తెలంగాణలో వైఎస్ షర్మిల పరామర్శ సందడి

  జగన్ సోదరి షర్మిల ఇక తెలంగాణలో పరామర్శ యాత్రల పేరుతో ఓదార్పు యాత్రలు చేయబోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి ఐదేళ్ళు గడిచిన తర్వాత ఆయన మరణ వార్త విని షాక్‌తో చనిపోయారని చెబుతున్న వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని వైకాపా విస్త్రత సమావేశంలో జగన్ ప్రకటించారు. షర్మిలమ్మకు తెలంగాణలో వైసీపీని గ్రామస్ధాయి నుంచి పటిష్టం చేసే బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నారని, వైఎస్ మరణ వార్త విని మనోవేదనతో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు షర్మిల పరామర్శ పేరుతో యాత్ర చేపడుతుందని తెలిపారు.

బచ్చా బిలావల్ భుట్టో.. మోడీకి వార్నింగ్...

  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ గౌరవాధ్యక్షుడు, పిల్లకాకి బిలావల్ భుట్టో జర్దారీ ఓ హెచ్చరిక చేశాడు. ‘‘పాకిస్థాన్ మీద భారత్ దాడులను చూస్తూ ఊరుకోం. గుజరాత్ బాధితుల మాదిరిగా మేం ప్రతీకారం తీర్చుకోలేమని భావిస్తున్నారా? మేం తప్పనిసరిగా దాడులను తిప్పికొడతాం. ఈ విషయాన్ని నరేంద్రమోడీ తెలుసుకోవాలి’’ అని బిలావల్ భట్టో తన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధికారిక వెబ్ సైట్‌లో పేర్కొన్నారడు. అయితే బిలావల్ భుట్లో మాటల విషయంలో మాత్రం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకులు కట్టుబడి వుండటం లేదు. ఈ వ్యాఖ్యలు బిలావల్ చేసినవి కావని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వెబ్‌సైట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఈ తరహా పోస్టింగ్స్ చేస్తున్నారని అంటూ తప్పించుకునే ప్రయత్నం, బిలావల్‌‌ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా ఆర్థిక లావాదేవీలు

  ఫేస్‌బుక్, బ్లాక్ బెర్రీ మెసెంజర్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఓ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్‌ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. ఫేస్‌బుక్‌ వినియోగదారులతోపాటు బ్లాక్‌బెర్రీ వినియోగదారులు కూడా హాట్‌రెమిట్‌ ద్వారా నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మరో నెలరోజుల్లో అన్నిరకాల ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్ల నుంచి కూడా హాట్‌రెమిట్‌ ద్వారా లావాదేవీలు జరిపేందుకు వీలుగా అప్లికేషన్స్‌ను ప్రారంభించనున్నట్టు సంస్థ చైర్మన్‌ కృష్ణప్రసాద్‌ చెప్పారు. హాట్‌రెమిట్‌ సర్వీసును ప్రముఖ నటి శ్రీదేవి లాంఛనంగా ఆవిష్కరించారు. నగదు బదిలీ సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంకు నుండి ఇ-వాలెట్ లైసెన్సు పొందామని చెప్పారు. అలానే క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల ప్రాసెసింగ్‌కు ఉండాల్సిన పీసీఐ-డీఎఎన్ఎస్ ధ్రువీకరణ కూడా తమకు ఉందన్నారు.

నేనూ చీపురు పడతా.. సమంత

  భారత ప్రధాని నరేంద్రమోడీ చేపడుతున్న కార్యక్రమాలు తనకు ఎంతగానో నచ్చుతున్నాయని, ఆయన గాంధీ జయంతి నాడు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్‌ కార్యక్రమం తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని, తాను కూడా త్వరలో చీపురు పట్టి వీధులను శుభ్రం చేయనున్నానని కథానాయిక సమంత ప్రకటించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో హెపటైటిస్ బిపై జరిగిన అవగాహన శిబిరానికి హాజరైన సందర్భంగా సమంత ఇలా ప్రకటించారు. ‘‘స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నాకెవరూ సవాల్ విసరలేదు. అలా ఎవరైనా సవాల్ విసిరితే నేను కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను’’ అన్నారు. ఎవరో సవాల్ విసిరితే ఎందుకు.. అంత స్ఫూర్తి పొందితే తనంతట తానే స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనచ్చుగా!

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎ‌స్‌లో చేరలేదా...

  నలుగురు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ గురువారం నాడు టీడీపీని విడిచిపెట్టి టీఆర్ఎస్‌లో చేరారు. గురువారం ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంని కలసి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరిన వారిలోఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, చల్లా ధర్మారెడ్డి, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ గంగాధర్ వున్నారు. అనంతరం పార్టీ మారిన ఈ ఐదుగురూ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధించేందుకే టీడీపీని విడిచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరామని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు ప్రభుత్వం ఎంతమాత్రం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కష్టాలకు గత ప్రభుత్వాలతోపాటు చంద్రబాబు విధానాలు కూడా కారణమని వారు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని వారు ఈ సందర్భంగా విమర్శించారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఎల్.రమణ ఈ విషయంలో కొత్త మలుపు తిప్పారు. ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరలేదని తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు.

తెలంగాణ పౌర కార్డులకు బ్రేక్?

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు పౌర గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తహతహలాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిసినా తెలంగాణ గుర్తింపు కార్డులు ఇవ్వాలనే డిసైడ్ అయ్యారు. ఆ విషయాన్ని బుధవారం నాడు ప్రకటించారు కూడా. అయితే పౌరులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాల్సిన పని అని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా ఇలా గుర్తింపు కార్డులు ఇవ్వడానికి వీల్లేదని తెలంగాణ రాష్ట్ర అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చెప్పినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఈ విషయంలో ముందుకు వెళ్తే రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ గుర్తింపు కార్డుల ఆలోచనను విరమించుకునే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.అయితే ఈ విషయం మీద ఇంతవరకు అధికారికంగా ప్రకటన వెలువడలేదు.

పౌరసత్వ కార్డులెందుకు.. కరెంటు ముఖ్యం...

  తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కావలసింది గుర్తింపు కార్డులు కాదని... కరెంట్ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. రామచంద్రరావు అన్నారు. ఫాస్ట్ పథకంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందగోరే విద్యార్థులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 15వ తేదీలోగా.. కేవలం 6 రోజుల వ్యవధిలో పొందాలని సూచించడం, ఈ కార్యక్రమాన్ని ఈ గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయడం సబబు కాదన్నారు. మొన్న సమగ్ర సర్వే, నిన్న ఫాస్ట్, నేడు గుర్తింపు కార్డులు అని కేసీఆర్ ప్రజలను పరేషాన్ చేస్తున్నాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గుర్తింపు కార్డుల గురించి ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పౌరులకు గుర్తింపు కార్డులు ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి ఇస్తారు? ఒకవేళ తెలంగాణ ప్రజలకు మాత్రమే అయితే తెలంగాణలోని తెలంగాణేతరుల సంగతేంటని రామచంద్రారావు ప్రశ్నించారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజులపాటు కరెంటు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఈ నెల 11, 13, 14 తేదీలలో మండల కేంద్రాల్లో బీజేపీ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన వివరించారు.

మహారాష్ట్ర సరే.. పాకిస్థాన్ సంగతేంటి?

  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ, శివసేన మధ్య పొత్తు చిత్తు అయిన తర్వాత శివసేన నాయకులు ప్రధాని మోడీ మీద ఫైర్ అవుతున్నారు. మహారాష్ట్రను ఎవరూ విడదీయలేరని మోడీ చేసిన ప్రకటనకు శివసేన నాయకులు ప్రతిస్పందించారు. ప్రధాన మంత్రి నరంద్ర మోడీ మహారాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ముందు పాకిస్థాన్‌తో సరిహద్దు సమస్యలపై దృష్టి పెట్టాలని శివసేన సూచించింది. పాక్ కాల్పుల్లో పౌరులు కూడా చనిపోవడం దురదృష్టకరమని, ఆ విషయాన్ని మోడీ తన ఎన్నికల ప్రసంగాల్లోనూ, అటు, తన ట్వీట్లలోనూ ప్రస్తావించడంలేదని సేన మండిపడింది. ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది.

పాకిస్థాన్‌ని మోడీ కట్టడి చేయాలి.. అంతే.. రాహుల్

  జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పలు జరుపుతున్నారు. ఈ విషయంలో భారతీయులందరూ పాకిస్థాన్ వైఖరిని తప్పుపడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని నరేంద్రమోడీని తప్పు పడుతున్నారు. నరేంద్రమోడీ పాకిస్థాన్‌ని కట్టడి చేయపోవడం వల్లే ఈ కాల్పులు జరుగుతున్నాయి. విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో జరిగిన ర్యాలీల్లో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధానమంత్రి మోడీ మీద విమర్శలు కురిపించారు. పాకిస్థాన్, చైనాల మీద దూకుడుగా వ్యవహరిస్తామని లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ చెప్పేవారని, పాక్ పలుసార్లు కవ్వింపు చర్యలకు దిగినా గత మూడు నెలలుగా ఆయున చేసిందేమీ లేదని రాహుల్ గాంధీ అన్నారు.

హుదూద్ తుఫాన్.. ఉత్తరాంధ్ర దడ

  మరో పెను తుఫాను ఉత్తరాంధ్ర, ఒరిస్సా వైపు మహావేగంగా వస్తోంది. హుదూద్ అని పేరు పెట్టిన ఈ తుఫాను గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో చండ ప్రచండంగా దూసుకొస్తోంది. ఉత్తర అండమాన్‌లో మొదలైన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి అండమాన్ వద్ద తీరం దాటింది. ఆ తర్వాత బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ఈ తుఫాను విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా వెయ్యి కిలోమీటర్ల దూరంలోనూ.. ఒడిసాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం మరింతగా బలపడి పెనుతుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాను 12వ తేదీ మధ్యాహ్నానికి ఏపీలోని విశాఖపట్నం ఒరిస్సాలోని గోపాల్‌పూర్‌ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ బులెటిన్‌ను జారీచేసింది. శనివారం నుంచి ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.

చీపురు పట్టుకుంటా... సానియా

  స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా రిలయన్స్ గ్రూపు అధినేత అనీల్ అంబానీ బుధవారం నాడు మోడీ పిలుపు మేరకు అనిల్ బుధవారం తన స్నేహితులతో కలిసి ముంబయి చర్చి గేట్ ముందు పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా మరో తొమ్మిదిమంది భారతీయ ప్రముఖులకు సవాల్ విసిరారు. వాళ్ళలో సానియా మీర్జా కూడా వున్నారు. రిలయన్స్ అధినేత అనీల్ అంబానీ తనకు చేసిన సవాల్ స్వీకరించిన టెన్నిస్ స్టార్ చీపురు పట్టి రోడ్లు ఊడ్చనున్నారు. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ అనీల్ అంబానీ చాలెంజ్ను స్వీకరిస్తున్నానని, వీలు చూసుకుని డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్కు వెళ్లేలోపు స్వచ్ఛ భారత్లో పాల్గొంటానని సానియా తెలిపారు.

సినిమా పరిశ్రమకు భూ కేటాయింపు రద్దు

  తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల ఎకరాలను సినిమా రంగానికి కేటాయిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమధ్య రెండు మూడుసార్లు ప్రకటించేసరికి చాలామంది సినిమా వాళ్ళు చొంగ కార్చారు. ఆ నాలుగువేల ఎకరాల్లో నాకు ఎంత భూమి ఇస్తారా అని ఆశపడ్డారు. కొంతమంది అయితే కేసీఆర్ని మంచి చేసుకునే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారయితే ఆ ఫిలిం సిటీనో మరేదో ఏర్పడితే దానికి కేసీఆర్ పేరు పెట్టాలని పెద్దమనసుతో తీర్మానించారు. కేసీఆర్ అయితే కృష్ణగారు దానికి అధ్యక్షుడిగానో మరోటో పదవి వెలగబెట్టాలని కోరుకున్నారు. ఈ పదవిని ఆఫర్ చేయడంలో కేసీఆర్ గారు కృష్ణగారిలోని సీమాంధ్రుడిని చూడలేదు. అయితే ఈ ఆశల పల్లకి ఇలా వుంటే, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు గతంలో బంజారాహిల్స్‌లో కేటాయించిన 16 ఎకరాల భూమిని రద్దు చేస్తూ, ఆ భూమిని వెనక్కి తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఇంకో నాలుగు వేల ఎకరాలు ఇచ్చే సంగతి దేవుడెరుగు.. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందిన బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ ప్రాంతంలో చలనచిత్ర అభివృద్ధి సంస్థకు వున్న 16 ఎకరాలు కూడా హుష్ కాకీ అయిపోయింది. ఈ రకంగా కేసీఆర్ సినిమా పరిశ్రమకు సెవెన్టీ ఎంఎం సినిమా చూపించారు.

ఎర్రబెల్లిని రానివ్వం...

  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్‌లోకి వెళ్ళబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఎర్రబెల్లి ఎప్పటికప్పుడు ఆ వార్తల్ని ఖండిస్తున్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా లేదా అనే విషయాన్ని అలా వుంచితే, ఆయన్ని మాత్రం టీఆర్ఎస్‌లోకి రానిచ్చేదే లేదని వరంగల్ పార్లమెంట్ సభ్యుడు కడియం శ్రీహరి కంకణం కట్టుకున్నట్టున్నారు. ఆ విషయాన్నే ఆయన చెబుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావును తెలంగాణ రాష్ట్ర సమితిలోకి రానివ్వబోమని కడియం శ్రీహరి స్పష్టంగా చెబుతున్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తూ అర్ధరాత్రి వేళల్లో కేసీఆర్ ఇంటిచుట్టూ ఎందుకు తిరుగుతున్నావని దయాకర్‌ని శ్రీహరి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళబోనని చెబుతున్న ఎర్రబెల్లి ఆ మాటకు కట్టుబడి వుండాలని ఎంపీ కడియం శ్రీహరి సవాల్ విసిరారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏ గడ్డిపీకినా టీఆర్‌ఎస్‌లోకి రానివ్వబోమని ఎంపీ కడియం స్పష్టంగా చెప్పేశారు.

రెండు వేలమందికి యాహూ హూస్టింగ్?

  యాహూ సంస్థ తన బెంగళూరు కార్యాలయంలో మార్పులు చేయనున్నట్టు సమాచారం. మెరుగైన సేవల కోసం మార్పులు అంటున్నారు. ‘మార్పులు’ అంటే దాదాపు రెండు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపడమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాహూ సంస్థ బెంగుళూరు కార్యాలయంలో మొత్తం 2500 మంది ఉద్యోగులు వున్నారు. వారిలో రెండు వేల మంది ఉద్యోగులను తొలగించాలని యాహూ యాజమాన్యం నిర్ణయించుకుందన్న రూమర్లు విని ఉద్యోగులు ఠారెత్తిపోతున్నారు. కంపెనీని రీస్ట్రక్చరింగ్ చేస్తున్నామని యాహూ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ ప్రాచి సింగ్ చెబుతున్నారు. ఉద్యోగులను తొలగిస్తారా అనే ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం రాలేదు.

విజయవాడ మూడు హత్యలు.. నిందితుల అరెస్ట్

  విజయవాడ సమీపంలోని పెద అవుటపల్లిలో జాతీయ రహదారిపై ముగ్గురిని దారుణంగా కాల్చి చంపిన కేసులో విజయవాడ పోలీసులు ఢిల్లీ పోలీసుల సహాయంతో హంతక ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్ట్‌ చేశారు. వీరిలో నలుగురు షూటర్లు కాగా, ముగ్గురు కీలక నిందితులు. మరో షూటర్‌ పరారీలో ఉన్నాడు. వీరందర్నీ బుధవారం విజయవాడలో మీడియా ఎదుటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వీరిని మంగళవారం ఢిల్లీలోని కర్‌కర్‌డుమా కోర్టులో హాజరుపరచగా, ఐదు రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. అరెస్టయిన ఏడుగురిలో ప్రతాప్‌ సింగ్‌ (35), ధరమ్‌వీర్‌ (32), నితిన్‌ (27), నీరజ్‌ (22) షూటర్లు కాగా మంజీత్‌ సింగ్‌ (35), సతీశ్‌కుమార్‌ అలియాస్‌ బావా (27), పంకజ్‌ అలియాస్‌ ప్రకాశ్‌ (22) వున్నారు.