హుదూద్ తుఫాను వచ్చేస్తోంది

  2013 సంవత్సరం అక్టోబర్‌లో వచ్చిన పైలీన్ తుఫాను కంటే ఇప్పుడు దూసుకువస్తున్న ‘హుదూద్’ తుఫాను ఇంకా బీభత్సంగా వుంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హుదూద్ ప్రభావంతో గాలి వేగం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. హుదూద్ ప్రభావంతో శుక్రవారం నాడు ఉత్తరాంధ్రలో ఈదురుగాలులు, శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నానికి హుదూద్ తుఫాను విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం హుదూద్ తుఫాను విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.దీని ప్రభావంతో సముద్రం రెండు మూడు అడుగులు ముందుకు రావచ్చని చెబుతున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం అధికంగా ఉండబోతోంది.

లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మిస్సింగ్

  హైదరాబాద్ ‌నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భవ్యశ్రీ అనే యువతి మిస్సింగ్ మిస్టరీ సంచలనం సృష్టిస్తోంది. భవ్యశ్రీ వివాహిత. కార్తీక్ అనే యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. గురువారం నాడు విధులకు వెళ్లిన భవ్యశ్రీ తిరిగి రాకపోవడంతో ఆమె భర్త కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేపీహెచ్‌ బీ 7వ ఫేస్‌లో కార్తిక్‌ చైతన్య, భవ్యశ్రీ చరిత దంపతులు నివాసం వుంటున్నారు. భవ్య మాదాపూర్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం నాడు ఆఫీసు వెహికల్ రాకపోవడంతో భవ్య ప్రైవేటు క్యాబ్‌ ఎక్కారు. తాను కాబ్‌ ఎక్కానని ఉదయం 8:30 గంటలకు భర్తకు మెసేజ్‌ చేశారు. సాయంత్రం వరకు భవ్య ఫోన్‌ అవుట్‌ ఆఫ్‌ కవరేజీలో ఉంది. అయితే రాత్రి ఇంటికి రావాల్సిన భార్య ఎంతకీ రాకపోవడంతో భర్త ఆఫీస్‌కు ఫోన్‌ చేయగా అసలు భవ్య విధులకు హాజరుకాలేదని సంస్థ ఉద్యోగులు తెలిపారు. దీంతో ఆందోళన చెందిన భర్త కార్తీక్‌ గత అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవ్య చరిత గత కొన్ని రోజులుగా విధులకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేక ఆమే ఎటైనా వెళ్ళిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహారాష్ట్ర... బీజేపీకే ప్రీపోల్ పట్టం

  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టంకట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ప్రీ పోల్ సర్వేల్లో తేలింది. అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే వుండాలని మహారాష్ట్ర ఓటర్లు భావిస్తున్నారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 15వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొనివుంది. ఈ ఎన్నికలలో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ 154 స్థానాలు పొందుతుందని, 47 సీట్లతో శివసేన రెండో స్థానంలో ఉంటుందని ది వీక్, హన్సా రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 133 స్థానాలు వస్తాయని ప్రీపోల్ సర్వే చెప్పింది. ఇండియా టుడే నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో కూడా ఈ తరహా ఫలితమే వచ్చింది.

సునందా పుష్కర్ మృతి.. అసలు ‘విష’యం...

  కేంద్ర మాజీ, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్‍ కొద్ది నెలల క్రితం ఢిల్లీలోని ఒక హోటల్ రూమ్‌లో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఆమె విష ప్రయోగం జరపడం వల్లే మృతి చెందారని పోస్టుమార్టం రిపోర్టు బయటపెట్టింది. సునందా పుష్కర్ భౌతికకాయానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో ఈ విషయం వెల్లడయిందని స్పెషల్ మెడికల్ టీమ్ ప్రకటించింది. న్యూఢిల్లీలోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులతో ఏర్పాటైన ఈ వైద్యుల బృందం నివేదికను సమర్పించినట్టు సమాచారం. మాజీ మంత్రి శశి థరూర్‌తో పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ ప్రేమ వ్యవహారం నడుపుతోందన్న  అనుమానంతో సునందా పుష్కర్, మెహర్‌తో ట్విట్టర్‌లో సంవాదం చేసిన తర్వాత ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్‌ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు.

సుప్రీం కోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్ దాఖలు

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిలు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్‌ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా నిర్ధారిస్తూ నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు 100 కోట్ల జరిమానా విధించింది. ఆ తర్వాత జయలలితను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. జయలలిత తరపున దాఖలైన బెయిల్ పిటిషన్‌ని ఈ నెల 7వ తేదీన కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో ఆమె తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారు.

శశిథరూర్ మోడీ భజనకి డిగ్గీ మద్దతు...

  ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను అంగీకరించడం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని థరూర్ పొగడడంపై కేరళ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతోంది. శశిథరూర్‌పై సరైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను కేరళ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ మాత్రం థరూర్‌కు మద్దతు తెలిపారు. శశిథరూర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలలో తప్పులేదన్నారు. స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు శశి థరూర్ అంగీకరించడంలో ఎలాంటి తప్పులేదు. కాంగ్రెస్ కార్యక్రమమైన దాన్ని మోడీ తన సొంతం చేసుకున్నారు అని దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

హీరో శ్రీహరి ప్రథమ వర్ధంతి

  ప్రముఖ కథానాయకుడు దివంగత శ్రీహరి ప్రథమ వర్ధంతి గురువారం నాడు ఆయన స్వగృహంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సి. కళ్యాణ్, వీర శంకర్, దేవీ ప్రసాద్, బాబీతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీహరి భార్య శాంతి మాట్లాడుతూ, ‘‘మా బావ శ్రీహరికి నేను చేస్తున్న చివరి పెద్ద ఉత్సవం ఇది. ఇకపై ఈ కార్యక్రమాన్ని మా పిల్లలు శశాంక్, మేఘాంశ్ కొనసాగిస్తారు. మా పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో వుండాలని నేను ఆశపడ్డాను. వాళ్ళు సినిమా రంగంలోనే వుంటామని చెబుతున్నారు. వారికి సినిమా పరిశ్రమ అండగా వుంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. శ్రీహరి కుమారులు శశాంక్, మేఘాంశ్ మాట్లాడారు. దర్శకుడు కావాలన్న కోరికను శశాంక్, హీరో కావాలన్న కోరికను మేఘాంశ్ వ్యక్తం చేశారు.

అమెరికా కుర్రకారు క్రేజ్: నగ్న సెల్ఫీలు

  అమెరికాలో కొత్త ఫ్యాషన్ మొదలైంది. అది నగ్న సెల్ఫీలు ఫ్రెండ్స్‌కి పంపడం. తమకు వచ్చిన నగ్న సెల్ఫీలను అందరికీ షేర్ చేయడం.. ఈ కొత్త ఫ్యాషన్ అమెరికా యువతరంలో పెరిగిపోతోందని ఒక సర్వే చెబుతోంది. ఇటీవలి కాలంలో నగ్నసెల్ఫీలు షేర్ చేసుకుని యువతీయువకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆ అధ్యయనంలో తేలింది. ఈ నగ్న సెల్ఫీ విష సంస్కృతి వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను కూడా చాలా ఇబ్బందులకు గురిచేస్తోందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఉటా తన పరిశోధనలో వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లతో ఇలాంటి అశ్లీల సెల్పీలు తీసుకుని ఒకరికొకరు పంపుకోవడాన్ని ‘సెక్సింగ్' అని యువతరం ముద్దుగా పిలుచుకుంటున్నారు.

మోహన్‌బాబుకి ప్రమాదం.. ఏం కాలేదు..

  ప్రముఖ నటుడు, నిర్మాత ‘కలెక్షన్ కింగ్’ మోహన్‌బాబు ప్రయాణిస్తున్న కారును హైదరాబాద్‌లోని రద్దీగా వుండే మాదాపూర్‌లో మరో క్యాబ్ కారు ఢీకొనడంతో మోహన్ బాబు ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదం నుంచి మోహన్‌బాబు ఎలాంటి గాయాలూ లేకుండా క్షేమంగా బయటపడ్డారు. మోహన్‌బాబుకు ఎంతమాత్రం గాయాలు తగలలేదు. మోహన్‌బాబు తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదం కారణంగా మాదాపూర్ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. గతంలో కూడా మాదాపూర్ ప్రాంతంలోనే నటుడు ప్రకాష్ రాజ్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం మీద మోహన్‌బాబు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

రాం జెఠ్మలానీకి రాంరాం చెప్పండి...

  కర్ణాటక హైకోర్టులో తన తరపున వాదించిన లాయర్ రాం జెఠ్మలాని నిర్లక్ష్యం కారణంగానే తాను జైల్లో గడపాల్సిన వస్తోందని, అందువల్ల అతన్ని లాయర్‌గా తొలగించి ఆయన స్థానంలో హరీష్ సాల్వేని లాయర్‌గా పెట్టాలని తన అనుచరులను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. ఇదిలా వుండగా జయలలిత తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కర్ణాటక హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం మీద వారు ఈ పిటిషన్ దాఖలు చేయనున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే సమయంలో హరీష్ సాల్వేతో వాదనలు వినిపించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జయలలిత తన అనుచరులకు స్పష్టంగా చెప్పారు. జయ ఆదేశాల ప్రకారమే గురువారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడం లేదట..

  తెలంగాణ టీడీపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ప్రకాష్ గౌడ్ తెలుగుదేశం పార్టీని వీడటం లేదని తమకు సమాచారం ఇచ్చారని తెలుగుదేశం నాయకుడు ఎల్.రమణ తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలు కలసి కేసీఆర్ దగ్గరకి వెళ్ళలేదని, విడివిడిగా వెళ్ళారని రమణ చెప్పారు. ధర్మారెడ్డి, ప్రకాష్ గౌడ్ స్థానిక సమస్యల గురించి చెప్పడానికి మాత్రమే కేసీఆర్ దగ్గరకి వెళ్ళారని రమణ తెలిపారు. పార్టీ క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలుగుదేశం పార్టీ చొరవ గురించి ప్రజలకు తెలుసని, ఎవరికైనా అనుమానాలుంటే తీరుస్తామని ఆయన అన్నారు.

ఆళ్ళగడ్డ వైసీపీ అభ్యర్థి అఖిలారెడ్డి... ఏకగ్రీవ కమిటీ...

  ఆళ్లగడ్డ శాసన సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత మహిళా నేత భూమా శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ పేరును ఖరారు చేశారు. గత ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించినా ఆళ్లగడ్డ ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించి దేశంలోని ఓ అరుదైన రికార్డును మరణించాక కూడా సాధించారు. ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ స్థానం నుంచి  అఖిలప్రియారెడ్డిని ఆళ్ళగడ్డ ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకంలో జగన్ పార్టీ నాయకులు వున్నారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టదని వైసీపీ నాయకులు ఆశిస్తున్నారు. ఈనెల 14న ఈ స్థానానికి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ స్థానం నుంచి అఖిలా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం కోసం తెలుగుదేశం పార్టీని ఒప్పించడానికి జగన్ ఒక కమిటీని నియమించినట్టు తెలుస్తోంది.

వర్మ షార్ట్ ఫిలింలో నటించడం హ్యాపీ: మంచు లక్ష్మి

  మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి పాదాల మీద ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ షార్ట్ ఫిలిం రూపొందించారు. దాని పేరు ‘లక్ష్మీ మంచు పాదాలు ... జీవితంలో ఒకరోజు’. ఈ షార్ట్ ఫిలిం ఓ వ్యక్తి దైనందిక జీవితంలో పాదాలు ఎలా పయనిస్తాయనే ప్రధానాంశంగా రూపొందింది. దీన్ని బుధవారంనాడు ప్రదర్శించారు. ఈ షార్ట్ ఫిలిం గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ, ‘‘నేను ఈ షార్ట్ ఫిలింలో నటించడం సంతోషాన్ని కలిగిస్తోంది. కేవలం నా పాదాలు మాత్రమే ఈ షార్ట్ ఫిలింలో కనిపిస్తాయి. ఇది నాకు ఒక థ్రిల్లింగ్ అంశం. ఇందులో మా అమ్మాయి కూడా నటించడం మరింత థ్రిల్లింగ్ అంశం. దర్శకుడిగా పాతికేళ్ళ కెరీర్ వున్న రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ఒక విషయాన్ని రెండున్నర గంటల్లో చెప్పడం కంటే రెండు నిముషాల్లో చెబితే ఎలా వుంటుందనే ఆలోచన వచ్చి ఈ షార్ట్‌ ఫిలిం రూపొందించాను. దీంట్లో నటించినందుకు మంచు లక్ష్మికి ధన్యవాదాలని అన్నారు.

డైరెక్టర్‌ని మెంటలోడా సమంత ఎందుకు తిట్టింది?

  చాలా మృదువుగా మాట్లాడే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓ డైరెక్టర్ని తిట్టిందట. ఆ తిట్లు కూడా మామూలు తిట్లు కాదు. ‘రాస్కెల్, పిగ్, మెంటలోడా’ అని ఆ దర్శకుడి ముఖం మీదే తిట్టేసిందట. ఈ విషయాన్ని సమంతే చెప్పింది. ‘‘నాకు కోపం వచ్చినా వ్యక్తం చేయను. నాలోనే దాచుకుంటాను. ఎవరి మీదైనా కోపం వస్తే మౌనంగా వుండిపోతాను. అలాంటి నన్ను ఈమధ్య ఓ డైరెక్టరు తెగ విసిగించాడు. ఎంత బాగా నటించినా టేకుల మీద టేకులు అడుగుతున్నాడు. దాంతో నాకు కోపం వచ్చేసింది. అతన్ని కోపంగా ‘రాస్కెల్, పిగ్, మెంటలోడా’ అని తిట్టేశాను’’ అని చెప్పింది. ఇంతకీ సమంత సదరు దర్శకుడిని పైకి తిట్టలేదంట.. మనసులో లోపల లోపలే తిట్టుకుందట. వాయబ్బో... అందాల భామ సమంతలో చతురత బాగానే వుంది.