దిక్కులు చూడకు రామయ్య స్వీట్ రివ్యూ
తారాగణం: నాగశౌర్య, సనా మక్బూల్,అజయ్, ఇంద్రజ, బ్రహ్మాజీ తదితరులు సంగీతం: కీరవాణి, దర్శకత్వం: త్రికోటి, నిర్మాత: రజనీ కొర్రపాటి.
‘అమెరికన్ బ్యూటీ’ అనే సూపర్ హిట్ ఇంగ్లిష్ సినిమా ప్రేరణతో తయారు చేసుకున్న కథ అనిపించే ‘దిక్కులు చూడకు రామయ్య’ తెలుగులో సరికొత్త కథాంశంతో చేసిన ప్రయత్నమనిచెప్పవచ్చు. పదిహేనేళ్లకే గోపాలకృష్ణ అలియాస్ క్రిష్ (అజయ్)కి భవాని (ఇంద్రజ)తో పెళ్లయిపోతుంది. చిన్న వయసులోనే ఇద్దరి బిడ్దల తండ్రి అయిపోతాడు. టీనేజ్‌ని సరిగ్గా ఎంజాయ్ చేయలేపోయాననే వెలితి క్రిష్‌లో ఉంటుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే మధు (నాగశౌర్య) క్రిష్ కొడుకు. అయితే ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఎంజాయ్ చేయలేదన్న బాధలో సమీత (సనా మక్బుల్) అనే అమ్మాయికి క్రిష్ సైట్ కొడుతూవుంటాడు. తనకు పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పి ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ అమ్మాయినే మధు కూడా ప్రేమిస్తాడు. అయితే ఒక సందర్భంలో తన తండ్రి సమీతతో చనువుగా ఉంటున్నాడని తెలుస్తుంది. సమీత కూడా తన తండ్రిని పెళ్లాడటానికి రెడీగా ఉందని తెలుసుకున్న మధు, తన తల్లి కోసం ఏం చేశాడు? ఏ విధంగా తన తండ్రిని మార్చాడు? అనేది ఈ ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా కథ.
ఈ చిత్రానికి హీరో నాగశౌర్య అయినా, కథాపరంగా అసలు హీరో అజయ్. తన కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ పాత్రను ఇందులో అజయ్ చేశారు. తల్లి బాగుకోసం పరితపిస్తూ, తండ్రికి బుద్ధి చెప్పే పాత్రలో నాగశౌర్య చక్కగా ఇమిడిపోయాడు. తన పాత్రకు అన్ని విధాలుగా న్యాయం చేశాడు. సనా మక్బూల్ అందానికీ, అభినయానికీ ఆస్కారమున్న పాత్ర చేసింది. చాలాకాలం తర్వాత వెండితెరపై మెరిసిన ఇంద్రజ తల్లి పాత్రలో మెప్పించారు. బ్రహ్మాజీ చక్కని వినోదాన్ని పంచారు.
ఈ సినిమాలో ప్రేమ, బంధాలు, భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించారు. చక్కని వినోదంతో ప్రేక్షకులకు విసుగు రాకుండా జాగ్రత్త పడ్డారు. తన సంగీతంతో కీరవాణి సినిమాను మరో స్థాయిలో నిలబెట్టారాయన.