పవన్ కళ్యాణ్ తుఫాను సహాయం 50 లక్షలు

  ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాను పట్ల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘‘విశాఖను, ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేసిన ఈ హుదూద్ తుఫాన్ నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తరాంధ్ర సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇది పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటిగా కృషి చేసి విపత్తుకు గురైన వారిని ఆదుకోవలసిన సందర్భం అని నేను భావిస్తున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విపత్తును అధిగమించడానికి చేస్తున్న కృషికి నావంతు సహకారాన్ని అందిస్తున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధికి నావంతు సహకారంగా 50 లక్షల రూపాయలను అందిస్తున్నాను. నా ఫ్యాన్స్‌ని, మద్దతుదారులను తుఫాను సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా  కోరుతున్నాను. త్వరలో నేను కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తాను’’ అన్నారు.

పాతికేళ్ళ తర్వాతే పెళ్ళిగోల

  దేశంలోని యువతరానికి ఎంతమాత్రం నచ్చని ఓ సలహాని బీహార్ ముఖ్యమంత్రి రామ్ మాంఝీ ఇచ్చారు. అదేంటంటే, దేశంలోని యువతీ యువకులు పాతికేళ్ళు దాటేవరకూ పెళ్ళి గురించే ఆలోచించకూడదు. పాతికేళ్ళ తర్వాత పెళ్ళి చేసుకున్న కారణంగానే తాను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. యూత్ పాతికేళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే అనారోగ్యానికి దూరంగా ఉండటమే కాక పోషకాహార లోపం సమస్యలు కూడా ఎదురుకావని ఆయన చెబుతున్నారు. అంచేత యువకులదే కాక యువతుల వివాహ వయసును 25 ఏళ్లకు పెంచితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గురుకుల వ్యవస్థను మాఝీ సందర్భంగా ప్రస్తావించారు. మనిషి జీవితాన్ని నాలుగు దశలుగా విభజించిన నాటి గురుకుల వ్యవస్థ 24 ఏళ్ల బ్రహ్మచర్యాన్ని, 24-48 ఏళ్ల దాకా గృహస్తాశ్రమాన్ని ప్రతిపాదించిందని ఆయన చెప్పారు.

హీరో రామ్‌చరణ్ 10 లక్షల సాయం

  హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజల సమస్యలను తీర్చడానికి, సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం సోమవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. అలాగే మంగళవారం సినీ కథానాయకుడు రామ్‌చరణ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.అలాగే మందులు, క్లోరినేషన్ మందులు కూడా పంపిణీ చేస్తామని, అపోలో ఫౌండేషన్ ద్వారా ఈ సహకారం అందుతుందని చెప్పారు. నిత్యావసర సరకులను కూడా పంపిణీ చేయనున్నామని రామ్‌చరణ్ తెలిపారు. తుఫాను సహాయ చర్యలు చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసనీయంగా పనిచేస్తున్నాయని రామ్‌చరణ్ ప్రశంసించారు.

పీఎస్ఎల్‌వి-సి26 కౌంట్‌డౌన్ ప్రారంభం

  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరి కోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 16వ తేదీ తెల్లవారుజామున 1:32 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి26 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. నావిగేషన్ సేవలను మెరుగుపరిచేందుకు ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని బెంగుళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రంలో రూపొందించారు. పీఎస్‌ఎల్వీ-సి26 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 6:32 గంటలకు ప్రారంభమైంది. పీఎస్‌ఎల్వీ-సి26 రాకెట్ ద్వారా 1425 కిలోల బరువున్న ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

అధికారుల నిర్లక్ష్యం చంద్రబాబు ఆగ్రహం

  ప్రజలు సమస్యల్లో వున్నప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వుంటే ఎలా అని ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. తుఫాను సహాయక చర్యలపై విశాఖలో మంగళవారం నాడు చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన అధికారులపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తివ్యక్తం చేశారు. అధికారులు పీఎం, సీఎంలను దృష్టిలో పెట్టుకుని కాదు, సామాన్యుడి కోసం పనిచేయాలని సూచించారు. ఆహారం, మంచినీళ్ళ విషయంలో ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా చూడాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరా వెంటనే జరగాలని ఆయన ఆదేశించారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా చూడాలని కోరారు. తాగునీటి పంపిణీ, విద్యుత్ సరఫరా ఎంతవరకు వచ్చాయని చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

చిన్నారిని రైలు కింద తోసి తానూ...

  కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ళు తమతోపాటు తాము కన్నవారిని కూడా చంపేస్తున్నారు. ఇద్దరు కొడుకులను చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రొఫెసర్ గురుప్రసాద్ ఘటనను మరువకముందే హైదరాబాద్‌లో ఓ తల్లి తన కూతురితో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని గాంధీ నగర్‌లో వున్న మ్యారీగోల్డ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం వుండే శ్యాంప్రసాద్, స్వప్నకు అక్షద్ (1) శాన్వి (2) సంతానం. సోమవారం ఉదయం సూపర్ మార్కెట్‌కి వెళ్తున్నానని చెప్పి కూతుర్ని తీసుకుని ఇంట్లోంచి బయటకి వెళ్ళిన స్వప్న ఆ తర్వాత కనిపించలేదు. హైదరాబాద్ నగర శివార్లలోని ఘట్‌కేసర్ దగ్గర రైల్వే ట్రాక్‌ మీద తల్లీ కూతుళ్ళ మృతదేహాలున్నాయని తెలిసి అక్కడకి వెళ్ళిన పోలీసులు, కుటుంబ సభ్యులకు వాళ్ళు స్వప్న, శాన్వి అని తేలింది. వేగంగా వస్తున్న రైలుకు అడ్డంగా స్వప్న తన పాపను నిలబెట్టి, రైలు దగ్గరకు వచ్చిన సమయంలో తాను కూడా రైలు కిందకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు  చెబుతున్నారు. కుటుంబ కలహాలే ఈ సంఘనటనకు కారణమని తెలుస్తోంది.

విద్యార్థిని మృతి.. హత్యా? ఆత్మహత్యా?

  తిరుపతిలోని ఓ ప్రైవేట్ కాలేజీ క్యాంపస్‌లో రేఖ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె స్వస్థలం కడప జిల్లా రైల్వేకోడూరు. సోమవారం రాత్రి ఆమె తన హాస్టల్ గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. అయితే రేఖ తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మరణం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె కళాశాల యాజమాన్యం వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుని వుండొచ్చొని, లేకపోతే ఆమె తలను గోడకేసి కొట్టి చంపిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె శరీరంపై ఉరి వేసుకుని చనిపోయిన ఆనవాళ్లు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రేఖ తలను బలంగా గోడకేసి కొట్టి ఉండటం వల్లే చనిపోయి ఉంటుందన్నారు.

నేడు విశాఖకు మోడీ

  హుదూద్ తుఫాను ప్రభావానికి గురైన విశాఖపట్నం పరిసరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రలో ప్రధాని పర్యటన 2 గంటల పాటు జరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖ నుంచి ఆయన ఏరియల్ సర్వే మొదలవుతుంది. ఏరియల్ సర్వే అనంతరం, విశాఖలో ఏర్పాటు చేసిన తుఫాను ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తారు. ఈ ప్రదర్శన కోసం సుమారు 100 ఫొటోలను హైదరాబాదులో ప్రింట్ వేయించి వైజాగ్ పంపించారు. తాను తుఫాను పరిస్థితి గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అన్ని విషయాలు తెలుసుకుంటూ వచ్చిన నరేంద్ర మోడీ.. అందుకు తగినట్టుగా సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు. ప్రధాని పర్యటన సందర్భంగా, హుదూద్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరనున్నారు. నష్టపోయిన పంటలు, నివాస గృహాలు, మౌలిక వసతులు, సమాచార, విద్యుత్, రవాణా వ్యవస్థల గురించి మోడీకి చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లను అందించాలని ఇప్పటికే కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని ఒరిస్సాకి వెళ్లి, అక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.

ఫ్రెంచ్ ఆర్థికవేత్త టిరోల్‌కి నోబెల్

  ఫ్రెంచ్‌ ఆర్థికవేత్త జీన్‌ టిరోల్‌ ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి విజేత అయ్యారు. పెట్టుబడి మార్కె ట్‌ శక్తి, నియంత్రణలపై చేసిన పరిశోధనలకుగాను ఆయనకు ఈ బహుమతి లభించింది. 1999 తర్వాత అమెరికా వెలుపలి వ్యక్తికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి రావడం ఇదే ప్రథమం. నోబెల్‌ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్థంతి సందర్భంగా డిసెంబర్‌ పదో తేదీన ఈ బహుమతులు అందచేస్తారు. నోబెల్‌ బహుమతికి ఎంపిక కావడం తనను ఎంతో కదలించి వేసిందని టిరోల్‌ అన్నారు. సమకాలీన ప్రపంచంలో  ప్రభావవంతులైన ఆర్థికవేత్తల్లో టిరోల్‌ ఒకరని, భిన్న రంగాల్లో ఆయన ఎంతో విస్తృతమైన పరిశోధనలు చేశారని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. టిరోల్‌ (61) ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని టోలోస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఆర్థికవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన మెసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (మిట్‌) ఆయన పిహెచ్‌డి చేశారు.

చిరంజీవి ఇంటికి వాస్తు కళ

  ఎవరైనా సక్సెస్‌లో వుంటే అది తమ గొప్పే అనుకుంటారు. ఫెయిల్యూర్‌లో వుంటే వాళ్ళ దృష్టి తాము నివసించే ఇంటి వాస్తు మీద పడుతుంది. ఇప్పుడు మాజీ మెగాస్టార్ చిరంజీవి కూడా తాను రాజకీయాల్లో రాణించకపోవడానికి కారణం తన ఇంటి వాస్తు సరిగా లేకపోవడమేనని అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే తన ఇంటి వాస్తును సమూలంగా మార్చేసి పూర్తి పర్‌ఫెక్ట్ వాస్తు వున్న ఇంటిగా మార్చాలని సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన కుటుంబం మొత్తం ఇల్లు ఖాళీ చేసి విదేశాలకు విహార యాత్రలకు వెళ్ళిపోయిందట. వారు తిరిగి వచ్చే సరికి ఇల్లంతా కొత్తగా, వాస్తుతో కళకళలాడుతూ వుంటుందట. చిరంజీవి కేంద్ర మంత్రిగా వున్నప్పుడు ఢిల్లీలో ఆయనకు కేటాయించిన ఇంటికి కోట్లు ఖర్చుపెట్టి భారీగా వాస్తు మార్పులు చేయించారు. అయినప్పటికీ ఆయన మంత్రిగా రాణించలేకపోయారు కదా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని తన సొంత ఇంటికి వాస్తు మార్పులు చేయించినంత మాత్రాన ఏం ఒరుగుతుంది అని హేతువాదులు ప్రశ్నిస్తున్నారు.

తుఫాను: సీఎం తక్షణసాయం ప్రకటన

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుదూద్ తుఫాను బాధితులకు తక్షణ సాయం ప్రకటించారు. సోమవారం సాయంత్రానికి బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 5 లీటర్ల కిరోసిన్ పౌరసరఫరాల దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, పరిస్థితిని సమీక్షించిన అనంతరం విశాఖ కలెక్టరేట్‌లో చంద్రబాబు మాట్లాడారు. తుఫాను కారణంగా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చంద్రబాబు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, పశువులు చనిపోతే 25 వేలు, మత్సకారుల వలలకు 5 వేలు, పడవ నష్టపోతే 10 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. విశాఖ నగరంలో (నేడు) సోమవారం సాయంత్రంలోగా విద్యుత్తును పునరుద్ధరించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గం స్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ శ్రమిద్దామని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తనకు ఎంతో ఇష్టమైన విశాఖ నగరానికి ఇలా జరగడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు.