి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 67 లక్షల బోగస్ రేషన్ కార్డులు వున్నాయా అని ఆశ్చర్యంతో అధికార వర్గాలు నోళ్ళు తెరిచాయి.

అడ్డంగా దొరికిపోయిన చెవిరెడ్డి...

  వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఆర్థికంగా స్థితిమంతుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైసీపీ రాయలసీమలో ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే ఆర్థికంగా ముందుంటారు. అయితే అలాంటి చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డికి పేద ప్రజలకు ఉండాల్సిన తెల్ల రేషన్ కార్డు వుంది. అలాగే సుబ్రహ్మణ్య రెడ్డి ఎంచక్కా నెలనెలా వృద్ధాప్య పెన్షన్ కూడా అందుకుంటున్నారు. కోట్లకు పడగలెత్తిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రికి తెల్ల రేషన్ కార్డు (ఏపీ 102600500742) వుండటం, నెలకు నాలుగు వందల రూపాయల రూపాయల వృద్ధాప్య పెన్షన్ కూడా అందుకుంటూ వుండటం బయటపడింది. ఆంధ్రప్రదేశ్‌లో బోగస్ రేషన్ కార్డులను ఏరివేస్తున్న సందర్భంగా ఈ వివరాలు బయటపడ్డాయి. ఇలాంటి వారు ఎంతోమంది తెల్లకార్డులు పొందారని, వయసు తక్కువ వున్నా, అర్హత లేకపోయినా వృద్ధాప్య పెన్షన్లు కూడా పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే అలాంటి వారిలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తండ్రి కూడా వుండటం వైసీపీ నాయకుల గొంతులో వెలక్కాయలా మారింది.

రాహుల్ దత్తత తీసుకుంటారని ఎవరన్నారు... ప్రియాంక ప్రశ్న

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్ళి జోలికే వెళ్ళకుండా, తన రాజకీయ వారసుడి స్థానం కోసం తన సోదరి ప్రియాంక రాబర్ట్ వాద్రా కుమారుడిని దత్తత తీసుకోబోతున్నారన్న వార్తలు పలు జాతీయ మీడియాలో వచ్చాయి. ప్రియాంక కుమారుడైన రైహాన్‌కి ‘గాంధీ’ని తగిలించి ‘రైహాన్ గాంధీ’గా కాంగ్రెస్ పార్టీ వారసత్వాన్ని అందించే ఉద్దేశం వున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వార్తల మీద ప్రియాంక చాలా సీరియస్ అయ్యారు. ఈ వార్త పూర్తిగా నిరాధారమని ఖండించారు. ఈ వార్తను ప్రసారం చేసిన వార్తా సంస్థలకు ఆమె లీగల్ నోటీసులు పంపించారు. ‘‘ఊహాగానాలతో మీరు (మీడియా) కల్పించిన వార్తలు మా కుటుంబ ప్రతిష్ఠను, నా మాతృత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వున్నాయి. ఇలాంటి అవాస్తవ వార్తలతో రాజకీయ ప్రకంపనాలు సృష్టించిన మీ వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని ప్రియాంక రాబర్ట్ వధేరా తన లీగల్ నోటీసులలో పేర్కొన్నారు.

ముగ్గురి హత్య... హనుమాన్‌జంక్షన్ దగ్గర కారు దొరికింది..

  కృష్ణా జిల్లాలోని అవుటుపల్లి సమీపంలో  జరిగిన కాల్పుల ఘటనలో దుండుగులు ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించారు. హనుమాన్ జంక్షన్ వద్ద ఈ కారు లభించింది. హత్య చేసిన దుండగులు మూడు రోజులుగా హనుమాన్ జంక్షన్‌లోని రాయల్ హంపీ హోటల్‌లో బస చేశారు. ఓ కారుకు బైక్ నెంబరు వేసి దుండగులు ఉపయోగించారు. కాల్పులు జరిగిన తర్వాత హనుమాన్‌జంక్షన్‌లోని హోటల్ వెనకాల కారును వదిలి హంతకులు పరారయ్యారు. పాతకక్షల కారణంగానే హత్యలు జరిగాయని విజయవాడ సీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. మృతులు చిన్న కడిమికి చెందిన గంధం మారయ్య, పగిడి మారయ్య, నాగేశ్వర రావు, గంధం మారయ్య  ఒకే కుటుంబానికి చెందిన వారు. కారు డ్రైవర్ ఏలూరు పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. హత్య జరిగిన స్థలంలో పోలీసులు 5 తుటాలు స్వాధీనం చేసుకున్నారు. 

యువతులకు మిస్డ్ కాల్స్ ఇచ్చారో... అంతే..

  మహిళలకు ఫోన్లు చేస్తూ, మిస్డ్ కాల్స్ ఇస్తూ వేధించే ఆకతాయిలకు బీహార్ పోలీసులు చెక్ పెట్టారు. మహిళలకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడే విషయం అటుంచితే, ఉద్దేశపూర్వకంగా మిస్డ్ కాల్స్ ఇస్తున్నా అరెస్టు చేసి లోపలవేసి తాట తీయడానికి  బీహార్ పోలీసులు రంగం సంద్ధిం చేశారు. ఇకపై మహిళలకు ఉద్దేశపూర్వకంగా మిస్ట్ కాల్స్ చేస్తే జైలు కటకటాల ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని బీహార్ రాష్ట్ర సీఐడీ ఇన్స్పెక్టర్ జనరల్ అరవింద్ పాండే హెచ్చరించారు. ఈ మేరకు నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని బీహార్‌లోని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు కూడా జారీ చేసేశారు. పదే పదే మిస్డ్ కాల్స్ చేయడం వల్ల యువతులు అభద్రతా భావానికి గురికావడంతోపాటు మనశ్శాంతిని కూడా కోల్పోతూ వుంటారని అన్నారు. ఆ సమస్యను నివారించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పాండే చెప్పారు. ఇలా మహిళలకు మిస్డ్ కాల్స్ చేసేవారిమీద 354 డి 1, 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

ప్రత్యేక హోదాపై కేంద్రం హామీ: కంభంపాటి

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీలైనంత త్వరగా ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ స్పష్టమైన హామీ ఇచ్చారని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు తెలిపారు. బుధవారం నాడు ఆయన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో కలసి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లులో పొందుపరచిన అంశాలను ఈ సందర్భంగా కంభంపాటి రామ్మోహన్‌రావు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. పరిశ్రమలకు రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీల మీద చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు మిగతా అన్ని విషయాల మీద సంబంధిత శాఖ కార్యదర్శులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన హామీ ఇచ్చారని కంభంపాటి రామ్మోహన్‌రావు తెలిపారు.

వైసీపీ వేధింపులు.. స్పీకర్‌కి ఎంపీ గీత ఫిర్యాదు..

  వైసీపీలో తన పట్ల జరుగుతున్న వేధింపులపై పార్లమెంట్ స్పీకర్‌కి ఫిర్యాదు చేశానని ఎంపీ కొత్తపల్లి గీత వెల్లడించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘పార్టీలో నాకు జరుగుతున్న అన్యాయంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఒక వైసీపీ ఎమ్మెల్యే నేను ఎస్టీని కాదని ప్రచారం చేస్తున్నారు. అది ఆ ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయమా లేక పార్టీ అభిప్రాయమా అనేది వైసీపీ స్పష్టం చేయాలి. నేను ఎస్టీ కాకుండానే వైసీపీ తనకు బీఫామ్ ఇచ్చిందా? దళితురాలైన మహిళా ఎంపీ అయిన నన్ను వైసీపీలో చులకనభావంతో చూస్తున్నారు. నేను ప్రజాసేవకోసమే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప జనం సొమ్ము కాజేయడానికి కాదు. నేను ఎవరి ఆస్తులూ కాజేయలేదు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం లేక వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. మహిళా ఎంపీ అయిన నా మీద సామాజిక వైబ్‌సైట్లలో కొంతమంది అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా పార్టీ ఎంతమాత్రం పట్టించుకోలేదు’’ అని కొత్తపల్లి గీత అన్నారు.

తెలంగాణ దూరదర్శన్: డిడి యాదగిరి

  ఇంతకాలం దూరదర్శన్‌ ఆంధ్రప్రదేశ్ ఛానల్ పేరు ‘డిడి సప్తగిరి’ అని వున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం దూరదర్శన్ ‌ కూడా రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక ఛానెళ్ళను ప్రసారం చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రసారమయ్యే దూరదర్శన్ ఛానల్‌కి ఏ పేరు పెట్టాలన్న అంశం మీద కొంత చర్చించింది. డిడి మంజీరా అని, డిడి యాదగిరి అని ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో ‘డిడి యాదగిరి’ అనే పేరునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 27 నుంచి తెలంగాణలో ‘డిడి యాదగిరి’ ప్రసారాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే వున్న ‘డిడి సప్తగిరి’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఛానల్‌గా యథాతథంగా కొనసాగుతుంది.

214 బొగ్గు గనుల అనుమతి రద్దు.. సుప్రీం కోర్టు

  యుపిఎ హయాంలో అనుమతులు ఇచ్చిన 214 బొగ్గు క్షేత్రాల అనుమతులను సుప్రీంకోర్టు బుధవారం నాడు రద్దు చేసింది. బొగ్గు క్షేత్రాల అనుమతుల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని సుప్రీంకోర్టు గతంలో ఎన్నోసార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా 214 బొగ్గు క్షేత్రాల అనుమతులను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా, ఎన్నో అవకతవకలతో బొగ్గు క్షేత్రాలను కేటాయించినందువల్లే రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. బుధవారం నాడు సుప్రీంకోర్టు 218 బొగ్గు క్షేత్రాల అనుమతులను రద్దు చేసే అవకాశం వుందని అందరూ ఊహించారు. అయితే సుప్రీం కోర్టు 214 గనుల మీదే కొరడా ఝళిపించింది.

ఐపీఎస్ ఆఫీసర్ మీద గర్ల్‌ఫ్రెండ్ కంప్లయింట్

  తమిళనాడుకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ మీద ఆయన గర్ల్ ఫ్రెండ్ పోలీసు అధికారులకు, కోర్టుకు ఫిర్యాదు చేసింది. తిరుచ్చికి చెందిన ఐపీఎస్ అధికారి వరుణ్‌కుమార్ చెన్నైకి చెందిన రిటైర్డ్ పోలీస్ కమిషనర్ కుమార్తెని ప్రేమించాడు. అయితే కొంతకాలం తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. తనను పెళ్ళి చేసుకోవాలంటే భారీ స్థాయిలో కట్న కానుకలు వరుణ్ కుమార్ కోరాడని ఆమె చెన్నై పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి, చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని కోరుతూ ఆమె తమిళనాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పరిశీలించిన హైకోర్టు దీనిపై పరిశీలనకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు వరుణ్‌కుమార్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. వరుణ్ కుమార్ ప్రస్తుతం బెయిల్ మీద విడుదలయ్యాడు.

పార్లమెంట్‌ క్యాంటిన్‌లో టేస్టీ హైదరాబాద్ బిర్యానీ

  పార్లమెంట్‌లో ఇక నుంచి రుచికరమైన ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యాని లభించబోతోంది. సమావేశాలు జరిగే సమయంలో పార్లమెంటు సభ్యులు ఎంచక్కా హైదరాబాద్ బిర్యానీ తినొచ్చు. హైదరాబాద్ బిర్యానీని పార్లమెంటు క్యాంటీన్ మెనులో చేర్చాలని పార్లమెంటరీ ఫుడ్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేందర్ రెడ్డి నిర్ణయించారు. పార్లమెంటులో హైదరాబాదీ బిర్యానీతో పాటు మిర్చి కా సాలన్, షాయి తుకడా, ఖుబానీ కా మీఠా వంటి కొత్త వంటకాలను ప్రవేశపెడతామని తెలిపారు. పార్లమెంటులోని వంట వారికి హైదరాబాదులోని నిజాం క్లబ్‌లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించనున్నట్లు ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు.