జయమ్మ అక్రమ ఆస్తుల కేసులో నేడే తీర్పు.. ఓడితే రాజీనామానే..

  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలితకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బెంగళూరు కోర్టు శనివారం తీర్పు ఇవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జయలలిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనితో ఈరోజు బెంగుళూరు కోర్టు ఈ కేసు మీద తీర్పు ఇవ్వబోతోంది. జయలలిత తీర్పును వాయిదా వేయాలని పిటిషన్ వేశారంటే, తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జయలలితకు తన ఆదాయాన్ని మించి 66 కోట్ల రూపాయల ఆస్తులు వున్నాయంటూ దాఖలైన పిటిషన్ మీద సుదీర్ఘకాలం పాటు విచారణ జరిగింది. ఈ కేసు తీర్పు వస్తున్న సందర్భంగా లక్షల మంది పోలీసులతో తమిళనాడు రాష్ట్రంలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. జయలలితకు వ్యతిరేకంగా కనుక కోర్టు తీర్పు వచ్చిందంటే తమిళనాడు రాజకీయాల్లో అది భారీ కుదుపు అవుతుందని, తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోతాయని పరిశీలకులు అంటున్నారు. జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా కూడా చేసే అవకాశం వుందంటున్నారు.

పొన్నాలకు అస్సలు సిగ్గులేదు: పాల్వాయి

  తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సిగ్గులేదని, అందుకే మెదక్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినా పదవిని పట్టుకుని వేలాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. పొన్నాల లాంటి అసమర్థుడికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను అప్పగిస్తే పార్టీ ఎలా మనగలుగుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు యువతరానికి అప్పగించాలని ఆయన అన్నారు. పొన్నాల అసమర్థత వల్లే ఇంకా పార్టీ సభ్యత్వ నమోదు ఇంకా ప్రారంభం కాలేదని, ఒకపక్క కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా వలసలు జరుగుతూ వుంటే, మరోవైపు పార్టీలో వున్నవారిని సస్సెండ్ చేస్తున్నారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పొన్నాల పదవి ఊడిపోయే అవకాశం వుందని పాల్వాయి జోస్యం చెప్పారు.

గాంధీ జయంతి సెలవు లేదు.. స్వచ్ఛ భారత్...

  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌ పథకాన్ని గాంధీ జయంతి రోజు నుంచి అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఎక్కడికక్కడ పేరుకున్న చెత్తని, మురికిని తొలగించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆరోజు సెలవును రద్దు చేసింది. ఆరోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వుండదు. ఆరోజు దేశవ్యాప్తంగా వున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఆరోజున ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా చీపురు పట్టుకుని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇండియా గేట్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

అలిపిరి వద్ద సీఎం చంద్రబాబు కాన్వాయ్‌కి చిన్న ప్రమాదం..

  పదకొండు సంవత్సరాల క్రితం... అంటే 2003 సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీన తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న చంద్రబాబు మీద మందు పాతర దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ కేసు నిందితులకు గురువారమే శిక్ష పడింది. ఇదిలా వుంటే, ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో పాల్గొనడానికి వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లో వున్న ఇంటెలిజెన్స్ ఐజీ కారును తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి వాహనం ఢీకొంది. దీంతో వాహనం వెనుక భాగం కొంత దెబ్బతింది. ఇదిలా వుంటే తిరుపతి, తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య చంద్రబాబు క్షేమంగా పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. అయితే, పోలీసులు భద్రత పేరుతో చంద్రబాబును కలిసేందుకు కార్యకర్తలకు అనుమతి ఇవ్వలేదు. దాంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు జోక్యం చేసుకుని పోలీసులకు, కార్యకర్తలకు సర్దిచెప్పారు.

గోపీచంద్ లౌక్యం మూవీ రివ్యూ..

  తారాగణం: గోపీచంద్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, పోసాని కృష్ణమురళి, చంద్రమోహన్‌, బ్రహ్మానందం, ముఖేష్‌ రుషి, రఘుబాబు.   సాంకేతిక నిపుణులు: కెమెరా: వెట్రి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: కోన వెంకట్‌, గోపీమోహన్‌, స్క్రీన్‌ప్లే, కోన వెంకట్‌, కథ: శ్రీధర్‌ సిపాన, దర్శకత్వం: శ్రీవాస్‌, నిర్మాత: ఆనంద్‌ ప్రసాద్.   వరంగల్‌లో బాబ్జీ అనే రౌడీ చెల్లెలి పెండ్లికి సిద్ధమవుతుండగా తీసుకెళ్తాడు వెంకటేశ్వర్లు (గోపీచంద్‌). ఆమెని తాను ప్రేమించిన వ్యక్తి చేతిలో పెడతాడు. దాంతో బాబ్జీ తన చెల్లెలి మీద ప్రేమతో తీసుకువెళ్ళిన వాడిపై కసితో ఊరంతా అనుచరులతో వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ సెల్ఫీ (బ్రహ్మానందం) కారులోనే ట్రావెల్‌ చేస్తూ తిరుగుతుంటారు. ఈలోగా బాబ్జీ మరో చెల్లెలు చంద్రకళ (రకుల్‌ ప్రీత్‌సింగ్‌) తొలిచూపులోనే ప్రేమలో పడతాడు వెంకటేశ్వర్లు. బాబ్జీ ప్రత్యర్థులు ముఖేష్‌రుసి ఓరోజు చంద్రకళపై ఎటాక్‌ చేస్తారు. ఇది తెలిసిన బాబ్జీ తన ఇంటికి తీసుకువచ్చి.. తననుక్ను భరత్‌కు ఇచ్చి పెండ్లి చేయాలనుకుంటాడు. మరి హీరో ఊరుకుంటాడా? అందరినీ బురిడీ కొట్టించి తన తెలివితేటలతో(లౌక్యం) ఎలా సాల్వ్‌ చేశాడు? అన్నది తర్వాతి కథ.   సినిమా మొదటి నుంచి చివరి వరకు హాస్యంతో వున్న ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గోపీచంద్ సరికొత్త నటనను ప్రదర్శించాడు.

గుర్తింపు పొందని పవన్ కళ్యాణ్ జనసేన...

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన జనసేనను రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నికల కమిషన్ తాజాగా విడుదల చేసిన జాబితాలో జనసేన పార్టీ పేరు కనిపించలేదు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైసీపీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రంలో అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని ఎంఐఎం గుర్తింపు పార్టీగా అవతరించింది.బీహార్‌లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా, కేరళలో రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీలుగా పొందాయి. మరి తన పార్టీకి గుర్తింపు రాకపోవడం పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

సచిన్ తమాషా ట్విట్

  ఏమో అనుకున్నాంగానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లో కూడా మంచి చతురత వుంది. సచిన్‌లోని ఈ చతురత బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ముంబయి క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన అమోల్ మజుందార్ రిటైర్మెంట్ సందర్భంగా బయటపడింది. సాధారణంగా క్రికెట్లో ఎవరైనా రిటైర్ అయితే వారికి అభినందనలు చెప్పడం, తమరు క్రికెట్‌కి బోలెడంత సేవ చేశారు అనడం మామూలే. అయితే సచిన్ మాత్రం అలాంటి అభినందనలు కాకుండా ‘స్వాగతం’ అని ట్విట్టర్లో తమాషా ట్విట్ చేశాడు. మామూలుగా శుభాకాంక్షలు చెబుతూనే, అమోల్ మజుందార్ క్రికెట్‌కి చేసిన సేవలను గుర్తుచేస్తూనే మా మా రిటైర్డ్ బ్యాచ్‌లోకి నీక్కూడా స్వాగతం అని ట్విట్ చేశాడు. ఇప్పుడు సచిన్ చేసిన ఈ తమాషా ట్విట్ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిగ్గా మారింది.

ప్రధాని నరేంద్ర మోడీకి సమన్లు... 2002 గోధ్రా కేసు

  గుజరాత్ అల్లర్ల కేసులో భారత ప్రధాని నరేంద్రమోడీకి న్యూయార్క్ ఫెడరల్ కోర్టు సమన్లు జారీ చేసింది. అమెరికాలకు చెందిన పౌర హక్కుల సంస్థ, ఇద్దరు గుజరాత్ అల్లర్ల బాధితుల ఫిర్యాదు మీద స్పందించిన ఫెడరల్ కోర్టు నరేంద్ర మోడీకి సమన్లు జారీ చేసింది. అమెరికా కోర్టు మోడీకి సమన్లు పంపడాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలోనే వున్నారు. ఇలాంటి సమయంలోనే అమెరికా కోర్టు మోడీకి సమన్లు జారీ చేయడం చర్చనీయాంశం అయింది. గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అమెరికా వెళ్ళిన సమయంలోనే అక్కడి కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది.

హత్య చేసి గొంతు కోసుకున్నాడు

  గుంటూరు జిల్లా మాచర్లలో శుక్రవారం ఉదయం బాబు అనే వ్యక్తి సుధాకర్ అనే మరో వ్యక్తిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. హత్య చేసిన తర్వాత భయపడిపోయి అదే కత్తితో తన గొంతు కూడా కోసుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాచర్లలోని నెహ్రూ నగర్‌లో నివాసం వుండే సుధాకర్, బాబుల మధ్య ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి. సుధాకర్ బాబుకు డబ్బు ఇవ్వాల్సి వుంది. ఈ విషయంలో వీరిద్దరూ కొంతకాలంగా గొడవ పడుతున్నాడు. శుక్రవారం ఉదయం సుధాకర్ ఇంటికి వచ్చిన బాబు కత్తితో బాగు గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత తన గొంతు కూడా కోసుకున్నాడు. స్థానికులు బాబును స్థానికంగా ప్రథమ చికిత్స చేసి, మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తమిళనాడులో ‘అమ్మ సిమెంట్’

  పథకాల మీద పథకాలు ప్రకటిస్తూ, వాటిని సమర్థంగా అమలు చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం పేరు ‘అమ్మ సిమెంట్’. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు బస్తా సిమెంట్ కేవలం 190 రూపాయలకు మాత్రమే అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలు ఇల్లు కట్టుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జయలలిత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకం ప్రకటించడం ద్వారా తమిళనాడులో సిమెంట్‌కి డిమాండ్ తగ్గి ధరలు దిగివచ్చే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అమ్మ క్యాంటిన్లు, అమ్మ మెడికల్స్, అమ్మ వాటర్, అమ్మ కూరగాయలు తదితర పథకాలు అమలులో వున్నాయి.

తెలుగమ్మాయికి గూగుల్ ఉపకారవేతనం

  ఆసియా పసిఫిక్ దేశాల్లోని విద్యార్థులకు గూగుల్ సంస్థ ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘గూగుల్ అనిత బోర్గ్ స్మారక ఉపకార వేతనం’ మద్రాసు ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న స్పందన రాజ్ బబ్బుల ఎంపికయ్యారు. మొత్తం ఎనిమిది దేశాల నుంచి 27 మంది విద్యార్థులు ఈ ఉపకార వేతనానికి ఎంపికైతే అందులో ఏడుగురు భారతీయులు ఉన్నారు. దీనికి ఎంపికైన తెలుగమ్మాయి స్పందన రాజ్‌ది వరంగల్. ఈ ఉపకార వేతనం కింద ఎంపికైన విద్యార్థులను గూగుల్ సంస్థ ఒక వారం పాటు టోక్యోలోని గూగుల్ కార్యాలయానికి తీసుకెళ్ళి, అక్కడ గుగూల్ అధికారులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో మాట్లాడే అవకాశం కల్పిస్తుంది. గూగుల్ ఉపకార వేతనంతోపాటు స్పందన రాజ్ ఫేస్ బుక్ అందించే 2014 గ్రేస్ హాప్పర్ ఉపకార వేతనానికి కూడా ఎంపిక కావడం విశేషం. ఈ ఉపకార వేతనం కింద వచ్చే నెల ఫినిక్స్‌లో జరిగే ఫేస్‌బుక్ సదస్సులో ఆమె పాల్గొంటారు. ఈ సదస్సులోనే మైక్రోసాఫ్ట్ సీఇఓ సత్య నాదెళ్ళ కూడా పాల్గొంటారు.

విజయవాడలో రాజధాని ఎందుకంట?

  టీఆర్ఎస్ నాయకులు తమకు సంబంధించని విషయాలలో కూడా ఎంటరైపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేశారన్న విషయంలో వారికి ఎంతమాత్రం సంబంధం లేదు. అయినప్పటికీ విజయవాడలో రాజధాని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీ సుమన్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించడం మీద ప్రశ్నలు సంధించారు. శివరామకృష్ణ కమిటీ వద్దన్నా కూడా ఆంధ్రప్రదేశ్‌కి ఎందుకు విజయవాడని రాజధానిగా చేశారని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నారు. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ నాయకులు తమ హద్దులు దాటడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఇస్తే సమస్యలు వస్తాయని చెప్పిది... అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం రాలేదా అని అడుగుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వ్యవహారాల మీద నోరు చేసుకోకుండా వుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు.

మూడు హత్యల కేసు... సీసీ కెమెరాలతో నిందితుల గుర్తింపు

  కృష్ణాజిల్లా పెద్ద అవుటపల్లి దగ్గర జరిగిన మూడు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్య కేసుకు ప్రణాళిక వేశారని భావిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు ప్రణాళిక వేసిన వారిలో భూతం శ్రీనివాసరావు, పురాణం గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు వున్నట్టు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా గుర్తించారు. హనుమాన్ జంక్షన్‌లో హంతకులు బసచేసిన లాడ్జ్‌లో దొరికిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా ఫుటేజ్ ద్వారా వీరిద్దరినీ గుర్తించారు. హత్యకు గురైన వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ ఇద్దరినీ గుర్తించారు. ప్రస్తుతం వీరి కోసం వెతుకుతున్నారు. వీరితోపాటు వున్న వ్యక్తులు, హత్య చేసిన వ్యక్తులు ముంబైకి చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు.

డైరెక్టర్ లారెన్స్... చీటింగ్ కేసు

  ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ మీద, ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాజ్‌కుమార్ మీద గురువారం నాడు జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ప్రభాస్, తమన్నా నటించిన రెబల్ సినిమాకు లారెన్స్ దర్శకుడు. ఆ సినిమా నిర్మాతలకు, లారెన్స్‌కి సినిమా ప్రారంభానికి ముందే ఒప్పందం కుదిరింది. 23 కోట్ల రూపాయలతో సినిమాను పూర్తి చేస్తానని, ఒకవేళ అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే తానే భరిస్తానని లారెన్స్ ఒప్పుకున్నాడు. దీనికి సంబంధించి నిర్మాతలు పుల్లారావు, భగవాన్‌తో ఒప్పందం కుదిరింది. అయితే లారెన్స్ అనుకున్న దానికంటే ఐదు కోట్లు ఎక్కువ ఖర్చు చేశారు. దాంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 5 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్మాతలు ఇద్దరూ లారెన్స్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే ఒక్కపైసా కూడా ఇవ్వనని లారెన్స్ మొండికేశారు. దాంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు లారెన్స్ మీద, అతని కార్యదర్శి మీద 420 కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం జూబిలీహిల్స్ పోలీసులు వీళ్ళిద్దరి కోసం గాలిస్తున్నారు.

కన్నవారిని యాసిడ్ తాగమన్న కొడుకు

  దేశం ఆల్రెడీ నాశనమైపోయింది. ఇంకా నాశనమైపోతోంది. ఆస్తికోసం అనుబంధాలనే మరచిపోతున్న మనుషులు తయారవుతున్నారు. అలాంటి ఒక వ్యక్తి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రుల్నే ఓ కొడుకు వేధించాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు నిజంగానే యాసిడ్ తాగేశారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్‌లో జరిగింది. దేవానంద్ అనే వ్యక్తి కొంతకాలంగా తల్లిదండ్రులని ఆస్తి ఇవ్వాలంటూ తీవ్రంగా వేధిస్తున్నాడు. ఆ వేధింపులలో భాగంగా తల్లిదండ్రులను యాసిడ్ తాగాలని బలవంతపెట్టాడు. అతని పోరు పడలేక అతని తల్లిదండ్రులు ఇద్దరూ యాసిడ్ తాగారు. ఈ సంఘటనలో తల్లి మరణించగా, తండ్రి గాంధీ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. ఇంత ఘనకార్యం చేసిన పుత్రరత్నం పరారీలో వున్నాడు.

ఆళ్ళగడ్డకు ఉప ఎన్నిక.. లైన్ క్లియరైంది..

  కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక ఫలితం తదుపరి తీర్పుకు లోబడి వుంటుందని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఆళ్లగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని వైసీపీ శాసన సభ్యుడు, మరణించిన శోభా నాగిరెడ్డి భర్త భూమా నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు గురువారం ఆదేశాలను జారీ చేసింది. గత సాధారణ ఎన్నికలు జరగడానికి ముందే ప్రమాదంలో ఆళ్ళగడ్డ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణించినప్పటికీ ఎన్నిక నిర్వహణ వాయిదా వేయకుండా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. ఆ ఎన్నికలలో శోభానాగిరెడ్డి గెలిచినప్పటికీ, ఆమె జీవించి లేకపోవడంతో మళ్ళీ ఎన్నిక జరపాల్సి వస్తోంది.

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉత్తర్వులు

  తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలో ఆరోగ్య, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నిర్ణయించారు. ఈ విశ్వవిద్యాలయానికి ‘కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’గా పేరు పెట్టారు. ఈ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీ-ఫార్మసీ, బీవీఎస్సీ, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలు, ఇతరత్రా వైద్య విద్యకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం కుదురుతుంది. తెలంగాణలోని వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు సదుపాయాలన్నీ ఇక్కడే సమకూరుతాయి.

ఫేస్‌బుక్‌లో అసభ్య మెసేజ్‌లు.. గోవా యువతి అరెస్టు..

  సాధారణంగా ఫేస్‌బుక్‌లో అసభ్య మెసేజ్‌లు పెట్టడం లాంటి పనులు అబ్బాయిలు చేస్తూ వుంటారు. అయితే ఇలాంటి పనులు ఓ అమ్మాయి చేసింది. గోవా రాష్ట్రంలోని పనాజీ సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామానికి చెందిన ఆమె తన స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేసింది. ఆ అకౌంట్లలో వాళ్ళ పేర్లతో రోజూ అసభ్య మెసేజ్‌లు పోస్టు చేయడమే పనిగా పెట్టుకుంది. తన ఎనిమిది మంది స్నేహితుల పేర్లతో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసిన ఆ యువతి, ఆ అకౌంట్ల ద్వారా తాను దొరికిపోకుండా కూడా సాంకేతికంగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంది. అయితే బాధితుల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్లు నిర్వహిస్తున్నదెవరో కనిపెట్టి 22 సంవత్సరాల ఆ యువతిని అరెస్టు చేశారు. ఆమె ఎందుకిలా చేసిందన్న విషయాన్ని పోలీసులు ఆ యువతి నుంచి తెలుసుకునే ప్రయత్నంలో వున్నారు.