బాహుబలి సెట్‌లో అగ్ని ప్రమాదం...

  ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్రం షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. శనివారం సాయంత్రం ఫైట్ సన్నివేశాల షూటింగ్ చేస్తూ వుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించి నలుగురు ఫైటర్లకు మంటలు అంటుకున్నాయి. భారీ మొత్తంలో కుంకుమ వెదజల్లేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగించారు. దీంతో మంటలు  భారీగా ఎగసిపడ్డాయి. ఆ మంటలు షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చి పక్కనే నిలుచుని వున్న నలుగురు ఫైటర్లకు అతి సమీపంగా ఎగసిపడ్డాయి. దీంతో నలుగురు ఫైటర్లు సతీష్, పాండు, గణేష్, సంతోష్‌లకు కాలిన గాయాలయ్యాయి.

ప్రేమ పేరుతో వేధింపులు.. నిర్భయ కేసు నమోదు

  జగిత్యాలలో రవి అనే డిగ్రీ విద్యార్థి సిమ్రాన్ బేగం అనే యువతిని ప్రేమపేరుతో వేధిస్తూ వుండటంతో ఆ యువతి ఈ వేధింపులు తట్టుకోలేక ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సిమ్రాన్ బేగం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రవి మీద నిర్భయ కేసు నమోదు చేశారు. రవి చాలాకాలంగా సిమ్రాన్‌ని ప్రేమ, పెళ్ళి పేరుతో వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక సిమ్రాన్ కాలేజీకి వెళ్ళడం కూడా మానేసింది. దాంతో రవి సిమ్రాన్ ఇంటి పక్కనే వుండే తన స్నేహితుడితోపాటు మరో ఇద్దరు యువతులను ఆమె దగ్గరకి ప్రేమ రాయబారానికి పంపించాడు. దానిని సిమ్రాన్ ఇంట్లోని పెద్దలు గమనించడంతో పెద్ద గొడవ జరిగింది. ఈ అవమానం తట్టుకోలేక సిమ్రాన్ ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.

భవ్యశ్రీ మిస్సింత్ కేసు.. శభాష్ పోలీసు...

  తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకినీ పోలీసులు కనుగొన్నారు. ఆమెను తన కుటుంబ సభ్యలకు అప్పగించారు. ఈ కేసు విషయంలో పోలీసులు చాలా చురుగ్గా వ్యవహరించారని అభినందనలు అందుకుంటున్నారు. భవ్యశ్రీ మిస్సయినట్టు ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. భవ్యశ్రీ సెల్ ఫోన్ సిగ్నల్స్‌ని ట్రాక్ చేసిన పోలీసులు ఆమె మొదట తూర్పు గోదావరి జిల్లాలో వున్నట్టు తెలుసుకుని అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత భవ్యశ్రీ వైజాగ్‌ పరిసరాల్లో వున్నట్టు తెలుసుకుని అక్కడ అన్వేషణ జరిపారు. ఒక గెస్ట్ హౌస్‌లో వున్న భవ్యశ్రీ పోలీసులు రావడం గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద పోలీసులు భవ్యశ్రీని వైజాగ్‌లోనే అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌‌కి తీసుకొచ్చారు. ఆమెను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. భవ్యశ్రీ ఇలా వెళ్ళిపోవడానికి కారణాలను పోలీసులు ఇంతవరకు వెల్లడించనప్పటికీ ఈ కేసు విషయంలో పోలీసులు చేసిన నిర్విరామ కృషిని అందరూ అభినందిస్తున్నారు.

మా అమ్మ ఎలా చనిపోయిందో తేల్చాలి

  కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మరణం విష ప్రయోగం కారణంగానే జరిగిందని ఎయిమ్స్ వైద్యుల బృందం రిపోర్టు ఇవ్వడంతో తన తల్లి మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె కుమారుడు శివ్ పుష్కర్ మీనన్ ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. అలాగే, తన తల్లి మరణంపై వెల్లువెత్తుతున్న వివిధ రకాల ఊహాగానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. దుబాయిలో నివశిస్తున్న శివ్ ఢిల్లీ పోలీసులకు ఈ విషయమై ఓ లేఖ రాశాడు. తన తల్లి సునంద పుష్కర్ మరణం వెనుక దాగి ఉన్న వాస్తవాలను వీలైనంత త్వరలో వెల్లడి చేయాలని, ఈ దర్యాప్తులోఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా వ్యవహరించాలని కోరాడు. ఇప్పటికే తల్లి మరణంతో తీవ్ర విచారంలో కూరుకుపోయిన తమను, తల్లి మరణంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఊహాగానాలు మరింత కుంగదీస్తున్నాయని శివ్ పుష్కర్ తన లేఖలో పేర్కొన్నాడు.

కూలిన హోర్డింగ్.. యువకుడి మృతి

  హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తా వద్ద బైక్పై వెళ్తున్న పృధ్వీసేనా రెడ్డి అనే యువకుడి మీద భారీ హోర్డింగ్ కుప్పకూలడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి దగ్గర దొరికిన ఐడీ కార్డు ఆధారంగా అతడు నానక్రామ్గూడలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నాడని తెలిసింది. మృతుడు కూకట్పల్లి నివాసి. అతడి బంధువులకు సమాచారం అందజేశారు. హోర్డింగ్ ఏర్పాటులో లోపం కారణంగానే కూలిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదు చేశారు. ఈ హోర్డింగ్ మొన్నీమధ్య జరిగిన మెట్రో పొలిస్ సదస్సు కోసం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష

  హుదూద్ తుఫాను పరిస్థితిని సమీక్షించేందుకు సచివాలయంలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 44 మండలాలలో 320 గ్రామాలు తుఫాను ప్రభావానికి గురయ్యే ప్రమాదం వుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. తుఫాను తీరాన్ని దాటిన అనంతరం చంద్రబాబు పరిస్థితిని మరోసారి సమీక్షించారు. ప్రజలను సాయంత్రం వరకు ఇళ్ళ నుంచి బయటకి రావొద్దని సూచించారు. ఆదివారం సాయంత్రం తాను విశాఖపట్నం వెళ్తానని, అవసరమైతే రెండు మూడు రోజులు అక్కడే వుంటానని చంద్రబాబు తెలిపారు.

హుదూద్ తుఫాను భారీ విధ్వంసం

  హుదూద్ తుఫాను ఉత్తరాంధ్రని అతలాకుతలం చేసింది. తుఫాను ఆదివారం ఉదయం పదిన్నర ప్రాంతంలో విశాఖ కైలాసగిరి వద్ద తీరాన్ని తాకింది. అనంతరం మధ్యాహ్నం విశాఖ సమీపంలోని పూడిమడక వద్ద తీరాన్ని దాటింది. దీంతో తీరం వెంబడి గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ తుఫాను అల్పపీడనంగా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాను ప్రభావం కారణంగా విశాఖ జిల్లాలో ఎనిమిది మంది మరణించినట్టు సమాచారం అందుతోంది. తుఫాను విశాఖ పట్టణంలో విధ్వంసం సృష్టించింది. అనేకచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్, రవాణా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజలు ఇళ్ళలోంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్టణంలో వందలాది కార్లు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్ళలోకి భారీగా నీరు వచ్చింది. విశాఖ రాడార్ కేంద్రంలోకి కూడా నీరు వచ్చింది. ఎయిర్ పోర్టు కప్పు ఎగిరిపోయింది.

కేటీఆర్‌కి శ్రీదేవి, సమంతతో ఫొటోలు దిగడానికి తీరిక వుందా?

  తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కి కరెంట్ కోతతో విలవిలలాడుతున్న రైతులను, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించే తీరిక లేదుగానీ, ‘శ్రీదేవి, సమంతలతో ఫోటోలు దిగడానికి తీరిక వుందా అని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేపట్టిన బస్సుయాత్ర శనివారం వరంగల్ జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖను ఎవ్వరికీ అప్పగించలేదు. కనీసం కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి సమీక్ష పెడితే, తెలంగాణతరఫున హాజరయ్యేందుకు ఏ ఒక్క మంత్రికీ అదనపు బాధ్యతలు అప్పగించలేదు. సమంత, శ్రీదేవిలతో క్యాట్‌వాక్ చేయడం మాని, ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ తీసుకురావాలని కేటీఆర్‌ను డిమాండ్ చేస్తున్నా’’ అన్నారు.

ట్విట్టర్ ఉద్యోగులకు బెదిరింపులు

  ట్విట్టర్లో వున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఖాతాలు తొలగించినందుకు తమ ఉద్యోగులను చంపుతామని ఐఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని ట్విట్టర్ సి.ఇ.ఓ. డిక్ కోస్టలో వెల్లడించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ, ‘‘ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఖాతాలను మేం తొలగించడం ప్రారంభించగానే ట్విట్టర్ ఉద్యోగులకు బెదిరింపు కాల్స్ రావడం ప్రారంభమైంది’’ అని చెప్పారు. ఉగ్రవాదులు తమ సందేశాలను పంపుకోవడానికి ట్విట్టర్ని ఉపయోగిస్తూ వుండటంతో, ఇది తమ నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి వారి ఖాతాలను తొలగించామని ఆయన తెలిపారు.

అప్పులకుప్ప ఐక్యరాజ్యసమితి

  మనం ఐక్యరాజ్య సమితి గురించి గొప్పగా చెప్పుకుంటాం గానీ, ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి వుంది. నెత్తిన బోలెడంత అప్పు వున్న మన ఇండియాకే ఐక్యరాజ్య సమితి 671 కోట్ల రూపాయల అప్పు వుందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినేవాడు అంటారే.. అలా వుంది ఐక్యరాజ్య సమితి పరిస్థితి. ఐక్యరాజ్య సమితి తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘మేం నిర్వహించే శాంతి పరిరక్షక కార్యక్రమాల్లో ఇండియా చాలా చురుగ్గా పాల్గొంటోంది. మా సూచన మేరకు వివిధ దేశాలకు శాంతి పరిరక్షక దళాలను పంపి, అనేక ఇతర సహాయాలు చేసినందుకు ఐక్యరాజ్య సమితి ఇండియాకి 671 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వుంది. రెండు రోజుల్లో ఈ డబ్బును చెల్లించాలని అనుకుంటున్నాం’’ అనేది ఈ ప్రకటన సారాంశం. పోనీలెండి.. అప్పు తీసుకున్నా తిరిగి ఇచ్చే ఉద్దేశం వున్నందుకు ఐక్యరాజ్యసమితిని అభినందించాల్సిందే. అన్నట్టు ఐక్యరాజ్య సమితి కేవలం ఇండియాకి మాత్రమే కాదు.. ఇథియోపియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లాంటి దరిద్రపు గొట్టు దేశాలకు కూడా బాకీ ఉంది.

జగన్ ఇంటి ముందు రైతుల ఆందోళన

  వైసీపీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి లోటస్ పాండ్ ఇంటిముందు రైతులు భారీ సంఖ్యలో చేరి ఆందోళన చేస్తున్నారు. వీరంతా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన రైతులు. జగన్‌కి చెందిన ఇండస్ట్రీస్‌కి గురజాల నియోజవర్గంలో గతంలో ప్రభుత్వం కేటాయించిన దాదాపు 613 ఎకరాల భూములను వినియోగంలోకి తేనందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీజును రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతకు నాలుగు రోజుల ముందు ఈ భూములు వినియోగంలోకి రాకపోవడంతో భూముల మొదటి సొంతదారులైన రైతులు ఈ పొలాల్లో పండించిన పంటలను సరస్వతి ఇండస్ట్రీస్‌కి చెందిన వారు ట్రాక్టర్లతో దున్నే ప్రయత్నం చేశారు. అప్పుడు రైతులు అడ్డుకోవడంతో వారిని గాయపరిచారు. ఆ సంఘటనలో గాయపడిన రైతులను తీసుకుని గురజాల ప్రాంతానికి చెందిన రైతులందరూ జగన్ ఇంటి ముందు ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు.